-9,08,219 చదరపు అడుగుల్లో రూ. 318 కోట్లతో సచివాలయం నిర్మాణం
-శాసనసభ, శాసన మండలి నిర్మాణానికి రూ.115 కోట్లు
-30 వేల చదరపు అడుగుల్లో రూ.12 కోట్లతో సీఎం నివాసం
-సీఆర్‌డీఏ అంచనాలు రూపకల్పన
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో ప్రభుత్వ కార్యాలయాల కాంప్లెక్స్ 900 ఎకరాల విస్తీర్ణంలో ఉండనుంది. సీఆర్ డీఏ అంచనా మేరకు ఈ పరిధి 60 కిలోమీటర్లలో ఉండనుంది. ఈ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం 1700 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని సీఆర్‌డీఏ అంచనా వేసింది. నూతన రాజధాని నిర్మాణానికి సంబంధించి రంగాల వారీగా సీఆర్‌డీఏ అంచనాలను రూపొందించి గురువారం రాష్ట్ర ప్రభుత్వ ఆమోదానికి పంపించింది. అందులో వివరాల మేరకు నూతన రాజధాని అమరావతిలో సచివాలయ నిర్మాణానికి రూ.318 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని సీఆర్‌డీఏ అంచనా వేసింది.
రాజధాని తొలి దశ నిర్మాణాలకు సీఆర్‌డీఏ రంగాల వారీగా అంచనాలను రూపొందించింది. ప్రభుత్వ కార్యాలయాలను 2019-20 నాటికి పూర్తి స్థాయిలో నిర్మాణాలను పూర్తి చేయాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు సీఎం, న్యాయమూర్తులు, మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగులు, అఖిల భారత సర్వీసు ఉద్యోగులకు ప్రభుత్వ నివాస సముదాయాల నిర్మాణాలను కూడా 2019-20 నాటికి పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని సీఆర్‌డీఏ లక్ష్యాలను నిర్ధారించింది. నూతన రాజధానిలో ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ 67,73,560 చదరపు అడుగుల్లో నిర్మాణాలను చేపట్టాలని నిర్ణయించింది. ఒక్కో చదరపు అడుగు నిర్మాణానికి 3,500 రూపాయల చొప్పున మొత్తం 2371 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని అంచనా వేసింది.
ప్రభుత్వ కార్యాలయాలకు ఈ ఏడాది జూన్ నాటికి సవివరమైన ప్రాజెక్టు నివేదికలను సిద్ధం చేయాలని, సెప్టెంబర్ నాటికి పరిపాలన, సాంకేతిక అనుమతులను మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది నవంబర్‌లో నిర్మాణ పనుల కాంట్రాక్ట్‌లను పూర్తి చేయాలని నిర్ణయించింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణ వ్యయం 355 కోట్ల రూపాయలు, 2017-18లో 830 కోట్ల రూపాయలు, 2018-19లో 830 కోట్ల రూపాయలు, 2019-20లో 356 కోట్ల రూపాయలు వ్యయంతో పూర్తి స్థాయిలో నిర్మాణాలను పూర్తి చేయాలని సీఆర్‌డీఏ లక్ష్యంగా నిర్ధారించింది.
ప్రభుత్వ నివాస సముదాయాల నిర్మాణాలకు సవివరమైన ప్రాజెక్టు నివేదికలను ఈ ఏడాది డిసెంబర్ నాటికి సిద్ధం చేయాలని, వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పనుల కాంట్రాక్ట్‌ను పూర్తి చేయాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది. 2018-19లో 940 కోట్ల రూపాయల మేర పనులను, 2019-20లో 533 కోట్ల రూపాయల మేర పనులను పూర్తి చేయాలని నిర్ణయించింది.
ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాల వివరాలు :
పనుల వివరాలు- చదరపు అడుగులు- వ్యయం (కోట్లలో)
అసెంబ్లీ, శాసన మండలి- 3,23,985 - 115.00
హైకోర్టు- 5,77,290- 202.00
సచివాలయం- 9,08,219 - 318.00
శాఖాధిపతుల కార్యాలయాలు- 47,74,066- 1670.00
రిటైల్, రిక్రియేషన్ కార్యాలయాలు- 1,50,000- 52.50
రాజ్‌భవన్- 40,000- 14.00
ప్రభుత్వ నివాస సముదాయాల నిర్మాణాల వివరాలు :
పనుల వివరాలు- చదరపు అడుగులు- వ్యయం (కోట్లలో)
అమరావతి గెస్ట్ హౌస్- 60,000- 18.00
సీఎం నివాసం- 30,000- 12.00
మంత్రుల బంగ్లాలు- 1,00,000- 35.00
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్- 9,34,000- 327.00
ప్రధాన న్యాయమూర్తి నివాసం- 20,000- 8.00
న్యాయమూర్తుల క్వార్టర్స్- 1,44,000- 50.00
అఖిల భారత సర్వీసు క్వార్టర్స్- 2,16,000- 65.00
గజిటెడ్ ఆఫీసర్ల క్వార్టర్స్- 9,36,000- 281.00
నాన్ గజిటెడ్ ఆఫీసర్ల క్వార్టర్స్ 20,52,000- 616.00
నాల్గోతరగతి ఉద్యోగుల క్వార్టర్స్2,04,750- 61.00
900 ఎకరాల్లో ఏపీ సచివాలయం
Published Thu, Jan 28 2016 6:55 PM | Last Updated on Sat, Aug 18 2018 8:27 PM
Advertisement