
కరువు, భూగర్భ జలాలు అడుగంటడం, సాధారణం కన్నా ఎక్కువగా 4–5 అధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వడంతో భూతాపం ముందెన్నడూ ఎరుగనంతగా పెరిగిపోతోంది.. 2024 ఏడాదిలో అన్ని నెలలూ మానవాళి చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎల్‌నినో కారణంగా ఇలా జరిగిందేమో అనుకుంటే.. లానినా దశలో కూడా 2025లో మొదటి 3 నెలలు కూడా రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
మనం ఇప్పుడు క్లైమెట్ ఎమర్జెన్సీ స్థాయిలో పర్యావరణ సంక్షోభాన్ని అనుభవిస్తున్నామని చెప్పకతప్పదు. అందుకు తాజా నిదర్శనం.. రిజర్వాయర్లు ఖాళీ అవుతున్నాయి. జీవనదులు ఎండి΄ోతున్నాయి. మట్టి ఉష్ణోగ్రత పెరిగిపోతోంది. పంటలకు గడ్డు కాలం వచ్చింది. ప్రస్తుత రబీ సీజన్‌లో తెలుగునాట కొన్ని జిల్లాల్లో వరి తదితర పంటలు, పండ్ల తోటలు నిలువునా ఎండిపోతున్నాయి. ఇది స్పష్టంగా ‘క్లైమెట్ ఎమర్జెన్సీ’ పరిస్థితే! కిం కర్తవ్యం?
వాతావరణ మార్పులను తట్టుకునేవి, తక్కువ నీటి అవసరం కలిగినవి అయిన చిరుధాన్యాలను ప్రధాన ఆహార పంటలుగా సాగు చేయాలని హైదరాబాద్‌లోని భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ(ఐ.ఐ.ఎం.ఆర్.) సూచిస్తోంది. రైతుకు పర్యావరణ, ఆర్థిక, పౌష్టికాహార భద్రతనిచ్చే ఈ పంటలు వినియోగదారులకు సంపూర్ణ పౌష్టికాహారాన్ని అందిస్తాయి.
ప్రకృతి వనరుల ఆధారంగానే వ్యవసాయం సాగేది. వర్షం మన వ్యవసాయానికి ముఖ్యాధారం. వర్షం ఎప్పుడొస్తుందో.. ఎంత తక్కువ కురుస్తుందో.. వర్షాకాలం మధ్యలో ఎన్ని రోజులు వర్షం మొహం చాటేస్తుందో తలపండిన వారికి కూడా అంతుపట్టని దశకు చేరాం. పెద్ద నదులపై ఉన్న రిజర్వాయర్లు సైతం వేసవి అడుగంటిపోవడంతో ఆయకట్టు భూములకు కూడా సాగు నీటి భద్రత కరువైపోయే పరిస్థితులు వచ్చాయి.
దీని అర్థం ఏమిటంటే.. ఇంతకుముందు వేస్తున్న అధికంగా నీటి అవసరం ఉండే పంటల్నే గుడ్డిగా ఇక మీదట సాగు చేయలేం. నీటి అవసరం అంతగా అవసరం లేని ఆహార పంటల వైపు దృష్టి మరల్చడం రైతులకు, సమాజానికి శ్రేయస్కరం అంటున్నారు నిపుణులు. వచ్చే ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసే పంటలను విజ్ఞతతో ఎంపిక చేసుకోవాలని ఆయన సూచిస్తున్నారు. ఈ కోవలో ముందు వరుసలో ఉండేవి.. చిరుధాన్య పంటలు.
జొన్న, సజ్జ, రాగి, కొర్ర, ఊద, సామ, అరికెలు, ఒరిగెలు.. ఇవీ మనకు ముఖ్యంగా తెలిసిన చిరుధాన్య పంటలు (మిల్లెట్స్). దక్షిణ భారతీయులకు వేలాది ఏళ్ల క్రితమే బాగా పరిచయమైన పంటలివి.. కొత్తవి కాదు. హరిత విప్లవం పేరుతో వరి, గోధుమ వంటి ఆహార పంటలను ప్రభుత్వం వ్యాప్తిలోకి తేవడానికి ముందు వేలాది ఏళ్లుగా మన పూర్వీకులు తింటూ ఆరోగ్యంగా జీవించడానికి కారణభూతమైన పంటలివి. పర్యావరణ, వాతావరణ సంక్షోభకాలంలో తిరిగి ఈ పంటల వైపు మన ప్రజలు, రైతులు, ప్రభుత్వాలు దృష్టిసారించాల్సిన అవసరం తోసుకు వచ్చిన తరుణం ఇది.
సి–4 రకం పంటలు మేలు
నీటి వనరులు అందుబాటులో లేని, సారం పెద్దగా లేని తేలిక, ఎర్ర నేలలు వరి, పత్తి వంటి పంటల సాగుకు అనుకూలం కావు. ఈ పంటలను సాంకేతిక పరిభాషలో ‘సి–3’ పంటలు అంటారు. తక్కువ వర్షం తోనే, కరువు కాలంలో సయితం అంతగా సారం లేని తేలిక, ఎర్ర నేలల్లోనూ ఖచ్చితమైన దిగుబడులనిచ్చేవి చిరుధాన్య పంటలు. సాంకేతిక పరిభాషలో వీటిని ‘సి–4’ పంటలు అంటారు.
చిరుధాన్య పంటలు వరి కన్నా అనేక రకాలుగా మేలైనవి . సమాజానికి పౌష్టికాహార భద్రతతోపాటు రైతులకు కనీస ఆదాయ భద్రతను ఇవ్వడంతోపాటు, వరి గడ్డి కన్నా అధిక ΄ోషక విలువలున్న పశుగ్రాసాన్ని కూడా అందిస్తాయన్నారు. భూతాపం అసాధారణంగా పెరుగుతున్న సంక్షోభ కాలంలో ఇంతకు ముందు వేసిన పంటే వేస్తామని, ఇంతకు ముందు తినే ఆహారమే తింటామని అనుకుంటూ ఉండకూడదు.
వాతావరణ అసమతుల్యతను తట్టుకొని పెరిగే చిరుధాన్యాలను ముఖ్య ఆహారంగా తినటం మొదలుపెడితే రైతులూ పండించడం మొదలు పెడతారు. తెలుగు రాష్ట్రాల వ్యవసాయ శాఖలు, రైతులు అనువుకాని భూముల్లో వరి, పత్తి, మొక్కజొన్న వంటి పంటలను లక్షల ఎకరాల్లో సాగు చేయడం మాని.. చిరుధాన్యాల సాగుపై దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు.
సి–4 పంటల విశిష్టత ఏమిటి?
సి–4 రకం పంటల విశిష్టత ఏమిటంటే.. అతి తక్కువ నీటితో, తక్కువ పంట కాలంలోనే కరువును, అధిక ఉష్ణోగ్రతను తట్టుకొని, అధిక పౌష్టిక విలువలతో కూడిన ఆహార ధాన్యాలను అందిస్తాయి. వాతావరణం నుంచి బొగ్గుపులుసు వాయువును, సూర్యరశ్మిని గ్రహించి అధిక ఉష్ణోగ్రతలు, కరువు పరిస్థితుల్లో సైతం ఆహారాన్ని ఉత్పత్తి చేసుకొని మంచి దిగుబడులు ఇవ్వడంలో సి–4 పంటలు సి–3 రకం పంటలకన్నా అధిక సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
భూతాపాన్ని పెంచే హరిత గృహ వాయువులను చిరుధాన్య పంటలతో పోల్చితే వరి పంట 20 రెట్లు ఎక్కువగా విడుదల చేస్తున్నది. అందుకే చిరుధాన్యాలు రైతులకు బీమా ఇవ్వగలిగిన పంటలన్నారు. పప్పుధాన్యాలు, నూనెగింజలతో కలిపి సమీకృత వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేసినప్పుడు ఎరువుల అవసరం, చీడపీడల బెడద కూడా చిరుధాన్య పంటలకు పెద్దగా ఉండదు.
తేలిక భూముల్లో, ఎర్ర నేలల్లో మొక్కజొన్న, పత్తి సాగు చేస్తే వర్షాలు సక్రమంగా పడనప్పుడు ఈ పంటలు రైతులను తీవ్ర నష్టాల పాలుజేయడానికి అవకాశాలెక్కువ. చెరకు సాగుకు 2,100 ఎం.ఎం, వరికి 1,250 ఎం.ఎం., పత్తికి 600 ఎం.ఎం. నీరు అవసరం. అయితే, జొన్నలకు 400 ఎం,ఎం., సజ్జ, రాగి, కొర్ర తదితర స్మాల్ మిల్లెట్లకు 350 ఎం.ఎం. నీరు సరి΄ోతుంది. వేరుశనగకు 450 ఎం.ఎం., పప్పుధాన్యాలకు 300 ఎం.ఎం., మొక్కజొన్నకు 500 ఎం.ఎం. నీరు అవసరమవుతుంది.
వ్యవసాయ శాఖలు రైతులను చైతన్య పరచి జొన్న, సజ్జ, రాగి వంటి పంటలను సూచించాలి. స్మాల్ మిల్లెట్స్ అయిన కొర్రలు, సామలు, ఊదలు, అరికెలు, ఒరిగెలు వంటి పౌష్టిక విలువలు కలిగిన ఈ పంటల సాగును తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ శాఖలు విస్తృతంగా ప్రోత్సహించాలి.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న క్రాప్ కాలనీలలో ఆయా ప్రాంతాన్ని, నేల స్వభావాన్ని బట్టి కొన్ని రకాల పంటలను ప్రోత్సహించి, దగ్గర్లోనే ప్రాసెసింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడం వల్ల రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉంటుంది. పంటల కాలనీలలో చిరుధాన్య పంటలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది.
సి–3 పంటలు
1. వరి, గోధుమ, పత్తి, పొద్దుతిరుగుడు..
2. చల్లని వాతావరణం (20–25 డిగ్రీల సెల్షియస్) అనుకూలం.
3. భూమ్మీద మొక్కల్లో 95% వరకు సి–3 రకం మొక్కలుంటాయి
4. అధిక ఉష్ణోగ్రతను, కరువును తట్టుకునే సామర్థ్యం తక్కువ
5. వాతావరణంలో బొగ్గుపులుసు వాయువు వల్ల భూతాపం పెరిగేకొద్దీ దిగుబడి తగ్గుతుంది∙
6. పంట కాలం ఎక్కువ.. 100–140 రోజులు
7. సాగు నీరు బాగా అవసరం. బెట్ట పరిస్థితులను ఎక్కువ కాలం తట్టుకోలేవు
8. వరికి 1,250 ఎం.ఎం., చెరకుకు 2,100 ఎం.ఎం., పత్తికి 600 ఎం.ఎం. వర్ష΄ాతం కావాలి
9. సారవంతమైన, నీటి వసతి ఉండే భూములు అనుకూలం
10. వాతావరణంలో భూతాపం పెరుగుతున్నకొద్దీ ఈ పంటల్లో ΄ోషకాలు, ఖనిజ లవణాలు తగ్గుతాయి
11. ఎరువుల అవసరం ఎక్కువ
సి–4 పంటలు
1. కొర్ర, అరిక, సామ, అండుకొర్ర, ఊద, జొన్న, సజ్జ, రాగి.
2. వేడి వాతావరణ (30–45 డిగ్రీల సెల్షియస్) పరిస్థితులను తట్టుకుంటాయి
3. భూమ్మీద మొక్కల్లో 5% వరకు సి–4 రకం మొక్కలుంటాయి
4. అధిక ఉష్ణోగ్రతను, కరువును తట్టుకునే సామర్థ్యం ఎక్కువ
5. వాతావరణంలో బొగ్గుపులుసు వాయువు వల్ల భూతాపం పెరుగుతున్నా దిగుబడి తగ్గదు∙
6. పంట కాలం తక్కువ.. 60–95 రోజులు (అరికలు 180 రోజులు)
7. సాగు నీటి అవసరం బాగా తక్కువ. నీటి కొరతను ఎక్కువ కాలం తట్టుకోగలవు
8. మొక్కజొన్నకు 500 ఎం.ఎం, జొన్నకు 400 ఎం.ఎం., రాగి, సజ్జలకు 350 ఎం.ఎం. చాలు. కొర్ర, సామ, అరిక, ఊద, అండుకొర్రలకు ఇంకా తక్కువ వర్షపాతం చాలు.
9. తేలిక భూములు, భూసారం తక్కువగా ఉండే మెట్ట భూములు అనుకూలం
10. పౌష్టిక విలువలు ఎక్కువ. పిండి పదార్థంతోపాటు అధిక పీచు, నాణ్యమైన మాంసకృత్తులు, ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉన్న సిరిధాన్యాలివి
11. ఎరువుల అవసరం లేదు/తక్కువ
జీఎస్టీ ఎత్తివేయాలి
పర్యావరణానికి హాని కలిగించే వరి, గోధుమ వంటి పంటలకు సబ్సిడీలు ఇస్తున్న ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు దోహదపడే చిరుధాన్యాలపై మాత్రం ప్రభుత్వం జీఎస్టీ విధిస్తుండటం సమంజసం కాదు. జీఎస్టీ రద్దు చేయాలి. చిరుధాన్యాలను ప్రభుత్వాలు మద్దతు ధరకు సేకరించి, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు సబ్సిడీ ధరకు అందివ్వాలి. సి4 రకం పంటలైన సిరిధాన్యాలతోనే ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ, ఆహార, ఆరోగ్య భద్రత చేకూరుతుందని అందరూ గ్రహించాలి.
– డాక్టర్ ఖాదర్ వలి, ప్రముఖ ఆహార ఆరోగ్య నిపుణులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత
--పతంగి రాంబాబు, సాగుబడి డెస్క్
(చదవండి: పంట పొలాల్లో డ్రోన్..! ఇక నుంచి ఆ పనుల్లో మహిళలు..)