కొద్ది రోజుల్లో మరో రూ. 370 కోట్లు
ఇప్పటివరకు రూ.903 కోట్ల విలువైన 18 ఎల్‌ఎంటీ సన్నాల కొనుగోలు
అత్యధికంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సేకరణ.. అత్యల్పంగా ఆదిలాబాద్‌లో..
సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్ సీజన్‌లో సన్నాలు పండించిన రైతులకు రూ. 500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటన సత్ఫలితాన్నే ఇస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో సన్నధాన్యం పంట గణనీయంగా పెరిగింది. రైతులు తమ తిండి అవసరాల కోసం మిగిల్చుకున్న సన్న ధాన్యం పోను... కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 18.07 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్‌ఎంటీ) సన్నాలను విక్రయించారు. సన్నాలు విక్రయించిన రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం ఇప్పటివరకు రూ.530 కోట్లను బోనస్ రూపంలో జమచేసింది.
మరో రూ.373 కోట్లను కొద్దిరోజుల్లోనే జమ చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించింది. ఇప్పటివరకు 3,24,338 మంది రైతులు సన్నాలను విక్రయించినట్లు పౌరసరఫరా శాఖ వర్గాలు తెలిపాయి. ఈ రైతులకు క్వింటాలుకు మద్దతు ధర రూ.2,320తోపాటు రూ.500 బోనస్ కలిపి 2,820 ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రబీ (యాసంగి)లో సన్నాల సాగు పెంచేందుకు రైతులు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. వచ్చే సంక్రాంతి వరకు ఖరీఫ్ సీజన్ కొనుగోళ్లు ఉంటాయని భావిస్తున్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలకు మరో 2 ఎల్‌ఎంటీల సన్న ధాన్యం వచ్చే అవకాశం ఉంది.
46 ఎల్‌ఎంటీల సేకరణ: రాష్ట్రంలో హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లో 7,624 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 46,02,099 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. ఇందులో సన్న రకం 18.07 ఎల్‌ఎంటీ కాగా, దొడ్డు రకం 27.95 ఎల్‌ఎంటీ. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, రంగారెడ్డి, మెదక్ ఉమ్మడి జిల్లాల్లో కొనుగోళ్ల ప్రక్రియ ముగింపు దశకు చేరుకోగా, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్, నల్లగొండ ఉమ్మడి జిల్లాల్లో ఇంకా కొనుగోళ్లు సాగుతున్నాయి.
సంక్రాంతి వరకు మరో 10 ఎల్‌ఎంటీల వరకు ధాన్యాన్ని సేకరించే అవకాశం ఉన్నట్లు పౌరసరఫరాల సంస్థ అధికారులు అంచనా వేస్తున్నారు. బోనస్‌తో సంబంధం లేకుండా... ఇప్పటివరకు కొనుగోలు చేసిన 46.02 ఎల్‌ఎంటీ ధాన్యానికి రూ.10,675.15 కోట్లు చెల్లించాల్సి ఉండగా, రూ.9,890.46 కోట్లు రైతుల ఖాతాల్లోకి జమచేశారు. ఇంకా రూ.784.69 కోట్లు రైతుల ఖాతాల్లోకి చేరాల్సి ఉంది.
అధిక ధరకు విక్రయించిన రైతులు
రాష్ట్రంలో ఈసారి అత్యధికంగా కోటీ 50 లక్షల మెట్రిక్ టన్ను ల మేర ధాన్యం దిగుబడి అయినట్లు ప్రభుత్వం చెపుతోంది. 91 ఎల్‌ఎంటీలు కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేసింది. నాణ్యమైన రకాలకు చెందిన బియ్యాన్ని ఇప్పుడే క్వింటాలుకు రూ. 6వేల వరకు విక్రయిస్తున్నారు. ధాన్యం విక్రయాల్లో ఇప్పటివరకు అత్యధికంగా నిజామాబాద్ జిల్లా నుంచి 4,90,906 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని విక్రయించారు.
తరువాత స్థానంలో కామారెడ్డి జిల్లాలో 4,36,979 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని విక్రయించారు. ఈ రెండు జిల్లాల్లోనే (ఉమ్మడి నిజామాబాద్) ఏకంగా 9.27 ఎల్‌ఎంటీల ధాన్యం కొనుగోలు చేయడం గమనార్హం. రాష్ట్రంలో కొనుగోలు చేసిన ధాన్యంలో 20 శాతానికి పైగా ఇక్కడి నుంచే కావడం విశేషం. తరువాత స్థానాల్లో ఉమ్మడి నల్లగొండ, కరీంనగర్, మెదక్, వరంగల్ జిల్లాలు ఉన్నాయి. అత్యల్పంగా కేవలం 1951 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే విక్రయించి ఆదిలాబాద్ ఆఖరి స్థానంలో నిలిచింది.
ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లు ఇలా...
సన్నరకం ధాన్యం: 18.07 ఎల్‌ఎంటీ
దొడ్డు రకం: 27.95 ఎల్‌ఎంటీ
సన్నధాన్యం విక్రయించిన రైతులు: 3,24,338
దొడ్డు రకం విక్రయించిన రైతులు: 5,39,494
మొత్తం ధాన్యం విలువ: రూ. 10,675.15 కోట్లు
రైతులకు చెల్లించిన మొత్తం: రూ. 9,890.46 కోట్లు
సన్న ధాన్యానికి చెల్లించాల్సిన బోనస్: రూ. 903.63 కోట్లు
చెల్లించిన మొత్తం: రూ. 529.99 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment