బుడమేరు వరదల వల్ల నీట మునిగిన 15 వేలకుపైగా ఆటోలు
ప్రభుత్వ రికార్డుల ప్రకారం కేవలం 4,348 ఆటోలకే పరిహారం
చాలా మంది పేర్లు బాధితుల జాబితాలోనే లేవు.. ఉన్నా కొందరికి డబ్బులు పడలేదు
సమయం పడుతుందని చెప్పి తప్పించుకుంటున్న బీమా సంస్థలు
రెండు వారాల్లోనే క్లెయిమ్‌లు పూర్తి చేసేలా బీమా సంస్థలతో మాట్లాడామంటున్న ప్రభుత్వం
ఒక్కో ఆటో మరమ్మతులకే రూ.12 వేల నుంచి రూ.75 వేల వరకూ వ్యయం
రోజుల తరబడి మెకానిక్ షెడ్ల వద్దే పడి ఉండటంలో ఆటో డ్రైవర్లకు పోయిన ఉపాధి
ఆదుకుంటామన్న ప్రభుత్వం నిలువునా ముంచేసిందంటున్న బాధితులు
బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్
సాక్షి, అమరావతి: ‘అటో డ్రైవర్ కె.శివారెడ్డి ఊర్మిళనగర్ రెండో లైనులో అద్దె ఇంటిలో నివసిస్తున్నాడు. ఇటీవల వచ్చిన బుడమేరు వరదలకు ఆ ఇల్లు మునిగిపోయింది. జీవనాధారమైన ఆటోతో పాటు ద్విచక్రవాహనం పూర్తిగా పాడైపోయాయి. సచివాలయ సిబ్బంది వచ్చి వివరాలు నమోదు చేసుకుని వెళ్లారు. కానీ ఇంత వరకూ ఒక్క రూపాయి కూడా పరిహారం రాలేదు. అప్పు చేసి ఆటోకు మరమ్మతులు చేయించుకుంటే రూ.45 వేలు ఖర్చయింది. ఇంటికిగానీ, వాహనాలకు గానీ పరిహారం ఇప్పించాలంటూ కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నాడు.
పదహారేళ్లుగా ఇదే ప్రాంతంలో ఆటో నడుపుతున్న నా పేరు ఎందుకు జాబితాలో లేదని ఎవరిని అడిగినా సమాధానం చెప్పడంలేదని వాపోతున్నాడు.’’...ఇది బుడమేరు వరదల్లో ఆటోలను కోల్పోయిన వేలాది మంది డ్రైవర్ల ఆవేదన. నగరంలో తిరిగే ఆటోలలో అతకధికం సింగ్ నగర్, ఇందిరానాయక్ నగర్, పాయకాపురం, కండ్రిగ, వాంబేకాలనీ, మిల్క్ ప్రాజెక్ట్, డాబా కోట్లు సెంటర్, రాజరాజేశ్వరిపేట, నందమూరి కాలనీ, భరతమాత కాలనీ, ఊరి్మళనగర్‌ల నుంచే వస్తున్నాయి. అక్కడి నిరుద్యోగులు డ్రైవర్లుగా మారి జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు వారందరి జీవితాలు అస్తవ్యస్ధంగా మారాయి. ఈ నేపధ్యంలో ఆ ప్రాంతాల్లో పర్యటించి బాధితుల బతుకు చిత్రంపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ ఇది.
మరమ్మతులకు కొత్త అప్పులు
రోజుల తరబడి ముంపులోనే ఉండటంతో ఆటోలు పూర్తిగా దెబ్బతిన్నాయి. బయట మెకానిక్ దగ్గర నుంచి కంపెనీ షోరూమ్ వరకూ ఒక్కో దాని మరమ్మతులకే రూ.12 వేల నుంచి రూ.75 వేల వరకూ వ్యయం అవుతోంది. రేడియేటర్, ఇంజిన్, బ్యాటరీతో పాటు బీఎస్ 6 వాహనాల్లో సెన్సార్లు పాడవ్వడంతో ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఇన్ని వాహనాలకు మరమ్మతులు చేసేందుకు మెకానిక్‌ల కొరత ఉండటంతో రోజుల తరబడి మోటార్ షెడ్ల వద్దే ఆటోలు పడి ఉంటున్నాయి. ఒకసారి మరమ్మతు చేసినా మళ్లీ మళ్లీ కొత్త లోపాలు బయటపడుతున్నాయి.
దీంతో కొత్త అప్పులు చేసి మరమ్మతులకు వెచి్చస్తున్నారు. ఉపాధి లేక, కుటుంబాలను పోషించుకోలేక, వాయిదాలు కట్టలేక అవస్థలు పడుతున్నామని డ్రైవర్లు నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. ఓట్లేయించుకున్న రాష్ట్ర ప్రభుత్వంగానీ, స్థానిక ప్రజాప్రతినిధులుగానీ తమను అసలు పట్టించుకోవడం లేదని కన్నీరుమున్నీరవుతున్నారు.
బీమా సంస్థల కొర్రీలు
వరద నీటిలో మునిగిన ఆటోలకు క్లెయిమ్‌లు ఎగవేసేందుకు బీమా సంస్థలు ఉన్న అన్ని అవకాశాలనూ వాడుకుంటున్నాయి. బీమా చేసే సమయంలో డ్రైవర్ల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారికి తెలియని షరతులను పొందుపరిచి వాటిని ఇప్పుడు సాకుగా చూపిస్తున్నాయి. ఒక ఆటోకి బీమా రావాలంటే సుమారు రెండు నెలలు సమయం పడుతుందని తప్పించుకుంటున్నాయి. అదికూడా వరద వచి్చనప్పటి నుంచి ప్రతి దశలోనూ తీసిన ఫొటోలు, వీడియోలు ఉంటేనే బీమా వర్తిస్తుందని మెలికపెడుతున్నాయి.
ప్రాణాలే కాపాడుకుంటామా, ఫొటోలు తీస్తామా అంటూ బాధితులు అడుగుతుంటే బీమా సంస్థలు సమాధానం చెప్పడం లేదు. రెండు వారాల్లోనే క్లెయిమ్‌లు పూర్తి చేసేలా బీమా సంస్థలతో మాట్లాడామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. ఆచరణలో మాత్రం అది శూన్యం. బీమా సంస్థలు కనీసం 45 రోజుల పాటు ఆటోను ఉన్న చోటు నుంచి కదపకుండా ఉంచాలని చెప్పాయి. అప్పటి వరకూ మరమ్మతు చేయకపోతే మొత్తానికే పనికిరాదని, ప్రభుత్వం ఈ విషయంలో పట్టించుకోవడం లేదని డ్రైవర్లు ఆవేదన చెందుతున్నారు.
పరిహారం లేదు
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సెప్టెంబర్ 1న విజయవాడలో వదర విలయం సృష్టించింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వారి జీవనాధారాలైన ఆటోలు, మోటార్ సైకిళ్లు వరద నీటిలో పూర్తిగా మునిపోయాయి. రోజుల తరబడి బురద నీటిలోనే నానిపోవడంతో ఇంజిన్, సెన్సార్లు,కార్బొరేటర్ వంటి ముఖ్యమైన భాగాలు దెబ్బతిన్నాయి. ఆటోకి రూ.10 వేలు, ద్విచక్ర వాహనానికి రూ.3 వేలు చొప్పున పరిహారం ఇస్తామన్న ప్రభుత్వం రకరకాల కొర్రీలతో మూడొంతుల మందిని మోసం చేసింది. ఆటో నడిపితేగానీ పూటగడవని నిరుపేదలు వాటిని బాగు చేసుకోలేక, కుటుంబాన్ని పోషించుకోలేక ప్రభుత్వ కార్యాలయాలు,అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
బుడమేరు వరదల వల్ల దాదాపు 15 వేలకుపైగా అటోలు నీట మునిగితే ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం కేవలం 6,515 మాత్రమే ఉన్నట్టు రవాణా శాఖ అధికారులు వెల్లడించారు. వీటిలో 4,348 ఆటోలకు పరిహారం అందించినట్లు ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేశారు. కానీ వాస్తవానికి మొత్తం బాధితుల్లో దాదాపు 80 శాతం మంది ఆటోవాలాలకు నష్టం పరిహారం అందలేదని బాధితులు చెబుతున్నారు. చాలా మంది పేర్లు బాధితుల జాబితాలోనే లేవు..కొందరి పేర్లు ఉన్నా వారికి డబ్బులు పడలేదు.
ఎవరూ పట్టించుకోవట్లేదు
‘‘వరదల్లో ఇల్లు మునిగిపోయింది. ఆటో బాగా బెబ్బతింది. ప్రస్తుతానికి నడిచేలా చేయడానికి రూ.8 వేలు ఖర్చయ్యింది. ప్రభుత్వం రూ.10 వేల ఇస్తామని చెప్పింది. కానీ మా వివరాలను నమోదు చేయడానికి కూడా ఎవరూ రాలేదు. సచివాలయంలో అడిగితే కలెక్టరేట్‌కు వెళ్లమని చెప్పారు. అక్కడికి వెళితే ఎవరూ పట్టించుకోవడం లేదు.’’ –లింగయ్య, ఆటో డ్రైవర్, రాజీవ్‌నగర్ కాలనీ
జీవనాధారం పోతే పరిహారం రాదా?
‘‘ఆటో నడిపితేగానీ మా కుటుంబం నడవదు. వరదల వల్ల ఆటో మునిగిపోయి జీవనాధారాన్ని కోల్పోయాం. బీమా రావాలంటే 45 రోజులు ఆటోను వాడకూడదంటున్నారు. బాగు చేయించుకునే స్తోమత కూడా లేదు. అయినా జాబితాలో మా పేరు లేదంటున్నారు. సచివాలయానికి వెళ్లి అడిగితే తమకేమీ తెలియని చెబుతున్నారు. మా గోడును ఎవరికి చెప్పుకోవాలి. మమ్మల్ని ఆదుకునేవారెవరు.’’ –బాబ్జి, ఆటో డ్రైవర్, రాజరాజేశ్వరిపేట
అద్దె ఆటోనే ఆధారం
‘‘నేను ఆటోను అద్దెకు తీసుకుని నడుపుతున్నాను. వరదకు ఆటో మునిగిపోయింది. ఎలాంటి పరిహారం రాలేదు. ఎవరిని అడిగినా ఎలాంటి ఉపయోగం లేదు.ఏం చేయాలో తెలియడం లేదు.’’ –దుర్గారావు, ఆటో డ్రైవర్, వాంబేకాలనీ.
చాలా ఖర్చవుతోంది
‘ఇంటర్ చదివి ఆటో నడుపుతున్నాను. మా నాన్న కూడా ఆటో డ్రైవరే. రెండు ఆటోలూ వరదలో మునిగిపోయాయి.ఒక సారి రిపేరుకి రూ.12 వేలు ఖర్చయ్యింది. కానీ మళ్లీ రేడియేటర్ పాడయ్యింది. నాలుగు రోజులుగా మెకానిక్ దగ్గరే పెట్టి బాగుచేయిస్తున్నాం.’’ –వై.సాయి, ఆటో డ్రైవర్, పాయకాపురం.
Comments
Please login to add a commentAdd a comment