సంపద సృష్టి అనే మాటను తరచూ వింటుంటాం. ప్రత్యేకించి ఏపీలో ఒక నాయకుడు తనకే సంపద సృష్టించడం తెలుసు అని ఏదేదో చెబుతుంటారు. కానీ, మరో నాయకుడు సంపద సృష్టించి చూపించారు. తనకు మళ్లీ అధికారం ఇస్తే పేదలను ధనికులను చేస్తానని పద్నాలుగేళ్లు సీఎంగా పనిచేసిన టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు చెబుతుంటే, ముఖ్యమంత్రి జగన్ తాను అధికారంలో ఉన్న సమయంలోనే పేదలకు లక్షల విలువైన ఆస్తి సమకూర్చి ‘ఇదీ.. పేదలను ఆదుకోవడం’’ అని రుజువు చేసుకుంటున్నారు.
అమరావతి రాజధాని గ్రామాలలో ఇరవైఐదు లే అవుట్లలో పేదలకు ఇళ్ల నిర్మాణానికి శ్రీకారంచుట్టిన సందర్భంగా జగన్ చేసిన ప్రసంగం చూస్తే కొన్ని స్పష్టమైన నినాదాలు, విధానాలతో ఆయన ముందుకు వెళుతున్నట్లు అర్ధం అవుతుంది. తొలుత ఒక లబ్దిదారు మాట్లాడుతూ తనకు కేటాయించిన సెంటు భూమి విలువ ఇప్పుడు పది లక్షలకు పైనే ఉంటుందని ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. దానికి తోడు ఇప్పుడు ఇంటి నిర్మాణానికి మరో మూడు లక్షలు, అక్కడ మౌలిక వసతులకు ఖర్చు పెట్టబోయే నిదులను లెక్క వేసుకుంటే మొత్తం పదిహేను లక్షల వరకు ఆమెకు సమకూరినట్లవుతుంది. నిజంగానే సంపదను సృష్టించడం అంటే ఇది కదా అని అనిపిస్తుంది.
✍️ గతంలో అమరావతి గ్రామాలలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. రాజధాని అని ప్రకటించినప్పుడు భూములు కలిగిన ఆసాములు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అమెరికా నుంచి వచ్చిన ఎన్‌ఆర్‌ఐలు లబ్ది పొందితే.. ప్రస్తుతం జగన్ ముఖ్యమంత్రి అయ్యాక నిరుపేదలకు ఆ ప్రాంతంలో లబ్ది పొందడం గమనించదగిన అంశమే అవుతుంది. అందుకే ఆయన పెత్తందారులే అక్కడ పాగ వేయాలని అనుకున్నారని, కాని తాము పేదలకు అవకాశం ఇచ్చామని, దీనిని సామాజిక అమరావతిగా. మనందరి అమరావతిగా మార్చామని జగన్ ప్రకటించారు. అంతేకాదు.. ఉపన్యాసం ఆరంభంలోనే ఈ ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా, ఆ తర్వాత ఇళ్ల నిర్మాణం జరగకుండా చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడు అడ్డుపడ్డారంటూ ధ్వజమెత్తారు.
✍️ అయినప్పటికీ మీ బిడ్డ మీ తరపున మూడేళ్లపాటు న్యాయపోరాటం చేసి, పేదలకు ఇళ్లు కట్టించడం వరకు తెచ్చామని, ఇది చరిత్రాత్మకమైన రోజు అని జగన్ పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు ఇళ్లు కట్టవద్దంటూ ఏపీలోనే ప్రతిపక్షం అడ్డుపడిందని ఆయన మండిపడ్డారు. హైకోర్టులో 18 కేసులు, సుప్రీం కోర్టులో ఐదు కేసులు వేసి అడ్డుకునే యత్నంచేశారని ఆయన చెప్పారు. చంద్రబాబు నాయుడు తన మనుషుల ద్వారా కేంద్ర మంత్రులను, అధికారులను కలిసి పేదలకు ఇళ్లు రాకుండా చేయాలని, నిధులు రాకుండా అడ్డుపడాలని చూశారని ఆయన తెలిపారు. ఊరుపేరులేని సంఘాలను కూడా ఇందుకోసం ఏర్పాటు చేశారని ఆయన చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
✍️ ఒకప్పుడు అమరావతి రాజధానిలోకి జగన్ రాకూడదని కొందరు పసుపు నీళ్లు చల్లి అవమానించే యత్నం చేస్తే.. ఇప్పుడు అదే ప్రాంతంలో జగన్ యాభై నాలుగువేల మందికి ఇళ్లు కట్టిస్తుండడం విశేషం. చంద్రబాబు ఆధ్వర్యంలోని తెలుగుదేశం, పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన , అలాగే ఈనాడు తదితర ఎల్లో మీడియా పేదలకు ఎలా వ్యతిరేకంగా ఉన్నారో ఆయన ఆధారసహితంగా వివరించడం ద్వారా రాష్ట్రం అంతటికి ఒక మెస్సేజ్ పంపించారు. తాను పేదల ప్రతినిధినని.. చంద్రబాబు, పవన్ లు పెత్తందార్ల ప్రతినిధులని, పేదల కోసం తాను పలు స్కీములు అమలు చేస్తుంటే, చంద్రబాబు తదితరులు వాటిని అడ్డుకుంటున్నారని.. తాను చేస్తున్న వాదనకు ఆయా ఉదాహరణలను కూడా జగన్ ఇచ్చారు. ప్రత్యేకించి పేదలు చదివే ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మీడియం వద్దంటున్నారని ఆయన గుర్తు చేశారు.అదే టైమ్ లో ఆ పెత్తందార్లంతా తమ పిల్లలను ఇంగ్లీష్ బడులలో చదివిస్తున్నారని ఎద్దేవ చేశారు.
✍️ పేదవారికి తాను మేలు చేస్తుంటే వీరు ఓర్వలేకపోతున్నారని చెప్పడానికి ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. వలంటీర్ల వ్యవస్థ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. కాకపోతే వెంకటగిరిలో చేసిన వ్యాఖ్యలను ఇక్కడ ఆయన మాట్లాడలేదు. మొత్తం స్పీచ్ లో పెత్తందార్లు, పేదల మధ్య పోరాటం గురించే ఆయన చెప్పే యత్నం చేశారు కాని, ఇతరత్రా రాజకీయ అంశాల జోలికి వెళ్లలేదు.
✍️ అమరావతి ప్రాంతంలో గజం విలువపదిహేను వేల వరకు ఉన్న విషయాన్ని ప్రస్తావించి , ఆ స్థలాలతో పాటు,రోడ్లు, నీరు, పార్కులు, తదితర సదుపాయాలు సమకూర్చుతున్న సంగతిని ఆయన వివరించి 12 లక్షల నుంచి పదిహేను లక్షల రూపాయల మేర ఆస్తిని సమకూర్చినట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికి పేదలకు సంబంధించి ఇంత భారీ కార్యక్రమం చేపట్టలేకపోయారు. సంపద సృష్టి అంటే ఆయన ప్రధానంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాన్నే చూస్తారన్న భావన ఉంది. అదికూడా బాగా డబ్బున్నవారికే అదనంగా వచ్చే ఆదాయవనరుగా మార్చడం మినహాయించి పేదల పక్షాన ఆయన ఉండేవారు కాదన్న విమర్శ ఎప్పటినుంచో ఉంది. అమరావతిని ఒక వర్గం రాజధానిగా, ధనికుల రాజధానిగా మార్చడానికి చంద్రబాబు ప్రయత్నించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నిరసనకు గురయ్యారు. అందుకే అమరావతిని జగన్ పేదలు కూడా నివసించే రాజధానిగా మార్చినట్లయింది. ఇక్కడ కొందరు ఒక విషయం ప్రస్తావిస్తున్నారు.
✍️ జగన్ ఇక్కడ పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చింది వాస్తవమేకాని, ఇతరత్రా అభివృద్ది ఎందుకు చేయడం లేదని అడుగుతున్నారు. దానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టమైన జవాబు ఇచ్చారు. రాజధాని ప్రాంతంలో ఏ పని చేద్దామన్నా కేసులు వేసి అడ్డుకుంటున్నవారే ఈ ప్రశ్నలు వేస్తున్నారని , తమకు అన్ని ప్రాంతాలు సమానమేనని, కేసుల గొడవ లేకపోతే అమరావతిని కూడా అభివృద్ది చేసి చూపిస్తామని ఆయన అన్నారు. రాజధాని గ్రామాలలో కొంతమంది తెలుగుదేశం, తదితర కొన్ని రాజకీయ పక్షాల ట్రాప్ లో పడి , అక్కడ అభివృద్ది కన్నా, ఆందోళనలకే ప్రాధాన్యం ఇచ్చారు. అది వాస్తవం.
✍️ చంద్రబాబు నాయుడు పరాజయం చెందినా, ఆయన మాట ప్రకారమే నడుచుకుని వాళ్లు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. అదే జగన్ ముఖ్యమంత్రి కాగానే అనవసర నిరసనలకు పోకుండా, వారంతా ఒక కమిటీగా ఏర్పడి, జగన్ ను కలిసి తమకు కావల్సిన అభివృద్ది పనులను చేయించుకుని ఉంటే బాగుండేది!. పైగా ఒకేసారి 55 వేల ఎకరాల భూమిని అభివృద్ది చేయడం ఎవరి వల్లా కాదు. చంద్రబాబు నాయుడు ప్రచారం కోసం అలివికాని పనిని భుజాన వేసుకుని చతికిలపడ్డారు. పైగా ఆయన టైమ్ లో రాజధాని ప్రాంతంలో పేదలకు ప్రాతినిధ్యమే లేదన్నట్లుగా వ్యవహారాలు సాగాయి. చివరికి అస్సైన్డ్ భూములను కూడా తమ అధీనం చేసుకున్నారు. దానికి ఆనాటి ప్రభుత్వం సహకరించి అప్రతిష్టపాలైంది. ఏది ఏమైనా జగన్ ఇప్పుడు పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి కొత్త టౌన్ షిప్ లు నిర్మించడం కూడా అభివృద్దిలో భాగమే అవుతుంది. ఇదే మాదిరి ఇతరత్రా అభివృద్ది పనులు కూడా జరిగేలా అందరు సహకరిస్తే మంచిది. లేకుంటే ఎప్పటిమాదిరి పెత్తందారి పోకడలతోనే,కుట్రలలోనే భాగస్వాములవుతామని ప్రతిపక్షం అనుకుంటే అది వారికే నష్టం అని వారు తెలుసుకోవాలి.
::: కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment