మల్టిపుల్‌ ప్రయోజనాల మల్టీ గ్రెయిన్‌ ఆటా | Multiple Purpose Multi Grain Ataa | Sakshi
Sakshi News home page

మల్టిపుల్‌ ప్రయోజనాల మల్టీ గ్రెయిన్‌ ఆటా

Published Thu, Dec 5 2019 12:57 AM | Last Updated on Thu, Dec 5 2019 12:57 AM

Multiple Purpose Multi Grain Ataa - Sakshi

సాధారణంగా ఏదో ఒక ధాన్యపు పిండిని వాడటం మామూలే. కానీ ఇటీవల చాలామంది మల్టి గ్రెయిన్‌ ఆటాలను వాడుతున్నారు. ఏదో ఒక ధాన్యంతో చేసిన పిండి కాకుండా... చాలా రకాల ధాన్యాలను కలిపి దంచిన పిండినే ‘మల్టి గ్రెయిన్‌ ఆటా’ అంటున్నాం. ఓట్స్, గోధుమపిండి, కుసుమలు, పొట్టు తీయని మరికొన్ని తృణధాన్యాలు కలిపి ఈ పిండిని తయారుచేసుకోవచ్చు. ఇందులో కనిష్టంగా 3  – 5 మొదలుకొని, గరిష్ఠంగా 12 వరకు ధాన్యాలు కలిపి తయారు చేసుకోవచ్చు.

ప్రయోజనాలు...
చాలాసందర్భాల్లో ఒక రకం పిండిలో ఉన్న పోషకాలు మరోరకం పిండిలో లోపించవచ్చు లేదా చాలా తక్కువగా ఉండవచ్చు. రకరకాల ధాన్యాలను తీసుకొని వాటిని కలిపి పిండిగా చేసుకోవడం వల్ల మల్టి గ్రెయిన్‌ అనే ఒకే పిండిలోనే చాలా రకాల పోషకాలు దొరుకుతాయి.  ఈ పిండి వాడటం వల్ల దేహానికి అన్నిరకాల పోషకాలు అంది ఆరోగ్యం సమకూరుతుంది.

ప్రయోజనాలు పొందాలంటే...
దేహానికి అన్ని రకాల పోషకాలు అందేలా అన్ని ధాన్యాల సమష్టి ప్రయోజనాలు పొందాలంటే... కనీసం 10 రకాల ధాన్యాలను కలిపి మనమే స్వయంగా పిండిగా పట్టించుకోవడం మేలు.

ఎలా తయారు చేసుకోవాలంటే...
1    పైన పేర్కొన్న ధాన్యాలను విడివిడిగా వేయించుకోవాలి. (ఒక్క గోధుమలను మాత్రం వేయించకూడదు).
2    వేయించిన ధాన్యాలు చల్లబడే వరకు ఆరబెట్టాలి. ఆ తర్వాత గోధుమలతో కలపాలి.
3    అన్నింటినీ కలిపి మర ఆడించి, పిండి పట్టించుకోవాలి.
4    మర ఆడించిన పిండి వేడిగా ఉంటుంది. అది చల్లారేవరకు వేచి చూడాలి.
5    రెండుసార్లు జల్లెడ పట్టుకోవాలి.
6    జల్లెడ పట్టినప్పుడు జల్లెడలో మిగిలిన పదార్థాలను పారేయాలి.
7    జల్లెడ పట్టగా కింద మిగిలిన మెత్తటి పిండిని గాలి చొరని ఎయిర్‌టైట్‌ డబ్బాలో నిల్వ చేసుకుని అవసరమైనప్పుడు ఉపయోగించుకోవాలి.

ఈ జాగ్రత్త పాటించండి:

మార్కెట్‌లో లభ్యమయ్యే మల్టీ గ్రెయిన్‌ ఆటాలో వాణిజ్య ప్రయోజనాల కోసం చాలా మంది తేలిగ్గా లభ్యమయ్యే గోధుమ పిండినే ప్రధానంగానూ, ఎక్కువగానూ వాడి, మిగతా తృణధాన్యాలను తక్కువ మోతాదులో వాడుతుంటారు. దీని వల్ల మనం దాదాపు సాధారణ గోధుమ పిండిని వాడిన ప్రయోజనానికి మించి పెద్దగా ఉపయోగం పొందలేం. అందుకే మన మల్టి గ్రెయిన్‌ ఆటాను మనమే తయారుచేసుకునేలా మర పట్టించుకోవడం  మంచిది.
సుజాతా స్టీఫెన్‌ చీఫ్‌ న్యూట్రిషనిస్ట్‌
యశోద హాస్పిటల్స్, మలక్‌పేట, హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement