కృష్ణా జలాల కేసుపై నేడు సుప్రీంలో విచారణ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల పంపిణీపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును గెజిట్‌లో ప్రచురించరాదంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. తమ ఎస్‌ఎల్‌పీని అడ్మిట్ చేసుకునే విధంగా వాదనలు వినిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆదివారం సాయంత్రమే న్యాయవాదులు రవీందర్‌రావుతోపాటు అంతర్‌రాష్ట్ర నదీ వివాదాలను పర్యవేక్షిస్తున్న అధికారులు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.
వారు రాష్ట్రం తరఫున వాదనలు వినిపించనున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్‌తో సోమవారం ఉదయం సమావేశమై కేసు పూర్వాపరాలను మరోమారు వివరించే అవకాశం ఉంది. అంతర్‌రాష్ట్ర నదీవివాదాల చట్టం ప్రకారం ఏర్పడిన ట్రిబ్యునల్ చట్టంలోని 5(2) అధికరణ కింద, తర్వాత దాన్ని సవరిస్తూ 5(3) కింద వెలువరించినతీర్పును సవాల్ చేస్తూ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. విచారణను కొనసాగించేందుకు అంగీకరించిన కోర్టు... తీర్పును మాత్రం గెజిట్‌లో ప్రచురించరాదని కేంద్రాన్ని ఆదేశించింది.
ఇదే విషయమై కర్ణాటక సైతం సుప్రీంకోర్టును ఆశ్రయించగా మరోరాష్ట్రం మహారాష్ట్ర.. ట్రిబ్యునల్ తీర్పును గెజిట్ ప్రచురించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ పిటిషన్ వేసింది. ఈ కేసులో కొత్తగా ఏర్పడిన తమను చేర్చాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం వేసిన ఇంప్లీడ్ పిటిషన్‌కు సుప్రీంకోర్టు అంగీకరించడంతో గత నెలలోనే ఎస్‌ఎల్‌పీ దాఖలైంది. ఈ పిటిషన్‌ను అడ్మిట్ చేసుకోవచ్చా.. లేదా అన్న అంశంపై కోర్టు విచారించనుంది.