AP Former DGP Anjaneya Reddy Interesting Comments On Chandrababu Naidu - Sakshi
Sakshi News home page

అమరావతిని చంద్రబాబు ఏకపక్షంగా ప్రకటించారు

Published Sun, Nov 20 2022 4:29 AM | Last Updated on Sun, Nov 20 2022 10:08 AM

AP Former DGP Anjaneya Reddy On Chandrababu With Sakshi

రాజధాని విషయంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం తప్పని ఏపీ మాజీ డీజీపీ ఆంజనేయరెడ్డి చెప్పారు. ఉన్నత విద్యావంతులు, ఉన్నత పదవుల్లో ఉన్న తాము సిటిజన్స్‌ ఫోరంగా ఏర్పడి ఈ విషయంపై చంద్రబాబుతో మాట్లాడినా పట్టించుకోలేదని తెలిపారు. రాష్ట్ర విభజన పరిణామాలు, పలు ఇతర అంశాలపై ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. రాజధాని ఏర్పాటుపై అన్ని పార్టీలు, అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయం తీసుకోవాలని కూడా చంద్రబాబుకు సూచించామన్నారు. రాజధానికి దొనకొండ అన్ని విధాలా తగిన ప్రాంతమని,  అందుకు 10 సానుకూల అంశాలను ఆయన ముందుంచామని తెలిపారు.  

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని విషయంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం తప్పని ఏపీ మాజీ డీజీపీ ఆంజనేయరెడ్డి చెప్పారు. ఉన్నత విద్యావంతులు, ఉన్నత పదవుల్లో ఉన్న తాము సిటిజన్స్‌ ఫోరంగా ఏర్పడి ఈ విషయంపై చంద్రబాబుతో మాట్లాడినా పట్టించుకోలేదని తెలిపారు. రాష్ట్ర విభజన పరిణామాలు, పలు ఇతర అంశాలపై ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘రాజధాని ఏర్పాటుపై అన్ని పార్టీలు, అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయం తీసుకోవాలని కూడా చంద్రబాబుకు సూచించాం.

రాజధానికి దొనకొండ అన్ని విధాలా తగిన ప్రాంతమని చెప్పాం. అందుకు 10 సానుకూల అంశాలను ఆయన ముందుంచాం. వెనుకబడ్డ ఆ ప్రాంతంలో ప్రభుత్వ భూములు లక్ష ఎకరాలకు పైగా ఉన్నాయి. నిర్మాణ వ్యయం కూడా తక్కువ. రాజధాని ఏర్పాటుతో ఆ ప్రాంత ప్రజలకు ఉపాధి లభించేది. పైగా సముద్ర మట్టానికి ఎత్తులో ఉన్న ఈ ప్రాంతంలో డ్రైనేజీ సమస్య కూడా ఉండదు. ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా చంద్రబాబు మాత్రం నిర్మాణాలకు ఏ విధంగానూ అనువుగా లేని అమరావతినే ఎంచుకున్నారు.

ఎలాంటి ఆలోచనా లేకుండా అప్పటికప్పుడు అమరావతి పేరు ప్రకటించారు. నిత్యం పంటలతో నందనవనంలా కళకళలాడే కృష్ణా డెల్టాలో కాంక్రీట్‌ పోసి నాశనం చేశారు. శివరామకృష్ణన్‌ కమిటీ కూడా అమరావతి ప్రాంతం తప్ప మరెక్కడైనా రాజధాని నిర్మించాలని సూచించినా చంద్రబాబు పరిగణనలోకి తీసుకోలేదు’ అని వివరించారు.

వికేంద్రీకరణ చాలా అవసరం
పరిపాలన వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాల ప్రజలకు న్యాయం జరుగుతుందని, ప్రాంతీయ అసమానతలు తొలగించవచ్చని తెలిపారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తే విజయవాడ, విశాఖలో బెంచ్‌లు పెట్టాలని అన్నారు. పరిపాలన కోసం నాలుగు జోన్లలోనూ డివిజనల్‌ కార్యాలయాలు పెట్టి, సచివాలయ అధికారాలు వాటికి బదిలీ చేయాలని, అప్పుడు ప్రజలకు వేగంగా సమస్యలు పరిష్కారమవుతాయని వివరించారు.

ఇటీవల రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు బాగుందని, కోస్తా, కృష్ణా డెల్టా ప్రాంతాలు లాభపడుతున్నాయని అన్నారు. నెల్లూరు – తిరుపతి మధ్య కూడా పరిశ్రమలు వచ్చాయని, కర్నూలు ప్రాంతం మాత్రం వెనుకబడి పోయిందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో అధికంగా పెట్టుబడులు పెట్టడం వల్ల అక్కడ సర్‌ప్లస్‌ ఆదాయాన్ని అన్ని జిల్లాలకు పంచేవారన్నారు.

విడిపోయాక రాష్ట్ర ఆదాయం పూర్తిగా తగ్గిపోయిందని, ఈ పరిస్థితి మరోసారి రాకూడదంటే అన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధి జరగాలని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమంపై దృష్టి పెట్టిందని, ఇది కోవిడ్‌ కష్టకాలంలో ప్రజలకు ఎంతో మేలు చేసిందని అన్నారు. తర్వాత అభివృద్ధిపై దృష్టి పెడుతుందని ఆంజనేయరెడ్డి చెప్పారు.

పోలవరంపైనా బాబు తప్పుడు నిర్ణయం
కేంద్ర పరిధిలోని పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు తీసుకోవడమే పెద్ద పొరపాటుగా ఆంజనేయరెడ్డి తెలిపారు. ఆయన తప్పిదం వల్ల ఇప్పుడు ఎస్కలేషన్‌ ఖర్చే దాదాపు రూ.60 వేల కోట్లకు పెరిగిపోయిందన్నారు. లేదంటే కేంద్రమే ప్రాజెక్టును పూర్తిచేసి ఇచ్చేదని చెప్పారు. మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు సమయంలోనే రాయలసీమ ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలన్న డిమాండ్‌ వచ్చిందని తెలిపారు.

ఆనాడు కర్నూలును రాజధానిగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ విడిపోయాక కూడా సీమకే అన్యాయం జరిగిందన్నారు. ఆనాడు కర్నూలును అభివృద్ధి చేసి ఉంటే  సీమ బాగుపడేదని, అమరావతి వల్ల ఎక్కువగా నష్టపోయింది రాయలసీమేనని అన్నారు. ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మైనింగ్, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు స్థాపించాలని సూచించారు. కేవలం ఐటీ పరిశ్రమ వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందదని, ప్రాంతాన్ని బట్టి అనువైన పరిశ్రమలు రావాలని చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement