వరద ప్రాంతాల్లో కరెంటు బిల్లులు వాయిదా
కుళాయి నీళ్లు రెండు రోజులు తాగడానికి, వంటకు వాడొద్దు
నేటి నుంచి 80,000 మందికి ఆహారం ప్యాకేజీ
రెండు రోజుల్లో రేషన్, శానిటైజేషన్ పూర్తి చేస్తాం: సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: వరద ముంపు ప్రాంతంలో దెబ్బతిన్న వ్యాపారులు, నష్టపోయిన ఇంటి వస్తువులను అంచనా వేయడానికి ప్రత్యేక యాప్ ద్వారా సర్వే చేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. తాము తిరిగి నిలదొక్కుకోగలము అన్న ధీమా కల్పించేలా బాధితులకు ప్యాకేజీని రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఆయన గురువారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఇంట్లో చెడిపోయిన వస్తువులను బాగు చేయడానికి వర్కర్లను ఏర్పాటు చేస్తామని, అవసరమైతే ఉబరైజేషన్ (ఆన్‌లైన్ ద్వారా వినియోగదారులకు సేవలందించే సంస్థలు) సేవలను కూడా వినియోగించుకుంటామని తెలిపారు.
వరద ప్రాంతాల్లో ఈ నెల విద్యుత్ బిల్లులను వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. తక్షణం కుళాయిల ద్వారా మంచి నీటిని సరఫరా చేస్తున్నా, వాటిని రెండు రోజుల పాటు వంటకు, తాగడానికి వినియోగించవద్దని సూచించారు. రెండు రోజుల్లోగా రేషన్, శానిటేషన్, టెలీకమ్యూనికేషన్, విద్యుత్ సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామన్నారు.
శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు రోజుకు 80,000 మందికి చొప్పున నూడుల్స్ ప్యాకెట్లు, ఆరు యాపిల్స్, ఆరు బిస్కట్లు, పాలు, వాటర్ బాటిళ్లు అందిస్తామని, చౌకగా కూరగాయలు కూడా అందించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. బుడమేరులో వరద తిరిగి కొద్దిగా పెరుగుతోందని, 6,000 క్యూసెక్కుల వరకు వస్తే నగరంలోకి తిరిగి కొద్దిగా నీళ్లు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. మూడో గండి కూడా పూడిస్తే నగరంలోకి నీళ్లు వచ్చే ప్రమాదం తప్పిపోతుందన్నారు. ఈ గండిని పూడ్చడానికి ఆర్మీ రంగంలోకి దిగినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment