నేటి నుంచి ఏపీ అసెంబ్లీ | Andhra Pradesh Assembly Start From Today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ

Published Mon, Nov 30 2020 5:43 AM | Last Updated on Mon, Nov 30 2020 8:07 AM

Andhra Pradesh Assembly Start From Today - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ, శాసన మండలి శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. తొలుత ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశమవుతుంది. ఆ తర్వాత ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశం మొదలవుతుంది. ప్రస్తుత అంచనా ప్రకారం ఈ సమావేశాలు డిసెంబర్‌ 4వ తేదీ వరకు ఐదు రోజుల పాటు జరిగే అవకాశం ఉందని భావిస్తుండటంతో అధికార వైఎస్సార్‌సీపీ, ప్రతిపక్ష టీడీపీ తమ వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. ఉభయ సభల్లో ప్రారంభంలోనే తొలి అంశంగా సంతాప తీర్మానాలు ఉంటాయి. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ కుమార్‌ ముఖర్జీ, ప్రఖ్యాత సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంతో పాటు పలువురు ప్రముఖులు, మాజీ ఎమ్మెల్యేల మృతికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదిస్తారు. శాసన మండలిలో కూడా ఈ ప్రముఖులతో పాటు మాజీ ఎమ్మెల్సీల మృతికి సంతాపం తెలిపే తీర్మానాలను ఆమోదిస్తారు. ఉభయ సభల్లోనూ ప్రభుత్వానికి చెందిన పలు అధికార పత్రాలను సమర్పించే కార్యక్రమం (పేపర్స్‌ లెయిడ్‌ ఆన్‌ ద టేబుల్‌) ఉంటుంది.  

బీఏసీ సమావేశంలో అజెండా ఖరారు
ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే ఉభయ సభలు కొద్ది సేపు విరామంతో వాయిదా పడతాయి. ఈ విరామ సమయంలో అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ అధ్యక్షతన ఆయన చాంబర్‌లో శాసనసభ కార్యకలాపాల సలహా మండలి (బీఏసీ) సమావేశం జరుగుతుంది. శీతాకాల సమావేశాలు ఎన్ని రోజులు జరిగేది, చర్చించాల్సిన అజెండా అంశాలను ఖరారు చేస్తారు. మండలిలో చైర్మన్‌ షరీఫ్‌ అధ్యక్షతన జరిగే బీఏసీ సమావేశంలో యధావిధిగా ఎజెండాను ఖరారు చేస్తారు. ఎక్కువ రోజులు జరగాల్సిన సాధారణ బడ్జెట్‌ సమావేశాలు కరోనా మహమ్మారి వల్ల గత జూన్‌ నెలలో కేవలం రెండు రోజులు మాత్రమే జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇపుడు ఐదు రోజులు జరుగుతాయని భావిస్తున్న శీతాకాల సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది.  

► రాజ్యాంగ నియమం ప్రకారం డిసెంబర్‌ 14వ తేదీ లోపుగా ఉభయ సభల సమావేశాలు జరిగి తీరాలి కనుక.. కరోనా తీవ్రత కొనసాగుతున్నప్పటికీ, ఉభయ సభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుల్లో అనేకులు 60 ఏళ్లు దాటిన వారున్నప్పటికీ, తప్పనిసరిగా ఈ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది.
 
ప్రజా సమస్యలపై చర్చకు అధికార పక్షం సిద్ధం
► ప్రజా ప్రాధాన్యత గల అంశాలను చర్చించాలని అధికార పక్షం భావిస్తోంది. నిజంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కానీ, అత్యవసర ప్రాధాన్యత గల అంశాలను కానీ ప్రతిపక్షం చర్చకు తెస్తే ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా చర్చకు తావిచ్చేందుకు, సమగ్రంగా అన్ని విషయాలు చర్చించేందుకు అధికారపక్షం మొగ్గు చూపుతోంది.  
► ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశాల్లో ప్రాధాన్యత గల అంశాలన్నింటిపైనా చర్చకు సిద్ధపడదామని, ప్రజాస్వామ్యయుతంగా అసెంబ్లీ, మండలిని నడిపిద్దామని సూచించారు.
► ప్రభుత్వం గత ఏడాదిన్నరగా చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలతో సహా ఇతరత్రా సమస్యలు సుమారు 20 వరకు ఎంపిక చేసి, చర్చ కోసం అధికారపక్షం సిద్ధపడుతోంది. శుక్ర, ఆదివారాల్లో జరిగిన ప్రభుత్వ చీఫ్‌ విప్, విప్, మంత్రుల సమావేశాల్లో అధికార పక్షం ఆయా అంశాల వారీగా చర్చలో పాల్గొనే వారికి బాధ్యతలు అప్పగించింది. ప్రతిపక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని వ్యూహం రూపొందించింది.  
 
అడ్డుకోవడమే ప్రతిపక్షం ఎజెండా  
► ప్రజా సమస్యలపై ఒక దశ, దిశ లేకుండా సతమతం అవుతున్న ప్రతిపక్ష టీడీపీ.. ప్రభుత్వ కా>ర్యకలాపాలను అడ్డుకోవడం ద్వారా వార్తల్లోకి ఎక్కాలని లక్ష్యంగా పెట్టుకుంది. తాము ఉభయ సభల్లోనూ అడ్డుకుంటామని ఆ పార్టీ ఏపీ విభాగం అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు బాహాటంగానే ప్రకటించారు.  
► ముఖ్యంగా ప్రభుత్వం తెచ్చే అధికారిక బిల్లులను శాసనమండలిలో తమకున్న ఆధిక్యతతో అడ్డుకోవాలని టీడీపీ చూస్తోంది. ప్రజా ప్రాధాన్యం గల అంశాలపై చర్చ కన్నా రాజకీయ లబ్ధి చేకూరే కార్యక్రమాలపైనే దృష్టి పెట్టాలని టీడీపీ భావిస్తోంది.  
► రాష్ట్ర ప్రజలకు అవసరమా? లేదా? అనే అంశాలను పక్కన పెట్టి, ప్రభుత్వం తెచ్చిన బిల్లును మండలిలో అడ్డుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇప్పటికే దిశా నిర్దేశనం చేశారు. టీడీపీ అనుకూల మీడియాపై అసెంబ్లీ, మండలిలో ఉన్న ఆంక్షలు తొలగించాలని కోరుతూ ఉభయ సభల్లో ప్రతిష్టంభనకు దిగాలని టీడీపీ యోచిస్తున్నట్లు సమాచారం.
► వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో టీడీపీ నేతలపై కక్ష సాధింపు జరుగుతోందని, రాష్ట్రంలో హింస, అవినీతి పెరిగి పోయిందని, రాష్ట్రంలో అసలు రాజ్యాంగమే అమలు కావడం లేదని ఆరోపిస్తూ ఉభయ సభల్లో చర్చకు దిగాలని ప్రతిపక్షం భావిస్తున్నట్లు తెలిసింది. పోలవరం ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదని కూడా ఆ పార్టీ ఆరోపిస్తోంది.   
 
15 బిల్లులు.. 20 అంశాలు  
► శీతాకాల శాసనసభ, మండలి సమావేశాల్లో సుమారు 15 బిల్లులను ప్రవేశ పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. సమావేశాలు 5 రోజులు జరుగుతాయని భావిస్తున్నందున ఇప్పటి వరకు బిల్లుల స్థానంలో ఉన్న ఆర్డినెన్సులన్నింటికీ చట్ట రూపం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. కొన్ని బిల్లుల వివరాలిలా ఉన్నాయి.
► ఏపీ పశుదాణా బిల్లు, చేపల దాణా బిల్లు, అక్వా కల్చర్‌ విత్తన బిల్లు, ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ భూమి వ్యవసాయేతర భూమిగా మార్పు బిల్లు, అసైన్‌మెంట్‌ భూమి బదలాయింపు నిషేధ సవరణ బిల్లు, ఏపీ వాల్యూ యాడెడ్‌ పన్ను సవరణ బిల్లు, ఏపీ వాల్యూ యాడెడ్‌ పన్ను (3వ సవరణ) బిల్లుతో పాటుగా సుమారు 15 బిల్లులు సభ ముందుకు వస్తాయని తెలుస్తోంది.  
► మరి కొన్ని బిల్లులు వివిధ దశల్లో ఉన్నాయి. సమావేశాలు ముగిసే లోపు అవి కూడా సంబంధిత అనుమతులు పొందితే ఇదే సమావేశాల్లో చర్చకు వస్తాయని అధికార వర్గాల ద్వారా తెలిసింది. మొత్తం మీద వైఎస్సార్‌సీపీ శాసనసభా పక్షం ప్రజా ప్రాధాన్యం గల 20 అంశాలను సమావేశాల్లో చర్చకు తీసుకు రావాలని జాబితాను సిద్ధం చేసింది.
 
చర్చకు రానున్న అంశాలు
► పోలవరం పురోగతి–గత ప్రభుత్వం తప్పిదాలు, ఇళ్ల పట్టాల పంపిణీ – ప్రతిపక్షాల కుట్ర, టిడ్కో గృహాలు –వాస్తవాలు, రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ – ప్రతిపక్షాల కుట్ర, బీసీల సంక్షేమం – ప్రభుత్వ చర్యలు.. బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు, కరోనా నియంత్రణ – ప్రభుత్వ చర్యలు, వైద్య ఆరోగ్య రంగం – ఆరోగ్యశ్రీ.
► ఎస్సీ ఎస్టీ మైనారిటీల సంక్షేమం, వ్యవసాయ రంగం, ఇన్‌పుట్‌ సబ్సిడీ, సున్నా వడ్డీ రుణాలు, రైతు భరోసా కేంద్రాలు, మద్దతు ధర, వైఎస్సార్‌ జలకళ, గ్రామ సచివాలయాలు – మెరుగైన పని తీరు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు –అమలు తీరు, మహిళా సాధికారత.. వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా, సున్నా వడ్డీ, మద్య నియంత్రణ – ప్రభుత్వ సంస్థలు,  
► నాడు–నేడు, సాగునీటి ప్రాజెక్టులు – రివర్స్‌ టెండరింగ్, అవినీతి నిర్మూలన – పారదర్శక పాలన, పారిశ్రామికాభివృద్ధి – ప్రభుత్వ చర్యలు, 9 గంటల ఉచిత విద్యుత్‌ – విద్యుత్‌ రంగంలో సంస్కరణలు, ప్రభుత్వ హామీలు – అమలు తీరు, నూతన ఇసుక విధానం అంశాలపై చర్చించాలని అధికారపక్షం భావిస్తోంది.  
► వివిధ అంశాలపై ఉభయ సభల్లో చేపట్టే చర్చకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహంపై ఆదివారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. శాసనమండలిపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రులు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఆయా అంశాలపై చర్చలో పాల్గొనే ఎమ్మెల్యేల పేర్లను కూడా ఖరారు చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement