సచివాలయానికి కార్పొరేట్ లుక్
- వినోద, క్రీడా సదుపాయాలతో కొత్త భవంతులు
- సీఆర్‌డీఏకు సూచించిన సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: గూగుల్, ఇన్ఫోసిస్ వంటి కార్పొరేట్ కార్యాలయాలకు దీటుగా ఏపీ సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలను నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీఆర్‌డీఏకు సూచించారు. కొత్తగా నిర్మించబోయే కార్యాలయాలు ఇప్పుడున్న ప్రభుత్వ కార్యాలయాలకంటే భిన్నంగా ఉండాలన్నారు. ఈ కార్యాలయాల్లో వినోద, క్రీడా సదుపాయాలతో భవంతులు నిర్మించాలన్నారు. బుధవారం ఉండవల్లిలోని తన నివాసంలో రాజధాని వ్యవహారాలపై సీఆర్‌డీఏతో సమీక్ష నిర్వహించారు.
వివిధ శాఖల కార్యదర్శులు, శాఖాధిపతుల కార్యాలయాలు ఒకేచోట ఉండేలా రూపొందించిన డిజైన్లను నార్మన్ ఫోస్టర్ అండ్ పార్టనర్స్ ప్రతినిధులు సమర్పించారు. వీటిపై కార్యదర్శులు, మంత్రుల అభిప్రాయాలు సేకరించాలని సీఆర్‌డీఏ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. వచ్చిన సూచనలకు అనుగుణంగా తుది డిజైన్లు సిద్ధం చేయాలని సూచించారు. సెప్టెంబర్ 13వ తేదీ నాటికి తుది డిజైన్లు ఇస్తామని ఫోస్టర్ బృందం ఈసందర్భంగా తెలిపింది.