Estimation
-
నష్టం అంచనాకు ప్రత్యేక యాప్
సాక్షి, అమరావతి: వరద ముంపు ప్రాంతంలో దెబ్బతిన్న వ్యాపారులు, నష్టపోయిన ఇంటి వస్తువులను అంచనా వేయడానికి ప్రత్యేక యాప్ ద్వారా సర్వే చేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. తాము తిరిగి నిలదొక్కుకోగలము అన్న ధీమా కల్పించేలా బాధితులకు ప్యాకేజీని రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఆయన గురువారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఇంట్లో చెడిపోయిన వస్తువులను బాగు చేయడానికి వర్కర్లను ఏర్పాటు చేస్తామని, అవసరమైతే ఉబరైజేషన్ (ఆన్లైన్ ద్వారా వినియోగదారులకు సేవలందించే సంస్థలు) సేవలను కూడా వినియోగించుకుంటామని తెలిపారు.వరద ప్రాంతాల్లో ఈ నెల విద్యుత్ బిల్లులను వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. తక్షణం కుళాయిల ద్వారా మంచి నీటిని సరఫరా చేస్తున్నా, వాటిని రెండు రోజుల పాటు వంటకు, తాగడానికి వినియోగించవద్దని సూచించారు. రెండు రోజుల్లోగా రేషన్, శానిటేషన్, టెలీకమ్యూనికేషన్, విద్యుత్ సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామన్నారు. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు రోజుకు 80,000 మందికి చొప్పున నూడుల్స్ ప్యాకెట్లు, ఆరు యాపిల్స్, ఆరు బిస్కట్లు, పాలు, వాటర్ బాటిళ్లు అందిస్తామని, చౌకగా కూరగాయలు కూడా అందించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. బుడమేరులో వరద తిరిగి కొద్దిగా పెరుగుతోందని, 6,000 క్యూసెక్కుల వరకు వస్తే నగరంలోకి తిరిగి కొద్దిగా నీళ్లు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. మూడో గండి కూడా పూడిస్తే నగరంలోకి నీళ్లు వచ్చే ప్రమాదం తప్పిపోతుందన్నారు. ఈ గండిని పూడ్చడానికి ఆర్మీ రంగంలోకి దిగినట్లు తెలిపారు. -
దుమ్ము లేపిన అమ్మకాలు.. పదిహేనేళ్ల రికార్డు బద్ధలయ్యేనా?
ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ ఎంతగా పెరుగుతుందో దేశం మొత్తం చూస్తోంది. గత రెండేళ్లలో అమ్మకాలు పెరుగుతూ వస్తున్నాయి. 2020లో ఈవీ వెహికిల్స్ అదీ టూ వీలర్స్ అమ్మకాలు 1,00,736 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇక 2021లో ఎలక్ట్రిక్ టూ వీలర్ల (ఈ2డబ్ల్యూ) విక్రయాలు దేశీయంగా 2,33,971 యూనిట్లుగా నమోదయ్యాయి. అంటే డబుల్ అయ్యిందన్నమాట. మరి ఈ ఏడాది ఎలా ఉండబోతోంది?.. ఈవీ మార్కెట్ అంచనా వేస్తున్నట్లు పదిహేనేళ్ల రికార్డు.. ఈ ఒక్క ఏడాదిలోనే బద్ధలు కానుందా? సాక్షి, న్యూఢిల్లీ: ఈ ఏడాది(2022)లో ఏకంగా 10 లక్షలకు యూనిట్ల మేర అమ్ముడు పోవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. అంటే గత 15 ఏళ్లలో అమ్ముడైన వాటికి ఇది సమానమన్నమాట. ఇది సాధమ్యేనా? అవుననే అంటోంది ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థల సొసైటీ (ఎస్ఎంఈవీ). ఈ మేరకు పలు అంచనాలతో కూడిన నివేదికను గురువారం విడుదల చేసింది. ‘గతంలో ఎన్నడూ లేనంతగా కొద్ది నెలలుగా ఈవీలకు మంచి రోజులు చూస్తున్నాం. గత 15 ఏళ్లలో మేము మొత్తం 10 లక్షల ఈ2డబ్ల్యూలు, ఈ–త్రీ వీలర్లు, ఈ–కార్లు, ఈ–బస్సులు విక్రయించాం. అయితే, 2022 జనవరితో మొదలుపెట్టి ఈ ఒక్క ఏడాదే దాదాపు అదే స్థాయిలో 10 లక్షల వాహనాలను విక్రయించే అవకాశాలు ఉన్నాయి‘ అని ఎస్ఎంఈవీ డైరెక్టర్ జనరల్ సోహిందర్ గిల్ చెబుతున్నారు. సానుకూలంగా ఈవీ విధానం.. ఎలక్ట్రిక్ వాహన విధానంలో ప్రభుత్వం ఇటీవల సానుకూల మార్పులు చేసిందని గిల్ పేర్కొన్నారు. ఖరీదైన ద్రవ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించుకుని పర్యావరణ అనుకూలమైన, స్వచ్ఛమైన రవాణా విధానాల అమలుకు కేంద్రం నిర్ణయాత్మక చర్యలు తీసుకుందని ఆయన పేర్కొన్నారు. ఆకర్షణీయమైన ధరలు, తక్కువ ఇంధన వ్యయాలు, చౌకగా నిర్వహణ తదితర అంశాల కారణంగా కస్టమర్లు పెద్ద సంఖ్యలో పెట్రోల్ ద్విచక్ర వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లడం ప్రారంభమైందని గిల్ పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ టూ వీలర్లను ఎంచుకోవడంలో పర్యావరణపరమైన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆయన వివరించారు. ఇటీవలి నెలవారీ ధోరణులు చూస్తుంటే .. గడిచిన పన్నెండు నెలలతో పోల్చి చూస్తే వచ్చే 12 నెలల్లో విక్రయాల వృద్ధి అయిదు నుంచి ఆరు రెట్లు అధికంగా ఉండొచ్చని గిల్ అంచనా వేస్తున్నారు. వచ్చే రెండు–మూడేళ్లలో దేశీయంగా ఈ–స్కూటర్లు, ఈ–మోటర్‌సైకిళ్లు, ఈ–సైకిళ్లు వంటి అన్ని విభాగాల్లో.. పెద్ద కంపెనీల నుంచి కూడా ఉత్పత్తులు ఉండగలవని ఆయన తెలిపారు. ‘వచ్చే నాలుగైదు ఏళ్లలో ద్విచక్ర వాహనాల మార్కెట్లో 30 శాతం దాకా వాటా ఎలక్ట్రిక్ వాహనాలది ఉంటుందని ధీమాగా చెప్పవచ్చు‘ అని గిల్ వివరించారు. హై–స్పీడ్ వాహనాలకే ఓటు.. ఎస్ఎంఈవీ గణాంకాల ప్రకారం.. గంటకు 25 కి.మీ.కు మించిన వేగంతో నడిచే, పూర్తి స్థాయి లైసెన్సు అవసరమయ్యే హై–స్పీడ్ ఎలక్ట్రిక్ టూ వీలర్ల (ఈ2డబ్ల్యూ) అమ్మకాలు 2021లో 425% వృద్ధితో 1,42,829 యూనిట్లకు చేరాయి. 2020లో వీటి సంఖ్య 27,206 యూనిట్లే. ఇక గంటకు 25 కి.మీ. కన్నా తక్కువ వేగంతో నడిచే, పూర్తి స్థాయి లైసెన్సు అవసరం ఉండని లో–స్పీడ్ ఈ2డబ్ల్యూల అమ్మకాలు కేవలం 24% వృద్ధి చెంది 73,529 యూనిట్ల నుంచి 91,142 యూనిట్లకు పెరిగాయి. వాస్తవానికి వీటి అమ్మకాలు 2021 ఆఖరు రెండు త్రైమాసికాల్లో గణనీయంగా తగ్గాయి. జే సంగ్ టెక్‌తో ఒమెగా సైకి మొబిలిటీ జట్టు.. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఒమెగా సైకి మొబిలిటీ (ఓఎస్ఎం) తాజాగా కొరియాకు చెందిన విద్యుత్ వాహనాల పవర్‌ట్రెయిన్ దిగ్గజం జే సంగ్ టెక్‌తో చేతులు కలిపింది. భారత్‌లో ఎలక్ట్రిక్ పవర్ట్రెయిన్లు తయారు చేయనుంది. ఈ భాగస్వామ్య ఒప్పందం ప్రకారం ఇరు సంస్థలు ఓఎస్ఎం జే సంగ్ టెక్ పేరిట జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తాయి. స్థానిక అవసరాలకు తగినట్లుగా పవర్ట్రెయిన్లను తయారు చేయడంలో జే సంగ్ సాంకేతికతను, ఒమేగా తయారీ సామర్థ్యాలను ఈ సంస్థ వినియోగించుకుంటుంది. ఏప్రిల్‌తో మొదలయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఓఎస్ఎంకి చెందిన కార్గో ఈ–త్రీ–వీలర్ రేజ్ప్లస్కు అవసరమయ్యే ఆర్ఏ314 పవర్‌ట్రెయిన్‌ను మొదటి ఉత్పత్తిగా జాయింట్ వెంచర్ సంస్థ ఆవిష్కరిస్తుంది. హరియా ణాలోని ఫరీదాబాద్ ప్లాంటులోనూ, పుణెలోని గ్రూప్ కంపెనీ ఒమేగా బ్రైట్ స్టీల్ అండ్ కాంపొనెట్స్ ప్లాంటులోను కొత్త ఆర్ఏ314ని ఓఎస్ఎం తయారు చేస్తుంది. ఈ పవర్‌ట్రెయిన్‌ను దేశీ డ్రైవింగ్ పరిస్థితుల్లో ప్రయోగాత్మకంగా పరీక్షించడం వల్ల చిన్న స్థాయి నాలుగు చక్రాల వాణిజ్య వాహనాల కోసం కూడా ఆర్ఏ314లను అభివృద్ధి చేసేందుకు వీలవుతుందని ఓఎస్ఎం ఎండీ దేవ్ ముఖర్జీ తెలిపారు. -
దిగ్గజ కంపెనీలు.. ఒక్క నిమిషపు ఆదాయమెంతో తెలుసా?
సాక్షి, వెబ్‌డెస్క్: అమెజాన్, గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, నెట్‌ఫ్లిక్స్.. దిగ్గజ కంపెనీలుగా ఒక వెలుగు వెలుగుతున్నాయి. రకరకాల సర్వీసులతో ఈ బడా బడా కంపెనీలు ప్రజలకు చేరువ అయ్యాయి.. ఇంకా అవుతూనే ఉన్నాయి. వాటి ద్వారా వెళ్తున్న ఆదాయం బిలియన్ల డాలర్లలో ఉంటుందన్నది ఊహించిందే. కానీ, ఆ కంపెనీలు నిమిషానికి ఎంత సంపాదిస్తాయో ఊహించగలరా? ఈ క్యూరియాసిటీని గుర్తించిన టెక్ నిపుణుడు..జర్నలిస్ట్ జోన్ ఎర్లిచ్‌మన్ ఒక అంచనాతో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అమెజాన్ కంపెనీ నిమిషం రెవెన్యూ 8,37,000 అమెరికన్ డాలర్లు(మన కరెన్సీలో ఆరున్నర కోట్ల రూపాయల దాకా ఉండొచ్చు)!, ఆ తర్వాతి ప్లేస్‌లో యాపిల్ 6,92,000 డాలర్లు(ఐదు కోట్లుపైనే) ఉంది. గూగుల్ 4,23,000 డాలర్లు(మూడు కోట్ల రూపాయలపైనే), మైక్రోసాఫ్ట్ 3,22,000 డాలర్లు, ఫేస్బుక్ రెవెన్యూ నిమిషానికి 2,02,000 డాలర్లు, డిస్నీ కంపెనీ లక్షా ఇరవై వేల డాలర్లు, టెస్లా ఎనభై వేల డాలర్లు, కోకా కోలా 70,000 డాలర్లు, నెట్‌ఫ్లిక్స్ 55 వేల డాలర్లు, కాఫీ స్టోర్ల ఫ్రాంఛైజీ స్టార్‌బక్స్ 52,000 డాలర్లు, మెక్ డొనాల్డ్స్ 40 వేలడాలర్లుగా నిమిషపు రెవెన్యూ ఉందని, ఇంటర్నేషనల్ మార్కెట్ లెక్కల ప్రకారం(జులై రెండోవారం).. ఇది ఒక అంచనా మాత్రమేనని ఎర్లిచ్‌మన్ స్పష్టం చేశాడు. ఇక రోజూ వారీ లాభం సుమారు యాపిల్ ఒక్కరోజు లాభం 240 మిలియన్ అమెరికన్ డాలర్లు(సుమారు 1,700 కోట్లు)గా ఉంది. గూగుల్ 182 మిలియన్ డాలర్లు, మైక్రోసాఫ్ట్ 162 మిలియన్ డాలర్లు, ఫేస్బుక్ 109 మిలియన్ డాలర్లు, అమెజాన్ 102 అమెరికన్ డాలర్లుగా ఉంది. మొత్తంగా వీటి రోజూవారీ లాభం అంతా కలిసి 795 మిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉండొచ్చని తెలుస్తోంది. బిలియన్ సంపాదనకు.. 1994లో ప్రారంభమైన అమెజాన్ ఐదేళ్లలో బిలియన్ సంపాదన మార్క్‌ను చేరుకోగా, గూగుల్ ఐదేళ్లలో, యాపిల్ ఆరేళ్లలో, ఉబెర్ ఆరేళ్లలో, పేపాల్ ఏడేళ్లలో, ట్విటర్ ఎనిమిదేళ్లలో, నెట్‌ఫ్లిక్స్ తొమిదేళ్లలో బిలియన్ రెవెన్యూను ఖాతాలో వేసుకోగలిగాయి. -
సంక్రాంతికే ఉల్లి దిగొచ్చేది!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఉల్లి ధరలు మరో నెల రోజుల పాటు ఆకాశంలోనే ఉండే పరిస్థితి కనిపిస్తోంది. దేశీయ మార్కెట్లో ఉల్లి డిమాండ్ ఎక్కువగా ఉండటం, సరఫరా లేకపోవడంతో ఇప్పట్లో ధరలు సాధారణ స్థాయికి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. అయితే ఉల్లి ధర, డిమాండ్ నేపథ్యంలో మహారాష్ట్రతో సహా ఇతర రాష్ట్రాల్లో ప్రస్తుత యాసంగి సీజన్లో సాగు పెరగడం, మరో పదిపదిహేను రోజుల్లో కేంద్రం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఉల్లి రానుండటంతో సంక్రాంతి నాటికి ఉల్లి కిలో ధర వంద రూపాయల దిగువకి వచ్చే అవకాశం ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫిబ్రవరికే సాధారణ ధర దేశ వ్యాప్తంగా విస్తారంగా కురిసిన వర్షాలతో ఉల్లికి తీవ్ర కొరత ఏర్పడింది. రోజువారీ ఉల్లి సరఫరా గత ఏడాది 3 లక్షల నుంచి 3.5 లక్షల క్వింటాళ్ల మేర ఉండగా.. ఈ ఏడాది 1.17 లక్షల క్వింటాళ్లకు పడిపోయింది. దీంతో దేశీయంగా ధర రూ.180–220కి చేరగా, రాష్ట్రంలోనూ రూ.160–180 పలుకుతోంది. అయితే ఉల్లి ధరలు పెరగడం, యాసంగికి నీటి లభ్యత పుష్కలంగా ఉండటంతో మహారాష్ట్రలో ఈ సీజన్లో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఖరీఫ్‌లో 2.50 లక్షల హెక్టార్లలో సాగు జరగ్గా, ఈ సీజన్లో 4 లక్షల హెక్టార్లకు మించి సాగైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. సాగైన ఉల్లి దిగుబడులన్నీ జనవరి మాసాంతం వరకు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఆలోగానే కేంద్రం టర్కీ నుంచి దిగుమతి చేసుకుంటున్న 11 వేల మెట్రిక్ టన్నులు, ఈజిప్టు నుంచి దిగుమతి చేసుకుంటున్న 6,090 మెట్రిక్ టన్నుల ఉల్లిగడ్డ విదేశాల నుంచి జనవరి రెండో వారంలోగా దేశానికి పూర్తిగా చేరుకుంటుంది. అప్పటివరకు విదేశాల నుంచి విడతలవారీగా ఉల్లి దేశానికి చేరినా ధరలు కాస్త తగ్గే అవకాశం ఉంటుంది. వచ్చే పదిహేను ఇరవై రోజుల్లో ఉల్లి ధర రూ.80–110 వరకు తగ్గే అవకాశం ఉందని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. సంక్రాంతి నాటికి ఉల్లి ధర రూ.50–80 మధ్య, ద్వితీయార్ధంలో రూ.35–60 మధ్య ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక ఫిబ్రవరిలో మహారాష్ట్ర నుంచి ఉల్లి సరఫరా పెరిగే అవకాశాలు ఉండటం.. నారాయణఖేడ్, వనపర్తి వంటి ప్రాంతాల నుంచి ఉల్లి మార్కెట్‌కు వచ్చే అవకాశాలు.. కర్నూలు, కర్ణాటక నుంచి దిగుమతులు పెరగనున్న నేపథ్యంలో ఫిబ్రవరిలో రాష్ట్రంలో ఉల్లి ధర రూ.20–30కి సాధారణ స్థాయికి చేరుకుంటుందని అంటున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హైదరాబాదీ బిర్యానీకి కూడా ఉల్లి సెగ తగిలింది. చాలా హోటళ్లు బిర్యానీలో ఉల్లి వాడకాన్ని బాగా తగ్గించాయి. ప్రముఖ హోటళ్ల బిర్యానీలు సైతం రుచిని కోల్పోయాయని పలువురు ఆహార ప్రియులు పేర్కొంటున్నారు. ఉల్లి లేకుండా బిర్యానీ వండాల్సిన పరిస్థితి రావడం ఇదే తొలిసారి అని హోటళ్ల నిర్వాహకులు పేర్కొంటున్నారు. -
ఒడిదుడుకులుంటాయి... జాగ్రత్త!
1997 చివరి వరకూ బీభత్సమైన ర్యాలీ..! కానీ 1998లో మాత్రం అదే స్థాయి ఎగుడుదిగుళ్లు. ఆ సంవత్సరంలో స్టాక్ మార్కెట్లు ఏకంగా 40 శాతం వరకూ నష్టపోయాయి. కోలుకోవటానికి ఏడాది పట్టింది. 2007 చివరి వరకూ కూడా ఇలాంటి పరిస్థితే. మార్కెట్లు మరిచిపోలేని పరుగు తీశాయి. కానీ 2008లో..? దారుణమైన పతనం. మళ్లీ ఆ మార్కెట్లు కోలుకోవటానికి ఏకంగా నాలుగైదేళ్లు పట్టేశాయి. ఇపుడు 2017లో... మునుపటి బుల్ రన్స్‌ను మైమరిపించేటంతటి డ్రీమ్ రన్. ఇండెక్స్లే కాదు. చాలా షేర్లు జీవితకాల గరిష్ఠ స్థాయిల్ని తాకాయి. మరి 2018లో ఏం జరుగుతుంది? ప్రతి పదేళ్లకోసారి భారత స్టాక్ మార్కెట్లలో చరిత్ర పునరావృతమవుతుందా? ఎగుడు దిగుళ్లు కళ్లకు కడతాయా? లేకపోతే ప్రస్తుత ర్యాలీకి దేశీయ మదుపరుల వెన్నుదన్నులున్నాయి కనుక... నిధుల ప్రవాహం బాగుంది కనక ర్యాలీ ఇలాగే కొనసాగుతుందా? భవిష్యత్తును ఊహించటం కష్టమే కాగా... ఈ విషయంలో విశ్లేషకుల అభిప్రాయం ఒకింత ప్రతికూలంగానే ఉంది. అందరూ ఎత్తుపల్లాలు తప్పకపోవచ్చని చెబుతుండగా... కొందరు మాత్రం కంపెనీల ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటే ఈ బుల్ పరుగు ఇలాగే కొనసాగుతుందని, నిఫ్టీ 11,000 మైలురాయిని అధిగమిస్తుందని చెబుతున్నారు. అయితే మార్కెట్లు పడకపోయినా అక్కడక్కడే కన్సాలిడేట్ కావచ్చని, కొన్ని రంగాల షేర్లు మాత్రం పరుగులు పెడతాయని ఇంకొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2018పై ఎవరి అంచనాలేంటి? ఏఏ రంగాలపై బుల్లిష్‌గా ఉన్నారు? ఏఏ షేర్లను సిఫారసు చేస్తున్నారు? మొత్తంగా స్టాక్ మార్కెట్ మదుపరులకు కొత్త సంవత్సరం ఎలా ఉండబోతోంది? ఆయా వివరాలన్నీ గుదిగుచ్చి ‘సాక్షి’ బిజినెస్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం... దేశీ స్టాక్ మార్కెట్లకు 2018లో ఒడిదుడుకులు తప్పకపోవచ్చన్నది జెన్‌మనీ జాయింట్ ఎండీ సతీష్ కంతేటి మాట. 2017 స్థాయిలో వృద్ధి ఉండకపోవచ్చని.. అంతర్జాతీయ అంశాలతో పాటు దేశీయంగా ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు ఇందుకు కారణంగా నిలవవచ్చని ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారాయన. మార్కెట్ల గమనంపై ఇంకా ఆయనేమన్నారంటే... కొత్త సంవత్సరంలో మార్కెట్లను ప్రభావితం చేయబోయే మూడు, నాలుగంశాలున్నాయి. రాబోయే బడ్జెట్లో మళ్లీ స్టాక్స్‌పై లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌ను (ఎల్టీసీజీ) ప్రవేశపెట్టొచ్చన్న అంచనాలు తక్షణం ప్రభావం చూపిస్తాయి. ఇది రెట్రాస్పెక్టివ్‌గా కాకుండా 2018 ఏప్రిల్ 1 తర్వాత కొన్న వాటికి మాత్రమే వర్తింపజేస్తే గనక మార్కెట్ మరీ నెగెటివ్‌గా రియాక్ట్ కాకపోవచ్చు. అలా కాకుండా రెట్రాస్పెక్టివ్‌గా ఉంటే మాత్రం సూచీలు పతనమయ్యే అవకాశముంది. ఏదైతేనేం.. దీనిపై అనిశ్చితితో బడ్జెట్ దాకా ఒడిదుడుకులు కొనసాగవచ్చు. మరోవైపు, డీమోనిటైజేషన్, జీఎస్టీ వంటి అంశాల వల్ల ఆదాయం వృద్ధి కావటానికి మరికొంత సమయం పడుతుంది. జీఎస్టీ తరువాత పన్నుల వసూళ్లు ఇంకా స్థిరపడలేదు. ఫలితంగా ప్రభుత్వం రూ. 50,000 కోట్ల మేర నిధులు సమీకరించాలనే యోచనలో ఉండటమనేది... ద్రవ్యలోటు పెరగటానికి దారితీయొచ్చు. అటు ఆర్బీఐ లకి‡్ష్యంచిన దానికన్నా కూడా ద్రవ్యోల్బణం అధికంగా ఉండొచ్చు. ఈ పరిణామాలన్నీ కూడా వడ్డీ రేట్ల పెంపునకు దారి తీయొచ్చు. ఏదైతేనేం... జీఎస్టీ, డీమోనిటైజేషన్ ప్రభావాల నుంచి బయటపడి ఎకానమీ పూర్తి స్థాయిలో కోలుకోవడానికి ముందే.. వచ్చే ఒకటిరెండు త్రైమాసికాల్లో వడ్డీ రేట్లు పెరిగితే మార్కెట్ నెగెటివ్‌గా స్పందించే అవకాశాలు ఉన్నాయి. ముడి చమురు ధర పెరుగుదలతో ద్రవ్యోల్బణం పెరిగి, అంతర్జాతీయ ధోరణిలోనే ఇక్కడా వడ్డీ రేట్లు పెరిగే రిస్కులున్నాయి. ఎన్నికల ఫలితాలూ కీలకమే... వచ్చే ఏడాది కర్ణాటక తదితర రాష్ట్రాల్లో ఎన్నికలున్నాయి. వీటి ఫలితాలను మార్కెట్ నిశితంగా పరిశీలిస్తుంది. ఆ పై ఏడాది కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటుపై వీటి ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయనేది చూస్తుంది. కాస్త అటూ ఇటూగా 2019లో కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వమే ఏర్పడుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇందుకు ఏమాత్రం భిన్నమైన ఫలితాలొచ్చినా.. మార్కెట్లు నెగెటివ్‌గా స్పందించే అవకాశం ఉంటుంది. మార్కెట్లు అస్థిరతను, అనిశ్చితిని ఇష్టపడవు. పాజిటివ్‌గా కావొచ్చు.. నెగెటివ్‌గా కావొచ్చు. కొన్నాళ్లుగా చూస్తే కేంద్ర ఎన్నికలకు ముందు పరిస్థితులను బట్టి మార్కెట్లు గణనీయమైన మార్పులకు లోనవుతున్నాయి. అదే విధంగా సార్వత్రిక ఎన్నికలు 2019లోనే ఉన్నప్పటికీ ఈ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను బట్టి మార్కెట్లు 2018 నుంచే డిస్కౌంటింగ్ చేసుకునే అవకాశాలున్నాయి. 2019లో స్థిరమైన ప్రభుత్వం వచ్చే సంకేతాలుంటే తప్ప 2018లో మార్కెట్లు... 2017 స్థాయి రిటర్నులు ఇవ్వకపోవచ్చు. 2018లో మరిన్ని ప్రతికూల పవనాలు వీచే అవకాశాలు ఉన్నందున.. కరెక్షన్ అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మార్కెట్ల వృద్ధి గతంతో పోలిస్తే తక్కువగానే ఉండొచ్చు. కంపెనీల ఫలితాలే దిక్సూచి ‘‘కొత్త ఏడాది భారత శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటిచెప్పటంతో పాటు, భారత మార్కెట్లకు టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుందనేది నా అభిప్రాయం. 2008 నుంచీ ప్రపంచ ఆర్థిక ముఖచిత్రం సానుకూలంగా ఉంటోంది. 2017లో జీఎస్టీతో భారత ఆర్థిక వ్యవస్థ భారీ సంస్కరణలకు తెర తీసింది. పెద్ద నోట్లను రద్దు చేయటంతో సహా వీటి వాస్తవ ఫలితాలు ఇంకా తెలియాల్సి ఉంది. దేశీ స్టాక్ మార్కెట్లు మాత్రం జనవరి నుంచి వెలువడే కంపెనీల ఫలితాల్ని బట్టే ఒక మలుపు తీసుకుంటాయి.’’ – వైభవ్ సంఘవి, కో–సీఈఓ, అవెండాస్ క్యాపిటల్ ఆల్టర్నేటివ్ స్ట్రాటజీస్ 10,650 దాటితే నిఫ్టీ@ 11,200 ‘‘2016 డిసెంబర్లో నిఫ్టీ దాదాపు 7,893 పాయింట్ల దగ్గర ఉంది. అక్కడి నుంచి ఒకే ఏడాదిలో ఏకంగా 10,500 పాయింట్లను దాటేసింది. విచిత్రమేంటంటే మధ్యలో ఎక్కడా భారీ కరెక్షన్లు కూడా రాలేదు. కాబట్టి ఈ ర్యాలీ కొనసాగుతుందనే అంచనాలున్నా... తగిన కరెక్షన్ రాకుండా ఇలా ఎంతవరకు వెళుతుందనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. నా ఉద్దేశం ప్రకారం నిఫ్టీ తదుపరి 10,650 పాయింట్లను చేరుతుంది. దాన్ని గనక పూర్తిస్థాయి కొనుగోళ్ల మద్దతుతో దాటేస్తే, 11,200 పాయింట్లను అవలీలగా దాటేస్తుంది. కాకపోతే కొంత జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే బుక్‌వేల్యూ, పీఈ రేషియో వంటి ఫండమెంటల్స్ చూసి కొనటానికి చాలా షేర్లు అనుకూలంగా లేవు. వాటిని కొంటే ఇంకా పెరుగుతాయనే నమ్మకం లేదు. కాబట్టి మున్ముందు కంపెనీల ఫలితాలు బాగుంటేనే మరింత ర్యాలీ జరుగుతుందని ఆశించొచ్చు’’ – మజార్ మొహమ్మద్, చీఫ్ స్ట్రాటజిస్ట్– చార్ట్‌వ్యూఇండియా.ఇన్ స్మాల్, మిడ్‌క్యాప్‌లో పాక్షికంగా లాభాల స్వీకరణ మొత్తం సెక్టార్ లేదా సూచీ సంకేతాల కోసం ఎదురుచూస్తూ కూర్చోకుండా.. ఇన్వెస్టర్లు.. ఎంచుకున్న షేర్లనే కొనటం మంచిది. మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో ర్యాలీని ఉపయోగించుకుని, వేల్యుయేషన్స్ ఎక్కువగా అనిపిస్తున్న వాటిల్లో పాక్షికంగానైనా లాభాలు స్వీకరించడం శ్రేయస్కరం. తద్వారా 2018 లేదా 2019లో మార్కెట్లు కరెక్షన్‌కి లోనైనా రిస్కులు తగ్గించుకోవచ్చు. అగ్రి ,ఇన్ఫ్రా స్టాక్స్‌లో అవకాశాలు .. రంగాలవారీగా చూస్తే.. అగ్రి సంబంధిత కంపెనీలు, ఇన్ఫ్రా, అఫోర్డబుల్ హౌసింగ్ నిర్మాణ సంస్థల షేర్లు మెరుగ్గా ఉంటాయని అంచనా. ఇక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మాలోనూ అవకాశాలు ఉన్నాయి.. అయితే, ఈ రంగాల్లో ప్రత్యేకమైన ఉత్పత్తులు తయారు చేసే స్పెషలైజ్డ్ సంస్థల వృద్ధికి అవకాశాలు బాగా ఉండగలవు. ఫార్మా విషయానికొస్తే.. ఎక్కువగా దేశీ మార్కెట్ ప్రధానంగా కార్యకలాపాలు ఉన్న సంస్థలు మెరుగ్గా ఉండొచ్చు. అమెరికా వడ్డీ రేట్లు, క్రూడాయిల్ రిస్కులు.. అంతర్జాతీయంగా చూస్తే.. క్రూడాయిల్ ధరలు గానీ ర్యాలీ జరిపిన పక్షంలో ఆ ప్రభావాలతో దేశీ మార్కెట్లు పెరిగే అవకాశాలు పరిమితంగానే ఉంటాయి. ఇక, 2008 నాటి మాంద్యం అనంతరం అమెరికా, యూరప్ మొదలైనవి వడ్డీ రేట్లు భారీగా తగ్గించేసి, ఉద్దీపన ప్యాకేజీలు ఇవ్వడం ద్వారా వ్యవస్థకు ఊతమిచ్చే ప్రయత్నం చేశాయి. ఆ నిధులే భారత్ తదితర మార్కెట్లలోకి ప్రవహించాయి. ప్రస్తుతం పరిస్థితులు సర్దుకుంటున్న దరిమిలా ఆయా దేశాలు క్రమంగా వడ్డీ రేట్లు పెంచడం మొదలుపెట్టాయి. అమెరికాలో పన్ను సంస్కరణలు అక్కడి కంపెనీలకు ప్రయోజనం చేకూర్చేవిగానే ఉన్నాయి. పరిస్థితుల రికవరీతో.. అమెరికా, యూరప్ మొదలైనవి గణనీయంగా వడ్డీ రేట్లు పెంచిన పక్షంలో ఈ పరిణామాలన్నీ మన మార్కెట్‌పై ప్రభావం చూపే రిస్కుంది. దేశీ పెట్టుబడులతో క్షీణతకు అడ్డుకట్ట.. కొన్నాళ్లుగా మార్కెట్లలోకి మ్యూచువల్ ఫండ్స్ తదితర మార్గాల్లో దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెరుగుతున్నాయి. మార్కెట్ భారీగా క్షీణించకుండా ఇవి కొంత అడ్డుకట్ట వేస్తున్నాయి. 2018లోనూ ఇదే ధోరణి కొనసాగే అవకాశం ఉంది. ఇది పాజిటివ్ కోణం. అయితే, నెగటివ్ కోణం మరోటి కూడా ఉంది. మార్కెట్ బాగుంది కదాని కంపెనీలు పొలోమంటూ ఐపీవోలకి వచ్చేస్తున్నాయి. దీంతో సరఫరా భారీగా పెరిగిపోతుండటం వల్ల మార్కెట్ల పెరుగుదల ఒక స్థాయికి మాత్రమే పరిమితం అయిపోయే అవకాశాలూ ఉన్నాయి. -
దోపిడీకి రాచబాట
అంచనా పెంచి అక్రమాలకు ఆమోదం తెనాలి–చందోలు రహదారి విస్తరణలో మరో అవినీతి కోణం కాంట్రాక్టు సంస్థ నుంచి రూ.కోటి రికవరీని తప్పించేందుకే! సాక్షి, అమరావతి : ప్రజాధనం దోపిడీకి ఏకంగా సర్కారు రాచబాట వేసిన వైనమిది. 2011లో చేపట్టిన తెనాలి–చందోలు రోడ్డు విస్తరణలో కాంట్రాక్టు సంస్థ అక్రమాలు బయటపడ్డాయి. రక్షణ గోడ నిర్మాణం, రెడీమిక్స్ ప్లాంట్ వ్యవహారాల్లో అవకతవకలు రూఢీ అయ్యాయి. కాంట్రాక్టు సంస్థ నుంచి రూ.1.04 కోట్లు రికవరీ చేయాలని సాక్షాత్తూ ఇంజనీరింగ్ నిపుణుల కమిటీతో పాటు విజిలెన్స్ కమిషనర్ తేల్చారు. ఈ అక్రమాలకు ఇప్పుడు ఆమోదముద్ర వేస్తూ పరిపాలన అనుమతుల అంచనాలు పెంచారు. రూ.40 కోట్ల రోడ్డు పనులను రూ.50 కోట్లకు పెంచుతూ ఏకంగా జీవో జారీ చేశారు. 2011లో ఇచ్చిన పరిపాలన అనుమతులకు అంచనా పెంచుతూ ఇప్పుడు జీవో జారీ చేయడం వెనుక ప్రధాన కారణం కాంట్రాక్టు సంస్థకు రికవరీ తలనొప్పులు తప్పించేందుకేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా తెనాలి–మంగళగిరి రహదారికి కిలోమీటరు విస్తరణకు గాను సంబంధం లేని తెనాలి–చందోలు రోడ్డుకు పరిపాలన అనుమతులు పెంచుతూ జీవో ఇవ్వడం గమనార్హం. అదీ ఏకంగా కిలోమీటరుకు రూ.10 కోట్లు కేటాయిస్తూ ఐదేళ్ల క్రితం ఇచ్చిన పరిపాలన అనుమతులకు ఈ పనిని జత చేయడం అనుమానాలకు తావిస్తోంది. అవినీతి రహదారి క«థాకమామిషు ఇదీ.. రాజధాని ప్రాంతమైన గుంటూరు జిల్లాలో తెనాలి–చందోలు నడుమ 22.600 కిలోమీటరు నుంచి 25.800 కిలోమీటరు వరకు అంటే 3.2 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రోడ్డుకు, తెనాలి–మంగళగిరి మధ్య 0.00 నుంచి 1.00 కిలోమీటరు వరకు అంటే కిలోమీటరు మేర నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణానికి రూ.40 కోట్ల అంచనాతో గతంలో టెండరు నోటిఫికేషన్ జారీ చేశారు. పది శాతం తక్కువ ధరతో ఓ సంస్థ, పది శాతం ఎక్కువ ధరతో మరో సంస్థ టెండరు దాఖలు చేశాయి. నిబంధనల ప్రకారం ఎల్1గా నిలిచిన సంస్థకు పనులు అప్పగించాలి. కానీ పది శాతం ఎక్కువ ధరకు టెండరు కోట్ చేసిన ఎల్2కు పనులు కట్టబెడుతూ టెండరు యాక్సెప్టింగ్ అథారిటీ (టీఏఏ) నిర్ణయించింది. తద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.4 కోట్ల మేర నష్టం వాటిల్లింది. టెండరు దశలోనే అడ్డగోలు అక్రమాలు ఈ విధంగా ఉంటే, కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ పనులు చేయడంలోనూ అంతులేని అవినీతికి పాల్పడినట్లు విజిలెన్స్ సహా ఆర్‌అండ్‌బీలో ఇంజనీరింగ్ నిపుణులు తేల్చారు. టెండరు మార్గదర్శకాల ప్రకారం నాలుగు లేన్ల రోడ్డుకు 40 ఎంఎం మెటల్‌తో, 15 ఎంఎం కాంక్రీట్‌తో రిటైనింగ్ వాల్స్ (అడ్డుగోడలు) నిర్మించాలి. కానీ 20 ఎంఎం మెటల్, 20 ఎంఎం కాంక్రీట్ ఉపయోగించి నాసిరకంగా అడ్డుగోడలు నిర్మించినట్లు విజిలెన్స్ తేల్చింది. రహదారి విస్తరణలో ఒప్పందానికి బదులు ఇతర మెటీరియల్ వాడకం, బ్యాచ్ మిక్సింగ్, మెషీన్ మిక్సింగ్ రేట్లలో తేడాలను గుర్తించింది. దీనివల్ల కాంట్రాక్టరుకు బిల్లుల రూపంలో భారీగానే చెల్లించినట్లు నిర్ధారిస్తూ ప్రభుత్వానికి విజిలెన్స్ ఎన్ఫోర్సుమెంటు విభాగం నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా గతేడాది కాంట్రాక్టు సంస్థ నుంచి రూ.1.04 కోట్లు రికవరీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించి తాఖీదులిచ్చింది. ఆర్అండ్బీ ఈఎన్సీ ఏమంటున్నారంటే... ఈ విషయమై ఆర్అండ్బీ ఇంజనీర్ ఇన్ చీఫ్ గంగాధరం వివరణనిస్తూ రికవరీపై కాంట్రాక్టు సంస్థ నాగభూషణం అండ్ కోకు నోటీసులిచ్చామని, కాంట్రాక్టు సంస్థ కోర్టును ఆశ్రయించిందని చెప్పారు. అప్పటి రోడ్డు విస్తరణ, రక్షణ గోడ నిర్మాణంలో ఇరిగేషన్ శాఖ కొంత పని వదిలేసిందని, ఆ పనిని పూర్తి చేసేందుకు తాజాగా పరిపాలన అనుమతులిచ్చామని తెలిపారు. -
900 ఎకరాల్లో ఏపీ సచివాలయం
-9,08,219 చదరపు అడుగుల్లో రూ. 318 కోట్లతో సచివాలయం నిర్మాణం -శాసనసభ, శాసన మండలి నిర్మాణానికి రూ.115 కోట్లు -30 వేల చదరపు అడుగుల్లో రూ.12 కోట్లతో సీఎం నివాసం -సీఆర్డీఏ అంచనాలు రూపకల్పన హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో ప్రభుత్వ కార్యాలయాల కాంప్లెక్స్ 900 ఎకరాల విస్తీర్ణంలో ఉండనుంది. సీఆర్ డీఏ అంచనా మేరకు ఈ పరిధి 60 కిలోమీటర్లలో ఉండనుంది. ఈ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం 1700 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని సీఆర్డీఏ అంచనా వేసింది. నూతన రాజధాని నిర్మాణానికి సంబంధించి రంగాల వారీగా సీఆర్డీఏ అంచనాలను రూపొందించి గురువారం రాష్ట్ర ప్రభుత్వ ఆమోదానికి పంపించింది. అందులో వివరాల మేరకు నూతన రాజధాని అమరావతిలో సచివాలయ నిర్మాణానికి రూ.318 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని సీఆర్డీఏ అంచనా వేసింది. రాజధాని తొలి దశ నిర్మాణాలకు సీఆర్డీఏ రంగాల వారీగా అంచనాలను రూపొందించింది. ప్రభుత్వ కార్యాలయాలను 2019-20 నాటికి పూర్తి స్థాయిలో నిర్మాణాలను పూర్తి చేయాలని సీఆర్డీఏ నిర్ణయించింది. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు సీఎం, న్యాయమూర్తులు, మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగులు, అఖిల భారత సర్వీసు ఉద్యోగులకు ప్రభుత్వ నివాస సముదాయాల నిర్మాణాలను కూడా 2019-20 నాటికి పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని సీఆర్డీఏ లక్ష్యాలను నిర్ధారించింది. నూతన రాజధానిలో ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ 67,73,560 చదరపు అడుగుల్లో నిర్మాణాలను చేపట్టాలని నిర్ణయించింది. ఒక్కో చదరపు అడుగు నిర్మాణానికి 3,500 రూపాయల చొప్పున మొత్తం 2371 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని అంచనా వేసింది. ప్రభుత్వ కార్యాలయాలకు ఈ ఏడాది జూన్ నాటికి సవివరమైన ప్రాజెక్టు నివేదికలను సిద్ధం చేయాలని, సెప్టెంబర్ నాటికి పరిపాలన, సాంకేతిక అనుమతులను మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది నవంబర్‌లో నిర్మాణ పనుల కాంట్రాక్ట్‌లను పూర్తి చేయాలని నిర్ణయించింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణ వ్యయం 355 కోట్ల రూపాయలు, 2017-18లో 830 కోట్ల రూపాయలు, 2018-19లో 830 కోట్ల రూపాయలు, 2019-20లో 356 కోట్ల రూపాయలు వ్యయంతో పూర్తి స్థాయిలో నిర్మాణాలను పూర్తి చేయాలని సీఆర్డీఏ లక్ష్యంగా నిర్ధారించింది. ప్రభుత్వ నివాస సముదాయాల నిర్మాణాలకు సవివరమైన ప్రాజెక్టు నివేదికలను ఈ ఏడాది డిసెంబర్ నాటికి సిద్ధం చేయాలని, వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పనుల కాంట్రాక్ట్‌ను పూర్తి చేయాలని సీఆర్డీఏ నిర్ణయించింది. 2018-19లో 940 కోట్ల రూపాయల మేర పనులను, 2019-20లో 533 కోట్ల రూపాయల మేర పనులను పూర్తి చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాల వివరాలు : పనుల వివరాలు- చదరపు అడుగులు- వ్యయం (కోట్లలో) అసెంబ్లీ, శాసన మండలి- 3,23,985 - 115.00 హైకోర్టు- 5,77,290- 202.00 సచివాలయం- 9,08,219 - 318.00 శాఖాధిపతుల కార్యాలయాలు- 47,74,066- 1670.00 రిటైల్, రిక్రియేషన్ కార్యాలయాలు- 1,50,000- 52.50 రాజ్‌భవన్- 40,000- 14.00 ప్రభుత్వ నివాస సముదాయాల నిర్మాణాల వివరాలు : పనుల వివరాలు- చదరపు అడుగులు- వ్యయం (కోట్లలో) అమరావతి గెస్ట్ హౌస్- 60,000- 18.00 సీఎం నివాసం- 30,000- 12.00 మంత్రుల బంగ్లాలు- 1,00,000- 35.00 ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్- 9,34,000- 327.00 ప్రధాన న్యాయమూర్తి నివాసం- 20,000- 8.00 న్యాయమూర్తుల క్వార్టర్స్- 1,44,000- 50.00 అఖిల భారత సర్వీసు క్వార్టర్స్- 2,16,000- 65.00 గజిటెడ్ ఆఫీసర్ల క్వార్టర్స్- 9,36,000- 281.00 నాన్ గజిటెడ్ ఆఫీసర్ల క్వార్టర్స్ 20,52,000- 616.00 నాల్గోతరగతి ఉద్యోగుల క్వార్టర్స్2,04,750- 61.00