న్యాయపరమైన చిక్కులు తప్పవా?
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణ టెండర్లలో న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశముందని అధికార వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి సీఆర్‌డీఏ నిర్ధారించిన పని విలువకన్నా ఎక్కువకు కాంట్రాక్టు ఏజెన్సీలు బిడ్లను దాఖలు చేయడమే ఇందుకు ప్రధాన కారణమని పేర్కొంటున్నాయి. ఈపీసీ విధానంలో టెండర్లను ఆహ్వానించినందున.. ఆ నిబంధనల మేరకు నిర్ధారించిన పని విలువలో ఐదు శాతానికన్నా ఎక్కువకు టెండర్లను ఖరారు చేయడానికి వీల్లేదని ఉన్నతస్థాయి అధికారి ఒకరు తెలిపారు.
అయితే ప్రస్తుతం టెండర్లలో పాల్గొన్న ఎల్ అండ్ టీ, షాపూర్జీ-పల్లోంజీ సంస్థలు సీఆర్‌డీఏ నిర్ధారించిన పని విలువకన్నా ఎక్కువ మొత్తానికి బిడ్లను దాఖలు చేశాయి. దీంతో వాటితో సంప్రదింపులద్వారా టెండర్ నిబంధనలకన్నా ఐదు శాతం ఎక్కువకు మించకుండా బిడ్ ధరల్ని తగ్గించుకునేలా చేయాలని, అలాగాక ఐదు శాతానికన్నా ఎక్కువకు టెండర్లను ఖరారు చేస్తే న్యాయపరంగా చెల్లదని ఆ అధికారి స్పష్టం చేశారు.
టెండర్ నిబంధనల్లో ఆ విషయం చెప్పలేదు..
ఐదు శాతానికన్నా ఎక్కువకు టెండర్లను దాఖలు చేసినప్పటికీ వాటిని పరిగణనలోకి తీసుకుంటామని టెండర్ నిబంధనల్లో పేర్కొనలేదు.. దీంతో మిగతా కాంట్రాక్టు ఏజెన్సీలు టెండర్లలో పాల్గొనలేదు.. అలా ంటప్పుడు ఐదు శాతానికన్నా ఎక్కువకు టెండర్లను ఎలా ఖరారు చేస్తారనే ప్రశ్న తలెత్తుతుందని ఉన్నతాధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఐదు శాతానికన్నా ఎక్కువకు టెండర్లను ఖరారు చేస్తారనే విషయం తెలిసుంటే తాము కూడా పాల్గొనేవారమని మిగతా కాంట్రాక్టు సంస్థలు పేర్కొంటే.. న్యాయపరంగా వారి వాదన బలంగా ఉంటుందన్న అభిప్రాయాన్ని ఆ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. గతంలో జలయజ్ఞం టెండర్ల సమయంలోనూ ఐదు శాతానికన్నా ఎక్కువకు టెండర్లు దాఖలు చేసినప్పుడు సంప్రదింపులద్వారా ఐదు శాతానికన్నా తక్కువకు తగ్గించుకున్నాకనే టెండర్లను ఖరారు చేయడాన్ని ఉన్నతాధికారి ఒకరు ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు.
మూడు ప్యాకేజీలుగా విభజన..
నిజానికి తాత్కాలిక సచివాలయాన్ని ఆరులక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, మొత్తం ఆరు బ్లాకులుగా నిర్మాణం చేపట్టాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది. రెండేసి బ్లాకుల చొప్పున మూడు ప్యాకేజీలుగా విభజించి ఈపీసీ విధానంలో టెండర్లను ఆహ్వానించారు. 1వ ప్యాకేజీలో ఒకటి, రెండు బ్లాకుల నిర్మాణ విలువను రూ.57.24 కోట్లుగా నిర్ధారించారు. రెండోప్యాకేజీలో మూడు, నాల్గవ బ్లాకుల నిర్మాణ విలువను రూ.56.45 కోట్లుగా, మూడవ ప్యాకేజీలో ఐదు, ఆరు బ్లాకుల నిర్మాణ విలువను రూ.57.05 కోట్లుగా నిర్ధారించారు.
మొత్తం తాత్కాలిక సచివాలయ నిర్మాణ విలువను సీఆర్‌డీఏ రూ.170.74 కోట్లుగా నిర్ధారించింది. ఈ మొత్తంమీద ఎల్‌అండ్‌టీ గానీ, షాపూర్జీ-పల్లోంజీ సంస్థగానీ ఐదు శాతానికన్నా ఎక్కువ కోట్ చేయడానికి వీల్లేదు. సీఆర్‌డీఏ నిర్ధారించిన రూ.170.74 కోట్లకంటే ఎంత తక్కువకు ఏ సంస్థ కోట్ చేస్తే దానికి పనులప్పగించేందుకు ఏ సమస్యా ఉండదు. అయితే సీఆర్‌డీఏ నిర్ధారించిన ధరకంటే ఐదు శాతానికి ఎక్కువగా టెండర్లను దాఖలు చేసినందున, ఆ ధరకు టెండర్లను ఖరారుచేస్తే న్యాయపరమైన చిక్కులు తప్పవనేది అధికారవర్గాల భావనగా ఉంది.
తేలని ‘తాత్కాలిక’ టెండర్లు
సాక్షి, విజయవాడ బ్యూరో: తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి సంబంధించిన టెండర్ల ఖరారు ప్రక్రియ ఇంకా కొలిక్కిరాలేదు. సీఆర్‌డీఏ నిర్దేశించిన చదరపు అడుగు రూ.3 వేల కంటే 35 శాతం ఎక్సెస్‌కు కోట్ చేసిన ఎల్ అండ్ టీ, షాపూర్జీ-పల్లోంజీ సంస్థలను ధర తగ్గించుకునేలా ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఆ సంస్థల ప్రతినిధులతో మంత్రి నారాయణ నేతృత్వంలో మూడు రోజులపాటు సుదీర్ఘంగా చర్చలు జరిపినప్పటికీ ఫలితం లేకపోయింది. అయితే వాటికే టెండర్లను ఖరారు చేయాలని ప్రభుత్వం సూచించడంతో ఆ సంస్థల్ని ఎలాగైనా ఒప్పించేందుకు సీఆర్‌డీఏ అధికారులు తంటాలు పడుతున్నారు. మంత్రి నారాయణ అందుబాటులో లేకపోవడంతో సోమవారం తిరిగి ఆ సంస్థలతో చర్చలు జరపాలని నిర్ణయించారు.