బుడమేరు వరదల్లో గల్లంతైన వ్యక్తి మృతి
15 రోజుల తర్వాత ముళ్ల చెట్టుకు వేలాడుతూ బయటపడిన మృతదేహం
క్షేమంగా తిరిగొస్తాడని ఇప్పటి దాకా కుటుంబ సభ్యుల ఎదురు చూపులు
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): ఎక్కడో ఒకచోట బతికే ఉంటాడు.. క్షేమంగా తిరిగొస్తాడు.. అని ఎదురు చూసిన వారి ఆశలు ఆవిరయ్యాయి. 15 రోజుల కిందట వరదలో కొట్టుకుపోయిన వ్యక్తి విగత జీవిగా కనిపించడంతో కుటుంబ సభ్యులు గుండెలు బాదుకున్నారు. కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆర్‌ఆర్‌పేటకు చెందిన పోలినాయుడు ముఠా కూలీ. అతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ నెల ఒకటో తేదీన ఉదయం పది గంటల సమయంలో తన పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా సింగ్‌నగర్, న్యూఆర్‌ఆర్‌పేట పరిసర ప్రాంతాలన్నీ బుడమేరు వరద ముంపునకు గురవుతున్నాయని తెలుసుకున్నాడు.
ఇంట్లో వారికి ఫోను చేసి మరో పది నిమిషాల్లో సింగ్‌నగర్ దాటి ఇంటికి వచ్చేస్తున్నానని చెప్పాడు. ఈ క్రమంలో తన స్నేహితుడితో కలిసి న్యూ ఆర్‌ఆర్‌పేటలోని బుడమేరుపై ఉన్న వంతెన దాటుతుండగా ఒక్కసారిగా వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. అతని స్నేహితుడు అతి కష్టం మీద బయటపడి విషయాన్ని పోలినాయుడు కుటుంబ సభ్యులకు, పోలీసులకు, అధికారులకు తెలియజేశాడు. అధికారులు ఎంత గాలించినా ఆచూకీ లభించలేదు. వరద ప్రవాహానికి ఎక్కడైనా వెళ్లి బయటపడి ఉంటాడని, క్షేమంగా తిరిగొస్తాడని ఆశతో ఎదురు చూస్తున్నారు.
అయితే ఆదివారం ఉదయం పోలినాయుడు గల్లంతైన ప్రదేశంలోని దేవినేని వెంకటరమణ మున్సిపల్ హైస్కూల్ వద్ద ఓ మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలినాయుడు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూడగా ముళ్ల చెట్ల మధ్యలో ఆయన ఒక చెట్టుకొమ్మను గట్టిగా పట్టుకుని నీటిలో పడి ఉన్నాడు. చేతికి ఉన్న ఉంగరం, దుస్తులను బట్టి కుటుంబ సభ్యులు పోలినాయుడేనని నిర్ధారించుకున్నారు. విషయాన్ని సింగ్‌నగర్ పోలీసులకు తెలియజేయగా వారు మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైఎస్సార్‌సీపీ నేత కాళ్ల ఆదినారాయణ వారి కుటుంబ సభ్యులకు అండగా నిలిచి అంత్యక్రియలు జరిపించారు.
వరద వదిలినా.. ఆ తల్లీ కొడుకుల్ని మృత్యువు వదల్లేదు
రామవరప్పాడు (విజయవాడ రూరల్): విజయవాడ పాత రాజీవ్‌నగర్‌కు చెందిన ఓ కుటుంబాన్ని బుడమేరు వరద ముంచేసింది. ఆ ముంపునుంచి తప్పించుకున్నా.. చివరకు లారీ రూపంలో దూసుకొచి్చన మృత్యువు తల్లీ కొడుకుల్ని మింగేసింది. విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడులో ఆదివారం రాత్రి లారీ ఢీకొన్న ఘటనలో స్కూటర్‌పై వెళ్తున్న పాతరాజీవ్‌నగర్ వాసులు లింగమనేని కృష్ణకుమారి (63), ఆమె కుమారుడు ప్రభుకుమార్ మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే.. బుడమేరు వరద కారణంగా పాత రాజీవ్‌నగర్‌లోని కృష్ణకుమారి ఇల్లు నీట మునిగింది.
దీంతో ఆ కుటుంబం గుణదలలో ఉంటున్న కృష్ణకుమారి సోదరుడి ఇంటి వద్ద ఆశ్రయం పొందుతోంది. ప్రభుకుమార్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. వరద ముంపు తగ్గడంతో తమ ఇంటిని రెండు రోజుల నుంచి శుభ్రం చేసుకుంటున్నారు. ఆదివారం కూడా ఇంటిని శుభ్రం చేసుకున్న అనంతరం తల్లీకుమారులు స్కూటర్‌పై గుణదల బయలుదేరారు. రామవరప్పాడు రింగ్ సమీపంలో లారీని గమనించక వారు కుడి వైపునకు మళ్లారు. లారీ ఆ స్కూటర్‌ను ఢీకొట్టడంతో తీవ్రగాయాలైన తల్లీకుమారులు ఘటనాస్థలంలోనే మృతిచెందారు.
Comments
Please login to add a commentAdd a comment