తాప నియంత్రణే తరుణోపాయం
సమకాలీనం
దేశంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 65 శాతం జనాభా ఆధారపడ్డ వ్యవసాయ రంగం ఇప్పటికే వాతావరణ మార్పుల ప్రతికూల ప్రభావాన్ని చవిచూస్తోంది. వరుసగా రెండో సంవత్సరం దేశం కరువు కోరల్లో చిక్కుకుంది. తాపవృద్ధి వల్లే 4.5 కోట్ల మంది భారతీయులు దారిద్య్రరేఖ కిందకు దిగజారిపోతారని ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది. ఇటువంటి పరిస్థితి దాదాపు అన్ని పేద-అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ ఉంటుంది. ఉమ్మడిగా చర్చించి వ్యూహాత్మకంగా భూతాప వృద్ధిని నియంత్రించడం యూఎన్‌సీసీసీ లక్ష్యం.
ఎవరి కోపతాపాలనైనా భరించవచ్చేమో....! కానీ, సహనశీల భూమాత కోపం-తాపం ఏది పెరిగినా భరించడం అసాధ్యం. కోపాన్ని అప్పుడప్పుడు వరదలు-కరువులు- భూకంపాలుగా చూపుతున్నా... ఇప్పుడామె తాపం వేగంగా, ప్రమాదకరంగా పెరుగుతోంది. ఈ శతాబ్దాంతానికి భూమి, దాన్ని ఆవహించి ఉన్న ఆవరణం వేడి పెరుగుదలని మరో రెండు డిగ్రీల సెల్సియస్‌ను దాటనీకుండా నియంత్రించే వ్యూహాలు-కట్టుబాట్ల కోసం 190కి పైగా దేశాలు ఈ నెలాఖరున ప్యారిస్‌లో భేటీ అవుతున్నాయి. పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రతినిధిగా భారత్ అక్కడ కీలక పాత్ర పోషించాల్సి ఉంది. సదస్సు నిర్ణయాల కోసం విశ్వమంతా నిరీక్షిస్తున్నది. అభివృద్ధి చెందని, చెందుతున్న దేశాల ప్రయోజనాల్ని పరిరక్షిస్తూనే, అభివృద్ధి చెందిన దేశాల్ని కట్టుబాట్లకు సంసిద్ధుల్ని చేయాలి. చర్చల్ని ఫలప్రదం చేయడమే కాకుండా కట్టుబాట్ల తుది ముసాయిదా-అమలుకు చట్టబద్ధతను తీసుకు వచ్చేందుకు భారత్ చొరవ కీలకమైందిగా భావిస్తు న్నారు. విశ్వవ్యాప్తంగా కర్బన ఉద్గారాల్ని నియంత్రించాలి. తద్వారా భూతా పాన్ని కట్టడి చేయాలి.
అంతిమంగా ‘వాతావరణ మార్పు’ (క్లైమేట్ చేంజ్)ను అరికట్టాలి. ఇదీ ఇప్పుడు, ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు జరుగుతున్న వాతావరణ మార్పు సదస్సు (యూఎన్‌సీసీసీ) ముందున్న పెద్ద లక్ష్యం. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 11 వరకు జరిగే ఈ ‘భాగస్వాముల సదస్సు’ (కాప్) నిర్ణయాలు, వాటి అమలుపైనే ధరిత్రి భవిష్యత్ వాతావరణం, మానవ మనుగడ ఆధారపడి ఉన్నాయి. భూతాపాన్ని నియంత్రించకుండా ప్రస్తుత వాతావరణ మార్పుల్ని యథేచ్ఛగా అనుమతిస్తే... శతాబ్దాంతానికి వాతావరణ ఉష్ణోగ్రత మరో అయిదారు డిగ్రీల మేర పెరిగే ప్రమాదముంది. నాలుగు డిగ్రీలు హెచ్చినా ధృవాల మంచు కరిగి, సముద్ర మట్టాలు పెరుగు తాయి. ఏ స్థాయిలో అంటే.... ప్రస్తుతం యాభయ్ శాతం ప్రపంచ జనాభాకు ఆవాసాలుగా ఉన్న చిన్న చిన్న తీర గ్రామాలు, పట్టణాలతో పాటు కోల్‌కతా, షాంఘై వంటి మహానగరాలు మునిగిపోతాయి. వాతావరణంలో మార్పు లొచ్చి మనుషుల ఆరోగ్యంపైన, వ్యవసాయం పైన, ఆహారోత్పత్తిపైన, ఆర్థిక వ్యవస్థలపైన, అంతిమంగా మనిషి మనుగడపైన తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది.
2 డిగ్రీల లక్ష్యం సాధించినా గొప్పే!
అసాధారణ స్థాయిలో పెరుగుతున్న భూతాపాన్ని నియంత్రించాలి. లేకుంటే విపరిణామాలు తప్పవు. మానవ ప్రమేయం వల్లే ఉష్ణోగ్రతలు పెరుగుతు న్నాయి. కొన్ని లక్షల సంవత్సరాల్లో పెరిగిన దాని కన్నా గత మూడు, నాలుగు వందల ఏళ్లలో ఈ పెరుగుదల ప్రమాదకర స్థాయిలో ఉండటమే దీనికి నిదర్శనం. కర్బన కేంద్రక ఇంధన వనరుల బదులు పునర్వినియోగ ఇంధన వనరుల్ని వినియోగించడం ద్వారా భూతాపాన్ని తగ్గించవచ్చు. బొగ్గు, పెట్రోలియం, నాఫ్తా వంటి శిలాజ ఇంధనాలు మండినపుడు హెచ్చు స్థాయిలో కర్బన ఉద్గారాలు వాతావరణంలోకి విడుదలవుతున్నాయి. పవన విద్యుత్తు, సౌర విద్యుత్తు వంటివి పర్యావరణానుకూలమైనవి.
వాటి విని యోగ నిష్పత్తిని పెంచాలి. ఇదొక పార్శ్వం. వాతావరణంలోకి కార్బన్ డయాక్సైడ్ మాత్రమే కాకుండా ఇతర ఉద్గారాలు హెచ్చు స్థాయిలో రావడం కూడా ఈ తాపవృద్ధికి కారణమౌతున్నాయి. వాటన్నింటినీ నియంత్రించాలి. వాతావరణంలోని కార్బన్‌డయాక్సైడ్ వినియోగమయ్యేలా అడవుల శాతాన్ని, హరితాన్ని వృద్ధి చేయాలి. మనిషి సౌఖ్యాల్ని నియంత్రిస్తూ జీవనశైలిలో మౌలిక మార్పులు తీసుకురావాలి. ఇందుకోసం ప్రపంచ దేశాలన్నీ కట్టు బడాలి. అప్పుడే ఉష్ణోగ్రత పెరుగుదలను నియంత్రించగలం.
ఉదాహరణకు ఉష్ణవృద్ధికి కారణమౌతున్న ఉద్గారాలను 2030 నాటికి (2005 నాటి స్థాయితో పోల్చి) 33 నుంచి 35 శాతం తగ్గిస్తామని భారత్ ప్రకటించింది. సాంకేతిక పరిజ్ఞానం మార్పిడి, గ్రీన్ క్లైమేట్ ఫండ్ సహాయం తదితరాల ద్వారా శిలా జేతర ఇంధన వనరుల వినియోగ శాతాన్ని 40కి పెంచుతామని పేర్కొంది. విస్తారంగా అడవుల్ని, రోడ్లపక్క చెట్లను పెంచి కార్బన్‌డయాక్సైడ్ (2.5 నుంచి 3 బిలియన్ టన్నుల) వినిమయం ద్వారా తత్సమానమైన కార్బన్ సింక్‌కు దోహదపడతామనీ సదస్సుకు ముందు సమర్పించిన నిబద్ధతా పత్రం (ఐఎన్‌డీసీ)లో పేర్కొంది. ఇలా దాదాపు 90 దేశాలు ఈ ఎన్‌ఐడీసీ లను సమర్పించాయి. వాటిని యథాతథంగా అమలు పరచినా.... భూతాపం పెరుగుదల 2.7 డిగ్రీల సెల్సియస్ దగ్గర కట్టడయ్యే ఆస్కారముంది. లక్ష్యం 2 డిగ్రీల పెరుగుదలకు నియంత్రించడమే అయినప్పటికీ, 2.7 వద్ద కట్టడి చేసినా గొప్పే అని శాస్త్రజ్ఞులు, పర్యావరణ నిపుణులంటున్నారు. ఈ పెరుగు దల నాలుగయిదు శాతానికి వెళితే అత్యంత ప్రమాదకరమని ‘క్లైమేట్ యాక్షన్ ట్రాకర్’ (క్యాట్) చెబుతోంది.
మనకు, మనబోటోళ్లకే పెద్ద నష్టం
భూతాప పెరుగుదల, వాతావరణ మార్పు ప్రతికూల ప్రభావం అభివృద్ధి చెందిన దేశాల కన్నా పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలపైనే ఎక్కువ. ఆ వివ రీత పరిస్థితుల్ని తట్టుకోగలిగే, సమర్థంగా ఎదుర్కోగలిగే జీవన ప్రమాణాలు ఇక్కడ ఏర్పడలేదు. ఆహారభద్రత, ఆరోగ్య భద్రత ఇప్పటికీ సమస్యే. ఇటీవల వెలువడిన రెండు అధ్యయన నివేదికలూ అదే చెబుతున్నాయి. 4 డిగ్రీల సెల్సియస్ తాప వృద్ధి వల్ల సముద్ర మట్టాలు పెరిగి, 50 శాతం జనాభా ఆవాసాలైన తీర ప్రాంతాలు నీట మునుగుతాయని అమెరికాకు చెందిన ‘క్లైమేట్ సెంట్రల్‘ సంస్థ వెల్లడించింది. వాతావరణ మార్పు ప్రభావం వల్లే 2030 నాటికి పదికోట్ల మంది పేదరికంలోకి జారిపోతారని ప్రపంచ బ్యాంక్ నివేదిక పేర్కొంది. వ్యవసాయంపైన, ఆహారోత్పత్తిపైన, ఆరోగ్య పరిస్థితులపైన తీవ్ర ప్రభావం పడుతుందన్నది నివేదిక సారం. ముఖ్యంగా ఆఫ్రికా సబ్-సహారన్ ప్రాంతం, దక్షిణాసియా తీవ్రంగా ప్రభావితమౌతాయి.
దేశంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 65 శాతం జనాభా ఆధారపడ్డ వ్యవసాయ రంగం ఇప్పటికే వాతావరణ మార్పుల ప్రతికూల ప్రభావాన్ని చవిచూస్తోంది. వరుసగా రెండో సంవత్సరం దేశం కరువు కోరల్లో చిక్కుకుంది. తాపవృద్ధి వల్లే 4.5 కోట్ల మంది భారతీయులు దారిద్య్రరేఖ కిందకు దిగజారి పోతారని ఈ నివేదిక వెల్లడించింది. ఇటువంటి పరిస్థితి దాదాపు అన్ని పేద-అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ ఉంటుంది. ఉమ్మడిగా చర్చించి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలనేది యూఎన్‌సీసీసీ లక్ష్యంగా ఉంది. అందుకే, భూతాపాన్ని నియంత్రించే ఏకలక్ష్యం కోసం విభిన్న బాధ్యతలతో పనిచేయాలని భారత్ పిలుపునిచ్చింది. అందరికీ ఒకే నిబంధన ఫలితాలివ్వదు. ఏ దేశం ఏ మేరకు తన వంతు పాత్ర నిర్వహి స్తుందో ఎవరికి వారుగా ప్రకటించే నిబంధన ఏర్పాటు చేశారు.
గడ్డకెక్కిన వాళ్లు గతం గతః అంటే ఎలా?
అంతర్జాతీయ సదస్సులు, ఒప్పందాల్లో మాటివ్వడమే కాకుండా మాట నిల బెట్టుకోవడం ముఖ్యం. చైనా తర్వాత అత్యధిక కర్బన ఉద్గారాలు వెలువరించే దేశం అమెరికా. కానీ, ఉద్గారాల నియంత్రణ-భూతాపం అరికట్టే చర్యల అమలులో అమెరికా గత చరిత్ర గొప్పగా లేదు. 1997 క్యోటో ఒప్పందం అమలు వైఫల్యాలకు బాధ్యత వహించలేదు. ధృవీకరణకు నిర్ద్వంద్వంగా నిరాకరించింది. ప్రపంచంలో అత్యధిక తలసరి ఉద్గారాలున్న దేశం అమెరి కాయే! ఇప్పుడు 20 నుంచి 28 శాతం వరకు తగ్గిస్తానని చెబుతోంది. ఎంత మేరకు ఆ మాటపై నిలబడుతుందో చూడాలి. చైనా కూడా 60 నుంచి 65 శాతం వరకు ఉద్గారాల్ని తగ్గిస్తానంటూనే, తమ ఉద్గారాలు 2030కి గరిష్ఠ స్థాయిలో ఉంటాయనడం విడ్డూరంగా ఉంది. ఇంతకూ తగ్గుతాయనా, పెరు గుతాయనా? తగ్గింపు పరిమాణాల లెక్కింపునకు 2005 ప్రమాణ సంవ త్సరం (బేస్ ఇయర్)గా తీసుకోవాలని అమెరికా, కాదు 1990ని ప్రమాణ సంవత్సరంగా తీసుకోవాలని ఐరోపా సంఘం చెబుతోంది.
ఈ వైరుధ్యాలెలా ఉన్నా, ప్రథమ ప్రపంచ దేశాల వైఖరిని పేద-అభివృద్ది చెందుతున్న దేశాలు నిరసిస్తున్నాయి. ఎప్పట్నుంచో ఇంధన వనరుల్ని విచ్చలవిడిగా వాడుకొని, సౌఖ్యాలు-ఉన్నత జీవన ప్రమాణాలు సాధించి, కాలుష్యానికి కారకులై..... ఇప్పుడు ఉన్నపళంగా కట్టడి, నియంత్రణ, పరిమితులు అంటే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ప్రగతి పథంలో ఉన్న తమను అభివృద్ధి అవకా శాల్ని వదులుకొమ్మంటే ఎలా అని వారు నిలదీస్తున్నారు. వారొక సమంజస మైన ప్రతిపాదన చేస్తున్నారు. కాలుష్యకారక దశ దాటి నేరుగా ప్రగతిదశకు దూకడానికి వీలుగా శాస్త్ర-సాంకేతిక పరిజ్ఞానాన్ని సబ్సిడీలతో, చౌకగా అందించాలని అభివృద్ధి చెందిన దేశాల్ని వారు కోరుతున్నారు. పశ్చిమ దేశాలందుకు సుముఖంగా లేవు. యూఎన్ ప్రతిపాదిస్తున్న ఈ సదస్సులకైనా అభివృద్ధి చెందిన దేశాలు ఎందుకు ముందుకొస్తున్నాయి? అంటే, అందులో ఓ మతలబుంది. కర్బన ఉద్గారాలకు, గ్రీన్‌హౌజ్ ఎమిషన్స్‌కి కారకులెవ రైనా.... భూతాప విపరిణామాలు మాత్రం సమస్త ప్రపంచానికి ఉంటాయి. అందుకే ఈ కదలిక! నిర్దిష్ట షరతులు, కట్టడి వెనుక వారి వ్యాపార ప్రయో జనాలు కూడా అంతర్లీనంగా ఉంటాయి.
పుడమి రక్షణ కర్తవ్యం అందరిదీ
కారకులెవరన్న మీమాంస, పండిత చర్చ కన్నా, పుడమితల్లిని కాపాడుకోవడ మెలా అన్నదే ఇపుడు ప్రపంచం ముందున్న కర్తవ్యం. 2009 కొపెన్‌హెగెన్ సదస్సులో తీసుకున్న నిర్ణయాలపై న్యాయపరమైన కట్టుబాట్లేమీ లేకపోవడం అమలును నీరుగార్చింది. ఇప్పుడా న్యాయపరమైన కట్టుబాటు సాధ్యమా? అన్న చర్చా జరుగుతోంది. ప్యారిస్ సదస్సుపై అంచనాలైతే భారీగానే ఉన్నాయి. ముఖ్యంగా భారత్ ఓ పెద్దన్న పాత్ర పోషించాలని అటు ప్రథమ ప్రపంచదేశాలు, ఇటు పేద-అభివృద్ధి చెందుతున్న దేశాలు అభిలషిస్తు న్నాయి. చర్చల సరళి, తీర్మానాలు, కట్టుబాట్లు, నిబద్ధతల్ని నిలబెట్టుకునే షరతులు... వగైరా వగైరా! ఇవన్నీ కీలకం కానున్నాయి.
2018లో మళ్లీ సమీక్షతో, తాప నియంత్రణలో సాధించిన ఫలితాలపై సింహావలోకనం ఉంటుంది. సౌరకుటుంబంలో జీవమున్న ఒకే ఒక గ్రహం, భూమిని ఆ ప్రత్యేకత నిలబెట్టుకునేలా చూడటమే మానవజాతి ముందున్న కర్తవ్యం. సరిగ్గా 225 ఏళ్ల కిందట, ఇదేరోజు...13 నవంబర్ 1789, అమెరికా నిర్మాతల్లో ఒకరైన బెంజమిన్ ఫ్రాంక్లిన్ తన మిత్రునికొక లేఖ రాస్తూ, ‘‘ఈ ప్రపంచంలో ఏదీ కచ్చితం అని చెప్పలేం, చావు పన్నులు తప్ప’’ అని పేర్కొన్నారు. చావు అనివార్యమైనపుడు, అనుభవించిన దానికి మూల్యం చెల్లించడమూ తప్పని సరైనపుడు.... బతికినంతకాలం బాధ్యతగా మసలుకోవాలి తప్ప, భవిష్యత్త రాల వనరుల్ని కొల్లగొట్టే హక్కు మనకు లేదు. ఇది సత్యం.
దిలీప్ రెడ్డి, సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్
ఈమెయిల్: dileepreddy@sakshi.com