సాక్షి, గుంటూరు: ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా.. ఇళ్లు కట్టించి ఇవ్వకుండా అడ్డుతగిలిన ప్రబుద్ధులు ఉన్నారు. ఒక చంద్రబాబు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, ఒక దత్తపుత్రుడు.. వీళ్లకు తోడు చంద్రబాబు పుట్టించిన ఊరు-పేరు లేని సంఘాలు. వీళ్లంతా పేదవాడికి ఇల్లు రాకూడదని ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి మన రాష్ట్రంలోనే చూశాం. ఇలాంటి దుర్మార్గమైన రాజకీయ పార్టీలను ఎక్కడా చూడలేదు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
సోమవారం కృష్ణాయపాలెంలో ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి.. పట్టాలు అందించి.. మోడల్ హౌజ్‌లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారాయన. అనంతరం వెంకటపాలెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ‘‘ఇవాళ రాష్ట్ర చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయే రోజు. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు.. పేదలందరికీ ఈరోజు మరిచిపోలేనిది. పేదల శత్రువులపై పేదలు సాధించిన విజయం ఇది. ఇళ్లు కట్టిస్తానని గతంలో చంద్రబాబు మోసం చేశారు. పేదవాడికి ఇల్లు రాకూడదని.. అడ్డుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. దీనికోసం సుప్రీం కోర్టు దాకా వెళ్లి మరీ ప్రయత్నించారు. ఇలాంటి పరిస్థితి మరెక్కడా రాకూడదు’’..
ఇవాళ పేదల విజయంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. పేదల వ్యతిరేకులంతా 18 కేసులు వేశారు. ఇందుకోసం ఎక్కడని గడపంటూ లేదు. మూడేళ్ల తరపున మీ కోసం పోరాటం చేశాం. అందుకే.. ఇది పెత్తందారుల మీద పేదల ప్రభుత్వం సాధించిన విజయం. రాక్షస బుద్ధితో ఉన్నవారితో మనం యుద్ధం చేస్తున్నాం.
ఈ పెత్తందారులు.. పేదవాడికి ఇంగ్లీష్ మీడియం అవసరమా? అని ప్రశ్నించిన వాళ్లు.. తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో చదివిస్తారు. సంక్షేమం అందిస్తుంటే రాష్ట్రం శ్రీలంక అవుతుందంటూ ప్రచారం చేస్తారు. మరి చంద్రబాబు తన హయంలో పేదలకు ఉపయోగపడే పనులు ఎందుకు చేయలేదు అని సీఎం జగన్ నిలదీశారు. పేద పిల్లలు బాగుపడడం వాళ్లకు ఇష్టం లేదు. పెత్తందారుల బుద్ధి ఎలా ఉందో గమనించండి అంటూ ఏపీ ప్రజలకు సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు.
ఇక సామాజిక అమరావతి.. మనందరిది
పేదలకు ఇల్లు నిర్మించి ఇస్తే రాజధాని అభివృద్ధి చెందదని కొందరు వాదించారు. పేరుకు ఇది రాజధాని.. అలాంటిది పేదలు ఇక్కడ ఉండకూడదా?. అందుకే.. ఇప్పుడు పేదలకు అండగా మార్పు మొదలైంది. అమరావతిని సామాజిక అమరావతిగా ఇవాళ పునాది రాయి వేస్తున్నా. ఇక నుంచి అమరావతి మన అందరిది.
ఎన్నో అవరోధాలను అధిగమించి ఇళ్లు నిర్మిస్తున్నాం. పేదల విజయంతో ఈ కార్యక్రమం జరుగుతోంది. మహిళా సాధికారకతకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నాం. అక్కచెల్లెమ్మల పేరిటే ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.70 లక్షలు ఖర్చు చేస్తున్నాం. 793 ఇళ్ల నిర్మాణం కోసం రూ.1,370 కోట్లు ఖర్చు చేస్తున్నాం. అన్ని సౌకర్యాలతో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తున్నాం. నాలుగేళ్లుగా ఎంతో మంచి చేశాం. గత ప్రభుత్వం చేయని మంచి చేశాం. మంచి చేస్తున్న మన ప్రభుత్వానికి మీ ఆశీస్సులు ఉండాలి అని ఆయన ప్రజలను కోరారు.
పేదవాడి సొంతటి కల
సీఆర్‌డీఏ పరిధిలో పేదల ఇళ్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. కృష్ణాయపాలెంలో పేదల ఇళ్ల నిర్మాణాలకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. రూ. 1,829. 57 కోట్ల వ్యయంతో.. 50 వేల మందికి పైగా పేదలకు స్థిర నివాసాలు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం 1,402.58 ఎకరాల్లో.. 50, 793 మంది పేదలకు ఉచితంగా ఇళ్ల పంపిణీ చేయనుంది జగనన్న ప్రభుత్వం.
Comments
Please login to add a commentAdd a comment