♦ తెలంగాణ ఎస్‌ఎల్‌పీపై రేపు విచారణ
♦ కృష్ణా జలాల్లో అన్యాయాన్ని మరోమారు వినిపించనున్న రాష్ట్రం
♦ ఇటీవలి బ్రిజేశ్ తీర్పుపైనా కీలక వాదనలు
♦ నేడు ఢిల్లీకి అధికారుల పయనం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల కేటాయింపుల్లో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని, దాన్ని సవరించేందుకు కొత్త ట్రిబ్యునల్‌ను నియమించి పునర్విచారణ జరిపేలా ఆదేశించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల కిందట దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్‌ఎల్‌పీ)పై గురువారం సుప్రీంకోర్టులో కీలక విచారణ జరుగనుంది. ఇటీవల కృష్ణా జలాలపై తదుపరి విచారణ కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితమంటూ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వెలువరించిన నేపథ్యంలో సుప్రీంలో ఈ విచారణ ప్రాముఖ్యం సంతరించుకుంది. ఇప్పటికే దాఖలు చేసిన పిటిషన్పై విచారణను ముందుకు కొనసాగిస్తుందా? లేక ఇటీవలి బ్రిజేశ్ తీర్పును పరిగణనలోకి తీసుకుంటూ మరేదైనా తీర్పు ఇస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. సుప్రీం విచారణ నేపథ్యంలో గురువారం నీటి పారుదల శాఖ అధికారులు ఢిల్లీకి వెళ్లనున్నారు.
ఎస్‌ఎల్‌పీలో రాష్ట్రం ఏమంది?
కృష్ణా జలాలపై బ్రిజేశ్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును తుది గెజిట్‌లో ప్రచురించరాదని, ఈ కేసులో తమ వాదనలు వినాలని కోరుతూ రాష్ట్రం 2014లో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేసింది. నీటి లభ్యతను అంచనా వేయడానికి తీసుకున్న 65 శాతం డిపెండబులిటీతో, కర్ణాటక ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచే అవకాశం ఉండడంతో రాష్ట్రం నష్టపోతుందని అందులో వివరించింది. కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణలో 68.5 శాతం ఉండగా.. ఏపీలో 31.5 శాతం మాత్రమే ఉందని, అయినా కేటాయింపులు మాత్రం ఆంధ్రప్రదేశ్‌కే ఎక్కువ జరిపారని పేర్కొంది. ‘‘కృష్ణాలోని భీమా సబ్ బేసిన్లో 75 శాతం డిపెండబులిటీ లెక్కన నీటి లభ్యత 342 టీఎంసీలు ఉంటుంది. ఈ నీటిని బచావత్ ట్రిబ్యునల్ మహారాష్ట్ర, కర్ణాటకకే కేటాయించగా.. బ్రిజేశ్ ట్రిబ్యునల్ 60 శాతం డిపెండబులిటీ లెక్కన మరో 28 టీఎంసీలు ఎగువ రాష్ట్రాలకు కేటాయించింది. దీంతో భీమా నుంచి కృష్ణాకు ఎలాంటి నీటి లభ్యత ఉండదు.
ఇక తుంగభద్ర, వేదవతి సబ్ బేసిన్లో మొత్తం నీటి లభ్యత 533 టీఎంసీలు ఉండగా అందులో తెలంగాణ వాటా కేవలం 18 టీఎంసీలే. అందులోనూ పూర్తి స్థాయి జలాలు ఎన్నడూ రాలేదు. తెలంగాణకు నీటి లభ్యత అంతా ప్రధాన కృష్ణాకు నాలుగు సబ్ బేసిన్ల నుంచి 794 టీఎంసీలుగా ఉంది. అయితే మహారాష్ట్రకు ఉన్న 260 టీఎంసీ కేటాయింపులకు అదనంగా ట్రిబ్యునల్ 50 టీఎంసీలు, కర్ణాటకకు ఉన్న 325 టీఎంసీలకు అదనంగా మరో 130 టీఎంసీలు కేటాయించింది. ఇలా ఎగువ రాష్ట్రాలకే 766 టీఎంసీలు కేటాయించడంతో తెలంగాణ సరిహద్దుకు వచ్చే నీరు కేవలం 28 టీఎంసీలే. ప్రస్తుతం ఎగువ రాష్ట్రాలకు అదనంగా కేటాయింపులు పెరిగితే దిగువకు నీరు వచ్చే అవకాశాలు దెబ్బతింటాయి’’ అని పిటిషన్లో తెలంగాణ వివరించింది. ఇవే అంశాలను మరోమారు సుప్రీం దృష్టికి తీసుకెళ్లి నాలుగు రాష్ట్రాలకు తిరిగి జలాల కేటాయింపులు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. మరోవైపు కృష్ణా జలాల విచారణ రెండు రాష్ట్రాలకే పరిమితం అంటూ ఇచ్చిన తీర్పుపై అఫిడవిట్ సమర్పించాలన్న గడువు ముగుస్తుండటంతో రాష్ట్రం మరో నాలుగు వారాల సమయం కోరుతూ ట్రిబ్యునల్‌కు లేఖ రాసింది.
కృష్ణా ఆశలన్నీ సుప్రీంపైనే..
Published Wed, Nov 16 2016 2:38 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
Advertisement
Advertisement