
సాక్షి, అమరావతి: రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని ఆరు నెలల్లో అభివృద్ధి చేయాలంటూ తామిచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ) దాఖలు చేసిన నేపథ్యంలో, రాజధానిపై తమ ముందున్న వ్యాజ్యాలపై నవంబర్ 28న తదుపరి విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది. ఈలోపు సుప్రీం కోర్టు తమ తీర్పుపై ఏం చెబుతుందో కూడా తెలుస్తుందని వ్యాఖ్యానించింది.
సుప్రీం కోర్టులో తాము దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీలో లోపాలను రిజిస్ట్రీ తెలిపిందని, వాటిని సరిచేస్తామని, పది రోజుల్లో అది విచారణకు వచ్చే అవకాశముందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ చెప్పిన విషయాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, తదుపరి విచారణను నవంబర్ 28న చేపడతామని తెలిపింది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు, జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్‌ల త్రిసభ్య ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని ఆరు నెలల్లో అభివృద్ధి చేయాలంటూ ఇచ్చిన తీర్పును ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర అధికారులు ఉల్లంఘిస్తున్నారని, వీరి చర్యలను కోర్టు ధిక్కారంగా పరిగణించాలంటూ రాజధాని రైతులు దోనె సాంబశివరావు, తాటి శ్రీనివాసరావు తదితరులు పిటిషన్లు దాఖలు చేశారు.
వీటితో పాటు రాజధానికి సంబంధించి మరికొన్ని వ్యాజ్యాలపై సీజే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరపు న్యాయవాదుల్లో ఒకరైన ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఎస్‌ఎల్‌పీని సాకుగా చూపుతూ హైకోర్టు తీర్పు అమలుకు గడువు పొడిగింపు కోరుతూ పోతోందని చెప్పారు.
ఈ సమయంలో అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ స్పందిస్తూ.. పిటిషన్‌లో లిఖితపూర్వకంగా లేవనెత్తిన అంశాలపై మాత్రమే తాము సమాధానం ఇస్తామన్నారు. ఏది పడితే అది మాట్లాడితే స్పందించడం సాధ్యం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీపై ఏజీ చెప్పిన వివరాలను ధర్మాసనం పరిగణనలోకి తీసుకొని, తదుపరి విచారణను వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment