‘అసైన్డ్‌’ దోపిడీకి రాజముద్ర! | Chandrababu Govt Looted Poor people lands in Amaravati | Sakshi
Sakshi News home page

‘అసైన్డ్‌’ దోపిడీకి రాజముద్ర!

Published Mon, Mar 3 2025 3:26 AM | Last Updated on Mon, Mar 3 2025 9:37 AM

Chandrababu Govt Looted Poor people lands in Amaravati

అమరావతిలో పేదల భూములు కాజేసిన పచ్చ ముఠాలకు ‘రిటర్నబుల్‌ ప్లాట్లు’  

సీఆర్‌డీఏకు చంద్రబాబు సర్కారు ఆదేశం.. రిజిస్ట్రేషన్‌కు సన్నాహాలు

ప్రభుత్వ పెద్దల బినామీల చేతికి విలువైన ప్లాట్లు 

ఈ మోసాలపై హైకోర్టును ఆశ్రయిస్తున్న అసైన్డ్‌ రైతన్నలు 

తమ సంతకాలు ఫోర్జరీ చేశారని పిటిషన్లు 2014–19 మధ్య అసైన్డ్‌ దోపిడీకి పాల్పడిన టీడీపీ నేతలు 

ఆ భూములకు భూ సమీకరణ ప్యాకేజీ, పరిహారం రాదంటూ ప్రచారం 

అమాయక ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతుల నుంచి కారుచౌకగా 1,300  ఎకరాలు కొట్టేసిన వైనం 

ఆ తర్వాత తాపీగా ప్యాకేజీని ప్రకటించిన బాబు సర్కారు 

ఈ భూముల క్రయవిక్రయాలు చెల్లవని నాడు అధికారులు చెప్పినా బేఖాతర్‌.. రికార్డులనూ మాయం చేసిన దోపిడీదారులు 

హైకోర్టులోనూ రైతుల ఫోర్జరీ సంతకాలతో అఫిడవిట్‌  

అదే.. అమరావతి! అంతా.. రైతన్నలే..!  కానీ రాజధాని ప్రాంతంలో.. గత ప్రభుత్వం పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను రద్దు చేసిన కూటమి ప్రభుత్వం.. అదే చోట నిరుపేద రైతుల నుంచి అసైన్డ్‌ భూములను కాజేసిన పచ్చ ముఠాలను ‘రాజముద్ర’తో సత్కరిస్తోంది. అమరావతిలో ఏకంగా 1,300 ఎకరాల అసైన్డ్‌ భూములు రిటర్న్‌బుల్‌ ప్లాట్ల ముసుగులో పచ్చ రాబందులకు ఫలహారంగా మారిపోతున్నాయి! అసలు అసైన్డ్‌ భూములను కొనడమే పెద్ద తప్పు.. 

ఇక వాటిని కొనుగోలు చేసిన టీడీపీ నేతలకు బదులుగా ప్లాట్లు కేటాయించడం అంతకంటే పెద్ద నేరం కాదా? రాష్ట్రవ్యాప్తంగా అసైన్డ్‌ భూములను సాగు చేసుకుంటున్న లక్షలాది మంది పేద రైతుల సమస్యకు పరిష్కారం చూపుతూ వాటిపై వారికి పూర్తి యాజమాన్య హక్కులు (ఫ్రీ హోల్డ్‌) కల్పిస్తూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అయితే దీన్ని సైతం కూటమి సర్కారు వివాదాస్పదంగా మార్చింది. 

గత సర్కారు 22 ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించిన లక్షలాది ఎకరాల భూములు, ఫ్రీ హోల్డ్‌ భూములపై తీసుకున్న నిర్ణయాలను తిరగతోడి వాటిని పారిశ్రామిక పార్కులు, ఇతర ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించుకోవడంపై ప్రతిపాదనలు రూపొందించాలని ఇప్పటికే క్యాబినెట్‌ సమావేశంలో నిర్ణయించింది. ఒకవైపు ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం, భూముల రీ సర్వే, అసైన్డ్‌ భూములకు యాజమాన్య హక్కుల కల్పన, చుక్కల భూములకు పరిష్కారం లాంటి అన్ని భూ సంబంధిత అంశాలను వివాదాలతో ముంచెత్తుతూ మరోవైపు ప్రక్షాళన పేరుతో తూతూమంత్రంగా రెవెన్యూ సదస్సులను నిర్వహించింది.

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో 2014–19 మధ్య బరితెగించి సాగించిన ‘అసైన్డ్‌’ భూముల దోపిడీకి చంద్రబాబు ప్రభుత్వం రాజముద్ర వేస్తోంది. అమాయక ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు మాయ మాటలు చెప్పి రూ.5 వేల కోట్లకు పైగా విలువ చేసే 1,300 ఎకరాల అసైన్డ్‌ భూములను చంద్రబాబు బినామీలు, సన్నిహితులు చేజిక్కించుకున్నట్లు అప్పట్లోనే వెల్లడైంది. 

వీటిని రిజిస్ట్రేషన్‌ చేసేందుకు అధికారులు అంగీకరించకపోవడంతో ఈ దోపిడీదారులు హైకోర్టుకు వెళ్లి రైతుల ఫోర్జరీ సంతకాలతో ఏకంగా న్యాయస్థానాన్నే మోసగించడానికి ప్రయత్నించారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడంతో భూ సమీకరణ కింద తీసుకున్న ఈ భూములకు అమరావతిలో ప్లాట్లు కేటాయించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ భూ దోపిడీకి వ్యతిరేకంగా అసైన్డ్‌ రైతులు న్యాయ పోరాటానికి సిద్ధపడ్డారు. తమకు న్యాయం చేయాలని తాజాగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తున్నారు.

పరిహారం ఇవ్వరంటూ భయపెట్టి..
కేంద్ర ప్రభుత్వ అసైన్డ్‌ భూముల పరిరక్షణ చట్టాన్ని ఉల్లంఘిస్తూ, అప్పటి రెవెన్యూ అధికారుల అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ 2014–19 మధ్య టీడీపీ హయాంలో చంద్రబాబు బృందం ఏకంగా 1,300 ఎకరాల అసైన్డ్‌ భూముల దోపిడీకి పాల్పడింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన ఈ భూములను చేజిక్కించుకోవడానికి పక్కా పన్నాగం పన్నింది. రాజధాని కోసం అన్ని భూములను సమీకరణ కింద ప్రభుత్వం తీసుకుంటుందని, ఇవి అసైన్డ్‌ భూములైనందున ఎలాంటి పరిహారం ఇవ్వదని మొదట రెవెన్యూ అధికారుల ద్వారా గ్రామాల్లో ప్రచారం చేయించింది. 

ఇందులో భాగంగా భూ సమీకరణ విధానాలు ఖరారు చేస్తూ జారీ చేసిన జీవో 1 లోనూ అసైన్డ్‌ భూములకు భూ సమీకరణ ప్యాకేజీ ప్రకటించలేదు. దీంతో పేద రైతులు భయాందోళనకు గురయ్యారు. అదే అదునుగా టీడీపీ పెద్దల బినామీలైన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు రంగ ప్రవేశం చేశారు. అసైన్డ్‌ భూములు తమకు అమ్మేయాలని, లేకపోతే ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇవ్వకుండా వాటిని తీసేసుకుంటుందని ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను భయపెట్టారు. అతి తక్కువ ధరకు సేల్‌ డీడ్‌ అగ్రిమెంట్లతో భూములను బదలాయించుకున్నారు. 

మొత్తం 1,300 ఎకరాలను చేజిక్కించుకున్నాక చంద్రబాబు ప్రభుత్వం వీటికి కూడా భూ సమీకరణ ప్యాకేజీ ప్రకటిస్తూ జీవో 41 జారీ చేసింది. అంటే అసైన్డ్‌ భూములను అక్రమంగా అతి తక్కువకు కొట్టేసిన టీడీపీ ముఠాకు రాజధానిలో విలువైన వాణిజ్య, నివాస స్థలాలను కేటాయిస్తామని తెలిపింది. దాంతో తాము మోసపోయామని అసైన్డ్‌ రైతులు గుర్తించి, ఆందోళన వ్యక్తం చేసినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. అప్పటికి ఎకరా రూ.కోటి విలువ ఉన్న భూములకు రాజధాని నిర్మిస్తే ఎకరా రూ.4 కోట్లు పలుకుతాయంటూ నాడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబే ప్రకటించారు. అంటే టీడీపీ ముఠా కొల్లగొట్టిన 1,300 ఎకరాల మార్కెట్‌ విలువ ఏకంగా రూ.5 వేల కోట్లు పైనే!


రికార్డుల గల్లంతు మాయాజాలం
1954 తర్వాత ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన అసైన్డ్‌ భూముల క్రయవిక్రయాలు నిబంధనలకు విరుద్ధమని రెవెన్యూ అధికారులు అభ్యంతరం తెలిపారు. అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే కూడా ఈ మేరకు లిఖిత పూర్వకంగా స్పష్టం చేశారు. ఈ భూముల రిజిస్ట్రేషన్లను అప్పటి మంగళగిరి సబ్‌ రిజిస్ట్రార్‌ తిరస్కరించారు. 

దాంతో దోపిడీదారులు ఆ భూములన్నీ 1954కు ముందు రైతులకు కేటాయించినవంటూ తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేశారు. వాస్తవానికి అవన్నీ 1980 – 2006 మధ్య రైతులకు కేటాయించినవే. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం 2006లో కేటాయించిన భూములు కూడా వీటిలో ఉన్నాయి. ఆ వాస్తవాన్ని కప్పిపుచ్చేందుకు టీడీపీ పెద్దలు గుంటూరు కలెక్టరేట్‌లో అసైన్డ్‌ భూముల రికార్డులను ఏకంగా మాయం చేశారు.



ఫోర్జరీ సంతకాలతో హైకోర్టుకే మస్కా
అసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్‌ను అధికారులు తిరస్కరించడంతో చంద్రబాబు బినామీలు, సన్నిహితులు హైకోర్టుకు వెళ్లారు. 1954కు ముందు కేటాయించిన ఈ భూములను ఎస్సీ, ఎస్టీ రైతులు తమకు స్వచ్ఛందంగానే విక్రయించారని హైకోర్టుకు తెలి­పారు. ఇందుకోసం ఆ రైతుల సంతకాలను ఫోర్జరీ చేసి అఫిడవిట్‌ దాఖలు చేశారు. 

ఆ భూములను రిజిస్ట్రేషన్‌ చేసేలా అధికారులను ఆదేశించాలని, వాటికి  భూ సమీకరణ కింద రాజధానిలో అభివృద్ధి చేసిన ప్లాట్లు కేటాయించేలా సీఆర్‌డీఏను ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఓ వైపు హైకోర్టులో ఈ వ్యాజ్యం సాగు­తుండగా.. మరో­పక్క అమరావతిలో అసైన్డ్‌ భూముల దోపిడీకి ఆమోద ముద్ర వేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమవుతోంది. భూ సమీక­రణ కింద తీసుకున్న ఆ 1,300 ఎకరాల అసైన్డ్‌ భూము­లకు అమ­రావతిలో రిటర్నబుల్‌ ప్లాట్లు కేటాయించాలని సీఆర్‌డీఏను ఆదేశించింది. తదనుగుణంగా చంద్రబాబు బృందం సభ్యుల పేరిట రిటర్నబుల్‌ ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు సీఆర్‌డీఏ సన్నాహాలు చేస్తోంది.

ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ను అడ్డుకోండి..
టీడీపీ కూటమి ప్రభుత్వ కుట్రను గుర్తించిన అసైన్డ్‌ రైతులు పలువురు హైకోర్టును ఆశ్రయించారు. తాము అసలు భూములు విక్రయించనే లేదని స్పష్టం చేశారు. తాము స్వచ్ఛందంగా భూములు విక్రయించినట్టు తమ సంతకాలు ఫోర్జరీ చేసి అఫిడవిట్లు దాఖలు చేశారని పలువురు అసైన్డ్‌ రైతులు న్యాయస్థానానికి నివేదించారు. తమ భూములకు ప్లాట్లను తమకే కేటాయించేలా సీఆర్‌డీఏను, ఇతరుల పేరిట ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ చేయకుండా స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు.

భూ దోపిడీని ఆధారాలతో నిగ్గు తేల్చిన సిట్‌
2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాగానే అమరావతిలో అసైన్డ్‌ రైతులు తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశారు. దాంతో గత ప్రభుత్వం విచారణకు సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) నియమించింది. సిట్‌ దర్యాప్తులో చంద్రబాబు బృందం భూ బాగోతం మొత్తం ఆధారాలతో బట్టబయలైంది. 

అసైన్డ్‌ భూముల పరిరక్షణ చట్టానికి విరుద్ధంగా భూముల బదలాయింపు చేయకూ­డదని లిఖిత పూర్వకంగా అభ్యంతరం తెలిపామని అప్పటి గుంటూరు కలెక్టర్‌గా ఉన్న కాంతిలాల్‌ దండేతో సహా పలువురు అధికారులు సీఆర్‌పీసీ 164 కింద వాంగ్మూలాలు ఇచ్చారు. దాంతో  ఏ1గా చంద్రబాబు, ఏ 2గా నారాయణతో పాటు పలువురిపై గతంలో సిట్‌ కేసు నమోదు చేసి న్యాయస్థానంలో చార్జిషీటు కూడా దాఖలు చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement