తెలంగాణా రాష్ట్రంలో వచ్చే రెండు రోజు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని, ఉదయపు వేళల్లో దట్టంగా పొగమంచు ఆవరించే అవకాశం ఉందని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయ వ్యవసాయ వాతావరణ పరిశోధన కేంద్రం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డా. పి. లీలారాణి ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు.
ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో శీతల గాలులు వీచే అవకాశం ఉంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వివిధ పంటలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. రైతులు ఈ కింది సూచనలు పాటించాలని డా. పి. లీలారాణి సూచించారు.
వరి: తెలంగాణా జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు చాలా ప్రాంతాలలో 15 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. చలి ప్రభావంతో యాసంగి నారుమడుల్లో నారు ఎదగక పోవచ్చు. ఆకులు పసుపు, ఎరుపు రంగుల్లోకి మారవచ్చు. కొన్నిసార్లు నారు చనిపోవచ్చు. అందువల్ల రైతులు కొన్ని రక్షణ చర్యలు చేపట్టాలి.
నారుమళ్ళపై ఇనుప చువ్వలు లేదా వెదురు కర్రలతో ఊతమిచ్చి పైన పలుచని పాలిథిన్ షీట్ లేదా ఖాళీ యూరియా బస్తాలతో తయారు చేసిన పట్టాలతో సాయంత్రం పూట కప్పి, మరుసటి రోజు ఉదయాన్నే తీసివేయాలి.
రాత్రి వేళల్లో నారుమడిలో నీరు నిండుగా ఉంచి తెల్లవారుజామున తీసివేసి, కొత్త నీరు పెట్టాలి. ∙200 చదరపు మీటరు విస్తీర్ణం గల నారుమడికి ఆఖరి దుక్కిలో 2 క్వింటాళ్లు బాగా చివికిన కోళ్ళు లేదా గొర్రెల ఎరువు వేయాలి. విత్తే సమయంలో 1 కిలో నత్రజని, 1కిలో భాస్వరం, 1 కిలో పొటాషియం ఇచ్చే రసాయనిక ఎరువులు వేయాలి.
వరి నారుమళ్ళలో జింక్ ధాతువు లోపం నివారణకు 2 గ్రా. జింక్ సల్ఫేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
వరుసగా వరి పంట పండించే భూముల్లో ప్రతి మూడు పైర్లకు ఒకసారి లేదా ప్రతి యాసంగిలో దమ్ములో ఎకరాకు 20 కిలోల జింకు సల్ఫేట్ వేయాలి.
చలి వాతావరణం, పొగమంచు వరిని అగ్గి తెగులు ఆశించటానికి అనుకూలం. పొలంలో, పొలంగట్లపైన ఉండే గడ్డి కలుపు మొక్కలు అగ్గి తెగులను వ్యాప్తి చేస్తాయి. కాబట్టి, పొలం గట్లపై కలుపు లేకుండా చూసుకోవాలి. వరి నారుమళ్ళలో అగ్గి తెగులు గమనిస్తే, నివారణకు 0.5 గ్రా. ట్రైసైక్లాజోల్ లేదా 1.5 మి.లీ. ఐసోప్రొథైయోలిన్ లేదా 2.5 మి.లీ. కాసుగామైసిన్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
మొక్కజొన్న: చలి వల్ల మొక్కజొన్నలో భాస్వరం లోపించి ఆకులు ఊదా రంగులోకి మారుతాయి. భాస్వరం లోప లక్షణాలు గమనించినట్లైతే నివారణకు 10 గ్రా. 19–19–19 లేదా డి.ఎ.పి మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
మిరప : ప్రస్తుత చలి వాతావరణం మిరపను బూడిద తెగులు ఆశించటానికి అనుకూలం. నివారణకు, 3గ్రా. నీటిలో కరిగే గంధకం లేదా 1 మి.లీ. అజాక్సిస్ట్రోబిన్ లేదా 2.5గ్రా. టేబుకొనజోల్ + గంధకం లేదా 1.5గ్రా. కార్బండజిమ్ + మాంకోజేబ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
మామిడి: ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మామిడిలో తేనెమంచు పురుగు, బూడిద తెగులు ఆశించటానికి అనుకూలం. నివారణకు, 0.3గ్రా. డైనోటేఫురాన్ + 1గ్రా. కార్బండజిమ్ + 2.5 మి.లీ. వేపనూనె లేదా 0.5 గ్రా. థయోమిథాక్సామ్ + 2 మి.లీ. హెక్సాకొనజోల్ + 2.5 మి.లి వేప నూనె మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
కుసుమ: నవంబర్‌లో విత్తుకున్న కుసుమ పంటకు పేనుబంక ఆశించే అవకాశం ఉంది. నివారణకు 2 మి.లీ. డైమిథోయెట్‌ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment