శ్రీకాకుళం నుంచి ప్రకాశం వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి
ఏలేరు రిజర్వాయర్‌కు వరద నీరు పోటెత్తింది
పిఠాపురానికీ ముప్పు
కొల్లేరు వరదతో నందివాడకు ముంపు ప్రమాదం
సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: వరద నష్టాలను ప్రాథమికంగా అంచనా వేసి కేంద్రానికి నివేదిక పంపినట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. వరద వల్ల రాష్ట్రానికి రూ.6,880 కోట్ల నష్టం కలిగినట్టు ప్రాథమికంగా అంచనా వేశామని, ఈ మేరకు తక్షణ సాయం అందించాల్సిందిగా కేంద్రాన్ని కోరినట్టు తెలిపారు. ఆదివారం విజయవాడ కలెక్టరేట్‌లో మీడియాతో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ వినాయక చవితి రోజు బుడమేరు మూడో గండిని ఆర్మీ సాయంతో విజయవంతంగా పూడ్చినట్టు చెప్పారు. వరద వచ్చి వారం రోజులైనా తగ్గకపోవడంతో ప్రజలు ఆవేశంగా ఉన్నారని, శనివారం కూడా రాజరాజేశ్వరిపేటలో 4 అడుగుల నీరు ఉందని వ్యాఖ్యానించారు.
రెండు రోజుల వర్షాలపై అప్రమత్తం చేశాం
రానున్న రెండు రోజుల్లో శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించినట్టు సీఎం చెప్పారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనుండటంతో ఏలేరు రిజర్వాయర్ నిండి దిగువ ప్రాంతమైన పిఠాపురం పరిసర ప్రాంతాలకు వరద ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఏలేరు నదికి సోమ, మంగళ వారాల్లో 10 వేల నుంచి 20 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే ఏలేరు రిజర్వ్‌యర్‌లో 21 టీఎంసీల నీరు ఉండటంతో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. బుడమేరు నుంచి వరద కొల్లేరుకు చేరుతుండటంతో నందివాడ మండలం ముంపునకు గురయ్యే అవకాశం ఉందన్నారు. విజయవాడ ముంపు ప్రాంతాల్లో వరద నీరు క్రమేపీ తగ్గుతోందని, వర్షాలు లేకపోతే సోమవారం సాయంత్రానికి మొత్తం నీరు లాగేస్తుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. రానున్న 36 గంటల్లో ఎంత వర్షం నీరు వస్తుందన్న అంచనాలు వేసుకుని దానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్టు తెలిపారు.
ఆపరేషన్ బుడమేరు
భవిష్యత్‌లో విజయవాడకు వరద భయం లేకుండా ఆపరేషన్ బుడమేరు చేపడుతున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. బుడమేరు చుట్టుపక్కల ఆక్రమణలు తొలగించి నీరు వేగంగా వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. బుడమేరు సామర్థ్యాన్ని 10–15 వేల క్యూసెక్కులకు పెంచే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment