వెలగపూడిలో ఉద్యోగుల వెతలు
సీఎస్ కార్యాలయం సిద్ధం చేయని సీఆర్‌డీఏ
సీఎస్, సీఎం కార్యాలయాల పూర్తికి మరో నెల పడుతుంది
పనులు జరుగుతుండటంతో దుమ్ము, ధూళితో ఉద్యోగులు సతమతం
సాక్షి, హైదరాబాద్: వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయంలో ఉద్యోగుల పరిస్థితి విచిత్రంగా ఉంది. ఒక పక్క పనులు కొనసాగుతుంటే.. మరోపక్క విధులు నిర్వహించాల్సి వస్తోంది. దీంతో దుమ్ము, ధూళితో ఉద్యోగులు సతమతం అవుతున్నారు. తాత్కాలిక సచివాలయం పనులు పూర్తి కాకుండానే హడావుడిగా శాఖలను ప్రభుత్వం తరలించడంతోనే ఈ పరిస్థితి నెలకొంది.
సచివాలయంలో కీలకమైన ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు సీఎస్ కార్యాలయం పనులు ఇంకా పూర్తి కాలేదు. ఈ నెల 11వ తేదీ కల్లా తన కార్యాలయం పూర్తి చేయాలని ప్రధాన కార్యదర్శి టక్కర్.. సీఆర్‌డీఏకు అంతకు నెలరోజుల ముందే చెప్పారు. కానీ ఆ సమయానికి పూర్తి కాకపోవడంతో ముహూర్త సమయానికి సీఎస్ తన కార్యాలయానికి వెళ్లలేదు. అలాగే ముఖ్యమంత్రి చాంబర్ మాత్రమే సిద్ధం చేసిన అధికారులు.. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులకు చాంబర్లు పూర్తి చేయలేదు. సీఎస్‌తో పాటు సీఎం కార్యాలయ అధికారుల చాంబర్లు పూర్తికావడానికి మరో నెల రోజులు పడుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
పొలాల్లో సచివాలయ భవనాలను నిర్మించడంతో నల్లటి పురుగులు కార్యాలయాల్లోకి వస్తున్నాయి. ఆ పురుగులు విడుదల చేసే ఒకరకమైన కంపును ఉద్యోగస్తులు భరించలేకపోతున్నారు. ఉదయం కార్యాలయాలకు వెళ్లే సరికి పెద్ద సంఖ్యలో ఈ నల్ల పురుగులు దర్శనమిస్తున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు ఏ శాఖ కార్యాలయానికి ఒక్క ల్యాండ్ ఫోను కూడా లేదు. ఆ ఫోన్లు రావడానికి మరో నెల పడుతుందంటున్నారు. టాయిలెట్లు సరైన నిర్వహణ లేక దుర్వాసన వస్తున్నాయి. ఇక క్యాంటీన్‌లో భోజనానికి వెళితే క్యూలో నిలబడాల్సిన పరిస్థితి. అసలు వెలగపూడి సచివాలయానికి పోస్టల్ పిన్‌కోడ్ కూడా లేదు. దీనికోసం ఎటువంటి చర్యలను చేపట్టలేదు.