డైరెక్టరేట్ ఆఫ్ వర్క్స్ అండ్ అకౌంట్స్ ఆదేశం
ఆర్థిక శాఖ అనుమతి లేదని స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల శాఖలో 500 మందికి పైగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు ఇటీవల నిర్వహించిన బదిలీలకు ఆర్థిక శాఖ అనుమతి లేకపోవడంతో.. వచ్చే నెలలో వారికి జీతాలు నిలిపివేయాలని డైరెక్టరేట్ ఆఫ్ వర్క్స్ అండ్ అకౌంట్స్ ఆదేశించింది. కాగా, జీవో నంబర్ 193 ఆధారంగానే తమకు బదిలీలు నిర్వహించారని, జీతాలు నిలిపివేత సరికాదని ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో సైతం ఇదే తరహాలో వర్క్స్ అండ్ అకౌంట్స్ విభాగం డైరెక్టర్ తమ జీతాలను నిలిపివేశారని వారు ఆరోపిస్తున్నారు. జీతాలు నిలిపివేస్తే వర్క్స్ అండ్ అకౌంట్స్ డైరెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తామని పేర్కొన్నారు.
నీటిపారుదల శాఖలో 1,578 ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నీటిపారుదల శాఖలో 1,597 మంది లస్కర్లు, 281 హెల్పర్లు కలిపి.. మొత్తం 1,878 మందిని ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన నియమించడానికి అనుమతిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ఈ నెల 18న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టుల భర్తీకి సంబంధిత ప్రాంత ఈఎన్‌సీ/సీఈల నేతృత్వంలో స్థానిక ఎస్‌ఈ, స్థానిక డీసీఈలతో స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ (జనరల్) జి.అనిల్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
‘గురుకుల’ అభ్యర్థుల ఆందోళన
లక్టీకాపూల్ (హైదరాబాద్): గురుకుల నియామక బోర్డు బోధన పోస్టులను నింపే క్రమంలో డిసెండింగ్ విధానం పాటించకపోవడం వల్ల ఒక్కొక్కరికి 2,3,4 పోస్టులు వచ్చాయని, దీని వల్ల 9 వేల పోస్టులలో 3 వేలు మిగిలిపోయాయని తెలంగాణ గురుకుల అభ్యర్థుల (1:2 జాబితా) ప్రతినిధులు ఎండీ ఉస్మాన్, రాజు, టి.ఉమాశంకర్‌లు పేర్కొన్నారు. పోస్టులు నింపే క్రమంలో ముందుగా పీజీటీ, టీజీటీ, జేఎల్, డీఎల్ పోస్టింగ్‌లు ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు.
శుక్రవారం తమకు న్యాయం చేయాలంటూ ప్రజాభవన్ వద్ద అభ్యర్థులు బైఠాయించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నుంచి స్పష్టమైన సమాధానం వచ్చేంత వరకు ఇక్కడే ఉంటామంటూ పట్టుపట్టారు. జీవో నం.81ని సడలించి తమకు న్యాయంగా రావాల్సిన ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
చదవండి: రేవంత్ డౌన్ డౌన్.. బెటాలియన్ పోలీసుల ధర్నా!
టీజీఎస్పీ సిబ్బంది సెలవుల్లో మార్పులు నిలిపివేత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పోలీస్ (టీజీఎస్పీ) సిబ్బంది సెలవుల్లో మార్పులు చేస్తూ ఈ నెల 10న ఇచ్చిన మెమోను తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకు నిలిపివేస్తున్నట్లు టీజీఎస్పీ అదనపు డీజీ సంజయ్‌కుమార్ జైన్ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. సెలవుల అంశంపై ఇచ్చిన ఉత్తర్వులు సిబ్బందిని అయోమయానికి గురిచేసినట్లు తన దృష్టికి రావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
బెటాలియన్లలో సిబ్బంది సమస్యలను తెలుసుకునేందుకు దర్బార్లు ఏర్పాట్లు చేసి వారితో మాట్లాడాలని, ఆ సమస్యలు తన దృష్టికి తేవాలని అన్ని బెటాలియన్ల కమాండెంట్లను సంజయ్‌కుమార్ జైన్ ఆదేశించారు. బెటాలియన్లలో పనిచేసే సిబ్బంది, వారి కుటుంబాల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తామని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. సిబ్బంది వ్యక్తిగతంగా తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తేవొచ్చని తెలిపారు. అందుకు tgspcontrol@gmail.com లేదా గ్రీవెన్స్ నంబర్ 8712658531కు తెలియజేయాలని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment