సాక్షి, హైదరాబాద్: పర్యావరణ అనుమతులు లేకుండా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల నిర్మాణాన్ని చేపట్టినందుకు రూ. 920.85 కోట్ల భారీ జరిమానాను విధిస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వారం రోజుల్లో సుప్రీం కోర్టు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనున్నట్టు రాష్ట్ర నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి.
పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు సంబంధించి వేర్వేరు పిటిషన్లు వేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఆ రెండు ఎత్తిపోతల పథకాల తొలి దశ పనులను కేవలం తాగునీటి అవసరాల కోసమే చేపట్టినందున పర్యావరణ అనుమతుల నుంచి మినహాయింపు ఉందని తెలంగాణ వాదిస్తోంది. పర్యావరణ అనుమతులు వచ్చిన తర్వాతే రెండో దశ కింద సాగునీటి అవసరాలకు సంబంధించిన పనులు చేపడతామని పేర్కొంటోంది.
ఈ విషయంలో తెలంగాణ వాదనలను పరిగణనలోకి తీసుకోకుండా ఎన్జీటీ ఏకపక్ష నిర్ణయం తీసుకుందంటూ సుప్రీం కోర్టులో వాదనలు వినిపించాలని నిర్ణయించింది. ఎన్జీటీ తీర్పు విషయంలో అవలంబించాల్సిన భవిష్యత్తు కార్యాచరణపై నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ ఇటీవల న్యాయనిపుణులతో సమావేశమై చర్చించారు. ఎన్జీటీ తీర్పును సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాత వచ్చే వారం సుప్రీం కోర్టులో ఎస్‌ఎల్పీ దాఖలు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది.
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.528 కోట్లు, డిండి ప్రాజెక్టుకు రూ. 92.85 కోట్లను పర్యావరణ పరిహారంగా చెల్లించడంతో పాటు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై విధించిన స్టేను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించి పనులు కొనసాగించినందుకు మరో రూ.300 కోట్ల జరిమానాను విధిస్తూ ఎన్జీటీ గత నెలలో ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వంతో పాటు ఆ రాష్ట్రంలోని మరో 9 మంది ప్రైవేటు వ్యక్తులు వేసిన కేసు విషయంలో ఈ నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment