పరిహారం విషయంలోనూ శాస్త్రీయంగా ఆలోచన
17న బాధితులకు సాయం
వరద నష్టం ఎన్యూమరేషన్, పరిహారంపై సీఎం చంద్రబాబు సమీక్ష
సాక్షి, అమరావతి: వరద నష్టం ఎన్యూమరేషన్ పక్కాగా జరగాలని, నష్టపోయిన ప్రతి బాధితునికి ప్రభుత్వ సాయం అందేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వరద నష్టం ఎన్యూమరేషన్, బాధితులకు పరిహారంపై సీఎం చంద్రబాబు శుక్రవారం సచివాలయంలో మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు.
వరదల కారణంగా 2,13,456 ఇళ్లు నీట మునిగాయని, ఇప్పటి వరకు 84,505 ఇళ్లలో నష్టం అంచనా లెక్కలు పూర్తయ్యాయని అధికారులు వివరించారు. వేలాది ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు పాడైపోయాయని, 2,14,698 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని, ఎన్యూమరేషన్లో రీ వెరిఫికేషన్ చేసి ప్రతి బాధితుడికి జరిగిన నష్టాన్ని సేకరిస్తున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సహాయక చర్యలపై ప్రజలు సంతృప్తితో ఉన్నారని, పరిహారం విషయంలో కూడా శాస్త్రీయంగా ఆలోచన చేసి జాబితా రూపొందించాలని సూచించారు. నష్టం అంచనాలు పూర్తి చేస్తే ఈ నెల 17వ తేదీన బాధితులకు సాయం అందజేద్దామని పేర్కొన్నారు.
రుణాలు రీషెడ్యూల్ చేయండి: సీఎం
వరద బాధితులకు వివిధ ఏజెన్సీలు అందించే సర్వీసులపై శుక్రవారం సాయంత్రం విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎంఎస్‌ఎంఈలు నడుపుతున్న వ్యాపారులు తీవ్రంగా దెబ్బతిన్నారని, వారి బ్యాంక్ రుణాలు రీ షెడ్యూల్ చేయాలని, ఈఎంఐల చెల్లింపునకు గడువు ఇవ్వాలని బ్యాంకర్లకు సూచించారు.
ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు శుక్రవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లారు. విజయవాడలోని కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష అనంతరం ఆయన బయలుదేరి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment