రిలే దీక్షల్లో పాల్గొన్న బహుజన పరిరక్షణ సమితి నాయకులు
తాడికొండ: చంద్రబాబును నమ్మితే నట్టేట ముంచేస్తాడని, అమరావతి ప్రాంత రైతులు ఇప్పటికైనా సీఎం వైఎస్ జగన్ చేపట్టిన రాజధాని అభివృద్ధికి సహకరించాలని బహుజన పరిరక్షణ సమితి నాయకులు సూచించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్‌లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న 148వ రోజు రిలే నిరాహార దీక్షల్లో పలువురు ప్రసంగించారు. రూ.3 వేల కోట్లతో అమరావతి ప్రాంత అభివృద్ధికి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం హర్షణీయమన్నారు. ఇకనైనా ఈ ప్రాంత రైతులు సీఎంను కలిసి సమస్యలు చెప్పుకుని రాజధాని అభివృద్ధికి సహకరించాలని కోరారు.
రాజధానికి భూములిచ్చిన రైతులు ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కావాలో లేక చంద్రబాబు అభివృద్ధి కావాలో తేల్చుకోవాలని సూచించారు. రైతుల ముసుగులో జేఏసీ పేరిట కులవాదాన్ని బయటకు తీసుకొచ్చి చంద్రబాబు అండ్ కో విరాళాలు ఇచ్చి మరీ దొంగ దీక్షలు చేయిస్తున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కుతో జనం పంచాయతీ కార్యాలయాల్లో అడుగుపెట్టకుండా బుద్ధి చెప్పినా.. బాబు తీరు మార్చుకోకపోతే తరిమికొట్టడం ఖాయమన్నారు. సమితి నాయకులు మాదిగాని గురునాథం, నత్తా యోనారాజు, బేతపూడి సాంబయ్య, ఈపూరి ఆదాం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment