పాలు, మాంసం, ఇతర ప్రొటీన్ ఆహారం ఎక్కువగా వినియోగిస్తున్న ప్రజలు
తృణధాన్యాల నెలవారీ తలసరి వినియోగం 1999–2000లో గ్రామాల్లో 12.72, పట్టణాల్లో 10.42 కిలోలు
2022–23 నాటికి గ్రామీణంలో 9.61, పట్టణాల్లో 8.05 కిలోలు
2022–23 గృహవినియోగ వ్యయ సర్వేలో వెల్లడి
సాక్షి, అమరావతి: ప్రజలు తమ ఆదాయం పెరుగుతున్న కొద్ది ఆహార అలవాట్లలో మార్పులు చేసుకుంటూ వెళుతున్నారు. పాలు, మాంసం, గుడ్లు వంటి ఇతర ప్రొటీన్ ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా తృణధాన్యాల వినియోగం తగ్గుతోంది. గృహవినియోగ వ్యయ సర్వే 2022–23లో ఈ విషయం వెల్లడైంది. దేశవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 1999–2000 నుంచి 2022–23 మధ్య తృణధాన్యాల తలసరి వినియోగం క్రమంగా క్షీణించింది. 1999–2000లో నెలవారీ తలసరి తృణధాన్యాల వినియోగం గ్రామీణ ప్రాంతాల్లో 12.72, పట్టణ ప్రాంతాల్లో 10.42 కిలోలుగా ఉండేది. ఇది 2022–23లో గ్రామాల్లో 9.61, పట్టణాల్లో 8.05 కిలోలకు పడిపోయింది.
పశ్చిమబెంగాల్‌లో అధికం
రాష్ట్రాల వారీగా తృణధాన్యాల వినియోగం పరిశీలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో 11.23 కిలోలతో పశ్చిమబెంగాల్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఒడిశా 11.21 కిలోలు, బీహార్ 11.14 కిలోలు, ఛత్తీస్‌గఢ్ 10.27 కిలోలతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. అదే పట్టణ ప్రాంతాల్లో వినియోగం బిహార్‌లో 10.45 కిలోలు, ఛత్తీస్‌గఢ్‌లో 10.43, జార్ఖండ్‌లో 9.59 కిలోలు. గ్రామీణ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్‌లో 9.30 కిలోలు, తెలంగాణలో 10.11, పట్టణాల్లో ఆంధ్రప్రదేశ్‌లో 8.29, తెలంగాణలో 8.77 కిలోల చొప్పున వినియోగిస్తున్నారు.
బియ్యానిదే పైచేయి
మొత్తం తృణధాన్యాల వినియోగంలో బియ్యం వాటా ఎక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా గ్రామాల్లో 9.61 కిలోల నెలవారీ తలసరి వినియోగంలో 55.35 శాతం బియ్యం, 40.93 శాతం గోధుమ, 3.48 శాతం ముతక, 0.22 శాతం ఇతర తృణధాన్యాలు ఉన్నాయి. పట్టణాల్లో 8.05 కిలోల నెలవారీ తలసరి వినియోగంలో 53.20 శాతం బియ్యం, 44.53 శాతం గోధుమ, 2.09 శాతం ముతక, 0.19 ఇతర తృణధాన్యాలు ఉన్నాయి. ఏపీలోని వినియోగిస్తున్న మొత్తం తృణధాన్యాల్లో గ్రామీణ ప్రాంతాల్లో 92.22 శాతం, పట్టణాల్లో 90.55 శాతం బియ్యం వాటా నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment