Special leave petition
-
Supreme Court: బాబు బెయిల్ రద్దు పిటిషన్.. విచారణ వాయిదా
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ బెయిల్‌ను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ నేడు విచారణకు వచ్చింది. జస్టిస్ బేల ఎం. త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. కౌంటర్ దాఖలు చేసేందుకు బాబు తరపు న్యాయవాదులు సమయం కోరడంతో ఈ కేసును ధర్మాసనం ఫిబ్రవరి 12కు వాయిదా వేసింది. కంటి చికిత్స, ఇతరత్ర ఆరోగ్య సమస్యల దృష్ట్యా స్కిల్ కేసులో ఏపీ హైకోర్టు అక్టోబర్ 31వ తేదీన తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఆపై ఆ బెయిల్‌ను రెగ్యులర్ బెయిల్‌గా మారుస్తూ నవంబర్ 20వ ఆదేశాలు ఇచ్చింది. అయితే.. బెయిల్‌పై ఏపీ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బెయిల్ ఇచ్చే విషయంలో హైకోర్టు తన పరిధిని మీరిందని పేర్కొంటూ ఆ మరుసటిరోజే సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. ఏపీ ప్రభుత్వం స్కిల్ కేసులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లో నారా చంద్రబాబు నాయుడిని ప్రతివాదిగా చేర్చింది. ఈ ఎస్ఎల్పీ తేలేంత వరకు హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరింది. హైకోర్టు స్కిల్ కుంభకోణంలో సీఐడీ చేసిన ఆరోపణల పూర్వాపరాల్లోకి వెళ్లి చంద్రబాబుకు క్లీన్‌చీట్ ఇచ్చిందని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఎస్ఎల్పీలో ఏముందంటే.. బెయిల్ మంజూరు సందర్భంగా హైకోర్టు తేల్చిన పలు అంశాలు వాస్తవ విరుద్దం. ట్రయల్ సందర్భంగా కింది కోర్టును ప్రభావితం చేసేలా హైకోర్టు తీర్పు ఉంది. బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు ఏకంగా 39 పేజీల తీర్పు వెలువరించింది. బెయిల్ మంజూరు సందర్భంగా హైకోర్టు మినీ ట్రయల్ నిర్వహించింది. రికార్డుల్లో ఉన్న అంశాలకు విరుద్దంగా హైకోర్టు తన నిర్ణయాన్ని వెలువరించింది. ఈ కేసులో హైకోర్టు తన పరిధిని అతిక్రమించింది బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా కేసు లోతుల్లోకి వెళ్లకూడదన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్దంగా హైకోర్టు వ్యవహరించింది హైకోర్టు చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ను డిశ్చార్జ్ పిటిషన్‌ను విచారించినట్లు విచారించింది స్కిల్ కుంభకోణం కేసు లోతుల్లోకి వెళ్లి మరీ చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసింది ఇదీ చదవండి: చంద్రబాబు రిమాండ్ సబబే.. తేల్చేసిన సుప్రీం కోర్టు స్పష్టంగా నగదు జాడలు ‘ప్రాజెక్టు విలువ రూ.36 కోట్లు అని చంద్రబాబు తదితరులు చెబుతున్నారు. అలా అయితే గత ప్రభుత్వం రూ.370 కోట్లు ఎందుకు విడుదల చేసినట్లు? మిగిలిన రూ.280 కోట్లు దారి మళ్లినట్లే. ఎంవోయూ, జీవో ప్రకారం అందచేయాల్సిన సాంకేతికతను సీమెన్స్, డిజైన్ టెక్‌లు అందించలేదన్నది వాస్తవం. అయితే సీఐడీ ఈ అంశాన్ని లేవనెత్తలేదని హైకోర్టు తన తీర్పులో చెప్పింది. వాస్తవానికి రిమాండ్లోనూ, హైకోర్టు వాదనల్లోనూ ఈ అంశాన్ని లేవనెత్తాం. ఫోరెన్సిక్ ఆడిట్‌ను ప్రతికూల కోణంలో చూడటం ద్వారా హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరించినట్లయింది. ►స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు మొత్తం విజయమైందని, దీని ద్వారా 2.13 లక్షల మంది విద్యార్థులు శిక్షణ పొందినట్లు తేల్చింది. ఇలా చెప్పడం ద్వారా హైకోర్టు తప్పు చేసింది. హైకోర్టు చెప్పింది ఎంత మాత్రం వాస్తవం కాదు. అధికారులు లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చే అధికారం చంద్రబాబుకు ఉందని హైకోర్టు తేల్చింది. ఒకవేళ అలాంటిది ఉందని అనుకున్నా, చంద్రబాబు తన, షెల్ కంపెనీల స్వీయ లబ్ధి కోసం దురుద్దేశపూర్వకంగా ఆ అధికారాన్ని ఉపయోగించారు. ఈ విషయాన్ని హైకోర్టు తన తీర్పులో పూర్తిగా విస్మరించింది. ►ఈ కుంభకోణానికి సంబంధించి సీమెన్స్, డిజైన్‌టెక్ ఉద్యోగులు ఇచ్చిన వాంగ్మూలాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఈ ప్రాజెక్టులో రాజకీయ జోక్యం ఉందని, ప్రాజెక్టు అమలుకు అడ్డువచ్చిన వారిని 24 గంటల్లో బదిలీ చేశారన్న వాంగ్మూలాలను పట్టించుకోలేద’ని సుప్రీంకోర్టు నిర్ధేశించిన పరిధుల అతిక్రమణ ‘ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే హైకోర్టు తీర్పు చెల్లుబాటు కాదు. దానిని రద్దు చేయాలి. బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఎలా వ్యవహరించాలన్న దానిపై ఇప్పటికే స్పష్టంగా తేల్చిన న్యాయపరమైన కొలమాలన్నింటినీ హైకోర్టు తన తీర్పు ద్వారా అతిక్రమించింది. బెయిల్ పిటిషన్ల విచారణ సందర్భంగా సాక్ష్యాలను పూర్తి స్థాయిలో పరిశీలించడం, కేసు లోతుల్లోకి వెళ్లడాన్ని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో తీవ్రంగా తప్పుపట్టింది. మినీ ట్రయల్ కూడా నిర్వహించకూడదని చెప్పింది, అయితే హైకోర్టు ఏకంగా ట్రయల్ నిర్వహించింది. ►బెయిల్ మంజూరు సందర్భంగా సీఐడీ ఆరోపణలను, వారి తీవ్రతను, డాక్యుమెంట్ల విశ్వసనీయతను, సాక్ష్యాల విలువను హైకోర్టు తన తీర్పులో తేల్చేసింది. హైకోర్టు బెయిల్ మంజూరు సమయంలో అనుసరించాల్సిన ప్రాథమిక కొలమానాలన్నింటికి విరుద్దంగా వ్యవహరించింది. చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ నమోదు చేసిన కేసు ప్రభావితం అయ్యేలా హైకోర్టు వ్యవహరించింది. దుర్వినియోగం చేసిన నిధులు తెలుగుదేశం పార్టీ ఖాతాలకు మళ్లించారని తేల్చేందుకు నిర్ధిష్ట ఆధారాలు లేవని హైకోర్టు తేల్చింది. బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఈ అంశాల జోలికి వెళ్లరాదు. ►హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న బెయిల్ పిటిషన్‌ను అడ్డంపెట్టుకుని తెలుగుదేశం పార్టీ వర్గాలు సీఐడీ దర్యాప్తునకు అడ్డుగోడలా నిలబడ్డాయి. సీఐడీ సమన్లకు ఏ మాత్రం సహకరించలేదు. సీఐడీ సమన్లకు టీడీపీ వర్గాలు స్పందించలేదన్న వాస్తవాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. మనీ లాండరింగ్ అంశంపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. నిధులు ఎక్కడకు వెళ్లాయన్న దానిపై నిర్ధిష్ట ఆధారాలున్నాయి. వాటిని హైకోర్టు ముందు ఉంచడం జరిగింది. అన్నీ అంశాలపై ఏపీ సీఐడీ, ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో నిధుల మళ్లింపు జరగలేదని తేల్చడం ద్వారా హైకోర్టు ఘోర తప్పిదానికి పాల్పడింది. క్వశ్చన్ ఆఫ్ లా.. హైకోర్టు తీర్పులో పలు అంశాలపై అనుమానాలున్నాయని రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్లో పేర్కొంది. ‘క్వశ్చన్ ఆఫ్ లా’కి సంబంధించి పలు ప్రశ్నలను సుప్రీంకోర్టు ఎదుట ఉంచింది. హైకోర్టు కసరత్తులో న్యాయపరమైన విధానం లోపించిందా? దర్యాప్తులో సేకరించిన సాక్ష్యాధారాలు, నిందితుడి నేరానికి సంబంధించిన అంశాలపై హైకోర్టు వ్యాఖ్యలు న్యాయపరమైన అంశాలకు విరుద్ధంగా ఉన్నాయా? బెయిల్‌పై పిటిషనర్ల వాదనలు లేనప్పుడు హైకోర్టు విస్తృతమైన తీర్పు ఇవ్వగలదా? పీసీ చట్టం 1988 ప్రకారం అధికారిక నిర్ణయాల విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని నిర్దోషిగా భావించొచ్చా? అధికారం, అధికార వినియోగం, అధికారిక పరిధి లేకపోవడం, అధికార సామర్థ్యాన్ని దుర్వినియోగం చేయడం, ఇతరులకు సొమ్ము రూపంలో లబ్ధి చేకూర్చడం తదితరాలపై హైకోర్టు నిర్ణయం సరైనదేనా?’ అనే ప్రశ్నలను సుప్రీంకోర్టు ముందుంచింది. నిరంజన్‌సింగ్ వర్సెస్ ప్రభాకర్ రాజారామ్, సుమిత్ శుభాచంద్ర గంగ్వాల్ వర్సెస్ మహారాష్ట్ర కేసుల్లో తీర్పులతోపాటు స్కిల్ స్కామ్ కేసులో సాక్ష్యాధారాలను వివరించే అంశాన్ని హైకోర్టు పదేపదే తిరస్కరించిందని పేర్కొంది. సంగీతబెన్ వర్సెస్ గుజరాత్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రస్తావిస్తూ ప్రస్తుత కేసులో హైకోర్టు ఆయా అంశాలను పరిశీలించకుండా బెయిల్ కేసును మినీ ట్రయల్‌గా మార్చిందని, ట్రయల్ కోర్టు పనితీరును విస్మరించిందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ ఒక్క కేసు పరిశీలనతోనే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టవచ్చని నివేదించింది. క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం! సీమెన్స్, డిజైన్‌టెక్ నుంచి రావాల్సిన 90 శాతం నిధులు రాలేదని, అందువల్ల ప్రభుత్వం చెల్లించాల్సిన 10 శాతం నిధులను చెల్లించడం సరికాదన్న అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి అభ్యంతరాలను చంద్రబాబు పట్టించుకోని విషయాన్ని హైకోర్టు పూర్తిగా విస్మరించింది. అవినీతి నిరోధక చట్టం మౌలిక సూత్రాల నుంచి, పబ్లిక్ సర్వెంట్ అధికారం దుర్వినియోగం వంటి వాటి నుంచి హైకోర్టు దూరంగా వెళ్లింది. చంద్రబాబు సాక్షులను ప్రభావితం చేసే విషయంపై హైకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఎంత మాత్రం హేతుబద్దమైనవి కావు. తన పీఏ పెండ్యాల శ్రీనివాస్ విదేశాలకు పారిపోవడం, కీలక నిందితులు సీఐడీ ముందుకు రాకపోవడం వంటి వాటి విషయంలో చంద్రబాబు పాత్ర ఉన్న విషయాన్ని హైకోర్టు పట్టించుకోలేదు. చంద్రబాబు రాజకీయంగా చాలా పలుకుబడి కలిగిన వ్యక్తి. దర్యాప్తును ప్రభావితం చేయడం, సాక్షులను భయభ్రాంతులకు గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దర్యాప్తుకు విఘాతం కలిగేలా కొందరు నిందితులు మీడియా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వర్గాలు దర్యాప్తునకు సహకరించడం లేదు. చంద్రబాబుకు బెయిల్ కోసం కాకుండా క్లీన్ చిట్ ఇచ్చే అంశంగా పరిగణించి ఆదేశాలు ఇచ్చినట్లు ఉంది. వీటన్నింటిరీత్యా చంద్రబాబు జుడీషియల్ రిమాండ్‌లో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
ఎందుకంత ఆందోళన? బాబు లాయర్లతో సుప్రీం బెంచ్
సాక్షి, ఢిల్లీ: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో సర్వోన్నత న్యాయస్థానంలో మాజీ సీఎం చంద్రబాబుకు ఊరట దక్కలేదు. బాబు పిటిషన్ ఆధారంగా ఇప్పటికిప్పుడు ఈ అంశాన్ని తేల్చలేమంటూ.. విచారణను వాయిదా వేసింది సుప్రీం. అయితే.. చంద్రబాబు పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. వాడీవేడి వాదనలు జరిగాయి. పీసీ యాక్ట్ 17 ఏ చంద్రబాబు కేసులో వర్తిస్తుందా? లేదా? అనే అంశం ప్రధానంగా వాదనలు జరిగాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో తనపై ఏపీ సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని ఏపీ హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబుకి ఎదురుదెబ్బ తగిలింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు.. సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. ఎట్టకేలకు ఈ పిటిషన్‌పై మంగళవారం జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేదిల ధర్మాసనం వాదనలు వింది. చంద్రబాబు తరపున సీనియర్ లాయర్లు సిద్ధార్థ్ లూథ్రా, హరీష్‌సాల్వే, అభిషేక మనుసింఘ్వీ వాదనలు వినిపించారు. ఈ తరుణంలో.. ఈ పిటిషన్‌పై ఎంత మంది సీనియర్లు వాదిస్తారంటూ బెంచ్ పశ్నించగా.. నలుగురం అంటూ తేలికపాటి స్వరంతో సాల్వే బదులిచ్చారు. అయినా మేం ముకుల్ రోహత్గీకి(ఏపీ ప్రభుత్వ తరుపున లాయర్) సరిపోమని సాల్వే తెలిపారు. అయితే ఇవాళ మాత్రం వాదనలు ముగ్గురే వినిపించారు. తొలుత.. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఎఫ్ఐఆర్లో నమోదు అయిన అంశాలపైనే హరీష్ సాల్వే వాదనలు(వర్చువల్)గా వినిపించారు. ‘‘చంద్రబాబు కేసు పూర్తి రాజకీయపరమైంది. గవర్నర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేశారు. హైకోర్టు 17ఏ వర్తించదని చెప్పడం సరికాదు. ఈ క్రమంలో.. సెక్షన్ 17 ఏ పై హైకోర్టు న్యాయమూర్తి అభిప్రాయంపై అభ్యంతరం వ్యక్తం చేశారు హరీష్ సాల్వే. ఈ సెక్షన్ ఎంక్వైరీ తేదీ గురించి చెబుతుంది తప్ప.. నేరం జరిగిన తేదీ గురించి కాదు. సెక్షన్ 17 ఏ ప్రకారం చంద్రబాబుకు రక్షణ ఉంటుంది అని సాల్వే వాదనలు వినిపించారు. ఇక.. ఇది కేవలం కక్ష సాధింపు చర్యే. 73 ఏళ్ల మాజీ ముఖ్యమంత్రిని వేధిస్తున్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నారు కాబట్టి పరిస్థితిని అర్థం చేసుకోవాలి. పోలీస్ కస్టడీ అడుగుతున్నందునా.. ముందే విచారణ చేపట్టాలని చంద్రబాబు తరపు మరో న్యాయవాది లూథ్రా బెంచ్‌కు తెలిపారు. మరో న్యాయవాది మను సింఘ్వీ.. యశ్వంత్ సిన్హా కేసు తీర్పును ఉదాహరించారు. ఇది కేవలం మంత్రిమండలిలో తీసుకున్న నిర్ణయమని మాత్రమే అభియోగాలున్నాయని తెలిపారు. అయితే.. ఇప్పుడే కేసు మెరిట్‌లోకి వెళ్లదల్చుకోలేదని బెంచ్ తెలిపింది. ఏకంగా క్వాష్ అడుగుతున్నారు ఇక ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. 17ఏతో ఈకేసుకు ఎలాంటి సంబంధం లేదు. జులై 2018లో 17-A వచ్చింది. అంతకంటే ముందే ఈ కేసు విచారణ ప్రారంభమైంది ఇందులో రాజకీయ కక్ష లేదు. ఈ కేసులో దర్యాప్తు 2017 కంటే ముందే మొదలయింది. అప్పుడే దీన్ని CBI పరిశీలించింది. ఇక రాజకీయ కక్ష అని ఎలా అంటారు? తప్పు చేసింది 2015-16లో. దర్యాప్తు మొదలయింది ఈ ప్రభుత్వం రాకముందే. ఇప్పుడు దాన్ని కక్ష అని ఎలా అంటారు? చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే ఈ కేసు విచారణ ప్రారంభమైంది. జీఎస్టీ విభాగం అప్పట్లోనే దర్యాప్తు చేపట్టింది. ఒకసారి ఈ డాక్యుమెంట్లు చూడండి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు APSDCని ప్రారంభించారు. కేవలం 10% ప్రభుత్వం ఇస్తే చాలన్నారు. 90% మరో సంస్థ గిఫ్ట్‌గా ఇస్తుందన్నారు. ఆ వెంటనే 10% నిధులు ప్రభుత్వ ఖజానా నుంచి విడుదలయ్యాయి. అరెస్టయిన మూడు రోజుల్లోనే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. బెయిల్ కోసం ప్రయత్నించకుండా ఇప్పుడు క్వాష్ అడుగుతున్నారు. అందుకే చంద్రబాబు పిటిషన్ ను తిరస్కరించాలి అని ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ధర్మాసనం వ్యాఖ్యలు చంద్రబాబు లాయర్లకు పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. బెంచ్ పలు ప్రశ్నలు సంధించింది. విచారణ మాత్రమే జరుగుతోందని మీకెందుకు అంత ఆందోళన? అని ప్రశ్నించింది. 2015-16లో నేరం జరిగింది కదా ? . ఆ లెక్కన 2018లో అవినీతి నిరోధక చట్టంలో 17-a రాకముందే నేరం జరిగింది కదా?. మరోవైపు.. ఐపీసీ కింద నమోదైన నేరాల పరిస్థితి ఏమిటి ?. పీసీ యాక్ట్ తో పాటు ఐపీసీ కింద కూడా నేరాలు నమోదయ్యాయి కదా అని ప్రశ్నించింది. ఈ దశలో రూలింగ్ ఇవ్వలేమని.. తర్వాతి విచారణలో వాదనలు వింటామని స్పష్టం చేసింది. సుదీర్ఘ వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం.. రెండు వైపులా అఫిడవిట్ ఇవ్వాలని, హైకోర్టులో క్వాష్ పిటిషన్ సందర్భంగా ఇచ్చిన అన్ని పత్రాలను సమర్పించాలని ఆదేశిస్తూ.. చంద్రబాబు పిటిషన్‌పై విచారణను వచ్చే సోమవారానికి(9వ తేదీకి) వాయిదా వేసింది. -
ఎన్జీటీ ఆదేశాలపై సుప్రీంకు
సాక్షి, హైదరాబాద్: పర్యావరణ అనుమతులు లేకుండా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల నిర్మాణాన్ని చేపట్టినందుకు రూ. 920.85 కోట్ల భారీ జరిమానాను విధిస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వారం రోజుల్లో సుప్రీం కోర్టు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనున్నట్టు రాష్ట్ర నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు సంబంధించి వేర్వేరు పిటిషన్లు వేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఆ రెండు ఎత్తిపోతల పథకాల తొలి దశ పనులను కేవలం తాగునీటి అవసరాల కోసమే చేపట్టినందున పర్యావరణ అనుమతుల నుంచి మినహాయింపు ఉందని తెలంగాణ వాదిస్తోంది. పర్యావరణ అనుమతులు వచ్చిన తర్వాతే రెండో దశ కింద సాగునీటి అవసరాలకు సంబంధించిన పనులు చేపడతామని పేర్కొంటోంది. ఈ విషయంలో తెలంగాణ వాదనలను పరిగణనలోకి తీసుకోకుండా ఎన్జీటీ ఏకపక్ష నిర్ణయం తీసుకుందంటూ సుప్రీం కోర్టులో వాదనలు వినిపించాలని నిర్ణయించింది. ఎన్జీటీ తీర్పు విషయంలో అవలంబించాల్సిన భవిష్యత్తు కార్యాచరణపై నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ ఇటీవల న్యాయనిపుణులతో సమావేశమై చర్చించారు. ఎన్జీటీ తీర్పును సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాత వచ్చే వారం సుప్రీం కోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.528 కోట్లు, డిండి ప్రాజెక్టుకు రూ. 92.85 కోట్లను పర్యావరణ పరిహారంగా చెల్లించడంతో పాటు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై విధించిన స్టేను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించి పనులు కొనసాగించినందుకు మరో రూ.300 కోట్ల జరిమానాను విధిస్తూ ఎన్జీటీ గత నెలలో ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వంతో పాటు ఆ రాష్ట్రంలోని మరో 9 మంది ప్రైవేటు వ్యక్తులు వేసిన కేసు విషయంలో ఈ నిర్ణయం తీసుకుంది. -
రాజధాని వ్యాజ్యాలపై నవంబర్ 28న విచారిస్తాం
సాక్షి, అమరావతి: రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని ఆరు నెలల్లో అభివృద్ధి చేయాలంటూ తామిచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేసిన నేపథ్యంలో, రాజధానిపై తమ ముందున్న వ్యాజ్యాలపై నవంబర్ 28న తదుపరి విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది. ఈలోపు సుప్రీం కోర్టు తమ తీర్పుపై ఏం చెబుతుందో కూడా తెలుస్తుందని వ్యాఖ్యానించింది. సుప్రీం కోర్టులో తాము దాఖలు చేసిన ఎస్ఎల్పీలో లోపాలను రిజిస్ట్రీ తెలిపిందని, వాటిని సరిచేస్తామని, పది రోజుల్లో అది విచారణకు వచ్చే అవకాశముందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ చెప్పిన విషయాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, తదుపరి విచారణను నవంబర్ 28న చేపడతామని తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్‌ల త్రిసభ్య ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని ఆరు నెలల్లో అభివృద్ధి చేయాలంటూ ఇచ్చిన తీర్పును ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర అధికారులు ఉల్లంఘిస్తున్నారని, వీరి చర్యలను కోర్టు ధిక్కారంగా పరిగణించాలంటూ రాజధాని రైతులు దోనె సాంబశివరావు, తాటి శ్రీనివాసరావు తదితరులు పిటిషన్లు దాఖలు చేశారు. వీటితో పాటు రాజధానికి సంబంధించి మరికొన్ని వ్యాజ్యాలపై సీజే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరపు న్యాయవాదుల్లో ఒకరైన ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఎస్ఎల్పీని సాకుగా చూపుతూ హైకోర్టు తీర్పు అమలుకు గడువు పొడిగింపు కోరుతూ పోతోందని చెప్పారు. ఈ సమయంలో అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ స్పందిస్తూ.. పిటిషన్లో లిఖితపూర్వకంగా లేవనెత్తిన అంశాలపై మాత్రమే తాము సమాధానం ఇస్తామన్నారు. ఏది పడితే అది మాట్లాడితే స్పందించడం సాధ్యం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన ఎస్ఎల్పీపై ఏజీ చెప్పిన వివరాలను ధర్మాసనం పరిగణనలోకి తీసుకొని, తదుపరి విచారణను వాయిదా వేసింది. -
హైకోర్టు తీర్పుపై సుప్రీంకు
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ ఇచ్చిన షెడ్యూల్‌ను సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పు అమలును నిలిపేయాలని కోరుతూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గురువారం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి స్థాయిలో కొనసాగుతున్న సమయంలో ఎన్నికలు నిర్వహించడం ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టడమే అవుతుందని ప్రభుత్వం పిటిషన్లో పేర్కొంది. వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు నిర్వహించవచ్చన్న నిర్ణయం తీసుకోవడానికి ఎన్నికల కమిషనర్ ఏమీ వైద్య నిపుణుడు కారని, ఆయన ఏ వైద్య నిపుణుడినీ సంప్రదించ లేదని తెలిపింది. వ్యాక్సినేషన్ ఎంత ముఖ్యమో తెలియచేస్తూ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఎన్నికలు చేపట్టడం సరికాదంటూ తాము లేవనెత్తిన అభ్యంతరాలను ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా తిరస్కరించిందని వివరించింది. చిత్తశుద్ధితో ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ఎన్నికల కమిషన్ బేఖాతరు చేసిందని తెలిపింది. ఈ ఒక్క కారణంతో హైకోర్టు తీర్పును రద్దు చేయవచ్చని చెప్పింది. ప్రభుత్వం తన పిటిషన్లో ఇంకా ఏం చెప్పిందంటే.. ఇప్పుడు ఎన్నికలంటే ప్రజల ప్రాణాలకు ముప్పే ► పోలీసు యంత్రాంగం మొత్తానికి ఫిబ్రవరి మొదటి వారంలో వ్యాక్సిన్ ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం. ఇదే సమయంలో ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. పోలీసులందరూ వ్యాక్సిన్ తీసుకోవడం, వ్యాక్సిన్ రవాణా, భద్రతకు చర్యలు తీసుకోవడం, ఎన్నికల విధుల్లో పాల్గొనడం వంటివి ఏక కాలంలో చేయాల్సి ఉంటుంది. ఇది ఆచరణ సాధ్యం కాని పని. ► ఈ ఏడాది మార్చిలో ఎన్నికల కమిషనర్ పదవీ విరమణ చేస్తున్నారు. తన హయాంలోనే ఎన్నికలు నిర్వహించాలన్న ఏకైక ఉద్దేశంతో ప్రజల ప్రాణాలను పణంగా పెడుతూ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. ఇప్పుడు ఎన్నికలు పెడితే, వ్యాక్సినేషన్ తీసుకోకుండా ప్రజలు ఎన్నికల్లో పాల్గొనే పరిస్థితి వస్తుంది. ఇది వారి ప్రాణాలకు ముప్పుగా మారుతుంది. ఈ వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకోవడంలో హైకోర్టు విఫలమైంది. పోలీసులు భద్రత కల్పించ లేరు ► ఎన్నికల కమిషన్ గతంలో ఇచ్చిన షెడ్యూల్‌ను కోవిడ్ కారణంగా చూపి వాయిదా వేసిన విషయాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకోవాల్సింది. వ్యాక్సినేషన్ సమయంలో పోలీసులు ఎన్నికలకు భద్రత కల్పించడం అసాధ్యం. వ్యాక్సిన్ రవాణా, స్టాక్ పాయింట్ల వద్ద భద్రత వంటివి పోలీసులే చూసుకోవాలి. వ్యాక్సిన్ బ్లాక్ మార్కెట్లోకి రాకుండా అడ్డుకోవడం, వ్యాక్సిన్ దారి మళ్లకుండా చూడటం, నకిలీలు చెలామణిలోకి రాకుండా చూడటం వంటివి కూడా పోలీసులే చేయాలి. ఫిబ్రవరిలో పోలీసులందరూ వ్యాక్సిన్ తీసుకుంటారు. అలాంటి సమయంలో వారు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అవకాశం ఉండదు. ఈ విషయాలన్నింటినీ హైకోర్టు పరిగణనలోకి తీసుకుని ఉండాల్సింది. ప్రభుత్వ అభ్యంతరాలు పట్టించుకోలేదు ► రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండానే ఎన్నికల నిర్వహణకు నిర్ణయం తీసుకోవచ్చా? ప్రభుత్వ అభ్యంతరాలను బేఖాతారు చేసి ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయడం సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధం కాదా? ఎన్నికల కమిషనర్ పూర్తిగా దురుద్దేశాలతో వ్యవహరించారు. ► కేటగిరి 1, కేటగిరి 2 కిందకు వచ్చే వారికి అవసరమైన 9.8 లక్షల వ్యాక్సిన్లను ఇప్పటికే అందుకున్నాం. కేటగిరి 1 కిందకు వచ్చే ఆరోగ్య కార్యకర్తలకు జనవరి చివరి కల్లా వ్యాక్సినేషన్ పూర్తవుతుంది. కేటగిరి 2లోకి వచ్చే పోలీసులు, పురపాలక, రెవిన్యూ ఉద్యోగులకు ఫిబ్రవరి మొదటి వారంలో వ్యాక్సినేషన్ మొదలవుతుంది. ఆ తరువాత 50 ఏళ్లు పైబడిన, 50 ఏళ్ల లోపు బీపీ, సుగర్ వ్యాధిగ్రస్తులకు వ్యాక్సిన్ ఇస్తారు. ► వీటిని పరిగణనలోకి తీసుకోవడంలో ఎన్నికల కమిషన్ దారుణంగా విఫలమైంది. ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలను ఎన్నికల కమిషన్ పరిగణనలోకి తీసుకుందని హైకోర్టు చెప్పడం సరికాదు. ముందస్తుగా తీసుకున్న నిర్ణయం ఆధారంగానే ఎన్నికల కమిషన్ సంప్రదింపులు జరిపిందే తప్ప, చిత్తశుద్ధితో వ్యవహరించలేదు. ఎన్నికల కమిషనర్ తన లేఖల్లో ఉపయోగించిన భాష ఏ మాత్రం సరిగా లేదని చెప్పిన హైకోర్టు, మరో వైపు ఆయనకు దురుద్దేశాల్లేవని చెప్పడం సబబు కాదు. పురపాలక సంఘాల ఎన్నికల విషయాన్ని పక్కన పెట్టేసి, పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఇది దురుద్దేశంతో తీసుకున్న నిర్ణయం. ఈ విషయాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ప్రాణాలు పణంగా పెట్టలేం.. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్ని వాయిదా వేయాలని కోరుతూ సుప్రీంను ఆశ్రయించనున్నాం. కరోనా నేపథ్యంలో ఉద్యోగుల ప్రాణాలను పణంగా పెట్టలేం, అవసరమైతే ఎన్నికల్ని బహిష్కరిస్తాం. హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికలు, కేరళ స్థానిక ఎన్నికల తర్వాత వేలాదిమంది ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. ఏపీలో ఎన్నికలు జరిపితే ఏడు లక్షలమందికిపైగా ఉద్యోగులు విధుల్లో పాల్గొనాల్సి ఉంటుంది. వారందరి పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. – ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు అవసరమైతే ఎన్నికలు బహిష్కరిస్తాం సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్ని వాయిదా వేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు పలు ఉద్యోగసంఘాల నాయకులు గురువారం మీడియాతో చెప్పారు. ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఉద్యోగుల తరఫున ఈ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కరోనా నేపథ్యంలో ఉద్యోగుల ప్రాణాలను పణంగా పెట్టలేమని, అవసరమైతే ఎన్నికల్ని బహిష్కరిస్తామని పేర్కొన్నారు. ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్, ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ 22 కేసులున్నప్పుడు ఎన్నికలు వాయిదా వేసి, రోజుకు 200 కేసులు వస్తున్నప్పుడు ఎన్నికలు పెట్టడం సరికాదని చెప్పారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికలు, కేరళ స్థానిక ఎన్నికల తర్వాత వేలాది మంది ఉద్యోగులు కరోనా బారిన పడ్డారని తెలిపారు. కరోనా సమయంలో 7,200 మంది ఉద్యోగులు చనిపోయారని చెప్పారు. ఎన్నికలు జరిపితే 7 లక్షలమందికిపైగా ఉద్యోగులు విధుల్లో పాల్గొనాల్సి ఉంటుందని, వారి పరిస్థితి ఆందోళనకరంగా మారుతుందన్నారు. ఏపీ ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి వ్యాక్సినేషన్ పూర్తయ్యేవరకు వాయిదా వేయాలి స్థానిక ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు మేము ఆశించిన విధంగా లేదు. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. వ్యాక్సినేషన్ పూర్తయ్యే వరకు ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతున్నాం. ఈ ప్రక్రియ రెండునెలల్లో పూర్తవుతుంది. – కె.వెంకట్రామిరెడ్డి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ మా ప్రాణాలు పణంగా పెట్టి ఎన్నికలు పెడతారా? ఎన్నికల కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. మా ప్రాణాలు పణంగా పెట్టి ఎన్నికలు నిర్వహించడం అవసరమా? ఎస్ఈసీ నిమ్మగడ్డ ఉద్యోగులపైన ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నారో చెప్పాలి. ఇది సరైన పద్ధతి కాదు. అవసరమైతే విచక్షణాధికారాలను ఉపయోగించాలని గవర్నర్‌ను కోరాం. – బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ చైర్మన్ ఎన్నికలకు సిద్ధంగా లేం స్థానిక ఎన్నికలకు సిద్ధంగా లేమని ఇప్పటికే స్పష్టం చేశాం. ఎన్నికల్లో ఉపాధ్యాయులు చాలా కీలకం. ప్రతి ఉపాధ్యాయుడు వెయ్యిమందిని కలిసి వారి మధ్యలో పనిచేయాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు కరోనా వ్యాప్తి చాలా సులువుగా జరుగుతుంది. ఇప్పటికే చాలామంది టీచర్లు చనిపోయారు. మళ్లీ మా ప్రాణాల మీదకు తేవడం సరికాదు. ఈ విషయాలు సుప్రీంకోర్టుకు తెలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్లో ఇంప్లీడ్ అవుతాం. – గిరిప్రసాద్, శ్రీధర్, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వాయిదా వేయాలి ఉపాధ్యాయుల శ్రేయస్సు దృష్ట్యా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యేవరకు స్థానిక ఎన్నికలు వాయిదా వేయాలి. ఉపాధ్యాయుల అభిప్రాయాలు తెలిపేందుకు మేం కూడా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. – జాలిరెడ్డి, వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ చైర్మన్ -
హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వొచ్చు
న్యూఢిల్లీ: రాజస్తాన్‌లో 19 మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలకు కొంత ఊరట లభించింది. వారిపై అనర్హత వేటు వేసే ప్రక్రియను ప్రారంభిస్తూ అసెంబ్లీ స్పీకర్ జారీ చేసిన నోటీసును వ్యతిరేకిస్తూ వారంతా హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో అనర్హత చర్యల విషయంలో జూలై 24 వరకు స్పీకర్‌ను నిరోధిస్తూ రాజస్తాన్ హైకోర్టు ఉత్తర్వు జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ స్పీకర్ సి.పి.జోషి సుప్రీంకోర్టులో బుధవారం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ బి.ఆర్.గవై, జస్టిస్ కృష్ణ మురారీతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. 19 మంది ఎమ్మెల్యేల వినతిపై తదుపరి ఉత్తర్వు ఇవ్వడానికి రాజస్తాన్ హైకోర్టుకు అనుమతి మంజూరు చేసింది. అయితే, ఈ ఉత్తర్వు స్పీకర్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలకు లోబడి ఉండాలని స్పష్టం చేసింది. ఉత్తర్వు ఇవ్వకుండా హైకోర్టును తాము అడ్డుకోలేమని వెల్లడించింది. అంతేకాకుండా అనర్హత వేటు విషయంలో తనను నిరోధిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుపై మధ్యంతర స్టే ఇవ్వాలన్న స్పీకర్ వినతిని ధర్మాసనం తోసిపుచ్చింది. అసమ్మతి గొంతు నొక్కేయలేం రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం చట్ట సభల సభ్యులపై అనర్హత వేటు వేసే విషయంలో స్పీకర్ అధికారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవడం తగదని స్పీకర్ సి.పి.జోషి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందిస్తూ.. స్పీకర్ ముఖ్యమైన ప్రశ్నలను లెవనెత్తారని, దీనిపై మరింత విచారణ జరగాల్సి ఉందని తేల్చిచెప్పింది. స్పీకర్ తరపు న్యాయవాది కపిల్ సిబల్ మాట్లాడుతూ.. తిరుగుబాటు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని, వారు సొంత ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించారని చెప్పారు. దీనిపై ధర్మాసనం బదులిస్తూ.. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడానికి అనుమతి ఇవ్వొచ్చా లేదా అనేది తేల్చేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అసమ్మతి స్వరాన్ని నొక్కేయలేమని వ్యాఖ్యానించింది. స్పీకర్ పిటిషన్‌పై విచారణను జూలై 27వ తేదీకి వాయిదా వేసింది. 19 మంది ఎమ్మెల్యేల పిటిషన్‌పై రాజస్తాన్ హైకోర్టు శుక్రవారం ఉత్తర్వు జారీ చేయనుంది. షెకావత్‌పై విచారణ జరపండి సంజీవని క్రెడిట్ కో–ఆపరేటివ్ సొసైటీ కుంభకోణంలో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ హస్తం ఉందని ఆరోపిస్తూ దాఖలైన ఫిర్యాదుపై విచారణ జరపాలని జైపూర్ అదనపు జిల్లా జడ్జి కోర్టు రాజస్తాన్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సొసైటీలో వేలాది మంది సొమ్ము మదుపు చేశారు. సొసైటీ నిర్వాహకులు ఇందులో రూ.900 కోట్లను మింగేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ కుంభకోణంపై స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్(ఎస్ఓజీ) దర్యాప్తు చేస్తోంది. 2019 ఆగస్టు 23న ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అయితే, ఇందులో షెకావత్ పేరును చేర్చలేదు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గులామ్సింగ్, లాబూ సింగ్ అదనపు జిల్లా జడ్జి కోర్టును ఆశ్రయించారు. సహకార సొసైటీ కుంభకోణంలో పాత్రదారులైన కేంద్ర మంత్రిని, మరికొందరిని ఎస్ఓజీ ఉద్దేశపూర్వకంగానే రక్షిస్తోందని ఫిర్యాదుదారులుఆరోపిస్తున్నారు. టేపులను విదేశాలకు పంపిస్తాం: గహ్లోత్ తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కుట్ర పన్నారని సీఎం గహ్లోత్ మరోసారి ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తూ ఆయన మాట్లాడినట్టుగా వెలుగులోకి వచ్చిన ఆడియో టేపులు ముమ్మాటికీ నిజమైనవేనని ఉద్ఘాటించారు. ఫోరెన్సిక్ టెస్టు కోసం వాటిని విదేశాల్లోని సైన్స్ ల్యాబ్‌కు పంపిస్తామని చెప్పారు. షెకావత్ ఏ తప్పూ చేయకపోతే స్వర నమూనా ఇచ్చేందుకు ఎందుకు అంగీకరించడం లేదని నిలదీశారు. తమ ప్రభుత్వానికి అసెంబ్లీలో పూర్తి మెజారిటీ ఉందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఐక్యంగా ఉన్నారని, త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. సచిన్ పైలట్ వర్గం కోర్టును ఆశ్రయించడంపై ఆయన స్పందిస్తూ.. వారంతా కోర్టుకు వెళ్లి తప్పు చేశారని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంతో న్యాయస్థానానికి సంబంధం లేదని గుర్తుచేశారు. -
ఐఎన్ఎక్స్ కేసు : 20 గంటలుగా అజ్ఞాతంలో చిదంబరం
సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పీ చిదంబరానికి సుప్రీం కోర్టులో ఊరట లభించలేదు. అరెస్ట్ నుంచి తక్షణ ఉపశమనం కల్పించాల్సిందిగా ఆయన చేసుకున్న అప్పీల్‌ను సర్వోన్నత న్యాయస్ధానం తోసిపుచ్చింది. చిదంబరం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ శుశ్రవారం విచారణకు రానుంది. చిదంబరం అరెస్ట్‌కు సీబీఐ రంగం సిద్ధం చేసిన క్రమంలో గడిచిన 24 గంటల నుంచీ ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. మరోవైపు చిదంబరం దేశం విడిచి వెళ్లకుండా ఆయనపై లుక్అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. ఇక 2007లో ఐఎన్ఎక్స్ మీడియా సంస్థకు విదేశాల నుంచి రూ. 305 కోట్ల నిధులు అందుకోవడానికి విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్ఐపీబీ) ఆమోదముద్ర వేయడంలో అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం నిబంధనలకు విరుద్ధంగా పచ్చజెండా ఊపారని ఆయన అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఐఎన్ఎక్స్ మీడియాలో విదేశీ నిధుల రాకకు ఎఫ్ఐపీబీ ఆమోదం లభించడం వెనుక అవకతవకలు ఉన్నాయని దర్యాప్తు సంస్థలు పేర్కొంటున్నాయి. -
బోఫోర్స్ భూతం వచ్చేస్తోంది
సాక్షి, న్యూఢిల్లీ : బోఫోర్స్ కేసును తిరగదొడేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రయత్నాలు ప్రారంభించింది. పున్వరిచారణకు ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేయబోతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని అధికార వర్గాలు ధృవీకరించాయి. 2005, మే 31 న బ్రిటన్‌కు చెందిన వాణిజ్యవేత్తల కుటుంబం హిందూజా సోదరులు శ్రీచంద్, గోపీచంద్, ప్రకాశ్ చంద్‌లపై నమోదయిన అభియోగాలను కొట్టేస్తూ.. వారిని నిర్దోషులుగా ఢిల్లీ హైకోర్టు ప్రకటించింది. అయితే ఆ సమయంలో ఉన్న సీబీఐ 90 రోజుల్లో తీర్పు సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయాల్సి ఉండగా.. ఆ పని చేయలేదు. దీనికి ప్రభుత్వం నుంచి దర్యాప్తు విభాగంపై ఒత్తిళ్లు వచ్చాయన్న ఆరోపణలు వినిపించాయి. దీంతో ఇప్పుడు ఆ ఆదేశాలను ఛాలెంజ్ చేస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయబోతున్నట్లు సమాచారం. బోఫోర్స్ కేసు.. టైమ్ లైన్ ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి కోరినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ యేడాది జూలైలో బిజూ జనతాదళ్ ఎంపీ భర్తృహరి మహతబ్ నేతృత్వంలోని కమిటీ పార్లమెంట్‌కు సమర్పించిన నివేదికలో... బోఫోర్స్ కేసు విచారణలో చాలా లోపాలున్నాయని తెలపటం తెలిసిందే. ఆ వెంటనే రంగంలోకి దిగిన సీబీఐ.. సుప్రీంకోర్ట్ లేదా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతోనే భోఫోర్స్ కేసుపై పునర్విచారణ సాధ్యమవుతుందని ప్రకటించింది. దీనికి తోడు ఈ మధ్యే ప్రైవేట్ డిటెక్టివ్ మైకేల్ హెర్షమ్ బోఫోర్స్ గురించి చేసిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకుంటామని కూడా ప్రకటించటంతో ముప్పై ఏళ్ల బోఫోర్స్ మళ్లీ తెరపైకి వచ్చినట్లయ్యింది. ఈ మధ్యలో బీజేపీ నేత అజయ్ కుమార్ అగర్వాల్ పునర్విచారణ కోసం దాఖలు చేసిన ఓ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు.. అక్టోబర్ 30 తర్వాత విచారణ చేపడతామని ప్రకటించింది కూడా. 1986 మార్చి 24న భారత ప్రభుత్వం 410 యూనిట్ల 155 ఎంఎం హవిట్జర్ గన్స్ కొనుగోలుకు స్వీడన్‌కు చెందిన ఏబీ భోఫోర్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ రూ.1,437.72 కోట్లు. అయితే మరసటి ఏడాదే స్వీడిన్ రేడియో భారతదేశంలోని కొందరు రాజకీయ నాయకులకు లంచం ఇచ్చి బోఫోర్స్ సంస్థ ఈ ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించి సంచలనాలనికి తెరలేపింది. 1989 నాటికి ఆ ఆరోపణలు భారీ కుంభకోణంగా రూపాంతరం చెందింది. -
కృష్ణా ఆశలన్నీ సుప్రీంపైనే..
♦ తెలంగాణ ఎస్ఎల్పీపై రేపు విచారణ ♦ కృష్ణా జలాల్లో అన్యాయాన్ని మరోమారు వినిపించనున్న రాష్ట్రం ♦ ఇటీవలి బ్రిజేశ్ తీర్పుపైనా కీలక వాదనలు ♦ నేడు ఢిల్లీకి అధికారుల పయనం సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల కేటాయింపుల్లో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని, దాన్ని సవరించేందుకు కొత్త ట్రిబ్యునల్‌ను నియమించి పునర్విచారణ జరిపేలా ఆదేశించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల కిందట దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్ఎల్పీ)పై గురువారం సుప్రీంకోర్టులో కీలక విచారణ జరుగనుంది. ఇటీవల కృష్ణా జలాలపై తదుపరి విచారణ కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితమంటూ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వెలువరించిన నేపథ్యంలో సుప్రీంలో ఈ విచారణ ప్రాముఖ్యం సంతరించుకుంది. ఇప్పటికే దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ముందుకు కొనసాగిస్తుందా? లేక ఇటీవలి బ్రిజేశ్ తీర్పును పరిగణనలోకి తీసుకుంటూ మరేదైనా తీర్పు ఇస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. సుప్రీం విచారణ నేపథ్యంలో గురువారం నీటి పారుదల శాఖ అధికారులు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎస్ఎల్పీలో రాష్ట్రం ఏమంది? కృష్ణా జలాలపై బ్రిజేశ్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును తుది గెజిట్‌లో ప్రచురించరాదని, ఈ కేసులో తమ వాదనలు వినాలని కోరుతూ రాష్ట్రం 2014లో ఎస్ఎల్పీ దాఖలు చేసింది. నీటి లభ్యతను అంచనా వేయడానికి తీసుకున్న 65 శాతం డిపెండబులిటీతో, కర్ణాటక ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచే అవకాశం ఉండడంతో రాష్ట్రం నష్టపోతుందని అందులో వివరించింది. కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణలో 68.5 శాతం ఉండగా.. ఏపీలో 31.5 శాతం మాత్రమే ఉందని, అయినా కేటాయింపులు మాత్రం ఆంధ్రప్రదేశ్‌కే ఎక్కువ జరిపారని పేర్కొంది. ‘‘కృష్ణాలోని భీమా సబ్ బేసిన్లో 75 శాతం డిపెండబులిటీ లెక్కన నీటి లభ్యత 342 టీఎంసీలు ఉంటుంది. ఈ నీటిని బచావత్ ట్రిబ్యునల్ మహారాష్ట్ర, కర్ణాటకకే కేటాయించగా.. బ్రిజేశ్ ట్రిబ్యునల్ 60 శాతం డిపెండబులిటీ లెక్కన మరో 28 టీఎంసీలు ఎగువ రాష్ట్రాలకు కేటాయించింది. దీంతో భీమా నుంచి కృష్ణాకు ఎలాంటి నీటి లభ్యత ఉండదు. ఇక తుంగభద్ర, వేదవతి సబ్ బేసిన్లో మొత్తం నీటి లభ్యత 533 టీఎంసీలు ఉండగా అందులో తెలంగాణ వాటా కేవలం 18 టీఎంసీలే. అందులోనూ పూర్తి స్థాయి జలాలు ఎన్నడూ రాలేదు. తెలంగాణకు నీటి లభ్యత అంతా ప్రధాన కృష్ణాకు నాలుగు సబ్ బేసిన్ల నుంచి 794 టీఎంసీలుగా ఉంది. అయితే మహారాష్ట్రకు ఉన్న 260 టీఎంసీ కేటాయింపులకు అదనంగా ట్రిబ్యునల్ 50 టీఎంసీలు, కర్ణాటకకు ఉన్న 325 టీఎంసీలకు అదనంగా మరో 130 టీఎంసీలు కేటాయించింది. ఇలా ఎగువ రాష్ట్రాలకే 766 టీఎంసీలు కేటాయించడంతో తెలంగాణ సరిహద్దుకు వచ్చే నీరు కేవలం 28 టీఎంసీలే. ప్రస్తుతం ఎగువ రాష్ట్రాలకు అదనంగా కేటాయింపులు పెరిగితే దిగువకు నీరు వచ్చే అవకాశాలు దెబ్బతింటాయి’’ అని పిటిషన్లో తెలంగాణ వివరించింది. ఇవే అంశాలను మరోమారు సుప్రీం దృష్టికి తీసుకెళ్లి నాలుగు రాష్ట్రాలకు తిరిగి జలాల కేటాయింపులు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. మరోవైపు కృష్ణా జలాల విచారణ రెండు రాష్ట్రాలకే పరిమితం అంటూ ఇచ్చిన తీర్పుపై అఫిడవిట్ సమర్పించాలన్న గడువు ముగుస్తుండటంతో రాష్ట్రం మరో నాలుగు వారాల సమయం కోరుతూ ట్రిబ్యునల్‌కు లేఖ రాసింది. -
సుప్రీం గడప తొక్కాల్సిందే!
• ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేయనున్న తెలంగాణ • ఇప్పటికే విచారణలో స్పెషల్ లీవ్ పిటిషన్ • తీర్పుపై విద్యాసాగర్‌రావుతో మాట్లాడిన సీఎం సాక్షి, హైదరాబాద్: బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పు రాష్ర్ట ప్రయోజనాలకు గొడ్డలిపెట్టులా ఉండడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. తీర్పు అమల్లోకి రాకుండా స్టే ఇవ్వాలని కోర్టును కోరాలని భావిస్తోంది. కృష్ణా జల వివాదాలపై ఏర్పాటైన బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును తుది గెజిట్‌లో ప్రచురించరాదని, ఈ కేసులో తమ వాదనలు పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఇదివరకే స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. అంతర్రాష్ట్ర నదీ వివాదాల చట్టం ప్రకారం ఏర్పడిన ట్రిబ్యునల్... తన తీర్పును ఆ చట్టంలోని 5(2) అధికరణ కింద వెలువరిస్తుంది. దీనిపై ఆయా రాష్ట్రాలు మూడు నెలల్లోగా వివరణలు, స్పష్టతలు కోరవచ్చు. వీటిపై విచారణ జరిపి తదుపరి నివేదికను 5(3) అధికరణ కింద ట్రిబ్యునల్ కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. అనంతరం కేంద్రం 6(1) అధికరణ ప్రకారం గెజిట్ ప్రచురిస్తుంది. ఈ గెజిట్ సుప్రీంకోర్టులోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పుతో సమానం అవుతుంది. బ్రిజేశ్ ట్రిబ్యునల్ 5(2) కింద ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సుప్రీంను ఆశ్రయించింది. ట్రిబ్యునల్ తీర్పును గెజిట్‌లో ప్రచురించరాదని కేంద్రాన్ని ఆదేశించింది. ఇదే విషయమై కర్ణాటక సైతం సుప్రీంను ఆశ్రయించగా మరో రాష్ట్రం మహారాష్ట్ర మాత్రం బ్రిజేశ్ తీర్పు, తుది తీర్పును గెజిట్‌లో ప్రచురించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ పిటిషన్ వేసింది. ఈ కేసులో కొత్తగా ఏర్పడిన తమను చేర్చాలని కోరుతూ తెలంగాణ వేసిన ఇంప్లీడ్ పిటిషన్‌కు సుప్రీం అంగీకరించి స్పెషల్ లీవ్ పిటిషన్‌కు అనుమతినిచ్చింది. ఈ పిటిషన్‌పై విచారణ ప్రస్తుతం సుప్రీంలో పెండింగ్‌లో ఉంది. ఈ విచారణ పూర్తయ్యేంత వరకు బ్రిజేశ్ తీర్పును గెజిట్ చేయడానికి వీల్లేదు. అయితే ప్రస్తుతం బ్రిజేశ్ ట్రిబ్యునల్.. నీటి కేటాయింపులను రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయడంతో అదే అదనుగా కర్ణాటక, మహారాష్ట్రలు తమకు కేటాయించిన మేరకు గెజిట్ ఇవ్వాలని కోరే అవకాశం ఉంది. ఈ దృష్ట్యా తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకు వెళ్లడమే సరైందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. తీర్పుపై నేడు సమీక్ష: ట్రిబ్యునల్ తీర్పు, దాని ఫలితాలపై సీఎం కేసీఆర్ గురువారం సమీక్షించే అవకాశం ఉంది. తీర్పు వెలువడిన వెంటనే ఆయన ఢిల్లీలో ఉన్న ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, అడిషనల్ అడ్వొకేట్ జనరల్ రాంచందర్‌రావులతో మాట్లాడారు. సుప్రీంను ఆశ్రయించే అంశంపై గురువారం నిర్ణయం తీసుకోనున్నారు. -
కృష్ణా జలాల కేసుపై నేడు సుప్రీంలో విచారణ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల పంపిణీపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును గెజిట్‌లో ప్రచురించరాదంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. తమ ఎస్ఎల్పీని అడ్మిట్ చేసుకునే విధంగా వాదనలు వినిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆదివారం సాయంత్రమే న్యాయవాదులు రవీందర్రావుతోపాటు అంతర్రాష్ట్ర నదీ వివాదాలను పర్యవేక్షిస్తున్న అధికారులు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. వారు రాష్ట్రం తరఫున వాదనలు వినిపించనున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్‌తో సోమవారం ఉదయం సమావేశమై కేసు పూర్వాపరాలను మరోమారు వివరించే అవకాశం ఉంది. అంతర్రాష్ట్ర నదీవివాదాల చట్టం ప్రకారం ఏర్పడిన ట్రిబ్యునల్ చట్టంలోని 5(2) అధికరణ కింద, తర్వాత దాన్ని సవరిస్తూ 5(3) కింద వెలువరించినతీర్పును సవాల్ చేస్తూ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. విచారణను కొనసాగించేందుకు అంగీకరించిన కోర్టు... తీర్పును మాత్రం గెజిట్‌లో ప్రచురించరాదని కేంద్రాన్ని ఆదేశించింది. ఇదే విషయమై కర్ణాటక సైతం సుప్రీంకోర్టును ఆశ్రయించగా మరోరాష్ట్రం మహారాష్ట్ర.. ట్రిబ్యునల్ తీర్పును గెజిట్ ప్రచురించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ పిటిషన్ వేసింది. ఈ కేసులో కొత్తగా ఏర్పడిన తమను చేర్చాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం వేసిన ఇంప్లీడ్ పిటిషన్‌కు సుప్రీంకోర్టు అంగీకరించడంతో గత నెలలోనే ఎస్ఎల్పీ దాఖలైంది. ఈ పిటిషన్‌ను అడ్మిట్ చేసుకోవచ్చా.. లేదా అన్న అంశంపై కోర్టు విచారించనుంది. -
26 వివాదాస్పద జీవోలపై స్పెషల్ లీవ్ పిటిషన్ తిరస్కరణ
సాక్షి లీగల్ ప్రతినిధి, న్యూఢిల్లీ: సీబీఐ కేసులో వివాదాస్పదమైన 26 ప్రభుత్వ ఉత్తర్వులకు సంబంధించి వాటిని జారీ చేసిన ఆరుగురు మంత్రులపై దర్యాప్తు జరపాల్సిందిగా సీబీఐని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. న్యాయవాది పి.సుధాకరరెడ్డి దాఖలు చేసిన ఈ స్పెషల్ లీవ్ పిటిషన్‌ను కొట్టివేసిన జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, జస్టిస్ ఎం.వై.ఇక్బాల్‌లతో కూడిన ధర్మాసనం.. ఈ విషయంలో సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. సీబీఐ దర్యాప్తు తీరుపై ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే విచారణ కోర్టును ఆశ్రయించాల్సిందిగా సుప్రీంకోర్టు పిటిషనర్‌కు సూచించింది. వివాదాస్పద జీవోలకు సంబంధించి సుప్రీంకోర్టు గత ఏడాది మార్చిలో ఆరుగురు మంత్రులకు - జె.గీతారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, పొన్నాల లక్ష్మయ్య, కన్నా లక్ష్మీనారాయణ, మోపిదేవి వెంకటరమణలకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆయా జీవోలు జారీ అయినపుడు వీరంతా దివంగత వైఎస్ మంత్రివర్గంలో కీలక శాఖలకు మంత్రులుగా ఉన్నారు. ‘సుప్రీం’ నోటీసులకు వారు సమాధానం ఇస్తూ.. ఆ 26 వివాదాస్పద జీవోల జారీకి మొత్తం మంత్రివర్గానిదే ఉమ్మడి బాధ్యత అని పేర్కొన్నారు. తాము ఎలాంటి విధివిధానాలనూ ఉల్లంఘించలేదని చెప్పారు. ఆయా ఉత్తర్వులను జారీ చేసేముందుగా మంత్రివర్గంలో చర్చించామని.. కాబట్టి ఆ ఉత్తర్వుల జారీకి ఏ ఒక్క మంత్రినీ వ్యక్తిగతంగా తప్పుపట్టజాలరని వాదించారు. ఈ ఆరుగురు మంత్రులతో పాటు.. రెవెన్యూ, పురపాలక, పెట్టుబడులు - మౌలికవసతులు, పరిశ్రమలు - వాణిజ్యం, సాగునీటి శాఖల కార్యదర్శులుగా పనిచేసిన 8 మంది ఐఏఎస్ అధికారులు ఎస్.వి.ప్రసాద్ (ప్రస్తుతం పదవీ విరమణ చేశారు), సి.వి.ఎస్.కె.శర్మ, ఎం.శామ్యూల్, వై.శ్రీలక్ష్మి, ఆదిత్యనాథ్‌దాస్, కె.రత్నప్రభ, బి.శ్యాంబాబ్, మన్మోహన్‌సింగ్‌లకు కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. జగన్మోహన్రెడ్డి సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించి.. పలువురు ఇతరులపై అనేక కేసులు నమోదు చేసిన సీబీఐ.. తన ఎఫ్ఐఆర్లో ఈ 14 మంది మంత్రులు, అధికారుల్లో ఎవరి పేరూ చేర్చలేదని పిటిషనర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం - వివిధ సంస్థల మధ్య కుదిరిన 26 ఒప్పందాలకు బాధ్యులు వీరేనన్నారు. వీరిపై దర్యాప్తు జరపాల్సిందిగా సీబీఐని ఆదేశించాలంటూ పిటిషనర్ సుధాకర్‌రెడ్డి తొలుత సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేశారు. దానిని ఆ కోర్టు తిరస్కరించటంతో ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా పిటిషన్ కొట్టివేయటంతో సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించి.. సీబీఐ దర్యాప్తు తీరుపై ఫిర్యాదులు ఉన్నట్లయితే విచారణ కోర్టునే ఆశ్రయించాలని సూచించింది.