
సాక్షి, అమరావతి: రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులకు పర్యావరణ అనుమతి అవసరం లేదని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ ఎత్తిపోతల పనులు పర్యావరణంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపవని తేల్చిచెబుతూ జాతీయ హరిత న్యాయస్థానం (ఎన్జీటీ) దక్షిణ ప్రాంత బెంచ్ (చెన్నై)కు బుధవారం నివేదిక ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదనతో పూర్తి స్థాయిలో ఏకీభవిస్తూ కేంద్రం నివేదిక ఇవ్వడం గమనార్హం. రాయలసీమ ఎత్తిపోతలపై ఆగస్టు 11న ఎన్జీటీ నిర్వహించే తుది విచారణలో ఈ నివేదిక కీలకం కానుంది. రాయలసీమ ఎత్తిపోతలకు ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని న్యాయనిపుణులు స్పష్టం చేస్తున్నారు.
► కృష్ణా నదీ జలాల్లో తన వాటాగా దక్కిన జలాలను వినియోగించుకోవడం ద్వారా రాయలసీమ, నెల్లూరు జిల్లాల సాగు, తాగునీటి కష్టాలను తీర్చాలని రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టింది.
► పర్యావరణ అనుమతి లేకుండా చేపట్టిన ఈ ఎత్తిపోతల పనులను నిలుపుదల చేయాలంటూ తెలంగాణలోని పాత మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు.
► ఈ పిటిషన్‌పై మే 20న విచారించిన ఎన్జీటీ.. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను నిలుపుదల చేయాలంటూ స్టే ఇచ్చింది.
► తన వాటా జలాలను వినియోగించుకోవడానికే ఎత్తిపోతల పనులు చేపట్టామని.. వీటికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం ఎన్జీటీలో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పథకం వల్ల పర్యావరణంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదని నివేదించింది.
► ప్రభుత్వ పిటిషన్‌పై ఈ నెల 13న విచారించిన ఎన్జీటీ.. ఎత్తిపోతల పనుల టెండర్ ప్రక్రియ చేపట్టడానికి అనుమతి ఇచ్చింది.