నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులను హైదరాబాద్ నుంచి అమరావతికి తరలింపు విషయంలో రాష్ట్రంలో తుగ్లక్ పాలన గుర్తుకు తెస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి అన్నారు. నెల్లూరులోని బీజేపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సచివాలయ ఉద్యోగుల తరలింపుపై ఇప్పటి వరకు స్పష్టత రాకపోవడం దురదృష్టకరమన్నారు. హైదరాబాద్‌లోనే పదేళ్లుండే అవకాశం ఉన్నా ఇప్పటికిప్పుడు ఉద్యోగులను తరలించాల్సిన అవసరం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగుల తరలింపుపై ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మధ్య సమన్వయలోపం ఉందా అని అనుమానం కలుగుతుందన్నారు. ఉద్యోగుల తరలింపు విషయంపై ఒక రోడ్‌మ్యాప్‌ను తక్షణమే తయారు చేయాలని డిమాండ్ చేశారు.
అంతేకాకుండా ఉద్యోగ సంఘాల మధ్య సమన్వయం లేకుండా గందరగోళాన్ని సృష్టిస్తున్నారన్నారు. ఉద్యోగులు తమ విధులు నిర్వర్తించుకోవడానికి మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. హైదరాబాద్ నుంచి అమరావతికి రాని ఉద్యోగులను ఉద్యోగంలో నుంచి తొలగిస్తామని టీడీపీ ఎమ్మెల్సీ బాబురాజేంద్రప్రసాద్ ప్రకటన చేయడం సమంజసం కాదన్నారు. అంతేకాకుండా హైదరాబాద్‌లో రాష్ట్రానికి చెందిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు సుమారు 5వేల మంది ఉన్నారని వారి పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా ఉందన్నారు. అమరావతి నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక రైలు ఏర్పాటును కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అడగాలని సూచించారు. ఈ విషయమై తాము కూడా కేంద్రం దష్టికి తీసుకెళ్తామన్నారు. ఈనెల 16వ తేదీ కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్‌పారికర్ నెల్లూరులో పర్యటించి కేంద్రప్రభుత్వ పథకాలు, విజయాలను వివరించనున్నారని తెలిపారు. అలాగే, 17వ తేదీన రాష్ట్రంలోని అన్ని మండలాల బీజేపీ పదాధికారులతో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా విశాఖలో సమావేశం నిర్వహించనున్నారని చెప్పారు.
'బాబు సర్కార్ పిచ్చి తుగ్లక్‌లా వ్యవహరిస్తోంది'
Published Tue, Jun 7 2016 5:56 PM | Last Updated on Sat, Aug 18 2018 8:27 PM
Advertisement