సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు తోడుగా వచ్చిన వారికి ఆస్పత్రుల్లో గాని బయట గాని వసతులు లేక వారు పడుతున్న బాధలు వర్ణనాతీతం. వివిధ జిల్లాల నుంచి వచ్చిన వారు రాత్రివేళల్లో కనీసం నిలువ నీడ లేక ఆస్పత్రి ఆవరణల్లోనూ, సమీపంలోని ఫుట్‌పాత్‌లు, పార్కులు, రోడ్డు డివైడర్ల పైనే కాలం గడుపుతున్నారు.
కనీసం మరుగుదొడ్లు, స్నానాలు చేసేందుకు సైతం పలు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారి కోసం నైట్ షెల్టర్ల ఏర్పాటు చేసేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. ఎంపిక చేసిన ఏడు ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద రానున్న చలికాలం లోగా వాటిని ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. గ తేడాది చలికాలంలో బాధితుల వేదనలు వర్ణిస్తూ ‘సాక్షి’లో వెలువడిన కథనానికి స్పందించిన జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ బంజారాహిల్స్‌లోని ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి వద్ద నైట్ షెల్టర్ ఏర్పాటుకు అప్పట్లోనే చర్యలు తీసుకున్నారు. దాని వల్ల ప్రస్తుతం ఎందరికో మేలు జరుగుతోంది.
మిగతా ఆస్పత్రుల వద్ద సైతం పేషెంట్లు.. వారికి తోడుగా వచ్చేవారు ఉండేందుకు నైట్ షెల్టర్లు ఏర్పాటు చేస్తామని అప్పట్లోనే ప్రకటించారు. అనంతరం ఆయా ఆస్పత్రుల ఉన్నతాధికారులతో చర్చించి ఇందుకు వారిని ఒప్పించారు. త్వరగా ఆయా ఆస్పత్రుల వద్ద నైట్ షెల్టర్లు అందుబాటులోకి తెచ్చేందుకు నివేదిక రూపొందించాల్సిందిగా కన్సల్టెన్సీలను ఆహ్వానిస్తూ టెండరు నోటిఫికేషన్ జారీ చేశారు. ఒక్కో ఆస్పత్రి వద్ద డిజైన్‌కు తక్కువలో రూ. 69 వేల వంతున ఏడు ఆస్పత్రులకు రూ.4.83 లక్షలకు కన్సల్టెన్సీ సేవలందించేందుకు ముందుకొచ్చిన సంస్థకు సదరు పనులను అప్పగించారు. సంస్థ నుంచి నివేదిక అందగానే నైట్ షెల్టర్ల పనులు ప్రారంభించనున్నారు.
అమలుకు నోచని ‘సుప్రీం’ఆదేశాలు..
ఐదు లక్షల జనాభా దాటిన నగరాల్లో ఒక నైట్ షెల్టర్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఆ లెక్కన నగరంలో దాదాపు వంద నైట్ షెల్టర్లు ఉండాలి. కాగా14 మాత్రమే ఏర్పాటు చేయగా వాటిలో 10 సక్రమంగా నడుస్తున్నాయి. పైగా నగరానికి దూరంగా ఏర్పాటు చేయడంతో వాటిని వినియోగించుకునే వారు లేక కొన్నింటిని మూసివేశారు.
కొత్తగా ఏడు నైట్ షెల్టర్లు
Published Mon, Sep 15 2014 12:03 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement