Telangana irrigation department
-
ఏఈఈల జీతాల నిలిపివేత.. అలా ఎలా?
సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల శాఖలో 500 మందికి పైగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు ఇటీవల నిర్వహించిన బదిలీలకు ఆర్థిక శాఖ అనుమతి లేకపోవడంతో.. వచ్చే నెలలో వారికి జీతాలు నిలిపివేయాలని డైరెక్టరేట్ ఆఫ్ వర్క్స్ అండ్ అకౌంట్స్ ఆదేశించింది. కాగా, జీవో నంబర్ 193 ఆధారంగానే తమకు బదిలీలు నిర్వహించారని, జీతాలు నిలిపివేత సరికాదని ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో సైతం ఇదే తరహాలో వర్క్స్ అండ్ అకౌంట్స్ విభాగం డైరెక్టర్ తమ జీతాలను నిలిపివేశారని వారు ఆరోపిస్తున్నారు. జీతాలు నిలిపివేస్తే వర్క్స్ అండ్ అకౌంట్స్ డైరెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తామని పేర్కొన్నారు.నీటిపారుదల శాఖలో 1,578 ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నీటిపారుదల శాఖలో 1,597 మంది లస్కర్లు, 281 హెల్పర్లు కలిపి.. మొత్తం 1,878 మందిని ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియమించడానికి అనుమతిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ఈ నెల 18న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టుల భర్తీకి సంబంధిత ప్రాంత ఈఎన్సీ/సీఈల నేతృత్వంలో స్థానిక ఎస్ఈ, స్థానిక డీసీఈలతో స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) జి.అనిల్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.‘గురుకుల’ అభ్యర్థుల ఆందోళనలక్టీకాపూల్ (హైదరాబాద్): గురుకుల నియామక బోర్డు బోధన పోస్టులను నింపే క్రమంలో డిసెండింగ్ విధానం పాటించకపోవడం వల్ల ఒక్కొక్కరికి 2,3,4 పోస్టులు వచ్చాయని, దీని వల్ల 9 వేల పోస్టులలో 3 వేలు మిగిలిపోయాయని తెలంగాణ గురుకుల అభ్యర్థుల (1:2 జాబితా) ప్రతినిధులు ఎండీ ఉస్మాన్, రాజు, టి.ఉమాశంకర్‌లు పేర్కొన్నారు. పోస్టులు నింపే క్రమంలో ముందుగా పీజీటీ, టీజీటీ, జేఎల్, డీఎల్ పోస్టింగ్‌లు ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. శుక్రవారం తమకు న్యాయం చేయాలంటూ ప్రజాభవన్ వద్ద అభ్యర్థులు బైఠాయించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నుంచి స్పష్టమైన సమాధానం వచ్చేంత వరకు ఇక్కడే ఉంటామంటూ పట్టుపట్టారు. జీవో నం.81ని సడలించి తమకు న్యాయంగా రావాల్సిన ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.చదవండి: రేవంత్ డౌన్ డౌన్.. బెటాలియన్ పోలీసుల ధర్నా! టీజీఎస్పీ సిబ్బంది సెలవుల్లో మార్పులు నిలిపివేత సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పోలీస్ (టీజీఎస్పీ) సిబ్బంది సెలవుల్లో మార్పులు చేస్తూ ఈ నెల 10న ఇచ్చిన మెమోను తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకు నిలిపివేస్తున్నట్లు టీజీఎస్పీ అదనపు డీజీ సంజయ్‌కుమార్ జైన్ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. సెలవుల అంశంపై ఇచ్చిన ఉత్తర్వులు సిబ్బందిని అయోమయానికి గురిచేసినట్లు తన దృష్టికి రావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బెటాలియన్లలో సిబ్బంది సమస్యలను తెలుసుకునేందుకు దర్బార్లు ఏర్పాట్లు చేసి వారితో మాట్లాడాలని, ఆ సమస్యలు తన దృష్టికి తేవాలని అన్ని బెటాలియన్ల కమాండెంట్లను సంజయ్‌కుమార్ జైన్ ఆదేశించారు. బెటాలియన్లలో పనిచేసే సిబ్బంది, వారి కుటుంబాల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తామని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. సిబ్బంది వ్యక్తిగతంగా తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తేవొచ్చని తెలిపారు. అందుకు tgspcontrol@gmail.com లేదా గ్రీవెన్స్ నంబర్ 8712658531కు తెలియజేయాలని స్పష్టం చేశారు. -
శ్రీశైలం జలాశయం ఖాళీ!
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం జలాశయంలో నిల్వలు అడుగంటిపోతున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పోటాపోటీగా సాగునీరు, విద్యుదుత్పత్తి అవసరాలకు జలాశయం నుంచి నీళ్లను తరలించడంతో జలాశయంలో నిల్వలు కనీస నీటి మట్టానికి దిగువన పడిపోయాయి. శ్రీశైలం జలాశయం గరిష్ట నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, గురువారం నాటికి కేవలం 51.92 టీఎంసీల నిల్వలు మాత్రమే మిగిలాయి. జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా.. సాగునీటి అవసరాలకు 854 అడుగులు, విద్యుదుత్పత్తి అవసరాలకు 834 అడుగుల కనీస నీటి మట్టం(ఎండీడీఎల్) ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం నీటి మట్టం 830 అడుగులకు పడిపోయింది. సాగునీటి, తాగునీటి అవసరాల పరిరక్షణ కోసం తక్షణమే శ్రీశైలం జలాశయంలో విద్యుదుత్పత్తిని నిలుపుదల చేసేలా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను ఆదేశించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ రెడ్డి తాజాగా కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ)కి లేఖ రాశారు. నిల్వల్లో ఏపీకి మిగిలింది 13 టీఎంసీలే ! తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో ప్రస్తుత నీటి సంవత్సరంలో మొత్తం 932.07 టీఎంసీల జలాల లభ్యత ఉండగా, ఇప్పటికే 725.51 టీఎంసీలను రెండు రాష్ట్రాలు వాడుకున్నాయి. మొత్తం లభ్యత జలాల్లో తాత్కాలిక కేటాయింపుల నిష్పత్తి 66: 34 ప్రకారం ఏపీకి 615.17 టీఎంసీలు, తెలంగాణకు 316.90 టీఎంసీల వాటా ఉంది. ఇప్పటికే ఏపీ 542.45 టీఎంసీలను వాడుకోగా, ఆ రాష్ట్రం పరిధిలోని ఇతర జలాశయాల్లో నిల్వ ఉన్న 59.68 టీఎంసీల కృష్ణా జలాలను కలుపుకుని ఆ రాష్ట్రం మొత్తం 602.13 టీఎంసీలను వాడుకున్నట్టు అయింది. తెలంగాణ 183.05 టీఎంసీలను వాడుకోగా, ఇక్కడి ఇతర జలాశయాల్లోని 10.2 టీఎంసీల నిల్వలు కలిపి మొత్తం 193.26 టీఎంసీలను వాడుకున్నట్టు అయింది. ప్రస్తుతం శ్రీశైలం, సాగర్ జలాశయాల్లో 136.67 టీఎంసీల నిల్వలు మిగిలి ఉండగా, అందులో ఏపీకి 13.03 టీఎంసీలు, తెలంగాణకు 123.63 టీఎంసీల కోటా ఉందని తెలంగాణ పేర్కొంటోంది. కల్వకుర్తి ఎత్తిపోతలకు కష్టకాలమే ! శ్రీశైలం జలాశయంలో 800.52 అడుగుల కనీస నీటి మట్టం ఉంటేనే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 2.38లక్షల ఎకరాల ఆయటకట్టుకు సాగునీటితో పాటు మహబూబ్‌నగర్ జిల్లాకు తాగునీటి సరఫరాకు వీలు కానుంది. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా సాగునీటి అవసరాలకు 13.6 టీఎంసీలు, తాగునీటి అవసరాలకు 4.40 టీఎంసీలు కలిపి మొత్తం 18టీఎంసీలు అవసరం. ప్రస్తుతం జలాశయంలో 51టీఎంసీలే మిగిలి ఉండగా, రెండు రాష్ట్రాలు విద్యుదుత్పత్తి కొనసాగిస్తుండడంతో నిల్వలు వేగంగా పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సాగు, తాగునీటి అవసరాలను పరిరక్షించడానికి తక్షణమే రెండు రాష్ట్రాలతో జలవిద్యుత్ ఉత్పత్తిని నిలుపుదల చేయించాలని కృష్ణా బోర్డుకు తెలంగాణ నీటిపారుదల శాఖ కోరింది. గతేడాది శ్రీశైలం జలాశయంలో నిల్వలు డెడ్‌స్టోరేజీకి పడిపోవడంతో మహబూబ్‌నగర్ జిల్లా వేసవి తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం జలాశయంలో రివర్స్ పంపింగ్ ద్వారా నీళ్లను ఎత్తిపోయాల్సి వచ్చింది. నేడు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో మిగిలి ఉన్న నిల్వలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు పంపిణీ చేసేందుకు శుక్రవారం ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణా బోర్డు నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సమావేశం కానుంది. ఈ కమిటీలో కృష్ణా బోర్డు కన్వీనర్‌తో పాటు ఏపీ, తెలంగాణ నీటిపారుదల శాఖల ఈఎన్సీలు పాల్గొననున్నారు. రబీ ఆయకట్టుతో పాటు వేసవి తాగునీటి అవసరాల కోసం రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులపై నిర్ణయం తీసుకోనున్నారు. -
ఎన్జీటీ ఆదేశాలపై సుప్రీంకు
సాక్షి, హైదరాబాద్: పర్యావరణ అనుమతులు లేకుండా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల నిర్మాణాన్ని చేపట్టినందుకు రూ. 920.85 కోట్ల భారీ జరిమానాను విధిస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వారం రోజుల్లో సుప్రీం కోర్టు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనున్నట్టు రాష్ట్ర నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు సంబంధించి వేర్వేరు పిటిషన్లు వేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఆ రెండు ఎత్తిపోతల పథకాల తొలి దశ పనులను కేవలం తాగునీటి అవసరాల కోసమే చేపట్టినందున పర్యావరణ అనుమతుల నుంచి మినహాయింపు ఉందని తెలంగాణ వాదిస్తోంది. పర్యావరణ అనుమతులు వచ్చిన తర్వాతే రెండో దశ కింద సాగునీటి అవసరాలకు సంబంధించిన పనులు చేపడతామని పేర్కొంటోంది. ఈ విషయంలో తెలంగాణ వాదనలను పరిగణనలోకి తీసుకోకుండా ఎన్జీటీ ఏకపక్ష నిర్ణయం తీసుకుందంటూ సుప్రీం కోర్టులో వాదనలు వినిపించాలని నిర్ణయించింది. ఎన్జీటీ తీర్పు విషయంలో అవలంబించాల్సిన భవిష్యత్తు కార్యాచరణపై నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ ఇటీవల న్యాయనిపుణులతో సమావేశమై చర్చించారు. ఎన్జీటీ తీర్పును సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాత వచ్చే వారం సుప్రీం కోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.528 కోట్లు, డిండి ప్రాజెక్టుకు రూ. 92.85 కోట్లను పర్యావరణ పరిహారంగా చెల్లించడంతో పాటు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై విధించిన స్టేను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించి పనులు కొనసాగించినందుకు మరో రూ.300 కోట్ల జరిమానాను విధిస్తూ ఎన్జీటీ గత నెలలో ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వంతో పాటు ఆ రాష్ట్రంలోని మరో 9 మంది ప్రైవేటు వ్యక్తులు వేసిన కేసు విషయంలో ఈ నిర్ణయం తీసుకుంది. -
‘పాలమూరు’ అవసరమని ప్రధానే అన్నారు
సాక్షి, హైదరాబాద్: కరువుపీడిత ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఆవశ్యకతను 2014లో మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ స్వయంగా ప్రస్తావించారని, అందువల్ల ఈ ప్రాజెక్టుకు సత్వరమే అనుమతులు జారీ చేయాలని కేంద్ర జల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ప్రాజెక్టుకు అనుమతులపై సీడబ్ల్యూసీలోని ప్రాజెక్టు అప్రైజల్ ఆర్గనైజేషన్ (పీపీవో) చీఫ్ ఇంజనీర్‌కు బుధవారం రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో ప్రధాని నాడు చేసిన ప్రసంగాన్ని సైతం ప్రదర్శించింది. ఉమ్మడి ఏపీలో 2013 ఆగస్టు 8న ప్రాజెక్టు సమగ్ర సర్వే కోసం రూ. 6.91 కోట్లను విడుదల చేస్తూ జీవో నంబర్ 72 జారీ చేసిన విషయాన్ని గుర్తుచేసింది. 60 రోజుల్లో 90 టీఎంసీలను తరలించేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు వివరించింది. శ్రీశైలం జలాశయంలో అన్ని అవసరాలు పోనూ మిగిలిన 230 టీఎంసీల్లో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులైన పాలమూరు–రంగారెడ్డికి 90 టీఎంసీలు, శ్రీశైలం ఎడమగట్టు కాల్వకు 40 టీఎంసీలు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 40 టీఎంసీలు, డిండి ఎత్తిపోతల పథకానికి 30 టీఎంసీల నీటి లభ్యత ఉందని రాష్ట్రం స్పష్టం చేసింది. రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్సీ సి.మురళీధర్, పాలమూరు–రంగారెడ్డి చీఫ్ ఇంజనీర్ హమీద్ ఖాన్ హాజరయ్యారు. శ్రీశైలంలో 582.5 టీఎంసీల లభ్యత.. 75 శాతం డిపెండబులిటీ (వందేళ్లలో కచ్చితంగా వచ్చిన 75 ఏళ్ల వరద) ఆధారంగా శ్రీశైలం జలాశయంలో 582.5 టీఎంసీల నీటి లభ్యత ఉందని, ఇందులో నాగార్జునసాగర్ అవసరాలకు 280 టీఎంసీలు, హైదరాబాద్ తాగునీటికి 16.5 టీఎంసీలు, చెన్నై నగర తాగునీటి అవసరాలకు 15 టీఎంసీలు, ఎస్సార్బీసీకి 19 టీఎంసీలు, 22 టీఎంసీల ఆవిరి నష్టా లు కలుపుకుని మొత్తం 352.50 టీఎంసీలు అవసరమని, మిగిలిన 230 టీఎంసీల్లో కృష్ణా బేసిన్ ప్రాజెక్టు అయిన పాలమూరు–రంగారెడ్డికి 90 టీఎంసీలు అవసరమని తెలంగాణ తెలిపింది. మైనర్ ఇరిగేషన్లో పొదుపు చేసిన 45 టీఎంసీలతోపాటు పోలవరం ప్రాజెక్టు ద్వారా కృష్ణా బేసిన్‌కు తరలించే 80 టీఎంసీల గోదావరి జలాలకు బదులుగా నాగార్జునసాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలు 80 టీఎంసీల కృష్ణా జలాలు వాడుకోవాలని 1978 ఆగస్టు 4న బచావత్ ట్రిబ్యునల్ ముందు ఒప్పందం జరిగిన విషయాన్ని తెలంగాణ గుర్తుచేసింది. ఈ ఒప్పందం ప్రకారం 35 టీఎంసీలు మహారాష్ట్ర, కర్ణాటకలు వాడుకోగా మిగిలిన 45 టీఎంసీలను పాలమూరు–రంగారెడ్డికి కేటాయించామని తెలిపింది. తెలంగాణలో మైనర్ ఇరిగేషన్ అవసరాలకు 90.81 టీఎంసీలను బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిందని, 2012– 13 నుంచి 2021–22 మధ్య 45.15 టీఎంసీలను మైనర్ ఇరిగేషన్లో పొదుపు చేసినట్లు తెలియజేసింది. ఇలా పొదుపు చేసిన 45 టీఎంసీలతోపాటు పోలవరం ద్వారా గోదావరి జలాల తరలింపుతో లభించనున్న 45 టీఎంసీలను పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయించినట్టు వివరించింది. రూ. 55 వేల కోట్లకు పెరిగిన వ్యయం.. తొలిదశలో నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణపేట, వికారాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలు, హైదరాబాద్ నగరంతోపాటు 1,226 గ్రామాలకు తాగునీటి అవసరాల కోసం పనులు చేపట్టేందుకు గతంలో ఎన్జీటీ సైతం అనుమతిచ్చిందని తెలంగాణ తెలిపింది. గత ఆగస్టు 24న రెండోదశ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు వివరించింది. 2015లో రూ. 35,200 కోట్ల అంచనాలతో ఈ ప్రాజెక్టును ప్రారంభించగా ప్రస్తుతం రూ. 55,086 కోట్లకు పెరిగిందని తెలిపింది. -
శ్రీశైలంపై తెగని పంచాయితీ
సాక్షి, హైదరాబాద్: రిజర్వాయర్ల నిర్వహణ కమిటీ (ఆర్ఎంసీ) చివరి సమావేశం సోమవారం రెండోరోజు కొనసాగగా.. తెలంగాణ అధికారుల గైర్హాజరుతో ఎలాంటి ఫలితం లేకుండానే ముగిసింది. గత శనివారం జలసౌధలో జరిగిన మొదటిరోజు సమావేశానికి ఏపీ, తెలంగాణ అధికారులు హాజరై.. ఆర్ఎంసీ ప్రతిపాదించిన ముసాయిదా నివేదికలోని పలు అంశాలపై ఏకాభిప్రాయం తెలపడంతో పాటు సమావేశాన్ని సోమవారం కూడా కొనసాగించి తుది నివేదికపై సంతకాలు చేయాలని నిర్ణయించారు. శ్రీశైలం జలాశయం రూల్‌కర్వ్ (నిర్వహణ నిబంధనలు)లో స్వల్ప మార్పులకు రెండు రాష్ట్రాలు ఓకే అన్నాయి. తాగు, సాగునీటి అవసరాలకు నష్టం కలగకుండా శ్రీశైలంలో జల విద్యుదుత్పత్తిని నియంత్రించాలనే మరో నిబంధనకు కూడా అంగీకారం తెలిపాయి. తీరా సోమవారం నాటి సమావేశానికి తెలంగాణ అధికారులు గైర్హాజరు కావడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. కృష్ణా బోర్డు సభ్యులు, ఆర్ఎంసీ కన్వీనర్ బి.రవికుమార్ పిళ్లై నేతృత్వంలో సోమవారం కమిటీ సమావేశం కాగా, ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ సి.నారాయణరెడ్డితో పాటు ఆ రాష్ట్ర అధికారులు హాజరయ్యారు. తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్‌తో పాటు ఇతర అధికారుల రాకకోసం దాదాపు అర్ధగంటకు పైగా నిరీక్షించారు. ఈ విషయాన్ని పిళ్లై తెలంగాణ ఈఎన్సీకి ఎస్ఎంఎస్ ద్వారా తెలపగా, తాము రావడం లేదని ఆయన బదులిచ్చారు. దీంతో ఏపీ ఈఎన్సీ, ఏపీ జెన్కో డైరెక్టర్ (హైడల్) నుంచి తుది నివేదికపై సంతకాలను సేకరించిన ఆర్ఎంసీ కన్వీనర్ ఎలాంటి చర్చ లేకుండానే సమావేశాన్ని ముగించారు. విఫలమైన ఆర్ఎంసీ ప్రయత్నాలు శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో ఎంత మేరకు నిల్వలుంటే ఎంత మేర జలాలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు తాగునీరు, సాగునీరు, జలవిద్యుదుత్పత్తి అవసరాలకు వాడుకోవాలి అన్న అంశం రూల్‌కర్వ్‌లో ఉంటుంది. రెండు జలాశయాల రూల్‌కర్వ్‌తో పాటు జలవిద్యుదుత్పత్తి, మిగులు జలాల వినియోగంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి నివేదికను సిఫారసు చేసేందుకు ఆర్ఎంసీ కమిటీని..కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఏర్పాటు చేసింది. ఆరుసార్లు సమావేశమైన ఆర్ఎంసీ రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదుర్చేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. అయితే చివరి సమావేశం రెండో రోజు భేటీకి తెలంగాణ అధికారులు గైర్హాజరు కావడంతో ఆర్ఎంసీ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆర్ఎంసీ తన తుది నివేదికలో చేయనున్న సాంకేతిక సిఫారసులు అమల్లోకి వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఆర్ఎంసీ తుది నివేదికపై ఏపీ తరఫున తాము సంతకాలు చేసినట్లు ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తెలిపారు. కనీస నిల్వ 830 అడుగులు చాలు శ్రీశైలంలో కనీస నిల్వ మట్టం 854 అడుగులుండాలని ప్రతిపాదించడాన్ని తాము అంగీకరించడం లేదని, 830 అడుగులుంటే సరిపోతుందని స్పష్టం చేశారు. పోతిరెడ్డిపాడు ద్వారా 34 టీఎంసీలను మాత్రమే ఏపీ తరలించుకోవాలన్న నిబంధననను రూల్‌కర్వ్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు. వరదల తర్వాత శ్రీశైలం, సాగర్ జలాశయాల నుంచి అదనపు జలాలను తరలించుకోవడానికి ఏపీ అంగీకరిస్తేనే మిగులు జలాల వినియోగం విషయంలో ఆ రాష్ట్రంతో ఒప్పందం చేసుకుంటామని తెలిపారు. ఏపీ, తెలంగాణ మధ్య 50:50 నిష్పత్తిలో కృష్ణా జలాల తాత్కాలిక బట్వాడా జరపాలని, వాడని కోటాను వచ్చే ఏడాదికి క్యారీ ఓవర్ చేయాలని సూచించారు. ముసాయిదా నివేదికలో తెలంగాణకి ప్రయోజనం కలిగించే అంశాలేమీ లేవని, తమకు ఆమోదయోగ్యం కాని ఈ నివేదికను నిలుపుదల చేయాలని కృష్ణా బోర్డు చైర్మన్‌ను కోరారు. పిళ్లై తప్పుడు వార్తలు రాయించారు మా వైఖరిలో మార్పు లేదు: తెలంగాణ ఆర్ఎంసీ నివేదికకు అంగీకరిస్తూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నట్టు ఆర్ఎంసీ కన్వీనర్ రవికుమార్ పిళ్లై మీడియాలో తప్పుడు వార్తలు రాయించారంటూ తెలంగాణ తీవ్ర ఆరోపణలు చేసింది. సరైన వాస్తవాలను మీడియాకు తెలియజేయాలని ఆయన్ను ఆదేశించాలని కృష్ణా బోర్డును కోరింది. నీటి వాటాలు, విద్యుత్ వాటాలు, క్యారీ ఓవర్ నిల్వలు, వరద జలాల లెక్కింపుపై తమ రాష్ట్ర వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఆర్ఎంసీ తుది సమావేశం ముగిసిన తర్వాత రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్.. కృష్ణా బోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు. 50:50 నిష్పత్తిలో శ్రీశైలం విద్యుత్‌ను పంచుకోవాలంటూ తమకిచ్చిన ముసాయిదా నివేదికలో ఆర్ఎంసీ చేసిన సిఫారసును అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. విద్యుదుత్పత్తి అవసరాలకే శ్రీశైలం జలాశయం ఉందని, జల విద్యుదుత్పత్తితో 240 టీఎంసీలను విడుదల చేయడం ద్వారా నాగార్జునసాగర్ కింద తాగు, సాగునీటి అవసరాలను తీర్చాల్సి ఉంటుందని తెలిపారు. -
8 నుంచి సంయుక్త సర్వే!
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌తో తెలంగాణ రాష్ట్రంలో ఉండనున్న ముంపు ప్రభావంపై ఈ నెల 8 నుంచి పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణ నీటిపారుదల శాఖలు సంయుక్త సర్వే నిర్వహించనున్నాయి. పోలవరం డ్యాంలో ఎఫ్ఆర్ఎల్ 150 మీటర్ల మేరకు గరిష్ట స్థాయిలో నీళ్లను నిల్వ చేస్తే బ్యాక్‌వాటర్ వల్ల తెలంగాణలో 890 ఎకరాలు, 203 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని ఇటీవల తెలంగాణ నిర్వహించిన సర్వేలో తేలింది. మరోవైపు పోలవరం బ్యాక్ వాటర్‌తో కిన్నెరసాని నది ఎగువన 18 కి.మీల వరకు, ముర్రెడు వాగు ఎగువన 6 కి.మీల వరకు ముంపు పభ్రావం ఉంటోందని ఇప్పటికే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) నిర్వహించిన సర్వేలో స్పష్టమైంది. కాంగ్రెస్ నేత శ్రీనివాస్‌రెడ్డి వేసిన కేసు విషయంలో ఎన్జీటీ ఈ మేరకు చర్యలు తీసుకుంది. ఎన్జీటీ ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో ప్రభావిత ప్రాంతాలను గుర్తించి నిర్థారించడానికి సంయుక్త సర్వే జరపాలని పీపీఏ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు ఉప నదులతో పాటు మరో 34 ఉప నదులు/వాగులపై పోలవరం బ్యాక్‌వాటర్‌తో ఉండనున్న ప్రభావంపై సర్వే జరపాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. ఈ ఉప నదుల ప్రవాహం గోదావరిలో కలవకుండా పోలవరం బ్యాక్‌వాటర్ అడ్డంకిగా మారుతోంది. దీంతో ఈ ఉపనదులు/వాగుల్లో ప్రవాహం వెనక్కి తన్నుతుండడంతో పరిసర ప్రాంతాలు ముంపునకు గురి అవుతాయని ఇప్పటికే ఎన్నోసార్లు తెలంగాణ రాష్ట్రం కేంద్రానికి లేఖలు రాసింది. పోలవరంతో గోదావరి నది పొడవునా ఉండనున్న ముంపు ప్రభావంపై సర్వే జరిపించాలని తెలంగాణ కోరుతోంది. వరద రక్షణ గోడల విషయంలో తెలంగాణ డిమాండ్ పట్ల పోలవరం అథారిటీ సానుకూలంగా స్పందించింది.. గోదావరికి ఇరువైపులా కరకట్టలు నిర్మించేందుకు కానున్న వ్యయంపై అంచనాలను సమర్పించాలని తెలంగాణ రాష్ట్రాన్ని కోరినట్టు తెలిసింది. సంయుక్త సర్వేలో తేలిన విషయాల ఆధారంగా ముంపు ప్రాంతాల్లోని బాధితులకు పునరావాసం కల్పించే అంశంపై పీపీఏ నిర్ణయం తీసుకోనుంది. -
కాళేశ్వరం అనుమతులు పునరుద్ధరించాలి
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండడాన్ని కారణంగా చూపి, కాళేశ్వరం ప్రాజెక్టు అదనపు టీఎంసీ పనులకు అనుమతులు జారీ చేసే ప్రక్రియను గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్ఎంబీ) నిలిపివేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టింది. అనుమతుల ప్రక్రియను పునరుద్ధరించేలా గోదావరి బోర్డును ఆదేశించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ కేంద్ర జలశక్తి శాఖకు బుధవారం లేఖ రాశారు. అనుమతులు లేకుండా చేపట్టిన అదనపు టీఎంసీ పనుల విషయంలో మాత్రమే యధాతథాస్థితి కొనసాగించాలని సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని లేఖలో స్పష్టం చేశారు. అన్ని అనుమతులున్న కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగానే అదనపు టీఎంసీ పనులను చేపట్టినట్టు ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా కలసి నివేదించినట్టు గుర్తు చేశారు. గెజిట్ నోటిఫికేషన్లో పొందుపర్చిన అనుమతి లేని జాబితాల నుంచి అదనపు టీఎంసీ పనుల భాగాన్ని తొలగించాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర జలశక్తి శాఖ మధ్య ఈ ప్రాజెక్టు విషయంలో ఆ తర్వాత కాలంలో సమగ్ర చర్చలు జరిగాయన్నారు. సీడబ్ల్యూసీ కోరిన అన్ని రకాల సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందజేసిందని వివరించారు. ఆ తర్వాతే ఈ ప్రాజెక్టుకు అనుమతుల విషయంలో తదుపరి చర్యలు తీసుకోవాలని గోదావరి బోర్డుకు సీడబ్ల్యూసీ సిఫారసు చేసిందన్నారు. ఈ దశలో అనుమతుల ప్రక్రియను గోదావరి బోర్డు నిలుపుదల చేస్తే ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యంతో పాటు రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అనుమతుల ప్రక్రియను సత్వరంగా పూర్తి చేయాలని గోదావరి బోర్డును ఆదేశించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. గోదావరి బోర్డు అత్యుత్సాహం.. సీడబ్ల్యూసీ సిఫారసు చేసిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు సవరణ డీపీఆర్‌కు అనుమతుల ప్రక్రియను నిలుపుదల చేసే అధికారం గోదావరి బోర్డుకు లేదని నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు అంటున్నారు. డీపీఆర్‌ను పరిశీలించిన తర్వాత వాటిని బోర్డు సమావేశంలో ఉంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అభిప్రాయాలను గోదావరి బోర్డు స్వీకరించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఆ తర్వాత సీడబ్ల్యూసీలోని టెక్నికల్ అడ్వైయిజరీ కమిటీ (టీఏసీ)కి డీపీఆర్‌ను గోదావరి బోర్డు పంపించాల్సి ఉంటుందని ఓ అధికారి తెలిపారు. టీఏసీ క్లియరెన్స్ లభించిన తర్వాత అపెక్స్ కౌన్సిల్లో చర్చించి ప్రాజెక్టుకు అనుమతి ఇస్తారని అధికారులు చెపుతున్నారు. అనుమతుల ప్రక్రియను నిలుపుదల చేసి గోదావరి బోర్డు అత్యుత్సాహం ప్రదర్శించిందని విమర్శిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సవరణ డీపీఆర్‌ను బోర్డు వెనక్కి తిప్పి పంపలేదని, కేవలం పరిశీలన జరపడానికి నిరాకరించిందని ఓ అధికారి తెలిపారు. -
‘ఆర్ఎంసీ’ నివేదికపై రాష్ట్రం అభ్యంతరం.. కృష్ణా బోర్డుకు లేఖ
సాక్షి, హైదరాబాద్: జలాశయాల నిర్వహణ కమిటీ(ఆర్ఎంసీ) ముసాయిదా నివేదికలో తమ ప్రతిపాదనలేవీ చేర్చకపోవడం పట్ల తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ ప్రతిపాదనలను మాత్రమే నివేదికలో చేర్చడంపై తప్పుబట్టింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ మంగళవారం కృష్ణా బోర్డు సభ్యులు, ఆర్ఎంసీ కన్వీనర్‌కు లేఖ రాశారు. శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రాల విద్యుత్‌ను తెలంగాణ, ఏపీ మధ్య 76:24 నిష్పత్తిలో పంపకాలు జరపాలని మరోసారి ఆయన పునరుద్ఘాటించారు. కృష్ణా డెల్టా ఆయకట్టుకు నాగార్జునసాగర్ నుంచి నీళ్లు విడు దల చేయరాదని, శ్రీశైలం జలాశయం నుంచి 34 టీఎంసీలకు మించి నీళ్లను ఏపీ తరలించరాదని.. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాలను 50:50 నిష్పత్తిలో బట్వాడా చేయాలన్న నిబంధనలను రూల్‌కర్వ్‌లో పొందుపర్చాలని ఆయన సూచించారు. ఈ మేరకు ఆర్ఎంసీ సమావేశంలో తెలంగాణ చేసిన ఈ ప్రతిపాదనలను ముసాయిదా నివేదికలో పొందుపర్చాలని డిమాండ్ చేశారు. -
హంద్రీనీవా, గాలేరునగరి విస్తరణను అడ్డుకోండి
సాక్షి, హైదరాబాద్: కృష్ణాజలాలను పరీవాహక ప్రాంతం బయటకు తరలించేలా హంద్రీనీవా సుజల స్రవంతి, గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టుల విస్తరణను ఏపీ ప్రభుత్వం చేపడుతోందని తెలంగాణ ఆక్షేపించింది. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం–2014 ప్రకారం కృష్ణాజలాలపై ఎలాంటి ప్రాజెక్టు చేపట్టాలన్నా కృష్ణానదీ యాజమాన్యబోర్డు(కేఆర్ఎంబీ), అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తప్పనిసరని తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్‌రావు కేఆర్ఎంబీ చైర్మన్ మహేంద్రప్రతాప్ సింగ్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న ఆయా ప్రాజెక్టుల విస్తరణను అడ్డుకోవాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. కేంద్ర అటవీ, పర్యావరణ మార్పుల మంత్రిత్వశాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి పర్యావరణ మదింç³# అథారిటీలకు కూడా విడివిడిగా రాసిన లేఖలో్లనూ విస్తరణ ప్రాజెక్టులకు ఇచ్చిన పర్యావరణ అనుమతి(ఈసీ) అమలు కాకుండా నిలిపివేయాలని కోరారు. ఈ విస్తరణ ప్రాజెక్టులను అడ్డుకోవాలని పలుమార్లు కృష్ణాబోర్డుకు లేఖలు రాసిన విషయాన్ని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020 ఆగస్టు 26న గాలేరునగరి నుంచి హంద్రీనీవాకు నీటితరలింపు నిమిత్తం రూ.5,036 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిపాదించిందని వివరించారు. గాలేరునగరి కాలువ 56 కిలోమీటర్ల దూరం మధ్యలో ఉన్న చెరువులకు 15.53 టీఎంసీల కృష్ణాజలాలను తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆ వివరాలివ్వండి ప్లీజ్ శ్రీశైలం–నాగార్జునసాగర్ రూల్‌కర్వ్ ముసాయిదా రూపొందించడానికి ప్రమాణాలేంటీ, ఏ ప్రాతిపదికన రూల్‌కర్వ్ సిద్ధం చేశారో ఆధారాల్విండంటూ మరో లేఖను ఈఎన్సీ మురళీధర్‌రావు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు రాశారు. దీనిపై కేఆర్ఎంబీ స్పందిస్తూ ‘కేఆర్ఎంబీకి సహకరించండి. తెలుగు రాష్ట్రాల మధ్య దీర్ఘకాలంగా ఉన్న వి వాదాలను పరస్పర అంగీకారంతో పరిష్కరించడానికే సమావేశం ఏర్పాటు చేశాం’అంటూ ప్రత్యుత్తరం ఇచ్చింది. ఆ లేఖపై స్పందిస్తూ శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ స్టేక్ హోల్డర్ కావడం వల్ల, ఈ ప్రాజెక్టు వల్ల ప్రత్యక్షంగా ప్రభావితం అవుతున్నదని జల వనరుల సంఘం, ప్రణాళిక సంఘం శ్రీశైలం ప్రాజెక్టును ఆమోదించిన పత్రాలు ఇవ్వాలని పదేపదే విజ్ఞప్తి చేస్తున్నట్లు మురళీధర్‌రావు కోరారు. 1977లో జరిగిన అంతర్రాష్ట్ర ఒప్పందం, శ్రీశైలం కుడి కాల్వతోపాటు పోతిరెడ్డిపాడుకు కేంద్రం అను మ తి జారీచేసిన పత్రాలు ఇవ్వాలని కోరు తున్నా మ న్నారు. రూల్‌కర్వ్ ఎలానిర్ణయించారో తెలుసుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. -
834 అడుగులు చాలు.. లేదు 854 ఉండాల్సిందే
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం జలాశయంపై తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య మళ్లీ తీవ్ర వాగ్వివాదం జరిగింది. శ్రీశైలం ప్రాజెక్టును విద్యుదుత్పత్తి కోసమే నిర్మించారని, జలాశయం నుంచి నీటిని వాడుకోవడానికి ఉండాల్సిన కనీస నీటిమట్టం 834 అడుగులు మాత్రమేనని తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ స్పష్టం చేశారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఏపీ జల వనరుల శాఖ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి.. శ్రీశైలం ప్రాజెక్టులో లభ్యతగా ఉన్న జలాల్లో సాగు, తాగునీటి అవసరాలకే ప్రాధాన్యం ఇవ్వాలని నొక్కిచెప్పారు. జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు కనీస మట్టం 854 అడుగుల స్థాయిలో నీటి నిల్వ ఉండేలా చూడాలని సూచించారు. కృష్ణా బోర్డు సభ్యుడు ఆర్కే పిళ్లై అధ్యక్షతన గురువారం జలసౌధలో కృష్ణా బోర్డు రిజర్వాయర్ల నిర్వహణ కమిటీ (ఆర్ఎంసీ) సమావేశం జరిగింది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల రూల్ కర్వ్ (నిర్వహణ నియమావళి), జలవిద్యుత్ ఉత్పత్తి, వరద జలాల మళ్లింపుపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టు కనీస నీటిమట్టాన్ని 854 అడుగులుగా నిర్ధారిస్తూ సీడబ్ల్యూసీ రూల్ కర్వ్ రూపొందించిందంటూ ఆర్కే పిళ్లై ఏపీ వాదనను సమర్థించారు. ఆ స్థాయిలో నీటిని నిల్వ చేస్తేనే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీళ్లందించగలమని ఏపీ ఈఎన్సీ పేర్కొన్నారు. జూలై 1 నుంచి అక్టోబర్ 31 వరకు కాకుండా, ఒకనెల ముందే అంటే.. జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు కనీసం 854 అడుగుల్లో నీరు నిల్వ ఉండేలా చూడాలని ఆయన ప్రతిపాదించారు. నాగార్జునసాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను ఏపీకి అప్పగించాలని డిమాండ్ చేశారు. వరద జలాలపై ఏకాభిప్రాయం జూరాల నుంచి ప్రకాశం బ్యారేజీ వరకూ అన్ని ప్రాజెక్టులు నిండి.. గేట్లు ఎత్తేసి సముద్రంలోకి జలాలను విడుదల చేస్తున్న సమయంలో మళ్లించే వరద జలాలను వాటా (నికర జలాలు)లో కలపకూడదని ఏపీ ఈఎన్సీ కోరారు. దీనిపై తెలంగాణ ఈఎన్సీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. మళ్లించిన వరద జలాలను నిల్వ చేసుకునే సామర్థ్యం ఏపీకి అధికంగా ఉందని.. కాబట్టి అందులో వాటా ఇవ్వాలని కోరారు. పిళ్లై జోక్యం చేసుకుంటూ మళ్లించే వరద జలాలను లెక్కిస్తామని, కానీ వాటిని నికర జలాల్లో కలపబోమని స్పష్టం చేశారు. ఇందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేసిన అంశాలపై బోర్డుకు నివేదిక ఇస్తామని, ఈనెల మూడో వారంలో మళ్లీ ఆర్ఎంసీ సమావేశం నిర్వహిస్తామని పిళ్లై చెప్పారు. చెరిసగం విద్యుత్‌పైనే అంగీకారం –తెలంగాణ ఈఎన్సీ ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్‌లలో నిల్వ ఉన్న నీటిలో 66 శాతం ఏపీ, 34 శాతం తెలంగాణకు వాటా ఉందని.. ఈ లెక్కన శ్రీశైలంలో ఉత్పత్తయ్యే విద్యుత్‌ను 66 శాతం వాటా ఇవ్వాలని ఏపీ ఈఎన్సీ డిమాండ్ చేశారు. దీనిపై తెలంగాణ ఈఎన్సీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఉత్పత్తయ్యే విద్యుత్ చెరి సగం పంచుకునేలా మొదట్లోనే అంగీకారం కుదిరిందని అన్నారు. విద్యుదుత్పత్తి అంశం ముగిసిన అధ్యాయమని, దాన్ని మళ్లీ తిరగదోడవద్దని చెప్పారు. -
అ‘ధనం’ ఇచ్చినా అందుకోలేదు..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాల పూర్తికి.. పెరిగిన ధరలకు అనుగుణంగా కాంట్రాక్టర్లకు అదనపు ధరలు చెల్లించేందుకు వీలుగా ప్రభుత్వం వెసులుబాటు కల్పించినా ఇంతవరకు అవి పూర్తి కాలేదు. 16 భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల పరిధిలోని 86 ప్యాకేజీల పనులకు అదనపు చెల్లింపులు చేసేందుకు ప్రభుత్వం సుముఖం చూపినా ఇప్పటివరకు జరగని భూసేకరణ, సహాయ పునరావాసం (ఆర్అండ్ఆర్), బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా 61 ప్యాకేజీల పనులు ఐదేళ్లుగా పూర్తి కాలేదు. మరో 15 వేల ఎకరాలకు పైగా భూసేకరణ చేస్తే కానీ ఈ పనులు పూర్తయి మరో 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందదు. ఈ దృష్ట్యా ఈ పనుల గడువును మరో 6 నెలల నుంచి రెండేళ్లు పెంచాల ని ఇరిగేషన్ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఐదేళ్లుగా ఎక్కడికక్కడే.. జలయజ్ఞంలో భాగంగా సాగునీటి ప్రాజెక్టులు వివిధ కారణాల రీత్యా జాప్యం జరగడంతో పాత ధరల ప్రకారం పనులు కొనసాగించలేమని కాంట్రాక్టు ఏజెన్సీలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో పెరిగిన సిమెంట్, కాంక్రీట్, స్టీలు ధరలకు అనుగుణంగా కొత్త ధరలు చెల్లించేందుకు ప్రభుత్వం 2015లో జీవో–146 వెలువరించింది. అనంతరం 2017లో కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ప్రాజెక్టుల్లో ఐబీఎం అంచనాలకు అదనంగా కొత్త కాంక్రీటు నిర్మాణాలు, అదనపు నిర్మాణాలు, లైనింగ్ పనులు చేరితే ఆ పనులకు అనుగుణంగా అంచనా వ్యయాన్ని పెంచుకునేందుకు ఆమోదం తెలిపారు. ఈ జీవోల మేరకు 2013 ఏప్రిల్ తర్వాత నిర్మాణం కొనసాగుతున్న ప్రాజెక్టుల్లోని ప్యాకేజీల పనులకు జీవో–146 అమలు చేస్తున్నారు. మొత్తంగా 111 ప్యాకేజీల పనులను దీని కింద చేర్చారు. తర్వాత ఇందులో కొన్నింటిని తొలగించి 86 ప్యాకేజీలకు జీవో వర్తింపచేశారు. రూ.19 వేల కోట్ల విలువైన ఈ ప్యాకేజీల పరిధిలో పనులు పూర్తి చేయాలంటే 45 వేల ఎకరాలకు పైగా భూమిని సేకరించాల్సి ఉంది. అయితే, ఇప్పటికీ చాలా ప్రాజెక్టుల పరిధిలో భూ సేకరణ పూర్తి కాలేదు. ముఖ్యంగా బీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, దేవాదుల, ఎస్సారెస్పీ స్టేజీ–2 వంటి పథకాల్లో ఇంకా భూ సేకరణ పూర్తి కాలేదు. ఇంకా 15 వేల ఎకరాలకు పైగా భూ సేకరణ జరగాల్సి ఉంది. కొన్ని చోట్ల ఆర్అండ్ఆర్ పనులు పూర్తికాక కోర్టు కేసుల నేపథ్యంలో పనులు ముందుకు కదలడం లేదు. కొన్ని ప్యాకేజీల పరిధిలో చాలాకాలంగా బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో ఏజెన్సీలు పనులు చేయడం లేదు. మరికొన్ని ప్యాకేజీల్లో ఏజెన్సీలు దివాలా తీయడంతోనూ పనులు ఆగిపోయాయి. దీంతో మరో రూ.3,500 కోట్ల పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఈ పనులు పూర్తయితేనే మరో 10 లక్షల ఎకరాల మేర ఆయకట్టు వృద్ధిలోకి వస్తుంది. ఇప్పటికే ఈ ప్యాకేజీల గడువును 2007–08 నుంచి 5 నుంచి 10 సార్లకు పైగా పొడిగించగా, ఇప్పుడు మళ్లీ వీటి గడువును 6 నెలల నుంచి రెండేళ్ల వరకు పొడిగించాలని ఇరిగేషన్ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయని పక్షంలో ఆ ఏజెన్సీలు కొన్నేళ్లపాటు ఎలాంటి పనులు చేపట్టకుండా చర్యలు తీసుకునేలా ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. -
తెలంగాణకు తీరని నష్టం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలను వినియోగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టదలిచిన ప్రాజెక్టులతో తెలంగాణ ప్రాజెక్టులకు తీరని నష్టం జరుగుతుందని రాష్ట్ర నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేశారు. కొత్త ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టేటప్పుడు బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరి అనే విషయాన్ని రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం స్పష్టం గా చెబుతోందని పేర్కొన్నారు. అయినా దానికి విరుద్ధంగా ఏపీ నడుచుకుంటోందని బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 3 టీఎంసీలు తరలించేలా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తిగా కొత్తదని, దీనికి ఎలాంటి అనుమతుల్లేవని, బోర్డు తక్షణం జోక్యం చేసుకొని దీన్ని అడ్డుకోవాలని కోరారు. దీంతోపాటు పోతిరెడ్డిపాడు కాల్వల సామర్థ్యం పెంచడం కూడా తెలంగాణ తాగు, సాగు నీటి అవసరాలకు విఘాతం కలిగించేదేనని, ఈ దృష్ట్యా ఏపీ తీసుకొచ్చిన జీవో 203పై మరింత ముందుకెళ్లకుండా బోర్డు చర్యలు తీసుకోవాలని కోరారు. (చదవండి: 30 ఏళ్ల వరద లెక్కలివ్వండి) ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు రజత్‌కుమార్, ఈఎన్సీ మురళీధర్, సీఈలు నరసింహారావు, నర్సింహా.. కృష్ణా బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్‌తో బుధవారం జలసౌధలోని ఆయన కార్యాలయంలో భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు జరిగిన భేటీలో ఇప్పటికే తెలంగాణ అభ్యంతరాలు పేర్కొంటూ రాసిన లేఖను ప్రస్తావిస్తూ, ఏపీ ప్రాజెక్టులతో జరిగే నష్టాన్ని వివరించారు. తెలంగాణ ప్రయోజనాలను అడ్డుకునే ఈ ప్రాజెక్టులను అడ్డుకోవాలని కోరారు. ఈ అంశంపై తమ పరిధిలో ఏపీ నుంచి వివరణ కోరతామని బోర్డు వారికి హామీ ఇచ్చింది. అలా అయితే అభ్యంతరం లేదు: రజత్ భేటీ అనంతరం రజత్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రాజెక్టులతో తెలంగాణకు జరిగే నష్టంపై బోర్డుకు వివరించామని తెలిపారు. ముఖ్యంగా రాష్ట్ర తాగు, సాగునీటి అవసరాలకు ఇబ్బంది కలుగుతుందని వివరించినట్లు చెప్పారు. గతంలోనే ఈ అంశంపై ఫిర్యాదు చేశామని, దీనిపై ఏపీ వివరణను బోర్డు కోరిందని, అయితే ఇప్పుడు అధికారికంగా జీవో వచ్చినందున తగు చర్యలు తీసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు. 3 టీఎంసీలతో చేపట్టే లిఫ్టు పథకం ముమ్మాటికీ కొత్తదేనని, దీనికి బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి ఉండాలని చెప్పామన్నారు. ఈ సందర్భంగానే తమ వాటా 512 టీఎంసీల నుంచే నీటిని వినియోగిస్తామని ఏపీ అంటోంది కదా అని ప్రశ్నించగా.. ‘ఏపీ తమ వాటా మేరకు నీటిని వాడుకుంటే అభ్యంతరం లేదు. అయితే అంతే నీటిని వాడుకుంటున్నారన్న దానికి సరైన విధానం లేదు. పోతిరెడ్డిపాడు వద్ద టెలిమెట్రీ పెట్టాలని చెప్పినా అది పూర్తిగా అమల్లోకి రాలేదు. అక్కడి నీటి వినియోగంపై సరైన పర్యవేక్షణ లేదు. మాటల్లో చెప్పేది ఒకటి, చేసేది ఇంకోటైతే సమస్యే కదా’అని పేర్కొన్నారు. ప్రస్తుతం మధ్యంతర ఒప్పందం మేరకు తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల మేర కేటాయింపులున్నాయని, అయితే పరీవాహకం ఆధారంగా చూస్తే తెలంగాణకు సైతం వాటా పెరగాల్సి ఉందన్నారు. దీనిపై ఇప్పటికే సుప్రీంకోర్టు, ట్రిబ్యునల్ ముందు తాము పోరాడుతున్నట్లు చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 2009లో భారీ వరదలు వచ్చాయని, అలా వచ్చినప్పుడు సమస్య లేదని, అదే 2017, 2018లో వరద లేక క్రాప్ హాలిడే ప్రకటించాల్సి వచ్చిందని గుర్తు చేశారు. శ్రీశైలానికి వరద రాకుంటే తెలంగాణ జిల్లాలోని ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలోని ప్రాజెక్టుల కింద తాగు, సాగు అవసరాలకు నీరందడం కష్టం అవుతుందని పేర్కొన్నారు. అందుకే ఏపీ ప్రాజెక్టులను ఆపాలని కోరుతున్నట్లు చెప్పారు. -
తెరపైకి సాగునీటి ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల కింద కోటి ఎకరాలకు పైగా ఆయకట్టుకు సాగునీటిని అందించే ప్రక్రియ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో నీటి పారుదల వ్యవస్థ యాజమాన్యంలో రైతులకు భాగస్వామ్యం కల్పించే చర్యలు చేపట్టాలని నీటి పారుదల శాఖ నిర్ణయించింది. కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల, పాలమూరు–రంగారెడ్డి వంటి ప్రాజెక్టుల నిర్మాణ పనులు వేగంగా జరుగుతుండటం, వాటి కింద నిర్మిస్తున్న కాల్వల ద్వారా సాగునీటిని అందిస్తున్న పరిస్థితుల్లో నీటి పారుదల వ్యవస్థ సక్రమ నిర్వహణ, సమర్ధ నీటి పంపిణీకి సాగునీటి సంఘాలను పునర్వ్యవస్థీకరించాలని యోచిస్తోంది. ఈ వ్యవస్థల సమగ్ర అభివృధ్ధికి వీలుగా ఈ సంఘాలకు గతంలోమాదిరి ఎన్నికలు నిర్వహించడమా లేక గ్రామ కమిటీలను నియమించడమా లేక లాటరీ పద్ధతిన ఉత్సాహవంతులను ఎంపికచేయడమా? అన్న అంశాలను పరిశీలిస్తోంది. 2014 వరకే పనిచేసిన సంఘాలు.. సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి వినియోగదారులను సంఘటిత పరచడం, నీటి యాజమాన్యంలో రైతులకు అవగాహన కల్పించడం లక్ష్యంగా 1997లో అప్పటి ప్రభుత్వం సాగునీటి సంఘాలను ఏర్పాటు చేసింది. సాగునీటి వినియోగ సంఘాలు (డబ్ల్యూయూఏ), డిస్ట్రిబ్యూటరీ సంఘాలు(డీసీ), ప్రాజెక్టు కమిటీ(పీసీ)లను ఏర్పాటు చేసింది. 2014కు ముందు తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టుల్లో మేజర్ ప్రాజెక్టుల కింద నీటి వినియోగ సంఘాలు 744, డీసీలు 97, పీసీలు 8 వరకు ఉండేవి. ఇక మైనర్ కింద 3,876 వరకు నీటి సంఘాలు ఉండేవి. 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వీటి ఎన్నికల్లో మార్పులు చేసింది. రొటేషన్‌లో ఈ సంఘాల కార్యవర్గాలు పనిచేసేలా చర్యలు తీసుకుంది. ప్రతి రెండేళ్లకోమారు మూడో వంతు సభ్యులకు ఎన్నికలు జరిపి రెండేళ్ల పదవీకాలం ముగిసే సభ్యులను మాజీలు చేయాలని సూచించింది. ఈ పద్ధతిలో 2006, 2008 సంవత్సరాల్లో సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తూ వచ్చింది. ఈ సంఘాలే 2014 జనవరి వరకు ఉన్నా, తర్వాత ఎన్నికలు నిర్వహించలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం సైతం రైతు సంఘాల జోలికి వెళ్లలేదు. -
కృష్ణా, గోదావరిపై చెక్‌డ్యాంలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో చెక్‌డ్యాంలు నిర్మించాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. దీంతో ఎక్కడికక్కడ నీటిని కట్టడి చేసి వీలున్నంత మేర ఎక్కువ జలాలను ఉపయోగించుకోవాలని భావిస్తోంది. రాష్ట్రంలోని నదులు, వాగుల పునరుజ్జీవం కోసం అనువైన చోట్ల చెక్‌డ్యాంలు నిర్మించాలని, ఇందుకు అవసరమైన సాంకేతికాంశాలను పరిశీలించి అంచ నా వ్యయంతో నివేదికను తయారు చేయాలని సీఎం కేసీఆర్ గతంలో నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో రిటైర్డ్ ఈఎన్సీ విజయ్‌ప్రకాశ్ నేతృత్వంలోని బృందం పలు అంశాలను అధ్యయనం చేసింది. ఆ అంశాలను క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మైనర్ ఇరిగేషన్ ఇంజనీర్లకు వివరించడానికి సోమవారం జలసౌధలో ఒకరోజు వర్క్‌షాప్ నిర్వహించారు. రాష్ట్రస్థాయి నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి అధికారులకు వరకు హాజరైన ఈ వర్క్‌షాప్‌లో లక్ష్యాలను, సీఎం సూచనలను ఇంజనీర్లకు ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ వివరించారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేస్తామని వెల్లడించారు. అనంతరం వర్క్‌షాప్‌నకు ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాశ్ ఇంజనీర్లనుద్దేశించి మాట్లాడుతూ.. సీఎం తీసుకున్న ఈ నిర్ణయం చాలా కీలకమైందని అన్నారు. మహారాష్ట్ర, కర్నాటక చాలా కాలం క్రితమే ప్రధాన నదులు, వాటి ఉపనదులపై చెక్‌డ్యాంలు, ఆనకట్టలు కట్టి నీటిని సద్వినియోగం చేసుకుంటున్నాయని తెలిపారు. జహీరాబాద్ ప్రాంతంలోని గొట్టిగానిపల్లె గ్రామంలో ఉన్న ఒకే ఒక్క వాగుపై 12 చెక్‌డ్యాంలు నిర్మించారని, దీంతో గ్రామంలో నీటి వనరుల లభ్యత పెరిగి ఏటా 2 పంటలు పండిస్తున్నారని తెలిపారు. మ్యాప్‌ల ద్వారా వివరణ: రిటైర్డ్ ఈఎన్సీ విజయ్‌ప్రకాశ్ తన అధ్యయనంలో వెల్లడైన అంశాలను ఇంజనీర్లకు వివరించారు. చెక్‌డ్యాంల నిర్మాణాలకు ఎంపిక చేయాల్సిన వాగులను ఎలా గుర్తించాలి, అందులో ఇమిడి ఉన్న సాంకేతిక అంశాలను పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఎన్ఆర్ఎస్ఏ రూపొందించిన మ్యాప్‌ల ద్వారా వాగుల ఎంపికపై చర్చించారు. రాష్ట్రంలోని నదులు, వాగులను మొత్తం 8 స్థాయిల్లో వర్గీకరించామని, నదులు, ఉపనదులు, వాగుల సామర్థ్యాలను బట్టి చెక్‌డ్యాంల నిర్మాణానికి 4 లేదా ఆపైన స్థలాలను ఎంపిక చేయాలని సూచించారు. గోదావరి బేసిన్‌లోని 6,500 కిలోమీటర్ల పొడవులో ఇప్పటికే ఆనకట్టలు, చెక్‌డ్యాంలు, కత్వా లు, బంధాలు మొత్తం కలిపి 319 ఉన్నాయని, కృష్ణా బేసిన్‌లోని 5,700 కిలోమీటర్ల పొడవున్న వాగులపై 466 ఉన్నట్టు గుర్తించామని వెల్లడించారు. ఇందులో అత్యధికంగా చిన్నస్థాయి వాగులపై ఉన్నాయని, పెద్ద వాగులపై ఇప్పుడు చెక్‌డ్యాంలు నిర్మించే అవకాశం ఉందన్నారు. మంచి రాతి పునాది గల స్థలాలను ఎంపిక చేయాలన్నారు. చెక్‌డ్యాంల ప్రతిపాదనలలో మొదటి నుంచీ భూగర్భ జలశాఖతో టచ్‌లో ఉండాలని సూచించారు. 3 మీటర్ల లోతున జలం అందుబాటులో ఉంటే అక్కడ చెక్‌డ్యాంలను ప్రతిపాదించవద్దని చెప్పారు. ఇప్పటికే విధ్వంసానికి గురైన గ్రామాలకు ప్రాధాన్యం కల్పించాలని భూగర్భ జల శాఖ డైరెక్టర్ పండిత్ సూచించారు. ఈ వర్క్‌షాప్‌లో వోఎస్డీ శ్రీధర్ రావు దేశ్‌పాండే, మైనర్ ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు. -
హస్తినలోనే తేల్చుకుందాం..!
సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరీ నదుల అనుసంధానంపై హస్తినలోనే తేల్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ‘అకినేపల్లి’బ్యారేజీ ద్వారా నీటి మళ్లింపు ప్రణాళికపై చర్చించేందుకు ఈ నెల 17న కేంద్ర జల వనరుల శాఖ ప్రత్యేక భేటీ ఏర్పాటు చేసింది. తెలంగాణ నీటిపారుదల శాఖ అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం అధికారులు అభ్యంతరాలు, అనుమానాలు, ఇతర ప్రత్యామ్నాయాల నివేదికలను తయారు చేశారు. ఒడిశాలోని మహానది నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోని గోదావరి, కృష్ణాలను కలుపుతూ తమిళనాడు, కర్ణాటకల్లోని కావేరి వరకు అనుసంధానం చేపట్టాలని కేంద్రం తొలుత నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు భిన్నంగా కొత్త ప్రత్యామ్నాయాన్ని జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) తెరపైకి తెచ్చింది. తెలంగాణలో ఇచ్చంపల్లి ప్రాజెక్టు వల్ల ముంపు అధికంగా ఉందనీ, దీనికి ప్రత్యామ్నాయంగా గోదావరిపై ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం అకినేపల్లి వద్ద బ్యారేజీ నిర్మించాలని కేంద్రం సూచిస్తోంది. అక్కడి నుంచి 247 టీఎంసీల మిగులు జలాలను నాగార్జునసాగర్‌కు ఎత్తిపోసి, అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా సోమశిల మీదుగా కావేరీకి తరలించాలని ప్రతిపాదిస్తోంది. అయితే దీనిని తెలంగాణ తప్పుపడుతోంది. అకినేపల్లి వద్ద తెలంగాణ, ఒడిశా అవసరాలు పోనూ, 50 శాతం నీటి లభ్యత ఆధారంగా 8,194 మిలియన్ క్యూబిక్ మీటర్లు(289 టీఎంసీలు), 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 12,104 మిలియన్ క్యూబిక్ మీటర్లు (427 టీఎంసీలు) మిగులు ఉం టుందని అంచనా వేసింది. 75 శాతం నీటి లభ్యత ప్రకారం ఎక్కువ జలాలున్నట్లు చూపడాన్ని తెలంగాణ ప్రశ్నిస్తోంది. -
విషమంగానే విద్యాసాగర్‌రావు ఆరోగ్యం
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదల సలహాదారు ఆర్.విద్యాసాగరరావు ఆరోగ్య పరిస్థితిపై కాంటినెంటల్ ఆస్పత్రి శుక్రవారం సాయంత్రం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఆయన ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని ఆస్పత్రి ఫౌండర్ చైర్మన్ డాక్టర్ గురు ఎన్.రెడ్డి తెలిపారు. ఎక్స్టెన్సివ్ మెటస్టాటిక్ బ్లాడర్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన వెంటిలేటర్ సాయంతో శ్వాస తీసుకుంటున్నారని వివరించారు. -
నిలకడగా విద్యాసాగర్ ఆరోగ్యం
సాక్షి, హైదరాబాద్: సాగునీటిరంగ నిపుణుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు రామరాజు విద్యాసాగర్‌రావు ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్స కు స్పందిస్తున్నారని కాంటినెంటల్ ఆస్పత్రి డాక్టర్లు సోమవారం వెల్లడించారు. ఈ మేరకు ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ గురు ఎన్.రెడ్డి మధ్యాహ్నం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. రెండ్రోజులుగా ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని, ఆస్పత్రి ప్రత్యేక డాక్టర్ల బృందం ఆయనను నిరంతరం పరీక్షిస్తోందని చెప్పారు. వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని, ఆరోగ్యం మెరుగైతే 24 గంటల తర్వాత వెంటిలెటర్ తొలగిస్తామన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్నారని వివరించారు. కాగా, విద్యాసాగర్‌రావు చనిపోయారంటూ టీవీ చానళ్లు, సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం నిజం కాదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
విషమంగానే విద్యాసాగర్‌రావు ఆరోగ్యం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని, ప్రస్తుతం ఆయనకు వెంటి లేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందు తున్నారు. కొంతకాలంగా ఆయన బ్లాడర్ కేన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆదివారం మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్ రెడ్డిలు వేర్వేరుగా ఆస్పత్రిని సందర్శించి విద్యాసాగర్‌రావు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని వైద్యులకు సూచించారు. ఎంపీ బీబీ పాటిల్, శాఖ స్పెషల్ సీఎస్ ఎస్కే జోషి, ఇతర ఇంజనీర్లు ఆస్పత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.