నీళ్లు, విద్యుత్, మందులు, ఆహారం ఏవీ లేవు
కాపాడండని కేకలు వేస్తే బాబు చేతులూపుతూ వెళ్లారు
ముంపు ప్రాంతాల బాధితుల ఆవేదన
సాక్షి, అమరావతి: ‘ఈ ప్రభుత్వం మా కోసం ఏం చేస్తోందో అర్థం కావడం లేదు. గుక్కెడు మంచి నీళ్లు కూడా ఇవ్వట్లేదు. ఇళ్లు మునిగిపోయి.. ఆహారం, మందులు, విద్యుత్ లేక పిల్లలతో, వృద్ధులతో తీవ్ర అవస్థలు పడుతున్నాం. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో లేదో అర్థం కావడం లేదు’ అని విజయవాడలోని ముంపు ప్రాంతాల బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లు మునిగిపోయి తాము ఏడుస్తుంటే.. సీఎం చంద్రబాబు పడవలో అటూ, ఇటూ తిరుగుతూ చేతులూపుకుంటూ వెళ్లిపోతున్నారని వాపోయారు. తమను సురక్షిత ప్రాంతాలకు చేర్చే ప్రయత్నాలు ఎందుకు చేయట్లేదంటూ బాధితులు కన్నీరు పెట్టుకున్నారు.
విజయవాడలోని కుమ్మరిపాలెం సమీపంలో ఉన్న లోటస్ లెజెండ్ అపార్ట్‌మెంట్ మొదటి అంతస్తు నీట మునిగింది. దీంతో అపార్ట్‌మెంట్ వాసులు బయటకు వచ్చే పరిస్థితి లేక ఆకలితో అలమటిస్తున్నారు. 193 కుటుంబాలు ఉంటున్న తమ అపార్ట్‌మెంట్ నీటిలో చిక్కుకుంటే.. ప్రభుత్వం గాలికి వదిలేసిందని గోనుగుండ్ల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజులుగా తాగునీరు, విద్యుత్ లేదని వాపోయారు. తమ క్షేమ సమాచారం బయటి ప్రాంతాల్లో ఉన్న కుటుంబ సభ్యులకు చెబుదామన్నా, సెల్‌ఫోన్‌లు పని చేయక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని గణేశ్ అనే బాధితుడు వాపోయాడు. ప్రభుత్వం పట్టించుకోలేదని.. పడవ వాళ్లకు చెప్పి బయటి నుంచి 400 ఆహార పొట్లాలు తెప్పించుకుంటుంటే దారిలోనే పోలీసులు అడ్డుకున్నారని వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. హృద్రోగంతో బాధ పడుతున్నానని, మందుల కోసం పడవ వాళ్లను అడిగితే రూ.వెయ్యి అడుగుతున్నారని నాగేశ్వరమ్మ వాపోయింది. న్యూ ఆర్‌ఆర్‌లో వరదలో చిక్కుకున్న తమను ఒడ్డుకు చేర్చాలని ప్రభుత్వ బోట్ల వాళ్లను అడిగితే మనిషికి రూ.వెయ్యి అడుగుతున్నారని ఎ.రవికుమార్ వాపోయాడు. పాత ఆర్‌ఆర్‌పేటలోని జేపీ అపార్ట్‌మెంట్‌లో 300 కుటుంబాలకు పైగా ఉంటున్నాయని, తాగు నీరు, ఆహారం లేక ఇబ్బంది పడుతున్నామని రామాంజనేయులు ఆవేదన వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment