సాక్షి, అమరావతి: రాజధానిపై అపోహలు అనవసరమని, ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. బొత్స సత్యనారాయణ శనివారం సచివాలయంలో రెండో బ్లాక్‌లో మున్సిపల్ శాఖ మంత్రి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆశీర్వచనాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రి బొత్స కుటుంబీకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.అలాగే మార్కెటింగ్ శాఖ మంత్రిగా మోపిదేవి వెంకటరమణ, ఇరిగేషన్ శాఖ మంత్రిగా అనిల్‌కుమార్ యాదవ్ బాధ్యతలు చేపట్టారు.
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం బొత్స మాట్లాడుతూ...ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని, ఈ ప్రభుత్వం నాది అని పేదలు భావించే రీతిలో పాలన ఉండబోతోందని అన్నారు. ‘చెప్పింది చేస్తాం...చేసేదే చెప్తాం..’ ఇదే జగన్ సర్కార్ విధామని బొత్స తెలిపారు. పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పెంచామని, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు గృహ వసతి కల్పిస్తామని హామీ ఇచ్చారు. పేదలకు పక్కా గృహ నిర్మాణాలు...ఇళ్ల స్థలాలను మంజూరు చేస‍్తామని, పట్టణ ప్రాంతాల్లో అనాదిగా ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. విభజన తర్వాత పసికందు లాంటి ఏపీని చంద్రబాబు చిక్కిశల్యం అయ్యేలా చేశారని ఆయన మండిపడ్డారు.
ఇక చంద్రబాబును విమానాశ్రయంలో తనిఖీలు చేయడం అధికార విధుల్లో భాగమే అని, దేశంలో చాలామంది ప్రతిపక్ష నేతలు ఉన్నారన్నారు. వారిని కూడా తనిఖీలు చేస్తున్నారని, అలాంటిది చంద్రబాబు తనిఖీల వ్యవహారాన్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదన్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సెక్యూరిటీని తొలగించారని, అదేమని అడిగితే మీకంతా రక్షణ అవసరం లేదని అన్నారని బొత్స ఈ సందర్భంగా గుర్తు చేశారు.
సవాల్‌గా తీసుకుని పనిచేస్తా: అనిల్‌కుమార్
అన్నదాత సుభిక్షంగా ఉండడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ధ్యేయమని ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఆయన శనివారం బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలో తనకు కేటాయించిన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు చేశారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం పుత్తూరు మున్సిపాలిటీకి తెలుగు గంగ నుంచి 1.3 టీఎంసీల తాగునీరు అందించే ఫైల్‌పై ఆయన తొలి సంతకం చేశారు. అనుభవం లేకున్నా తనపై నమ్మకంతో జల వనరుల శాఖ బాధ్యతలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనకు అప్పగించారని, ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. తనకు అప్పగించిన బాధ్యతను ఓ సవాల్‌గా తీసుకుని పని చేస్తానని తెలిపారు. ఇరిగేషన్ శాఖను పాదర్శకంగా చేస్తామని, ఇతర శాఖల కన్నా బెస్ట్ శాఖగా చేస్తామని మంత్రి అనిల్‌కుమార్ పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రారంభించిన ప్రతి ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని అన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతు సుభిక్షంగా ఉండాలని, ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖలో అవినీతి జరిగిందన‍్న మంత్రి...ఈ ప్రభుత్వంలో దోపిడీ ఉండదని, ప్రతి టెండర్ జ్యూడిషియల్ కమిటీ ముందు ఉంచుతామని తెలిపారు.
పాడిరైతు కోసం లీటర్ పాలుకు రూ.4 పెంపు
పాడి పరిశ్రమ, మత్య్స శాఖ అభివృద్ధికి కృషి చేస్తామని మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన రైతుల నుంచి పప్పుధాన్యాల కొనుగోలుకు రూ.100కోట్లు విడుదలపై తొలి సంతకం చేశారు. పాడి రైతు కోసం లీటర్ పాలకు నాలుగు రూపాయిలు పెంచుతున్నామని, దీని వల్ల ప్రభుత్వంపై రూ.220 కోట్లు అదనపు భారం పడుతుందన్నారు. పాల సేకరణ ధర పెంపుతో 9లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని మంత్రి మోపిదేవి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment