Tendar notification
-
పర్యావరణ అనుమతి అక్కర్లేదు
సాక్షి, అమరావతి: రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులకు పర్యావరణ అనుమతి అవసరం లేదని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ ఎత్తిపోతల పనులు పర్యావరణంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపవని తేల్చిచెబుతూ జాతీయ హరిత న్యాయస్థానం (ఎన్జీటీ) దక్షిణ ప్రాంత బెంచ్ (చెన్నై)కు బుధవారం నివేదిక ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదనతో పూర్తి స్థాయిలో ఏకీభవిస్తూ కేంద్రం నివేదిక ఇవ్వడం గమనార్హం. రాయలసీమ ఎత్తిపోతలపై ఆగస్టు 11న ఎన్జీటీ నిర్వహించే తుది విచారణలో ఈ నివేదిక కీలకం కానుంది. రాయలసీమ ఎత్తిపోతలకు ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని న్యాయనిపుణులు స్పష్టం చేస్తున్నారు. ► కృష్ణా నదీ జలాల్లో తన వాటాగా దక్కిన జలాలను వినియోగించుకోవడం ద్వారా రాయలసీమ, నెల్లూరు జిల్లాల సాగు, తాగునీటి కష్టాలను తీర్చాలని రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టింది. ► పర్యావరణ అనుమతి లేకుండా చేపట్టిన ఈ ఎత్తిపోతల పనులను నిలుపుదల చేయాలంటూ తెలంగాణలోని పాత మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. ► ఈ పిటిషన్‌పై మే 20న విచారించిన ఎన్జీటీ.. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను నిలుపుదల చేయాలంటూ స్టే ఇచ్చింది. ► తన వాటా జలాలను వినియోగించుకోవడానికే ఎత్తిపోతల పనులు చేపట్టామని.. వీటికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం ఎన్జీటీలో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పథకం వల్ల పర్యావరణంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదని నివేదించింది. ► ప్రభుత్వ పిటిషన్‌పై ఈ నెల 13న విచారించిన ఎన్జీటీ.. ఎత్తిపోతల పనుల టెండర్ ప్రక్రియ చేపట్టడానికి అనుమతి ఇచ్చింది. -
‘జోలదరాశి’కి జ్యుడిషియల్ ప్రివ్యూ ఓకే
సాక్షి, అమరావతి: కేసీ కెనాల్ ఆయకట్టు స్థిరీకరణే లక్ష్యంగా కర్నూలు జిల్లా కోయిలకుంట్ల మండలం జోలదరాశి వద్ద కుందూ నదిపై 0.80 టీఎంసీల సామర్థ్యంతో రూ.207.95 కోట్ల వ్యయంతో రిజర్వాయర్ నిర్మాణ టెండర్ ప్రతిపాదనను జ్యుడీషియల్ ప్రివ్యూ ఆమోదించింది. ఈ పనులకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేసేందుకు జలవనరుల శాఖ కసరత్తు చేస్తోంది. కుందూ నదిపై రెండు జలాశయాలను నిర్మించి, వరదను ఒడిసి పట్టి కేసీ కెనాల్, తెలుగుగంగ ఆయకట్టు స్థిరీకరణ పనులకు డిసెంబర్ 17న రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు రిజర్వాయర్లు.. ► జోలదరాశి వద్ద 0.80 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణానికి రూ.312.3 కోట్లతో, చాగలమర్రి మండలం రాజోలి ఆనకట్టకు ఎగువన 2.95 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణానికి రూ.1,357.10 కోట్లతో ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. రాజోలి రిజర్వాయర్ టెండర్ ప్రతిపాదనలను జ్యుడీషియల్ ప్రివ్యూ ఆమోదించిన తరువాత నోటిఫికేషన్ జారీ చేస్తారు. కేసీ కెనాల్‌కు 140 ఏళ్ల చరిత్ర.. జల రవాణా కోసం తుంగభద్ర–పెన్నాను అనుసంధానం చేస్తూ కర్నూలు జిల్లా సుంకేశుల వద్ద డచ్ సంస్థ ఆనకట్ట నిర్మించింది. అక్కడి నుంచి పెన్నా నది వరకు కాలువ తవ్వకం పనులను 1873లో ప్రారంభించి 1880 నాటికి పూర్తి చేసింది. డచ్ సంస్థ తవ్విన కేసీ కెనాల్‌ను 1880లో బ్రిటీష్ ప్రభుత్వం 3.02 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ కాలువ 1933 నుంచి సాగునీటి ప్రాజెక్టుగా మారింది. ఆయకట్టు రైతులకు భరోసా.. ► బచావత్ ట్రిబ్యునల్ కేసీ కెనాల్‌కు 39.9 టీఎంసీలను కేటాయించింది. ఇందులో సుంకేశుల బ్యారేజీ వద్ద 29.9 టీఎంసీలు లభ్యమవుతాయని, మిగతా పది టీఎంసీలు తుంగభద్ర జలాశయం నుంచి విడుదల చేయాలని పేర్కొంది. అయితే సుంకేశుల బ్యారేజీ సామర్థ్యం 1.2 టీఎంసీలే కావడం, వర్షాభావంతో నీటి లభ్యత కనిష్ట స్థాయికి చేరడం వల్ల కేసీ కెనాల్ ఆయకట్టుకు సక్రమంగా నీళ్లందని దుస్థితి నెలకొంది. ► కుందూ వరద ప్రవాహాన్ని ఒడిసి పట్టడం ద్వారా కేసీ కెనాల్ ఆయకట్టును స్థిరీకరించే లక్ష్యంతో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి రాజోలి, జోలదరాశి జలాశయాల నిర్మాణానికి 2008 డిసెంబర్ 23న పరిపాలన అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ► రాజోలి ఆనకట్టకు దిగువన 84,686 ఎకరాలకు కుందూ వరద ద్వారా నీళ్లందించి, మిగతా 1,80,942 ఎకరాలకు సుంకేశుల బ్యారేజీ నుంచి తుంగభద్ర జలాలను అందించడం ద్వారా కేసీ కెనాల్ ఆయకట్టును సస్యశ్యామలం చేయాలని భావించారు. అయితే ఆయన హఠాన్మరణంతో రాజోలి, జోలదరాశి జలాశయాలకు గ్రహణం పట్టింది. సీఎం వైఎస్ జగన్ అధికారం చేపట్టిన తరువాత కేసీ కెనాల్ ఆయకట్టును సస్యశ్యామలం చేసేందుకు ఆ రెండు జలాశయాలను నిర్మించాలని నిర్ణయించారు. రూ.54.36 కోట్లతో వెంగళరాయసాగరం ఆధునీకరణ విజయనగరం జిల్లాలోని వెంగళరాయసాగరం ప్రాజెక్టు ఆధునీకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ(జైకా) నిధులతో రెండేళ్లలో పనులు పూర్తి చేయాలని నిర్ణయించింది. ఆయకట్టు చివరి భూములకు సైతం నీళ్లందించి రైతులకు వెన్నుదన్నుగా నిలవాలని భావిస్తోంది. ప్రాజెక్టు ఆధునీకరణ పనులకు రూ.54.36 కోట్ల వ్యయంతో ఈనెల 20న జలవనరులశాఖ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆగస్టు 7న టెండర్ ఖరారు చేయనుంది. ► విజయనగరం జిల్లా సాలూరు మండలం లక్ష్మీపురం వద్ద సువర్ణముఖి నదిపై 1.68 టీఎంసీల సామర్థ్యంతో 1976లో వెంగళరాయసాగరం నిర్మించారు. ఎడమ కాలువ కింద 8,550 ఎకరాలు, కుడి కాలువ కింద 16,150 ఎకరాలు, కుడి గట్టు కాలువ కింద 5 వేల ఎకరాలు వెరసి 29,700 ఎకరాల ఆయకట్టు ఉంది. ► ప్రాజెక్టులో పూడిక పేరుకుపోవడం, స్పిల్ వేలో లోపాలు, గేట్లకు మరమ్మతు చేయకపోవడం, కాలువలు అస్తవ్యస్తంగా మారడంతో ఆయకట్టుకు సక్రమంగా నీళ్లందడం లేదు. ► ఏపీఐఎల్‌ఐపీ రెండో దశలో వెంగళరాయసాగరం ప్రాజెక్టు ఆధునీకరణకు రూ.54.36 కోట్లు కేటాయించారు. ఈ పనులు రెండేళ్లలో పూర్తి చేయాలనే లక్ష్యంతో జలవనరుల శాఖ టెండర్లు పిలిచింది. ► ప్రాజెక్టులో పూడిక తొలగించడం, స్పిల్ వే మరమ్మతులు, గేట్లు బిగించడం.. కాలువలకు లైనింగ్ చేయడం ద్వారా ఆయకట్టు చివరి భూములకు నీళ్లందించనున్నారు. -
రాయలసీమ ఎత్తిపోతలకు నేడు టెండర్ నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: రాయలసీమ ఎత్తిపోతల పనులకు ఈపీసీ (ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్) విధానంలో సోమవారం టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలని జలవనరుల శాఖ నిర్ణయించింది. జ్యుడిషియల్ ప్రివ్యూ ఆమోదించిన ప్రతిపాదనలతో.. 30 నెలల్లో పనులను పూర్తి చేయాలనే షరతుతో టెండర్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఈ పనులకు రూ.3,278.18 కోట్లను ఐబీఎం(అంతర్గత అంచనా విలువ)గా నిర్ణయించింది. సోమవారం ఉదయం 11 గంటల నుంచి ఈ–ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్ నుంచి టెండర్ డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే రోజు నుంచి షెడ్యూళ్లు దాఖలు చేసుకోవచ్చు. టెండర్ షెడ్యూళ్లు దాఖలు చేసే వారు రూ. 10 కోట్లను ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఈఎండీ)గా చెల్లించాలి. – ఆగస్టు 3 మధ్యాహ్నం మూడు గంటల వరకూ టెండర్ డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే రోజున ఐదు గంటల్లోగా షెడ్యూళ్లను దాఖలు చేయాలి. – ప్రీ–బిడ్ సమావేశాన్ని ఈనెల 27న నిర్వహిస్తారు. టెండర్లో పాల్గొనే కాంట్రాక్టర్ల సందేహాలను జలవనరుల శాఖ అధికారులు నివృత్తి చేస్తారు. – వచ్చే నెల 4న ఉదయం 11 గంటలకు సాంకేతిక బిడ్‌ను, 7న ఉదయం 11 గంటలకు ఆర్థిక బిడ్‌ను తెరుస్తారు. – ఆర్థిక బిడ్‌లో తక్కువ ధర(ఎల్–1)కు కోట్ చేసిన కాంట్రాక్టర్ పేర్కొన్న మొత్తాన్నే కాంట్రాక్టు విలువగా పరిగణించి.. 10న ఉదయం 11 గంటల నుంచి ఈ–ఆక్షన్ (రివర్స్ టెండరింగ్) నిర్వహిస్తారు. తక్కువ ధరకు కోట్ చేసిన (ఎల్–1) కాంట్రాక్టర్‌ను ఖరారు చేసి.. వీటిని ఎస్‌ఎల్‌టీసీ (స్టేట్ లెవల్ టెక్నికల్ కమిటీ)కి పంపుతారు. వాటిని ఎస్‌ఎల్‌టీసీ పరిశీలించి ఆమోదించాక కాంట్రాక్టు ఒప్పందం చేసుకోవడానికి అనుమతి ఇస్తుంది. -
కొత్తగా ఏడు నైట్ షెల్టర్లు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు తోడుగా వచ్చిన వారికి ఆస్పత్రుల్లో గాని బయట గాని వసతులు లేక వారు పడుతున్న బాధలు వర్ణనాతీతం. వివిధ జిల్లాల నుంచి వచ్చిన వారు రాత్రివేళల్లో కనీసం నిలువ నీడ లేక ఆస్పత్రి ఆవరణల్లోనూ, సమీపంలోని ఫుట్‌పాత్‌లు, పార్కులు, రోడ్డు డివైడర్ల పైనే కాలం గడుపుతున్నారు. కనీసం మరుగుదొడ్లు, స్నానాలు చేసేందుకు సైతం పలు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారి కోసం నైట్ షెల్టర్ల ఏర్పాటు చేసేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. ఎంపిక చేసిన ఏడు ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద రానున్న చలికాలం లోగా వాటిని ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. గ తేడాది చలికాలంలో బాధితుల వేదనలు వర్ణిస్తూ ‘సాక్షి’లో వెలువడిన కథనానికి స్పందించిన జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ బంజారాహిల్స్‌లోని ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి వద్ద నైట్ షెల్టర్ ఏర్పాటుకు అప్పట్లోనే చర్యలు తీసుకున్నారు. దాని వల్ల ప్రస్తుతం ఎందరికో మేలు జరుగుతోంది. మిగతా ఆస్పత్రుల వద్ద సైతం పేషెంట్లు.. వారికి తోడుగా వచ్చేవారు ఉండేందుకు నైట్ షెల్టర్లు ఏర్పాటు చేస్తామని అప్పట్లోనే ప్రకటించారు. అనంతరం ఆయా ఆస్పత్రుల ఉన్నతాధికారులతో చర్చించి ఇందుకు వారిని ఒప్పించారు. త్వరగా ఆయా ఆస్పత్రుల వద్ద నైట్ షెల్టర్లు అందుబాటులోకి తెచ్చేందుకు నివేదిక రూపొందించాల్సిందిగా కన్సల్టెన్సీలను ఆహ్వానిస్తూ టెండరు నోటిఫికేషన్ జారీ చేశారు. ఒక్కో ఆస్పత్రి వద్ద డిజైన్‌కు తక్కువలో రూ. 69 వేల వంతున ఏడు ఆస్పత్రులకు రూ.4.83 లక్షలకు కన్సల్టెన్సీ సేవలందించేందుకు ముందుకొచ్చిన సంస్థకు సదరు పనులను అప్పగించారు. సంస్థ నుంచి నివేదిక అందగానే నైట్ షెల్టర్ల పనులు ప్రారంభించనున్నారు. అమలుకు నోచని ‘సుప్రీం’ఆదేశాలు.. ఐదు లక్షల జనాభా దాటిన నగరాల్లో ఒక నైట్ షెల్టర్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఆ లెక్కన నగరంలో దాదాపు వంద నైట్ షెల్టర్లు ఉండాలి. కాగా14 మాత్రమే ఏర్పాటు చేయగా వాటిలో 10 సక్రమంగా నడుస్తున్నాయి. పైగా నగరానికి దూరంగా ఏర్పాటు చేయడంతో వాటిని వినియోగించుకునే వారు లేక కొన్నింటిని మూసివేశారు.