
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వాస్తు దోషం వదిలేలా కనిపించడం లేదు. దీంతో ప్రభుత్వం అసెంబ్లీ భవనానికి మార్పులు, చేర్పులు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వాస్తు దోషం అంటూ సచివాలయంలో పలు మార్పులు చేర్పులు చేసిన సర్కార్.. అసెంబ్లీ భవనానికి మార్పులు చేయనుంది. వాస్తు కోసం సచివాలయం వైపు అధికారులు ...కొత్త గేటు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే అసెంబ్లీలో ఐదు గేట్లు ఏర్పాటు చేయగా, తాజాగా ఆరో గేటు నిర్మిస్తున్నారు. సచివాలయంలో వాస్తు దోషం కారణంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన రూటు మార్చుకుని వెళుతున్న విషయం విదితమే.
అంతేకాకుండా సచివాలయంలో పలు గోడలు, నిర్మాణాలు పగులగొట్టిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో అడుగుపెట్టిన దగ్గర్నుంచీ టీడీపీ సర్కారుకు పలు ఆటంకాలు ఎదురవుతున్నట్లు ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజే ‘ఓటుకు కోట్లు’ కేసులో చంద్రబాబుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. శాసనసభ ప్రారంభం తొలి రోజే ఇలా జరగడంతో టీడీపీ శ్రేణులు అపశకునం ఎదురైనట్లు చర్చించుకున్నారు. దీంతో అసెంబ్లీకి వాస్తు దోషాలు ఉన్నట్లు గుర్తించి మార్పులు చేస్తున్నారు. సచివాలయం వైపు ఆరో గేటు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం రానున్న రోజుల్లో ఇంకా ఏం మార్పులు చేస్తుందో చూడాలి.