సాక్షి, అమరావతి: అమరావతి సీఆర్డీఏ ప్రాంతంలో రైతులకు ప్లాట్ల కేటాయింపు వ్యవహారంపై ‘ఈనాడు’ దినపత్రిక మరోసారి తన దివాళాకోరు తనాన్ని బయటపెట్టింది. గత ప్రభుత్వంలో రైతులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంటే తట్టుకోలేక బురద జల్లేందుకు పూనుకుంది. ‘ప్లాట్లు రద్దు చేసుకోవాలంటూ రైతులకు లేఖలు’ శీర్షికన వాస్తవాలను దాచేసి పూర్తిగా వక్రీకరణకు దిగింది. వాస్తవానికి అమరావతి సీఆర్డీఏ ప్రాంతంలో గత ప్రభుత్వం భూ సమీకరణ ద్వారా 34,400 ఎకరాలను సమీకరించింది.
ఈ భూములిచ్చిన రైతులకు 63,462 నివాస/వాణిజ్య ప్లాట్లు కేటాయించింది. అయితే.. కొందరు రైతులు భూ సమీకరణకు భూములిచ్చేందుకు నిరాకరించగా, ఇలాంటి చోటా గత ప్రభుత్వం భూ సేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై ఆ ప్రాంత రైతులు న్యాయస్థానాలను ఆశ్రయించి స్టే కూడా తెచ్చుకున్నారు. ఈ వివాదాలు పరిష్కారం కాకుండానే ఆ భూముల్లోనూ ప్లాట్లను కేటాయించేశారు. గత ప్రభుత్వం భూసేకరణను, ప్లాట్ల కేటాయింపు ఎంత అస్తవ్యస్తం చేశారో చెప్పడానికి ఇదో నిదర్శనం.
రైతులకు మేలు చేస్తుంటే తప్పుడు రాతలు
సీఆర్డీఏ ప్రాంతంలో భూములిచ్చిన వారికి కేటాయించిన ప్లాట్లలో 3,356 ప్లాట్లు ఈ విధంగా భూ సేకరణ ప్రక్రియలో, కోర్టు తగాదాలతో రైతులకు రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు లేకున్నా 953 ప్లాట్లను రిజిస్టర్ చేసేశారు. అంటే భూమి లేకుండానే రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయి.
ఈ సమస్యను సరిదిద్ది, ల్యాండ్ పూలింగ్‌కు భూములిచ్చిన వారికి మేలుచేసే ఉద్దేశంతో భూ సేకరణ, కోర్టు వివాదాల్లో ఉన్న ప్లాట్లకు ప్రత్యామ్నాయంగా వేరే ప్లాట్లను కేటాయించేందుకు ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్లాట్ల తాత్కాలిక కేటాయింపు ఉత్తర్వుల్లోని 3వ నిబంధన మేరకు కేటాయించిన ప్లాటు విషయంలో ఏదైనా సమస్య ఉంటే నిర్ణీత కాలంలో పరిష్కరించేందుకు లేదా ప్రత్యామ్నాయ ప్లాటు కేటాయించేందుకు ఏపీ సీఆర్డీఏ బాధ్యత తీసుకుంది.
అందుకు అనుగుణంగానే పూలింగ్‌కు భూములిచ్చిన యజమానుల అంగీకారం కోసం వారికి కేటాయించిన ప్లాట్లలో భూసేకరణ/కోర్టు వివాదాల సమస్య ఉన్నందున ప్రత్యామ్నాయ ప్లాట్లు కేటాయించేందుకు వారికి సమాచారం ఇచ్చి అంగీకారం తీసుకుంటోంది. ఎంతోకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను పరిష్కరించేందుకు ఈ ప్రక్రియ చేపడితే ఎల్లో మీడియా వక్రీకరించి ప్రభుత్వంపై బురద జల్లుతూ దిగజారుడు కథనాన్ని ప్రచురించింది.
Comments
Please login to add a commentAdd a comment