environment permissions
-
ఎన్జీటీ ఆదేశాలపై సుప్రీంకు
సాక్షి, హైదరాబాద్: పర్యావరణ అనుమతులు లేకుండా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల నిర్మాణాన్ని చేపట్టినందుకు రూ. 920.85 కోట్ల భారీ జరిమానాను విధిస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వారం రోజుల్లో సుప్రీం కోర్టు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనున్నట్టు రాష్ట్ర నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు సంబంధించి వేర్వేరు పిటిషన్లు వేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఆ రెండు ఎత్తిపోతల పథకాల తొలి దశ పనులను కేవలం తాగునీటి అవసరాల కోసమే చేపట్టినందున పర్యావరణ అనుమతుల నుంచి మినహాయింపు ఉందని తెలంగాణ వాదిస్తోంది. పర్యావరణ అనుమతులు వచ్చిన తర్వాతే రెండో దశ కింద సాగునీటి అవసరాలకు సంబంధించిన పనులు చేపడతామని పేర్కొంటోంది. ఈ విషయంలో తెలంగాణ వాదనలను పరిగణనలోకి తీసుకోకుండా ఎన్జీటీ ఏకపక్ష నిర్ణయం తీసుకుందంటూ సుప్రీం కోర్టులో వాదనలు వినిపించాలని నిర్ణయించింది. ఎన్జీటీ తీర్పు విషయంలో అవలంబించాల్సిన భవిష్యత్తు కార్యాచరణపై నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ ఇటీవల న్యాయనిపుణులతో సమావేశమై చర్చించారు. ఎన్జీటీ తీర్పును సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాత వచ్చే వారం సుప్రీం కోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.528 కోట్లు, డిండి ప్రాజెక్టుకు రూ. 92.85 కోట్లను పర్యావరణ పరిహారంగా చెల్లించడంతో పాటు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై విధించిన స్టేను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించి పనులు కొనసాగించినందుకు మరో రూ.300 కోట్ల జరిమానాను విధిస్తూ ఎన్జీటీ గత నెలలో ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వంతో పాటు ఆ రాష్ట్రంలోని మరో 9 మంది ప్రైవేటు వ్యక్తులు వేసిన కేసు విషయంలో ఈ నిర్ణయం తీసుకుంది. -
పర్యావరణ అనుమతి అక్కర్లేదు
సాక్షి, అమరావతి: రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులకు పర్యావరణ అనుమతి అవసరం లేదని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ ఎత్తిపోతల పనులు పర్యావరణంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపవని తేల్చిచెబుతూ జాతీయ హరిత న్యాయస్థానం (ఎన్జీటీ) దక్షిణ ప్రాంత బెంచ్ (చెన్నై)కు బుధవారం నివేదిక ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదనతో పూర్తి స్థాయిలో ఏకీభవిస్తూ కేంద్రం నివేదిక ఇవ్వడం గమనార్హం. రాయలసీమ ఎత్తిపోతలపై ఆగస్టు 11న ఎన్జీటీ నిర్వహించే తుది విచారణలో ఈ నివేదిక కీలకం కానుంది. రాయలసీమ ఎత్తిపోతలకు ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని న్యాయనిపుణులు స్పష్టం చేస్తున్నారు. ► కృష్ణా నదీ జలాల్లో తన వాటాగా దక్కిన జలాలను వినియోగించుకోవడం ద్వారా రాయలసీమ, నెల్లూరు జిల్లాల సాగు, తాగునీటి కష్టాలను తీర్చాలని రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టింది. ► పర్యావరణ అనుమతి లేకుండా చేపట్టిన ఈ ఎత్తిపోతల పనులను నిలుపుదల చేయాలంటూ తెలంగాణలోని పాత మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. ► ఈ పిటిషన్‌పై మే 20న విచారించిన ఎన్జీటీ.. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను నిలుపుదల చేయాలంటూ స్టే ఇచ్చింది. ► తన వాటా జలాలను వినియోగించుకోవడానికే ఎత్తిపోతల పనులు చేపట్టామని.. వీటికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం ఎన్జీటీలో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పథకం వల్ల పర్యావరణంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదని నివేదించింది. ► ప్రభుత్వ పిటిషన్‌పై ఈ నెల 13న విచారించిన ఎన్జీటీ.. ఎత్తిపోతల పనుల టెండర్ ప్రక్రియ చేపట్టడానికి అనుమతి ఇచ్చింది. -
ఏపీ తాత్కాలిక సచివాలయంపై విచారణ వాయిదా
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తాత్కాలిక సచివాలయంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్ దాఖలైంది. వెలగపూడిలో నిర్మాణాలకు ఇచ్చిన పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో పిటిషిన్ వేశారు. పర్యావరణ అనుతులు లోపభుయిష్టంగా ఇచ్చారని పిటిషనర్ శర్మ వాదించారు. ఈ నేపథ్యంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పర్యావరణ మంత్రిత్వశాఖ, రాష్ట్ర పర్యావరణ అథారిటీకి నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. కాగా, తదుపరి విచారణ జులై 7కు వాయిదా పడింది.