Andhra Pradesh capital
-
విశాఖ రాజధానిపై వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ పరిపాలన రాజధానిపై వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే విశాఖపట్నం ఏపీ పరిపాలన రాజధాని కాబోతుందని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. లీగల్ ఇష్యూస్ వల్ల కాస్త ఆలస్యమవుతోందని పేర్కొన్నారు. కాగా, వైవీ సుబ్బారెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగనమోహన్‌రెడ్డి రెండు, మూడు నెలల్లో విశాఖ రాబోతున్నారు. త్వరలోనే విశాఖ ఏపీ పరిపాలన రాజధాని కాబోతుంది. అన్ని ప్రాంతాల ప్రజలకు అనువైన ప్రాంతం విశాఖ. దక్షిణ భారతదేశానికి ముంబై నగరం వంటిది విశాఖ అని వెల్లడించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఇదే సమయంలో పుంగనూరులో టీడీపీ శ్రేణుల దాడిపై కూడా సుబ్బారెడ్డి స్పందించారు. ఈ ఘటనపై మాట్లాడుతూ.. చంద్రబాబు మీద దాడి చేయాల్సిన అవసరం మాకు లేదు. చంద్రబాబు బలమేంటో 2019 ఎన్నికల్లోనే చూశాం. చంద్రబాబు ఏమైనా పెద్ద బలవంతుడా దాడులు చేయడానికి.. ఓడిపోయిన తర్వాత మూడేళ్ల పాటు చంద్రబాబు ఇంట్లోనే ఉన్నారు. ఏడాది నుంచి బయటకు వచ్చి టీడీపీపై దాడి అంటూ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ కూడా చంద్రబాబు తరహాలోనే ప్రజలను రెచ్చగొడుతున్నారు. పవన్‌కు ఒక విధానం అంటూ లేదు. ఒకసారి సీఎం పదవి వద్దంటాడు.. మరోసారి పదవి కావాలంటాడు అంటూ విమర్శలు చేశారు. ఇది కూడా చదవండి: ఈనాడు బ్యానర్.. పచ్చ బ్యాచ్ కోసం పాకులాట.. రామోజీ అడ్డంగా దొరికాడు -
AP:రాజధానిలో పేదలు ఉండొద్దంటే ఎలా?
సాక్షి, అమరావతి: ‘‘రాజధానిలో పేదలు ఉండకూడదంటే ఎలా?’’ అని హైకోర్టు ధర్మాసనం రాజధాని పిటిషనర్లను ప్రశ్నించింది. రాజధాని ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడం అభివృద్ధిలో భాగమని వ్యాఖ్యానించింది. ఫలానా వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని చెప్పజాలరని స్పష్టం చేసింది. రాజధాని భూములు ప్రస్తుతం సీఆర్డీఏవేనని, అంతేకానీ భూములిచ్చిన వారివి కాదని పేర్కొంది. రాజధాని వ్యవహారం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున అందుకు సంబంధించిన వ్యవహారంలో తాము జోక్యం చేసుకుని పరిస్థితిని జఠిలం చేయలేమని తెలిపింది. పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు వీలుగా రాజధాని ప్రాంతంలో 1,134 ఎకరాలను ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు బదలాయించాలని సీఆర్డీఏ కమిషనర్‌ను ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 45 విషయంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమని తెలిపింది. ప్రస్తుత దశలో స్టే విధించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. భూములను కలెక్టర్లకు బదలాయించాలని మాత్రమే ప్రభుత్వం చెప్పిందని, అందువల్ల కేటాయింపులను ప్రశ్నిస్తూ దాఖలైన వ్యాజ్యాలు అపరిపక్వమైనవని స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయిస్తున్నారని వ్యాఖ్యానించింది. రాజధాని విషయంలో కొన్ని అంశాలను హైకోర్టులో, కొన్నింటిని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తున్నారని ప్రస్తావిస్తూ జీవో 45పై కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొంది. నిర్ణయాలు తీసుకోకుండా ప్రభుత్వాన్ని నిరోధించలేమని, అవి ప్రభుత్వ విధుల్లో భాగమని తేల్చి చెబుతూ జీవో 45పై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పురపాలక శాఖ, సీఆర్డీఏలను న్యాయస్థానం ఆదేశించింది. ప్రభుత్వ కౌంటర్‌ను పరిశీలించిన తరువాతే మధ్యంతర ఉత్తర్వుల జారీ విషయాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మంతోజు గంగారావు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పేదలకు ఇళ్ల స్థలాలపై పిటిషన్లు.. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాల నిమిత్తం 1,134 ఎకరాల భూమిని ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు బదిలీ చేసేందుకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 45ను సవాల్ చేస్తూ అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు దామా శేషాద్రినాయుడు, ఉన్నం మురళీధరరావు, దేవ్‌దత్ కామత్, వీఎస్ఆర్ ఆంజనేయులు తదితరులు వాదించారు. ఇళ్ల స్థలాల నిమిత్తం గతంలో జారీ చేసిన జీవోను హైకోర్టు నిలుపుదల చేసిందని మురళీధరరావు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. తరువాత సీఆర్డీఏ చట్టానికి సవరణలు చేసి ఆర్ 5 జోన్ తెచ్చారన్నారు. తుది ఉత్తర్వులకు లోబడి ఉండేలా ఆదేశాలిస్తాం.. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ ఇళ్ల స్థలాల కేటాయింపు తమ తుది ఉత్తర్వులకు లోబడి ఉండేలా ఆదేశాలు ఇస్తామని పేర్కొనగా దీన్ని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వ్యతిరేకించారు. రాజధాని భూములను అన్యాక్రాంతం చేయడం, బదలాయించడం, థర్డ్ పార్టీ హక్కులు సృష్టించడం చేయరాదని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పునిచ్చిందన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా 3 అంశాలపైనే స్టే విధించిందన్నారు. మిగిలిన అంశాల విషయంలో హైకోర్టు తీర్పు అమల్లోనే ఉందని నివేదించారు. పరిస్థితిని జఠిలం చేయలేం.. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. రాజధాని ప్రజలందరిదని, అది ఏ వ్యక్తిదో, వర్గానిదో కాదని స్పష్టం చేసింది. రాజధానిపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న నేపథ్యంలో జీవో 45 విషయంలో జోక్యం చేసుకుని పరిస్థితిని జఠిలం చేయలేమని తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వమే సమస్యను జఠిలం చేస్తోందంటూ పిటిషనర్ల న్యాయవాది దేవ్‌దత్ కామత్ సుప్రీంకోర్టు ఉత్తర్వులను చదివి వినిపించడంతో... సుప్రీంకోర్టు ఉత్తర్వులకు తమను భాష్యం చెప్పమని కోరుతున్నారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. కావాలంటే సుప్రీంకోర్టుకే వెళ్లాలని స్పష్టం చేసింది. రాజధాని విషయంలో హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని పిటిషనర్ల న్యాయవాదులు పేర్కొనగా దానిపై ఇప్పటికే కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలైందని ధర్మాసనం తెలిపింది. జరగని కేటాయింపులపై వ్యాజ్యాలేమిటి? ఈ వ్యాజ్యాలను ఇప్పటికిప్పుడు విచారించాల్సినంత అత్యవసరం ఏముందో చెప్పాలని పిటిషనర్లను ధర్మాసనం ప్రశ్నించింది. ప్రతిదీ అత్యవసరమంటూ పిటిషన్లు దాఖలు చేయడాన్ని తాము ఎంతమాత్రం హర్షించబోమని, తమను ఒత్తిడి చేయవద్దని తేల్చి చెప్పింది. ఇళ్ల స్థలాల కేటాయింపులు తమ తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయని, ఈ దశగా ఉత్తర్వులు ఇస్తామని ధర్మాసనం పునరుద్ఘాటించింది. ముఖ్యమంత్రి ఓ సమావేశం నిర్వహించి పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని అధికారులను ఆదేశించారని, అందువల్లే జీవోపై స్టే కోరుతున్నామని పిటిషనర్ల తరపు న్యాయవాదులు నివేదించారు. ‘ప్రభుత్వం పని చేయాల్సిందే కదా. నిర్ణయాలు తీసుకోకుండా ఎలా నిరోధించగలం? అసలు ఈ వ్యాజ్యాలు అపరిపక్వమైనవి. ప్రభుత్వం భూములను కలెక్టర్లకు బదలాయించాలని మాత్రమే చెప్పింది. కేటాయింపులు ఇంకా జరగలేదు. జరగని కేటాయింపులపై వ్యాజ్యాలు దాఖలు చేయడం ఏమిటి? ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయనివ్వండి. ఆ తరువాత ఏం చేయాలో చూద్దాం...’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఒత్తిడి చేసి మధ్యంతర ఉత్తర్వులు పొందలేరు.. ఈ సమయంలో సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు స్పందిస్తూ థర్డ్ పార్టీలకు భూములు కేటాయిస్తే విషయం జఠిలం అవుతుందన్నారు. తదుపరి దాఖలు చేసే వ్యాజ్యాల్లో వారందరినీ ప్రతివాదులుగా చేయాల్సి ఉంటుందని, ఆది అచరణ సాధ్యం కాదన్నారు. పిటిషనర్లు రైతులని, ఇళ్ల స్థలాల కేటాయింపు వల్ల వారి హక్కులు ప్రభావితం అవుతాయన్నారు. దీనిపై ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. ఇవి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు కావని, అందరి తరఫున వ్యాజ్యాలు వేసి జీవో మొత్తాన్ని నిలుపుదల చేయాలని కోరలేరని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఇళ్ల స్థలాల కేటాయింపు వల్ల ఇతరులు కూడా లబ్ధి పొందుతున్నారని గుర్తు చేసింది. ప్రస్తుత దశలో జీవో 45 విషయంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయబోమని తేల్చి చెప్పింది. అపరిపక్వమైన వ్యాజ్యాల్లో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం సాధ్యం కాదంది. ఒత్తిడి చేసి మధ్యంతర ఉత్తర్వులు పొందలేరని వ్యాఖ్యానించింది. రైతులకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా ఇతరులకు ఇళ్ల స్థలాలివ్వడం చట్ట విరుద్ధమని మరో సీనియర్ న్యాయవాది వీఎస్ఆర్ ఆంజనేయులు వాదించారు. ఇన్సైడర్స్.. అవుట్ సైడర్స్ ఏమిటి? సీనియర్ న్యాయవాది మురళీధరరావు వాదనలు వినిపిస్తూ మే మొదటి వారంలో ఇళ్ల స్థలాలివ్వాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించినట్లు పత్రికల్లో వచ్చిందన్నారు. అవుట్‌సైడర్స్‌కు (రాజధానేతరులు) ఇళ్ల స్థలాలిస్తూ వివాదాలు సృష్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పేర్కొనడంపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. రాజధాని ప్రజలందరిదీ, కేవలం పూలింగ్ కింద భూములిచ్చిన వారిది మాత్రమే కాదని పేర్కొంది. అవుట్ సైడర్స్, ఇన్సైడర్స్ అంటూ మాట్లాడొద్దని సూచించింది. రాజధాని భూములను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఇళ్ల స్థలాల కేటాయింపు ద్వారా అదే జరుగుతోందని తెలిపింది. -
ఏపీ రాజధాని కేసు విచారణ తేదీ ఇచ్చిన సుప్రీం కోర్టు
-
రాజధానిపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే
సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధాని అంశంపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనంటూ కేంద్రం స్పష్టం చేసిందని ఏపీ పరిపాలన వికేంద్రీకరణ సాధన జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ లజపతిరాయ్ అన్నారు. రాజధాని అంశంపై కేంద్రం ప్రకటనను వక్రీకరిస్తూ కొందరు ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్లు 5, 6, 94లలో పేర్కొన్న అంశాలను వక్రీకరిస్తూ అమరావతే ఏకైక రాజధాని అని కొందరు చేస్తున్న ప్రచారాన్ని ఆయన గురువారం ఖండించారు. కొత్త రాజధానిలో హైకోర్టు, రాజ్‌భవన్, ఇతర కార్యనిర్వాహక హెచ్వోడీలు ఏర్పాటు చేయాలని.. ఆ చట్టంలోని సెక్షన్ 94(3)లో పేర్కొన్నారన్నారు. ఈ అంశాలను సెక్షన్ 6లో పేర్కొన్న అంశాలతో సమన్వయపరిచి చూడాలన్నారు. రాజదాని ఏర్పాటు కోసం రాష్ట్రంలో వివిధ ప్రాంతాలను పరిశీలించి.. నిర్ణయం తీసుకునేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని.. సెక్షన్ 6లో స్పష్టం చేశారన్నారు. ఆ ప్రకారం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ రాష్ట్రంలో అధికార వ్యవస్థలను వికేంద్రీకరణ విధానంలో ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసిందన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం సహకరించాలని పునర్విభజన చట్టంలో పేర్కొన్నారన్నారు. ఆ ప్రకారమే వెనుకబడిన ఉత్తరాంధ్రలో పరిపాలన రాజదాని ఏర్పాటుకు సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం సమర్థించాలన్నారు. -
చినబాబు ఫ్లాప్ షో..అందుకే చంద్రబాబు టాక్ షో..
యడ్లపాడు: రాజధాని గురించి చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. ఆమె గురువారం పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం బోయపాలెంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు సొంత మనుషులకు దోచిపెట్టేందుకే రాజధాని అంశాన్ని తెరపైకి తెచ్చారన్నారు. నిజంగా ఆయనకు రాజధాని నిర్మించాలనే ఉద్దేశమే ఉంటే తాత్కాలిక భవనాలతోనే ఎందుకు సరిపెట్టారని ప్రశ్నించారు. శాశ్వత నిర్మాణాల్లేకుండా, మౌలిక వసతులు కూడా కల్పించకుండా రాజధాని నిర్మించానంటూ కల్లబొల్లి కబుర్లు ఎన్నో అప్పట్లో చంద్రబాబు చెప్పారన్నారు. దీనివల్ల బాబు, ఆయన మనుషులు అక్కడ వ్యాపారం చేసుకుని లాభం పొందారని దుయ్యబట్టారు. పోలవరం ఆలస్యానికి చంద్రబాబే కారణమని ఆరోపించారు. నారా లోకేశ్ పాదయాత్రకు కనీస స్పందన కూడా లేదని, ఈ విషయాన్ని పక్కదారి పట్టించేందుకే చంద్రబాబు అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి ఆడియో వింటేనే వారి ఆందోళన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధితో ముందుకు వెళ్లాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్ష అని, మూడు రాజధానులు తమ విధానమని స్పష్టం చేశారు. -
మాకు సంబంధం లేదు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం రాజధాని పరిణామాల నేపథ్యంలో అమరావతి పరిరక్షణ సమితి దాఖలు చేసిన పిటిషన్‌లోని అంశాలపై స్పందించలేమని కేంద్రం స్పష్టం చేసింది. ఆ ఆంశాలు తమకు సంబంధించినవి కావని, వాటిపై స్పందించాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమేనని తెలిపింది. మూడు రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ అమరావతి పరిరక్షణ సమితి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం కేంద్రం ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది. ‘ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం–2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏర్పడ్డాయి. చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం రెండు రాష్ట్రాలకు పదేళ్లపాటు హైదరాబాద్ రాజధాని. ఆ తర్వాత తెలంగాణకు రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని వస్తుంది. అనంతరం చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం కేంద్రం ఏపీ రాజధాని నిమిత్తం ఆరునెలల్లో నివేదిక ఇవ్వాలని ఐఏఎస్ విశ్రాంత అధికారి కె.సి.శివరామకృష్ణన్ నేతృత్వంలో 2014 మార్చి 28న నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 2014 ఆగస్టు 30న నివేదిక ఇచ్చింది. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి ఆ నివేదిక పంపింది. అనంతరం 2015 ఏప్రిల్ 23న ఏపీ ప్రభుత్వం అమరావతిని నూతన రాజధానిగా ఆదేశాలు ఇచ్చింది. చట్టంలోని సెక్షన్ 94 ప్రకారం ఏపీలోని రాజ్‌భవన్, హైకోర్టు, ప్రభుత్వ సచివాలయం, అసెంబ్లీ, మండలి ఇతర సదుపాయాలకు కేంద్రం ఆర్థికసాయం చేయాలని ఉంది. దీనిమేరకు కేంద్ర ప్రభుత్వం గృహ, పట్టణ వ్యవహారాలశాఖ నుంచి రూ.వెయ్యి కోట్ల సహా రూ.2,500 కోట్లు విడుదల చేసింది. అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం–2020, ఆంధ్రప్రదేశ్ డీసెంట్రలైజేషన్, ఇన్‌క్లూజివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ రీజియన్ యాక్ట్–2020లను చేసింది. దీన్ని రాష్ట్ర గెజిట్‌లో ప్రచురిస్తూ.. అమరావతి లెజిస్లేటివ్ రాజధానిగా, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ రాజధానిగా, కర్నూలు జ్యుడిషియల్ రాజధానిగా పేర్కొంది. ఈ రెండు చట్టాలు రూపొందించే క్రమంలో కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించలేదు..’ అని కౌంటరులో పేర్కొంది. పిటిషనర్ లేవనెత్తిన అంశాలు కేంద్రానికి సంబంధించినవి కాదని స్పష్టం చేసింది. అందువల్ల ఈ దశలో స్పందించడం లేదని, తదుపరి అవసరమైతే స్పందిస్తామని పేర్కొంది. -
టూరిజం 2.0’.. అరకు, గండికోట
సాక్షి, అమరావతి: ఆంధ్రా ఊటీగా పేరొందిన అరకు–లంబసింగి సర్క్యూట్, గ్రాండ్ కాన్యన్ ఆఫ్ ఇండియాగా పిలిచే గండికోట ప్రాంతాలు అంతర్జాతీయ పర్యాటక ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకోనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో సుమారు రూ.150 కోట్లకు పైగా అంచనాలతో మౌలిక వసతులను మెరుగుపర్చుకోనున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ‘స్వదేశీ దర్శన్–2.0’ పథకం కింద దేశంలోని 36 పర్యాటక ప్రాంతాలను ఎంపిక చేసింది. ఇందులో అరకు–లంబసింగి సర్క్యూట్, గండికోట పర్యాటక ప్రదేశాలకు చోటు కల్పించింది. త్వరలోనే పనులు ప్రారంభించేలా కేంద్ర పర్యాటక శాఖ ప్రాజెక్టు డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ల కోసం ఆర్ఎఫ్పీలను సైతం ఆహ్వానించింది. రాష్ట్ర పర్యాటక శాఖకు ప్రాజెక్టు అమలు బాధ్యతలను అప్పగించి సమయానుకూలంగా పూర్తి చేసేందుకు మార్గదర్శకాలను రూపొందించింది. స్థానిక సంస్కృతికి, పౌర సమాజ స్థితిగతులను మెరుగుపర్చేలా ప్రణాళికలను సిద్ధం చేసింది. 2.0తో అందుబాటులోకి అధునాతన వసతులు 2.0 ప్రణాళికల ద్వారా పర్యాటక సామర్థ్యాన్ని పెంచేలా ఈ రెండు ప్రాంతాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి చేయనున్నాయి. పర్యాటక, వారసత్వ సంపద పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాయి. పర్యాటకుల కోసం వాచ్ టవర్లు, రిసార్టులు, వసతి గదులు, కన్వెన్షన్ సెంటర్లు, అడ్వెంచర్ క్రీడలు, గోల్ఫ్ కోర్సులు, యాంపీ థియేటర్లు, సాంస్కృతిక భవనాలు, సౌండ్ లైట్ షోలను అందుబాటులోకి తీసుకురానున్నాయి. స్థానిక కళాకారులు, చేతివృత్తి కార్మికుల జీవన ప్రమాణాలు పెంచేలా వారి కోసం ప్రత్యేక దుకాణ సముదాయాలను నిర్మించనున్నాయి. ఎకో ఫ్రెండ్లీ ట్రాన్స్‌పోర్టు, రహదారి సౌకర్యం, ల్యాండ్ స్కేప్, డిజిటల్ టెక్నాలజీ, స్థానిక కాలనీల్లో మౌలిక వసతులు కల్పించనున్నాయి. పర్యాటకుల ‘క్యూ’ అరకు లోయలో ఏపీ పర్యాటక సంస్థ 4 రిసార్టులను నిర్వహిస్తోంది. మయూరిలో 80, అరకు వేలీలో 58, అనంతగిరిలో 30, టైడా రిసార్టులో 23 గదులను అందుబాటులో ఉంచింది. ఇటీవల లంబసింగిలో సైతం 11 కొత్త కాటేజీలను నిర్మిచింది. మరోవైపు విశాఖపట్నం నుంచి ప్రత్యేక ప్యాకేజీ టూర్లను నడుపుతోంది. అరకుతో పాటు బొర్రా గుహలు, వంజంగి, కొత్తపల్లి జలపాతాలు, పాడేరు పరిసర ప్రాంతాలను పర్యాటకులు వీక్షించేలా చర్యలు చేపట్టింది. కాగా, కడప జిల్లాలోని గండికోటకు విశిష్ట చారిత్రక నేపథ్యంతో పాటు అమెరికాలోని గ్రాండ్ కాన్యన్ తరహాలో కొండలను చీల్చుకుంటూ ప్రవహించే పెన్నా నది ఒంపులు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. ఇక్కడికి వారాంతాల్లో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి పర్యాటకులు తరలి వస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా ఇందులో వాయు, జల, భూమిపై చేసే సాహస క్రీడల అకాడమీని నెలకొల్పారు. మరోవైపు 4వేల ఎకరాల్లో గండికోట ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంతో పాటు యువతకు ఉపాధి కల్పించేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ప్రముఖ అంతర్జాతీయ హోటల్ రంగ సంస్థ ఒబెరాయ్‌ను సైతం తీసుకొస్తోంది. (చదవండి: AP: జీవో నెం.1పై హైకోర్టులో విచారణ.. చీఫ్ జస్టిస్ కీలక వ్యాఖ్యలు) -
ఆ వ్యాజ్యాలనూ మేమే విచారిస్తాం
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాల వారికి సైతం ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు వీలుగా సీఆర్డీఏ చట్టాన్ని సవరిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని సవాల్ చేస్తూ రాజధాని రైతు పరిరక్షణ సమితి, అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య, మరికొందరు వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. ద్విసభ్య ధర్మాసనం ముందున్న ఆ వ్యాజ్యాలను సైతం తామే విచారిస్తామని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.ఆ వ్యాజ్యాలను తమ ముందుంచాలని సీజే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం హైకోర్టు రిజిస్ట్రీని సోమవారం ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 27వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలావుంటే రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని 6 నెలల్లో అభివృద్ధి చేయాలంటూ ఇచ్చిన తీర్పును ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర అధికారులు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తున్నారని, వీరి చర్యలను కోర్టు ధిక్కారంగా పరిగణించి, వారిని శిక్షించాలంటూ రాజధాని రైతులు దోనె సాంబశివరావు, తాటి శ్రీనివాసరావు, మరికొందరు దాఖలు చేసిన కోర్టు ధిక్కార వ్యాజ్యాలపై విచారణను కూడా ఫిబ్రవరి 27కి వాయిదా వేసింది. రాజధాని వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై తాము ఇప్పుడు విచారణ జరపడం సబబు కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని 6 నెలల్లో అభివృద్ధి చేయాలంటూ ఇచ్చిన తీర్పును ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర అధికారులు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తున్నారని, వీరి చర్యలను కోర్టు ధిక్కారంగా పరిగణించి, వారిని శిక్షించాలంటూ రాజధాని రైతులు దాఖలు చేసిన కోర్టు ధిక్కార వ్యాజ్యాలు సోమవారం విచారణకు వచ్చాయి. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ స్పందిస్తూ.. అమరావతి రాజధాని విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిందని తెలిపారు. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు రాజధాని అభివృద్ధి విషయంలో హైకోర్టు నిర్ధేశించిన కాల పరిమితులపై స్టే విధించిందన్నారు. ఈ నెల 31న సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై మరోసారి విచారణ జరపనున్న దృష్ట్యా విచారణను ఫిబ్రవరికి వాయిదా వేయడం మేలన్నారు. అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, సీఆర్డీఏ తరఫు న్యాయవాది కాసా జగన్మోహన్రెడ్డి తమ వాదనలు వినిపిస్తూ.. రాజధాని ప్రాంతంలో ఇతరులకు సైతం ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు వీలుగా ప్రభుత్వం చట్ట సవరణ చేసిందన్నారు. ఈ నేపథ్యంలో ఆ వ్యాజ్యాలన్నీ నిరర్థకం అవుతాయని, ఆ మేరకు మెమో కూడా దాఖలు చేశామన్నారు. ఈ మెమోకు కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్లను ధర్మాసనం ఆదేశించిందని, అయినప్పటికీ కౌంటర్ దాఖలు చేయలేదని తెలిపారు. కౌంటర్ దాఖలు చేయకపోవడమే కాక, ప్రధాన అభ్యర్థనను సవరిస్తూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారన్నారు. అంతేకాక చట్ట సవరణను సవాల్ చేస్తూ పిటిషనర్లు ద్విసభ్య ధర్మాసనం ముందు పిటిషన్లు దాఖలు చేశారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ వ్యాజ్యాలను జీవో 107ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యాలతో జత చేయాలని వారు త్రిసభ్య ధర్మాసనాన్ని అభ్యర్థించారు. దీంతో ద్విసభ్య ధర్మాసనం ముందున్న వ్యాజ్యాలను తమ ముందుంచాలంటూ త్రిసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ విషయం మాకెందుకు చెప్పలేదు పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన సాయిసంజయ్ సూరనేని వాదనలు వినిపిస్తూ.. చట్ట సవరణపై తాము దాఖలు చేసిన వ్యాజ్యాలపై ద్విసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోందన్నారు. విచారణ ముగిసేంత వరకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయబోమంటూ ద్విసభ్య ధర్మాసనం ముందు ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఆ హామీని గతంలో దాఖలైన వ్యాజ్యాలకు సైతం వర్తింప చేయాలని కోరారు. దీనిపై త్రిసభ్య ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ఇదే అంశంపై ద్విసభ్య ధర్మాసనం ముందు పిటిషన్లు దాఖలు చేసిన విషయాన్ని తమ దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత పిటిషనర్లపై ఉందని తేల్చి చెప్పింది. ఇళ్ల స్థలాల కేటాయింపు వ్యవహారంపై త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతున్న విషయాన్ని ద్విసభ్య ధర్మాసనానికి ఎందుకు చెప్పలేదని ప్రశ్నించింది. ద్విసభ్య ధర్మాసనం ముందున్న వ్యాజ్యాలను కూడా తామే విచారిస్తామని స్పష్టం చేసింది. -
హైకోర్టు ‘గడువుల’పై సుప్రీం స్టే
రాజధాని ఫలానా ప్రాంతంలోనే ఉండాలని ఆదేశించే అధికారం న్యాయస్థానానికి లేదు. అది ప్రభుత్వ పరిధిలోని అంశం. ఇలాంటి వ్యవహారాల్లో కూడా కోర్టులు జోక్యం చేసుకుంటుంటే, ఇక ప్రజా ప్రతినిధులెందుకు? మంత్రి వర్గం ఎందుకున్నట్లు? – సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జోసెఫ్, జస్టిస్ నాగరత్న ధర్మాసనం సాక్షి, న్యూఢిల్లీ: రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని ఆరు నెలల్లో నిర్మించి, అభివృద్ధి చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు నిలిపేసింది. అలాగే రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ తదితర ప్రాథమిక మౌలిక సదుపాయాలతో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రక్రియను నెల రోజుల్లో పూర్తి చేయాలన్న ఆదేశాన్ని కూడా సుప్రీంకోర్టు నిలిపేసింది. అంతేకాక అన్ని మౌలిక సదుపాయాలతో నివాసయోగ్యమైన రీతిలో ప్లాట్లను అభివృద్ధి చేసి వాటిని మూడు నెలల్లో ల్యాండ్ పూలింగ్ కింద భూములిచ్చిన భూ యజమానులకు అప్పగించాలన్న ఆదేశాన్ని సైతం సుప్రీంకోర్టు స్టే చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని అమరావతి రైతులకు, రైతు సంఘాలకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి 31కి వాయిదా వేసింది. రాజధాని నగరాన్ని మార్చే లేదా రాజధానిని విభజించే లేదా మూడు రాజధానులను ఏర్పాటు చేసే విషయంలో తీర్మానం, చట్టం చేసే శాసనాధికారం రాష్ట్రానికి లేదని చెప్పిన హైకోర్టు తీర్పుపై జనవరి 31న లోతుగా విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ‘‘ఈ లోపు రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త చట్టాన్ని తెస్తే, ప్రస్తుత వ్యాజ్యాలన్నీ నిరర్థకం అవుతాయి కదా! అందుకనే ఈ వ్యవహారాన్ని వీలైనంత త్వరగా తేలుస్తాం’’ అని న్యాయమూర్తులు జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బివీ.నాగరత్నంతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పలు సందర్భాల్లో విస్మయం వ్యక్తం చేసింది. పలు ఘాటు వ్యాఖ్యలు కూడా చేసింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో ప్రభుత్వ పిటిషన్ రాజధాని నగరాన్ని మార్చే లేదా రాజధానిని విభజించే లేదా మూడు రాజధానులను ఏర్పాటు చేసే విషయంలో తీర్మానం, చట్టం చేసే శాసనాధికారం రాష్ట్రానికి లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ ఏడాది మార్చి 3న తీర్పునిచ్చింది. అలాగే హైకోర్టుతో సహా శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలకు సంబంధించిన ప్రధాన కార్యాలయాలను ఏపీ సీఆర్డీఏ చట్టం, ల్యాండ్ పూలింగ్ నిబంధనల కింద నోటిఫై చేసిన ప్రాంతంలో తప్ప మరో చోటుకి మార్చే అధికారం కూడా రాష్ట్రానికి లేదని హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. వీటితో పాటు రాజధాని నగర, రాజధాని ప్రాంత అభివృద్ధి, నిర్మాణం విషయంలో పలు కాల పరిమితులను నిర్ధేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఇదే సమయంలో హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని, ఇలా చేయకపోవటం కోర్టు ధిక్కారమేనని పేర్కొంటూ కొందరు రైతులు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నంతో కూడిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది. మనుగడలోని లేని చట్టం ఆధారంగా హైకోర్టు తీర్పునిచ్చింది... ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ, పాలన వికేంద్రీకరణ కోసం ఉద్దేశించిన చట్టం రద్దయిందని, అలా రద్దయిన తరవాత కూడా అది ఉన్నట్లుగా భావించి హైకోర్టు తీర్పునిచ్చిందని, అలా ఎలా చేస్తుందని ప్రశ్నించారు. న్యాయమూర్తి జస్టిస్ జోసెఫ్ జోక్యం చేసుకొని రైతులకు, రాష్ట్రానికి మధ్య జరిగిన ఒప్పందం కొంత మేరకు మనుగడలో ఉంటుంది కదా అని అభిప్రాయపడ్డారు. ఒక నిర్దిష్ట పరిధిలో చట్టాన్ని ఆమోదించాలంటూ శాసనసభను హైకోర్టు ఆదేశించజాలదని, ఇదంతా అధికార విభజన పరిధిలోని వ్యవహారమని వేణుగోపాల్ తెలిపారు. ఒక చట్టం మనుగడలో లేనప్పుడు దాని శాసన యోగ్యతపై కోర్టు జోక్యం తగదన్నారు. ‘‘చట్టం రద్దు చేసినప్పుడు శాసనసభ తదుపరి ఏం చేస్తుందో న్యాయ వ్యవస్థ ఓపికతో చూడాలి. ఆపై శాసనసభ మరో చట్టాన్ని ఆమోదిస్తే దాని చెల్లుబాటును పరిగణించొచ్చు. కానీ చట్టమే లేనప్పుడు అది ఉన్నట్టే పరిగణనలోకి తీసుకున్నారు. ఇది చాలా చిత్రమైన అంశం. న్యాయస్థానాలు పూర్తిగా అకడమిక్ సమస్యల్లోకి వెళ్లజాలవవు’’ అని వేణుగోపాల్ తెలిపారు. రాజధాని నగరం అనే భావన రాజ్యాంగంలో లేదని ఆయన వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలోని ఏడో షెడ్యూలులో రాజధాని ఏర్పాటుకు సంబంధించి నిర్దిష్ట ప్రదేశం లేదని, రాజధాని అంటే ప్రభుత్వం తన మూడు శాఖల్లో దేనిలోనైనా పని చేసే స్థానం మాత్రమేనన్నారు. కార్యనిర్వాహక వ్యవహారాలు పూర్తిగా అధికార యంత్రాంగానికి సంబంధించిన సమస్య అని విన్నవించారు. హైకోర్టు పరిధి దాటి వ్యవహరించింది... నెల లోపు ఇది చేయండి అని ఆదేశించడం సులభమని, కాని దానిని ఆచరణలో పెట్టడం అసాధ్యమైన పనిగా వేణుగోపాల్ పేర్కొన్నారు. ఈ సమయంలో జస్టిస్ జోసెఫ్ జోక్యం చేసుకుంటూ, ‘అమరావతిలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టినట్లు ఉన్నారుగా..! హైకోర్టు భవనం కూడా కట్టారు. ఇప్పుడు కర్నూలులో హైకోర్టు అంటున్నారు. దీని సంగతి ఏమిటి? అని ప్రశ్నించారు. అదంతా అయిపోయిన అంశం అని వేణుగోపాల్ పేర్కొన్నారు. ప్రాథమిక హక్కులకు ముప్పు వాటిల్లుతుందని సహేతుకమైన భయాందోళనలున్నప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చు. కానీ హైకోర్టు ఆదేశాలు అనుమానమే బేస్‌గా ఇచ్చినట్లున్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ సమయంలో జస్టిస్ బీవీ నాగరత్న స్పందిస్తూ,. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో అధికారాలు వేర్వేరుగా లేవా? హైకోర్టు ఎందుకు కార్యనిర్వాహక అధికారాలను నిర్విర్తిస్తోంది? అన్నింటినీ ఒకే చోట కేంద్రీకరించడం కంటే మరిన్ని పట్టణ కేంద్రాలను కలిగి ఉండడం మంచిది కదా..? దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్రమే కదా? హైకోర్టు కాదు కదా!. హైకోర్టు పరిధి దాటి వ్యవహరించింది’’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. అంతేకాక ఇరువురు న్యాయమూర్తులు కూడా, వేర్వేరు రాష్ట్రాల్లో అధికార వికేంద్రీకరణ గురించి న్యాయవాదులతో చర్చించారు. రైతుల ప్రయోజనాలకు పూర్తి రక్షణ ఉంది... ఈ సమయంలో భూములిచ్చిన రైతుల గురించి జస్టిస్ జోసెఫ్ ఆరా తీశారు. రైతుల హక్కులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది ఎస్. నిరంజన్‌రెడ్డి కోర్టుకు వివరించారు. చట్టంలో రైతుల ప్రయోజనాలను పరిరక్షించే ఏర్పాట్లున్నాయన్నారు. రైతుల నుంచి సేకరించిన భూమిని అభివృద్ధి చేయడానికి సంబంధించి ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేరుస్తుందని, అయితే కాలపరిమితి అనేది ప్రధానమైన అడ్డంకి అని ఆయన వివరించారు. అమరావతిని రాజధానిగా తొలగించలేదని, మూడు అధికార కేంద్రాల్లో అమరావతి కూడా ఒకటి అని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో హైకోర్టు నిర్వహణ గురించి న్యాయమూర్తులు ఆరా తీశారు. హైకోర్టు గురించి చెప్పాలని జస్టిస్ జోసెఫ్ కోరగా.. అమరావతిలోనే నిర్వహణ సాగుతోందని నిరంజన్‌రెడ్డి తెలిపారు. హైకోర్టుపై ఎంత ఖర్చుచేశారని న్యాయమూర్తి ప్రశ్నించగా.. సుమారు రూ.100 కోట్లకుపైగా ఖర్చు చేసినట్లు నిరంజన్‌రెడ్డి తెలిపారు. హైకోర్టులో క్యాంటీన్ లేదట కదా..! న్యాయమూర్తులు, న్యాయవాదులు మధ్యాహ్నా సమయంలో భోజనం నిమిత్తం బయటకి వెళ్తున్నారట కదా! అని జస్టిస్ నాగరత్న ప్రశ్నించారు. హైకోర్టు పూర్తి స్థాయిలో పనిచేయాలంటే పూర్తి స్థాయి సౌకర్యాలు ఉండాలి కదా? అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం క్యాంటీన్ పూర్తిస్థాయిలో ఉందని నిరంజన్‌రెడ్డి తెలిపారు. పూర్తిస్థాయి వాదనల తరువాత దీనిపై నిర్ణయం... వేణుగోపాల్ వాదనలు కొనసాగిస్తూ.. సమాఖ్య నిర్మాణంలో రాజధానిని మార్చుకొనే అధికారం రాష్ట్రానికి ఉండదా? ఆ అధికారాన్ని హైకోర్టు తన ఆదేశాలతో నియంత్రించొచ్చా? అని ప్రశ్నించారు. జస్టిస్ జోసెఫ్ జోక్యం చేసుకొని రెండు సమస్యలు గుర్తించినట్లుగా పేర్కొన్నారు. శాసనసభ అధికారాలు, రైతుల సమస్య రెండింటినీ చూడాల్సి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వానికే రాష్ట్ర రాజధానిని నిర్ణయించే అధికారం ఉందన్న హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని వేణుగోపాల్ కోరారు. ఈ విషయంలో న్యాయాన్యాయాల జోలికి వెళ్లని సుప్రీంకోర్టు... పూర్తి స్థాయి వాదనల తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. హైకోర్టు తప్పుగా పేర్కొంది... చట్టంలో ‘ఎ క్యాపిటల్’ అని ఉందని, అంటే ఒకే రాజధాని అని ఎలా భావిస్తారని ఆంధ్రప్రదేశ్ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వ్యాఖ్యానించారు. అమరావతిని రాజధానిగా కేంద్రం నిర్ణయించలేదని, కేంద్రం కేవలం నిపుణుల కమిటీని మాత్రమే వేసిందని ఆయన తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 4 ప్రకారం రాష్ట్ర రాజధానిని కేంద్రమే నిర్ణయిస్తుందని హైకోర్టు తప్పుగా పేర్కొందని వేణుగోపాల్ తెలిపారు. ఆర్టికల్ 4 ద్వారా సంక్రమించిన అధికారం కొత్త రాష్ట్రం ఏర్పడిన సమయంలో ఒకసారి మాత్రమే వినియోగించగలిగేదని వేణుగోపాల్ ధర్మాసనం దృష్టికికి తీసుకొచ్చారు. శాసన అధికారాలకు మూలం ఏంటని జస్టిస్ జోసెఫ్ ఈ సందర్భంగా ప్రశ్నించారు.. కార్యనిర్వాహక అధికారం శాసన అధికారంతో సహా విస్తృతమైనదని, ముందుగా శాసన అధికారం కలిగి ఉండాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. క్యాపిటల్ అనే భావన అసలు రాజ్యాంగంలో లేదని, సమాఖ్య రాష్ట్రంలో పాలనలో కొంత భాగాన్ని కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా నిర్ణయించడానికి అనుమతి ఉంటుందని, కార్యనిర్వాహక అధికారాల నిర్వహణలో శాసన వ్యవస్థ ఎప్పుడైనా అడుగు పెట్టొచ్చని వేణుగోపాల్ తెలిపారు. ‘‘రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే సమయంలో రాజ్యాంగపరమైన విషయాలపై నిర్ణయం తీసుకోవాలి. కానీ రోజువారీ కార్యకలాపాలు ఎలా నిర్వహించాంటూ రాష్ట్రం చేతులు కట్టుకుని న్యాయవ్యవస్థను అడగాలా? ఇది పూర్తిగా ఎగ్జిక్యూటివ్ అధికారాలకు విరుద్ధం కాదా?’’ అని వేణుగోపాల్ ప్రశ్నించారు. ఆర్టికల్ 162 రాష్ట్ర కార్యనిర్వాహక అధికార పరిధిని పరిశీలిస్తుంది కదా అని జస్టిస్ జోసెఫ్ ప్రశ్నించగా... కార్యనిర్వాహక అధికారం శాసన అధికారంతో కలిసి ఉంటుందని మాత్రమే ఆర్టికల్ 162 చెప్పిందని వేణుగోపాల్ తెలిపారు. అయితే, రాష్ట్రానికున్న శాసన అధికారాలతో విభజన చట్టాన్ని సవరించగలరా? అని జస్టిస్ జోసెఫ్ ప్రశ్నించారు. అలా చేయలేమని, విభజన చట్టం అనేది ఓ ప్రవేశిక అని వేణుగోపాల్ తెలిపారు. విభజన చట్టాన్ని సవరించడానికి పార్లమెంటుకు నిర్దిష్టమైన నిబంధనలున్నందున దాన్ని సవరించలేమని జస్టిస్ జోసెఫ్ పేర్కొన్నారు. రాజధానిని మార్చే అధికారం రాష్ట్రానికి లేదు... రైతుల తరఫు సీనియర్ న్యాయవాది ఫాలీ నారీమన్ వాదనలు వినిపిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి సరికాదన్నారు. పార్లమెంటు చేసిన చట్టాన్ని ఓసారి చూడాలన్న ఆయన... ఒకసారి రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేశాక దాన్ని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. జస్టిస్ జోసెఫ్ జోక్యంచేసుకొని... చట్టంలో అమరావతిలోనే రాజధాని ఉండాలని చెప్పలేదుగా? అని ప్రశ్నించారు. తొలుత హైదరాబాద్ రాజధానిగా పేర్కొన్నారని, తర్వాత కేంద్రం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ప్రత్యామ్నాయ రాజధానిని నిర్ణయించాలని సూచించిందని నారిమన్ పేర్కొన్నారు. అంటే ఫలానా ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలని చెప్పలేదుగా? అని జస్టిస్ జోసెఫ్ పేర్కొంటూ... రాజధాని ఒక ప్రాంతంలో అభివృద్ధి చెందాలని కూడా చెప్పలేమన్నారు. పార్లమెంటు ఒక రాజధాని అని మాత్రమే చెప్పిందని, కానీ ఇక్కడ మూడు రాజధానులు అంటున్నారని నారీమన్ తెలిపారు. రాజధాని ఎక్కడ ఉండాలో రాష్ట్రం నిర్ణయించగలదని జస్టిస్ జోసెఫ్ స్పష్టంచేశారు. దీనిపై పార్లమెంటు చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకుంటందని నారీమన్ తెలిపారు. లబ్ది చేకూరుతుందనే భూములిచ్చారు... రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు నిరంజన్‌రెడ్డి, శ్రీరామ్ జోక్యం చేసుకొంటూ రాష్ట్ర జాబితాలోని ఎంట్రీ 35, ఉమ్మడి జాబితాలోని ఎంట్రీ 20 ప్రకారం రాష్ట్రంలో పట్టణ, స్థానిక ప్రణాళికలకు సంబంధించి చట్టాలను రూపొందించడానికి శాసనసభ సమర్థనీయమైందని తెలిపారు. రైతుల తరఫు మరో సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్ వాదనలు వినిపిస్తూ.. రైతులకు ప్రయోజనం చేకూరుతుందనే ల్యాండ్ పూల్‌కి అంగీకరించారన్నారు. 2020 నాటికి భూములు అభివృద్ధిలోకి తెస్తామని హామీ ఇచ్చారని, కానీ 2019 నుంచే మౌలికసదుపాయాల కల్పన ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వదిలేసిందని శ్యాం దివాన్ తెలిపారు. మూడేళ్లుగా భూమిపై ఎలాంటి చర్యలు లేవన్నారు. కొన్ని ఫొటోలు చూపుతూ హైకోర్టు ఆవరణలో సౌకర్యాలు లేవని, సరైన రహదారులు లేవని, పాఠశాలలు లేవని, కానీ మిషన్ 2020 అని రైతులకు చెప్పారన్నారు. పరిపాలనలో భాగంగా పాలనపరమైన బ్లాకులను వేరే ప్రాంతాలకు మార్చే సామర్థ్యం రాష్ట్రానికి లేదని పేర్కొన్నారు. పాలనపరమైన బ్లాకులను మార్చడం ద్వారా నగరాన్ని నాశనం చేస్తున్నారన్నారు. హైకోర్టు విధించిన కాలపరిమితి అసాధ్యమని భావిస్తే తిరిగి హైకోర్టుకు వెళ్తే తగిన సమయం ఇస్తుందన్నారు. 2019 మే నుంచి మౌలిక సదుపాయాల అభివృద్ధి ఎందుకు చేయలేదో కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలన్నారు. అసలు చట్టంలో రాజధాని నగరం అంటే ఏంటని జస్టిస్ జోసెఫ్ ప్రశ్నించగా.. పరిపాలన ప్రాథమిక స్థానమని దివాన్ తెలిపారు. అలా అయితే మనకు ప్రజా ప్రతినిధులెందుకు..? ఇవన్నీ ఫలానా ప్రాంతంలో ఉండాలా? ఇవి చట్టానికి సంబంధించిన విషయాలా? అని న్యాయమూర్తి తిరిగి ప్రశ్నించారు.. జస్టిస్ బీవీ నాగరత్న స్పందిస్తూ.. అలా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేయడం న్యాయస్థానానికి సంబంధించిన అంశం కాదు. అలాంటప్పుడు మనకు ప్రజా ప్రతినిధులు ఎందుకున్నారు? మంత్రి వర్గం ఎందుకు? అని ప్రశ్నించారు. పరిపాలనా సౌలభ్యం కోసం రాజధాని కాకుండా వేరే ప్రదేశంలో సెక్రటేరియట్ లేదా దానిలో కొంత భాగం ఉండాలని ప్రభుత్వం భావిస్తుండొచ్చుగా? జస్టిస్ జోసెఫ్ పేర్కొన్నారు. అమరావతి నుంచి విశాఖపట్నం, కర్నూలు ఎంత దూరమని న్యాయవాదిని ప్రశ్నించారు. విశాఖపట్నం సుమారు 500 కిలోమీటర్లు, కర్నూలు సుమారు 800 కిలోమీటర్లు అని ప్రభుత్వ న్యాయవాదులు తెలిపారు. ఇది వికేంద్రీకరణలాగే ఉంది కదా! అని ధర్మాసనం అభిప్రాయపడింది. అందరి వాదనలు విన్న ధర్మాసనం, హైకోర్టు ఇచ్చిన తీర్పులోని పలు ఆదేశాలపై స్టే విధించింది. తదుపరి విచారణను జనవరి 31కి వాయిదా వేసింది. అమరావతి రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని ఆరు నెలల్లో అభివృద్ధి చేయాలన్న హైకోర్టు ఆదేశం పూర్తిగా అసంబద్ధం. అది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఆరు నెలల్లో రాజధాని నగరాన్ని అభివృద్ధి చేయడమేంటి? అసలు మీ ఉద్దేశంలో రాజధాని నగరమంటే ఏంటి? అన్నీ మౌలిక వసతులతో రాజధాన్ని ప్రాంతం మొత్తాన్ని నెల రోజుల్లో అభివృద్ధి చేయాలా? హైకోర్టు ఇలా ఎలా ఆదేశాలిస్తుంది. నగర నిర్మాణంలో హైకోర్టుకున్న నైపుణ్యమేంటి? హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానరా? లేక చీఫ్ ఇంజనీరా? ఇలాంటి వ్యవహారంలో కోర్టులకు ఎలాంటి నైపుణ్యం ఉండదు. అందువల్ల నగర నిర్మాణం విషయంలో మేం ఏ రకంగానూ జోక్యం చేసుకోబోం. ఆంధ్రప్రదేశ్‌లో అధికారాలు వేర్వేరుగా లేవా? హైకోర్టు ఎందుకు కార్యనిర్వాహక విధులు నిర్వర్తిస్తోంది? అన్నింటినీ ఒకే చోట కేంద్రీకరించడం కంటే మరిన్ని పట్టణ కేంద్రాలను కలిగి ఉండడం మంచిదే కదా!!. ఈ విషయంలో నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే తప్ప, హైకోర్టుది కాదు. ఈ మొత్తం వ్యవహారంలో హైకోర్టు పరిధి దాటి వ్యవహరించింది. హైకోర్టు కార్య నిర్వాహక వ్యవస్థ ఎంత మాత్రం కాజాలదు. – సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జోసెఫ్, జస్టిస్ నాగరత్నం ధర్మాసనం -
అమరావతిని చంద్రబాబు ఏకపక్షంగా ప్రకటించారు
రాజధాని విషయంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం తప్పని ఏపీ మాజీ డీజీపీ ఆంజనేయరెడ్డి చెప్పారు. ఉన్నత విద్యావంతులు, ఉన్నత పదవుల్లో ఉన్న తాము సిటిజన్స్ ఫోరంగా ఏర్పడి ఈ విషయంపై చంద్రబాబుతో మాట్లాడినా పట్టించుకోలేదని తెలిపారు. రాష్ట్ర విభజన పరిణామాలు, పలు ఇతర అంశాలపై ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. రాజధాని ఏర్పాటుపై అన్ని పార్టీలు, అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయం తీసుకోవాలని కూడా చంద్రబాబుకు సూచించామన్నారు. రాజధానికి దొనకొండ అన్ని విధాలా తగిన ప్రాంతమని, అందుకు 10 సానుకూల అంశాలను ఆయన ముందుంచామని తెలిపారు. సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం తప్పని ఏపీ మాజీ డీజీపీ ఆంజనేయరెడ్డి చెప్పారు. ఉన్నత విద్యావంతులు, ఉన్నత పదవుల్లో ఉన్న తాము సిటిజన్స్ ఫోరంగా ఏర్పడి ఈ విషయంపై చంద్రబాబుతో మాట్లాడినా పట్టించుకోలేదని తెలిపారు. రాష్ట్ర విభజన పరిణామాలు, పలు ఇతర అంశాలపై ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘రాజధాని ఏర్పాటుపై అన్ని పార్టీలు, అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయం తీసుకోవాలని కూడా చంద్రబాబుకు సూచించాం. రాజధానికి దొనకొండ అన్ని విధాలా తగిన ప్రాంతమని చెప్పాం. అందుకు 10 సానుకూల అంశాలను ఆయన ముందుంచాం. వెనుకబడ్డ ఆ ప్రాంతంలో ప్రభుత్వ భూములు లక్ష ఎకరాలకు పైగా ఉన్నాయి. నిర్మాణ వ్యయం కూడా తక్కువ. రాజధాని ఏర్పాటుతో ఆ ప్రాంత ప్రజలకు ఉపాధి లభించేది. పైగా సముద్ర మట్టానికి ఎత్తులో ఉన్న ఈ ప్రాంతంలో డ్రైనేజీ సమస్య కూడా ఉండదు. ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా చంద్రబాబు మాత్రం నిర్మాణాలకు ఏ విధంగానూ అనువుగా లేని అమరావతినే ఎంచుకున్నారు. ఎలాంటి ఆలోచనా లేకుండా అప్పటికప్పుడు అమరావతి పేరు ప్రకటించారు. నిత్యం పంటలతో నందనవనంలా కళకళలాడే కృష్ణా డెల్టాలో కాంక్రీట్ పోసి నాశనం చేశారు. శివరామకృష్ణన్ కమిటీ కూడా అమరావతి ప్రాంతం తప్ప మరెక్కడైనా రాజధాని నిర్మించాలని సూచించినా చంద్రబాబు పరిగణనలోకి తీసుకోలేదు’ అని వివరించారు. వికేంద్రీకరణ చాలా అవసరం పరిపాలన వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాల ప్రజలకు న్యాయం జరుగుతుందని, ప్రాంతీయ అసమానతలు తొలగించవచ్చని తెలిపారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తే విజయవాడ, విశాఖలో బెంచ్‌లు పెట్టాలని అన్నారు. పరిపాలన కోసం నాలుగు జోన్లలోనూ డివిజనల్ కార్యాలయాలు పెట్టి, సచివాలయ అధికారాలు వాటికి బదిలీ చేయాలని, అప్పుడు ప్రజలకు వేగంగా సమస్యలు పరిష్కారమవుతాయని వివరించారు. ఇటీవల రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు బాగుందని, కోస్తా, కృష్ణా డెల్టా ప్రాంతాలు లాభపడుతున్నాయని అన్నారు. నెల్లూరు – తిరుపతి మధ్య కూడా పరిశ్రమలు వచ్చాయని, కర్నూలు ప్రాంతం మాత్రం వెనుకబడి పోయిందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో అధికంగా పెట్టుబడులు పెట్టడం వల్ల అక్కడ సర్ప్లస్ ఆదాయాన్ని అన్ని జిల్లాలకు పంచేవారన్నారు. విడిపోయాక రాష్ట్ర ఆదాయం పూర్తిగా తగ్గిపోయిందని, ఈ పరిస్థితి మరోసారి రాకూడదంటే అన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధి జరగాలని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమంపై దృష్టి పెట్టిందని, ఇది కోవిడ్ కష్టకాలంలో ప్రజలకు ఎంతో మేలు చేసిందని అన్నారు. తర్వాత అభివృద్ధిపై దృష్టి పెడుతుందని ఆంజనేయరెడ్డి చెప్పారు. పోలవరంపైనా బాబు తప్పుడు నిర్ణయం కేంద్ర పరిధిలోని పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు తీసుకోవడమే పెద్ద పొరపాటుగా ఆంజనేయరెడ్డి తెలిపారు. ఆయన తప్పిదం వల్ల ఇప్పుడు ఎస్కలేషన్ ఖర్చే దాదాపు రూ.60 వేల కోట్లకు పెరిగిపోయిందన్నారు. లేదంటే కేంద్రమే ప్రాజెక్టును పూర్తిచేసి ఇచ్చేదని చెప్పారు. మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు సమయంలోనే రాయలసీమ ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలన్న డిమాండ్ వచ్చిందని తెలిపారు. ఆనాడు కర్నూలును రాజధానిగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ విడిపోయాక కూడా సీమకే అన్యాయం జరిగిందన్నారు. ఆనాడు కర్నూలును అభివృద్ధి చేసి ఉంటే సీమ బాగుపడేదని, అమరావతి వల్ల ఎక్కువగా నష్టపోయింది రాయలసీమేనని అన్నారు. ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మైనింగ్, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు స్థాపించాలని సూచించారు. కేవలం ఐటీ పరిశ్రమ వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందదని, ప్రాంతాన్ని బట్టి అనువైన పరిశ్రమలు రావాలని చెప్పారు. -
కర్నూలు ప్రజలు ఒకే రాజధాని కావాలంటున్నారు
సాక్షి, అమరావతి: అధికార వికేంద్రీకరణ గురించి కర్నూలులో అడిగితే అక్కడి ప్రజలు ముక్తకంఠంతో ఒకే రాజధాని కావాలని నినదించారని ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పారు. కర్నూలును మెగా సిటీగా, విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తామని చెప్పామన్నారు. జగన్ రాయలసీమ, ఉత్తరాంధ్ర ద్రోహి అని విమర్శించారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో శనివారం జరిగిన పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. తన జీవితంలో పోలీసులు, ప్రభుత్వం ఇలా వ్యవహరించడాన్ని చూడలేదన్నారు. ఈ పోలీసులకు సిగ్గుందా అని ప్రశ్నించారు. నందిగామ, కర్నూలులో తన సభలకు జీవితంలో ఎప్పుడూ చూడనంత జనం వచ్చారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే, రాష్ట్రాన్ని కాపాడే శక్తి ఎవరికీ ఉండదని చంద్రబాబు చెప్పారు. మళ్లీ సీఎంగానే తాను అసెంబ్లీకి వెళ్తానని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవకపోతే రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందన్నారు. పోలీసులు పెడుతున్న కేసులపై నేతలు తొడకొట్టి బదులివ్వాలని చెప్పారు. జగన్ అన్ని వ్యవస్థలను నాశనం చేయడం ద్వారా అడ్డులేకుండా చూసుకుంటున్నారని ఆరోపించారు. తన హయాంలో అమలుచేసిన పథకాలు నిలిపివేశారని, టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామన్నారు. ‘ఇదేం ఖర్మ’కు శ్రీకారం ఇక టీడీపీ నేతలు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ వైఫల్యాల గురించి చెప్పాలని ఇందుకోసం ‘ఇదేం ఖర్మ’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలన్నారు. అలాగే, 175 నియోజకవర్గాల్లో లీగల్ టీములు పనిచేస్తున్నాయని, పోలీసు కేసులు, ఇతర విషయాల్లో వారి సహకారం తీసుకోవాలని సూచించారు. కుప్పం నియోజకవర్గంలో తనకిప్పుడు లాయర్లను వెతుక్కునే పరిస్థితి వచ్చిందని చెప్పారు. పోలీసు నా కొడుకులు ఫోన్ చేస్తే రికార్డు చేయండి.. జడ్జిల ముందు అబద్ధాలు చెప్పండి ఈ సమావేశంలో చంద్రబాబు సమక్షంలో రైల్వేకోడూరుకు చెందిన టీడీపీ నేత బత్యాల చెంగల్రాయుడు పోలీసులను దుర్భాషలాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు. పోలీసు నా కొడుకులు ఫోన్‌చేస్తే రికార్డు చేయాలని కార్యకర్తలకు సూచించారు. కార్యకర్తలు వాయిస్ రికార్డు చేయాలని, పోలీసులను భయపెట్టేలా మాట్లాడాలని, బెదిరించాలని సలహా ఇచ్చారు. ‘పోలీసులు కోర్టుకు తీసుకెళ్తే మేజిస్ట్రేట్ చెప్పుకునేది ఏమైనా ఉందా అని అడుగుతారు. అప్పుడు అబద్ధాలు చెప్పండి. పోలీసులు ఎగిసెగిసి తన్నారని చెప్పాలి. చెప్పరాని చోటులో ఈ పోలీసులు ముగ్గురు ఎగిరి తన్నారు. చాలా నొప్పిగా ఉందని యాక్షన్ చేయాలి. అప్పుడు నా కొడుకులకు ఖాకీ గుడ్డలు ఊడిపోతాయి’ అంటూ కార్యకర్తలకు ఆయన సలహాలిచ్చారు. పోలీసులను ఎలా ఇబ్బంది పెట్టాలో, తప్పు చేసి ఎలా తప్పించుకోవాలో ఆయన కార్యకర్తలకు శిక్షణ తరహాలో వివరించారు. -
విశాఖ రాజధానికోసం గర్జించిన విద్యార్థి లోకం
టెక్కలి: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో గురువారం ‘మన విశాఖ.. మన రాజధాని’ నినాదం మార్మోగింది. వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరుగుతుందని విద్యార్థిలోకం గళమెత్తింది. వికేంద్రీకరణకు మద్దతుగా ఉత్తరాంధ్ర జేఏసీ కన్వీనర్ హనుమంతు లజపతిరాయ్, టెక్కలి నియోజకవర్గ కన్వీనర్ డి.ఎ.స్టాలిన్, విద్యార్థి, నిరుద్యోగ పోరాటసమితి నాయకుడు టి.సూర్యం నేతృత్వంలో విద్యార్థులు గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర జేఏసీ కన్వీనర్ హనుమంతు లజపతిరాయ్ మాట్లాడుతూ దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన ఉత్తరాంధ్రకు ఊపిరిపోసే విధంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖలో పరిపాలన రాజధానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. మన భావితరాల బంగారు భవిష్యత్ కోసం విశాఖ పరిపాలన రాజధాని కావాల్సిందేనన్నారు. ఈ విషయంలో వెనుకడుగు లేదని స్పష్టం చేశారు. జేఏసీ నియోజకవర్గ కన్వీనర్ డి.ఎ.స్టాలిన్ మాట్లాడుతూ మన భవిష్యత్ కోసం చేస్తున్న ఈ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయాలని పిలుపునిచ్చారు. విశాఖలో పరిపాలన రాజధానితో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ఎంతో అభివృద్ది చెందుతుందని చెప్పారు. కాగా, టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి పాత జాతీయ రహదారి మీదుగా వైఎస్సార్ జంక్షన్ నుంచి అంబేడ్కర్ జంక్షన్ వరకు విద్యార్థులు ర్యాలీ చేశారు. వైఎస్సార్, అంబేడ్కర్ విగ్రహాల వద్ద జేఏసీ నాయకులు నివాళులు అర్పించారు. -
రాజధానిని వదులుకుంటే చరిత్ర క్షమించదు..
టెక్కలి: విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తేనే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని, వికేంద్రీకరణతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమని వక్తలు నొక్కి వక్కాణించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో గురువారం నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో చర్చా వేదిక నిర్వహించారు. విద్యార్థి, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, సామాజిక సంఘాల ప్రతినిధులు పాల్గొని విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు కావాల్సిందేనంటూ తీర్మానించారు. ప్రాంతీయ అసమానతలకు తావులేకుండా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నతాశయంతో ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం విశాఖలో రాజధానికి శ్రీకారం చుట్టారని, దీనికి మనమంతా మద్దతు తెలపాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పిరియా విజయ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలు లేకుండా సీఎం వైఎస్ జగన్ వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారని, ఈ క్రమంలో విశాఖను పరిపాలన రాజధానిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి చెప్పారు. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసుకునేందుకు వచ్చిన ఈ అవకాశాన్ని వదులుకుంటే భావితరాలు మనల్ని క్షమించవని ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ హెచ్చరించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భాగంగా విశాఖలో రాజధాని కోసం సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఎవరు అడ్డుపడినా ఊరుకోం.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్ పాలన వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి కోసం విశాఖలో పరిపాలన రాజధానిని ఏర్పాటు చేస్తున్నారు. అభివృద్ధి అంశాన్ని రాజకీయం చేస్తున్నారు. ఈ విషయంలో ఎవరు అడ్డుపడినా తొక్కుకుంటూ రాజధానిని ఏర్పాటు చేసుకుంటాం. – ప్రొఫెసర్ గుంట తులసీరావు, శ్రీకాకుళం నాన్ పొలిటికల్ జేఏసీ చైర్మన్. మద్దతిద్దాం.. వికేంద్రీకరణలో భాగంగా విశాఖలో రాజధాని ఏర్పాటుతో ఉత్తరాంధ్ర ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి ప్రభుత్వ నిర్ణయానికి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలి. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ చైతన్యవంతం కావాలి. – పేడాడ పరమేశ్వరరావు, జర్నలిస్టు సంఘం రాష్ట్ర నేత ఉత్తరాంధ్ర నుంచి వలస నివారణ విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటును ఉద్యోగ సంఘాల తరఫున పూర్తి స్థాయిలో స్వాగతిస్తున్నాం. దీనివల్ల ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి వలసలను నివారించవచ్చు. విశాఖలో రాజధాని వలన కలిగే ప్రయోజనాలపై గ్రామ స్థాయిలో చర్చా వేదికలు నిర్వహించాలి. సీఎం జగన్ తీసుకున్న వికేంద్రీకరణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. – చౌదరి పురుషోత్తంనాయుడు, ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర నేత ఇప్పుడు వదిలేస్తే.. చరిత్ర క్షమించదు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఉత్తరాంధ్రపై అభిమానంతో విశాఖలో రాజధానిని ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఓ సువర్ణావకాశం. ఇలాంటి అవకాశాన్ని విడిచి పెడితే చరిత్ర మనల్ని క్షమించదు. విశాఖ రాజధాని కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాలి. – హనుమంతు సాయిరాం, ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు. భావి తరాల భవిత కోసం.. విశాఖలో రాజధాని వల్ల కలిగే ప్రయోజనాలపై గ్రామ స్థాయిలో ప్రజలను చైతన్యపరచాలి. రాజధాని ఏర్పాటుతో భావి తరాల భవిష్యత్తు ఎంతో బాగుంటుంది. విశాఖలో రాజధాని సాధన కోసం టెక్కలి నుంచే ఉద్యమాన్ని ప్రారంభించాలి. – దానేటి శ్రీధర్, వైద్యుడు, జిల్లా నాన్ పొలిటికల్ జేఏసీ కన్వీనర్. -
రాజధానిలో ఇతర ప్రాంతాల వారికి స్థలాలివ్వడానికి వీల్లేదు
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాల వారికి ఇళ్లస్థలాలు ఇవ్వడానికి వీల్లేదని రాజధాని రైతులు బుధవారం హైకోర్టుకు నివేదించారు. రాజధాని ప్రాంతంలో ఇతరులకు ఇళ్లస్థలాలు ఇచ్చి ఆ ప్రాంతాన్ని మురికివాడగా చేసి, తద్వారా రాజధానిని అడ్డుకోవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని రైతుల తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు చెప్పారు. ఇళ్లస్థలాలు ఇస్తే తమప్రాంత ప్రజలకే ఇవ్వాలన్నారు. ల్యాండ్‌పూలింగ్ కింద రైతులిచ్చిన భూముల్లో ఇతరులకు ఇళ్లస్థలాలు ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తెలిపారు. చట్ట నిబంధనల ప్రకారం రాజధాని అభివృద్ధి కోసం ఇచ్చిన భూములను ప్లాట్లుగా అభివృద్ధి చేసి, అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి, ఆ ప్లాట్లను తిరిగి రైతులకు అప్పగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రైతుల భూములను రాజధాని అభివృద్ధి కోసమే ఉపయోగించాలి తప్ప ఇతర అవసరాలకు వినియోగించరాదని చెప్పారు. రాజధాని ప్రాంతంలో ఇతరులకు ఇళ్లస్థలాలు ఇవ్వడమంటే మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధంగా వ్యవహరించడమేనని, ఇలా చేసే అధికారం సీఆర్డీఏకు, ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాల వారికి కూడా ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు వీలుగా ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ చట్టం విషయంలో జోక్యం చేసుకోవాలని కోర్టును కోరారు. ఇతర ప్రాంతాల వారికి ఇళ్లస్థలాలు కేటాయించకుండా ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని కోరారు. రైతుల తరఫున ఆదినారాయణరావు వాదనలను పూర్తిచేయడంతో ప్రభుత్వ వాదనల నిమిత్తం విచారణ గురువారానికి వాయిదా పడింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాల వారికి కూడా ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు వీలుగా ప్రభుత్వం సీఆర్డీఏ చట్టాన్ని సవరించ డాన్ని సవాలు చేస్తూ రాజధాని రైతుపరిరక్షణ సమితి, అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య, మరికొందరు వేర్వేరుగా హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాలపై బుధవారం జస్టిస్ దుర్గాప్రసాద్ ధర్మాసనం విచారించింది. ఆ వ్యాజ్యాలన్నీ నిరర్థకం.. రాజధాని ప్రాంతంలో పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇళ్లస్థలాల కేటాయింపునకు రాష్ట్ర ప్రభుత్వం 2020లో జారీచేసిన జీవో 107ను సవాలు చేస్తూ అమరావతి రైతులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ ఈ నెల 30కి వాయిదా పడింది. రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాల వారికి కూడా ఇళ్లస్థలాలు కేటాయించేందుకు వీలుగా ప్రభుత్వం సవరణ చట్టం తీసుకొచ్చిన నేపథ్యంలో జీవో 107ను సవాలు చేస్తూ రైతులు దాఖలు చేసిన వ్యాజ్యాలు నిరర్థకం అవుతాయంటూ ప్రభుత్వం ఓ మెమో దాఖలు చేసింది. ఈ విషయాన్ని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి బుధవారం ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రైతుల తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు ఈ మెమోను వ్యతిరేకించారు. తమ వ్యాజ్యాలు నిరర్థకం కావని, అవి మనుగడలోనే ఉంటాయని తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు, ఆ వ్యాజ్యాలు ఏ విధంగా మనుగడలో ఉంటాయో తెలియజేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదినారాయణరావుకు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ డి.వి.ఎస్.ఎస్.సోమయాజులు, జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. -
‘పెండింగ్’పై 23న భేటీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి వివిధ మంత్రిత్వ శాఖల వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాల పరిష్కారానికి ఏర్పాటైన కేంద్ర, రాష్ట్ర సమన్వయ కమిటీ ఈ నెల 23వ తేదీన సమావేశమై సమీక్ష నిర్వహించనుంది. కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ (సమన్వయ) కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ డైరెక్టర్ ఎం.చక్రవర్తి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమాచారం పంపారు. ఈ–సమీక్ష పోర్టల్‌లో పొందుపరిచిన ఏపీకి చెందిన అంశాలపై సమీక్షించనున్నట్లు పేర్కొన్నారు. రెవెన్యూ లోటు, హోదా.. సమన్వయ కమిటీ వద్ద పెండింగ్‌లో ఉన్న 34 అంశాలతో పాటు వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల వద్ద అపరిష్కృతంగా ఉన్న 15 అంశాలను సమీక్ష అజెండాలో చేర్చారు. రాజధానిలో మౌలిక వసతుల కల్పనకు అవసరమైన ఆర్థిక సాయం అందించడంతో పాటు రాష్ట్ర విభజన జరిగిన ఏడాది రెవెన్యూ లోటు భర్తీతో సహా ప్రత్యేక హోదా అంశాన్ని కూడా అజెండాలో పొందుపరిచారు. జాతీయ రహదారులు, రైల్వే లైన్లకు సంబంధించి పెండింగ్ అంశాలను అజెండాలో చేర్చారు. అజెండాలో ముఖ్యాంశాలు ఇవీ... ► విభజన చట్టం 13వ షెడ్యూల్లో పేర్కొన్న మేరకు ఆరు నెలల్లోగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు. ► కొత్త రాజధాని నుంచి హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ముఖ్యమైన నగరాలకు ర్యాపిడ్ రైలుతోపాటు రోడ్డు కనెక్టివిటీ కల్పించడం. ► విభజన చట్టం 13వ షెడ్యూల్ ప్రకారం వైఎస్సార్ జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు. ► 2014–15 ఆర్థిక ఏడాదిలో రెవెన్యూ లోటు భర్తీకి నిధులు అందించడం. ► 2016లో ప్రధాని ప్రకటన మేరకు విశాఖలో జాతీయ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్ ఏర్పాటు. ► కొత్త రాజధానిలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్థిక సాయం అందించడం. ► పోలవరంలో ఆర్ అండ్ ఆర్తో సహా ప్రాజెక్టుకయ్యే పూర్తి వ్యయాన్ని కేంద్రమే భరించడం. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ఇతర అంశాలతో పాటు ఒడిశా, చత్తీస్‌గడ్‌లో ప్రజాభిప్రాయ సేకరణకు చర్యలు తీసుకోవడం. ► విశాఖలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఏర్పాటు చేయడం. ► విశాఖలో మెట్రో రైలు ఏర్పాటుకు చర్యలు చేపట్టడం. ► వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ అందించడం. ► ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించడం. ► విభజన చట్టంలో పేర్కొన్న మేరకు పారిశ్రామిక ఆర్థిక ప్రగతికి పన్ను రాయితీలు ఇవ్వడం. హైదరాబాద్‌లో ఉన్న వివిధ శిక్షణ సంస్థలను ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పడం. ► కాకినాడ పోర్టు సమీపంలో ఎలక్ట్రానిక్ (హార్డ్‌వేర్) ఉపకరణాల తయారీ కేంద్రం ఏర్పాటు. 16న పీపీఏ సర్వసభ్య సమావేశం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) సర్వసభ్య సమావేశాన్ని ఈ నెల 16న హైదరాబాద్‌లో జరగనుంది. సమావేశంలో ఈ సీజన్లో చేపట్టాల్సిన పనులు, సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్..ఆ మేరకు నిధుల మంజూరుపై చర్చించనున్నారు. పీపీఏ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించాలని 4 నెలల క్రితం పీపీఏ సీఈవోకు జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ లేఖ రాశారు. పీపీఏ నుంచి స్పందన లేకపోవడంతో ఇటీవల అదే అంశాన్ని గుర్తు చేస్తూ మరో లేఖ రాశారు. దీనిపై స్పందించిన పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ 16న సమావేశాన్ని నిర్వహిస్తామని ఏపీకి సమాచారమిచ్చారు. కాగా, ఏడాది క్రితం పీపీఏ సర్వ సభ్య సమావేశాన్ని నిర్వహించారు. -
మూడు రాజధానుల కోసం గళమెత్తిన విద్యార్థి లోకం
ఒంగోలు సబర్బన్: మూడు రాజధానుల కోసం విద్యార్థి లోకం గళమెత్తింది. ఒక రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు అంటూ ఒంగోలు నగరం మార్మోగింది. శనివారం వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ముంగమూరు రోడ్డు జంక్షన్ నుంచి లాయర్ పేట షిర్డీ సాయిబాబా గుడి వరకు సాగింది. విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య మాట్లాడుతూ.. అమరావతిని శాసన రాజధానిగా, విశాఖను పరిపాలనా రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేయాలని డిమాండ్ చేశారు. మూడు రాజధానులతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణతో పాటు పరిపాలనా వికేంద్రీకరణ జరిగిన నాడే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి పథంలో నడుస్తాయన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుచూపుతో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని చూస్తుంటే.. ప్రతిపక్ష టీడీపీతో పాటు దాని తోక పార్టీలు అమరావతే రాజధాని కావాలని పట్టుబట్టడం వెనుక రియల్ ఎస్టేట్ వ్యాపారాలే కారణమని ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ యువనేత బాలినేని ప్రణీత్‌రెడ్డి మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులు అవశ్యమని పేర్కొన్నారు. తెలంగాణ విషయంలో మోసపోయింది చాలదన్నట్లు అమరావతి ఒక్కదానినే రాజధానిని చేయాలని టీడీపీ పట్టుబట్టడం వెనుక ఆంతర్యం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందేనని అన్నారు. అమరావతిలో రాష్ట్ర సచివాలయం నిర్మిస్తే వర్షం వస్తే వర్షపు నీరు కారి బకెట్లు పెట్టుకోవాల్సిన పరిస్థితిని తీసుకొచ్చిన ఘనత టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుదేనని విమర్శించారు. రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని కోరుకోవాల్సింది పోయి ఏ ప్రాంతం ఏమైపోతే మాకేమి.. అమరావతి ఒక్కటే బాగుపడితే చాలు అన్న చందంగా చంద్రబాబు ఉండటాన్ని మిగతా ప్రాంతాల ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు. విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు రేల్లా అమర్నాథరెడ్డి, రాష్ట్ర ఆర్యవైశ్య ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాదు, విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు దాట్ల యశ్వంత్, విద్యార్థి విభాగం నాయకులు కొండూరు నవీన్, కృష్ణారెడ్డి, పురిణి శ్రీనివాసులురెడ్డి, నరశింహ, శ్రీకాంత్‌రెడ్డి, చంద్ర, హరీష్‌తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. -
మూడు రాజధానులకే మా మద్దతు
తిరుపతి తుడా: మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయానికి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ మద్దతు తెలిపింది. ఈ మేరకు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. మునిసిపల్ కార్యాలయంలో మేయర్ శిరీష అధ్యక్షతన మంగళవారం అత్యవసర సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొన్న ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మూడు రాజధానుల ఆవశ్యకతను వివరించారు. తీర్మానాన్ని నగర మేయర్ డాక్టర్ ఆర్.శిరీష బలపరచగా.. డిప్యూటీ మేయర్లు ముద్రనారాయణ, భూమన అభినయ్‌రెడ్డి, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు సంపూర్ణ మద్దతు తెలిపారు. సభ్యుల్లో ఒక్కరు కూడా రాజధాని వికేంద్రీకరణను వ్యతిరేకించకపోవడంతో తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందిందని మేయర్ శిరీష ప్రకటించారు. కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వానికి నివేదించనున్నట్టు ఆమె చెప్పారు. ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ.. దశాబ్దాలుగా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు వెనుకబాటుకు గురవుతున్నాయన్నారు. మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలును రాజధాని చేస్తామని చెప్పి నమ్మించారన్నారు. ఆపై తెలంగాణ ప్రాంతాన్ని విలీనం చేస్తూ ఉమ్మడి ఏపీ ఏర్పడినప్పుడు కర్నూలులో ఉన్న రాజధానిని హైదరాబాద్‌కు తన్నుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఏపీ విడిపోతే కర్నూలుకు రావాల్సిన రాజధానిని కుట్రపూరితంగా, దురుద్దేశంతో అమరావతిలో ఏర్పాటు చేశారన్నారు. రాయలసీమకు రావాల్సిన నీటి ప్రాజెక్టులను సైతం అడ్డుకున్న నీచుడు చంద్రబాబని దుయ్యబట్టారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను తుంగలో తొక్కి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చంద్రబాబు అమరావతిని రాజధాని చేశారని ధ్వజమెత్తారు. సీఎం వైఎస్ జగన్ రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలని ఆశిస్తుంటే.. అందుకు విరుద్ధంగా చంద్రబాబు 29 గ్రామాలకే న్యాయం జరగాలని పట్టుబట్టడం సిగ్గుచేటన్నారు. రాజధాని, పాలన వికేంద్రీకరణతోనే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధ్యమన్నారు. అన్ని ప్రాంతాలకు సమానంగా విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మూడు రాజధానులతోనే సాధ్యమవుతాయని చెప్పారు. భవిష్యత్తులో వేర్పాటువాదం రాకూడదన్న ముందు చూపుతోనే సీఎం జగన్ గొప్ప నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. అయితే చంద్రబాబు అండ్ కో వికేంద్రీకరణను అడ్డుకుంటున్నారని విమర్శించారు. వికేంద్రీకరణకు సీమవాసులంతా మద్దతు ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు. కాగా ఇటీవల రాయలసీమ ఆత్మగౌరవ మహాప్రదర్శన విజయవంతం చేసిన భూమన కరుణాకరరెడ్డికి మునిసిపల్ కౌన్సిల్ అభినందనలు తెలిపింది. -
విశాఖ రాజధాని కోసం విద్యార్థుల గర్జన
చోడవరం: వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి విశాఖ రాజధాని ఎంత అవసరమో విద్యార్థి భేరి ఎలుగెత్తి చాటిందని, మూడు రాజధానులు ఏర్పాటుచేసే వరకూ ఉద్యమం ఆగదని ఉత్తరాంధ్ర జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ ఎం.లజపతిరాయ్ స్పష్టంచేశారు. వలస బతుకుల కష్టాల నుంచి విముక్తి కలగాలన్నా, విద్యార్థులకు మంచి భవిష్యత్తు లభించాలన్నా వికేంద్రీకరణ ఒక్కటే మార్గమన్నారు. అనకాపల్లి జిల్లా చోడవరంలో సోమవారం జరిగిన ‘విద్యార్థి భేరి’ రాజధాని నినాదాలతో హోరెత్తింది. వేలాదిమంది విద్యార్థులు తరలిరావడంతో పట్టణంలో ప్రధాన వీధులు కిటకిటలాడాయి. స్థానిక శివాలయం జంక్షన్ నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీ వరకు సుమారు కిలోమీటరున్నర మేర భారీ ర్యాలీ జరిగింది. ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, ఎంపీ సత్యవతి, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు పాల్గొన్నారు. విద్యార్థి సంఘాల నాయకులు, న్యాయవాదులు, డాక్టర్లు ర్యాలీని ముందుండి నడిపించారు. ర్యాలీ అనంతరం కాలేజీ గ్రౌండ్ వద్ద జరిగిన సభకు చోడవరం జేఏసీ కన్వీనర్ కాండ్రేగుల డేవిడ్ అధ్యక్షత వహించారు. ఈ సభలో ప్రొఫెసర్ లజపతిరాయ్ మాట్లాడుతూ ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదని, మరింత ఉధృతం చేస్తామన్నారు. మూడు రాజధానుల కోసం ఇప్పటికే చిత్తూరు, కర్నూలు, ఉభయ గోదావరి జిల్లాల్లో ఉద్యమాలు ఉధృతమయ్యాయన్నారు. అడ్డుకునే వారి ఆటలు సాగవు కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధిని కొన్ని శక్తులు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని, వాటి ఆటలు సాగవని హెచ్చరించారు. విద్యార్థులు మూడు రాజధానులకు తమ మద్దతు ప్రకటించడం అభినందనీయమన్నారు. ఎంపీ బీవీ సత్యవతి మాట్లాడుతూ ఊరే లేనిచోట పూర్తిస్థాయి రాజధాని నిర్మించడం ఎంత కష్టమో అందరికీ తెలుసునని, మూడుచోట్ల రాజధానులు ఏర్పాటుచేస్తే మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఉత్తరాంధ్ర ఓట్లు కావాలి గానీ ఈ ప్రాంత అభివృద్ధి మాత్రం కొన్ని పార్టీలకు అవసరంలేదని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వంలో సాధించుకోలేకపోతే విశాఖ రాజ ధాని ఎప్పటికీ కాదన్నారు. విశాఖ–కాకినాడ పెట్రో కెమికల్ అండ్ పెట్రోలియం కారిడార్ చైర్పర్సన్ చొక్కాకుల లక్ష్మి, వైఎస్సార్సీపీ నేత చొక్కాకుల వెంకట్రావు, ఉత్తరాంధ్ర జేఏసీ వైస్ కన్వీనర్ దేముడు మాస్టారు తదితరులు పాల్గొన్నారు. -
మూడు రాజధానులతో అన్ని ప్రాంతాల అభివృద్ధి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న మహోన్నత ఆశయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టిన మూడు రాజధానులకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు నత్తా యోనారాజు పునరుద్ఘాటించారు. మూడు రాజధానులకు మద్దతుగా విజయవాడలో సోమవారం మోటార్ సైకిళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీనగర్‌లోని ధర్నా చౌక్‌లో నిర్వహించిన ఒక రోజు దీక్ష విజయవంతంగా ముగిసింది. యోనారాజు మాట్లాడుతూ అమరావతి రాజధాని పేరుతో టీడీపీ చేస్తున్న డ్రామాలకు వ్యతిరేకంగా, మూడు రాజధానులకు మద్దతుగా మాలమహానాడు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక రోజు దీక్షలు తలపెట్టామని, ఏలూరు జిల్లాలో పూర్తిచేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పి.గౌతంరెడ్డి, వైఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు బొప్పన భవకుమార్, ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడు మారేష్, నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు శ్రీనివాసరావు మద్దతు తెలిపారు. -
అమరావతిలో అందరికీ ఆవాసం
సాక్షి, అమరావతి: సామాన్యులకూ ఇకపై అమరావతి ప్రాంతంలో ఇల్లు కట్టుకుని స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే సౌలభ్యాన్ని ప్రభుత్వం చట్ట ప్రకారం కల్పించింది. అక్కడ బయటి వారు నివసించకుండా న్యాయ వివాదాలతో అడ్డుకుంటున్న విపక్షాల కుట్రలను ఛేదిస్తూ మంగళగిరి, తుళ్లూరు మండలాల్లోని 5 గ్రామాల్లో 900.97 ఎకరాలను ఆర్–5 జోన్‌గా చట్ట ప్రకారం ఏర్పాటు చేసింది. ఆర్థికంగా వెనుకబడ్డ ప్రజలంతా ఎలాంటి ఆంక్షలు లేకుండా గృహాలను నిర్మించుకునేందుకు అవకాశం కల్పిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చట్టం చేసింది. ఈ మేరకు కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు, మందడం, ఇనవోలు గ్రామాలను కొత్త జోన్ పరిధిలోకి తెచ్చింది. 2020లోనే ఈ ప్రాంతంలో సామాన్యులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం కాగా విపక్షాలు న్యాయ వివాదాలు సృష్టించాయి. చట్ట ప్రకారమే 5 శాతం సీఆర్డీఏ చట్టం 2014 సెక్షన్–53 (డి) ప్రకారం మొత్తం విస్తీర్ణంలో ఐదు శాతం భూమిని ల్యాండ్ పూలింగ్ కింద పేదల నివాసాలకు కేటాయించవచ్చు. అందుకోసం స్థానిక సంస్థలు లేదా ప్రత్యేకాధికారుల అనుమతితో మాస్టర్ ప్లాన్ లేదా జోనల్ డెవలప్మెంట్ ప్లాన్‌కు తగినట్లుగా మార్పులు చేయవచ్చు. ఆ ప్రకారమే ఆర్–5 జోన్ ఏర్పాటు కానుంది. దీనిపై అభ్యంతరాల స్వీకరణకు 15 రోజులు గడువిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. పరిశ్రమలు, వ్యాపార సముదాయాలు, కాలుష్య రహిత కార్యకలాపాలు లాంటి వాటిని పది అంతర్గత జోన్లుగా పేర్కొంది. ఆయా ప్రాంతాల్లో పాటించే నిబంధనలను గెజిట్‌లో పొందుపరిచింది. పేదలకు మేలు జరిగితే సహించని ‘ఈనాడు’ నిరుపేదలు, ఆర్థికంగా వెనుబడినవారికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 35 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలను అందచేసింది. సొంతిల్లు లేనివారు ఉండరాదనే ఉద్దేశంతో అన్ని నియోజకవర్గాలు, పట్టణాలు, పంచాయితీల్లో సైతం ల్యాండ్ పూలింగ్ విధానాన్ని తెచ్చింది. ఆయా ప్రాంతాల్లో సొంతిల్లు లేనివారు దరఖాస్తు చేసుకుంటే ఎప్పుడైనా నిబంధనల మేరకు స్థలం కేటాయించేలా ఉత్తర్వులిచ్చింది. ఇదే విధానాన్ని అమరావతి ప్రాంతంలోనూ అనుసరించనుంది. శాసన రాజధానిలో సామాన్యులు సైతం కాలు మోపేలా అవకాశం కల్పిస్తుంటే సహించలేని ‘ఈనాడు’ విషం కక్కుతోంది. సీఎం జగన్ పేదల పక్షపాతి పేదలు నివసించలేని రాజధాని అందరి రాజధాని ఎలా అవుతుంది? రాజధాని గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తూ సీఆర్డీఏ చట్టానికి సవరణ చేయడం అభినందనీయం. అన్ని వర్గాలకు చోటు కల్పించినప్పుడే అది అందరి రాజధాని అవుతుంది. ముఖ్యమంత్రి జగన్ ఎల్లప్పుడూ పేదల పక్షాన ఉంటానని మరోసారి నిరూపించారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలను అడ్డుకుంటే అది మూర్ఖత్వమే. – రేటూరి కిషోర్, సీనియర్ న్యాయవాది (మంగళగిరి) సామాజిక న్యాయం అంటే ఇదీ.. రాజధాని అంటే అన్ని వర్గాల ప్రజలు నివసించేదిలా ఉండాలి. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలిస్తే సామాజిక సమతుల్యత దెబ్బ తింటుందని అనడం ఒక్క వర్గం ప్రజలపై వివక్ష చూపడమే అవుతుంది. సీఎం జగన్ ప్రభుత్వం అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ చట్ట సవరణ చేయడం గొప్ప పరిణామం. సామాజిక న్యాయం అంటే ఇదీ. – మునగాల మల్లేశ్వరరావు, రాజకీయ నేత, మంగళగిరి అన్ని వర్గాలుండాలి ప్రజా రాజధాని అంటే అన్ని వర్గాల ప్రజలుండాలి. కోటీశ్వరుడి నుంచి కూటి కోసం తిప్పలు పడే వారి వరకు అందరికీ చోటివ్వాలి. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతాలో అన్ని వర్గాల ప్రజలున్నారు. అమరావతిలో మాత్రం పేదలు వద్దని టీడీపీ నేతలు అనడం అన్యాయమే. ఆర్–5 జోన్ ఏర్పాటు మంచి నిర్ణయం. – వై.జయరాజు, న్యాయవాది (కర్నూలు) గొప్ప విషయం.. అమరావతి ప్రాంతంలో బయటివారు నివాసాలు ఏర్పాటు చేసుకోరాదని టీడీపీ కోర్టుల్లో కేసులు పెట్టింది. రాష్ట్రంలో ప్రజలు ఎక్కడైనా స్వేచ్ఛగా స్థలం కొని ఇల్లు కట్టుకునేలా జగనన్న ప్రభుత్వం అవకాశం కల్పించింది. సీఎం జగన్ గొప్ప పని చేశారు. ప్రతిపక్షం కోర్టులకు వెళ్లడం సిగ్గుచేటు. – రామాంజనేయులు, డీసీసీబీ డైరెక్టర్, బ్రహ్మసముద్రం సముచిత నిర్ణయం పేదల కోసం సీఆర్డీఏ చట్టాన్ని సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నాం. ప్రాంతం ఏదైనా అన్నిచోట్లా అందరికీ జీవించే హక్కు ఉంటుంది. ఆర్థిక స్తోమతను బట్టి ఫలానా వ్యక్తులు మాత్రమే ఉండాలనడం సరికాదు. రాష్ట్ర ప్రభుత్వం పేదల పక్షాన ఆలోచించి సముచిత నిర్ణయం తీసుకుంది. – ఏలూరి సుబ్రహ్మణ్యం, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, కాకినాడ పేదల పక్షపాతి అర్హులైన పేదలకు అమరావతి ప్రాంతంలో ఇళ్ల స్థలాలు కేటాయించడం సరైన నిర్ణయం. దీన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ కోర్టులకెక్కి అడ్డుకుంది. పేదలకు న్యాయం చేకూర్చాలనే దృఢసంకల్పంతో ముఖ్యమంత్రి జగన్ ముందడుగు వేశారు. పేదల పక్షపాతిగా మరోసారి రుజువు చేసుకున్నారు. – కాపు రామచంద్రారెడ్డి, ప్రభుత్వ విప్(రాయదుర్గం) హర్షిస్తున్నాం.. అమరావతిని ఒక సామాజిక వర్గానికే పరిమితం చేస్తూ టీడీపీ సర్కారు సీఆర్డీఏ చట్టంలో పలు నిబంధనలు పెట్టి స్వార్ధపూరితంగా వ్యవహరించింది. సీఎం జగన్ 900.97 ఎకరాలను పేదల నివాసానికి కేటాయించడం హర్షించదగ్గ విషయం. పేద ప్రజలకు మేలు చేసే అమరావతిలో మరిన్ని సంస్కరణలు తేవాలి. – చింతా కృష్ణయ్య, సీనియర్ న్యాయవాది, ధర్మవరం తప్పిదాన్ని సరిదిద్దారు.. రాజధాని ప్రాంతంలో పేదలకు చోటు కల్పించకుండా కులవాదులు అంతా ఏకమయ్యారు. పేదలకు స్థలాలిస్తే సామాజిక అసమతుల్యత ఏర్పడుతుందని కోర్టుల్లో కేసులు వేశారు. చారిత్రక తప్పిదాన్ని సీఎం జగన్ సరిచేశారు. పేదలు, బడుగులకు 900 ఎకరాలు కేటాయించడం గొప్ప విషయం. అసమానతలు లేని సమాజ నిర్మాణానికి ఇది దారి తీస్తుంది. – మాదిగాని గురునాథం, సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు (విజయవాడ) (తుళ్లూరులో ముడు రాజధానుల శిబిరం నిర్వాహక నాయకులు) సామాజిక సమత్యులత సాకారం అమరావతిలో టీడీపీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే సీఎం జగన్ పేదలకు 900 ఎకరాలకుపైగా కేటాయించటం సంతోషకరం. ఇకపై పేదలు, మధ్య తరగతి, సామాన్య వర్గాలు సైతం అమరావతి మా రాజధాని అనే చెప్పుకునేలా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుంది. సామాజిక సమతుల్యత స్పష్టంగా కనిపిస్తోంది. –– పోలూరి వెంకటరెడ్డి, బార్ అసోసియేషన్, మాజీ అధ్యక్షుడు అణగారిన వర్గాలకు పెద్దపీట.. అణగారిన వర్గాలకు పెద్దపీట వేసేలా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం సాహసోపేతం. టీడీపీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారం, దోపిడీ కోసమే వేలాది ఎకరాలను లాక్కున్నారు. కనీసం సాగు భూమిని వదిలివేయాలన్న ఆలోచన కూడా లేకుండా భూ దాహంతో వ్యవహరించారు. రాజధాని అంటే సంపన్న వర్గాలకే కాకుండా అణగారిన వర్గాలకు కూడా చోటు కల్పించాలి. ––– చెన్నంశెట్టి చక్రపాణి (విశ్రాంత ఎస్పీ, న్యాయవాది) -
వికేంద్రీకరణపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి
బీచ్ రోడ్డు (విశాఖ తూర్పు): పరిపాలన వికేంద్రీకరణపై కొన్ని మీడియా సంస్థలు, కొన్ని పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మేధావులు పిలుపునిచ్చారు. రాజధానిగా అమరావతి అసలు పనికి రాదని స్పష్టంగా చెప్పారు. మూడు రాజధానులతోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందుతాయని తేల్చి చెప్పారు. శుక్రవారం పరిపాలన వికేంద్రీకరణ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఏయూ హిందీ విభాగంలో మేధావుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని పలువురు మేధావులు, పలు సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, ఇతరులు పాల్గొన్నారు. పరిపాలన వికేంద్రీకరణ జరగల్సిందేనని చెప్పారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ లజపతిరాయ్ మాట్లాడుతూ.. రాజధాని, కోర్టులు ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశం భారత రాజ్యాంగంలో ఎక్కడా లేదని చెప్పారు. ప్రధాని, ముఖ్యమంత్రి పాలనకు అనుకూలమైన ప్రాంతంలో ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. అమరావతి కాకుండా వేరే ప్రాంతంలో రాజధాని పెట్టడానికి రాజ్యాంగం ఒప్పుకోదంటూ కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. రాజధానులు ఎన్ని పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి అనేది పాలకుడి నిర్ణయమేనని అన్నారు. ఒక ప్రాంతం మీద అభిమానంతో కాకుండా రాష్ట్రాభివృద్ధి, భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు ఏర్పాటు చేయడం మంచి నిర్ణయమని తెలిపారు. ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరూ స్వాగతించాల్సిన అంశమన్నారు. చంద్రబాబు రక్తం మరిగిన పులి పరిపాలన వికేంద్రీకరణ పరిరక్షణ వేదిక అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ మనిషి రక్తం రుచి మరిగిన పులి మాదిరిగానే 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు ప్రవర్తన కూడా ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రతి అంశాన్నీ వ్యతిరేకించడమే బాబు ధ్యేయమని అన్నారు. ఏదో ఒక విధంగా రాష్ట్రాన్ని నాశనం చేసి లాభం పొందాలని ఆశిస్తున్నారన్నారు. అమరావతి రాజధాని కాదని, అది ఒక కమ్మ సామాజికవర్గం వ్యాపార సామ్రాజ్యమని అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా ఇప్పటివరకు వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. సీఎం జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాలు సరైనవేనని, అందుకు సచివాలయ వ్యవస్థ, జిల్లాల విభజన నిదర్శనమని తెలిపారు. కరోనా సమయంలో సచివాలయ వ్యవస్థ ద్వారా వందలాది మంది ప్రాణాలను కాపాడారని అన్నారు. మారుమూల గ్రామాల ప్రజలు వారి సమస్యలు చెప్పుకొనేందుకు కలెక్టర్ కార్యాలయానికి రావాలంటే రెండు రోజులు పట్టేదని, ఇప్పుడు జిల్లాల విభజనతో వారి చెంతకే కలెక్టరేట్ వచ్చిందన్నారు. అమరావతి రైతులంతా బడా బాబులే: ప్రొఫెసర్ ఎన్ఏడీ పాల్ వికేంద్రీకరణ పరిరక్షణ వేదిక గౌరవాధ్యక్షులు ప్రొఫెసర్ ఎన్ఏడీ పాల్ మాట్లాడుతూ తమిళనాడు నుంచి ఆంధ్రను విభజించినప్పుడు రాజధానికి మొదట విశాఖపట్నమే అనుకున్నా.. కొన్ని రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కర్నూలుకు మార్చారన్నారు. ఆ తరువాత హైదరాబా«ద్‌కు మార్చి రాష్ట్ర ప్రజల సంపద అంతా అక్కడ పెట్టుబడులుగా పెట్టారన్నారు. ఇప్పుడు కూడా అదేవిధంగా చేయడం వల్ల ఒక ప్రాంతం మాత్రమే అభివృద్ధి చెందుతుందని, అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలంటే వికేంద్రీకరణ జరిగి తీరాల్సిందేనని చెప్పారు. వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాలకు విద్య, వైద్య, ఉద్యోగావకాశాలు సమానంగా అందుతాయని తెలిపారు. అమరావతి రైతులు అసలు రైతులే కాదని, అంతా బడాబాబులేనని విమర్శించారు. అసలు సిసలైన రైతులు ఉత్తరాంధ్రలో ఉన్నారన్నారు. వరదలొస్తే అమరావతి కొట్టుకుపోతుంది : ప్రొఫెసర్ ముత్తయ్య ప్రొఫెసర్ ముత్తయ్య మాట్లాడుతూ అమరావతి రాజధానిగా అస్సులు పనికి రాదన్నారు. వరదలు వస్తే అమరావతి కొట్టుకుపోయే పరిస్థితి ఉందన్నారు. లక్షల కోట్లు వృథా తప్ప మరో ప్రయోజనం ఉండదన్నారు. వాయు, జల, రోడ్డు మార్గాలు ఉన్న విశాఖ నగరాన్ని రాజధానిగా చేస్తే రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వస్తాయని చెప్పారు. తద్వారా ఆదాయం పెరిగి సంక్షేమ పథకాలను అమలు చేయవచ్చని తెలిపారు. విద్యార్థుల పోరాటాలు విజయవంతం అవుతాయి : ప్రొఫెసర్ పుల్లారావు ప్రొఫెసర్ పుల్లారావు మాట్లాడుతూ అన్ని ప్రాంతీల అభివృద్ధి కోసమే పరిపాలన వికేంద్రీకరణ అని, ప్రాంతీయ అభిమానంతో కాదని చెప్పారు. విద్యార్థులు చేసిన ఏ పోరాటమైనా విజయవంతం అవుతుందన్నారు. పరిపాలన వికేంద్రీకరణ పరిరక్షణ కోసం విద్యార్థులను భాగస్వామ్యం చేయటం అభినందనీయమన్నారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్లు సూర్యనారాయణ, శోభ శ్రీ , నల్ల సత్యనారాయణ, ప్రేమానందం, కృష్ణ, రాజామాణిక్యం, బార్ కౌన్సిల్ సభ్యులు అరుణ్ కుమార్, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. -
విశాఖపై విద్వేషాల కబ్జా.. రామోజీ టక్కు టమారం.. ‘ఈనాడు’ విషపు రాతలు
రామోజీరావుకు విశాఖపట్నమంటే ప్రేమో, ద్వేషమో, మరేదో తెలియని భావసంభోగం ఉన్నదనే చెప్పాలి. ఎందుకంటే అక్కడే ఆయన 47 ఏళ్ల కిందట అక్షర ఫ్యాక్షనిజానికి అంకురార్పణ చేశారు. లీజు పేరిట స్థలాలు తీసుకుని న్యాయ పోరాటాలతో కాజేయటమనే టక్కు టమారానికీ ఇక్కడే శ్రీకారం చుట్టారు. ఇతరుల స్థలాలను కబ్జా చేయటానికి ఎన్ని 420 పనులైనా చేయొచ్చునని... ఎన్ని ఫోర్జరీలైనా చేయొచ్చునని ఇక్కడి నుంచే నిరూపించబోయారు. అందుకే ఆయనది విశాఖతో విడదీయలేని బంధం. కాకుంటే న్యాయం గెలుపు ఆలస్యం కావచ్చేమో గానీ... గెలవటం మాత్రం పక్కా అనేది రామోజీ సైతం నమ్మక తప్పలేదు. లీజు పోరాటం ఒక్కో న్యాయస్థానాన్నీ దాటుకుంటూ సుప్రీంకోర్టుకు కూడా చేరాక తల వంచారు. లీజు ముగిసిన ఏడేళ్ల తరవాత స్థలాన్ని అప్పగించాల్సి వచ్చింది కూడా. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే... కొద్దిరోజులుగా ఆయన విశాఖపై ప్రేమ ముసుగులో విద్వేషం కక్కుతున్నారు. ప్రభుత్వంపై విషం చిమ్మటానికి ప్రతిరోజూ విశాఖలో భూ కబ్జాలంటూ అడ్డగోలు రాతలు రాస్తున్నారు. దానికి సాక్ష్యంగా ఊరూపేరూ లేని వ్యక్తులను తెరపైకి తీసుకొచ్చి... ఉత్తరాంధ్రకు, విశాఖకు, రాష్ట్రానికి పరిరక్షణ సమితుల పేర్లతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై, నాయకులపై పక్కా స్కెచ్ ప్రకారం నానా అభాండాలూ వేస్తున్నారు. ప్రతిరోజూ చెబితే అవి ఎంత పచ్చి అబద్ధాలైనా జనాన్ని నమ్మించవచ్చనేది ‘ఈనాడు’ పుట్టిన దగ్గర్నుంచీ రామోజీరావు అనుసరిస్తున్న వ్యూహం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తరాంధ్ర బాగుపడకూడదన్న దురుద్దేశంతో... ఇపుడదే వ్యూహాన్ని విశాఖ విషయంలో అమలు చేస్తున్నారు. అసలు విశాఖలో భూ కబ్జాలు చేసిందెవరు? ఆ భూముల్ని కబ్జా దారుల నుంచి కాపాడిందెవరు? భూములకు సంబంధించి రామోజీ చేస్తున్న రచ్చలో నిజమెంత? ఒకసారి చూద్దాం... గ‘లీజు’ పనులకు రామోజీ అంకురార్పణ రామోజీరావు తన కబ్జాలు, కుట్రలు మొదలుపెట్టింది ఇక్కడేనని చెప్పాలి. ఎందుకంటే ‘ఈనాడు’ అక్షర వ్యాపారాన్ని ఆరంభించింది విశాఖ సీతమ్మ ధారలోనే!. ఇక్కడి సర్వే నెంబరు 50/4లో 2.78 ఎకరాల భూమిని రామోజీ 1974 మార్చి 30న స్థల యజమాని మంతెన ఆదిత్య వర్మ నుంచి 33 సంవత్సరాల లీజుకు తీసుకున్నారు. మొదటి 14 ఏళ్లూ నెలకు చెల్లించే అద్దె రూ.2,500. తరవాత నెలకు రూ.3వేలు. లీజు గడువు ముగిశాక భూమిని తిరిగి అప్పగించి వెళ్లిపోవాలి. కానీ వెళ్లిపోతే రామోజీ గొప్పేముంది? లీజు స్థలాన్ని కాజేయాలనే దుర్బుద్ధి 1989లోనే పుట్టింది రామోజీకి. అక్కడ రోడ్డు వెడల్పు చేయడానికి 618 గజాలను ప్రభుత్వం తీసుకుంది. ప్రతిఫలంగా సీతమ్మధారలోనే సర్వే నెంబర్ 52లో 872 గజాల స్థలాన్ని కేటాయించారు. మరి ఆ భూమి ఆదిత్య వర్మది కదా? దాన్ని రామోజీ తీసుకున్నది లీజుకు కదా? ప్రభుత్వానికిచ్చే అధికారం ఎవరిది? ప్రభుత్వం పరిహారంగా ఇచ్చే భూమిని తీసుకోవాల్సింది ఎవరు? వీటన్నిటికీ మనం చెప్పే జవాబులు తప్పని నిరూపించారు రామోజీ. ఆదిత్య వర్మకు విషయం చెప్పకుండా... ప్రభుత్వానికి భూములిచ్చి, పరిహారంగా ఇచ్చిన భూమిని తన కుమారుడి పేరిట రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నారు. అలా... విశాఖలో మోసాలు మొదలెట్టారు!!. రామోజీ మోసాన్ని ఆలస్యంగా గుర్తించారు ఆదిత్య వర్మ. 2007 సెపె్టంబరు 19న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ రామోజీరావు ‘ఈనాడు’కు చీఫ్ ఎడిటర్ మరి. పోలీసులను అంత తేలిగ్గా విచారణ చేయనిస్తారా? తన మనుషుల ద్వారా ఒత్తిడి తెచ్చారు. పోలీసులు ఊరుకున్నారు. దీంతో ఆదిత్య వర్మ న్యాయపోరాటం మొదలెట్టారు. చివరకు న్యాయమూర్తి స్పందించి... పోలీసులకు అక్షింతలు వేయటంతో విచారణ మొదలైంది. కోర్టులో మరో డ్రామా!! ఈ 420 కేసు కోర్టులో విచారణకు వచ్చాక రామోజీ మరో కుట్రకు తెరలేపారు. రోడ్డు కోసం తాను ప్రభుత్వానికి స్థలమివ్వటం, ప్రతిగా ప్రభుత్వం స్థలాన్ని తన కుమారుడి పేరిట ఇవ్వటం వంటివేవీ తనకు తెలియవంటూ... తాను స్థలం ఇవ్వకముందే అక్కడ రోడ్డు ఉందని వాదించారు. అలాంటపుడు తాను స్థలమెందుకు ఇస్తానని ఎదురు తిరిగారు. దీనికోసం ఏకంగా విశాఖ జోనల్ డెవలప్మెంట్ ప్లాన్‌నే ఫోర్జరీ చేసేశారన్నది అప్పట్లో పిటిషనర్ ఆరోపణ. ఫోర్జరీ మ్యాప్‌లను వారు కోర్టుకు కూడా సమర్పించారు. దీంతో రామోజీపై ఫోర్జరీ, కుట్ర కేసులు కూడా నమోదయ్యాయి. లీజు ముగిసినా ఖాళీ చేయకుండా.. నిజానికి లీజు గడువు 2007తో ముగిసింది. కానీ రామోజీ ఆ స్థలాన్ని ఖాళీ చేయలేదు. అప్పటిదాకా నెలకు ఇస్తున్న రూ.3వేలును రూ.10వేలు చేస్తానని, మరో 33 ఏళ్లు లీజు పొడిగించాలని కోరారు. అప్పటికే అక్కడ స్థలం విలువ దాదాపు రూ.40 కోట్లు ఉండటంతో... కుదరదన్నారు యజమాని వర్మ. కానీ రామోజీ కోర్టుకెళ్లారు. మేజి్రస్టేటు కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా 2014 వరకూ లాగారు. అద్దె కూడా పెంచలేదు. లీజు గడువు ముగిసిన 2007 నుంచీ నెలకు రూ. 3వేల చొప్పున కూడా సక్రమంగా చెల్లించలేదు. దీనిపై స్థల యజమాని రెంట్ కంట్రోల్ కోర్టుకు వెళ్లటంతో... రామోజీ స్టే తెచ్చారు. ఈ స్టేతో చాన్నాళ్లు నెట్టుకొచ్చారు. దీన్ని హైకోర్టులో వర్మ సవాలు చేయగా... రామోజీకి ఎదురుదెబ్బ తగిలింది. దిగువ కోర్టు ఇచ్చిన స్టేను కొనసాగించాలంటే.. తుది తీర్పు వెలువడేదాకా అప్పటి విలువల ప్రకారం నెలకు రూ.17 లక్షల చొప్పున ఈనాడు కార్యాలయానికి అద్దె చెల్లించాలని , అది కూడా ప్రతి నెలా 10వ తేదీలోపు చెల్లించాలని, అప్పటిదాకా బకాయిలుగా ఉన్న అద్దె రూ.2.57 కోట్లను తక్షణం ఇచ్చేయాలని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. రామోజీ సుప్రీంకు వెళ్లారు. అక్కడా చుక్కెదురు కావటంతో అద్దె చెల్లించాల్సి వచ్చింది. తరవాత చెల్లించటం ఇష్టం లేక స్థలాన్ని ఖాళీ చేశారు. అన్ని వ్యూహాలూ విఫలమవటంతో.. నాలుగేళ్ల తరవాత స్థల యజమానితో రాజీపడి కుట్ర, మోసం, ఫోర్జరీ కేసులనుంచి బయటపడ్డారు. ఇదీ... ఈ నీతుల కొండ బాగోతం. తెల్లారి లేస్తే పేపర్లో అందరికీ సుద్దులు చెప్పే ఈ అనకొండ బాగోతాల్లో ఇది కేవలం విశాఖ పార్ట్ మాత్రమే. హైదరాబాద్‌లో సాగించిన అరాచకాలు గానీ, విజయవాడలో బంధువుల్ని మోసం చేసిన తీరుగానీ, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో జరిపిన అక్రమాలు గానీ రాస్తే.. ఎన్ని పార్ట్‌లైనా సరిపోవేమో!! తెలుగుదేశం కబ్జాల అడ్డా... విశాఖ విచిత్రమేంటంటే కబ్జాలకు కేరాఫ్‌గా మారిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పనిగట్టుకుని వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తుండటం. వాటికి బాకా ఊదుతూ... అవన్నీ నిజమనేట్లుగా రామోజీరావు దరువేయటం. అందరూ కలిసి విశాఖ ప్రజలకు ఓ ఎల్లో చిత్రాన్ని చూపిస్తుండటం!!. నిజానికి అందినకాడికల్లా తెలుగుదేశం నేతలు కబ్జాలు చేస్తే... సిట్ల పేరిట కాలయాపన చేస్తూ... చర్యలకు మాత్రం దూరంగా ఉంటే... గడిచిన మూడేళ్లలో ఏకంగా 430 ఎకరాల భూమిని తిరిగి స్వాదీనం చేసుకున్నది ఈ ప్రభుత్వమేనన్న విషయం ‘ఈనాడు’ ఎప్పుడూ చెప్పదు. ఎందుకంటే ఈ కబ్జాదారుల్లో తెలుగుదేశం మాజీ ఎంపీ, చంద్రబాబు బంధువైన ఎంవీవీఎస్ మూర్తి సహా టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సోదరుడు, అయ్యన్న, బండారుల పుత్రరత్నాలు... ఇలా చాలా మందే ఉన్నారు. వీళ్లని వెనకేసుకు రావటమే తమ బాధ్యతగా భావించే చంద్రబాబు మీడియా మిత్రులెవరూ వీటి విలువ దాదాపు రూ.5వేల కోట్లకుపైనే ఉంటుందని గానీ, ఇంతటి విలువైన భూముల్ని ప్రభుత్వం కాపాడిందని గానీ చెప్పరు. ఆఖరికి దసపల్లా భూముల్లో పాగా వేసి తెలుగుదేశం పార్టీ కార్యాలయం కట్టేసుకున్న చంద్రబాబునూ మహాత్ముడిగానే చెబుతుంటుంది ‘ఈనాడు’. అదీ కథ. లేటరైట్ మాఫియా కేరాఫ్ అయ్యన్న? నోటికొచ్చినట్లు తూలటం, తూగటంలో అయ్యన్నపాత్రుడిని మించిన తెలుగుదేశం నాయకుడు లేడనే చెప్పాలి. విశాఖలో లేటరైట్ తవ్వకాలకు సంబంధించి ఆయన కుటుంబంపై వచ్చిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. ఎందుకంటే విశాఖ మన్యంలో బాక్సైట్ తరవాత అత్యంత విలువైనది లేటరైటే. నాతవరం మండలంలోని పలు గ్రామాల్లో వేల హెక్టార్లలో లేటరైట్ నిక్షేపాలున్నాయి. కాకపోతే వీటిని తవ్వే హక్కు గిరిజనులకే ఉండటంతో 2009 జులైలో సింగం భవాని అసనగిరిలో 5 హెక్టార్లకు, సుందరకోటలో 35.5 హెక్టార్లకు తవ్వకం అనుమతులు పొందారు. బమిడికలొద్దిలో 110 హెక్టార్లకు జర్తా లక్ష్మణ్‌రావు అనుమతి పొందారు. 5 హెక్టార్లు మించితే పర్యావరణ అనుమతులు తప్పనిసరి కావటం... వీటికి అనుమతులు రాకపోవటంతో వారు తవ్వకాలు చేపట్టలేకపోయారు. కానీ తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక అయ్యన్న కుటుంబీకుల కన్ను లేటరైట్ గనులపై పడింది. తొలుత అధికారాన్ని ఉపయోగించి సింగం భవానీకి చెందిన 5 హెక్టార్లను చెరబట్టారు. వేరొక ఎంపీ కుమారుడితో కలిపి తవ్వకాలు చేపట్టి ... 11 నెలల వ్యవధిలో రూ.20 కోట్లకుపైగా విలువైన ఖనిజాన్ని స్వాహా చేశారు. ఆ తరవాత 110 హెక్టార్లపై కన్నేశారు. లక్ష్మణ్‌రావును, అతని దగ్గర సబ్లీజుకు తీసుకున్న వారిని తొలుత 80 శాతం వాటా అడిగి... ఇవ్వననటంతో కేసులు పెట్టి వేధింపులకు దిగారు. సహకరించని సర్పంచ్‌ను సైతం చెక్‌పవర్ రద్దుచేసి మరీ వేధించారు. చివరకు అక్కడ తవ్వకాలు జరపకుండా కలెక్టర్ ద్వారా నిషేధం ఉత్తర్వులు కూడా జారీ చేయించారు. ఆ ప్రాంతం మొత్తానికి నిషేధం ఉత్తర్వులు వర్తించినా.. తన చేతుల్లో ఉన్న 5 హెక్టార్లను మాత్రం ఆయన గారి పుత్రరత్నం అడ్డూఅదుపూ లేకుండా తవ్వేశాడు. ‘గీత’o దాటి కబ్జాలు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి రుషికొండ ప్రాంతంలో ఏకంగా 42.51 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. బీచ్‌ను ఆనుకుని ఉండే అత్యంత విలువైన ఈ స్థలం... గీతం యూనివర్సిటీకి సమీపంలోనే ఉంది. దీన్ని ఆక్రమించుకుని రెండెకరాల్లో కళాశాల భవన నిర్మాణాలు కూడా చేపట్టారు. మిగిలిన స్థలానికి కాంపౌండ్ వాల్ కట్టేశారు. సుమారు రూ.500 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని దశాబ్దాల పాటు కబ్జా చేసినా... మనోడే కదా అని టీడీపీ సర్కారు పట్టించుకోలేదు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక ఈ కబ్జాలపై దృష్టిపెట్టింది. ప్రహరీని తొలగించి కబ్జాలో ఉన్న 40.51 ఎకరాలను స్వాదీనం చేసుకుంది. అప్పట్లో నానా యాగీ చేయబోయిన పచ్చ బ్యాచ్... ప్రభుత్వం స్థిరంగా నిలబడటంతో తోక ముడుచుకుంది. పల్లా సోదరుడి భూ ఫలహారం.. అధికారులు స్వాదీనం చేసుకున్న భూముల్లో సింహభాగం టీడీపీ నేతల కబంధ హస్తాల్లో ఉన్నవే. గయాలు, పోరంబోకు, గోర్జి, కొండ పోరంబోకు, వాగులు, కాలువలు, గెడ్డలు, రాస్తాలు, గుట్టలు, ఇనాం, జిరాయితీ, గ్రామకంఠాలు, చెరువులు.. ఇలా కాదేదీ కబ్జాకు అనర్హం అన్నట్లుగా కాజేశారు. కొద్దిరోజుల క్రితం గాజువాక నియోజకవర్గం తుంగ్లాం గ్రామ సర్వే నంబరు 33–2లో గుడితో పాటు ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమించేందుకు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సోదరుడు పల్లా శంకర్రావు ప్రయత్నించాడు. అడ్డువచ్చిన స్థానిక యువతపై దాడికి యత్నించాడు. ప్రభుత్వ జోక్యంతో వెనక్కి తగ్గాడు. బినామీ పేర్లతో.. లెక్కేలేదు ఇవన్నీ ఒకెత్తయితే టీడీపీ అధికారంలో ఉన్నపుడు ఆ పార్టీ నేతలు బినామీ పేర్లతో చేసిన కబ్జాలకు లెక్కేలేదు. దీంతో వైసీపీ ప్రభుత్వం గడిచిన మూడేళ్లుగా విశాఖ, దాని చుట్టుపక్కల మండలాల్లో ఆక్రమణలకు గురైన విలువైన ప్రభుత్వ భూములను కాపాడేందుకు చర్యలు తీసుకుంటూ వస్తోంది. ప్రభుత్వ ఆదేశాలతో ప్రత్యేక దర్యాప్తు బృందాలు క్షేత్రస్థాయి పరిశీలనతో భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నాయి. ఫలితంగా మొత్తం 270 ప్రాంతాల్లో ఆక్రమణలకు గురైన 430.81 ఎకరాల ప్రభుత్వ భూములను తిరిగి స్వాదీనం చేసుకున్నారు. ప్రభుత్వ ధరల ప్రకారం వీటి రిజిస్ట్రేషన్ విలువ రూ.2,638 కోట్లు కాగా మార్కెట్ విలువ రూ.5 వేల కోట్లకుపైనే ఉంటుందని అంచనా. ఆక్రమణలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులూ నమోదు చేస్తున్నారు. ‘బండార’o బయటపడి... పరాజయం ► పెందుర్తి మండలం గుర్రమ్మపాలెంలో గతంలో ఏపీఐఐసీ 110 ఎకరాలు సేకరించి... ఎకరాకు రూ. 23 లక్షల చొప్పున రైతులకు నష్ట పరిహారం చెల్లించింది. అక్కడే బండారు చక్రం తిప్పాడు. ప్రభుత్వానికి చెందిన 20 ఎకరాలకు బినామీలను సృష్టించి... ఆ పరిహారాన్ని తన ఖాతాలో వేసుకున్నాడని అప్పట్లోనే ఆరోపణలొచ్చాయి. అక్కడితో ఆగకుండా... భూమికి పరిహారం పొందిన ప్రతి రైతు నుంచీ ఎకరాకు రూ.5 లక్షల చొప్పున తనకు కట్టాల్సిన పరిహారంగా నిర్ణయించి మరీ లాక్కున్నాడని అప్పట్లో రైతులు బహిరంగంగానే వాపోయారు. కాకపోతే ఇలా ఎన్ని కోట్లు మింగేసినా... అధికారంలో ఉన్నది మిత్రపక్ష తెలుగుదేశం కాబట్టి రామోజీకి ఇలాంటివేవీ కనిపించలేదు. ► ఆ మధ్య దుమారం రేపిన పెందుర్తి మండలం లక్ష్మీపురం భూ వివాదంలోనూ బండారు తనయుడిదే కీలకపాత్ర. అసలు వారసులకు– నకిలీలకు తగవు పెట్టింది అస్మదీయులైతే, ఈ వివాదాన్ని సెటిల్ చేసేందుకు ఈయన భారీగా రూ.10 కోట్ల వరకూ డిమాండ్ చేశాడని, తాము ఇవ్వనందుకు కేసులతో వేధిస్తున్నారని వారసులు అప్పట్లో వాపోయారు కూడా. ► ఇక వేపగుంట, పెందుర్తి ప్రాంతంలో బీఆర్టీఎస్ రహదారిలో భవనాలు కోల్పోయిన వారికి టీడీఆర్ రూపంలో నష్టపరిహారం చెల్లించారు. ఇందులో దాదాపు 300 టీడీఆర్‌లు ఇప్పించినందుకు ఈ పుత్ర రత్నం దాదాపు 5 కోట్లు కొట్టేశారన్నది అప్పట్లో బహిరంగంగానే వినవచ్చింది ► ఇవన్నీ ఈ పుత్రరత్నం భూములకు సంబంధించిన దందాలు. ఇక ఉద్యోగాలిప్పిస్తామంటూ వసూళ్లు, వ్యక్తిగత సెటిల్మెంట్లు వంటివన్నీ లెక్కలోకి తీసుకుంటే ఎన్ని పేజీలైనా చాలవు మరి. -
రాజధాని వ్యాజ్యాలపై నవంబర్ 28న విచారిస్తాం
సాక్షి, అమరావతి: రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని ఆరు నెలల్లో అభివృద్ధి చేయాలంటూ తామిచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేసిన నేపథ్యంలో, రాజధానిపై తమ ముందున్న వ్యాజ్యాలపై నవంబర్ 28న తదుపరి విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది. ఈలోపు సుప్రీం కోర్టు తమ తీర్పుపై ఏం చెబుతుందో కూడా తెలుస్తుందని వ్యాఖ్యానించింది. సుప్రీం కోర్టులో తాము దాఖలు చేసిన ఎస్ఎల్పీలో లోపాలను రిజిస్ట్రీ తెలిపిందని, వాటిని సరిచేస్తామని, పది రోజుల్లో అది విచారణకు వచ్చే అవకాశముందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ చెప్పిన విషయాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, తదుపరి విచారణను నవంబర్ 28న చేపడతామని తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్‌ల త్రిసభ్య ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని ఆరు నెలల్లో అభివృద్ధి చేయాలంటూ ఇచ్చిన తీర్పును ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర అధికారులు ఉల్లంఘిస్తున్నారని, వీరి చర్యలను కోర్టు ధిక్కారంగా పరిగణించాలంటూ రాజధాని రైతులు దోనె సాంబశివరావు, తాటి శ్రీనివాసరావు తదితరులు పిటిషన్లు దాఖలు చేశారు. వీటితో పాటు రాజధానికి సంబంధించి మరికొన్ని వ్యాజ్యాలపై సీజే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరపు న్యాయవాదుల్లో ఒకరైన ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఎస్ఎల్పీని సాకుగా చూపుతూ హైకోర్టు తీర్పు అమలుకు గడువు పొడిగింపు కోరుతూ పోతోందని చెప్పారు. ఈ సమయంలో అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ స్పందిస్తూ.. పిటిషన్లో లిఖితపూర్వకంగా లేవనెత్తిన అంశాలపై మాత్రమే తాము సమాధానం ఇస్తామన్నారు. ఏది పడితే అది మాట్లాడితే స్పందించడం సాధ్యం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన ఎస్ఎల్పీపై ఏజీ చెప్పిన వివరాలను ధర్మాసనం పరిగణనలోకి తీసుకొని, తదుపరి విచారణను వాయిదా వేసింది. -
పాదయాత్ర అడ్డుకోవడానికి మీరెవరు?
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: అమరావతి మద్దతుదారుల పాదయాత్రను అడ్డుకోవడానికి మంత్రులు, అధికార వైసీపీ నేతలు ఎవరంటూ జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ప్రశ్నించారు. అమరావతి రాజధాని గురించి ఎవరూ మాట్లాడకూడదని.. మూడు రాజధానుల గురించి ఎవరూ నోరెత్తకూడదన్నది వైసీపీ ఆలోచన అని.. తమది పొలిటికల్ పార్టీ అని.. తమకూ ఓ వైఖరి ఉంటుందని చెప్పారు. ప్రత్యేక విమానంలో సోమవారం విశాఖపట్నం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చి, అక్కడ నుంచి మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్న అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. ‘ఏపీ మళ్లీ మూడు ముక్కలుగా విడిపోవాలా. అదా వైసీపీ కోరిక? తిప్పికొడితే 13 జిల్లాలు, వాటిని 26 ముక్కలు చేశారు. దానికి పాలనా సౌలభ్యం అన్నారు. దీనికీ అంతు ఉండాలిగా. ఎక్కడో ఒకచోట ఆగాలి. దీనిని ప్రజలు కూడా గ్రహించాలి. ఉత్తరాంధ్ర, కులం, మతం అంటూ కొట్టుకుంటూ ఉంటే అభివృద్ధి ఎక్కడ ఉంటుంది? దయచేసి ప్రజలందరూ ఆలోచించాలి. విశాఖ ఘటనలకు సంబంధించి మా పార్టీ నేతలపై కేసులు పెడుతున్నారు. వాళ్ల కాన్వాయి మీద దాడి జరగాలని వాళ్లే ప్లాన్ చేసుకుని మా పార్టీ నేతలపై కేసులు పెట్టారు. మా కేడర్‌కు మనోధైర్యం ఇచ్చా. విశాఖ ఘటనలపై హైకోర్టులో పిటిషన్ వేశాం. తెలంగాణ రాష్ట్ర సాధన నిర్వీర్యం అవుతుంది న్యాయ వ్యవస్థకు కూడా అప్పీల్ చేసుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్‌లో ఈ రోజున జరుగుతున్న దానిని సునిశితంగా గమనించండి. రాష్ట్ర న్యాయ శాఖను కూడా అభ్యర్థిస్తున్నా. అలాగే, రాష్ట్రం బాగుపడాలంటే వైసీపీ నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలి. అలా చేయకపోతే తెలంగాణ రాష్ట్ర సాధన కూడా నిర్వీర్యం అయిపోతుంది. ఇందుకు పత్రికాధిపతులు, చానల్స్ యజమానుల సహకారం కోరుతున్నా. ఇక రాష్ట్రంలో జరిగే విషయాలను బీజేపీకి చెప్పవచ్చుగా అని విశాఖలోని కొందరు జర్నలిస్టులు నన్ను ప్రశ్నించారు. కానీ, ఇక్కడ యుద్ధం మీరే చేయండి అని బీజేపీ అగ్రనాయకులు అంటారు. నేను ఢిల్లీకి వెళ్లను. ఇక్కడే తేల్చుకుంటా.. వైసీపీ అధికారంలోకి రాకుండా పోరాడుతా. కోర్టు అంశాలతో పాటు గవర్నర్‌ను కలిసే అంశాలపై చర్చిస్తా.’ అని చెప్పారు. బెజవాడకు పవన్ పయనం అంతకుముందు.. మూడు రోజుల పాటు విశాఖలో మకాం వేసి హంగామా చేసిన పవన్ తాను ఆశించిన ఫలితం దక్కకపోవడంతో విజయవాడకు తిరిగొచ్చారు. ఈనెల 16న జనవాణి కోసం 15వ తేదీ సాయంత్రం ఆయన విశాఖ వెళ్లారు. అదే రోజు మంత్రుల కార్లపై విశాఖ విమానాశ్రయంలో జనసేన రౌడీమూకలు దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పవన్ హోటల్‌కు వెళ్లిపోవడం.. ఆ మర్నాడు జనవాణి జరిగే పోర్టు స్టేడియం వద్ద ఉత్తరాంధ్ర నాన్ పొలిటికల్ జేఏసీ నేతలు, వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో జనవాణిని నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో దానిని వాయిదా వేసుకున్నారు. ఆ తర్వాత అరెస్టయిన జనసేన రౌడీమూకలను విడిచిపెట్టే వరకు విశాఖలోనే ఉంటానని పవన్ బీరాలు పలికారు. కానీ, సోమవారం మధ్యాహ్నం విజయవాడకు ప్రత్యేక విమానంలో వెళ్లిపోయారు. ఈ సందర్భంగా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. పవన్ సోము వీర్రాజు భేటీ విజయవాడ నోవాటెల్ హోటల్లో బసచేసిన పవన్‌కల్యాణ్‌తో సోమవారం రాత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు భేటీ అయ్యారు. విశాఖపట్నంలో చోటుచేసుకున్న సంఘటనలతోపాటు తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరు చర్చించుకున్నారు. అనంతరం వీరిద్దరూ మీడియాతో మాట్లాడారు. తమకు లభిస్తున్న ఆదరణను చూడలేక అధికార పార్టీ నేతలు ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. విశాఖలో జరిగిన దాడి పూర్తిగా ప్రభుత్వ కుట్రగా భావిస్తున్నామన్నారు. ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, ఈ అంశాలను కేంద్ర పెద్దలకు కూడా వివరించగా.. వైసీపీ ప్రభుత్వ దుశ్చర్యలపై పోరాడాలని సూచించారని వారు చెప్పారు. విశాఖ గర్జన రాష్ట్ర ప్రభుత్వం స్పాన్సర్డ్ ప్రోగ్రాంగా అభివర్ణించారు. జన స్పందన లేకపోవడంతో కుట్రకు తెరలేపారని, ఇక నుంచి ఇటువంటి వాటిని అడ్డుకుని తీరుతామని వారిద్దరూ స్పష్టంచేశారు. -
రియల్ ఎస్టేట్ రాజధాని వద్దే వద్దు
రాజమహేంద్రవరం రూరల్ : అమరావతి రైతు పాదయాత్రకు తూర్పుగోదావరిజిల్లా కాతేరులో నిరసన సెగ తగిలింది. సోమవారం సాయంత్రం కాతేరు వెంకటాద్రిగార్డెన్స్ నుంచి ప్రారంభమైన పాదయాత్రకు మల్లయ్యపేట గాంధీ బొమ్మ సమీపంలో స్థానికులు ప్లకార్డులు, నల్లబెలూన్లు చేబూని నిరసన వ్యక్తం చేశారు. వారికి వైఎస్సార్సీపీ శ్రేణులు తోడయ్యాయి. రియల్ ఎస్టేట్ రాజధాని వద్దే వద్దు.. మూడు రాజధానులే ముద్దు.. అంటూ నినాదాలు చేస్తూ గాల్లోకి బెలూన్లు ఎగురవేశారు. నిరసనకారులను పాదయాత్రికులు కవ్వించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అమరావతి పాదయాత్రికులు తారాజువ్వలు వదులుతూ నిరసనకారులను రెచ్చగొట్టడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాలనూ నియంత్రించారు.