రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్న మహిళలు, దళిత సంఘాలు
తాడికొండ: కుల వివక్షతో కూడిన ఏక రాజధాని కన్నా.. మూడు రాజధానులే మిన్న అని ఐడియల్ దళిత్ ఉమెన్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ జి.రాజసుందర బాబు అన్నారు. మూడు రాజధానులకు మద్దతుగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్‌లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షల్లో బుధవారం ఆయన మాట్లాడారు. అమరావతిలో కుల వివక్ష తాండవిస్తోందని, ఇలాంటి వివక్ష దేశంలో ఎక్కడా లేదన్నారు. పేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంటే.. వాటిని చంద్రబాబు బృందం అడ్డుకోవడం వివక్ష కాదా అని ప్రశ్నించారు.
వికేంద్రీకరణకు మద్దతుగా ఎక్కడైతే దాడి జరిగిందో అదే కృష్ణాయపాలెం గ్రామం నుంచి 50 వేల మంది బహుజన మహిళలతో ర్యాలీగా తరలివస్తామని తెలిపారు. 36 రోజులుగా కొనసాగుతున్న 3 రాజధానుల ఉద్యమానికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి మద్దతు పెరుగుతోంది. ఐడియల్ నాయకులు కందుల దీనమణి రాజీ, బేతపూడి భారతి, మట్టుపల్లి వీరమ్మ, ఐడీబీ నాయక్, నత్తా యోనారాజు, నూతక్కి జోషి, సుభాషిణి, పిడతల అభిషేక్, బూదాల సలోమి, సౌమ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment