Andhra Pradesh Secretariat
-
రేపటి నుంచి ఏపీ సచివాలయాల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు
-
ఏపీ సచివాలయంలో ఉద్యోగుల సంబరాలు
-
FRBM పరిమితికి మించి గత ప్రభుత్వం అప్పులు చేసింది: ఏపీ సీఎం ప్రత్యేక కార్యదర్శి
-
మూగబోయిన మంత్రి గౌతమ్ రెడ్డి ఛాంబర్
-
AP: చర్చలకు సరే
సాక్షి, అమరావతి: పీఆర్సీ జీవోలను రద్దు చేస్తే కానీ మంత్రుల కమిటీతో చర్చలకు హాజరు కాబోమని పట్టుబట్టిన ఉద్యోగ సంఘాలు పట్టువిడుపు ప్రదర్శించాయి. మంత్రుల కమిటీ నుంచి తమకు లిఖిత పూర్వకంగా ఆహ్వానం వస్తే చర్చలకు వెళతామని సోమవారం పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సమావేశం అనంతరం ఉద్యోగ సంఘాల నాయకులు ప్రకటించారు. ఆ తరువాత కొద్దిసేపటికే మంత్రుల కమిటీ నుంచి వారికి లిఖితపూర్వక ఆహ్వానం అందడంతో ప్రతిష్టంభనకు తాత్కాలికంగా తెరపడింది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో చర్చలకు రావాలని మంత్రుల కమిటీ తరఫున జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ ఆహ్వానించారు. పీఆర్సీ సాధన సమితి నేతలు బండి శ్రీనివాసరావు, సూర్యనారాయణ, కె. వెంకట్రామిరెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు, కేవీ శివారెడ్డి, సీహెచ్ కృష్ణమూర్తి తదితర 20 మంది పేర్లను లేఖలో పేర్కొన్నారు. వెలగపూడి సచివాలయంలోని రెండో బ్లాకు ఆర్థిక శాఖ కాన్ఫరెన్స్ హాలులో సమావేశానికి రావాలని పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీకి పంపిన ఆహ్వానంలో సూచించారు. చర్చలకు సిద్ధమే: స్టీరింగ్ కమిటీ మంత్రుల కమిటీతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సభ్యులు ప్రకటించారు. విజయవాడలో నిర్వహించిన కమిటీ సమావేశంలో ప్రస్తుత పరిణామాలు, కార్యాచరణ, ప్రభుత్వంతో ఎలా వ్యవహరించాలనే అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పాత జీతాలే ఇవ్వాలని కోరతాం: బొప్పరాజు ఈనెల 3వ తేదీన చలో విజయవాడ నిర్వహిస్తున్నట్లు రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు, స్టీరింగ్ కమిటీ సభ్యుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డు నుంచి అల్లూరి సీతారామరాజు వంతెన మీదుగా భాను నగర్ చేరుకుని సభ నిర్వహిస్తామన్నారు. 7వతేదీ నుంచి సమ్మె తలపెట్టిన నేపథ్యంలో న్యాయపరమైన అంశాలను ఎదుర్కొనేందుకు ఇద్దరు హైకోర్టు సీనియర్ న్యాయవాదులు వైవీ రవి ప్రసాద్, సత్యప్రసాద్‌లను నియమించుకున్నామని తెలిపారు. కొత్త జీవోలను నిలిపివేసి పాత జీతాలే చెల్లించాలని చర్చల్లో కోరతామన్నారు. మేం రాలేదనడం సరికాదు: బండి ఉద్యోగ సంఘాలు చర్చలకు రావడం లేదని మంత్రుల కమిటీ పేర్కొనడం సరికాదని ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు చెప్పారు. స్టీరింగ్ కమిటీలోని 9 మంది సభ్యులంతా చర్చలకు సంబంధించిన అంశంపై సంతకాలు చేసి పంపినట్లు తెలిపారు. అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదో అర్ధం కావడం లేదన్నారు. రివర్స్ పీఆర్సీతో గందరగోళానికి గురి చేస్తున్నారన్నారు. భయపెట్టేలా మెమోలు: సూర్యనారాయణ తమపై తప్పుడు ప్రచారం చేయవద్దని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ కోరారు. జీతాల చెల్లింపుపై అధికారులు భయపెట్టే విధంగా ఖజానా శాఖ ఉద్యోగులకు మెమోలు జారీ చేస్తున్నారని చెప్పారు. ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం ఆటవిక చర్యని విమర్శించారు. ఆర్ధికశాఖ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్నారు. బెదిరింపులకు లొంగేది లేదని, అవసరమైతే న్యాయస్ధానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. ఆర్థిక శాఖలోని ఐఏఎస్ అధికారులపై డీవోపీటీకి ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రింటెడ్ చార్జీ మెమోలకు ఉద్యోగులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. నిబంధనల ప్రకారం సీసీఏ రూల్ 20 ప్రకారం మాత్రమే చర్యలు తీసుకోవాలన్నారు. సర్వీస్ రిజిస్టర్ లేకుండా పే ఫిక్సేషన్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. చలో విజయవాడ సభ నిర్వహించనున్న ప్రాంతాన్ని స్టీరింగ్ కమిటీ సభ్యులు పరిశీలించారు. -
సచివాలయం నకిలీ పత్రాల ఫోర్జరీ కేసులో నలుగురి అరెస్ట్
తాడికొండ: ఏపీ సచివాలయంలో నకిలీ పత్రాలను ఫోర్జరీ చేసి మోసం చేసిన నలుగురు వ్యక్తులను గుంటూరు జిల్లా తుళ్ళూరు పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మంత్రి కొడాలి నాని పేషీలో ఔట్ సోర్సింగ్ అటెండర్‌గా పనిచేస్తున్న సతీష్ వర్మ అనే వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తానంటూ యాగయ్య అనే వ్యక్తి వద్ద రూ. 3.30 లక్షలు తీసుకున్నాడు. ఈ నగదును మధ్యవర్తులుగా వ్యవహరించిన ఆరుగురు వ్యక్తులు పంచుకుని.. ఉద్యోగం ఇస్తానని చెప్పిన వ్యక్తికి నకిలీ డాక్యుమెంట్ ఇచ్చారు. బాధితుడు యాగయ్య ఆ డాక్యుమెంట్‌ను తీసుకొని తనకు ఉద్యోగం ఇవ్వాలంటూ సచివాలయంలోని సివిల్ సప్లయిస్ పేషీలో కలవగా, అధికారులు అది నకిలీదని గుర్తించి అదే విషయం అతనికి చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ వ్యవహారంలో ఆరుగురు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు గుర్తించి సతీష్ వర్మ, షేక్ బాజీ, మేడా వెంకట రామయ్య, వంశీకృష్ణ అనే నలుగురిని అరెస్టు చేశారు. గుంటూరుకు చెందిన సౌజన్య, ఒంగోలుకు చెందిన క్రాంతి కుమార్ పరారీలో ఉన్నందున వారి కోసం గాలింపు చేపట్టినట్టు చెప్పారు. -
ఆరోగ్య సేతు ఉంటేనే ఏపీ సచివాలయంలోకి..
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు ప్రత్యేక నిబంధనలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా ఆరోగ్యసేతు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని ఆదేశించింది. ఆరోగ్య సేతు యాప్ ఉన్నవారిని మాత్రమే సచివాలయంలోకి అనుమతించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శుక్రవారం ఆదేశాలు ఇచ్చారు. హై రిస్క్ జోన్లలో ఉన్న ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే అవకాశం కల్పించాలని స్పష్టం చేశారు. విధులకు వచ్చే ఉద్యోగులు కచ్చితంగా థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్లు, మాస్కులు వినియోగించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉద్యోగులతో పాటు సచివాలయ సందర్శనకు వచ్చే వారిని కూడా ఫోన్లలో ఆరోగ్య సేతు యాప్ ఉంటేనే అనుమతించాలని, లేదంటే అనుమతించరాదన్నారు. దీన్ని కఠినంగా అమలు చేయాల్సిందిగా సచివాలయ చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్‌కు సూచించారు. సచివాలయంలో పనిచేసే ప్రతి ఒక్కరూ బ్లాక్ ప్రవేశం ద్వారం వద్దే థర్మల్ స్క్రీనింగ్‌తో పాటు చేతులను శానిటైజ్ చేసుకోవాలన్నారు. (‘ఆరోగ్య సేతు’ భద్రతా సమస్య.. కేంద్రం క్లారిటీ) ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తప్పనిసరిగా కార్యాలయానికి బయల్దేరే ముందు తన ఆరోగ్య పరిస్థితిని, లక్షణాలను యాప్‌లో స్టోర్ చేయాలి. ఆఫీసుకు వెళ్లే ముందు ‘సేఫ్, లో రిస్క్’ అని సందేశం వచ్చినప్పుడు మాత్రమే కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. కాగా కరోనా తాజా సమాచారంతో పాటుగా వైరస్ వ్యాప్తి చెందకుండా పాటించాల్సిన జాగ్రత్తలు, కేంద్రం అనుసరిస్తున్న నియంత్రణ చర్యలు వంటి అంశాలను అందించే ఆరోగ్య సేతు యాప్‌ను ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా వినియోగించేలా కేంద్రం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆరోగ్య సేతు అప్డేటెడ్ వెర్షన్లో ఎప్పటికప్పుడు వివరాలను నమోదు చేస్తే కరోనా వ్యాప్తిని పసిగట్టి తదుపరి చర్యలు తీసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. (ఉద్యోగులకు మహారాష్ట్ర కీలక ఆదేశాలు) -
సచివాలయంలో పెరిగిన ఉద్యోగుల హాజరు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఉద్యోగుల హాజరు పెరిగింది. లాక్డౌన్ నిబంధనలను సడలించిన నేపథ్యంలో సహాయ కార్యదర్శి, పైస్థాయి అధికారులు అంతా ప్రతిరోజు విధులకు హాజరు కావాలని, సహాయ కార్యదర్శి స్థాయి దిగువ ఉద్యోగులు ఆయా విభాగాల్లో 33 శాతం మంది హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయిన సంగతి తెలిసిందే. దీంతో అన్ని శాఖల్లోనూ 33 శాతం మంది హాజరవుతున్నారు. ప్రభుత్వం ప్రతి ఉద్యోగికి 5 మాస్కులు పంపిణీ చేసింది. అధికారులు ప్రతి రోజు అన్ని విభాగాలను శుభ్రం చేయిస్తున్నారు. ప్రతి సెక్షన్‌లోనూ శానిటైజర్లు ఏర్పాటు చేశారు. సచివాలయం ఉద్యోగులకు ప్రత్యేక బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. అయితే సచివాలయంలోకి సాధారణ విజిటర్లను అధికారులు అనుమతించడంలేదు. -
ఏపీ: వీరు సచివాలయానికి రావాలి
సాక్షి, అమరావతి: లాక్డౌన్ నిబంధనలను సడలించడంతో సహాయ కార్యదర్శి, పైస్థాయి అధికారులు అంతా ప్రతిరోజు సచివాలయంలో విధులకు హాజరు కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదివారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. సహాయ కార్యదర్శి స్థాయి దిగువ ఉద్యోగులు ఆయా విభాగాల్లో 33 శాతం మంది హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి. (నేటి నుంచి.. లాక్డౌన్ సడలింపులు) మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు, ఊపిరి సంబంధిత వ్యాధులు, కిడ్నీ కీమోథెరపీ, రోగనిరోధక శక్తి పెంచుకునే చికిత్స తీసుకునేవారిని విధుల నుంచి తప్పించే అధికారం సంబంధిత శాఖ కార్యదర్శికి వదిలేశారు. గర్భణి ఉద్యోగులు ఇంటి వద్దే ఉండటం మంచిదని సూచించారు. విధులకు హాజరయ్యేవారు సురక్షితంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. కాగా, కరోనా నివారణకు విధించిన లాక్‌డౌన్‌ను కంటైన్మెంట్ క్లస్టర్ల ప్రాతిపదికగా సోమవారం నుంచి కొన్ని రకాల సడలింపులిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. కంటైన్మెంట్ క్లస్టర్లలో మరింత పటిష్టంగా కరోనా కట్టడి చర్యలు చేపట్టనున్నట్టు ప్రకటించింది. (ఎక్కడి వారక్కడే: సీఎం వైఎస్ జగన్) -
ఏపీ సచివాలయంలో గణతంత్ర వేడుకలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదివారం ఉదయం జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శశిభూషణ్ కుమార్, చీఫ్ సెక్యూరిటీ అధికారి కేకే మూర్తి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఇక తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం జాతీయ జెండాను అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎం ముఖ్య కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డి, సీఎం కార్యాలయ కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్, సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, సీఎస్వోలు జోషి, పరమేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీలో గణతంత్ర వేడుకలు అసెంబ్లీలో స్పీకర్ తమ్మినేని సీతారాం జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ వేడుకల్లో అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు, చీఫ్ మార్షల్, అసెంబ్లీ ఉద్యోగులు పాల్గొన్నారు. అలాగే శాసనమండలిలో ఛైర్మన్ షరీఫ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. -
ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా ఉన్నారన్నారు. పీఆర్సీ, డీఏల పట్ల ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని, ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పిన సీఎం హామీని నెరవేర్చేలా కృషి చేస్తామని వెంకట్రామిరెడ్డి తెలిపారు. -
సహకార బ్యాంక్‌లకు ఇంచార్జ్ కమిటీల నియామకం
సాక్షి,అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం 13 జిల్లాల సహకార సెంట్రల్ బ్యాంక్‌లకు పర్సన్ ఇంచార్జ్ కమిటీలను నియమించింది. ప్రతి డీసీసీబీకి 7గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. జిల్లాల వారీగా డీసీసీబీ చైర్పర్సన్ల వివరాలు.. 1) శ్రీకాకుళం- పాలవలస విక్రాంత్ 2) విజయనగరం- మరిసర్ల తులసి 3) విశాఖపట్నం- సుకుమార్ వర్మ 4) తూర్పుగోదావరి- అనంత ఉదయ్‌భాస్కర్ 5) పశ్చిమగోదావరి- కవురు శ్రీనివాస్ 6) కృష్ణా జిల్లా- యార్లగడ్డ వెంకటరావు 7) గుంటూరు- రాతంశెట్టి సీతారామాంజనేయులు 8) ప్రకాశం- మాదాసి వెంకయ్య 9) నెల్లూరు- ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి 10) చిత్తూరు- ఎం.రెడ్డమ్మ 11) కర్నూల్- మాధవరం రామిరెడ్డి 12) వైఎస్సార్ కడప- తిరుపాల్ రెడ్డి 13) అనంతపురం- బోయ వీరాంజనేయులు -
నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం
-
నేడు రాష్ట్ర మంత్రివర్గ భేటీ
సాక్షి, అమరావతి: మరిన్ని ఎన్నికల హామీలను అమల్లోకి తేవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన బుధవారం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ప్రధానంగా వచ్చే జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురానున్న ప్రతిష్టాత్మకమైన ‘జగనన్న అమ్మ ఒడి’ పథకం మార్గదర్శకాలను ఈ సమావేశంలో మంత్రివర్గం ఖరారు చేయనుంది. అలాగే మహిళలు, పిల్లలు తీవ్ర రక్తహీనత, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న 77 గిరిజన మండలాల్లోని 1,642 గ్రామ పంచాయతీల్లో అదనపు పౌష్టికాహారం అందించేందుకు చేపట్టనున్న పైలెట్ ప్రాజెక్టుకు కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఈ పైలెట్ ప్రాజెక్టు ద్వారా 66 వేల మంది గర్భవతులు, బాలింతలకు, 3.18 లక్షల మంది పిల్లలకు అదనపు పౌష్టికాహారం అందిస్తారు. అలాగే హజ్ యాత్రికులకు, జెరూసలేం యాత్రికులకు అందజేసే ఆర్థిక సాయాన్ని రూ.మూడు లక్షలలోపు వార్షికాదాయమున్న వారికి రూ.40 వేల నుంచి రూ.60 వేలకు, మూడు లక్షలపైన వార్షికాదాయమున్న వారికి రూ.20 వేల నుంచి రూ.30 వేలకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. రోబో ఇసుకను ప్రోత్సహించేందుకు ప్రస్తుతమున్న క్రషర్స్‌కు పావలా వడ్డీకే రుణాలను ఏపీఎస్ఎఫ్సీ ద్వారా అందించేందుకు మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఏపీ అడ్వొకేట్స్ సంక్షేమ నిధి చట్టంలో సవరణలు, అలాగే దేవదాయ చట్టంలో సవరణలకు సంబంధించిన ముసాయిదా బిల్లులకు కేబినెట్లో ఆమోదం తెలిపే అవకాశముంది. -
సీఎం జగన్‌తో పాక్సికన్ ఇండియ ఎండీ భేటీ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మంగళవారం సచివాలయంలో ఫాక్సికన్ ఇండియా ఎండీ జోష్ ఫాల్గర్ కలిశారు. ఈ సందర్భంగా సంస్థ కార్యకలాపాలను ముఖ్యమంత్రికి వివరించిన ఫాల్గర్, నెల్లూరు జిల్లా శ్రీ సిటీలో ఉన్న కంపెనీ ద్వారా దాదాపు 15 వేల మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపారు. వారందరికి వృత్తిపరమైన శిక్షణ కూడా ఇచ్చామని చెప్పారు. అదే విధంగా కంపెనీ ఉత్పాదక సామర్థ్యం కూడా పెంచబోతున్నామన్న జోష్ ఫాల్గర్ , ప్రస్తుతం నెలకు 35 లక్షల సెల్ఫోన్లు విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. కాగా, ఎలక్ట్రానిక్ రంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. రాష్ట్రాన్ని ఎలక్ట్రానిక్ హబ్‌గా తీర్చిదిద్దడానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. పెట్టుబడులకు రాష్ట్రం అన్ని విధాల అనుకూల ప్రాంతమన్న ముఖ్యమంత్రి, ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు. ఉత్తమ నైపుణ్యమున్న మానవ వనరులను తయారు చేయడానికి అత్యుత్తమ ప్రమాణాలతో ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మరింత మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే దీని ఉద్దేశమన్న సీఎం జగన్, ఆ దిశలో ఫాక్సికన్ కంపెనీ కూడా ముందుడుగు వేయాలని ఆకాంక్షించారు. -
సీఎంను కలిసిన ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని బుధవారం ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు కలిశారు. సచివాలయంలోని ముఖ్యమంత్రిని కలిసిన వారు ఈ సందర్భంగా ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకోవడంపై ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కలను సీఎం వైఎస్ జగన్ నెరవేర్చుతున్నారు. వీరిని రాష్ట్ర ప్రభుత్వంలోకి తీసుకోవడానికి ఆయన ఆమోదం తెలపడంతో 52 వేల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలుగనుంది. చదవండి: ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కల సాకారం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వంలో ఏపీఎస్ ఆర్టీసీ విలీనానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం విదితమే. దీంతో ఇకపై ఆర్టీసీలోని ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తారు. వీరంతా కొత్తగా ఏర్పాటయ్యే ప్రజా రవాణా శాఖ కిందకు వస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే అన్ని సౌకర్యాలు, నియమ నిబంధనలు ప్రజా రవాణా శాఖలో విలీనం తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు వర్తిస్తాయి. చదవండి: ఆర్టీసీ విలీనం! -
బాధ్యతలు స్వీకరించిన సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు(ప్రజా వ్యవహారాలు)గా సజ్జల రామకృష్ణారెడ్డి గురువారం సచివాలయంలోని తన ఛాంబర్లో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో పెనుమార్పులు జరుగుతున్నాయన్నారు. గత పాలకుల అవినీతిని ఎండగడుతున్నారని, ప్రజల వద్దకు పాలన తీసుకు వెళ్లేందుకు చర్యలు చేపడుతున్నట్లు రామకృష్ణారెడ్డి అన్నారు. తండ్రి వైఎస్సార్ పాలనను అనుకరిస్తూ తనదైన శైలిలో వైఎస్ జగన్ పాలన సాగిస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు సీఎం జగన్ చేస్తున్న యజ్ఞంలో తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన పేర్కొన్నారు. ఏపీ ప్రజా వ్యవహారాల సలహాదారుడిగా విలువైన సలహాలు, సూచనలు చేస్తానని తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన సజ్జల రామకృష్ణారెడ్డికి పలువురు అభినందనలు తెలిపారు. -
24న సీఎం జగన్ అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు
సాక్షి, అమరావతి : ఈనెల 24వ తేదీన జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సదస్సులో ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, విభాగాధిపతులు, ముఖ్య కార్యదర్శులు పాల్గొంటారు. గతానికి భిన్నంగా సచివాయలంలోనే దీనిని నిర్వహించనుంది. గత ప్రభుత్వం ఈ సదస్సును మొదట ప్రయివేటు (ఎ-1) కన్వెన్షన్ సెంటర్లోనూ, తర్వాత కరకట్టవద్ద నిర్మించిన గ్రీవెన్సు హాలులోనూ నిర్వహించింది. అయితే కొత్త సర్కారు మాత్రం కలెక్టర్ల సదస్సును రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయంలోనే నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. పారదర్శక పాలన, గ్రామ సచివాలయాల ఏర్పాటు, ప్రజారోగ్యం మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలు, ఇంటింటికీ నిత్యావసర సరకుల పంపిణీ, పాఠశాలల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫాం సరఫరా, వ్యవసాయ రంగం స్థితిగతులు, కరువు, తాగునీటి ఎద్దడి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ఇందులో సమీక్షిస్తారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన ప్రభుత్వం నిర్వహించనున్న తొలి కలెక్టర్ల సదస్సులో పారదర్శక పాలన, సర్కారు ప్రాధాన్యాలు, కొత్తగా అమలు చేయనున్న సంక్షేమ కార్యక్రమాలకు ఏర్పాట్లు తదితర ప్రధానమైన అంశాలపై చర్చిస్తారు. ప్రభుత్వ ప్రాధాన్యాల ప్రకారం అజెండా రూపొందించి పంపించాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అన్ని జిల్లాల కలెక్టర్లు, విభాగాధిపతులు, శాఖల ముఖ్య కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. సచివాలయం అయిదో బ్లాక్ కాన్ఫరెన్సు హాలులో 24వ తేదీ ఉదయం 10 గంటలకు కలెక్టర్ల సమావేశం ప్రారంభమవుతుందని డాక్టర్ మన్మోహన్ సింగ్ తెలిపారు. రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) తొలి పలుకులతో కలెక్టర్ల సదస్సు ప్రారంభమవుతుంది. -
వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారు: పుష్పశ్రీవాణి
సాక్షి, అమరావతి : గిరిజన శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె ....గిరిజన గ్రామాల్లో ఆరోగ్య కార్యకర్తల వేతనాలను రూ.400 నుంచి రూ.4వేలకు పెంచుతూ తొలి సంతకం చేశారు. గిరిజన ప్రాంతాల్లో మార్కెట్ యార్డుల అభివృద్ధికి రూ.19 కోట్లు విడుదల చేస్తూ ఆమె రెండో సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'గిరిజన సంక్షేమ శాఖ లో పారదర్శక పాలన అందించి, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నమ్మకాన్ని నిలబెట్టుకుంటా' అన్నారు. గిరిజనులకి ఇచ్చిన ప్రతి ప్రభుత్వ పథకాన్ని, హామీని నెరవేర్చి గిరిజనుల ఆత్మ గౌరవాన్ని, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తామన్నారు. గిరిజన ప్రాంతంలో విద్యావకాశాలు మెరుగుపరిచి, గిరిజన ఆడపిల్లలకి వైఎస్సార్ పెళ్లికానుక కింద లక్ష రూపాయలు అందిస్తామన్నారు. గతంలో చంద్రబాబు గిరిజనులని అంటరాని వారిగా చూసి మంత్రి పదవి ఇవ్వలేదని, గిరిజనులని ఉప ముఖ్యమంత్రి చేసిన జగన్మోహన్రెడ్డి చరిత్రలో నిలిచిపోతారన్నారు. -
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బొత్స
-
రాజధానిపై అపోహలు అనవసరం: బొత్స
సాక్షి, అమరావతి: రాజధానిపై అపోహలు అనవసరమని, ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. బొత్స సత్యనారాయణ శనివారం సచివాలయంలో రెండో బ్లాక్‌లో మున్సిపల్ శాఖ మంత్రి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆశీర్వచనాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రి బొత్స కుటుంబీకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.అలాగే మార్కెటింగ్ శాఖ మంత్రిగా మోపిదేవి వెంకటరమణ, ఇరిగేషన్ శాఖ మంత్రిగా అనిల్‌కుమార్ యాదవ్ బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం బొత్స మాట్లాడుతూ...ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని, ఈ ప్రభుత్వం నాది అని పేదలు భావించే రీతిలో పాలన ఉండబోతోందని అన్నారు. ‘చెప్పింది చేస్తాం...చేసేదే చెప్తాం..’ ఇదే జగన్ సర్కార్ విధామని బొత్స తెలిపారు. పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పెంచామని, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు గృహ వసతి కల్పిస్తామని హామీ ఇచ్చారు. పేదలకు పక్కా గృహ నిర్మాణాలు...ఇళ్ల స్థలాలను మంజూరు చేస్తామని, పట్టణ ప్రాంతాల్లో అనాదిగా ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. విభజన తర్వాత పసికందు లాంటి ఏపీని చంద్రబాబు చిక్కిశల్యం అయ్యేలా చేశారని ఆయన మండిపడ్డారు. ఇక చంద్రబాబును విమానాశ్రయంలో తనిఖీలు చేయడం అధికార విధుల్లో భాగమే అని, దేశంలో చాలామంది ప్రతిపక్ష నేతలు ఉన్నారన్నారు. వారిని కూడా తనిఖీలు చేస్తున్నారని, అలాంటిది చంద్రబాబు తనిఖీల వ్యవహారాన్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదన్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సెక్యూరిటీని తొలగించారని, అదేమని అడిగితే మీకంతా రక్షణ అవసరం లేదని అన్నారని బొత్స ఈ సందర్భంగా గుర్తు చేశారు. సవాల్‌గా తీసుకుని పనిచేస్తా: అనిల్‌కుమార్ అన్నదాత సుభిక్షంగా ఉండడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ధ్యేయమని ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఆయన శనివారం బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలో తనకు కేటాయించిన ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేశారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం పుత్తూరు మున్సిపాలిటీకి తెలుగు గంగ నుంచి 1.3 టీఎంసీల తాగునీరు అందించే ఫైల్‌పై ఆయన తొలి సంతకం చేశారు. అనుభవం లేకున్నా తనపై నమ్మకంతో జల వనరుల శాఖ బాధ్యతలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనకు అప్పగించారని, ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. తనకు అప్పగించిన బాధ్యతను ఓ సవాల్‌గా తీసుకుని పని చేస్తానని తెలిపారు. ఇరిగేషన్ శాఖను పాదర్శకంగా చేస్తామని, ఇతర శాఖల కన్నా బెస్ట్ శాఖగా చేస్తామని మంత్రి అనిల్‌కుమార్ పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రారంభించిన ప్రతి ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని అన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతు సుభిక్షంగా ఉండాలని, ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖలో అవినీతి జరిగిందన్న మంత్రి...ఈ ప్రభుత్వంలో దోపిడీ ఉండదని, ప్రతి టెండర్ జ్యూడిషియల్ కమిటీ ముందు ఉంచుతామని తెలిపారు. పాడిరైతు కోసం లీటర్ పాలుకు రూ.4 పెంపు పాడి పరిశ్రమ, మత్య్స శాఖ అభివృద్ధికి కృషి చేస్తామని మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన రైతుల నుంచి పప్పుధాన్యాల కొనుగోలుకు రూ.100కోట్లు విడుదలపై తొలి సంతకం చేశారు. పాడి రైతు కోసం లీటర్ పాలకు నాలుగు రూపాయిలు పెంచుతున్నామని, దీని వల్ల ప్రభుత్వంపై రూ.220 కోట్లు అదనపు భారం పడుతుందన్నారు. పాల సేకరణ ధర పెంపుతో 9లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని మంత్రి మోపిదేవి పేర్కొన్నారు. -
‘తొలి కేబినెట్ భేటీ బాగా జరిగింది’
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన తొలి మంత్రివర్గ సమావేశం చాలా బాగా జరిగిందని పలువురు ఆంధ్రప్రదేశ్ మంత్రులు అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేలా భేటీ సాగిందని తెలిపారు. ప్రజలకు మరింత సేవ చేయాలని సీఎం జగన్ ఆదేశించారని, ముఖ్యమంత్రి ఆదేశాలను తప్పకుండా పాటిస్తామన్నారు. కేబినెట్ సమావేశానికి వచ్చిన మంత్రులు అవంతి శ్రీనివాస్, గుమ్మునూరు జయరాం, మాలగుండ్ల శంకరనారాయణ.. సచివాలయంలో తమకు కేటాయించిన చాంబర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. త్వరలోనే మంచి ముహూర్తం చూసుకొని బాధ్యతలు తీసుకుంటామని తెలిపారు. చాంబర్స్ కేటాయింపుపై మంత్రులు సంతోషం వ్యక్తం చేశారు. (చదవండి: ఏపీ మంత్రులకు పేషీలు కేటాయింపు) -
ప్రభుత్వ ఉద్యోగుల ఐఆర్ 27 శాతం పెంపు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన తొలి కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. దాదాపు ఐదున్నర గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పాదయాత్రలో ప్రజలకిచ్చిన హామీలను అమలు పరిచే దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో ఏ విధంగా విలీనం చేయాలనే దానిపై చర్చించిన కేబినెట్.. ఈ అంశంపై లోతైన అధ్యయనం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తు నిర్ణయం తీసుకుంది. ఆశావర్కర్ల వేతనాల పెంపుకు కూడా ఆమోద ముద్ర వేసింది. దీంతో ఆశావర్కర్ల జీతాలు 10వేల రూపాయలకు పెరగనున్నాయి. అంతేకాకుండా వచ్చే ఏడాది జనవరి 26 నుంచి అమ్మ ఒడి పథకం అమలు చేయాలని వైఎస్ జగన్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం ద్వారా పిల్లలను బడులకు పంపే తల్లుల ఖాతాల్లోకి రూ.15,000 జమ చేయనున్నారు. అలాగే, సీపీఎస్ రద్దు చేసిన పక్షంలో ఆ నిధిని వెనక్కు తీసుకోవడంలో ఎదురయ్యే సమస్యలపై చర్చించడానికి కమిటీ ఏర్పాటుకు వైఎస్ జగన్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కేబినెట్ తీపి కబురు అందజేసింది. ప్రభుత్వ ఉద్యోగుల ఐఆర్ 27 శాతం పెంపునకు ఆమోద ముద్ర వేసింది. సామాజిక పింఛన్లు రూ. 2,250 పెంపునకు కూడా ఆమోదం తెలిపింది. రైతు భరోసాకు ఆమోదం తెలిపిన కేబినెట్.. అక్టోబర్ 15 నుంచి అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ప్రతి శాఖలోను అవినీతి జరగకుండా మంత్రులు సర్వశక్తులు ఒడ్డాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. నామినేటెడ్ పదవులను రద్దు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేశారు. కాగా, కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను మంత్రులు కాసేపట్లో మీడియాకు వివరించనున్నారు. గతానికి భిన్నంగా సాగిన కేబినెట్ సమావేశం.. రాష్ట్ర సమస్యలే ప్రధాన అజెండగా సాగింది. పాదయాత్రలో ప్రజలకిచ్చిన హామీలపై స్పష్టతతో, ఆర్థిక పరిస్థితిపై అవగాహనతోనే తొలి కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి ఇన్ని నిర్ణయాలు తీసుకోగలిగారని చెప్పవచ్చు. చదవండి : ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు -
మంత్రులకు పేషీలు కేటాయింపు
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రివర్గంలో కొలువుతీరిన అమాత్యులకు సోమవారం చాంబర్లు(పేషీ) కేటాయించారు. హోం శాఖ మంత్రి మేకతోటి సుచరితకు రెండో బ్లాక్‌లోని 136 నంబరు గల గదిని కేటాయించగా..అదే బ్లాకులో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు రూమ్ నెంబర్. 215ని కేటాయించారు. రెండోబ్లాకులో వివిధ శాఖా మంత్రులకు కేటాయించిన చాంబర్లు కురసాల కన్నబాబు(వ్యవసాయ శాఖ) - 208 బొత్స సత్యనారాయణ(మున్సిపల్ శాఖ -135 వెల్లంపల్లి శ్రీనివాస్ (దేవాదాయశాఖ) -137 బాలినేని శ్రీనివాసరెడ్డి(విద్యుత్ శాఖ)- 211 బుగ్గన రాజేంద్రనాధ్(ఆర్థిక శాఖ)- 212 మూడో బ్లాక్ పుష్ప శ్రీవాణి(ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ)- 203 అంజాద్ బాషా(ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ వ్యవహారాలు)- 212 పినిపే విశ్వరూప్(సాంఘిక సంక్షేమం)- 211 గుమ్మనూరు జయరాం(కార్మిక శాఖ)- 207 ముత్తంశెట్టి శ్రీనివాస్(పర్యాటక శాఖ)- 210 నాలుగో బ్లాక్ నారాయణ స్వామి(ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్)-127 శ్రీరంగనాథ రాజు(హౌసింగ్)- 211 కొడాలి శ్రీవెంకటేశ్వర రావు(పౌర సరఫరాలు)-130 ఆదిమూలపు సురేష్(విద్యా శాఖ)- 210 మోపిదేవి వెంకటరమణ(మత్స్య శాఖ)-132 అనిల్ కుమార్ యాదవ్(జలవనరుల శాఖ)- 212 మేకపాటి గౌతమ్‌రెడ్డి(ఐటీ)- 208 శంకర్ నారాయణ(బీసీ సంక్షేమం)-131 ఐదో బ్లాక్ ఆళ్ల నాని డిప్యూటీ సీఎం(వైద్య ఆరోగ్యశాఖ)-191 ధర్మాన కృష్ణదాస్(రోడ్స్ అండ్ బిల్డింగ్స్)-193 తానేటి వనిత (మహిళ స్త్రీ శిశు సంక్షేమ)- 210 పేర్ని నాని (రవాణా అండ్ ఐ&పీఆర్)- 211 పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(పంచాయతీ రాజ్,రూరల్ డెవలప్మెంట్, గనుల శాఖ)-188 -
ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలపై ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షత జరుగుతున్న సమావేశంలో సామాజిక పెన్షన్లు రూ.2250కి పెంపుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. అలాగే ఆశా వర్కర్ల జీతాలు రూ.3వేలు నుంచి రూ.10వేలకు పెంపుతో పాటు, ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ పెంపుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కూడా మంత్రివర్గం సుముఖత వ్యక్తం చేసింది. వీలైనంత త్వరలో అందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించింది. అలాగే వైఎస్సార్ రైతు భరోసా పథకం అమలుపై మంత్రివర్గంలో చర్చ కొనసాగుతోంది. అలాగే పారిశుద్ధ్య కార్మికులు, హోంగార్డుల వేతనాల పెంపునకు సంబంధించి ఏం చేయాలన్నదానిపై మంత్రివర్గ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. హోంగార్డుల జీతాల పెంపుపైనా సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఉదయం పదిన్నరకు ప్రారంభమైన మంత్రివర్గ సమావేశం ఇంకా కొనసాగుతోంది. చదవండి: కొనసాగుతున్న ఏపీ కేబినెట్ తొలి సమావేశం -
ఏపీ మంత్రివర్గం తొలి సమావేశం
-
కొనసాగుతున్న ఏపీ కేబినెట్ తొలి సమావేశం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన నూతనంగా విస్తరించిన ఏపీ మంత్రివర్గం తొలి సమావేశం కొనసాగుతోంది. సోమవారం ఉదయం 10.30 గంటలకు సచివాలయం తొలి బ్లాకులోని మొదటి అంతస్తులో ఈ సమావేశం జరుగుతోంది. తొలి కేబినెట్లోనే... పాదయాత్రలో ప్రజలకిచ్చిన హామీలను అమలు పరిచే దిశగా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. రైతులు, మహిళలు, అవ్వా తాతలు, వికలాంగులు, ఉద్యోగులు, కార్మికుల ప్రయోజనాలే ప్రధాన అజెండాగా ముఖ్యమంత్రి కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులు ఎనిమిది అంశాలతో కేబినెట్ అజెండాను రూపొందించారు. అలాగే అక్టోబర్ 15 నుంచి అమలు చేయనున్న వైఎస్సార్ రైతు భరోసా పథకంపై చర్చించనున్నారు. గత వారం రోజులుగా జరుగుతున్న వివిధ శాఖల అధికారిక సమీక్ష సమావేశాల్లో ఇలాంటి నిర్ణయాలకు సంబంధించిన పలు సంకేతాలను వైఎస్ జగన్ ఇచ్చారు. -
చాంబర్లు పరిశీలించిన మంత్రులు
సాక్షి, అమరావతి : కొత్త మంత్రివర్గంలో కొలువుతీరిన అమాత్యులకు చాంబర్ల (పేషీ) ఏర్పాటుకు సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) చర్యలు చేపట్టింది. దీంతో పలువురు మంత్రులు తమకు కేటాయించిన చాంబర్లను పరిశీలించారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం ఉదయం మూడు, ఐదు బ్లాక్‌లను పరిశీలించారు. జీఏడీ అధికారులతో చర్చించి తన చాంబర్‌పై తుది నిర్ణయం తీసుకోనున్నారు. కాగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నిన్న (ఆదివారం) తన సతీమణి ఝూన్సీతో కలిసి ఏపీ సచివాలయంలో తనకు కేటాయించిన చాంబర్‌ను పరిశీలించారు. రెండవ బ్లాక్‌లోని మున్సిపల్ శాఖ మంత్రి పేషీని పరిశీలించిన ఆయన పేషీకి అవసరం అయిన మార్పులు సూచించారు. అలాగే కమాండ్ కంట్రోల్ రూమ్‌ను కూడా పరిశీలించారు. అలాగే దేవాదాయ శాఖమంత్రి వెలంపల్లి శ్రీనివాస్ అనుచరులు ఆయనకు కేటాయించిన పేషీని పరిశీలించారు. నాలుగో బ్లాక్‌లోని విద్యాశాఖ పేషీని ఆయనకు కేటాయించాలని జీఏడీ అధికారులను కోరారు. ఇక విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కుటుంబ సభ్యులు వచ్చి విద్యాశాఖ మంత్రి చాంబర్‌ను పరిశీలించారు. -
ఆశావర్కర్ల వేతనాల పెంపు ఫైల్‌పై తొలి సంతకం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం శనివారం తొలిసారిగా సచివాలయంలో అడుగుపెట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి అధికార యంత్రాంగం ఘన స్వాగతం పలికింది. వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ఉదయం 8.39 గంటలకు సచివాలయం తొలి బ్లాక్ మొదటి అంతస్తులోని తన కార్యాలయంలోకి ప్రవేశించిన వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. అంతకుముందు ఆయన తన కార్యాలయంలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. దేవుడి పటాల వద్ద కొబ్బరికాయ కొట్టారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 42 వేల మంది ఆశా వర్కర్లకు ప్రయోజనం ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు ఆశా వర్కర్ల వేతనాలు రూ.3,000 నుంచి రూ.10 వేలకు పెంచిన ఫైలుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి సంతకం చేశారు. రాష్ట్రంలో 42 వేల మంది ఆశా వర్కర్లు ఉండగా వారి వేతనాలను ఒకేసారి పది వేల రూపాయలకు పెంచడంతో ఏటా రూ.504 కోట్ల మేరకు వారికి ప్రయోజనం కలగనుంది. అనంతపురం–అమరావతి ఎక్స్‌ప్రెస్ వేకి సంబంధించి నిరభ్యంతర సర్టిఫికెట్ ఫైల్‌పై ముఖ్యమంత్రి రెండో సంతకం చేశారు. జర్నలిస్టుల ఇన్సూ్యరెన్స్ రెన్యువల్‌కు సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి మూడో సంతకం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం, డీజీపీ గౌతం సవాంగ్, వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి వైవీ సుబ్బారెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కార్యాలయ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలిసారిగా సచివాలయానికి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంతోపాటు పలువురు ఐఏఎస్‌లు, సచివాలయ ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులు ఘనస్వాగతం పలికారు. ప్రజల ఆశలకు అనుగుణంగా పనిచేద్దాం పరిపాలనలో పారదర్శకత పెంచడంతో పాటు అవినీతి సమూలంగా నిర్మూలించేందుకు అధికార యంత్రాంగం అంతా సహకరించాలని సీఎం వైఎస్ జగన్ కోరారు. తన కార్యాలయంలోకి ప్రవేశించిన అనంతరం వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులనుద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు. పరిపాలనలో మార్పు, కొత్తదనం తేవాలని ప్రజలు తమకు అఖండ మెజారిటీ ఇచ్చారని, వారి ఆశలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయాల్సి ఉందన్నారు. రాజకీయ పార్టీలే కాకుండా అధికార యంత్రాంగం కూడా ప్రజలకు జవాబుదారీగా, బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. వృథా ఖర్చులను తగ్గించి డబ్బులు ఆదా చేసేందుకు అధికార యంత్రాంగం సహకరించాలని కోరారు. అనవసరమైన వ్యయాలను తగ్గిస్తూ నిధులు ఆదా చేసే ప్రతిపాదనలను తెచ్చేవారిని సన్మానిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో పరిపాలన దేశానికే ఆదర్శవంతమయ్యే స్థాయికి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి కోరారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలనే రెండే రెండు పేజీల్లో పార్టీ ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచామని, వాటిని తు.చ. తప్పకుండా అమలు చేయడానికి అధికార యంత్రాంగం సహకరించాలని కోరారు. త్వరలో గ్రామ వలంటీర్లను నియమిస్తామని, వారి ద్వారా అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందిస్తామని చెప్పారు. సుపరిపాలనకు సూచనలు అందచేయాలని అధికారులను ముఖ్యమంత్రి కోరారు. కాలుష్యాన్ని అరికట్టేందుకు ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెట్టాలన్న అధికారుల సూచనను సీఎం స్వాగతించారు. ఘన వ్యర్ధాల నిర్వహణ, గ్రీన్ టాక్స్ విధించడం ద్వారా కాలుష్యాన్ని నివారించవచ్చని సీఎం అభిప్రాయపడ్డారు. అంతకు ముందు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పనిచేయడానికి అధికారులంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సవాళ్లను ధీటుగా ఎదుర్కొని మంచి పనితీరు కనబరిచే ప్రతిభ అధికార యంత్రాంగానికి ఉందన్నారు. ప్రభుత్వ విధానాలు, లక్ష్యాలకు అనుగుణంగా పనిచేసే గొప్ప సామర్థ్యం కలిగిన అధికారులు రాష్ట్రంలో ఉన్నారని చెప్పారు. నిజాయితీగా ఉంటే భయమెందుకు?: సీఎం గత ప్రభుత్వ హయాంలో టెండర్ల విధానాన్ని అపహాస్యం చేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. అంచనా వ్యయాలను భారీగా పెంచేసి కమీషన్లు చెల్లించే కాంట్రాక్టర్లకు అధిక ధరలకు పనులు అప్పగించి ఖజానాకు గండి కొట్టారని చెప్పారు. తమ ప్రభుత్వం టెండర్ల విధానాన్ని ప్రక్షాళన చేస్తుందని, ఇందులో భాగంగానే హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను కలిసి జ్యుడీషియల్ కమిషన్ నేతృత్వంలో టెండర్లు నిర్వహించాలని కోరామన్నారు. ఎక్కువ మంది కాంట్రాక్టర్లు పోటీ పడేలా నిబంధనలు రూపొందించి పారదర్శకంగా టెండర్లను నిర్వహిస్తామన్నారు. దీనివల్ల తక్కువ ధరలకే పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు వస్తారని, ప్రభుత్వ ధనం భారీగా ఆదా అవుతుందని వివరించారు. అక్రమాలకు పాల్పడకుండా నిజాయితీగా ఉంటే సీబీఐ అంటే భయం ఎందుకని ప్రశ్నించారు. అందుకే రాష్ట్రంలో ఎక్కడైనా దర్యాప్తు నిర్వహించేలా సీబీఐకి అనుమతి ఇచ్చామని స్పష్టం చేశారు. -
ఉన్నత విద్యావంతుల కొలువు
సాక్షి, అమరావతి: రాష్ట్ర నూతన మంత్రివర్గంలో ఉన్నత విద్యావంతులున్నారు. చాలామంది మంత్రులు గ్రాడ్యుయేట్లు, పోస్టుగ్రాడ్యుయేట్లే కావడం విశేషం. ఇద్దరు డాక్టరేట్లు పొందిన మంత్రులయ్యారు. ఒక డెంటల్ డాక్టరు కూడా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంఏ, పీహెచ్డీ చేసి డాక్టరేట్ హోదాలో ఉన్నారు. విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆదిమూలం సురేష్ ఇంజనీరింగ్‌లో డాక్టరేట్ పొందడం విశేషం. నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ బీడీఎస్(దంత వైద్యం) కోర్సు చేశారు. పాముల పుష్ప శ్రీవాణి, విశ్వరూప్ బీఎస్సీ పూర్తి చేసిన తర్వాత బీఈడీ చేశారు. కురసాల కన్నబాబు డబుల్ ఎంఏ (రాజనీతి శాస్త్రం, జర్నలిజం) చేశారు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కూడా ఇంజనీరింగ్ పట్టభద్రుడు. శంకరనారాయణ బీకాం చేసిన తర్వాత ఎల్ఎల్బీ చేశారు. మంత్రుల్లో నలుగురు ఎస్సెస్సీ చదివిన వారు ఉండగా, మిగిలిన వారంతా గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, డాక్టరేట్లు సాధించిన వారు కావడం గమనార్హం. తండ్రి, తనయుడి మంత్రివర్గాల్లో ఆరుగురు రాష్ట్ర మంత్రివర్గం పాత, కొత్తల మేలుకలయికగా ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకట రమణారావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, పినిపే విశ్వరూప్, బాలినేని శ్రీనివాసరెడ్డిలకు గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. వీరంతా వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో పనిచేసిన వారే కావడం గమనార్హం. తండ్రి (వైఎస్ రాజశేఖరరెడ్డి) మంత్రివర్గంలో, తనయుడి (వైఎస్ జగన్మోహన్రెడ్డి) మంత్రివర్గంలోనూ చోటు దక్కించుకుని, అరుదైన రికార్డును వీరు సొంతం చేసుకున్నారు. ఈ అరుదైన ఘటన రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ చోటు చేసుకోలేదు. శనివారం ప్రమాణ స్వీకారం చేసిన మొత్తం 25 మందిలో 19 మంది తొలిసారి మంత్రులయ్యారు. వీరిలో బుగ్గన రాజేంద్రనాథ్ ప్రజాపద్దుల కమిటీ(పీఏసీ) చైర్మన్ హోదాలో మంత్రులకున్నంత అనుభవం గడించారు. అప్పుడు తండ్రి.. ఇప్పుడు తనయుడు మచిలీపట్నం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పేర్ని వెంకటరామయ్యకు(నాని) జగన్ మంత్రివర్గంలో చోటు దక్కింది. నాని తండ్రి, దివంగత కృష్ణమూర్తి ఇదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ గతంలో కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గాల్లో పని చేశారు. మహిళలకు హోం శాఖ ఇచ్చింది వైఎస్ కుటుంబమే ఉమ్మడి ఏపీలో దివంగత సీఎం వైఎస్ఆర్ 2009లో రాష్ట్రంలోనే కాదు, దేశ చరిత్రలోనే ఓ మహిళకు హోం మంత్రిత్వ శాఖను కట్టబెట్టి ఓ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. అప్పటివరకూ కేంద్రంలో గానీ, రాష్ట్రాల్లో గానీ హోం శాఖను మహిళలు నిర్వహించిన దాఖలాలు లేవు. అలాంటిది తొలుత వైఎస్ ఆ శాఖను సబితా ఇంద్రారెడ్డికి అప్పగించారు. çపదేళ్ల తరువాత మళ్లీ ఆయన తనయుడు వైఎస్ జగన్ తన మంత్రివర్గంలో ఓ మహిళకు.. అందులోనూ దళిత మహిళ మేకతోటి సుచరితకు హోం శాఖను కేటాయించి చరిత్ర సృష్టించారు. -
ఉద్యోగులకు సీఎం వైఎస్ జగన్ వరాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు వరాల జల్లు కురిపించారు. తొలిసారి సచివాలయానికి వచ్చిన ఆయన శనివారం ఉదయం గ్రీవెన్స్ హాల్లో ఉద్యోగులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ను ప్రకటించారు. అంతేకాకుండా సీపీఎస్ రద్దుపై ఆదివారం జరిగే మంత్రవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచుతామని ప్రకటన చేశారు. 27 శాతం మధ్యంతర భృతి ఇస్తూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే మేనిఫెస్టోలోని హామీలన్నీ అమలు చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రభుత్వం నుంచి పాలన అందించాలంటే ఉద్యోగుల సహకారం కావాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాలు సన్నిహితంగా ఉండటం సర్వసాధారణమని, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించుకోవడానికి సన్నిహితంగా ఉంటారని, గత ప్రభుత్వంతో సన్నిహితంగా ఉన్నవాళ్లను తాను తప్పుపట్టనని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. చదవండి...మీపై పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది : సీఎం జగన్ అంతకు ముందు సచివాలయంలో ఉదయం 10 గంటలకు అన్ని శాఖల కార్యదర్శులు, హెచ్‌వోడీలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంతోపాటు అన్ని శాఖల ముఖ్య అధికారులు, ప్రిన్స్‌పల్ సెక్రటరీలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు తమ ప్రభుత్వాన్ని ఎంతో నమ్మకంతో ఎన్నుకున్నారని, మీరు (అధికారులు) పూర్తిగా సహకరిస్తే ప్రజల- ప్రభుత్వ కల సాకారం అవుతుందని పేర్కొన్నారు. అధికారులపై తనకు పూర్తి విశ్వాసముందని తెలిపారు. తమ ప్రభుత్వంలో అవినీతికి ఆస్కారంలేని పారదర్శక పాలన అందించడానికి తాను దృఢసంకల్పంతో ఉన్నట్టు స్పష్టం చేశారు. అవినీతిని నిర్మూలించి ప్రభుత్వానికి నిధులు ఆదా చేయాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు తమకు ఉన్న పూర్తి అవగాహనతో సహకరించాలని కోరారు. అనవసర వ్యయాన్ని తగ్గించాలన్నారు. మంచి పనితీరు ప్రదర్శించే అధికారులను సన్మాన సత్కారాలతో గౌరవిస్తానని తెలిపారు. మన పాలన దేశానికే ఆదర్శంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. -
మీపై పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది : సీఎం జగన్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం ఉదయం తొలిసారిగా సచివాలయంలో అడుగుపెట్టారు. వేద పండితుల ఆశీర్వచనాల అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం సహా అన్ని శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ప్రజలు ఎంతో నమ్మకంతో ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని, అధికారులు పూర్తిగా సహకరిస్తేనే ప్రజల-ప్రభుత్వ కల సాకారం అవుతుందని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు అధికారులు పూర్తిస్థాయిలో పనిచేస్తారని, ఈ విషయంలో తాను విశ్వాసంతో ఉన్నారన్నారు. అధికారులు తమకు ఉన్న పూర్తి అవగాహనతో.. అవినీతిని నిర్మూలించడంలో ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. సీబీఐ రావడంలో అభ్యంతరం ఏమిటి.. ‘ప్రజలు ఇంత పెద్ద ఎత్తున ఆదరించారంటే వాళ్లకు మాపై ఎన్నో ఆశలు ఉంటాయి. అందుకు తగ్గట్టుగా పాలించాల్సిన అవసరం ఉంది. ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన ప్రణాళిక (మేనిఫెస్టో) అందరికి మార్గదర్శనం కావాలి. దీనిలో ప్రకటించిన అంశాలు అందరు అధికారులకు దిక్సూచి కావాలి. గతంలో మేనిఫెస్టోలు చేసిన ప్రభుత్వాలు.. వాటిని ఎంతవరకు అమలు చేశాయో చూపడానికే వెనుకంజ వేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ వివిధ విభాగాధిపతులు, కార్యదర్శులు, సీనియర్ అధికారులు ఉన్నారు. పారదర్శక పాలన అందించేందుకు మీ తోడ్పాటు అవసరం. మీపై నాకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉన్నాయి. అనవసర వ్యయాన్ని తగ్గించాలి. మంచి పని తీరు ప్రదర్శించే అధికారులను సన్మాన సత్కారాలతో గౌరవిస్తాను. గతంలో కాంట్రాక్టులు అంటే కేవలం తమకు అనువైన వారికి అనుగుణంగానే విధానాలు రూపొందించిన పరిస్థితులు ఉండేవి... కాని ఇకపై ఆ పరిస్థితి ఉండదు. రివర్స్ టెండరింగ్‌కు వెళ్తాము. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసినప్పుడు స్పష్టంగా చెప్పాను. చేసే పనులను మీ ముందు పెడతాము.. జ్యుడిషల్ కమిషన్ వేయండని కోరాను. ఇది దేశంలో ఎక్కడా జరగలేదు. ఇక సీబీఐ ఇక్కడ విచారణకు రావడాన్ని ఎందుకు అడ్డుకోవాలి. మంచి పాలన అందించాలనే సంకల్పంతో ఉన్నాం... సీబీఐ రావడంలో అభ్యంతరం ఏమిటి? క్షేత్రస్థాయి నుంచి ప్రక్షాళన చేపట్టేందుకు గ్రామ వాలంటీర్లను నియమించుకుంటున్నాము. ప్రతీ 50 ఇళ్ళకు ఒక వాలంటీర్ పని చేస్తారు. గ్రామ సచివాలయం కేంద్రంగా వీరంతా పని చేస్తారు. పనులు పారదర్శకంగా, అందరికి పథకాలు ప్రయోజనాలు అందాలన్నదే ఈ విధానం లక్ష్యం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాలనలో చేపట్టబోయే సంస్కరణల గురించి అధికారులకు వివరించారు. చదవండి : సచివాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధంగా ఉన్నాము : సీఎస్ సచివాలయంలో బాధ్యతలు చేపట్టిన తర్వాత తమతో సమావేశమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో మంచి ప్రతిభావంతులైన అధికారుల సమాహారం ఉంది. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పని చేయడానికి అధికారులంతా సిద్ధంగా ఉన్నారు. అనేక సవాళ్ళను సైతం ఎదుర్కొని మంచి పనితీరును ప్రదర్శించే ప్రతిభ ఇక్కడి అధికార యంత్రాంగానికి ఉంది. ప్రభుత్వ లక్ష్యాలు, విధానాలకు అనుగుణంగా పనిచేసే గొప్ప సామర్థ్యం ఉన్న అధికారులు ఉన్నారు’ అని వ్యాఖ్యానించారు. ఆకాంక్షలు నెరవేరుస్తా : సీఎం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా సచివాలయంలో అడుగుపెట్టిన సందర్భంగా.. ప్రజలు, దేవుడి ఆశీస్సులతోనే ఇది సాధ్యమైందని సీఎం వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేసి.. వారి ఆకాంక్షలు నెరవేరుస్తానని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. With God’s and your blessings, I will fulfill your aspirations and live upto your expectations. https://t.co/YX4ccW8tOm — YS Jagan Mohan Reddy (@ysjagan) June 8, 2019 -
అమరావతి : సచివాలయంలో సీఎం జగన్
-
కొలువుదీరిన కొత్త మంత్రివర్గం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నూతన మంత్రిమండలి కొలువుదీరింది. మంత్రులుగా ఎన్నికైన 25మంది ఎమ్మెల్యేలతో గవర్నర్ నరసింహన్ శనివారం పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. సచివాలయంలో సీఎం చాంబర్ పక్కన ఉన్న కాన్ఫరెన్స్ హాల్లో ఈ కార్యక్రమం కన్నులపండువగా జరిగింది. మంత్రుల పదవీ స్వీకార ప్రమాణ కార్యక్రమం కోసం.. ఇక్కడ సర్వాంగ సుందరంగా ఏర్పాట్లు చేశారు. మంత్రులతో గవర్నర్ పదవీ స్వీకార ప్రమాణం ఈవిధంగా ఉంది.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధర్మాన కృష్ణదాస్ (పోలినాటి వెలమ-బీసీ) మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ధర్మాన కృష్ణదాస్ అనే నేను అంటూ.. తెలుగుభాషలో దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు. విజయనగరం జిల్లాకు చెందిన బొత్స సత్యనారాయణ (తూర్పు కాపు బీసీ) మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. బొత్స సత్యనారాయణ అనే నేను అంటూ.. తెలుగుభాషలో ఆయన దైవసాక్షిగా ప్రమాణం చేశారు. విజయనగరం జిల్లాకు చెందిన పాముల పుష్పశ్రీవాణి (ఎస్టీ) మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. పాముల పుష్పశ్రీవాణి అనే నేను అంటూ.. తెలుగుభాషలో ఆమె దైవసాక్షిగా ప్రమాణం చేశారు. విశాఖపట్నం జిల్లాకు చెందిన ముత్యంశెట్టి శ్రీనివాసరావు (కాపు) మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ముత్యంశెట్టి శ్రీనివాసరావు.. అవంతి శ్రీనివాస్ అనే నేను అంటూ తెలుగుభాషలో దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కురసాల కన్నబాబు (కాపు) మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. కురసాల కన్నబాబు అనే నేను అంటూ తెలుగుభాషలో దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ (శెట్టిబలిజ-బీసీ) మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. సుభాష్ చంద్రబోస్ పిల్లి అనే నేను అంటూ తెలుగుభాషలో దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పినిపె విశ్వరూప్ (ఎస్సీ-మాల) మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. విశ్వరూప్ పినిపె అనే నేను అంటూ తెలుగుభాషలో దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (కాపు) మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. కాళీకృష్ణ శ్రీనివాస్ ఆళ్ల అనే నేను అంటూ తెలుగుభాషలో దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన చెరుకువాడ శ్రీరంగనాథరాజు (క్షత్రియ) మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. చెరుకువాడ శ్రీరంగనాథరాజు అనే నేను అంటూ తెలుగుభాషలో దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన తానేటి వనిత (ఎస్సీ-మాదిగ) మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. వనిత తానేటి అనే నేను అంటూ తెలుగుభాషలో దైవసాక్షిగా ఆమె ప్రమాణం చేశారు. కృష్ణా జిల్లాకు చెందిన కొడాలి శ్రీ వెంకటేశ్వర్రావు (కమ్మ) మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. కొడాలి శ్రీ వెంకటేశ్వర్రావు నాని అనే నేను అంటూ తెలుగుభాషలో దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు. కృష్ణా జిల్లాకు చెందిన పేర్ని నాని (కాపు) మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. పేర్ని వెంకటరామయ్య నాని అనే నేను అంటూ తెలుగుభాషలో దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు. కృష్ణా జిల్లాకు చెందిన వెలంపల్లి శ్రీనివాస్ (వైశ్య) మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. వెల్లంపల్లి శ్రీనివాస్ అనే నేను అంటూ తెలుగుభాషలో దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు. గుంటూరు జిల్లాకు చెందిన మేకతోటి సుచరిత (ఎస్సీ-మాల) మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. మేకతోటి సుచరిత అనే నేను అంటూ తెలుగుభాషలో దైవసాక్షిగా ఆమె ప్రమాణం చేశారు. గుంటూరు జిల్లాకు చెందిన మోపిదేవి వెంకటరమణారావు (మత్స్యకారుడు-బీసీ) మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. మోపిదేవి వెంకటరమణారావు అనే నేను అంటూ తెలుగుభాషలో దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డి (రెడ్డి) మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి వాసు అనే నేను అంటూ తెలుగుభాషలో దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేష్ (ఎస్సీ-మాదిగ) మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఆదిమూలపు సురేష్ అనే నేను అంటూ ఆంగ్లభాషలో దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు. పీఎస్సార్ నెల్లూరు జిల్లాకు చెందిన పాలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్ (యాదవ-బీసీ) మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. అనిల్‌కుమార్ యాదవ్ పాలుబోయిన అనే నేను అంటూ తెలుగుభాషలో దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు. పీఎస్సార్ నెల్లూరు జిల్లాకు మేకపాటి గౌతమ్‌రెడ్డి (రెడ్డి) మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. మేకపాటి గౌతమ్‌రెడ్డి అనే నేను అంటూ ఆంగ్లభాషలో దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (రెడ్డి) మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే నేను అంటూ తెలుగుభాషలో దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన కళత్తూరు నారాయణస్వామి (ఎస్సీ-మాల) మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. కళత్తూరు నారాయణస్వామి అనే నేను అంటూ తెలుగుభాషలో దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు. కర్నూలు జిల్లాకు చెందిన బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి (రెడ్డి) మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అనే నేను అంటూ తెలుగుభాషలో దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు. కర్నూలు జిల్లాకు చెందిన గుమ్మనూరు జయరామ్ (బోయ-బీసీ) మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. గుమ్మనూరు జయరామ్ అనే నేను అంటూ తెలుగుభాషలో దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు. వైఎస్సార్ జిల్లాకు చెందిన షేక్ బేపారి అంజాద్ బాషా (ముస్లిం-బీసీ) మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఎస్బీ అంజాద్ అనే నేను అంటూ తెలుగుభాషలో అల్లాసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు. అనంతపురం జిల్లాకు చెందిన మాలగుండ్ల శంకరనారాయణ (కురుబ-బీసీ) మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. మాలగుండ్ల శంకరనారాయణ అనే నేను అంటూ తెలుగుభాషలో దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు. మంత్రుల పదవీ స్వీకార ప్రమాణ కార్యక్రమం.. జాతీయగీతాలాపనతో ముగిసింది. అనంతరం కొత్త మంత్రులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, గవర్నర్ నరసింహన్‌తో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. అంతకుముందు పదవీ స్వీకార ప్రమాణం చేసిన వెంటనే మంత్రులు వరుసగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్, గవర్నర్ నరసింహన్ వద్దకు వెళ్లి అభివాదం చేశారు. ప్రాంగణానికి చేరుకున్న గవర్నర్ నరసింహన్, సీఎం జగన్ సచివాలయంలో సీఎం చాంబర్ పక్కన ఉన్న కాన్ఫరెన్స్ హాల్లో పదవీ స్వీకార ప్రమాణ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు, అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమ ప్రాంగణానికి సీఎం జగన్, గవర్నర్ నరసింహన్ చేరుకున్నారు. మంత్రుల పదవీ స్వీకార ప్రమాణ కార్యక్రమం కోసం.. ఇక్కడ సర్వాంగ సుందరంగా ఏర్పాట్లు చేశారు. ప్రొటెం స్పీకర్‌గా శంబంగి ప్రమాణ స్వీకారం.. ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడు చేత గవర్నర్ నరసింహన్ పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. సీఎం కార్యాలయం పక్కనే గల కాన్ఫరెన్స్ హాల్లో ఉదయం 11.15 గంటలకు శంబంగి ప్రోటెం స్పీకర్‌గా ప్రమాణం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్‌తోపాటు అధికారులు పాల్గొన్నారు. మరికాసేపట్లో 25మంది ఎమ్మెల్యేలతో మంత్రులుగా గవర్నర్ పదవీ స్వీకార ప్రమాణం చేయించనున్నారు. మన పాలన దేశానికి ఆదర్శం కావాలి: సీఎం జగన్ సచివాలయంలో ఉదయం 10 గంటలకు అన్ని శాఖల కార్యదర్శులు, హెచ్‌వోడీలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంతోపాటు అన్ని శాఖల ముఖ్య అధికారులు, ప్రిన్స్‌పల్ సెక్రటరీలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు తమ ప్రభుత్వాన్ని ఎంతో నమ్మకంతో ఎన్నుకున్నారని, మీరు (అధికారులు) పూర్తిగా సహకరిస్తే ప్రజల- ప్రభుత్వ కల సాకారం అవుతుందని పేర్కొన్నారు. అధికారులపై తనకు పూర్తి విశ్వాసముందని తెలిపారు. తమ ప్రభుత్వంలో అవినీతికి ఆస్కారంలేని పారదర్శక పాలన అందించడానికి తాను దృఢసంకల్పంతో ఉన్నట్టు స్పష్టం చేశారు. అవినీతిని నిర్మూలించి ప్రభుత్వానికి నిధులు ఆదా చేయాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు తమకు ఉన్న పూర్తి అవగాహనతో సహకరించాలని కోరారు. అనవసర వ్యయాన్ని తగ్గించాలన్నారు. మంచి పనితీరు ప్రదర్శించే అధికారులను సన్మాన సత్కారాలతో గౌరవిస్తానని తెలిపారు. మన పాలన దేశానికే ఆదర్శంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. ‘రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసినప్పుడు స్పష్టంగా ఇదే విషయం చెప్పాను. ప్రభుత్వం చేసే పనులను మీ ముందు పెడతాం. జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటుచేసి.. మీరు న్యాయమైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరాను. ఇది దేశంలో ఎక్కడా జరగలేదు’ అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. ‘రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసినప్పుడు స్పష్టంగా ఇదే విషయం చెప్పాను. మా ప్రభుత్వం చేసే పనులను మీ ముందు పెడతాం. జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటుచేసి.. మీరు న్యాయమైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరాను. ఇది దేశంలో ఎక్కడా జరగలేదు’ అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. రాష్ట్రంలో మంచి ప్రతిభావంతులైన అధికారుల సమాహారం ఉందని, ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పనిచేయడానికి అధికారులంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అనేక సవాళ్ళను సైతం ఎదుర్కొని మంచి పనితీరును ప్రదర్శించే ప్రతిభ ఇక్కడి అధికార యంత్రాంగానికి ఉందని, ప్రభుత్వ విధానాలు, లక్ష్యాలకు అనుగుణంగా పనిచేసే గొప్ప సామర్థ్యం ఉన్న అధికారులున్నారని ఆయన తెలిపారు. సచివాలయంలో సీఎం హోదాలో తొలిసారి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం ఉదయం సచివాలయానికి చేరుకున్నారు. సీఎం హోదాలో తొలిసారి ఆయన సచివాలయంలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యమంత్రికి ఘనస్వాగతం పలికారు. వేదపండితుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి.. ఉదయం 8.39 గంటలకు తన ఛాంబర్లో సీఎం అడుగుపెట్టారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఆయన తన చాంబర్‌లోని కుర్చీపై ఆసీనులయ్యారు. మూడు ఫైళ్లపై సీఎం జగన్ సంతకాలు సచివాలయంలోకి అడుగుపెట్టి.. ముఖ్యమంత్రిగా బాధ్యతల స్వీకరించిన అనంతరం సీఎం జగన్మోహన్రెడ్డి మూడు ఫైళ్లపై సంతకాలు చేశారు. ఆశావర్కర్ల జీతాలను రూ. మూడు వేల నుంచి రూ. 10వేలకు పెంచుతూ.. తొలి సంతకం చేశారు. అనంతపురం ఎక్స్‌ప్రెస్ హైవేకి కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరుతూ రెండో సంతకం చేశారు. జర్నలిస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యువల్ ఫైల్‌పై సీఎం జగన్ మూడో సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతం సవాంగ్, ధనుంజయరెడ్డి, ఇతర అధికారులు, వేదపండితులు పాల్గొన్నారు. పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నందిగం సురేశ్, ఆదిమూలపు సురేశ్, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, గుమ్మనూరు జయరాం, అనిల్‌కుమార్ యాదవ్, ధర్మాన కృష్ణదాస్, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తదితరులు సీఎం వైఎస్ జగన్‌కు అభినందనలు తెలిపారు. తాడేపల్లి నుంచి సచివాలయానికి.. అంతకుముందు తాడేపల్లిలోని తన నివాసం నుంచి ఆయన సెక్రటేరియట్‌కు చేరుకున్నారు. సచివాలయం తొలి బ్లాకులోని మొదటి అంతస్తులోని సీఎం కార్యాలయంలోకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తొలిసారి ప్రవేశించారు. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో సీఎం వైఎస్ జగన్ అన్ని శాఖల కార్యదర్శులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సచివాలయ ఉద్యోగుల సంఘంతో ఆయన సమావేశం కానున్నారు. సీఎం కార్యాలయం పక్కనే గల కాన్ఫరెన్స్ హాల్లో ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన శంబంగి చినఅప్పలనాయుడు చేత 11.15 గంటలకు గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కూడా హాజరవుతారు. -సాక్షి, అమరావతి (సీఎం వైఎస్ జగన్ షెడ్యూల్ ఇలా... (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సీఎం హోదాలో తొలిసారి సచివాలయానికి
సాక్షి, అమరావతి :ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలిసారి సచివాలయంలో అడుగుపెట్టారు. సచివాలయంలోని తొలి బ్లాకులోని మొదటి అంతస్తులో గల సీఎం కార్యాలయంలోకి ముఖ్యమంత్రి శనివారం ఉదయం 8.39 గంటలకు ప్రవేశించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం పలికారు. ఈ కార్యక్రమంలో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. అంతకు ముందు ముఖ్యమంత్రికి ఉద్యోగులు ఘనంగా స్వాగతం పలికారు. ఉదయం 8.15 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి సెక్రటేరియట్‌కు బయల్దేరారు. ఈ కార్యక్రమం పూర్తయిన తరువాత ఉదయం 9.30 గంటలకు సీఎం వైఎస్ జగన్ అన్ని శాఖల కార్యదర్శులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ వెంటనే సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలతో సమావేశం అయ్యారు. సీఎం కార్యాలయం పక్కనే గల కాన్ఫరెన్స్ హాల్లో ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన శంబంగి చిన అప్పలనాయుడు చేత 11.15 గంటలకు గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ హాజరవుతారు. ముఖ్యమంత్రి షెడ్యూల్ వివరాలు: ఉదయం 8.15 కి తాడేపల్లి నివాసం నుంచి సెక్రటేరియట్‌కు సీఎం జగన్ 8.35 కి సచివాలయానికి ముఖ్యమంత్రి... 8.39 కి సచివాలయంలో తన ఛాంబర్ లో అడుగు పెట్టిన సీఎం... 8.50 కి మొదటి సంతకం చేయనున్న సీఎం జగన్.. 9.10 కి ఉద్యోగ సంఘాల సన్మానం.. 10 గంటలకు కార్యదర్సలు,శాఖాధిపతులతో తొలి సమావేశం.. 10.50 కి ఉద్యోగులనుద్దేశించి మాట్లాడనున్న సీఎం.. 11.15 కి గవర్నర్ సమక్షంలో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం.. 11.42 కి మంత్రుల ప్రమాణస్వీకారం కార్యక్రమానికి హాజరు.. మధ్యాహ్నం ఒంటి గంటకు హై టీ తో ముగియనున్న కార్యక్రమం.. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఏపీ సచివాలయం మొదటిబ్లాక్‌లో మార్పులు
-
ఏపీ సచివాలయంలో మార్పులు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ సచివాలయం మొదటి బ్లాక్‌లో మార్పులు చేపట్టారు. వాస్తుకు అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఛాంబర్‌ను ఆగ్నేయ మూల నుంచి మార్చనున్నారు. ఈ క్రమంలో పాత ఛాంబర్ పక్కన కొత్తగా మరో ఛాంబర్‌ను నిర్మించునున్నారు. అదే విధంగా ముఖ్యమంత్రి చాంబర్లోకి వెళ్లే ఒక ద్వారాన్ని కూడా మూసివేశారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకు గాను 151, 25 పార్లమెంట్ స్థానాలకు గాను 22 స్థానాలు సాధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో సీఎంగా పగ్గాలు చేపట్టిన జగన్ రెండోరోజే సచివాలయంలో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. శుక్ర, శని వారాల్లో ఆయన సచివాలయంలో పరిపాలన వ్యవహారాలు సమీక్షించే అవకాశం ఉంది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నిలిచిపోయిన జీమెయిల్; అనుమానాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయంలో సోమవారం జీమెయిల్ నిలిచిపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ జీమెయిల్ పనిచేయకపోవడంతో సమాచార మార్పిడి నిలిచిపోయింది. ఫలితంగా ప్రభుత్వ సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. సెక్రటేరియట్ నెట్వర్క్ ఐపీలో బ్లాక్ చేయడం వల్లే జీమెయిల్ ఆగిపోయిందని ఉద్యోగ వర్గాలు వెల్లడించాయి. జీమెయిల్ పనిచెయ్యకపోవడంపై ఉద్యోగుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ వ్యవహారాలన్నీ జీమెయిల్ ద్వారానే అధికారులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో హఠాత్తుగా జీమెయిల్ నిలిపివేయడంపై అనుమానాలు రేగుతున్నాయి. జీమెయిల్‌ను కావాలనే నిలిపివేశారా, మరేదైనా కారణం ఉందా అనే దానిపై వెంటనే స్పష్టత రాలేదు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించాల్సివుంది. -
ఏపీ సచివాలయ ఉద్యోగుల దుర్మరణం
కోదాడరూరల్(సూర్యాపేట): కారు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఏపీ సచివాలయ ఉద్యోగులు ఇద్దరు మృతిచెందగా.. మరో నలుగురికి గాయాలయ్యాయి. సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని దోరకుంట శివారులో సోమవారం తెల్లవారుజామున ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథ నం మేరకు.. ఏపీ సచివాలయం సెక్షన్ ఆఫీసులోని జీఏడీ శాఖలో పనిచేస్తున్న టీకే హరికృష్ణ(54) రెవెన్యూ చీఫ్ సెక్రటరీకి పర్సనల్ సెక్రటరీ కొలిశెట్టి భాస్కర్‌రావు(52)తోపాటు మరో నలుగురికి హైదరాబాద్‌లో నివాసాలున్నాయి. వారాంతం కావడంతో శని, ఆదివారాలు కుటుంబ సభ్యులతో గడిపారు. ఉద్యోగ నిర్వహణ నిమిత్తం అమరావతికి కారులో సోమవారం ఉదయం 5:30 నిమిషాలకు బయలు దేరారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని దోరకుంట వద్దకు రాగానే మలుపును గమనించని డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో కారు అదుపుతప్పి మూడు ఫల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో టీకే హరికృష్ణ(54) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. కొలిశెట్టి భాస్కర్‌రావు(52) తీవ్రగాయాల పాలై కోదాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. సెక్షన్ ఆఫీసులోని ఎలక్షన్ విభాగంలో వి«ధులు నిర్వహిస్తున్న విజయలక్ష్మికి తీవ్రగాయాలు కాగా ఆమెను చికిత్స నిమిత్తం కోదాడకు, అక్కడినుంచి ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న పాపయ్యను నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. రెవెన్యూలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న బోరెడ్డి రఘువీరాంజనేయులు, డ్రైవర్ సయ్యద్ ఖలీల్ కోదాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతదేహాలను కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. ఈ ఘటనపై రఘువీరాంజనేయులు ఫిర్యాదు మేరకు రూరల్ సీఐ రవి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులను పరామర్శించిన స్పెషల్ సీఎస్ ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ( భూపరిపాలన విభాగాధిపతి) మదన్మోహన్, ఐఏఎస్ అధికారి చక్రవర్తి కోదాడకు చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న మృతదేహాలను సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు. వైఎస్ జగన్ సంతాపం సాక్షి, అమరావతి: ఏపీ సచివాలయానికి చెందిన ఇద్దరు ఉద్యోగులు సోమవారం తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంపై ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబీకులకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
చంద్రబాబు ఇంధ్రభవనం కట్టుకుని.. సచివాలయాన్ని మాత్రం
-
‘లోకేశ్ టెక్నాలజీతో సచివాలయం’
సాక్షి, విజయవాడ: గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఏపీ సచివాలయంలో లీకేజీలు మరోసారి బయటపడ్డ సంగతి తెలిసిందే. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు లేటెస్ట్ టెక్నాలజీతో తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయం నిర్మించినట్టు గొప్పలు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. గతంలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఛాంబర్లో నీళ్లు లీక్ అయితే నానా మాటలు అన్నారని.. కానీ ఇప్పుడు మంత్రుల ఛాంబర్లలో అదే పరిస్ధితి నెలకొందన్నారు. సచివాలయాన్ని మంత్రి లోకేశ్ టెక్నాలజీతో నిర్మించారని ఎద్దేవా చేశారు. మంత్రులు, అధికారులు సచివాలయంలోకి వెళ్లడానికి భయపడుతున్నారని అన్నారు. వేల కోట్లు ఖర్చుపెట్టి తాత్కాలిక నిర్మాణాలు చేపట్టిన చంద్రబాబు, లోకేశ్‌లు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేరళ తరహా వరద వస్తే సచివాలయం కూలిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. ఇలాంటి పరిస్థితిపై వైఎస్ జగన్ ముందుగానే హెచ్చరించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. విజయవాడలో డ్రైన్లు పొంగిపొర్లుతున్నా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాలకు కొండచరియలు విరిగిపడుతున్నా స్పందించడం లేదని ఆరోపించారు. చంద్రబాబు హైదరాబాద్‌లో ఇంధ్రభవనం కట్టుకుని.. సచివాలయాన్ని మాత్రం లీక్‌ల భవనంగా మార్చారని విమర్శించారు. కాగా, వేల కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన సచివాలయంలో ఇలాంటి పరిస్థితి చోటు చేసుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి; ఏపీ సచివాలయంలో మళ్లీ లీకేజీలు -
ఏపీ సచివాలయంలో మళ్లీ లీకేజీలు
సాక్షి, అమరావతి : ఏపీ సచివాలయంలో మళ్లీ లీకేజీలు బయటపడ్డాయి. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుసున్న వర్షాలకు ఏపీ సచివాలయంలోని మంత్రుల ఛాంబర్లలోకి నీరు వచ్చి చేరింది. భారీ వర్షాలకు సీలింగ్‌లు ఊడిపడుతున్నాయి. మంత్రులు గంటా శ్రీనివాసరావు, అమర్నాథ్రెడ్డి, దేవినేని ఉమ ఛాంబర్‌ల్లో సీలింగ్ ఊడిపడి, ఏసీల్లోకి వర్షపు నీరు వచ్చిచేరింది. 4, 5వ బ్లాకుల్లోని పలు సెక్షన్లలో సీలింగ్ ఊడిపడింది. అసెంబ్లీ బిల్డింగ్లోనూ పలు చోట్ల సీలింగ్ ఊడిపోయి వర్షపు నీరు వచ్చి చేరుతోంది. లీకేజీతో అసెంబ్లీ మొదటి అంతస్తులోని రిపోర్టింగ్ సెక్షన్లోకి వర్షలు నీరు వచ్చి చేరుతోంది. -
సచివాలయంలో ఉద్యోగాల పేరిట మోసం
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగాల పేరిట మోసం జరిగింది. సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు చెందిన నిరుద్యోగుల నుంచి కొందరు కేటుగాళ్లు రూ. కోటి వసూలు చేశారు. నిందితుల్లో బెజవాడ నున్న పీఎస్ కానిస్టేబుల్ సంజయ్ ప్రదీప్ కూడా ఉండటం సంచలనం రేపుతోంది. కానిస్టేబుల్ సంజయ్‌తో పాటు మోసగించిన అనిల్, సునీల్ సోదరుల(వీరు పోలీసు కుటుంబాలకు చెందిన వారే)ను పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఏపీ సచివాలయం టాప్ ఎగిరిపోయింది
-
బతికుండగానే డెత్ సర్టిఫికెట్ సృష్టించి..
సాక్షి, అమరావతి : భూమి కోసం కన్నకొడుకులే కనికరం లేకుండా ప్రవర్తించారు. తల్లి బతికుండగానే.. ఆమె చనిపోయిందంటూ డెత్ సర్టిఫికేట్ తీసుకొని.. భూమి తమ పరం చేసుకున్నారు. భూమి లాక్కున్న విషయం తెలియడంతో ఆ తల్లి తల్లిడిల్లిపోయింది. కన్నకొడుకుల చర్యకు దిగ్భ్రాంతి చెందింది. తనకు న్యాయం చేయాలంటూ అమరావతిలో ఏపీ సచివాలయం ఎదుట నడిరోడ్డు మీద బైఠాయించి నిరసన తెలిపింది. న్యాయం కోసం ఆందోళన చేస్తున్న ఆమెను పోలీసులు బలవంతంగా అక్కడ నుంచి తరలించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెద్దపరిమి గ్రామానికి చెందిన నరసమ్మ తన పేరిట ఉన్న 90 సెంట్ల భూమిని తన ఇద్దరు కొడుకులు లాక్కున్నారని ఏపీ సచివాలయం ఎదుట ఆందోళన దిగారు. తను బతికుండగానే.. అక్రమంగా బూకటపు డెత్ సర్టిఫికెట్ సృష్టించి.. వీఆర్వో వద్ద భూమిని తమ పేరిట బదలాయించుకున్నారని ఆమె వెల్లడించారు. అధికారులకు విన్నవించుకోవడానికి ఇక్కడికి వచ్చానని, గతంలో పలుమార్లు అధికారులను కలిసినా తనకు న్యాయం జరగలేదని ఆమె తెలిపారు. ఈ క్రమంలో రోడ్డుపై బైఠాయించిన ఆమెను బలవంతంగా పోలీసులు అక్కడికి నుంచి బయటకు పంపేశారు. -
కన్నకొడుకుల చర్యకు తల్లి దిగ్భ్రాంతి
-
ఏపీ సచివాలయంలో వేధింపుల పర్వం
-
వైఎస్ జగన్ చాంబర్లో మళ్లీ వర్షపు నీటి లీకేజీలు
-
ప్రతిపక్ష నేత చాంబర్లోకి మళ్లీ వర్షపునీరు
సాక్షి, అమరావతి: కోట్ల ఖర్చుతో వెలగపూడిలో నిర్మించిన సచివాలయం, శాసనసభ భవనాల్లో డొల్లతనం మరోసారి బయటపడింది. మంగళవారం సచివాలయం, శాసనసభ పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసింది. ఈపాటి వర్షానికే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చాంబర్లోకి మరోసారి వర్షపు నీళ్లు చేరాయి. చాంబర్లో సీలింగ్ నుంచి వర్షపు నీరు ధారగా కారుతోంది. ఈ అంశంపై శాసనసభ ఇన్చార్జి కార్యదర్శి ఎం.విజయరాజుకు వైఎస్సార్ సీఎల్పీ సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఇన్చార్జి కార్యదర్శి ఆదేశాల మేరకు శాసనసభ సిబ్బంది వర్షపు నీటిని ఎత్తిపోశారు. గతేడాది జూన్‌లో కురిసిన వర్షానికి ఇదే రీతిలో ప్రతిపక్ష నేత చాంబర్లో వర్షపు నీరు చేరింది. తాజాగా కురిసిన వర్షం కారణంగా ప్రతిపక్ష నేత చాంబర్లోనే మళ్లీ లీకేజీలు బయటపడటం గమనార్హం. -
వైఎస్ జగన్ ఛాంబర్లో వర్షపు నీరు లీకేజీలు
-
వైఎస్ జగన్ ఛాంబర్లో మళ్లీ వర్షపు నీరు
సాక్షి, అమరావతి : కోట్లు ఖర్చుపెట్టి వెలగపూడిలో నిర్మించిన ఏపీ సచివాలయ డొల్లతనం మరోసారి బయటపడింది. మంగళవారం సచివాలయం పరిసరాల్లో కురిసిన భారీ వర్షం కారణంగా పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. దీంతో సచివాలయం చెరువును తలపిస్తోంది. అంతే కాకుండా సచివాలయం గేట్-2 వెయిటింగ్ హాల్ సైతం వర్షపు నీరు లీకేజీ అవుతోంది. దీనితో పాటు అసెంబ్లీలోని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఛాంబర్లో మరోసారి వర్షపు నీరు లీకేజీ అవుతోంది. సీలింగ్ నుంచి నీరు కారుతోంది. గత ఏడాది జూన్ నెలలో కురిసిన భారీ వర్షానికి ఇదే తీరుగా ప్రతిపక్ష నేత ఛాంబర్లో నీరు చేరింది. దీంతో వర్షం నీటిని బయటకు పంపించడానికి సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. అయితే దీనిపై వైఎస్సార్ సీపీ తీవ్ర నిరసనలు చేపట్టడంతో స్పీకర్ విచారణకు ఆదేశించారు. విచారణ చేపట్టిన కమిటీ పైపులను కోసేశారంటూ నివేదిక ఇచ్చి చేతులు దులుపుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కురిసిన వర్షం కారణంగా మళ్లీ లీకేజీలు బయటపడ్డాయి. సచివాలయంలోని ప్రతిపక్షనేత ఛాంబర్‌తో పాటు పలు వెయిటింగ్ హల్లో నీరు చేరడంతో సచివాలయ నాణ్యతపై పలు సందేహాలు వెలువడుతున్నాయి. -
సచివాలయం వద్ద అక్కాచెల్లెళ్ల ఆత్మహత్యాయత్నం
-
ఏపీ సచివాలయం వద్ద తీవ్ర కలకలం
సాక్షి, అమరావతి: ఏపీ సచివాలయం వద్ద తీవ్ర కలకలం రేగింది. సచివాలయం గేటు వద్ద మంగళవారం ఇద్దరు యువతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. సచివాలయ సిబ్బంది వారిని అడ్డుకుని ఆస్పత్రికి తరలించారు. యువతుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. తమ తండ్రి చనిపోవడంతో ఆ ఉద్యోగం తమకు ఇప్పించాలని కర్నూలు జ్లిలా నంద్యాలకు చెందిన షాకీరా(25), ఫాతిమాలు తమ కుటుంబ సభ్యులతో సచివాలయానికి వచ్చారు. అయితే అధికారులు వారిని లోనికి అనుమతించలేదు. దీంతో మనస్తాపానికి గురైన అక్కాచెల్లెళ్లు తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. కాగా, ఏపీ సెక్రటేరియట్ వద్ద ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. గత రెండు నెలల్లో బాధితులు ఆత్మహత్యకు యత్నించడం ఇది నాలుగోసారి. ఇరవై ఏళ్లుగా తిరుగుతున్నాం కర్నూలు జిల్లా కోయిలకుంట్లకు చెందిన మహబూబ్ ఫిరా అగ్రికల్చర్ వీఈవోగా పని చేస్తూ ఇరవై ఏళ్ల క్రితం చనిపోయాడు. దీంతో అప్పటి నుంచి అతని భార్య, ముగ్గురు పిల్లలు అధికారుల చుట్టూ, ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరుగుతూ ఉన్న నష్ట పరిహారం గానీ, ఆ కుటుంబంలో మరో వ్యక్తికి ఉద్యోగం కానీ రాలేదు. ' ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేశాను.. ఒక అమ్మాయి మైనర్ అవ్వడం వల్ల ఉద్యోగం ఇవ్వటం కుదరదని అప్పట్లో అధికారులు చెప్పారు. ఇప్పుడు మా అమ్మాయి షాకిరాకు 19 ఏళ్లు వచ్చినా ఉద్యోగం ఇవ్వడం లేదు. ముఖ్యమంత్రిని కలవడానికి సచివాలయానికి పది సార్లు సచివాలయం వచ్చాము. సెక్యూరిటీ సిబ్బంది లోపలకు పంపించడం లేదు. తిరిగి తిరిగి విరక్తి చెంది షకీరా, ఫాతిమా పురుగు మందు తాగారు' అని పీరా భార్య తెలిపింది. -
‘ఏ తప్పు చేయలేదు, విచారణకు సిద్ధం’
-
నేనెలాంటి తప్పు చేయలేదు...అయినా..
సాక్షి, అమరావతి : అమరావతి: ఇరిగేషన్ శాఖలో సెక్షన్ ఆఫీసర్ వెంకట రామిరెడ్డి సస్పెన్షన్‌పై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వెంకట్రామిరెడ్డిపై బుధవారం సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సస్పెన్షన్‌కు గురైన వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ...‘నేనెలాంటి తప్పు చేయకపోయినా సస్పెండ్ చేశారు. ఎలాంటి విచారణకు అయినా సిద్ధం. విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయి. 50 ఏళ్లకే ఉద్యోగుల పదవీ విరమణ ఆలోచన లేదని చెప్పారు. లేని జీవోని దొంగిలించానని నాపై సస్పెన్షన్ వేటు వేశారు. సస్పెన్షన్‌పై స్పందించాలని సచివాలయ ఉద్యోగ సంఘాన్ని కోరాం. వాళ్లు స్పష్టమైన హామీ ఇవ్వలేదు. రెండు రోజుల్లో చెబుతామన్నారు. ఉద్యోగుల సంఘం నిర్ణయాన్ని బట్టి ఏం చేయాలో ఆలోచిస్తాం.’ అని అన్నారు. ఉద్యోగుల్లో అభద్రతా భావం... హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చిన ఉద్యోగులు అభద్రతతో ఉన్నారని ఏపీ సచివాలయం ఉద్యోగిని భావన అన్నారు. ఏకపక్షంగా ఉద్యోగులను సస్పెండ్ చేయడం సరికాదన్నారు. ఉద్యోగుల్లో అభ్రదతా భావం తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఉద్యోగుల సంఘం స్పందనను బట్టి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామన్నారు. ఈ చర్యపై ఏపీ సచివాలయం మూడో బ్లాక్ వద్ద బుధవారం సాయంత్రం కొందరు ఉద్యోగులు నిరసనకు ప్రయత్నించారు. అయితే, సచివాలయంలో ఎలాంటి ఆందోళనలకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్యోగుల సమస్యలు పట్టించుకోవడం లేదని సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణపై వారంతా మండిపడ్డారు. సచివాలయం ఉద్యోగుల అసోసిషన్ వద్ద భవిష్యత్ కార్యచరణ పై చర్చలు జరిపారు. ఉద్యోగుల నిరసనతో ఎట్టకేలకు వారిని కలిసేందుకు మురళీకృష్ణ ముందుకొచ్చారు. ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులతో మురళీకృష్ణ చర్చలు సాగిస్తున్నారు. నేను ఏ తప్పు చేయలేదు..విచారణకు నేను సిద్ధం -
సీఎం కోసం వచ్చి వ్యక్తి ఆత్మహత్యాయత్నం..
సాక్షి, అమరావతి: ఓ వ్యక్తి సీఎం నారా చంద్రబాబు నాయుడ్ని కలిసేందుకు ఏపీ సచివాలయంకు వచ్చాడు. అక్కడున్న సిబ్బంది అతని లోపలికి అనుమతించలేదు. దీంతో మనస్థాపానికి గురైన ఆ వ్యక్తి తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును తీసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాలివి.. భాదితుడు కర్నూల్ జిల్లా ఆదోనికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. సీఎంను కలిసేందుకు పంపాలని ఆ వ్యక్తి కోరినట్లు తెలిసింది. దీనికి సచివాలయ సిబ్బంది అతని లోపలికి అనుమతించలేదు. వారు సీఎం కాబినేట్ మీటింగ్‌లో ఉన్నారని చెప్పడంతో విషం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది ఆ వ్యక్తిని అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సచివాలయంలో మరో ఉద్యోగిపై వేటు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మరో ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు పడింది. జలవనరుల శాఖలో సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వెంకట్రామిరెడ్డిపై బుధవారం సస్పెన్షన్ వేటు వేశారు. ఉద్యోగుల వయోపరిమితి కుదింపు డ్రాఫ్ట్ కాపీ లీకేజీతో సంబంధం ఉందంటూ వెంకట్రామిరెడ్డిపై ఈ చర్యలు తీసుకున్నారు. కాగా ఇదే వ్యవహారంలో న్యాయశాఖ సెక్షన్ ఆఫీసర్ తిమ్మప్పను సస్పెండ్ చేసిన అధికారులు తాజాగా వెంకట్రామిరెడ్డిపై కూడా సస్పెన్షన్ వేటు వేయడంతో సచివాలయ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కాగా ప్రభుత్వ ఉద్యోగులను 50 ఏళ్లకే ఇంటికి పంపే ప్రతిపాదన లేదని గతంలో సీఎం చంద్రబాబు, మంత్రులు బుకాయించిన విషయం తెలిసిందే. అయితే జీఎం కాపీలను లీక్ చేశారంటూ చర్యలు తీసుకోవడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంకట్రామిరెడ్డిపై ఉద్దేశపూర్వకంగానే చర్యలు తీసుకున్నారని వారు తెలిపారు. ఇటీవల జరిగిన సచివాలయ ఉద్యోగుల ఎన్నికల్లో వెంకట్రామి రెడ్డి అధ్యక్ష పదవికి పోటీ చేశారు. ఆ విషయంలో పోటీ నుంచి తప్పుకోవాలని వెంకట్రామిరెడ్డిని ఇంటికి పిలిచి సీఎం వార్నింగ్ ఇచ్చారని ఉద్యోగులు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల వెనుక.. ఆ ఎన్నికల వివాదమే కారణమని ఉద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ- ఆఫీసు విధానంలోనూ కాపీల లీక్ ఎలా సాధ్యమని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. -
ఏపీ సచివాలయం ఎదుట కలకలం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఎదుట ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. వసుధ అనే యువతి బుధవారం సచివాలయం ప్రధాన గేటు ఎదుట యువతి కళ్లు తిరిగి పడిపోయింది. ఈ విషయాన్ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. వసుధ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. కాగా విజయనగరం జిల్లాకు చెందిన శ్రవణ్ అనే వ్యక్తి వసుధను ప్రేమించి మోసం చేసినట్లు సమాచారం. అయితే అక్కడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో ఆమె... ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసేందుకు వచ్చింది. అయితే వసుధను లోపలికి అనుమతించకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేసింది. కాగా గతంలోనూ ఓ ఆర్ఎంపీ డాక్టర్ కూడా సచివాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం చేసిన విషయం విదితమే. -
ఏపీ సచివాలయం ఎదుట కలకలం
-
ఇంకెన్నాళ్లీ మరమ్మత్తు పనులు ?
-
సచివాలయంలో బుద్ధా వెంకన్న ఓవరాక్షన్
సాక్షి, అమరావతి: ఏపీ సచివాలయంలో ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న హడావిడి చేశారు. నిబంధలనకు విరుద్ధంగా సచివాలయంలోని పబ్లిసిటీ సెల్లో మంగళవారం బుద్ధా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అయితే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలకు పబ్లిసిటీ సెల్ లో ప్రెస్ మీట్లకు అనుమతి లేదని ఐ అండ్ పీఆర్ అధికారులు తెలిపారు. కేవలం మంత్రులు మాత్రమే మీడియా సమావేశం నిర్వహించుకునేందుకు అనుమతి ఉందన్నారు. కానీ అలాంటి నిబంధనలేవి పట్టించుకోని ఆయన సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అనుమతి లేకుండా ప్రెస్ మీట్ పెట్టడంపై మీడియా ప్రతినిధులు బుద్ధా వెంకన్నను ప్రశ్నించారు. దానిపై స్పందించిన ఆయన సచివాలయం.. కమిషనర్ దా అంటూ.. ప్రెస్ మీట్ నిర్వహించారు. -
ఏపీ అసెంబ్లీ భవనానికి వాస్తుదోషం..
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వాస్తు దోషం వదిలేలా కనిపించడం లేదు. దీంతో ప్రభుత్వం అసెంబ్లీ భవనానికి మార్పులు, చేర్పులు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వాస్తు దోషం అంటూ సచివాలయంలో పలు మార్పులు చేర్పులు చేసిన సర్కార్.. అసెంబ్లీ భవనానికి మార్పులు చేయనుంది. వాస్తు కోసం సచివాలయం వైపు అధికారులు ...కొత్త గేటు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే అసెంబ్లీలో ఐదు గేట్లు ఏర్పాటు చేయగా, తాజాగా ఆరో గేటు నిర్మిస్తున్నారు. సచివాలయంలో వాస్తు దోషం కారణంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన రూటు మార్చుకుని వెళుతున్న విషయం విదితమే. అంతేకాకుండా సచివాలయంలో పలు గోడలు, నిర్మాణాలు పగులగొట్టిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో అడుగుపెట్టిన దగ్గర్నుంచీ టీడీపీ సర్కారుకు పలు ఆటంకాలు ఎదురవుతున్నట్లు ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజే ‘ఓటుకు కోట్లు’ కేసులో చంద్రబాబుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. శాసనసభ ప్రారంభం తొలి రోజే ఇలా జరగడంతో టీడీపీ శ్రేణులు అపశకునం ఎదురైనట్లు చర్చించుకున్నారు. దీంతో అసెంబ్లీకి వాస్తు దోషాలు ఉన్నట్లు గుర్తించి మార్పులు చేస్తున్నారు. సచివాలయం వైపు ఆరో గేటు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం రానున్న రోజుల్లో ఇంకా ఏం మార్పులు చేస్తుందో చూడాలి. -
అమరావతి: అసెంబ్లీకి మళ్లీ వాస్తుదోషం
-
సచివాలయానికి వెళ్లం: ఉద్యోగులు
సాక్షి, అమరావతి: ఏపీ సచివాలయం ఉద్యోగులు సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు. ఉద్యోగులంతా కలిసి తాడికొండ అడ్డరోడ్డు వద్ద ఆందోళన నిర్వహించారు. గుంటూరు నుంచి వెలగపూడి సచివాలయానికి వెళ్లే బస్సు నాన్‌స్టాప్ సర్వీస్ పేరుతో నడుపుతూ ఆర్డినరీ సర్వీస్ మాదిరిగా అన్ని స్టాపుల్లో ఆపుతున్నారని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బయోమెట్రిక్ ఆమల్లోకి రావడంతో సమయానికి చేరుకోలేకపోతున్నామని ఉద్యోగులు వాపోయారు. దీనిపై తాము ఆర్టీసీ ఆర్ఎంకు ఫిర్యాదు చేయగా ఆయన సైతం ఎక్కడా ఆపవద్దంటూ ఆదేశాలు జారీచేసినా సిబ్బంది మాత్రం పట్టించుకోకుండా ఆర్డినరీ సర్వీస్ మాదిరిగా నడుపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరించే వరకు సచివాలయానికి వెళ్ళబోమంటూ బస్సు నుంచి దిగి ఆందోళన చేస్తున్నారు. -
సచివాలయానికి కార్పొరేట్ లుక్
- వినోద, క్రీడా సదుపాయాలతో కొత్త భవంతులు - సీఆర్డీఏకు సూచించిన సీఎం చంద్రబాబు సాక్షి, అమరావతి: గూగుల్, ఇన్ఫోసిస్ వంటి కార్పొరేట్ కార్యాలయాలకు దీటుగా ఏపీ సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలను నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీఆర్డీఏకు సూచించారు. కొత్తగా నిర్మించబోయే కార్యాలయాలు ఇప్పుడున్న ప్రభుత్వ కార్యాలయాలకంటే భిన్నంగా ఉండాలన్నారు. ఈ కార్యాలయాల్లో వినోద, క్రీడా సదుపాయాలతో భవంతులు నిర్మించాలన్నారు. బుధవారం ఉండవల్లిలోని తన నివాసంలో రాజధాని వ్యవహారాలపై సీఆర్డీఏతో సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల కార్యదర్శులు, శాఖాధిపతుల కార్యాలయాలు ఒకేచోట ఉండేలా రూపొందించిన డిజైన్లను నార్మన్ ఫోస్టర్ అండ్ పార్టనర్స్ ప్రతినిధులు సమర్పించారు. వీటిపై కార్యదర్శులు, మంత్రుల అభిప్రాయాలు సేకరించాలని సీఆర్డీఏ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. వచ్చిన సూచనలకు అనుగుణంగా తుది డిజైన్లు సిద్ధం చేయాలని సూచించారు. సెప్టెంబర్ 13వ తేదీ నాటికి తుది డిజైన్లు ఇస్తామని ఫోస్టర్ బృందం ఈసందర్భంగా తెలిపింది. -
మాగంటి బాబు Vs పీతల సుజాత
అమరావతి: ఏపీ సచివాలయంలో చింతలపూడి టీడీపీ నేతలు వాదులాటకు దిగారు. కొద్దిరోజులుగా ఎంపీ మాగంటి బాబు, పీతల సుజాత వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. దీనిపై మాట్లాడేందుకు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పుల్లారావు ఇరువర్గాల వారిని సోమవారం నాలుగో బ్లాక్‌లోని తన ఛాంబర్‌కు పిలిపించారు. మాజీ మంత్రి పీతల సుజాత నేతృత్వంలో ఇరువర్గాల వారిని విబేధాలు వీడి పని చేసుకోవాలని సూచించారు. అనంతరం మంత్రి ఛాంబర్ నుంచి బయటకు రాగానే వారు వాదులాటలు మొదలుపెట్టారు. ఈ పరిణామం చూసిన అక్కడి వారు ముక్కున వేలేసుకున్నారు. -
కొంచెం నీరు కొంచెం మద్యం
-
లీకేజీలు చాలా చిన్నవిషయం
-
లీకేజీ వెనుక పెద్ద ప్యాకేజీ ఉంది: ఆళ్ల
హైదరాబాద్ : ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం అంటూ గొప్పలు చెప్పిన ప్రభుత్వం నిర్వాకాన్ని అందరూ చూస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. కొద్దిపాటి వర్షానికే ఏపీ సచివాలయం ఛాంబర్లు వర్షపు నీటితో లీక్ అయిన వ్యవహారంతో ఆంధ్ర రాష్ట్ర పరువును దిగజార్చుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘సచివాలయంలో లీకేజీలు చాలా చిన్న విషయం అని, భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారని మంత్రి నారాయణ అంటున్నారు. ఏపీ సచివాలయం ఛాంబర్ల లీకేజీ వెనక చాలా పెద్ద ప్యాకేజీ ఉంది. మీకు, ప్రభుత్వానికి, చంద్రబాబుకు వచ్చిన ప్యాకేజీ మాత్రం భారీ ఎత్తున ఉండి ఉంటుంది. లీకేజీ వెనుక అసలు విషయం ప్రజలకు తెలియాల్సి ఉంది. అందుకే చదరపు అడుగుకు పదివేల రూపాయిలకు కాంట్రాక్ట్ కట్టబెట్టారు. దీని వెనుక పెద్ద ఎత్తున ప్యాకేజీ కుదిరింది. గతంలోనూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఛాంబర్ కూడా వర్షంనీరు చేరింది. దానిపై సీఐడీ ఎంక్వైరీ వేశారు. నెలరోజుల గడుస్తున్నా దానిపై కదలిక లేదు. ఇప్పుడు మంత్రుల ఛాంబర్లు కురుస్తున్నాయి. ఓ వైపు వర్షం, మరోవైపు అధికారులు పని చేసుకోవాలి. దీంతో వాళ్లు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. చిన్న వర్షానికే ఇలా ఉంటే తుపాను వస్తే పరిస్థితి ఏంటి?. హుద్‌హుద్ తుఫాను సమయంలో కేవలం విశాఖలో రెవెన్యూ శాఖలో రికార్డులు మాయం అయ్యాయి. ఇప్పుడు కూడా సచివాలయం నిర్మాణానికి సంబంధించి ఏ కాంట్రాక్టర్లకు కాంట్రాక్ట్ ఇచ్చారో వాళ్లకు సంబంధించిన పైళ్లు మాయం అయ్యే అవకాశం ఉంది. దీనిపై సీఐడీ కాదు సీబీఐ విచారణ జరిపించాలి.’ అని ఆయన డిమాండ్ చేశారు. -
లీకేజీలు చాలా చిన్నవిషయం: మంత్రి నారాయణ
అమరావతి: ఏపీ సచివాలయంలో తాజా లీకేజీలపై మున్సిపల్ మంత్రి నారాయణ స్పందించారు. లీకేజీలు చాలా చిన్న విషయమని.. భూతద్ధంలో చూపిస్తున్నారని మండిపడ్డారు. స్లాబ్ పై ఉన్న డక్ షీట్ బయటకు రావడం వల్లే నీళ్లు లీకయ్యాయని మంత్రి తెలిపారు. మనం కట్టుకున్నఇళ్లలో కూడా మొదట్లో చాలా లోపాలుంటాయని.. అయితే వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. వర్షం తగ్గగానే మరమ్మత్తులు చేస్తామన్నారు. లోపాలను రెండేళ్లపాటు నిర్మాణ సంస్థలే సరిచేస్తాయని ఆయన తెలిపారు. కాగా మంగళవారం సచివాలయంలో బయటపడ్డ లీక్ లపై మంత్రి నారాయణను మీడియా ప్రశ్నించింది. అయితే మొదట ఆ విషయం తనకు తెలియదని నారాయణ తోసిపుచ్చడం గమనార్హం. -
ఏపీ సచివాలయంలో మళ్లీ లీకేజీలు
-
ఏపీ సచివాలయంలో మళ్లీ లీకేజీలు
అమరావతి:అమరావతి: ఏపీ సచివాలయంలో మళ్లీ లీకేజీలు బయటపడ్డాయి. సచివాలయంలోని నాల్గవ బ్లాక్‌లో పలు ఛాంబర్లలో వర్షపు నీరు లీక్ అవుతోంది. 4వ బ్లాక్ లోని ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మంత్రి గంటా యాంటీ రూమ్, దేవినేని ఉమ ఛాంబర్ తో పాటు పలుచోట్ల వర్షపు నీరు లోపలికి వచ్చింది. కొన్ని చోట్ల విండో గ్లాస్‌ల నుంచి, కొన్నిచోట్ల పై ఫ్లోర్ నుంచి వాటర్ లీక్ అవుతోంది. గంటా యాంటీ రూమ్‌లో సీలింగ్ తడిసి ఊడిపడింది. జలవనరుల శాఖ విభాగంలో చాలా చోట్ల గోడల వెంబడి నీరు వచ్చి చేరుతోంది. దీంతో రెవెన్యూ శాఖ సెక్షన్ లో ఉద్యోగుల పనికి ఆటంకం ఏర్పడింది. బకెట్లతో వర్షపు నీటిని సిబ్బంది తొలగిస్తున్నారు. (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) కాగా గత నెలలో కురిసిన వర్షానికి కూడా సచివాలయంలో వర్షపు నీరు వచ్చి చేరింది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాంబర్లోకి వర్షపు నీరు వచ్చింది. -
ఏపీ సచివాలయంలో వాస్తుదోషం...!
అమరావతి: వాస్తు నెపంతో ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మరోసారి మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి. వాస్తు దోషం ఉందంటూ అధికారులు కొత్తగా మరో గేటు ఏర్పాటు చేస్తున్నారు. అయితే కొత్త గేటు పెట్టేందుకు ప్రహారీ గోడ కూల్చివేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్ కోసం మంత్రుల బ్లాక్‌ల వెనుక ఉన్న రహదారిని ఎమర్జెన్సీ రహదారిగా మార్చివేశారు. ఆ రహదారిలో ఎలాంటి వాహనాలు పెట్టరాదని ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే ఉన్న నాలుగు గేట్లకు అదనంగా మరో గేటు పెట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వాస్తు ప్రకారం అయిదో గేటు ఉండాలనే సూచనతో ఈ మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే వాస్తు దోషం నేపథ్యంలో సచివాలయంలో పలుమార్లు మార్పులు చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే మంత్రుల చాంబర్లతో పాటు వివిధ నిర్మాణాలకు సంబంధించి సుమారు ఏడెనిమిది సార్లు మార్పులు చేపట్టారు. వాస్తు పేరుతో వేలకోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
సచివాలయానికి మరో గేటు
అమరావతి: సచివాలయంలో వాస్తు లోపాల సవరణ చేస్తున్నారు. అందుకోసం కొత్తగా మరో గేటు ఏర్పాటు చేస్తున్నారు. సచివాలయ ప్రహరీ కూల్చివేసి నూతన గేటు నిర్మాణ పనులు చేపట్టారు. ఇప్పటికే సచివాలయానికి నాలుగు గేట్లు ఉన్నాయి. తాజాగా ఏర్పాటు చేస్తున్న గేటుతో ఆ సంఖ్య ఐదుకు చేరింది. సీఎం కాన్వాయి కోసం బ్లాక్‌ల వెనుక ఉన్న దారిని అత్యవసర రహదారిగా మార్చారు. బ్లాక్‌ల వెనుక ఎలాంటి వాహనాలు ఉంచకూడదని పోలీసులు ఆదేశాలు జారీచేశారు. -
చంద్రబాబుకు మళ్లీ వాస్తు భయం
అమరావతి: టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మళ్లీ వాస్తు భయం పీడిస్తోంది. దీంతో ఆయన ఏపీ సచివాలయంలో తన రూట్ మార్చారు. గేట్ నంబర్ 1 నుంచి కాకుండా గేట్ నంబర్ 2 నుంచి చంద్రబాబు సచివాలయంలోకి వెళుతున్నారు. అయితే వాస్తు కారణాలతోనే సీఎం రూట్ మార్చినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా ఓటుకు కోట్లు కేసుతో చిక్కుల్లో పడిన సమయంలోనూ చంద్రబాబు నాయుడు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన ఇంటి వాస్తుపై దృష్టి కేంద్రీకరించారు. ఇందులో భాగంగా ఆయన తన రాకపోకల దారి మార్చుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఇంట్లో నుంచి బయటకు వచ్చాక ఇప్పటివరకూ కుడివైపు తిరిగేవారు. ఇక నుంచి ఎడమ వైపునకు తిరిగి రాకపోకలు సాగించేవారు. అలాగే పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌ను కూడా వాస్తు ప్రకారం మార్పులు చేర్పులు చేసిన విషయం విదితమే. -
ఏపీ సచివాలయం లిఫ్ట్‌లో ఇరుక్కున్నారు
సచివాలయంలో లిఫ్ట్‌లో ఇరుకున్న సిబ్బంది ప్రాణభయంతో హడలిపోయిన బాధితులు లోపలనుంచి తమను రక్షించండని మీడియా ప్రతినిధులకు ఫోన్లు 25 నిముషాల తర్వాత ఎట్టకేలకు లిఫ్ట్ మరమ్మతు సాక్షి, అమరావతి: రెండ్రోజుల క్రితం అసెంబ్లీ నిండా వర్షపు నీళ్లు. అదే రోజు మడుగులా మారిన సచివాలయం. తాజాగా లిఫ్ట్‌లో పదిమంది పారిశుధ్య సిబ్బంది లిఫ్ట్‌లో ఇరుక్కుని ప్రాణభయంతో కేకలు వేయడం ఇదీ సచివాలయంలో తంతు. వివరాల్లోకి వెళితే.. ఏపీ సచివాలయంలో గురువారం సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో ఏడెనిమిదిమంది పారిశుధ్య సిబ్బందితో పాటు ఒకరిద్దరు సందర్శకులు 3వ బ్లాకులో కిందకు దిగేందుకు లిఫ్ట్ ఎక్కారు. లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్‌కు వచ్చింది గానీ, ద్వారాలు తెరుచుకోలేదు. ఎంత అరచినా ఎవరూ స్పందించలేదు. దీంతో లోపలున్న సిబ్బంది ప్రాణభయంతో భీతిల్లారు. దీంతో సాక్షి ప్రతినిధికి ఫోన్ చేశారు. తమకు ఊపిరి (ఆక్సిజన్) అందడం లేదని, తమను రక్షించడంటూ ఫోన్ చేశారు. దీంతో సాక్షి టీవీలో స్క్రోలింగ్‌లు వచ్చాయి. ఒక్కసారిగా విషయం అందరికీ తెలిసింది. విషయం తెలియడంతో సచివాలయంలో ఫొటోగ్రాఫర్లు కూడా 3వ బ్లాకు వద్దకు పరిగెట్టుకుంటూ వెళ్లారు. అక్కడున్న సెక్యూరిటీ సిబ్బందికీ తెలిసింది. దీంతో పరిగెట్టుకుంటూ వెళ్లి లిఫ్ట్ నిర్వాహకులను పిలిపించారు. అప్పుడు వచ్చి లిఫ్ట్ ద్వారాలు తెరుచుకునేలా చేశారు. ద్వారాలు తెరుచుకునే సరికి 25 నిముషాలు పైనే పట్టింది. ద్వారాలు తెరుచుకునే సరికి బాధితులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఐదు నిముషాల అనంతరం ఊపిరి అందడం లేదని, ప్రాణం పోతుందేమోనన్న భయం వచ్చిందని లిఫ్ట్ నుంచి బయటకు వచ్చిన అనంతరం సిబ్బంది చెప్పారు. లిఫ్ట్‌లో ఓ దివ్యాంగుడుకూడా ఉన్నారు. అంతర్జాతీయ రాజధానికి ఆయువుపట్టయిన సచివాయలయంలో 25 నిమిషాలు తమను రక్షించేవాడు లేకపోవడం దారుణమని బాధితుల్లో ఒకరు వ్యాఖ్యానించారు. -
వర్షపు నీటిలో ఏపీ సచివాలయం
అమరావతి: గుంటూరు, కృష్ణా జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. సచివాలయం, చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం పడుతోంది. వర్షం కారణంగా సచివాలయంలోని నాలుగో బ్లాక్ లోకి వర్షపు నీరు వచ్చి చేరుతోంది. దీంతో రెవెన్యూ శాఖ సెక్షన్ లో ఉద్యోగుల పనికి ఆటంకం ఏర్పడింది. అసెంబ్లీ, సచివాలయంలోని పలు ఛాంబర్లు వర్షపు నీటితో నిండాయి. అసెంబ్లీలోని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యాలయంలోకి వర్షపు నీరు సన్నటి ధారగా నీరు పడుతోంది. దీంతో బకెట్లతో వర్షపు నీటిని సిబ్బంది తొలగిస్తున్నారు. కాగా అసెంబ్లీలోకి మీడియాను అనుమతించలేదు. విజువల్స్ తీయకుండా పోలీసులు మీడియాను అడ్డుకున్నారు. కాగా గుంటూరు జిల్లాలోని సత్తెన పల్లి పరిసర గ్రామాల్లో పిడుగు పడే అవకాశం ఉన్నట్లు విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. కృష్ణా జిల్లా కంచికచర్లలో మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా మొదలైన వాన, తీవ్ర ఈదురుగాలులతో స్థానికులు భీతిల్లారు. భీకరమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షంతో చెట్లు నేలకూలాయి. రేకుల షెడ్ల పైకప్పులు గాలికి కొట్టుకుపోయాయి. కుండపోతగా కురిసిన వానతో రోడ్లపై ఎక్కడికక్కడ నీరు నిలిచిపొయింది. దీనికి తోడు ఉరుముల మెరుపులతో జనం భయకంపితులయ్యారు. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరా నిలిచిపొయింది. పట్టణంలో జనజీవనం పూర్తిగా స్తంభించింది. -
సచివాలయ కంప్యూటర్లపై వాన్నా క్రై దాడి!
అమరావతి: ప్రపంచవ్యాప్తంగా వేలాది కంప్యూటర్లను స్తంభింపజేసిన వాన్నా క్రై ర్యాన్సమ్వేర్.. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని పలు కంప్యూటర్లనూ తాకినట్లు అనుమానిస్తున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లోని డిప్యూటీ కార్యదర్శి ఒకరు బుధవారం తన కంప్యూటర్ను ఓపెన్ చేసిన సమయంలో ఈ వైరస్ దాడి వెలుగుచూసింది. తన కంప్యూటర్ ఓపెన్ కాకపోవడంతో వెంటనే ఐటీ అధికారులను పిలిచానని, వైరస్ దాడి జరిగినట్లు ఈ సందర్భంగా గుర్తించామని ఆ అధికారి వివరించారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లోని మరో 9 కంప్యూటర్లలోనూ ఇదే సమస్య తలెత్తినట్లు గుర్తించారు. అయితే సచివాలయంలో ఏ ఒక్క కంప్యూటరూ ర్యాన్సమ్వేర్ బారిన పడలేదని ప్రిన్సిపల్ సెక్రటరీ కె.విజయానంద్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఆ 9 కంప్యూటర్లలోని హార్డ్ డిస్క్‌లను తొలగించినట్లు చెప్పారు. -
మంత్రి అచ్చెన్నాయుడు కొట్టారని..
సచివాలయం వద్ద ఆర్ అండ్ బీ ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం ముఖ్యమంత్రిని కలవనీయలేదని మత్తు బిళ్లలు మింగిన వైనం సీఐ, ఎస్ఐ లైంగికంగా వేధించారని ఆరోపణ బలవంతంగా తరలించిన పోలీసులు? మంగళగిరి/తుళ్లూరు రూరల్ (తాడికొండ): ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు అవకాశం కల్పించలేదని ఆర్అండ్బీ ఉద్యోగిని కూరపాని కల్యాణి సచివాలయం మొదటిగేటు వద్ద బుధవారం మత్తు బిళ్లలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన ఆమెను మంగళగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తరువాత రాత్రి ఏడుగంటల సమయంలో ఆమెను బలవంతంగా రైల్లో సొంత ఊరికి తరలించినట్లు తెలిసింది. ఆస్పత్రిలో ఆమె తనగోడు విలేకరులకు తెలిపారు. రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు తనను కొట్టారని, టెక్కలి సీఐ, ఎస్ఐ లైంగికంగా వేధించారని ఆరోపించారు. తన తండ్రి కూరపాని అప్పారావు ఆర్అండ్బీ శాఖలో రోడ్‌రోలర్ డ్రైవర్‌గా పనిచేస్తూ మృతిచెందడం తో తనకు అదే శాఖలో అటెండర్‌గా ఉద్యోగం వచ్చిందని తెలి పారు. పదోన్నతి కోసం ప్రయత్నిస్తున్న తాను సమర్పించిన పదో తరగతి సర్టిఫికెట్ నకిలీదని ఆర్అండ్బీ అధికారులు తనపై కేసు పెట్టారని చెప్పారు. అధికారులు ఉద్దేశ పూర్వకంగానే వేధిస్తున్నారని తాను తిరిగి వారిపై కేసు పెట్టానని తెలిపారు. టెక్కలి సీఐ, ఎస్ఐ తన కేసు గురించి పట్టించుకోకపోగా తనను లైంగికంగా వేధించారని ఆరోపించారు. సమస్యను మంత్రి అచ్చెన్నాయుడుకు తెలిపేందుకు వెళ్లగా.. ఆయన అధికారుల మాటలు విని తనను కొట్టి అవమానించారని చెప్పారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలసి విన్నవించగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. ఇప్పటివరకు న్యాయం చేయకపోగా తనపై పోలీసులు, ఆర్అండ్బీ అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని ఆవేదనతో చెప్పారు. తన బాధను ముఖ్యమంత్రికి మరోసారి చెప్పుకోవడానికి వస్తే కలవనీయడం లేదని, ఆ మనస్తాపంతో ఆత్మహత్యకు ప్రయత్నించానని ఆమె తెలిపారు. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె నుంచి పట్టణ ఎస్ఐ వినోద్ వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బలవంతంగా తరలిస్తున్నారు.. ‘సాక్షి’కి ఫోన్లో తెలిపిన కల్యాణి ‘సార్ నన్ను పోలీసులు బలవంతంగా విజయవాడ రైల్వే స్టేషన్‌కు తీసుకొచ్చారు. మా ఊరికి పంపుతున్నారు.. నా చుట్టూ పోలీసులున్నారు. మాట్లాడటానికి కూడా వీలులేదు. అందుకే బాత్రూంకి వచ్చి మాట్లాడుతున్నాను.. నేను మా ఊరికి వెళితే నాకు అక్కడ న్యాయం జరగదు.. నాకు న్యాయం కావాలి సార్..’ అంటూ కల్యాణి బుధవారం రాత్రి ఏడుగంటల సమయంలో ‘సాక్షి’ విలేకరికి ఫోన్ చేశారు. సాక్షి ప్రతినిధులు విజయవాడ రైల్వేస్టేషన్‌కు చేరుకునేసరికి ఆమె ఫోన్ అందు బాటులో లేదు. రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాలు గాలించినా ఆమె జాడ కనిపించలేదు. -
మమ్మల్ని సొంత రాష్ట్రానికి పంపండి
తెలంగాణ ఉద్యోగుల ఆవేదన సాక్షి, అమరావతి: రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, రెండు రాష్ట్రాల ఉద్యోగ జేఏసీలు తమను పట్టించుకోవడం లేదని తెలంగాణకు చెందిన ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో పనిచేస్తున్న రాష్ట్ర ఉద్యోగులు సచివాలయ ఉద్యోగ సంఘం నేతలు, అధికారులను కలసి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. తమను సొంత రాష్ట్రానికి పంపాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ పని చేయలేకపోతున్నామని పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడంలేదని ఉద్యోగి శ్రీధర్ తెలిపారు. త్వరలో గవర్నర్‌తో జరిగే సమా వేశంలో తమ సమస్యలపై చర్చించాలని, తమను చేర్చుకునేలా తెలంగాణ ప్రభు త్వాన్ని ఒప్పించాలని కోరారు. ఏపీ సచివాలయంలో 233 మంది, హెచ్‌వోడీ కార్యా లయాల్లో 680 మంది తెలంగాణకు చెందిన ఉద్యోగులు అక్కడ పనిచేస్తున్నారు.