
దీక్షల్లో పాల్గొన్న రాయలసీమ విద్యార్థి సంఘాల జేఏసీ, బహుజన పరిరక్షణ సమితి నేతలు
తాడికొండ: మూడు రాజధానులకు మద్దతుగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్‌లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు బుధవారం 85వ రోజుకు చేరుకున్నాయి. ముఖ్య అతిథులుగా హాజరైన రాయలసీమ విద్యార్థి సంఘం, దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ.. దళితుల అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుంటున్న చంద్రబాబుకు భవిష్యత్‌లోనూ అధికారం కల్లేనన్నారు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయనే యోచనతో రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకుంటే.. చంద్రబాబు మాత్రం బినామీల ఆస్తులను కాపాడుకునేందుకు, కుల రాజధాని నిర్మించేందుకు ఆరాట పడుతున్నారని ధ్వజమెత్తారు.
నదీ తీర ప్రాంతంలో ఉన్న అమరావతిలో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం సాధ్యపడదని, మూడు రాజధానులు నిర్మిస్తే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని శివరామకృష్ణన్ కమిటీ స్పష్టం చేసినా చంద్రబాబు పెడచెవిన పెట్టారని విమర్శించారు. రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ చైర్మన్ శ్రీరాములు, బహుజన పరిరక్షణ సమితి నాయకులు పరిశపోగు శ్రీనివాసరావు, మాదిగాని గురునాథం, పిడతల అభిషేక్, నత్తా యోనారాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment