cereals
-
దేశంలో తృణధాన్యాల వినియోగం తగ్గుదల
సాక్షి, అమరావతి: ప్రజలు తమ ఆదాయం పెరుగుతున్న కొద్ది ఆహార అలవాట్లలో మార్పులు చేసుకుంటూ వెళుతున్నారు. పాలు, మాంసం, గుడ్లు వంటి ఇతర ప్రొటీన్ ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా తృణధాన్యాల వినియోగం తగ్గుతోంది. గృహవినియోగ వ్యయ సర్వే 2022–23లో ఈ విషయం వెల్లడైంది. దేశవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 1999–2000 నుంచి 2022–23 మధ్య తృణధాన్యాల తలసరి వినియోగం క్రమంగా క్షీణించింది. 1999–2000లో నెలవారీ తలసరి తృణధాన్యాల వినియోగం గ్రామీణ ప్రాంతాల్లో 12.72, పట్టణ ప్రాంతాల్లో 10.42 కిలోలుగా ఉండేది. ఇది 2022–23లో గ్రామాల్లో 9.61, పట్టణాల్లో 8.05 కిలోలకు పడిపోయింది. పశ్చిమబెంగాల్లో అధికంరాష్ట్రాల వారీగా తృణధాన్యాల వినియోగం పరిశీలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో 11.23 కిలోలతో పశ్చిమబెంగాల్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఒడిశా 11.21 కిలోలు, బీహార్ 11.14 కిలోలు, ఛత్తీస్‌గఢ్ 10.27 కిలోలతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. అదే పట్టణ ప్రాంతాల్లో వినియోగం బిహార్‌లో 10.45 కిలోలు, ఛత్తీస్‌గఢ్‌లో 10.43, జార్ఖండ్‌లో 9.59 కిలోలు. గ్రామీణ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్‌లో 9.30 కిలోలు, తెలంగాణలో 10.11, పట్టణాల్లో ఆంధ్రప్రదేశ్‌లో 8.29, తెలంగాణలో 8.77 కిలోల చొప్పున వినియోగిస్తున్నారు. బియ్యానిదే పైచేయిమొత్తం తృణధాన్యాల వినియోగంలో బియ్యం వాటా ఎక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా గ్రామాల్లో 9.61 కిలోల నెలవారీ తలసరి వినియోగంలో 55.35 శాతం బియ్యం, 40.93 శాతం గోధుమ, 3.48 శాతం ముతక, 0.22 శాతం ఇతర తృణధాన్యాలు ఉన్నాయి. పట్టణాల్లో 8.05 కిలోల నెలవారీ తలసరి వినియోగంలో 53.20 శాతం బియ్యం, 44.53 శాతం గోధుమ, 2.09 శాతం ముతక, 0.19 ఇతర తృణధాన్యాలు ఉన్నాయి. ఏపీలోని వినియోగిస్తున్న మొత్తం తృణధాన్యాల్లో గ్రామీణ ప్రాంతాల్లో 92.22 శాతం, పట్టణాల్లో 90.55 శాతం బియ్యం వాటా నమోదైంది. -
G20 Summit: జీ20 అతిథులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు
న్యూఢిల్లీ: జీ20 కూటమి నేతలు, అతిథులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం రాత్రి ఢిల్లీలో భారత్ మండపం వద్ద ఘనమైన విందు ఇచ్చారు. తృణధాన్యాలు, కశ్మీరీ కాహా్వతో తయారు చేసిన పసందైన వంటకాలను ఈ సందర్భంగా అతిథులు రుచి చూశారు. ముంబై పావ్, బాకార్ఖానీ అనే రొట్టెలు వడ్డించారు. డార్జిలింగ్ టీ ఏర్పాటు చేశారు. భారతీయ వంటకాల్లోని వైవిధ్యం ఇక్కడ సాక్షాత్కారించింది. తొలుత రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ జీ20 నేతలకు స్వాగతం పలికారు. స్వాగత వేదిక వెనుక ప్రాచీన నలందా విశ్వవిద్యాలయ శిథిలాల చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే జీ20 థీమ్ ‘వసుధైవ కుటుంబం’ అని లిఖించారు. రాష్ట్రపతి ఇచి్చన విందులో అమెరికా అధ్యక్షుడు బైడెన్, యూకే ప్రధాని రిషి సునాక్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 300 మంది హాజరయ్యారు. సునాక్ వెంట ఆయన భార్య అక్షతా మూర్తి కూడా వచ్చారు. నలందా విశ్వవిద్యాలయం గురించి బైడెన్‌కు, సునాక్ దంపతులకు ప్రధాని మోదీ తెలియజేశారు. జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిదా భార్య యోకో కిషిదా భారతీయ సంప్రదాయ చీరను ధరించి రావడం విశేషం. -
‘తృణ’ధాన్యమే..! రాష్ట్రంలో అంతంతమాత్రంగానే సాగు
సాక్షి, హైదరాబాద్: తృణ ధాన్యాలు...చిరుధాన్యాలుగా పేరొందిన వీటిలో ఎన్నో పోషకాలుంటాయి. కోవిడ్–19 తర్వాత పరిస్థితులతో వీటికి క్రమంగా డిమాండ్ పెరుగుతోంది. సమృద్ది పోషకాలతో పాటు రోగ నిరోదక శక్తిని పెంపొందించడం, జీర్ణవ్యవస్థను గాడిలో ఉంచడంతో పాటు మానవ శరీరానికి పలు రకాల మేలు చేయగల ఈ తృణధాన్యాల సాగు రాష్ట్రంలో మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. నాలుగైదేళ్లుగా ఈ ధాన్యాల సాగు రాష్ట్ర స్థాయిలో కాస్త పెరుగుతున్నట్లు కనిపిస్తున్నా ఇతర రాష్ట్రాల దిగుబడులతో పరిశీలిస్తే తెలంగాణ చాలా వెనుకబడి ఉందని చెప్పొచ్చు. తృణ ధాన్యాల్లో ఎక్కువగా వినియోగించేవి జొన్నలు, సజ్జలు, రాగులు. వీటితో పాటు కొర్రలు, అరికెలు, సామలు తదితరాలు తృణధాన్యాల కేటగిరీలోకే వస్తాయి. కానీ తొలి మూడింటి కంటే వీటి వినియోగం అంతంత మాత్రమే. ఆరోగ్య సూత్రాల్లో భాగంగా తృణ ధాన్యాల వినియోగంపై వైద్య రంగ నిపుణులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ సూచనలిస్తున్నప్పటికీ రాష్ట్రంలో వీటి సాగు అత్యల్పమే. ఇటీవల పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రాల వారీగా తృణధాన్యాల దిగుబడులపై కేంద్ర ప్రభుత్వం ఒక నివేదిక విడుదల చేసింది. ఈక్రమంలో రాష్ట్రాల వారీగా దిగుబడుల్లో తెలంగాణ అత్యంత వెనుకబడి ఉంది. 2021–22 అంచనాలను బట్టి రాష్ట్రంలో తృణ ధాన్యాల దిగుబడి 180.13 మెట్రిక్ టన్నులుగా ఉంది. సరిగ్గా 2017–18 వార్షికంలో ఈ దిగుబడులు కేవలం 83.67 మెట్రిక్ టన్నులు మాత్రమే. ప్రథమ స్థానంలో రాజస్తాన్... చిరుధాన్యాల దిగుబడుల్లో దేశంలోనే రాజస్తాన్ రాష్ట్రం అగ్రభాగాన ఉంది. రాజస్తాన్‌లో ఏటా సగటున 4290.95 మెట్రిక్ టన్నుల తృణధాన్యాల దిగుబడి వస్తోంది. ఆ తర్వాతి స్థానంలో మహారాష్ట్ర 2,296 మెట్రిక్ టన్నుల దిగుబడి రాగా...ఉత్తర్‌ప్రదేశ్‌లో 2223.86 మెట్రిక్ టన్నుల దిగుబడితో మూడో స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, హరియాణా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలన్నీ ముందు వరుసలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా సగటున 15921 మెట్రిక్ టన్నుల తృణ ధాన్యాలు దిగుబడి వస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పోషకాలు ఎక్కువగా ఉండి ఆరోగ్యాని అత్యంత మేలుచేసే తృణధాన్యాల సాగును విస్తృతం చేయాలని కేంద్రం సూచించింది. రాష్ట్రంలో తృణధాన్యాల సాగుకు వాతావరణం అనుకూలతతో పాటు ఇక్కడి నేలలు సైతం ఎంతో అనుకూలమైనప్పటికీ వ్యవసాయ శాఖ మాత్రం ఈ అంశంపై ఎలాంటి దృష్టి సారించలేదనిపిస్తోంది. వినియోగం పెరిగితే దిగుమతి చేసుకునే కంటే స్థానికంగా సాగు విస్తీర్ణాన్ని పెంచితే సరసమైన ధరలకే అందుబాటులోకి తీసుకురావొచ్చని కేంద్ర వ్యవసాయ శాఖ రాష్ట్రాలకు సూచించింది. -
మిల్లెట్స్.. హెల్త్ బుల్లెట్స్
ఆరోగ్యమే మహాభాగ్యం అనేది జగద్విదితం. ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం తీసుకోవాలి. మనం తీసుకునే ఆహారంపైనే మన ఆరోగ్య పరిస్థితులు ఆధారపడి ఉంటాయి. మన దేశంలో దశాబ్దాలుగా వరినే ప్రధాన ఆహారంగా తీసుకోవడం, శారీరక శ్రమ తగ్గిపోవడం వల్ల సుగర్, ఊబకాయం, గుండె సంబంధ వ్యాధులు వస్తున్నాయని వైద్యుల పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు తాము తీసుకునే ఆహారంలో పలు మార్పులు చేసుకుంటున్నారు. త్రుణ/చిరుధాన్యాల (మిల్లెట్స్)ను తీసుకుంటూ అనారోగ్యాల బారిన పడకుండా జాగ్రత్త పడుతున్నారు. – సాక్షి, కర్నూలు డెస్క్ త్రుణధాన్యాలు అంటే.. త్రుణధాన్యాల్లో ముఖ్యంగా చెప్పుకోతగ్గవి కొర్రలు, జొన్నలు, సజ్జలు, రాగులు, ఊదలు, సామలు. భారతదేశంలో రైతులు దాదాపు ఐదు వేల సంవత్సరాలుగా వీటిని సాగు చేస్తున్నారు. ఇవి తక్కువ కాలవ్యవధి పంటలు. అంటే విత్తిన రెండు నెలలకు పంట చేతికి వస్తుంది. పైగా వర్షాధారితం. ఒక్కసారి తగినంత వర్షం కురిస్తే చాలు పంట పండినట్లే. వీటిలో ఉండే పీచు పదార్థం వల్ల తిన్న వెంటనే గ్లూకోజ్‌గా మారిరక్తంలో కలిసిపోకుండా అవసరమైన మేరకు మాత్రమే కొద్దికొద్దిగా రక్తంలో కలుస్తుంది. గ్రీన్ రివల్యూషన్ ప్రభావం ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం వరకు చిరుధాన్యాలను ఎక్కువ విస్తీర్ణంలోనే రైతులు సాగుచేసేవారు. అయితే, 1960 –70 దశకంలో భారతదేశంలో వ్యవసాయ విప్లవం (గ్రీన్ రివల్యూషన్) వచ్చిన తరువాత వరి, గోధుమ ప్రధాన ఆహార పంటలుగా మారిపోయాయి. ఎక్కువ దిగుబడి రావడంతో దక్షిణాది రాష్ట్రాల్లో దాదాపు రైతులందరూ వరినే సాగు చేయడం ప్రారంభించారు. బియ్యంలో పీచు పదార్థం లేకపోవడంతో చాలా సంవత్సరాలుగా వాటిని ఆహారంగా తీసుకుంటున్న ప్రజలు అనారోగ్యాలకు గురయ్యారు. వైద్యుల పరిశోధనల్లో వెల్లడవుతున్న విషయాలపై అవగాహనకు వచ్చిన ప్రజలు ప్రస్తుతం తమ ఆహార అలవాట్లు మార్చుకుంటూ త్రుణధాన్యాలను తీసుకుంటున్నారు. జిల్లాలో చిరుధాన్యాల సాగు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రస్తుతం దాదాపు ఐదు వేల మంది రైతులు 12 వేల ఎకరాల్లో చిరుధాన్యాలు సాగు చేస్తున్నారు. ఖరీఫ్‌లో విత్తనం వేసుకుంటే ఒక్క వర్షానికే పంట చేతికి వస్తుంది. రెండు నెలల్లోనే దిగుబడులు వస్తున్నందున మళ్లీ రెండో పంట కూడా వేసుకునేందుకు వీలవుతోంది. జొన్నలు ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోంది. కొర్రలు ఆరు నుంచి ఎనిమిది క్వింటాళ్లు వరకు వస్తోంది. ఖర్చు తక్కువ కావడం పంట ఉత్పత్తులకు మార్కెట్ ఉండటంతో రైతులు వాటి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రజలు కూడా తమ ఆహారంలో మిల్లెట్స్‌కు చోటివ్వడంతో వినియోగం పెరిగి మార్కెట్లో వాటికి డిమాండ్ ఏర్పడింది. అండుకొర్రలు కిలో రూ.55, కొర్రలు రూ.32, అరికెలు రూ.30 ధరలు పలుకుతున్నాయి. మార్కెట్ తీరుతెన్నులను గమనించిన కొందరు రైతులు త్రుణధాన్యాలనే సాగు చేస్తున్నారు. కర్నూలు జిల్లా పందిపాడుకు చెందిన రైతు కె.వేణుబాబు ఏకంగా 37 ఎకరాల్లో మిల్లెట్స్‌ను పండిస్తున్నారు. రైతులకు లాభసాటి చిరుధాన్యాల సాగు ప్రస్తుతం రైతులకు లాభసాటిగా మారింది. హైదరాబాద్‌లోని ఐఐఎంఆర్ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్) నాణ్యమైన చిరుధాన్యాల సీడ్స్ విక్రయిస్తోంది. జిల్లాలో సాగు రైతులు ఎక్కువగా వాటినే వినియోగిస్తున్నారు. చిరుధాన్యాలు సాగుచేసే కొందరు రైతులు సంఘాలుగా ఏర్పడి సీడ్స్ రైతులకు సరఫరా చేస్తూ.. పంట ఉత్పత్తులను కూడా వారే కొనుగోలు చేస్తున్నారు. రైతులకు సీడ్స్ ఇచ్చే సమయంలోనే పంట ఉత్పత్తులను నిర్ణీత ధరకు కొనుగోలు చేసేలా బైబ్యాక్ ఒప్పందం చేసుకుంటున్నారు. దీంతో అటు రైతులకు ఇటు సీడ్ వ్యాపారులకు లాభాలు చేతికి దక్కుతున్నాయి. కర్నూలులోని ‘ఆంధ్రప్రదేశ్ విత్తన రైతు సేవా సంఘం’ ఒక్కటే దాదాపు నెలకు ఐదు టన్నుల వరకు ప్రాసెస్ చేసిన సిరిధాన్యాలను వినియోగదారులకు విక్రయిస్తున్నదంటే మార్కెట్లో వాటికి ఉన్న డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. డిమాండ్ పెరుగుదలకు కారణాలు త్రుణధాన్యాలు ఆహారంగా తీసుకునే వారికి ఆరోగ్యపరంగా పలు ఉపయోగాలున్నాయని డాక్టర్ ఖాదర్‌వలీ, ప్రకృతివనం ప్రసాద్ వంటి వారు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో పాటు ప్రజలు కూడా సహజంగానే ఆరోగ్య విషయాలపై అవగాహన పెంచుకుని మెనూలో మార్పులు చేసుకుంటున్నారు. మిల్లెట్స్‌లో కార్బొహైడ్రేట్స్, ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్‌తో పాటు పీచుపదార్థం ఉంటుంది. పీచుపదార్థం వల్ల తిన్న ఆహారం కొద్దికొద్దిగా మాత్రమే గ్లూకోజ్‌గా మారుతుంది. అంటే రక్తంలో గ్లూకోజ్ పెద్ద మొత్తంలో ఒకేసారి చేరదు కాబట్టి సుగర్, బీపీ అదుపులో ఉంటాయి. సుగర్ అదుపులో ఉన్నందున ఊబకాయం రాదు. అందువల్లే వీటిని తీసుకోవడానికి ప్రజలు ఇష్టపడుతున్నారు. 37 ఎకరాల్లో త్రుణధాన్యాల సాగు ఈ చిత్రంలోని రైతు పేరు కె.వేణుబాబు. కర్నూలు వాసి. గతంలో వాణిజ్యపరంగా పత్తి సాగు చేసేవారు. గత కొద్ది సంవత్సరాలుగా కల్లూరు మండలం పందిపాడులో తనకున్న పొలంతోపాటు మరికొంత కౌలుకు తీసుకుని త్రుణధాన్యాలు సాగు చేస్తున్నారు. ఈ సంవత్సరం 37 ఎకరాలలో త్రుణధాన్యాలు సాగు చేశారు. ఆహారం విషయంలో ప్రజలు చైతన్యవంతులవుతున్నారని, జొన్నలు, కొర్రలు వంటి చిరుధాన్యాలకు అలవాటు పడుతున్నందున వాటికి డిమాండ్ ఏర్పడినందున వాటినే సాగు చేశానని చెప్పారు. ఖరీఫ్ ప్రారంభంలో వేసిన పంట రెండు నెలల్లో చేతికి వస్తున్నందున రెండో పంట సాగుకు కూడా వీలుంటుందని అంటున్నారు. ఎకరాకు 10 క్వింటాళ్ల రాగుల దిగుబడి ఈ చిత్రంలో కనిపించే వ్యక్తి పేరు అల్వాల బాలయ్య. నందికొట్కూరు పట్టణానికి చెందినవారు. కొన్నేళ్లుగా చిరుధాన్యాల సాగులో రాణిస్తున్నారు. ఈ ఏడాది కూడా 3 ఎకరాల్లో సామలు, 2 ఎకరాల్లో రాగులు సాగు చేశారు. సామలు 6, రాగులు 10 క్వింటాళ్లు దిగుబడి వస్తోంది. సామలు క్వింటా రూ.3000 చొప్పున విక్రయించారు. తక్కువ పెట్టుబడితో అధిక నికరాదాయం పొందుతున్నారు. సాగు చేయడమే కాదు... చిరుధాన్యాలనే ఆహారంగా తీసుకుంటున్నారు. -
చిరుధాన్యాలకు మరింత ప్రాధాన్యం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో చిరుధాన్యాల సాగుకు మరింత ప్రాధాన్యమిస్తామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. 2023 సంవత్సరాన్ని చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో పోషక విలువలు అధికంగా అందించగల వీటిని ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. హైదరాబాద్‌లో శుక్రవారం మొదలైన నాలుగో నేషనల్ న్యూట్రీ సీరల్ కన్వెన్షన్‌లో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో 1.50 కోట్ల ఎకరాల సాగుభూమి ఉండగా 1.46 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయని, వీటిలో చిరుధాన్యాల విస్తీర్ణం కొంచెం తక్కువగా ఉందన్నారు. ఆరోగ్యానికి పోషకాలను అందించే చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం మరింత చొరవ తీసుకోవాలని, ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా వీటిని అన్నివర్గాల వారికి అందివ్వగలిగితే డిమాండ్ పెరిగి ఎక్కువమంది రైతులు సాగు చేపట్టే అవకాశం ఉందని వివరించారు. చిరుధాన్యాల సాగుకు అత్యంత ప్రాధాన్యమివ్వడం భవిష్యత్తులో ఎదురయ్యే అనేక సమస్యలకు పరిష్కారం కాగలదని సీనియర్ ఐఏఎస్ అధికారి, నేషనల్ రెయిన్‌ఫెడ్ ఏరియా అథారిటీ సీఈవో డాక్టర్ అశోక్ దళవాయి అభిప్రాయపడ్డారు. దేశంలో ప్రస్తుతం 28 కోట్ల టన్నుల ధాన్యాలు పండుతుండగా, ఇందులో కనీసం మూడోవంతు చిరుధాన్యాలు ఉండేలా చేయగలిగితే భవిష్యత్తు అవసరాలను అందుకోగలమని చెప్పారు. కేంద్రప్రభుత్వ సంయుక్త కార్యదర్శి శోభాఠాకూర్, ఐకార్ అడిషనల్ డీజీ డాక్టర్ ఆర్.కె.సింగ్, ఐఐఎంఆర్ డైరెక్టర్ డాక్టర్ రత్నావతి, ఐఐఎంఆర్ న్యూట్రి హబ్ సీఈవో డాక్టర్ దయాకర్‌రావు, సమున్నతి సంస్థ అనిల్ కుమార్, వ్యవసాయశాఖ అదనపు కమీషనర్ హన్మంతు తదితరులు పాల్గొన్నారు. కొత్త పుంతలు తొక్కుతున్న చిరుధాన్య ఉత్పత్తులు... నేషనల్ న్యూట్రీ సీరల్ కన్వెన్షన్ 4.0 సందర్భంగా హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో ఏర్పాటు చేసిన చిరుధాన్యాల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఉత్కర్ ఫుడ్స్ అనే బెంగళూరు కంపెనీ చిరుధాన్యాలతో చేసిన వడియాలకు ఆయుర్వేద మూలికలైన శతావరి, నన్నారి (ఇండియన్ సార్స్ పరిల్లా)లను జోడించింది. నన్నారి కీళ్లనొప్పులను తగ్గించేందుకు ఉపయోగపడుతుందన్న విషయం తెలిసిందే. శతావరి విషయానికొస్తే ఇది హార్మోన్ల సమతౌల్యానికి, మెనోపాజ్ సమస్యల పరిష్కారానికి అక్కరకొస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. మిబిల్స్ మురుకులు, మిక్స్చర్, లడ్డూలు, గోల్డెన్ మిల్లెట్స్, క్వికీలు నూడుల్స్, పాస్తాలను సిద్ధం చేసి అమ్ముతున్నాయి. వైస్ మామా చిరుధాన్యాలకు పండ్లు, కాయగూరలు, డ్రైఫ్రూట్స్లు జోడిస్తోంది. -
మార్కెట్లోకి 10 నూతన వంగడాలు
సాక్షి, అమరావతి: రైతులకు కొత్తగా మరో పది వంగడాలు అందుబాటులోకి వచ్చాయి. ఏపీ ఎన్జీ రంగా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పనిచేస్తున్న వివిధ పరిశోధన కేంద్రాలు వీటిని అభివృద్ధి చేశాయి. వరిలో మూడు, పెసలు, చిరుధాన్యాల్లో రెండు చొప్పున విత్తనాలు వచ్చాయి. మినుము, వేరుశనగ, శనగలో ఒక్కొక్కటి చొప్పున కొత్త వంగడాలు తీసుకొచ్చారు. మంగళవారం రాష్ట్ర విత్తన సబ్ కమిటీ 40వ సమావేశంలో వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనమ్ మాలకొండయ్య, స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్, వీసీ విష్ణువర్ధన్‌రెడ్డి వీటిని విడుదల చేశారు. పూనం మాలకొండయ్య మాట్లాడుతూ మంచి గుణగణాలు కలిగిన కొత్త రకాలను శాస్త్రవేత్తలు, విస్తరణ సిబ్బంది కలిసి రైతులకు పరిచయం చేయాలని సూచించారు. రాష్ట్రంలో చిరుధాన్యాలకు ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తున్నందున, ఈ రకాల సాగును ప్రోత్సహించాలని చెప్పారు. కొత్త రకాల ప్రత్యేకతలను ఆర్బీకేల్లో ప్రద ర్శించి, రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయ యాంత్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్న తరుణంలో అందుకు అనువైన రకాలను రూపొందించాలని సూచించారు. కొత్త వంగడాల ప్రత్యేకతలు... ► వరి.. ఎంటీయూ–1318: మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం నుంచి విడుదల చేసిన ఈ రకం ఎంటీయూ 7029 స్వర్ణ రకానికి బదులుగా అభివృద్ధి చేసింది. మిషన్ కోతకు అనువైనది. ఎక్కువ దిగుబడినిస్తుంది. ముంపును తట్టుకునే శక్తి ఉంటుంది. ► వరి.. ఎంటీయూ1232: ఇది కూడా మార్టేరు పరి శోధన కేంద్రం అభివృద్ధి చేసిందే. నెల రోజుల ముంపును కూడా తట్టుకుంటుంది. 135 నుంచి 140 రోజుల్లో పంట వస్తుంది. అగ్గి, పాముపొడ తెగుళ్లు, సూది దోమను తట్టుకునే రకమిది. ► వరి.. ఎంసీఎం–103 (బందరు సన్నాలు): మచిలీపట్నం వ్యవసాయ పరిశోధన కేంద్రం అభివృద్ధి చేసిన వంగడమిది. ఉప్పు నేలలకు అనువైన రకమిది. అగ్గి తెగులును తట్టుకుంటుంది. సాధారణ నేలల్లో హెక్టార్‌కు 60 నుంచి 65 క్వింటాళ్లు, ఉప్పు నేలల్లో 50 నుంచి 55 క్వింటాళ్లు దిగుబడి ఇస్తుంది. ► రాగులు.. వీఆర్ 1099 (గోస్తనీ): దీన్ని విజయనగరం వ్యవసాయ పరిశోధన సంస్థ అభివృద్ధి చేసింది. అన్ని జిల్లాల్లో సాగుకు అనువైనది. ప్రస్తుతం ఉన్న శ్రీ చైతన్య రకం కంటే 17 నుంచి 22 శాతం అధిక దిగుబడి ఇస్తుంది. అగ్గి తెగులును తట్టుకుంటుంది. ► కొర్రలు.. ఎస్ఐఏ–3150 (మహానంది): దీన్ని నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం అభివృద్ధి చేసింది. ఖరీఫ్, రబీతో పాటు వేసవి కాలానికి కూడా అనువైనది. హెక్టారుకు 31 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. 20 శాతం ఎక్కువ ప్రొటీన్, కాల్షియం ఉంటాయి. ► పెసర.. ఎల్జీజీ–574: గుంటూరు లాంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం అభివృద్ధి చేసింది. మాగాణి, మెట్ట ప్రాంతానికి అనువైనది. మోజాయిక్ వైరస్‌ను తట్టుకుం టుంది. హెక్టార్‌కు 15–16 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. మిషన్ కోతకు అనువైనది. ► పెసర.. ఎల్జీజీ–607: గుంటూరు లాంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం అభివృద్ధి చేసిన రకమిది. పంట కాలం 60 నుంచి 65 రోజులు. యెల్లో మోజాయిక్ వైరస్‌ను తట్టుకునే శక్తి ఉంటుంది. హెక్టార్‌కు 15–17 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. ఒకేసారి పరిపక్వతకు వస్తుంది. మిషన్ కోతకు అనువుగా ఉంటుంది. ► మినుములు.. ఎల్బీజీ–884: గుంటూరు లాంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అభివృద్ధి చేసింది. మాగాణి, మెట్ట ప్రాంతాలకు అనువైనది. మోజాయిక్ వైరస్‌ను తట్టుకుంటుంది. హెక్టార్‌కు 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ► శనగలు.. ఎన్‌బీఈజీ 776: నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అభివృద్ధి చేసిన రకమిది. ఎండు తెగులు తట్టుకుంటుంది. హెక్టార్‌కు 28 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ఎక్కువ కాయలు కలిగి 20.9 శాతం ప్రొటీన్ ఉంటుంది. జేజీ–11 రకానికి బదులుగా సాగుకు అనువైనది. 90 నుంచి 105 రోజుల్లో పంట వస్తుంది. మిషన్ కోతకు అనువుగా ఉంటుంది. ► వేరుశనగ.. టీసీజీఎస్–1694: తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం అభివృద్ధి చేసింది. ఖరీఫ్, రబీ కాలాలకు అనువైన రకం. షెల్లింగ్ పర్సంటేజ్ 72 శాతంగా ఉంటుంది. ఖరఫ్లో హెక్టార్‌కు 35 క్వింటాళ్లు, రబీలో 50 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. -
ఆరోగ్య సిరులు!
సాక్షి, అమరావతి: అన్నదాత ఇంట చిరుధాన్యాలు సిరులు కురిపించనున్నాయి. ప్రజలకు ఆరోగ్య భాగ్యాన్ని చేకూర్చనున్నాయి. అటు రైతులకు రొక్కం ఇటు ప్రజలకు ఆరోగ్యం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘మిషన్ మిల్లెట్’కు శ్రీకారం చుట్టింది. సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా చిరుధాన్యాల సాగును ప్రోత్సహించి సరికొత్త వ్యవసాయ విప్లవం దిశగా కార్యాచరణ చేపట్టింది. విత్తనాల సరఫరా నుంచి 100 శాతం పంట కొనుగోలు బాధ్యత స్వీకరించడం ద్వారా రైతులకు భరోసా కల్పించనుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా చిరుధాన్యాలను సరఫరా చేయడంతోపాటు పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం.. ప్రభుత్వ హాస్టళ్లలో పోషక విలువలతో కూడిన ఈ ఆహారాన్ని అందించడం ద్వారా భావితరం ఆరోగ్య పరిరక్షణకు నడుం బిగించింది. లక్ష్య సాధనకు రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణ ఇదీ... 10 లక్షల ఎకరాల్లో సాగుకు సన్నద్ధం... రాష్ట్రంలో చిరుధాన్యాల సాగును రెట్టింపు చేయడమే లక్ష్యంగా ‘మిల్లెట్స్ మిషన్’కు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏటా 5.79 లక్షల ఎకరాల్లో చిరు ధాన్యాలను పండిస్తున్నారు. మేజర్ మిల్లెట్స్‌గా పరిగణించే సజ్జలు, జొన్నలు, మైనర్ మిల్లెట్స్‌గా పరిగణించే రాగులు, కొర్రలు, వరిగ, ఊద, సామలు, అరిక పంటలను సాగు చేయడం ద్వారా ఏటా 4.40 లక్షల టన్నుల దిగుబడి సాధిస్తున్నారు. రానున్న ఐదేళ్లలో చిరు ధాన్యాల సాగు విస్తీర్ణాన్ని అదనంగా మరో 5 లక్షల ఎకరాలు పెంచనున్నారు. రాగుల సాగును 3,45,625 ఎకరాలకు, కొర్రల సాగును 1,54,375 ఎకరాలకు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇతర చిరు ధాన్యాలైన సజ్జ, జొన్న, వరిగ, ఊద, సామ, అరిక సాగును కూడా ప్రోత్సహించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. అనువైన ప్రాంతాల మ్యాపింగ్... చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు మండలాల వారీగా కార్యాచరణకు వ్యవసాయ శాఖ సిద్ధమవుతోంది. అనువైన ప్రాంతాలను మండలాల వారీగా మ్యాపింగ్ చేస్తున్నారు. ఎంపిక చేసిన గ్రామాల్లో కనీసం 50 ఎకరాల చొప్పున చిరు ధాన్యాల సాగును ప్రోత్సహిస్తారు. అందుకోసం రూ.82.95 కోట్లతో 17,282 ఎకరాల్లో రాగులు, రూ.30.88 కోట్లతో 7,720 ఎకరాల్లో కొర్రలను ‘క్లస్టర్ డెమో’గా గుర్తించి సాగు చేపడతారు. చిరుధాన్యాలను సాగు చేసే రైతులకు రూ.103.69 కోట్లతో 69,125 తుంపర సేద్యం యూనిట్లు అందచేస్తారు. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా రూ.8.13 కోట్లతో 650 మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తారు. దిగుబడుల్లో నాణ్యతను పెంచేందుకు రూ.15.07 కోట్ల అంచనాతో ఎంపిక చేసిన చిరుధాన్యాల క్షేత్రాల్లో 13,825 పొలం బడులు నిర్వహిస్తారు. ఉత్తమ యాజమాన్య పద్ధతులతో.. చిరుధాన్యాల సాగులో ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటించే రైతులకు జీఏపీ (గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్) గుర్తింపునిస్తారు. వీటి సాగు రైతులకు అన్ని విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. కొండలు, గిరిజన ప్రాంతాలతో పాటు మెట్ట భూములు వీటికి అనుకూలం. వర్షాభావ పరిస్థితులను సమర్థంగా తట్టుకుంటాయి. కందులు, ఆముదం లాంటి ఇతర పంటల్లో అంతర పంటగా సాగు చేయవచ్చు. ఎకరం వరి సాగుకు వినియోగించే నీటితో నాలుగెకరాల్లో చిరుధాన్యాలను పండించొచ్చు. తక్కువ విద్యుత్, పరిమితంగా ఎరువుల వినియోగం, తక్కువ కాలపరిమితితో సాగు చేయడం ద్వారా భూమిలో సేంద్రియ కర్బనం పెరుగుతుంది. సజ్జలు, జొన్నలు, రాగులకు కేంద్రం మద్దతు ధర ప్రకటించగా మిగిలిన పంటలకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర చెల్లిస్తోంది. మార్కెట్లో గిట్టుబాటు ధర దక్కని ప్రతీసారి ప్రభుత్వం జోక్యం చేసుకొని చిరు ధాన్యాలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తోంది. చిరుధాన్యాలను సాగు చేస్తే ఎకరాకు రూ.10 వేల లోపే ఖర్చు అవుతుంది. మార్కెట్లో ధర బాగుంటే ఎకరాకు రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు ఆదాయం వస్తుంది. పైగా వీటి సాగు కాలం చాలా తక్కువ. విత్తు నుంచి కొనుగోలు దాకా ప్రభుత్వమే.. చిరుధాన్యాల సాగుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుంది. పంట రుణాలు, కొనుగోలు, పంపిణీ బాధ్యతలన్నీ చేపడుతుంది. 90 శాతం సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేస్తుంది. ‘మిషన్ మిల్లెట్’ ద్వారా రైతులకు పంట రుణాలు అందచేసి ఉచిత పంటల బీమా పరిధిలోకి తీసుకొస్తారు. ఇన్పుట్ సబ్సిడీ వర్తింపజేస్తారు. మార్కెటింగ్ లింకేజ్ కల్పిస్తారు. పంటలను ప్రాసెస్ చేయడం ద్వారా రైతులకు రెట్టింపు ఆదాయం వచ్చేలా ప్రభుత్వం సహకరిస్తుంది. ఆర్బీకేల ద్వారా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తుంది. తద్వారా చిరుధాన్యాల సాగు లాభదాయకమని, అనుకూలమని రైతులకు భరోసా కల్పిస్తారు. హాస్టళ్లు, ప్రభుత్వ క్యాంటీన్లలో.. కొనుగోలు చేసిన చిరు ధాన్యాలను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తుంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు, వైద్యశాఖ ద్వారా గర్భిణీలకు పంపిణీ చేస్తారు. పాఠశాలల్లో వారానికోసారి మధ్యాహ్న భోజనంలో మిల్లెట్స్ వంటకాలను అందిస్తారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు మిల్లెట్ ఆహారంతో పాటు వారానికి రెండుసార్లు వాటితో చేసిన బిస్కెట్స్, స్నాక్స్ అందిస్తారు. అన్ని ప్రభుత్వ క్యాంటీన్ల మెనూల్లో వీటితో తయారైన వంటకాలను చేరుస్తారు. మిల్లెట్ల ఆహారంపై అవగాహన కల్పించేందుకు జిల్లా, రాష్ట్రస్థాయిలో ఫుడ్ మేళాలు నిర్వíహిస్తారు. మిల్లెట్ వంటకాలు, చిట్కాలపై ఆర్బీకేలు, ఆర్బీకే చానల్ ద్వారా విస్తృతంగా ప్రచారం కల్పిస్తారు. ప్రత్యేక ప్యాకేజింగ్, బ్రాండింగ్‌తో రైతుబజార్లతో పాటు డీమార్ట్, జియో మార్ట్, స్పెన్సర్స్, మోర్ లాంటి సూపర్ మార్కెట్ల ద్వారా ప్రజలకు చేరువ చేసేందుకు ఐటీసీ, ఎఫ్పీఓలతో అవగాహన ఒప్పందం చేసుకుంటారు. ఇలా చిరుధాన్యాల సాగు అటు రైతులకు ప్రయోజనకరంగా ఇటు సామాన్యులకు ఉపయుక్తంగా ఉండేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. ఉన్నతస్థాయి పర్యవేక్షణ కమిటీ.. చిరుధాన్యాల సాగు కార్యాచరణను పక్కాగా పర్యవేక్షించేందుకు ‘స్టేట్ మిల్లెట్ గ్రూప్’ పేరుతో ఉన్నతస్థాయి కమిటీని ప్రభుత్వం నియమించింది. వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని ఈ కమిటీలో వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. వచ్చే ఖరీఫ్ నుంచి చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేలా కమిటీ కార్యాచరణను వేగవంతం చేసింది. వరికి ప్రత్యామ్నాయంగా.. రాష్ట్రాన్ని చిరుధాన్యాల హబ్‌గా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పం మేరకు మిషన్ మిల్లెట్ కార్యాచరణ రూపొందించాం. రానున్న ఐదేళ్లలో వరికి ప్రత్యామ్నాయంగా పెద్ద ఎత్తున చిరు ధాన్యాల సాగును ప్రోత్సహిస్తాం. వీటిని సాగు చేసే రైతులకు అన్ని రకాలుగా చేయూతనందిస్తాం. వారు పండించిన పంటను ఆర్బీకేల ద్వారా నేరుగా కొనుగోలు చేస్తాం. – పూనం మాలకొండయ్య, స్పెషల్ సీఎస్, వ్యవసాయ శాఖ నిదానంగా అరుగుదల.. ప్రస్తుతం మనం తింటున్న పాలీష్ పట్టిన బియ్యం, ఇతర పప్పులు తిన్న వెంటనే అరిగిపోతాయి. దీంతో రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ పెరుగుతాయి. పాలీష్ చేయని చిరుధాన్యాలు తీసుకుంటే అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కార్బోహైడ్రేట్స్‌తో పాటు విటమిన్స్ కూడా సమపాళ్లలో అందుతాయి. ఫోర్టిఫైడ్ రైస్‌తో చిరుధాన్యాలు తీసుకోవడం ఆరోగ్యానికి శ్రేయస్కరం. ప్రజలకు చిరుధాన్యాలను అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం శుభపరిణామం. – డాక్టర్ కె.సుధాకర్, అదనపు డీఎంఈ సాగుకు ప్రోత్సాహం ► ప్రస్తుతం రాష్ట్రంలో ఏటా 5.79 లక్షల ఎకరాల్లో చిరు ధాన్యాలను పండిస్తున్నారు. రానున్న ఐదేళ్లలో అదనంగా మరో 5 లక్షల ఎకరాలు పెంచనున్నారు. రాగుల సాగును 3,45,625 ఎకరాలకు, కొర్రల సాగును 1,54,375 ఎకరాలకు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ► చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖ అనువైన ప్రాంతాలను మండలాల వారీగా మ్యాపింగ్ చేస్తోంది. ఎంపిక చేసిన గ్రామాల్లో కనీసం 50 ఎకరాల చొప్పున చిరు ధాన్యాల సాగును ప్రోత్సహిస్తుంది. ► రైతులకు 69,125 తుంపర సేద్యం యూనిట్లు అందజేస్తారు. రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా 650 మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తారు. దిగుబడుల్లో నాణ్యతను పెంచేందుకు చిరుధాన్యాల క్షేత్రాల్లో 13,825 పొలం బడులు నిర్వహిస్తారు. -
త్వరలో మిల్లెట్ మిషన్ పాలసీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో త్వరలోనే ‘మిల్లెట్ మిషన్ పాలసీ’ని తీసుకొస్తామని, దీనిద్వారా చిరుధాన్యాల సాగుకు మరింత ఊతమిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కె. కన్నబాబు వెల్లడించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించిన రైతుభరోసా కేంద్రం (ఆర్బీకే) వ్యవస్థ ఒక విప్లవమని, దీని ద్వారా ప్రతి గ్రామంలోను రైతుకు సొంత కార్యాలయం ఉందనే ధీమా కలిగిందన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలపై శాసన మండలిలో గురువారం జరిగిన స్వల్పకాలిక చర్చలో పలువురు సభ్యులు అడిగిన వివిధ ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు. రైతులకు కావాల్సిన ప్రతి సేవా ఆర్బీకేల్లో అందుతోందన్నారు. ఎమ్మెల్సీలు సైతం తమతమ గ్రామాల్లో వీటిని సందర్శించాలని కన్నబాబు విజ్ఞప్తిచేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రేటింగ్‌లో వ్యవసాయ రంగంలో ఏపీ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని.. స్కోచ్ తదితర అవార్డులు మన వ్యవసాయ రంగానికి దక్కాయని కన్నబాబు తెలిపారు. ఇక.. రాష్ట్రంలో ప్రతి పంటకూ ఈ–క్రాప్ బుకింగ్ సిస్టమ్ ద్వారా బీమాను వర్తింపజేస్తున్నామని, వచ్చే సీజన్ నుంచి బీమా నమోదుకు సంబంధించి రశీదులిచ్చే విధానాన్ని అమలుచేస్తామని కూడా ఆయన వెల్లడించారు. భూ యజమాని అనుమతితో సంబంధంలేకుండానే ఈ–క్రాప్‌లో కౌలురైతులనూ నమోదు చేసి వారికి మేలు చేస్తున్నామని.. పెట్టుబడి సాయం అందించేలాకూడా వారికి సీసీఆర్సీ కార్డులను జారీచేస్తున్నామన్నారు. ఆర్బీకేల ద్వారా సుబాబుల్, సరుగుడు కొనుగోలు సుబాబుల్, యూకలిప్టస్, సరుగుడు పంటనూ ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కన్నబాబు చెప్పారు. పేపర్ పరిశ్రమకు ముడిసరుకుగా ఉపయోగపడే సుబాబుల్, యూకలిప్టస్, సరుగుడుకు ప్రస్తుత పరిస్థితుల్లో సరైన ధర దక్కడంలేదన్న ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ.. ఇప్పటికే వాటి కటింగ్ ఆర్డర్ కోసం ఆర్బీకేల ద్వారా నమోదు చేసే పద్ధతిని చేపట్టామన్నారు. క్షేత్రస్థాయిలో కొత్తగా ఉద్యోగ నియామకాలు అయ్యే వరకు ఎంపీఈఓలను కొనసాగిస్తామన్నారు. ఇక రాష్ట్రంలో స్మశాన వాటికల ఆక్రమణ, కొరత తదితర ఇబ్బందులపై చర్యలు చేపడతామని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ బదులిచ్చారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా రాష్ట్రంలో అంగన్వాడీల్లో పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం తీçసుకుంటున్న ప్రత్యేక చర్యలతో మాత, శిశు మరణాల రేటు తగ్గిందని మరో మంత్రి తానేటి వనిత బదులిచ్చారు. వచ్చే నెలలో ఆర్బీకేను సందర్శించనున్న గవర్నర్ రాష్ట్రంలో ఏదో ఒక రైతుభరోసా కేంద్రాన్ని స్వయంగా పరిశీలించేందుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అంగీకరించారని మంత్రి కన్నబాబు గురువారం ‘మండలి’లో తెలిపారు. ఏప్రిల్‌లో ఆయన సందర్శించే అవకాశముందని.. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారన్నారు. -
గిరి సీమల్లో సిరుల సేద్యం
కొండవాలు ప్రాంతాల్లో సంప్రదాయ పంటలు పండించుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న అడవి బిడ్డలు ఇప్పుడు అద్భుతాలు సృష్టిస్తున్నారు. సమగ్ర వ్యవసాయ విధానంలో పంటలు పండిస్తూ తమ సుస్థిరాభివృద్ధికి బాటలు వేసుకుంటున్నారు. వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ పరిశోధనా ఫలితాలను పందిరిమామిడి కృషి విజ్ఞాన కేంద్రం క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వం తరఫున వారికి అవసరమైన ఆర్థిక తోడ్పాటునిస్తోంది. దీంతో వారు సాగులో మెళకువలు, సాంకేతిక శిక్షణ పొందుతూ సంతృప్తికర స్థాయిలో ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. జీవన ప్రమాణాలను మెరుగుపర్చుకుంటూ పిల్లలనూ బాగా చదివించుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంత గిరిజనులు సాగులో సాధిస్తున్న విజయాలపై ప్రత్యేక కథనం.. సాక్షి, అమరావతి: సమగ్ర వ్యవసాయ విధానంలో వరి ఆధారిత పంట–పాడి–మత్స్య సాగు చేసేందుకు కృషి విజ్ఞాన కేంద్రం అడవి బిడ్డలను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా జీడి మామిడి అంటు కట్టు విధానం, అపరాలు, చేపల సాగు, రబ్బర్, చిరు ధాన్యాలు, జీడి మామిడి ప్రాసెసింగ్, మేకలు, గొర్రెలు, పెరటి కోళ్లు, తేనెటీగలు, పుట్ట గొడుగులు, నర్సరీ పెంపకంతో పాటు పనసతో సహా వివిధ రకాల పంటల విలువాధారిత ఉత్పత్తులు, వర్మీ కంపోస్ట్ తయారీపై గడిచిన మూడేళ్లుగా గిరిజనులకిస్తున్న శిక్షణ కార్యక్రమాలు ఇప్పుడు సత్ఫలితాలిస్తున్నాయి. ఎంతలాగంటే.. మత్స్య సంపద ద్వారా 57 శాతం, వరి సాగు ద్వారా 24 శాతం, ఉద్యాన పంటల ద్వారా 5.13 శాతం, మేకల పెంపకం ద్వారా 4.8 శాతం ఆదాయాన్ని వీరు ఆర్జిస్తున్నారు. రెట్టింపు ఆదాయమే లక్ష్యంగా.. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న శిక్షణతో ఏజెన్సీలో చిరుధాన్యాల సాగు రెండేళ్లలో గణనీయంగా పెరిగింది. వీటిని ప్రాసెస్ చేసి అమ్మడం ద్వారా గిరిజనులు ఏటా రూ.27వేల ఆదాయాన్ని అదనంగా ఆర్జించగలుగుతున్నారు. అలాగే.. ► రబ్బరు సాగును ప్రోత్సహించేందుకు కేవీకే ద్వారా సాగులో మెళకువలపై అధికారులు రెండేళ్లుగా శిక్షణనిస్తూనే రబ్బర్ టాపింగ్, ప్రాసెసింగ్ పరికరాలు సమకూర్చుతున్నారు. దీంతో నేడు ఎగుమతి చేయదగ్గ నాణ్యమైన రబ్బర్ షీట్లను ఉత్పత్తి చేయగలుగుతున్నారు. ఆరునెలల పాటు సేకరించే రబ్బర్ పాల ద్వారా ఒక్కో రైతు రూ.2.5 లక్షలు ఆర్జిస్తున్నారు. తేనెటీగల పెంపకం యూనిట్లో ఉత్పత్తిని పరిశీలిస్తున్న గిరిజన రైతులు ► అటవీ ప్రాంతంలో విరివిగా లభించే అడ్డాకుల ద్వారా గిరి మహిళల ఆర్థికాభివృద్ధికి బాటలు వేయాలన్న సంకల్పంతో మారేడుమిల్లి మండలం బోధగండి పంచాయతీ మంగంపాడు గ్రామంలో విస్తరాకుల పరిశ్రమను ఏర్పాటుచేశారు. ఫలితంగా నేడు ఒక్కో మహిళ రూ.3వేల పెట్టుబడితో నెలకు రూ.18వేలు ఆర్జిస్తోంది. ► పెరటి కోళ్ల పెంపకం ద్వారా మరింత ఆదాయం ఆర్జించేందుకు వీలుగా హైదరాబాద్‌లోని జాతికోళ్ల పరిశోధనా కేంద్రం నుంచి శ్రీనిధి, వనశ్రీ, వనరాజా, గాగస్, అశీల్, కడక్‌నాథ్ వంటి మేలు జాతి కోడి పిల్లలను అధికారులు తెప్పించి పంపిణీ చేస్తున్నారు. వీటి పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక శిక్షణనిస్తున్నారు. ఇలా ప్రతిఏటా 2వేల కోళ్లను 200 గిరిజన మహిళలకు అందజేస్తుండడంతో ఇళ్ల వద్దే ఉంటూ గిరిజన మహిళలు అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. ► మేకలు, గొర్రెల పెంపకాన్ని లాభసాటిగా మార్చేందుకు హింగోలిలో కేవీకే అభివృద్ధి చేసిన అధిక వ్యాధి నిరోధకశక్తి కలిగిన ఉస్మానాబాది రకం మేకలను ఒక్కొకరికి మూడు చొప్పున ఇస్తున్నారు. 10–12 నెలల వయస్సు వరకు పెంచిన తర్వాత ఒక్కోదాన్ని రూ.8వేల నుంచి రూ.10వేల విక్రయిస్తూ అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. ► ఇక పనస విలువాధారిత ఉత్పత్తుల తయారిపైనా శిక్షణనివ్వడంతో గిరిజనులు ప్రతినెలా రూ.12వేల అదనపు ఆదాయం పొందుతున్నారు. ► తేనెటీగల పెంపకంపైనా శిక్షణనివ్వడంతో సొంత పొలాలతో పాటు అటవీ ప్రాంతంలో కూడా విలువాధారిత తేనె ఉత్పత్తును తయారుచేస్తున్నారు. తద్వారా ఏటా రూ.40 వేల అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ► అంతేకాదు.. పుట్ట గొడుగుల పెంపకం యూనిట్లను ఏర్పాటుచేసి పాల పుట్ట గొడుగులు, గులాబీ, తెలుపు ముత్యపు చిప్ప పుట్ట గొడుగుల పెంపకంపై తర్ఫీదు ఇస్తున్నారు. గిరిజన రైతులకు మేకల యూనిట్‌ను అందజేస్తున్న అధికారులు పెట్టుబడి పోనూ 50వేలు మిగులుతోంది నేను పదో తరగతి చదువుకున్నా. నాకున్న రెండున్నర ఎకరాల్లో వర్షాధారంపై ఆధారపడి కొర్రలు, రాగులు పండించి సంతలకుపోయి అమ్ముకుంటే పెట్టుబడి పోను రూ.17,500 మిగిలేది. ప్రభుత్వం మినీ మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్‌ను అందించింది. ప్రాసెసింగ్ చేసి ఎలా అమ్మాలో స్థానిక కేవీకే ద్వారా శిక్షణ పొందాను. ఇప్పుడు అదనంగా మరో రూ.32,300 ఆదాయం వస్తోంది. మొత్తం మీద రూ.49,800 మిగులుతోంది. – పల్లలబొజ్జ్డి నారాయణరెడ్డి, బొద్దగుంట, వై.రామవరం మండలం మేకల పెంపకంతో అదనపు ఆదాయం గతంలో నాలుగు ఎకరాల్లో వరి, మినుము, కందులు సాగుచేసేవాడిని. పంట పండితే నాలుగు డబ్బులు లేకుంటే పస్తులుండాల్సి వచ్చేది. స్థానిక కేవీకే ద్వారా ఉస్మానాబాదీ రకానికి చెందిన రెండు మేకలు, ఓ మేకపోతు తీసుకున్నా. ఈతకు రెండు పిల్లల చొప్పున ఏడాదికి నాలుగు పిల్లలు వస్తున్నాయి. మరోవైపు.. వ్యవసాయం ద్వారా ఏటా రూ.55వేల ఆదాయం.. ఏటా 3–4 మేకలను అమ్ముకోవడం ద్వారా అదనంగా మరో రూ.24వేలు వస్తోంది. – కంగల రామస్వామి దొర, ఐ.పోలవరం, రంపచోడవరం మండలం నెలకు రూ.11,500 ఆదాయం రెండేళ్ల క్రితం మాకు శ్రీనిధి, వనశ్రీ, గఘస్ కోళ్లను అందించారు. పొలం పనులు చేసుకుంటూ వాటిని పెంచుకుంటున్నా. ఏడాది వయస్సున్న కోడిని రూ.500 నుంచి రూ.600లకు అమ్ముతున్నా. గుడ్లు, కోళ్ల అమ్మకాల ద్వారా నెలకు రూ.11,500 నికర ఆదాయం వస్తోంది. – కాలుం రామతులసి, ఐ.పోలవరం, రంపచోడవరం మండలం సొంతంగా మార్కెటింగ్ మూడేళ్ల క్రితం తేనెటీగల పెంపకాన్ని చేపట్టా. శిక్షణ, సాంకేతిక సలహాలతో సొంత పొలంతో పాటు అటవీ ప్రాంతంలో తేనెటీగల పెంపకం యూనిట్లు పెట్టా. 3 నెలలకోసారి 60 కేజీల తేనె, 20 కేజీల మైనం తీస్తున్నా. వాటి ద్వారా నెలకు రూ.16వేల చొప్పున ఆర్జిస్తున్నా. గతేడాది నుంచి తేనె విలువా«ధారిత ఉత్పత్తులైన మురబ్బ, అల్లం తేనె, విప్పపువ్వు తేనేలతో పాటు మైనంతో తయారుచేసిన క్రాక్‌క్రీమ్, లిప్‌బామ్ వంటి ఉత్పత్తులను తయారుచేసి ‘గిరిమధుర నేచురల్ ప్రొడక్టŠస్’ పేరిట మార్కెటింగ్ చేస్తున్నా. – జగతా భావన కృష్ణ, రంపచోడవరం సాంకేతికంగా ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యం ప్రభుత్వాదేశాల మేరకు గిరిజనుల్లో ఆదాయ వనురులను పెంపొందించడమే లక్ష్యంగా ఉద్యాన వర్సిటీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున విస్తరణ కార్యక్రమాలు అమలుచేస్తున్నాం. మైదాన ప్రాంతాల్లో మాదిరిగానే ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన రైతులను సాంకేతికంగా ముందుకు తీసుకెళ్లేందుకు శిక్షణతో పాటు ఆర్థిక తోడ్పాటునూ అందిస్తున్నాం. – డాక్టర్ టి. జానకీరామ్, వైస్ చాన్సలర్, వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ, తాడేపల్లిగూడెం ఇంటి వద్దే జాతి కోళ్లు పెంచుకుంటున్న గిరిజనులు తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం మర్రివాడ గ్రామానికి చెందిన ఎం. సావిత్రి కుటుంబ సభ్యులు 13మంది సంఘంగా ఏర్పడి వరి, జీడి మామిడి పంటలు సాగుచేస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో స్థానిక సామాజిక చెరువులో బొచ్చు, గడ్డిమోసు, శీలావతి వంటి చేçపలను సాగుచేస్తున్నారు. ఇలా ఏటా ఆహార ధాన్యాల ద్వారా రూ.34వేలు, కూరగాయల సాగు ద్వారా రూ.24 వేలు, మత్స్యసాగు ద్వారా రూ.73వేలు ఆర్జిస్తున్నారు. కడక్‌నాథ్, గాఘస్ కోళ్ల పెంపకం ద్వారా మరో రూ.16,800 ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన మారేడుమిల్లి మండలం పందిరిమామిడి గ్రామానికి చెందిన కత్తుల సోమిరెడ్డి. గతంలో వీళ్లు 70మంది కలిసి కూరగాయలు పండిస్తే ఒక్కొక్కరికి రూ.7వేలకు మించి వచ్చేది కాదు. కానీ, ఇప్పుడు వీరంతా రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో రబ్బరు సాగు, ప్రాసెసింగ్‌లో శిక్షణ పొంది ప్రాసెసింగ్ యూనిట్ తీసుకున్నారు. ఇప్పుడు నాణ్యమైన రబ్బరును ఉత్పత్తి చేస్తూ ఓ సంఘంగా ఏర్పడ్డారు. కేరళ వంటి రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఫలితంగా.. గడిచిన ఆర్నెల్లలో 1,200 కేజీల రబ్బరును ప్రాసెస్ చేసి ఎగుమతి చేయడంద్వారా ఒక్కొక్కరం రూ.2.5 లక్షలు ఆర్జించామని.. ఖర్చులు పోనూ ఒక్కో రైతుకు రూ.1.50 లక్షలు మిగులుతోందని సోమిరెడ్డి చెబుతున్నాడు. -
30 ఏళ్లకే బీపీ, షుగర్.. ఒక్కపూట అన్నానికే పరిమితం.. కోటీశ్వరులు మెచ్చిన తిండి..
సాక్షి, విశాఖపట్నం: ప్రస్తుతం అన్ని వయసుల వారిలోనూ ఆరోగ్య స్పృహ పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే ఆహారంలోనూ మార్పులు వస్తున్నాయి. ఎలాంటి పురుగు మందులు, రసాయనాలు వేయకుండా, సేంద్రియ పద్ధతిలో పండించిన పంటలతో చేసిన పంటలనే కోరుకుంటున్నారు. అందుకు అనుగుణంగా చిరుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, బియ్యం, గోధుమలు, అపరాలు వంటి ఆహారోత్పత్తులకు నగరంలో ఏటేటా అనూహ్య ఆదరణ లభిస్తోంది. ఆహార ప్రియుల ‘స్వచ్ఛమైన అభిరుచికి అనుగుణంగానే వందల కొద్దీ చిన్న, పెద్ద సంస్థలు, కార్పొరేట్ దిగ్గజాలు, రైతు సహకార సంఘాలు సైతం మార్కెట్లో పోటీపడతున్నాయి. దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో ఏటా సుమారు రూ.వెయ్యి కోట్ల ఆర్గానిక్ ఆహార పదార్థాల విక్రయాలు జరుగుతుండగా, ఒక్క విశాఖలో సుమారు రూ.20 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతున్నట్టు అంచనా. ఒక అంచనా మేరకు సుమారు 30 వేల కుటుంబాలు నిత్యం సహజంగా పండిన ఆహార పదార్థాలను తీసుకుంటుండగా, మరో 15 వేల కుటుంబాలు ఆర్గానిక్ రుచులను మాత్రమే ఆస్వాదిస్తున్నాయి. ఏటా ఆర్గానిక్ ఆహార ప్రియుల సంఖ్య పెరుగుతోంది. నగర జీవనంలో పెరుగుతున్న ఒత్తిళ్లు, రకరకాల అనారోగ్య సమస్యల నుంచి శాశ్వత విముక్తిని, ఊరట పొందాలంటే అత్యధికంగా పిండి పదార్థాలు ఉండే బియ్యం కంటే, పోషక విలువలు, పీచు పదార్థాలు సమృద్ధిగా ఉండే మిల్లెట్స్‌ను ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. చదవండి: పసి మనసుకు ఎందుకింత కష్టం.. లోపం తల్లిదండ్రులదా? చిన్నారులదా? డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): ఒకప్పుడు నిరుపేదల ఆకలి తీర్చిన ‘చిరు ధాన్యాలు’ ఇప్పుడు కోటీశ్వరుల నిత్య జీవితంలో ఆహారమయ్యాయి. ఫాస్ట్‌ఫుడ్ యుగంలో ఈ చిరుధాన్యాలేంటనుకుంటున్నారా..! నగరంలో చాలా మంది వీటినే ఆరాధిస్తున్నారు. ఆహారంగా ఆస్వాదిస్తున్నారు. ఎందుకంటే.. అనేక రకాల జీవనశైలి వ్యాధుల నుంచి ఊరటనిస్తున్నాయి. ఆరోగ్య సిరులు కురిపిస్తున్నాయి. రెండు పూటలా వరి అన్నమే ప్రధాన ఆహారంగా తీసుకునే నగర వాసులు.. ఇప్పుడు ఒక్క పూట అన్నానికే పరిమితమవుతున్నారు. చదవండి: బరువు తగ్గాలనుకుంటున్నారా? కడుపు నిండా తింటూనే ఆ పనిచేయండి ఉదయం, సాయంత్రం కొర్రలు, రాగులు, అరికెలు, ఊచలు, జొన్నలు, వరిగెలు వంటి వాటితో చేసిన ఆహార పదార్థాలను మాత్రమే భుజిస్తున్నారు. ముప్పై ఏళ్ల వయసులోనే ఉప్పెనలా వచ్చిపడుతున్న బీపీ, షుగర్, ఆర్థరైటీస్ వంటి వివిధ రకాల వ్యాధులు నగరవాసుల ఆహారపు అలవాట్లను సమూలంగా మార్చేలా చేస్తున్నాయి. రోగాలు వచ్చినప్పుడు మందు బిళ్లలు మింగే బదులు..అవి రాకుండా చూసుకోవడమే ఉత్తమమని భావిస్తున్నారు. అందుకే చిరుధాన్యాల ఆహారమే ఉత్తమమంటున్నారు. నగరంలో పెరుగుతున్న మిల్లెట్స్ వినియోగంపై సాక్షి ప్రత్యేక కథనం.. సహజ ఆహారమే ఎందుకు ప్రస్తుత కాలంలో బియ్యం నుంచి పప్పులు, వంట నూనెల వరకు అన్నింటా కల్తీయే రాజ్యమేలుతోంది. 36 ఏళ్ల కిందటే నిషేధించిన ఇతియాన్, డీడీటీ, బీహెచ్‌సీ వంటి ప్రమాదకరమైన పురుగు మందుల అవశేషాలు ఇప్పటికీ బయటపడతున్నట్టు వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మధుమేహం, అధిక రక్తపోటు, స్థూలకాయం వంటి వ్యాధులకు నగరాల్లో ఇలాంటి కల్తీ ఆహారాలు ప్రజలను మరింత అనారోగ్యం బారిన పడేస్తున్నాయి. చిన్న వయస్సులోనే అనేక రోగాలు దరిచేరుతున్నాయి. ఎదుగుతున్న పిల్లల్లో రోగ నిరోధక శక్తి క్షీణిస్తోంది. కల్తీ ఆహారం మేధో వికాసానికి సైతం బ్రేకులు వేస్తోంది. ఇలాంటి అనర్థాల నుంచి బయటపడేందుకు ప్రజలు ఇప్పుడు ఆర్గానిక్, మిల్లెట్స్ ఆహారాన్ని కోరుకుంటున్నారు. వ్యాధులకు గురై రకరాల మందులు మింగుతూ రోగులుగా బతకడం కంటే సహజ ఆహారంతో అసలు వ్యాధులే రాకుండా ఉంటాయనే నమ్మకం ప్రజల్లో బాగా పెరిగింది. ఒకప్పుడు ముడి బియ్యం అన్నమంటే చాలా మందికి తెలిసేది కాదు. పుష్కలమైన పీచుపదార్థాలు, పోషక విలువలు ఉన్న ముడిబియ్యం తీసుకొనే వారి సంఖ్య ఇటీవల అధికమైంది. ఇదొక్కటే కాదు. అన్ని ఆహార ఉత్పత్తులు రైతు క్షేత్రాల నుంచి నేరుగా నగరానికి వస్తున్నాయి. ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో ఉండడంతో చాలా మంది అటువైపే చూస్తున్నారు. పాతవైపు..కొత్త చూపు.. ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్స్, నోరూరించే రకరకాల వంటకాలు, బిరియాని ఘుమఘుమలు, వెరైటీ వెజ్, నానవెజ్‌తో రోజూ పసందైన విందు భోజనాలు ఆరగించే నగర వాసులు ఇప్పుడు ‘పాత’ తరం ఆహరమే ముద్దు అంటున్నారు. ఇప్పుడు ప్రధాన ఆహారంగా ఉన్న సజ్జలు, కొర్రలు, వరిగెలు, ఊదలు, సామలు, జొన్నలు, రాగులు, వరిగెలు వంటి చిరు ధాన్యాలకు అనూహ్యామైన డిమాండ్ పెరిగింది. కాల్షియం బాగా ఉండి అనేక రకాల జీవన శైలి వ్యాధుల నుంచి విముక్తి కల్పించడంలో దోహదం చేసే రాగులకు స్థూలకాయాన్ని అదుపులో ఉంచే కొర్రలకు నగరవాసులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంటికి.. ఒంటికి కూడా.. సహజమైన జీవన విధానంలో కేవలం ఆహార పదార్థాలే కాకుండా కూరగాయలు, ఆకుకూరలు, సబ్బులు, షాంపులు, వంట నూనెలు, కాస్మోటిక్స్ కూడా చేరాయి. పలు వ్యాపార దిగ్గజాలు నగరవాసుల అభిరుచికి తగ్గట్టుగా ఆర్గానిక్ ఉత్పత్తులను అందజేస్తున్నాయి. ఇక దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ, రైతునేస్తం, సహజ ఆహారం, ధరణి నేచురల్స్, గ్రామీణ్‌మాల్ వంటి సంస్థలు, రైతు సహకార సంఘాలు సేంద్రీయ ఎరువులతో పండించిన పంటలతో మహా నగరానికి పల్లెకు, మధ్య బాటలు వేశాయి. సూపర్ మార్కెట్లలో ఇప్పుడు బ్రౌన్‌రైస్, జొన్నలు, రాగులు తప్పనిసరి విక్రయ వస్తువులయ్యాయి. ఆన్లైన్ అమ్మకాలు సైతం జోరందుకున్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తున్నారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నారు. సాత్విక ఆహారంతో పాటు చిరుధాన్యాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. తద్వారా బీపీ, షుగర్లను నియంత్రణలో ఉంచుకుంటున్నారు. వాటితో పాటు శారీరక వ్యాయామానికి ప్రాధాన్యమిస్తున్నారు. –గట్రెడ్డి రమాదేవి, గృహిణి ఒత్తిడితో ఉన్నవారికి చిరుధాన్యాలు అవసరం నిత్యం పని ఒత్తిడిలో ఉన్న వారికి బీపీ, షుగర్ వచ్చే అవకాశం ఉంది. దీంతో రాగి అంబలి, దంపుడు బియ్యం, కొర్రలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో చిరుధాన్యాల ప్రాధాన్యం కోసం విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వాటి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. –బి.అరుణ రాజేశ్వరి, ఆర్టీసీ ఉద్యోగి, మధురవాడ -
శ్రీవారి ప్రసాదాల తయారీలో సిరిధాన్యాలు వినియోగించాలి
తిరుమల: శ్రీవారి ప్రసాదాల తయారీలో వారానికి రెండు పర్యాయాలు సిరిధాన్యాలు ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దృష్టికి తీసుకువెళతామని టీటీడీ బోర్డు సభ్యుడు మూరంశెట్టి రాములు చెప్పారు. సినీ నటుడు భరత్ రెడ్డితో పాటు ఆయన శ్రీవారిని ఆదివారం దర్శించుకున్నారు. ఆలయం వెలుపల రాములు మాట్లాడుతూ.. శ్రీవారికి సిరిధాన్యాలతో ప్రసాదాలను తయారుచేసేలా ప్రయత్నిస్తామని తెలిపారు. టీటీడీ బోర్డు చైర్మన్, ఈవో, అదనపు ఈవోతోపాటు ప్రజల అభిప్రాయాలను తీసుకుని అమలు చేసేందుకు యత్నిస్తామన్నారు. భరత్ రెడ్డి మాట్లాడుతూ..ప్రజల ఆహార పద్ధతులు మారాల్సి ఉందని, సిరిధాన్యాలతోనే ప్రజలకు ఆరోగ్యకర జీవితం లభిస్తుందన్నారు. తమ మిల్లెట్ మార్వెల్స్ సంస్థను పాన్ ఇండియా స్థాయిలో ప్రారంభించేందుకు మరో సంస్థతో కలిసి ముందుకెళతామన్నారు. వారి వెంట సినీ నటుడు సప్తగిరి తదితరులున్నారు. -
‘మిల్లెటు’ బండెక్కి వచ్చేత్తమూ..
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఆహారమే ఔషధం.. ఇది ఆయుర్వేదానికి సంబంధించిన ఒక నానుడి. ఔషధం లాంటి ఆహారాన్ని ‘ఔరా’అనిపించే విధంగా ఓ బువ్వబండి అందిస్తోంది. ‘తింటే గారెలే తినాలి..’అంటారు కదా! ఈ బువ్వబండిని చూస్తే, ‘తింటే.. చిరుధాన్యాల బువ్వే తినాలి’అని అనిపిస్తుంది. సామల అన్నం, నోరూరించే టమాటా పచ్చడి, పసందైన ఆకుకూర పప్పు, గంజి సూప్.. ఇది బువ్వబండి మెనూ. ఇది గుడ్‌ఫుడ్ మాత్రమేకాదు, హెల్దీ ఫుడ్ కూడా. సంపూర్ణ ఆరోగ్యాన్ని పంచే చిరుధాన్యాల ప్రాధాన్యం తెలియజేసేందుకు ప్రతిరోజూ ఉచితంగా మిల్లెట్ భోజనాన్ని వడ్డిస్తున్నారు సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌కు చెందిన కొల్లూరు సత్తయ్య, అమృతమ్మ దంపతులు. సామలు, అరికెలు, కొర్రలు, అండుకొర్రలు, ఊదలు వంటి చిరుధాన్యాలతో ఆహారం అందిస్తున్నారు. ఇందుకోసం ఆయన ‘బువ్వబండి’ని తయారుచేశారు. ఈ బువ్వబండిని రోజూ ఉద యం 8.30 నుంచి 10.30 గంటల వరకు తెల్లాపూర్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఉంచుతారు. వందలాది మంది నిరుపేదలు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు ఈ బండి వద్ద ‘చిరు’బు వ్వ తింటారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. రోజూ రూ.4 వేలు.. ఐదు రకాల చిరుధాన్యాలు ఒక్కో రకం చిరుధాన్యం భోజనం ఐదు రోజుల చొప్పున వడ్డిస్తుంటారు. ఈ చిరుధాన్యాలను మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతం నుంచి కొనుగోలు చేస్తున్నారు. రోజూ 25 కిలోల చిరుధాన్యంతో చేసిన భోజనం వడ్డిస్తున్నారు. ఈ మిల్లెట్ భోజనంలో రోజూ ఒక రోటి పచ్చడి కూడా ఉంటుంది. టమాటా, పుంటికూర (గోంగూర), మెంతికూర, కొత్తిమీర వంటి వాటితో రోటిపచ్చడి వడ్డిస్తున్నారు. ఈ ఆహారంలో ఆకుకూర పప్పు కూడా ఉంటుంది. ఒక్కో ఆకుకూర ఒక్కోరోజు అందిస్తున్నారు. వీటితోపాటు గంజి సూప్ ఇస్తున్నారు. ఈ బువ్వబండిని సత్తయ్య 2021 నవంబర్‌లో ప్రారంభించారు. సత్తయ్య కుటుంబసభ్యులు ఉదయం 5 గంటలకే లేచి ఈ బువ్వబండి పనులు మొదలుపెడుతుంటారు. బువ్వబండి నిర్వహణ కోసం ప్రతిరోజూ కనీసం రూ.4 వేల ఖర్చు అవుతోందని సత్తయ్య పేర్కొంటున్నారు. -
సామలు, కొర్రలు, ఊదలు, అరికెలు.. వీటిని ఎప్పుడైనా రుచి చూశారా?
Benefits of millets and their role in increasing immunity: ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవాలి. మన పూర్వీకులు బలమైన ఆహారం తీసుకోవడం వల్ల ఎలాంటి వ్యాధులు లేకుండా జీవించారని చెబుతుంటారు. ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో ‘ఇమ్యూనిటీ పవర్’ పెంచుకునేందుకు బలవర్ధక ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు మళ్లీ సంప్రదాయ ఆహారం వైపు మళ్లుతున్నారు. వారి అభిరుచికి అనుగుణంగా నల్లగొండలో చిరు ధాన్యాల టిఫిన్ సెంటర్లు వెలిశాయి. ఈ సెంటర్లలో పట్టణవాసులు బారులు దీరుతున్నారు. – రామగిరి (నల్లగొండ) చిరు ధాన్యాలతో చేసిన అల్పాహారం తింటున్న ప్రజలు మారిన ఆహారపు అలవాట్లతో ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. ఉరుకుల పరుగుల జీవనంతో చాలామంది మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మనుషుల ఆరోగ్యం అలవాట్లతో పాటు, తీసుకునే ఆహార పదార్థాలపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. అయితే, చిరు ధాన్యాల ఆహారం తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు రావని సూచిస్తున్నారు. దీంతో ప్రజలు చిరు ధాన్యాల ఆహారం తినడానికి ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. చదవండి: బిగ్‌బాస్ నుంచి ఢీ 13 వరకు: తాండూరు మెరికలు.. బుల్లి తెరపై మెరుపులు చిరు ధాన్యాలు అంటే..? పూర్వ కాలంలో మెట్ట పంటలైన చిరు ధాన్యాలను ఎక్కువగా సాగు చేసేవారు. వీటినే అప్పటి వారు ప్రధాన ఆహారపు అలవాటుగా చేసుకున్నారు. చిరు ధాన్యాల్లో ముఖ్యమైనవి జొన్నలు, సజ్జలు, కొర్రలు, వరిగలు, రాగులు, అరికలు, అండు కొర్రలు, ఊదలు, అవిసెలు, సామలు మొదలైనవి. చదవండి: తరుముతున్న థర్డ్‌వేవ్: ‘ఫిబ్రవరి వద్దు.. డిసెంబర్లోనే కానివ్వండి పంతులు గారూ’ చిరు ధాన్యాల టిఫిన్లు చిరు ధాన్యాలు (తృణ ధాన్యాలను) ఉపయోగించి పలు రకాల టిఫిన్లను తయారు చేస్తున్నారు. ముఖ్యంగా దోశలు, ఇడ్లీలు, పొంగల్, బిస్మిల్లాబాత్, పులిహోర, రాగి సంకటి, రాగి జావ లాంటివి ప్రత్యేకం. వీటితోపాటు నువ్వుల లడ్డు, అవిస గింజల లడ్డు, బీట్రూట్ లడ్డులను తయారు చేసి అమ్ముతున్నారు. బీపీ, షుగర్, క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వారితో పాటు ఇతర వ్యాధులు ఉన్న వారి వీటిని రోజూ అల్పాహారంగా తీసుకుంటున్నారు. చదవండి: వేమనపల్లి ప్రాణహిత తీరంలో ఏళ్లనాటి డైనోసార్ శిలాజాలు బిస్మిల్లా బాత్ సామలు సామలను ఆహారంగా తీసుకోవ డం వల్ల అనేక గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. అతిసారం, అజీర్ణం, సుఖ వ్యాధులు, శుక్రకణాల వృద్ధికి, ఆడవారిలో రుతు సమస్య లకు మంచి ఔషధంగా పని చేస్తాయని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు. ముఖ్యంగా మైగ్రేన్ సమస్య ఉన్నవారికి ఉపశమనం కలిగిస్తాయని చెబుతున్నారు. కీళ్ల నొప్పులు, ఊబకాయం, గుండె జబ్బుల నివారణకు ఇది మంచి ఆహారం. చదవండి: ఆ ఇంటి నిండా మొక్కలే!... ఉద్యానవనాన్ని తలపించే గృహవనం!! రాగి ఇడ్లీ కొర్రలు కొర్రలు తీపి, వగరు రుచిని కలిగి ఉంటాయి. షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇవి మంచి ఆహారం. ఇవి తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పదార్థాలు తగ్గిపోతాయని వైద్యులు చెబుతున్నారు. వీటిలో యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కొర్రలలో అధిక పీచు, మాంసకృత్తులు, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియంతో పాటు విటమిన్స్ ఉండడంతో ఉదర సంబంధ వ్యాధి గ్రస్తులకు మంచిగా పనిచేసాయంటున్నారు. మూత్రంలో మంట, కడుపు నొప్పి, అతిసారం, ఆకలి లేకపోవడం మొదలైన సమస్యలకు మంచి ఔషధంగా పని చేస్తాయని, కాలిన గాయాలు, రక్తహీనత, ఊబకాయం, రక్తస్రావం, కీళ్లవాతం, గుండెజబ్బుల నుంచి త్వరగా కోలు కోవడానికి కొర్రలు మంచిగా పనిచేస్తాని చెబుతున్నారు. బీట్రూట్ లడ్డు అండు కొర్రలు పూర్వపు పంటల్లో అండు కొర్రలు ఒకటి. వీటిని కనీసం నాలుగు గంటలు నానబెట్టిన తర్వాతనే వండుకోవాలి. కంటి సంబంధ, బీపీ, థైరాయిడ్, జీర్ణాశయం, ఊబకాయం లాంటి సమస్యల నివారణకు బాగా పని చేస్తాయి. అంతే కాకుండా అర్షమొలలు, అల్సర్, ఎముకలు, ఉదర, పేగు, చర్మ సంబంధ కాన్సర్ల చికిత్సకు బాగా ఉపయోగపడతాయంటున్నారు. మిక్స్డ్ పొంగలి ఊదలు ఊదలు దేహంలో శరీర ఉష్ణొగ్రతలను సమస్థితిలో ఉంచడానికి ఉపయోగపడతాయని వైద్యులు సూచిస్తున్నారు. ఎక్కువ సేపు కూర్చొని పని చేసేవారికి శారీరక శ్రమ లేని వారికి ఊదలు మంచి ఆహారమని, వీటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుందని, అందువల్ల మలబద్ధకం, మధు మేహానికి మంచిగా పనిచేస్తాయని చెబుతున్నారు. కొర్ర దోశ అరికెలు అరికెలలో విటమిన్లు, ఖనిజ లవణాలు అధికంగా ఉంటాయి. కాన్సర్ లాంటి ప్రమాదకర వ్యాధులు రాకుండా అరికెలు నివారిస్తాయని న్యూట్రిషన్లు సూచిస్తున్నారు. రక్తంలో కోలెస్ట్రాల్, చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయని వీటిలో యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయని, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయని చెబుతున్నారు. నువ్వుల లడ్డు ఆన్లైన్ సౌకర్యం కూడా.. చిరు ధాన్యాల టిఫిన్స్‌ను ఆన్లైన్ ద్వారా ఆర్డర్ తీసుకుని ఇంటికి చేరవేస్తాం. టేస్ట్ బాగుండడంతో ఆర్డర్లు బాగా పెరిగాయి. ప్రస్తుతం జొమాటో ద్వారా ఆర్డర్ తీసుకుని సరఫరా చేస్తున్నాం. ఇక్కడికి రాలేనివారు యాప్ ద్వారా ఆర్డర్ చేసుకుంటున్నారు. పట్టణంలోని అన్ని ప్రాంతాలకు సరఫరా చేస్తున్నాం. – ఎస్.నరేష్, జొమాటో బాయ్ జొన్న సంకటి షుగర్ తగ్గింది నెల రోజుల నుంచి చిరు ధాన్యాలతో తయారు చేసిన టిఫిన్ చేస్తున్నాను. నాకు షుగర్ ఉంది. మందులు వాడినా తగ్గకపోయేది. చాలా రోజులుగా చిరు ధాన్యాలతో తయారు చేసిన టిఫిన్ చేస్తుండడంతో షుగర్ తగ్గినట్లు వైద్యులు చెప్పారు. – బి.యాదగిరి పార్సిల్ తీసుకెళ్తా నేను చిరుధాన్యాల టిఫిన్ సెంటర్ నుంచి పార్సిల్ తీసుకెళ్తా. ఇంట్లో అందరం చిరు ధాన్యాలతో తయారు చేసిన టిఫినే తింటాం. ఇంట్లో ఇవన్నీ చేసుకోవడం సాధ్యం కాదు. అందుకని రోజుకో రకం టిఫిన్ తీసుకెళ్తాను. ఇవి తిన్నప్పటి నుంచి ఆరోగ్యం మంచిగా ఉంది. – అజారుద్దీన్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నా చిరు ధాన్యాలతో టిఫిన్ చేయడానికి ప్రత్యేకంగా హైదరాబాద్‌లో శిక్షణ తీసుకున్నా. హైదరాబాద్‌లో ఇలాంటి హోటళ్లు ఎక్కువగా ఉండేవి. నల్లగొండలో ఈ ఆహారం అందించాలనే ఉద్దేశంతో శివసాయి చిరు ధాన్యాల పేరుతో టిఫిన్ సెంటర్ పెట్టాను. ఇక్కడ నేను మరో నలుగురికి శిక్షణ కూడా ఇస్తున్నా. షుగర్, బీపీ, గుండె జబ్బులు, క్యాన్సర్ పేషంట్లు టిఫిన్ సెంటర్‌కు బాగా వస్తున్నారు. – రాజునాయక్, నిర్వాహకుడు -
చిరుధాన్యాలు, నూనె గింజలను సాగు చేయండి
సాక్షి, అమరావతి: వరికి మించిన ఆదాయం రావడమే కాకుండా తక్కువ నీటి వసతితో ఎక్కువ దిగుబడులు సాధించేందుకు చిరుధాన్యాలు, నూనె గింజల పంటల్ని సాగు చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అధికారికంగా ప్రారంభమైన రబీ సీజన్లో సాగు చేసే దాళ్వా వరికి బదులు పలు రకాల వంగడాలను వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. మొక్కజొన్న.. మొక్కజొన్న పంటను కోస్తా జిల్లాల్లో జనవరి 15 వరకు విత్తుకోవచ్చు. ఎకరానికి 8 కిలోల విత్తనం వాడాలి. మొక్క తొలి దశలో ఆశించే పురుగులను నివారించటానికి సయాట్రినిప్రోల్, థయోమిథాక్సామ్ మందును 4 మి.లీ. కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. నేల స్వభావాన్ని బట్టి ఎకరానికి 26,666 నుండి 33,333 మొక్కల సాంద్రత ఉండేలా చూడాలి. రబీ జొన్న రబీకి అనువైన సూటి రకాలు: ఎన్టీజే 4, ఎన్టీజే 5, ఎన్ 15, సీఎస్వీ 216, ఆర్సీఎస్వీ 14, ఆర్ఎం 35–1, సీఎస్వీ 18, సీఎస్వీ 22 అనుకూలమైన హైబ్రిడ్ రకాలు: సీఎస్హెచ్ 15, ఆర్సీఎస్హెచ్ 16, సీఎస్హెచ్ 19, సీఎస్హెచ్ 31 ఆర్. ఈ వారంలో విత్తుకోవచ్చు. ఎకరాకు 4 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తేటప్పుడు వరుసల మధ్య 45 సెం.మీ. దూరం, మొక్కల మధ్య 12–15 సెం.మీ. దూరం ఉండేలా చూసుకోవాలి. వేరుశనగ.. రబీలో నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో వేరుశనగ వేస్తుంటారు. అందుకు అనువైన రకాలు. కదిరి లేపాక్షి (కె. 1812), పంట కాలం 122 రోజులు. ఎకరానికి 20–25 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. 57% నూనెను, 70% గింజ దిగుబడిని ఇస్తుంది. ఎకరానికి 30–35 కిలోల గింజలు కావాలి. బెట్టను, తెగుళ్లను బాగా తట్టుకుంటుంది. కదిరి అమరావతి (2016), కదిరి చిత్రావతి, కదిరి 7 బోల్ట్, కదిరి 6, కదిరి 9, కదిరి హరితాంద్ర, ధరణి ఒకవేళ ఈ రబీ సీజన్లో దాళ్వా సాగు చేయాలనుకునే రైతులు ఎంటీయూ 1010 (కాటన్ దొర సన్నాలు), ఎంటీయూ 1153 (చంద్ర), ఎంటీయూ 1156 (తరంగిణి), ఎంటీయూ 1121 (శ్రీధృతి), ఎంటీయూ 1210 (సుజాత), ఎంటీయూ 3626 (ప్రభాత్), ఐఆర్ 64, ఎన్.ఎల్.ఆర్. 34449 (నెల్లూరు మసూరీ), ఎన్.ఎల్.ఆర్. 3354 (నెల్లూరు ధాన్యరాశి)వినియోగించినట్లయితే మెరుగైన దిగుబడి సాధించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరిన్ని వివరాలకు సమీపంలోని కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ లేదా ఏరువాక కేంద్రం కో–ఆర్డినేటర్‌ను సంప్రదించాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విస్తరణ సంచాలకులు డాక్టర్ పి.రాంబాబు తెలిపారు. -
ఫాస్ట్ఫుడ్స్కు స్వస్తి.. పూర్వీకుల ఆహారంపై మక్కువ చూపుతున్న జనం
తరం మారుతోంది...వారి స్వరం కూడా మారుతోంది. ఆరోగ్యమే మహా భాగ్యమంటూ చిరుధాన్యాలను తమ ఆహార మెనూలో చేర్చి అగ్రస్థానం కల్పిస్తున్నారు. తమ జాబితాలో మొదటి స్థానంలో ఉండే బిర్యానీ, ఫాస్ట్‌ఫుడ్, జంక్ ఫుడ్లను తొలగిస్తూ ఆరోగ్యప్రద ఆహారాలకు ప్రధానంగా యువత ప్రాధాన్యమిస్తున్నారు. ఫాస్ట్ఫుడ్స్కు క్రమేపీ దూరమవుతూ.. చిరు ధాన్యాల వైపు జనం దగ్గరవుతున్నారు. ఆహారపు అలవాట్లలో మార్పు రావడంతో ఇందుకు అనుగుణంగా మార్కెట్ కూడా మారుతోంది. చిరుధాన్యాల పట్ల ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుండడంతో బియ్యం దుకాణాల్లో ఇవి కూడా అమ్మకానికి పెడుతున్నారు. బిస్కెట్లు, చాక్లెట్లు, చపాతి, మురుకులు, ఇడ్లీలు కూడా చిరుధాన్యాలతో తయారు చేస్తున్నారు. కరోనా రాకతో మరింత గిరాకీ మనిషికి హిమోగ్లోబిన్ 15 గ్రాములుంటే వ్యాధి నిరోధక శక్తి బాగుంటుందని వైద్యులు సూచిస్తున్నారు. అన్నిటికంటే రాగులు ద్వారా శరీరానికి అవసరమైన పోషక పదార్ధాలు అందుతాయి. ముఖ్యంగా ఎముకలకు కాల్షియాన్ని అందిస్తుంది. ఈ విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు రాగికి బెల్లం జతచేసిన ఆహార పదార్ధాలు ఇళ్లల్లో తయారీ చేయిస్తూ తమ పిల్లలకు అందిస్తున్నారు. గ్లూకోజ్ స్థాయులను కూడా నియంత్రించడంలో రాగులు దోహదపడుతుండడంతో మధుమేహులు కూడా ఆకర్షితులవుతున్నారు. వీటితోపాటు జొన్నలు, సజ్జలు, కొర్రలు, సామలను కూడా తమ ఆహారంలో చేర్చుకుంటున్నారు. బెల్లంతో చేసిన తినుబండారాలను ఇప్పుడు ఎక్కువగా తీసుకుంటున్నారు. బెల్లం పాకంతో వేరుశెనగ, నువ్వు ఉండలు, రాగి లడ్డు, మినపలడ్డు, రాగి అట్టులను యువత ఇష్టపడుతుండడంతో మిఠాయి దుకాణాల్లో ఇవి స్థానం దక్కించుకుంటున్నాయి. -
చిరుధాన్యాలతో రక్తహీనతకు చెక్
హిమోగ్లోబిన్, ఫెర్రిటిన్ మోతాదుల్లో వృద్ధి: ఇక్రిశాట్ చిరుధాన్యాలు.. ఆరోగ్య ‘సిరి’ధాన్యాలు అని అందరికీ తెలుసు. మధుమేహం, గుండె సంబంధిత సమస్యల నియంత్రణలో చిరుధాన్యాలు మేలు చేస్తాయని శాస్త్రీయంగా నిరూపితమైంది. వీటితో రక్తహీనతకూ చెక్ పెట్టొచ్చని తాజా పరిశోధన తేల్చిచెప్పింది. –సాక్షి, హైదరాబాద్ చిరుధాన్యాలకు పుట్టినిల్లు తెలంగాణ. వరిసాగు పెరిగాక... వాటి సాగు, వాడకం తగ్గిపోయింది. ఆరోగ్య స్పృహ పెరగడంతో మళ్లీ చిరుధాన్యాలపై ఆసక్తి చూపుతున్నారు. ఈ చిరుధాన్యాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్‌తోపాటు రక్తంలోని ఫెర్రిటిన్ మోతాదు కూడా పెరుగుతుందని అంతర్జాతీయ పరిశోధన ఒకటి తెలిపింది. అంతర్జాతీయ మెట్ట ప్రాంత పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్) నేతృత్వంలో నాలుగు దేశాల్లోని ఏడు సంస్థలు రక్తహీనత, చిరుధాన్యాల వాడకంపై పరిశోధన నిర్వహించాయి. 22 అధ్యయనాల పునఃసమీక్ష ఆధారంగా తాజా విషయాలను ఇక్రిశాట్ వెల్లడి చేసింది. ఫెర్రిటిన్ మోతాదు సగం హెచ్చు... రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, ఆరికలు, సామలు.. ఇలా మొత్తం ఆరు చిరుధాన్యాలను ఆహారంగా తీసుకున్న వెయ్యిమందిపై ఇప్పటికే జరిగిన అధ్యయనాల ఫలితాలను తాము విశ్లేషించామని, ఇతరులతో పోలిస్తే వీరిలో హిమోగ్లోబిన్ మోతాదు 13.2 శాతం, ఇనుము కలిగి ఉన్న ప్రొటీన్ ఫెర్రిటిన్ 54.7 శాతం ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమైందని తాజా అధ్యయనానికి నేతృత్వం వహించిన ఇక్రిశాట్ సీనియర్ పౌషకాహారవేత్త డాక్టర్ ఎస్.అనిత తెలిపారు. 21 రోజులనుంచి నాలుగున్నరేళ్ల పాటు చిరుధాన్యాలను ఆహారంగా తీసుకున్నవారిపై అధ్యయనం నిర్వహించినట్లు ఆమె చెప్పారు. ‘‘చిరుధాన్యాలు సగటు మనిషికి అవసరమైన రోజువారీ ఇను ము మొత్తాన్ని అందించగలవని స్పష్టమైంది. కానీ తినే ధాన్యం, ఎలా శుద్ధి చేశారన్న అంశాలను బట్టి ఎంత మోతాదులో అందుతుందనేది ఆధారపడి ఉంది. దీన్ని బట్టి రక్తహీనత సమస్యను ఎదుర్కొనేందుకు చిరుధాన్యాలు బాగా ఉపయోగపడతా యని స్పష్టంగా చెప్పవచ్చు’’అని డాక్టర్ అనిత వివ రించారు. ఫ్రాంటియర్స్ ఇన్ న్యూట్రిషన్ తాజా సం చికలో అధ్యయనం వివరాలు ప్రచురితమయ్యాయి. 174 కోట్ల మందిలో సమస్య.. ప్రపంచవ్యాప్తంగా రక్తహీనతను ఎదుర్కొంటున్న వారు 174 కోట్ల మంది ఉన్నారు. వీరి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోందని ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జాక్వెలిన్ హ్యూగ్స్ తెలిపారు. రక్తహీనత పిల్లల మానసిక, శారీరక అభివృద్ధిని నిరోధిస్తుందని ఇప్పటికే పలు పరిశోధనలు తెలిపాయని, వీటికి పరిష్కారం చిరుధాన్యాల వాడకమేననని ఆయన వివరించారు. చిరుధాన్యాల్లోని సూక్ష్మపోషకాలు శరీరానికి అందవనడంలో ఏ మాత్రం నిజం లేదని, మిగిలిన ఆహార పదార్థాలతోపాటు చిరుధాన్యాలను తీసుకున్నప్పుడు, వాటిలోని ఇనుమును శరీరం శోషించుకుంటోందని ఈ అధ్యయనంలో స్పష్టమైందని జాతీయ పోషకాహార సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆర్.హేమలత తెలిపారు. ‘మై ప్లేట్ ఫర్ ద డే’పేరుతో చిరుధాన్యాలను ఎలా వాడుకోవచ్చో తెలిపామని, ఈ రకమైన ఆహారం ద్వారా భారత్‌లో రక్తహీనత సమస్యను అధిగమించవచ్చని ఆమె చెప్పారు. పులియబెట్టడం, పాప్‌కార్న్ మాదిరిగా చేయడం ద్వారా చిరుధాన్యాల్లోని ఇనుము మూడు రెట్లు అధికంగా అందుతుందని, పిండిని ఆవిరిలో ఉడికించి చేసే ఆహారం ద్వారా 5.4 రెట్లు అందుతుందని, మొలకెత్తినవి, పొట్టు తొలగించినవి తినడం వల్ల రెండు రెట్లు ఎక్కువ ఇనుము శరీరానికి అందుతుందని ఆమె వివరించారు. -
‘చిరు’కు జైకొడుతున్నారు.. కారణాలు ఇవే! ..మంచి పరిణామం
సాక్షి, అమరావతి: కరోనా కారణంతో ఆహారపు అలవాట్లలో బాగా మార్పులొచ్చాయి. ఎన్నో పోషక విలువలున్న చిరుధాన్యాలు, వాటి అనుబంధ ఉత్పత్తుల వినియోగం రాష్ట్రంలో బాగా పెరిగింది. సంప్రదాయ అల్పాహారాలైన ఉప్మా–పెసరట్టు, మసాలా దోశ, ఇడ్లీ, ఊతప్పం తదితరాల స్థానంలో ఇప్పుడు చిరుధాన్యాలతో తయారుచేసే కొర్రల ఉప్మా, పుట్టగొడుగుల దోశ, కొర్ర ఇడ్లీ, రాగి ఇడ్లీ, జొన్నట్టు ఉప్మా, కొర్ర పాయసం, రాగి జావ వంటివి వచ్చి వచ్చాయి. ఇది సేంద్రీయ వ్యవసాయ రైతులో లేక ప్రకృతి సేద్యం చేస్తున్న వారో చెబుతోంది కాదు.. కార్పొరేట్ సంస్థలే స్పష్టంచేస్తున్న వాస్తవం. 2020 మార్చి నుంచి ఇప్పటివరకు చేసిన ఓ సర్వే ప్రకారం.. లాక్డౌన్ అనంతర కాలంలో పోషక విలువలున్న ఆహారానికి ఎక్కడలేని గిరాకీ పెరిగింది. కరోనా సమయంలో ఇంటి వద్ద ఉన్న చిన్నాపెద్ద అందరూ చిరుతిళ్ల వైపు ఎక్కువ మొగ్గు చూపారు. ప్యాక్ చేసిన చిరు ధాన్యాలు, వాటి అనుబంధ ఉత్పత్తులపై ఆసక్తి చూపారు. దీన్ని ఆసరా చేసుకున్న వాటి తయారీ సంస్థలు, పేరున్న మల్టీచైన్ కంపెనీలు చిరుధాన్యాలతో తయారుచేసిన రెడీ టూ కుక్, రెడీ టూ ఈట్ పదార్థాలపై ఎక్కువ దృష్టిపెట్టాయి. కొత్త పదార్థాలను మార్కెట్లోకి ప్రవేశపెట్టాయి. లాక్డౌన్ అనంతరం కూడా చిరుధాన్యాల వినియోగం పెరిగింది. అల్పాహారంలో ఎక్కువ వినియోగం ప్రస్తుతం చిరు ధాన్యాలను ఎక్కువగా అల్పాహారంలో తీసుకుంటున్నట్లు అమెరికాకు చెందిన కెల్లాగ్స్ ఫ్రూట్ లూప్స్ కంపెనీ వెల్లడించింది. కార్న్‌ఫ్లేక్స్ మాదిరే చిరు ధాన్యాల ఫ్లేక్స్ ప్రస్తుతం మార్కెట్లో బాగా దొరుకుతున్నాయి. వీటిని పాలల్లో కలుపుకుని తీసుకుంటున్నారు. ఇక జొన్న రవ్వ ఇడ్లీలు, కొర్ర, ఆండ్రు కొర్రలు, రాగి ఇడ్లీల పిండిని ప్యాక్‌చేసి రెడీ టూ కుక్‌గా విక్రయిస్తున్నారు. అటుకులు సరేసరి. చిరుధాన్యాలతో తయారైన పరోటా, చపాతీలు.. వాటిల్లోకి కూరలు కూడా ప్యాకింగ్‌లో దొరుకుతున్నాయి. ఉప్మా, ఇడ్లీ, ఓట్స్, దోశ మిక్స్ వంటివీ తయారుచేస్తున్నాయి. మరోవైపు.. దేశవ్యాప్తంగా చిరుధాన్యాలు, ఓట్స్ వ్యాపారం గత ఏడాది కాలంలో 300 మిలియన్ డాలర్లకు చేరింది. ఏడాది కిందట 11–12 శాతంగా ఉన్న వీటి వినియోగం ఇప్పుడు 18–20 శాతానికి పెరిగింది. చిరుధాన్యాలతో తయారుచేసిన ఉప్మా రవ్వ ఇప్పుడు ఎక్కువగా అమ్ముడవుతోంది. ఇంటికి తీసుకువెళ్లి నీళ్లలో ఉడికించి తినడమే. -
తృణమో పణమో తిందాం తప్పక
సాక్షి, హైదరాబాద్: జొన్నలు, సజ్జలు, రాగుల వంటి తృణధాన్యాలతో కూడిన ఆహారం పిల్లల శారీరక ఎదుగుదలను ఎక్కువ చేస్తుందని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ మెట్ట ప్రాంత పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్) నేతృత్వంలో జరిగిన ఒక పరిశోధనలో వెల్లడైంది. మూడు నెలలపాటు తృణధాన్యాలతో కూడిన భోజనం తినడం ద్వారా విద్యార్థుల ఎదుగుదలలో 50 శాతం వృద్ధి కనిపించిందని ఈ పరిశోధన లో స్పష్టమైంది. ఢిల్లీలో బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో నీతి ఆయోగ్ సభ్యుడు రమేశ్ చంద్, రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ఉద్దేశించిన సాధికార సంస్థ అధ్యక్షుడు డాక్టర్ అశోక్ దళవాయి ఈ పరిశోధన వివరాలను వెల్లడించారు. ‘స్మార్ట్‌ఫుడ్ స్టడీ’పేరుతో ఇక్రిశాట్ కర్ణాటకలో పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేసే అక్షయపాత్రతో కలిసి ఈ పరిశోధన చేపట్టింది. బెంగళూరు పరిసరాల్లోని నాలుగు గ్రామాల్లో కొంతమంది విద్యార్థులను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూపునకు తృణధాన్యాలతో తయారుచేసిన ఇడ్లీ, కిచిడీ, ఉప్మా, బిసిబేళేబాత్లను అందించారు. బియ్యం స్థానంలో సజ్జలు, రాగులు, సామలను ఉపయోగించారు. ఇదే సమయంలో మరో గ్రూపు విద్యార్థులకు సాంబార్ అన్నం ఆహారంగా ఇచ్చారు. నిర్దిష్ట కాలం తర్వాత రెండు గ్రూపుల్లోని పిల్లల ఎదుగుదలను పోల్చి చూశారు. తృణధాన్యాలు ఆహారంగా తీసుకున్న వారి శరీర కొలతలు ఇతరుల కంటే చాలా మెరుగ్గా ఉన్నట్లు గుర్తించారు. మధ్యాహ్న భోజన పథకంలో తృణధాన్యాల ఆహారంపై శాస్త్రీయంగా జరిగిన తొలి అధ్యయనం ఇదేనని ఇక్రిశాట్‌కు చెందిన న్యూట్రిషినిస్ట్ డాక్టర్ ఎస్.అనిత తెలిపారు. కేవలం తృణధాన్యాలను వాడటం కాకుండా ఏ రకమైన తృణధాన్యాన్ని ఉపయోగిస్తున్నాం? ఎలా వండుతున్నాం? ఏ ఇతర ఆహార పదార్థాలతో కలిసి తింటున్నాం? అన్న అంశాలూ ముఖ్యమేనని స్పష్టం చేశారు. పోషకాహార లోపాలకు చెక్.. రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న కేంద్రం ఆలోచన సాకారం కావాలంటే తృణధాన్యాల సాగుకు ప్రోత్సాహం అవసరమని ఈ పరిశోధన చెబుతోందని డాక్టర్ అశోక్ దళవాయి తెలిపారు. ఇక్రిశాట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్‌తో కలిసి మెరుగైన వంగడాల సృష్టికి కృషిచేస్తోందని ఇక్రిశాట్ డైరెక్టర్ డా. పీటర్ కార్బెర్రీ తెలిపారు. పాఠశాల విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకంలో తృణధాన్యాలను చేర్చడం ద్వారా పోషకాహార లోపాలను సరిదిద్దేందుకు అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. చౌక ధర దుకాణాల ద్వారా తృణధాన్యాల పంపిణీ చేపడితే రైతు లకూ ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. మరిన్ని పోషకాలు ఉన్న తృణ ధాన్యాలను గుర్తించి వాటి సాగుకు ప్రోత్సాహకాలు అందించడం అవసరమన్నారు. -
మల్టిపుల్ ప్రయోజనాల మల్టీ గ్రెయిన్ ఆటా
సాధారణంగా ఏదో ఒక ధాన్యపు పిండిని వాడటం మామూలే. కానీ ఇటీవల చాలామంది మల్టి గ్రెయిన్ ఆటాలను వాడుతున్నారు. ఏదో ఒక ధాన్యంతో చేసిన పిండి కాకుండా... చాలా రకాల ధాన్యాలను కలిపి దంచిన పిండినే ‘మల్టి గ్రెయిన్ ఆటా’ అంటున్నాం. ఓట్స్, గోధుమపిండి, కుసుమలు, పొట్టు తీయని మరికొన్ని తృణధాన్యాలు కలిపి ఈ పిండిని తయారుచేసుకోవచ్చు. ఇందులో కనిష్టంగా 3 – 5 మొదలుకొని, గరిష్ఠంగా 12 వరకు ధాన్యాలు కలిపి తయారు చేసుకోవచ్చు. ప్రయోజనాలు... చాలాసందర్భాల్లో ఒక రకం పిండిలో ఉన్న పోషకాలు మరోరకం పిండిలో లోపించవచ్చు లేదా చాలా తక్కువగా ఉండవచ్చు. రకరకాల ధాన్యాలను తీసుకొని వాటిని కలిపి పిండిగా చేసుకోవడం వల్ల మల్టి గ్రెయిన్ అనే ఒకే పిండిలోనే చాలా రకాల పోషకాలు దొరుకుతాయి. ఈ పిండి వాడటం వల్ల దేహానికి అన్నిరకాల పోషకాలు అంది ఆరోగ్యం సమకూరుతుంది. ప్రయోజనాలు పొందాలంటే... దేహానికి అన్ని రకాల పోషకాలు అందేలా అన్ని ధాన్యాల సమష్టి ప్రయోజనాలు పొందాలంటే... కనీసం 10 రకాల ధాన్యాలను కలిపి మనమే స్వయంగా పిండిగా పట్టించుకోవడం మేలు. ఎలా తయారు చేసుకోవాలంటే... 1 పైన పేర్కొన్న ధాన్యాలను విడివిడిగా వేయించుకోవాలి. (ఒక్క గోధుమలను మాత్రం వేయించకూడదు). 2 వేయించిన ధాన్యాలు చల్లబడే వరకు ఆరబెట్టాలి. ఆ తర్వాత గోధుమలతో కలపాలి. 3 అన్నింటినీ కలిపి మర ఆడించి, పిండి పట్టించుకోవాలి. 4 మర ఆడించిన పిండి వేడిగా ఉంటుంది. అది చల్లారేవరకు వేచి చూడాలి. 5 రెండుసార్లు జల్లెడ పట్టుకోవాలి. 6 జల్లెడ పట్టినప్పుడు జల్లెడలో మిగిలిన పదార్థాలను పారేయాలి. 7 జల్లెడ పట్టగా కింద మిగిలిన మెత్తటి పిండిని గాలి చొరని ఎయిర్‌టైట్ డబ్బాలో నిల్వ చేసుకుని అవసరమైనప్పుడు ఉపయోగించుకోవాలి. ఈ జాగ్రత్త పాటించండి: మార్కెట్లో లభ్యమయ్యే మల్టీ గ్రెయిన్ ఆటాలో వాణిజ్య ప్రయోజనాల కోసం చాలా మంది తేలిగ్గా లభ్యమయ్యే గోధుమ పిండినే ప్రధానంగానూ, ఎక్కువగానూ వాడి, మిగతా తృణధాన్యాలను తక్కువ మోతాదులో వాడుతుంటారు. దీని వల్ల మనం దాదాపు సాధారణ గోధుమ పిండిని వాడిన ప్రయోజనానికి మించి పెద్దగా ఉపయోగం పొందలేం. అందుకే మన మల్టి గ్రెయిన్ ఆటాను మనమే తయారుచేసుకునేలా మర పట్టించుకోవడం మంచిది. సుజాతా స్టీఫెన్ చీఫ్ న్యూట్రిషనిస్ట్ యశోద హాస్పిటల్స్, మలక్‌పేట, హైదరాబాద్ -
'అరుదైన' అవకాశానికి అవరోధం
సాక్షి, జహీరాబాద్: ఐక్యరాజ్య సమితి ఎంపిక చేసిన ‘ఈక్వేటారి’ అవార్డును అందుకునే అవకాశం దూరం కావడం పట్ల డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ మహిళా సంఘం(చిరు ధాన్యాల చెల్లెండ్ల సమాఖ్య) సభ్యులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈనెల 19 నుంచి 26వ తేదీ వరకు అమెరికాలోని న్యూయార్కులో ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ కార్యక్రమం (యూఎన్డీపీ) ప్రతిష్టాత్మక ఈక్వేటారి అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇదే వేదిక నుంచి డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ(డీడీఎస్) మహిళా సంఘం సభ్యులు అవార్డును అందుకోవాల్సి ఉంది. ఇందు కోసం ఐక్యరాజ్య సమితి నుంచి సంస్థ సభ్యులకు ఆహ్వానం సైతం లభించింది. అయినా అవార్డును అందుకునేందు కోసం వెళ్లే మహిళలు వీసా కోసం దరఖాస్తు చేసుకోగా తిరస్కరణకు గురి అయింది. ఇది సంఘం సభ్యులను ఎంతో నిరాశ పర్చింది. ప్రపంచ వ్యాప్తంగా పనిచేసే పర్యావరణ వేత్తలు, వారి సంస్థలకు ఐక్యరాజ్య సమితి ఈక్వేటారి అవార్డులను ఇస్తూ వస్తోంది. 2019 సంవత్సరానికి గాను జహీరాబాద్ మండలంలోని పస్తాపూర్‌లో గల డీడీఎస్ మహిళా సంఘానికి ఈ అవార్డుకు చోటు దక్కింది. గత 30 సంవత్సరాల కాలంగా అవిశ్రాంతంగా పర్యావరణ మేలు కోసం డీడీఎస్ మహిళా సంఘాలు చేస్తున్న కృషి, పనులను గుర్తించిన ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం డీడీఎస్ మహిళా సంఘానికి అవార్డుకు ఎంపిక చేసింది. డీడీఎస్ మహిళా సంఘానికి వచ్చిన అవార్డును అందుకునేందుకు గాను పస్తాపూర్ గ్రామానికి చెందిన అనుసూయమ్మ, పొట్పల్లి గ్రామానికి చెందిన మొగులమ్మలను సంస్థ ఎంపిక చేసింది. వారికి ట్రాన్స్లేటర్లుగా జయశ్రీ, మయూరిలను ఎంపిక చేశారు. గత 17 సంవత్సరాల కాలంగా యూఎన్డీపీ ప్రతి సంవత్సరం ప్రపంచ స్థాయిలో అందజేస్తున్న అవార్డులకు గాను ఇప్పటి వరకు భారత దేశంలో 9 సంస్థలు మాత్రమే ఈ అవార్డుకు ఎంపికయ్యాయి. ఈ సారి డీడీఎస్ మహిళా సంఘం 10వ అవార్డుకు ఎంపికైంది. గత మూడు దశబ్దాల కాలంగా అవిశ్రాంతంగా పర్యావరణ మేలు కోసం డీడీఎస్ సంఘాలు చేస్తున్న పనిలో సామాజిక అటవుల కమ్యూనిటీ నియంత్రిత పీడీఎస్ ద్వారా బీడు భూములకు పచ్చ దుప్పటి కప్పడం, గ్రామల పక్కన ఉండే ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి హరిత వనాలను పెంచడం, కనుమరుగవుతున్న మందు చెట్లను కాపాడి వాటిని అభయారణ్యం లాంటి స్థావరాలుగా రూపుదిద్దడం, అంతరించి పోతున్న చిరు ధాన్యాలను పరిరక్షించి విస్తరింప జేయడం, కమ్యూనిటీ విత్తనాల బ్యాంకులను స్థాపించడం లాంటి కార్యక్రమాలను డీడీఎస్ మహిళా సంఘాల సభ్యులు తీసుకుని విజయం సాధించడంలాంటి అద్భుతమైన పనులకు గుర్తింపుగా ఈక్వేటారి అవార్డు దక్కింది. ప్రపంచ వ్యాప్తంగా 127 దేశాలకు చెందిన 847 నామినేషన్లు ఐక్యరాజ్య సమితి అవార్డుకోసం దాఖలయ్యాయి. వీటన్నింటిని పరిశీలించిన అనంతరం 20 మంది విజేతలను యూఎన్డీపీ ఎంపిక చేసింది. వీటిలో డీడీఎస్ మహిళా సంఘానికి అరుదైన చోటు దక్కింది. ఈ అవార్డును అందుకునేందుకు గాను వెళ్లేందుకు ఎంపికైన మహిళా సంఘం సభ్యులు అనుసూమ్మ, మొగులమ్మలతో పాటు ట్రాన్స్లేటర్లుగా జయశ్రీ, మయూరిలను పంపేందుకు నిర్ణయించారు. ఈ మేరకు వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీసా దరఖాస్తులు తిరస్కరణకు గురికావడంతో మహిళా సంఘం సభ్యులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మేము చేసిన పనులు చెప్పుకోవాలనుకున్నా గత మూడు దశాబ్దాల కాలంగా డీడీఎస్ మహిళా సంఘాల సభ్యులు పర్యావరణాన్ని కాపాడేందుకు చేస్తున్న కా>ర్యక్రమాలను చెప్పుకోవాలనుకున్నా. ఇందు కోసం పూర్తిగా సిద్ధం అయ్యా. అవార్డును అందుకునేందుకు చేసుకున్న వీసా దరఖాస్తు తరస్కరణకు గురు కావడం తీవ్ర ఆవేదనకు గురి చేసింది. మే ం సాధించిన విషయాలను ఐక్యరాజ్య సమితి వేదికగా ప్రపంచ వ్యాప్తంగా వచ్చే పర్యావరణ పరిరక్షకులకు వినిపించి మరింత విస్తరింపజేసేలా వివరించాలనుకున్నా. వీసా రాక పోవడం ఎంతో బాధను కలిగించింది. –అనుసూయమ్మ, మహిళా సంఘం సభ్యురాలు వీసా తిరస్కరణ తీవ్ర నిరాశకు గురి చేసింది ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం(యూఎన్డీపీ) ప్రతిష్టాత్మక ఈక్వేటారి అవార్డు పొందేందుకు గాను నూయార్కు వెళ్లేందుకు అవసరమైన వీసా లభించక పోవడం తీవ్ర నిరాశకు గురి చేసింది. పర్యావరణ పరిరక్షణతో పాటు అంతరించి పోతున్న పాత పంటల సాగు విస్తరణ కోసం తాము చేస్తున్న కృషి ఎనలేనిది. మహిళా రైతులకు లభించిన అవకాశం వీసా తరస్కరణ రూపంలో దక్కక పోవడం తీవ్ర మానసిక వేదనకు గురి చేసింది. – మొగులమ్మ, మహిళా రైతు, చిరు ధాన్యాల చెళ్లెళ్ల సమాఖ్య అధ్యక్షురాలు, పొట్పల్లి చదవండి: ఆహ్వానం అందినా..వీసా ఇవ్వలేదు -
ఆక్వా రైతులకు మేత భారం
పెరుగుతున్న మేత ధరలు ఆక్వా రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తృణ ధాన్యాల దిగుబడి విషయంలో గత ప్రభుత్వానికి సరైన రవాణా ప్రణాళిక లేకపోవడంతో వాటి ధరలను వ్యాపారులు అమాంతం పెంచేశారు. దీనికితోడు ఉప్పు నీటి ప్రభావంతో రొయ్యలు, చేపల దిగుబడులు తగ్గిపోవడం.. ఉత్పత్తికి తగ్గట్టుగా గిట్టుబాటు ధర లేకపోవడం.. వ్యాధులు, వైరస్ చుట్టుముట్టడంతో మరింత కుంగదీశాయి. ఏటా ఇలాంటి సంక్షోభాలను ఎదుర్కొంటున్న రైతులకు ఈసారి నష్టాలు తప్పేలా లేవు. గత నాలుగేళ్లలో చేపల మేత ధర రెట్టింపు కాగా.. రొయ్యల మేత ధర మూడొంతులు పెరిగింది. వీటి పెరుగుదల రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సాక్షి, కాకినాడ: జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 12,500 హెక్టార్లలో చేపలు, 6,200 వేల హెక్టార్లలో రొయ్యలను సాగు చేస్తున్నారు. నాలుగు కంపెనీల ద్వారా మేత ఉత్పత్తి చేస్తున్నారు. అక్కడ తయారైన వివిధ రకాల మేత చేపలు, రొయ్యలకు ఆహారంగా అందజేస్తున్నారు. మేత తయారీకి తృణ ధాన్యాలు వినియోగిస్తున్నారు. అయితే ఈ ధాన్యాల ధరలు గతంతో పోల్చుకుంటే కేజీ వేరుశనగ చెక్క ధర రూ.3, తవుడు రూ.6, డీవోపీ రూ.8 చొప్పున పెరిగాయి. డీవోపీ ధర రికార్డు స్థాయిని దాటిపోయింది. ప్రస్తుతం నాణ్యమైన టన్ను డీవోపీ ధర రూ.20 వేలు పలుకుతుండటం రైతులకు మింగుడు పడటం లేదు. మేతల రేట్లు పెరిగిన స్థాయిలో చేపల ధరల్లో మాత్రం మార్పు రాలేదు. నాలుగేళ్ల కిందట తవుడు ధర రూ.10 ఉన్నప్పుడు రోహూ రకం చేప కిలో రూ.100 ఉండేది. ప్రస్తుతం మేతల ధరలు రెట్టింపయినా చేప ధర రూ.110 వరకు మాత్రమే ఉంది. టన్ను చేపల రేట్లకు పది టన్నుల మేతల ధరలు ఉంటే రైతులకు గిట్టుబాటు అవుతుంది. ప్రస్తుతం టన్ను చేపలు సుమారు రూ.1.10 లక్షలుండగా టన్ను మేత రూ.20 వేలు పలుకుతోంది. కారణాలు ఏమిటంటే.. పెరిగిన మేత ధరలకు ప్రధాన కారణం దేశవ్యాప్తంగా తృణ ధాన్యాలకు అధిక డిమాండ్లే. రైస్ మిల్లర్లకు ప్రభుత్వ కన్సైన్మెంట్ లేకపోవడంతో తక్కువ పరిణామంలోనే ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఎక్కడా రైస్ మిల్లులు తిరిగే పరిస్థితి లేదు. గోదాముల్లో ధాన్యం ఉన్నా ఆర్డర్లు లేకపోవడంతో వాటిని మిల్లు పట్టించడం లేదు. తవుడుకు తీవ్ర కొరత ఏర్పడింది. నూనె తీసిన డీవోపీ ధరలకు రెక్కలు వచ్చాయి. స్థానికంగా తవుడు కొరత ఏర్పడంతో డిమాండ్ పెరిగింది. ఏటా వర్షాకాలం ప్రారంభంలో రైతులందరూ ఒకేసారి సాగు పనులు మొదలు పెట్టడంతో ఈ కాలంలో మేతలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. జూలై నుంచి నవంబర్ వరకు ధరలు పెరుగుతాయి. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు సిండికేటుగా ఏర్పడి ధరలను ప్రభావితం చేస్తున్నారు. కృత్రిమ డిమాండ్‌ను సృష్టించి అమాంతంగా రేట్లు పెంచి విక్రయిస్తున్నారు. ఆక్వా సాగులో ముఖ్యమైన మేతలు లేకపోతే దిగుబడిపై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతో ధరలు పెంచినా ప్రశ్నించకుండానే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇబ్బందుల్లో రైతులు ఆక్వా సాగుదార్లకు మేతల ధరలు తలకుమించిన భారంగా పరిణమిస్తున్నాయి. చెరువుల్లో రొయ్యలు ఉన్నప్పుడు ఒకేసారి భారీ ఎత్తున మేతల ధరలు పెరుగుతున్నా తప్పక కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. గత ఏడాది నవంబర్ తర్వాత చేపల చెరువులకు చుక్కనీరు అందిన దాఖలాలు లేవు. ఓ పక్క నీరు లేక.. మరో పక్క పెరిగిన మేతల ధరలతో ఇబ్బందులు తప్ప లేదు. చెరువుల్లో నీరు అడుగంటి పోవడంతో పట్టుబడి సాధ్యం కాదు. చెరువులో వలను దింపితే చేపలు చనిపోయే ప్రమాదం ఉంది. పట్టుబడి చేయాలో..పెరిగిన మేతల ధరలతో సాగు చేసి నష్టాలు చవిచూడాలో అర్థం కాక ఆక్వా రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. కల్తీ కాటు మేతల ధరలు ఆకాశాన్ని అంటడంతో కొందరు వ్యాపారులు అత్యాశకు పోయి కల్తీకి పాల్పడుతున్నారు. చెరువుల్లో పిల్లల ను రక్షించుకోవడానికి ధరలు ఎంత పెరిగినా కొనుగోలు చేయక తప్పని పరిస్థితిలో రైతులున్నారు. కల్తీ చేసిన మేతల్ని కొనుగోలు చేసి నష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. వేరుశనగ చెక్కలో కంకర ఇసుక, చింతపిక్కల పొడి, వేరుసెనగ తొక్కల పొడిని కలుపుతున్నారు. తవుడులో రంపపు పొట్టు, సీరు నూకలు, ఊకదూగరతో కల్తీ చేస్తున్నారు. కొందరు మిల్లర్లే స్వయంగా తవుడును కల్తీ చేసి అమ్ముతున్నారు. పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల్లో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో మిల్లర్ల వద్ద నాణ్యమైన తవుడు దొరుకుతుందని వచ్చిన రైతులకు అక్కడా మోసం తప్పడం లేదు. గిట్టుబాటు కరువే ఎకరం చెరువులో 1.50 లక్షల పిల్లలు సాగు చేస్తే.. ప్రస్తుతం ఒక పిల్ల ధర 35 పైసలు పలుకుతోంది. అంటే 1.50 లక్షల పిల్లలకు రూ.45 వేలు, మందులు, మేత, విద్యుత్తు బిల్లులకు మరో రూ.4 లక్షలు అవుతోంది. ఆశించిన మేర పంట దిగుబడి అందితే.. అంటే రొయ్య 30 కౌంట్‌కు వచ్చి మూడు టన్నులు అయితే రూ.15 లక్షలు ఆదాయం వస్తుంది. లేని పక్షంలో పెట్టిన పెట్టుబడి సైతం చేతికందే పరిస్థితి ఉండదు. ప్రస్తుతం బహిరంగ విపణిలో సైతం రొయ్యల ధరలు ఆశించిన మేర లేకపోవడంతో రైతులు సాగుకు ముందుకు రావడం లేదు. -
తయారీ యూనిట్లపై జీసీసీ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: వ్యాపార వృద్ధిలో భాగంగా గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ (జీసీసీ) తయారీ యూనిట్ల ఏర్పాటువైపు దృష్టి సారించింది. గిరి తేనె, సహజ సిద్ధమైన సబ్బులు, షాంపూల తయారీతో బహిరంగ మార్కెట్లో తనదైన ముద్ర వేసిన జీసీసీ.. తాజాగా తృణధాన్యాల ఉత్పత్తుల వైపు దృష్టి పెట్టింది. జొన్నలు, రాగులు, కొర్రలు, సజ్జలతో తయారుచేసిన సహజసిద్ధమైన స్వీట్లు, స్నాక్స్, వంటకాలకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. ఈ దిగుబడులకు ధరలు సైతం అధికంగా ఉండటంతో గిరిజన సంక్షేమ శాఖ యంత్రాంగం ఐటీడీఏ ప్రాంతాల్లోని గిరిజన రైతాంగాన్ని వీటి సాగుకు ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో వచ్చిన పంట దిగుబడులను ప్రాసెసింగ్ చేసి వాటి ద్వారా ఆహార పదార్థాల తయారీకి కార్యాచరణ సిద్ధం చేస్తోంది. 25 యూనిట్ల ఏర్పాటు.. ఉట్నూరు, భద్రాచలం ఐటీడీఏ పరిధిలో జీసీసీకి తేనె పరిశ్రమలు ఉన్నాయి. ఏటూరు నాగారం పరిధిలో సబ్బులు, షాంపూల తయారీ యూనిట్లున్నాయి. వీటితోపాటు నగరంలోని కొన్ని పరిశ్రమలను లీజు రూపంలో తీసుకుని అక్కడ వివిధ రకాల సబ్బులు, షాంపూలు తయారు చేసి మార్కెట్లోకి తెస్తున్నారు. ప్రస్తుత ప్రొడక్షన్ బహిరంగ మార్కెట్లో కంటే సం క్షేమ వసతి గృహాలు, గురుకులాలకే సరిపోతోంది. డిమాండ్‌కు తగినట్లు సరఫరా చేయాలనే ఉద్దేశంతో జీసీసీ కొత్త యూనిట్ల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందిస్తోంది. ఒక్కో యూనిట్‌ను గరిష్టంగా రూ.40 లక్షలతో ప్రారంభించాలని భావిస్తోంది. రాష్ట్రంలోని మూడు ఐటీడీఏల పరిధిలో ప్రాధాన్యతా క్రమంలో వీటిని ఏర్పాటు చేస్తారు. పంట దిగుబడులను బట్టి యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. దాదాపు రూ.10 కోట్లతో తయారీ యూనిట్లను నెలకొల్పాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. దీనిలో 60 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వమే ఇవ్వనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. పూర్తిస్థాయి ప్రాజెక్టు రిపోర్టును సమర్పిస్తే కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ నుంచి 60 శాతం గ్రాంటు రానుం దని అధికారులు భావిస్తున్నారు. మిగతా 30 శాతం బ్యాంకు రుణం ద్వారా, మరో పది శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో చేపట్టేలా ప్రణాళిక తయారు చేస్తున్నారు. గిరిజన యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతోనే ఈ యూనిట్లను నెలకొల్పుతున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. -
మహాభాగ్యం మొలకెత్తినట్లే!
మొలకెత్తిన ధాన్యాలు తినడం ఆరోగ్యకరం అని తెలిసిందే. ఇటీవల చాలామంది మొలకెత్తిన ధాన్యాలు తింటున్నారు. ప్రత్యేకించి మొలకెత్తిన పెసలతో ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. అవి ఏమిటో చూద్దాం.జుట్టు రాలిపోయి, పలచబడేవారికి మొలకెత్తిన పెసలు స్వాభావిక చికిత్స అనుకోవచ్చు. వాటితో జుట్టు కూడా మళ్లీ మొలకెత్తే అవకాశాలు ఎక్కువ. మొలకెత్తే పెసలలో పుష్కలంగా ఉండే విటమిన్–ఏ రోమాంకురాలను ప్రేరేపించి (హెయిర్ ఫాలికిల్స్ను స్టిమ్యులేట్ చేసి) మళ్లీ జుట్టును మొలిపించే అవకాశం ఉంది. అంతేకాదు... రోమాంకురాలకు సరఫరా అయ్యే రక్తనాళాల (క్యాపిల్లరీస్)ను కూడా ఈ మొలకలు ప్రేరేపిస్తాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది.పైన చెప్పుకున్నట్లు మొలకెత్తే పెసర్లలో పుష్కలంగా ఉన్న విటమిన్–ఏ వల్ల కంటిచూపు మెరుగుపడుతుంది. వయసు పెరగడం వల్ల వచ్చే మాలిక్యులార్ డిజనరేషన్‌తో పాటు ఎన్నో రకాల కంటి వ్యాధులు నివారితమవుతాయి. వయసు పెరుగుతుండటం (ఏజింగ్)తో కనపడే ఎన్నో లక్షణాలను ఈ మొలకలు నివారిస్తాయి. జుట్టు తెల్లబడటం, జుట్టు రాలిపోవడం, చర్మం ముడతలు పడటం వంటి ఏజింగ్ పరిణామాలను అరికట్టి దీర్ఘకాలం యౌవనంగా ఉండేలా చూస్తాయి. పెసర మొలకలు మంచి ప్రోటీన్లకు నెలవు. ఎప్పటికప్పుడు కండరాలను రిపేర్ చేస్తుండటం వల్ల దీర్ఘకాలం పాటు కండరాలు మంచి పటుత్వంతో బలంగా ఉంటాయి. మొలకెత్తే పెసలలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల రక్తహీనతతో బాధపడేవారికి ఇవి రక్తాన్ని భర్తీ చేస్తాయి. జుట్టు పెరుగుదలకు అవసరమైన ఐరన్నూ సమకూర్చడం వల్ల కూడా ఇవి జుట్టును మళ్లీ మొలిపించడానికి దోహదపడతాయి. మహిళల్లో హార్మోన్ల సమతౌల్యతకు పెసర మొలకలు సహాయం చేస్తాయి. చర్మంలోని కొత్త కణాల పుట్టుకను వేగవంతం చేయడం వల్ల పెసర మొలకలతో మేని మెరుపు, మంచి నిగారింపు వస్తుంది. చర్మక్యాన్సర్ వంటి వ్యాధులనూ ఈ మొలకలు నివారిస్తాయి. చర్మంలోని తేమను తగ్గకుండా చేస్తే హైడ్రేటింగ్ ఏజెంట్స్‌గా కూడా పెసర మొలకలు పనిచేస్తాయి. జీవక్రియల కారణంగా ఒంట్లో పేరుకుపోయే ఎన్నో రకాల విషాలను పెసర మొలకలు చాలా వేగంగా బయటకు వెళ్లేలా చూస్తాయి. అందుకే వీటిని మంచి డీ–టాక్సిఫయింగ్ ఏజెంట్లుగా చెప్పవచ్చు. గర్భవతులకు ఇవి చాలా మేలు చేస్తాయి. గర్భధారణ సమయంలో వీటిని ‘ప్రెగ్నెన్సీ ప్రోటీన్ పవర్‌హౌజ్’గా పరిగణిస్తారు. వీటిలో పోషకాలు చాలా ఎక్కువ. అయితే క్యాలరీలు చాలా తక్కువ. అందుకే బరువు తగ్గాలనుకునేవారికి ఆరోగ్యకరమైన ఆహారం ఈ పెసర మొలకలు. అన్ని రకాల విటమిన్లు, ఖనిజలవణాల కారణంగా ఇవి ఒంటికి మంచి రోగనిరోధక శక్తిని ఇస్తాయి. -
ఆహార మందిరం
రామంతాపూర్: నగరవాసుల్లో ఆరోగ్య స్పృహ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో చిరుధాన్యాలకు ప్రాధాన్యం ఏర్పడింది. వీటితో తయారు చేసిన వంటకాలకు డిమాండ్ ఉంటోంది. సిటీజనులకు ఆరోగ్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ముగ్గురు యువకులు చిరుధాన్యాలతో అల్పాహారం అందిస్తున్నారు.రామంతాపూర్ శ్రీనివాసపురం బ్రహ్మం గారి దేవాలయం వద్ద ధ్యానప్రకృతి ఆహార మందిరం పేరుతో వీరు ఏర్పాటు చేసిన టిఫిన్ సెంటర్ స్థానికులకు ఆరోగ్య రుచులు అందిస్తోంది. హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేసిన శ్రీకాంత్, తుషార్, శివకృష్ణ దీనిని ప్రారంభించారు. రాగులు, సజ్జలు, కొర్రల పిండి, జొన్న, అరికెలు, సామలు, సన్‌ఫ్లవర్ ఆయిల్, దేశీ ఆవు నెయ్యి, సైందవ లవణం, పొట్టు పెసర్లతో... పూరీ, ఇడ్లీ, దోసె, ఉప్మా తదితర టిఫిన్లు అందిస్తూ ఆహా అనిపిస్తున్నారు. రాగులు, కొర్రలతో ఇడ్లీలు, దోసెలు, వీటికి తృణధాన్యాలు కలిపి మరికొన్ని రకాల టిఫిన్లు, రాగి పిండితో పూరీ, అంబలి, జావా తదితర పదార్థాలను వండి వడ్డిస్తున్నారు.సాధారణ టిఫిన్ల మాదిరే చిరుధాన్యాలతో తయారు చేస్తూ రూ.30కేఅందించడం విశేషం. వడ్డింపులోప్రత్యేకత.. వీరు తయారు చేసిన టిఫిన్లను అరిటాకుల్లో వడ్డిస్తున్నారు. అంతేకాకుండా తాగేందుకు తులసీ ఆకులు కలిపిన నీటిని అందిస్తున్నారు. ఆర్డర్ ఇస్తే డోర్ డెలివరీ సైతం చేస్తున్నారు. కిట్టీ పార్టీలు, చిన్నపాటి శుభకార్యాలకు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వీరు తెలిపారు. రుచి.. నాణ్యత నెల రోజులుగా ఇక్కడే టిఫిన్ చేస్తున్నాను. టిఫిన్లు రుచిగా, నాణ్యతగా ఉన్నాయి. తృణధాన్యాలు నేరుగా తినలేని వారు ఈ టిఫిన్లు తీసుకోవచ్చు. – రఘు, శ్రీనివాసపురం ఆదరణ బాగుంది.. వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ టిఫిన్లు తినేందుకు అందరూ అలవాటు పడుతున్నారు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. – తుషార్, నిర్వాహకుడు -
పాఠకుల ప్రశ్నలకు డా.ఖాదర్ సమాధానాలు
మైసూరుకు చెందిన స్వతంత్ర ఆహార, అటవీ కృషి శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్‌వలి అందించిన సమాచారం మేరకు ‘సాక్షి’ దినపత్రిక ‘ఫ్యామిలీ’లో 2018 జనవరి 25న.. ‘కేన్సర్‌ను సిరిధాన్యాలతో జయిద్దాం..’ ‘కేన్సర్‌పై చిరు పిడికిలి’ శీర్షికలతో కథనాలు ప్రచురితమయ్యాయి. వాటిని చదివిన పాఠకులు కొందరు తమ ప్రశ్నలను సాక్షి కార్యాలయానికి పంపారు. ఆ ప్రశ్నలకు డాక్టర్ ఖాదర్ చెప్పిన సమాధానాలను ఇక్కడ పొందుపరుస్తున్నాము. గమనిక: డా.ఖాదర్‌వలి ఇక్కడ సూచించిన చికిత్సలతో ఒకరికి 3 నెలల్లో నయమైతే, మరొకరికి సంవత్సరం పట్టొచ్చు.. అది వారి రోగనిరోధకశక్తిని బట్టి ఉంటుంది. పరిమాణం, ప్రమాణాలు వేర్వేరుగా ఉంటాయి కాబట్టి, ఫలితాలు వేరుగా ఉంటాయి. అవసరాన్ని బట్టి స్థానిక ఆయుర్వేద/హోమియో వైద్యులను సంప్రదించి మందులు తీసుకోవచ్చు. ప్రశ్న: హైపోధైరాయిడ్తో బాధపడుతూ రోజూ టాబ్లెట్లు వేసుకుంటున్నాను. సిరిధాన్యాలు తింటూ, కషాయాలుæతాగితే ఈ సమస్య పోతుందా? –అనూష, గృహిణి, మొహిదీపట్నం, హైదరాబాద్. ప్రశ్న: నా వయసు 51 ఏళ్లు. గత పదేళ్లుగా థైరాయిడ్ సమస్య ఉంది. 75 ఎం.జి. టాబ్లెట్ రోజూ వాడుతున్నా. పరిష్కారం చెప్పండి? – టి. రజని, మచిలీపట్నం, కృష్ణా జిల్లా డా.ఖాదర్‌వలి: థైరాయిడ్ సంబంధిత సమస్యలున్న ఎవరైనా.. 3 రోజులు సామ బియ్యం, ఒక రోజు ఊదలు, ఒక రోజు అరికలు, ఒక రోజు కొర్రలు, ఒక రోజు అండుకొర్రల బియ్యం వండుకు తినాలి. తర్వాత మళ్లీ 3 రోజులు సామ బియ్యం, మిగతా 4 రకాల సిరిధాన్యాలను రోజుకు ఒకటి చొప్పున తినాలి. ఏ రోజైనా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి కూడా ఆ సిరిధాన్యాన్నే తినాలి. కషాయాలు.. మెంతి ఆకుల కషాయం ఒక వారం, పుదీన ఆకుల కషాయం మరో వారం, తమలపాకుల కషాయం మరో వారం.. అలా మార్చి మార్చి వాడుకోవాలి. రోజుకు 2 లేదా 3 సార్లు కషాయం తాగవచ్చు. వీటితోపాటు.. గానుగలో స్వయంగా తీయించుకున్న కల్తీలేని కొబ్బరి నూనెను రోజూ ఉదయం 3 చెంచాలు 3 నెలల పాటు తాగాలి. గానుగ పట్టిన కుసుమ నూనె ఒక నెల, కొబ్బరి నూనె మరో నెల.. మార్చి, మార్చి తాగితే ఇంకా మంచిది. కుసుమ నూనె దొరక్కపోతే కొబ్బరి నూనే వాడొచ్చు. 3 నెలల తర్వాత వారానికి ఒకటి, రెండు సార్లు తాగితే చాలు. థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్లు ముఖ్యంగా రోజూ గంట సేపు నడవడం తప్పనిసరి. ఇలా చేస్తూ ఉంటే.. 5 వారాల్లో 25% అల్లోపతి మందులను తగ్గించవచ్చు. అలా.. 20 వారాల్లో పూర్తిగా మందులు ఆపేయవచ్చు. ఆ తర్వాత కూడా సిరిధాన్యాలు తినటం, కషాయాలు కొనసాగిస్తే పూర్తిగా ఆరోగ్యవంతులై సంతోషంగా ఉండొచ్చు. థైరాయిడ్ ఎక్కువున్నా, తక్కువున్నా ఈ పద్ధతిని అనుసరించవచ్చు. ఎక్కువ ఉన్న వారికి నార్మల్కు రావడానికి ఎక్కువ కాలం పట్టొచ్చు. ప్రశ్న: నా వయసు 67 ఏళ్లు. 1998 నుంచి హైపోథైరాయిడ్ ఉంది. మధుమేహం ఉంది. మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాను. హోమియో మందుతో ఉపశమనం పొందుతున్నాను. నా ఆహార విధానం సిరిధాన్యాలలోకి మార్చుకుంటే మేలు జరుగుతుందా? –కె.నాగమల్లేశ్వరరావు, విశ్రాంత బ్యాంక్ మేనేజర్, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా డా. ఖాదర్‌వలి: 5 రకాల సిరిధాన్యాలు (కొర్ర, అండుకొర్ర, సామ, అరిక, ఊద) బియ్యాన్ని ఒక్కో రకాన్ని వరుసగా రెండేసి రోజుల చొప్పున తినాలి. గానుగలో స్వయంగా తీయించుకున్న కల్తీలేని కొబ్బరి నూనెను రోజూ ఉదయం 3 చెంచాలు తాగాలి. మెల్లిగా వాకింగ్ చేయాలి. మారేడు(బిల్వపత్రాల)ఆకుల కషాయం ఒక వారం, రావి ఆకుల కషాయం మరో వారం, వేప ఆకుల కషాయం తర్వాత వారం చొప్పున ఉదయం, సాయంత్రం వాడాలి. ప్రశ్న: సిరిధాన్యాలు, కషాయాలతో కేన్సర్ వ్యాధులకు చికిత్స గురించి జనవరి 25న సాక్షి ఫ్యామిలీలో సవివరమైన సమాచారం ఇచ్చినందుకు ‘సాక్షి’కి, డా.ఖాదర్ గారికి కృతజ్ఞతలు. మధుమేహం, ఆర్థరైటిస్ సంధివాతానికి, హెపటైటిస్–బికి ఏయే సిరిధాన్యాలు, కషాయాలు వాడాలో తెలియజేయండి. ఈ సిరిధాన్యాలు ఎక్కడ లభిస్తాయో చెప్పండి. –కె. ఎ. గోపాల్‌రెడ్డి, విశ్రాంత ఉపాధ్యాయుడు, సన్నకారు రైతు, కొంగనపాడు గ్రామం, కల్లూరు మం., కర్నూలు జిల్లా డా.ఖాదర్‌వలి: వీరికి కూడా పై సమాధానమే వర్తిస్తుంది. 5 రకాల సిరిధాన్యాలు (కొర్ర, అండుకొర్ర, సామ, అరిక, ఊద) బియ్యాన్ని ఒక్కో రకాన్ని వరుసగా రెండేసి రోజుల చొప్పున తినాలి. గానుగలో స్వయంగా తీయించుకున్న కల్తీలేని కొబ్బరి నూనెను రోజూ ఉదయం 3 చెంచాలు తాగాలి. మెల్లిగా వాకింగ్ చేయాలి. మారేడు(బిల్వపత్రాల)ఆకుల కషాయం ఒక వారం, రావి ఆకుల కషాయం మరో వారం, వేప ఆకుల కషాయం తర్వాత వారం చొప్పున ఉదయం, సాయంత్రం వాడాలి. సిరిధాన్యాలు ఎక్కడ లభిస్తాయి? డాక్టర్ ఖాదర్: సిరిధాన్యాల కోసం మీ దగ్గరలోని రైతుబజార్లలోనో, మరో చోటో సేంద్రియ ఆహారోత్పత్తులు అమ్మే దుకాణదాలు ఉంటాయి. వారిని సిరిధాన్యాలు కావాలని అడగండి. ప్రజలు దుకాణదారులను అడుగుతూ ఉంటే వాళ్లే తెప్పించి ఇవ్వడం ప్రారంభమవుతుంది. మీ ప్రాంతంలో రైతులను కూడా ప్రోత్సహించండి.. 5 రకాల సిరిధాన్యాలను సాగు చేయమని. నేనైతే అమ్మటం లేదు. రాయచూరులో ఆనంద్‌పాటిల్(097313 14333) అనే రైతు తాను ఐదేళ్లుగా సిరిధాన్యాలు ఐదు రకాలను పండించి, అమ్ముతున్నారు. విత్తనాలు ఇచ్చి ఇతర రైతులను కూడా ప్రోత్సహిస్తూ.. 5 రకాల సిరిధాన్యాలను విక్రయిస్తున్నారు. పార్శిల్/కొరియర్ ద్వారా కూడా పంపుతారు. అనారోగ్యానికి మీరు నిజంగా పరిష్కారం ఆశిస్తుంటే తప్పకుండా పాటించాల్సిన విషయాలు: డా. ఖాదర్ ► బియ్యం/గోధుమ పిండిని ముఖ్య ఆహారంగా తీసుకోవడం ఆపెయ్యాలి. వీటిలో పీచుపదార్ఢం–పిండిపదార్థం దామాషా చిరుధాన్యాలతో పోల్చినప్పుడు అతి తక్కువ. ► రోజువారీగా ప్రధాన ఆహారంగా చిరుధాన్యాలను తినండి. కొర్రలు, అండుకొర్రలు, సామలు, ఊదలు, అరికెలను రోజుకు ఒకటి చొప్పున తినండి. రోజులో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి పూటలు కూడా ఒకే రకం చిరుధాన్యాన్ని తినండి. ఔషధ గుణాలతో అనారోగ్యాన్ని పారదోలి, పూర్తి ఆరోగ్యాన్ని అందించటం ఈ 5 రకాల చిరుధాన్యాల వల్లనే సాధ్యమవుతుంది. ► మీ దేహానికి అవసరమైన పోషకాలను సరిపడినంతగా అందించడానికి, విషాలను బయటకు పంపడానికి ఒక రోజు ఒకే చిరుధాన్యం తినాలి. రోజులో మూడు పూటలూ ఒకే చిరుధాన్యాన్ని తినటం ఇందువల్ల అత్యవసరమని గుర్తించండి. ఆ తెల్లారి మరో రకం చిరుధాన్యాన్ని తినండి. ► ఆవు, గేదె, మేక తదితర జంతువుల పాలకు బదులుగా.. కొబ్బరి పాలు, నువ్వుల పాలు తయారు చేసుకొని వాడుకుంటే ఆరోగ్యం. జంతువుల పాలు తాగటం వెనువెంటనే ఆపెయ్యాలి. పాలు కలిపి తాగే టీ, కాఫీ, బూస్ట్, హార్లిక్స్.. అన్నీ ఆపెయ్యాలి. పెరుగు, మజ్జిగ తీసుకోవచ్చు. తిరిగి ఆరోగ్యం పొందడానికి ఇదే పరిష్కారం. జంతువుల పాల వల్ల మీ దేహంలో హార్మోన్ అసమతుల్యత వస్తున్నది. పాలు వాడటం ఆపెయ్యడంతోటే కనీసం 50% అనారోగ్యం పోతుంది. పాలను తోడేసినప్పుడు.. పెరుగుగా తోడుకునే క్రమంలో అందులోని రసాయనాల విషప్రభావాన్ని సూక్ష్మజీవరాశి నశింపచేస్తుంది. కాబట్టి పెరుగు, మజ్జిగ పర్వాలేదు. ► అల్లోపతి వైద్యులు యాంటీ బయోటిక్ మందులు ఇచ్చినన్నాళ్లు ఇస్తారు. అవి పనిచేయకపోతే, స్టెరాయిడ్స్ ఇస్తారు. అనారోగ్యం పెరుగుతుందే గాని, తగ్గదు. ఇది పరిష్కారం కాదు. ► హోమియో / ఆయుర్వేద మందులు వాడండి. ► నువ్వు పాల తయారీ విధానం: 100 గ్రాముల నువ్వులు తీసుకొని ఒకటిన్నర లీటర్ల నీటిలో బాగా నానబెట్టాలి. నానిన నువ్వులను రోలులో రెండు, మూడు సార్లు పొత్రంతో రుబ్బాలి. నువ్వులు నానబెట్టిన నీటినే పోస్తూ రుబ్బిన తర్వాత తీసి వస్త్రంలో వేసి పిండాలి. అలా మూడు, నాలుగు సార్లు రుబ్బి, పిండగా వచ్చిన పాలనే తిరిగి రోట్లో పోస్తూ మళ్లీ పిండితే.. చక్కని నువ్వు పాలు వస్తాయి. ఏ వయసు వారైనా వాడొచ్చు. గమనిక: డా. ఖాదర్‌వలి చికిత్స విధానాన్ని గురించి మరింత వివరంగా తెలుసుకోగోరే వారు Youtubeలో ఆయన వీడియోలను చూడవచ్చు. Doctor Khader, Siridhanyalu, Mysuru, Telugu అని టైప్ చేస్తే ఆయన ప్రసంగాలను చూసి అవగాహన పెంచుకోవచ్చు. స్వతంత్ర ఆహార శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ మార్చి మొదటి వారంలో హైదరాబాద్‌లో, వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పర్యటించి.. వివిధ సదస్సుల్లో ప్రసంగించనున్నారు. తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల వేదిక, ఇతర స్వచ్ఛంద సంస్థలు ఈ సదస్సులను నిర్వహిస్తున్నాయి. ప్రసంగాల అనంతరం సభికుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. అందరూ ఆహ్వానితులే. ప్రవేశం ఉచితం. సదస్సుల వివరాలు.. 2018 మార్చి 4వ తేదీ: సాయంత్రం 5 గంటలకు.. హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఆడిటోరియం. ఇతర వివరాలకు.. తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల వేదిక ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి (హైదరాబాద్) – 99638 19074 మార్చి 5వ తేదీ: ఉదయం 10 గంటలకు.. సత్యసాయి మందిరం.. వనపర్తి మార్చి 5వ తేదీ: సాయంత్రం 5 గంటలకు.. నారాయణ్‌పేట్ మార్చి 6వ తేదీ: ఉదయం 10 గంటలకు: చంద్ర గార్డెన్స్, జడ్చర్ల మార్చి 6వ తేదీ: సాయంత్రం 10 గంటలకు.. క్రౌన్ గార్డెన్స్, మహబూబ్‌నగర్.. వివరాలకు.. బసవరాజ్(మహబూబ్‌నగర్) – 93466 94156 మార్చి 7వ తేదీ: సికింద్రాబాద్‌లో ఉదయం, సాయంత్రం సదస్సులు జరుగుతాయి. వివరాలకు.. శివశంకర్ (హైదరాబాద్)– 94401 26778