సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ ఇచ్చిన షెడ్యూల్‌ను సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పు అమలును నిలిపేయాలని కోరుతూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గురువారం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి స్థాయిలో కొనసాగుతున్న సమయంలో ఎన్నికలు నిర్వహించడం ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టడమే అవుతుందని ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది. వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు నిర్వహించవచ్చన్న నిర్ణయం తీసుకోవడానికి ఎన్నికల కమిషనర్ ఏమీ వైద్య నిపుణుడు కారని, ఆయన ఏ వైద్య నిపుణుడినీ సంప్రదించ లేదని తెలిపింది. వ్యాక్సినేషన్ ఎంత ముఖ్యమో తెలియచేస్తూ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఎన్నికలు చేపట్టడం సరికాదంటూ తాము లేవనెత్తిన అభ్యంతరాలను ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా తిరస్కరించిందని వివరించింది. చిత్తశుద్ధితో ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ఎన్నికల కమిషన్ బేఖాతరు చేసిందని తెలిపింది. ఈ ఒక్క కారణంతో హైకోర్టు తీర్పును రద్దు చేయవచ్చని చెప్పింది. ప్రభుత్వం తన పిటిషన్‌లో ఇంకా ఏం చెప్పిందంటే..
ఇప్పుడు ఎన్నికలంటే ప్రజల ప్రాణాలకు ముప్పే
► పోలీసు యంత్రాంగం మొత్తానికి ఫిబ్రవరి మొదటి వారంలో వ్యాక్సిన్ ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం. ఇదే సమయంలో ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. పోలీసులందరూ వ్యాక్సిన్ తీసుకోవడం, వ్యాక్సిన్ రవాణా, భద్రతకు చర్యలు తీసుకోవడం, ఎన్నికల విధుల్లో పాల్గొనడం వంటివి ఏక కాలంలో చేయాల్సి ఉంటుంది. ఇది ఆచరణ సాధ్యం కాని పని.
► ఈ ఏడాది మార్చిలో ఎన్నికల కమిషనర్ పదవీ విరమణ చేస్తున్నారు. తన హయాంలోనే ఎన్నికలు నిర్వహించాలన్న ఏకైక ఉద్దేశంతో ప్రజల ప్రాణాలను పణంగా పెడుతూ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. ఇప్పుడు ఎన్నికలు పెడితే, వ్యాక్సినేషన్ తీసుకోకుండా ప్రజలు ఎన్నికల్లో పాల్గొనే పరిస్థితి వస్తుంది. ఇది వారి ప్రాణాలకు ముప్పుగా మారుతుంది. ఈ వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకోవడంలో హైకోర్టు విఫలమైంది.
పోలీసులు భద్రత కల్పించ లేరు
► ఎన్నికల కమిషన్ గతంలో ఇచ్చిన షెడ్యూల్‌ను కోవిడ్ కారణంగా చూపి వాయిదా వేసిన విషయాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకోవాల్సింది. వ్యాక్సినేషన్ సమయంలో పోలీసులు ఎన్నికలకు భద్రత కల్పించడం అసాధ్యం. వ్యాక్సిన్ రవాణా, స్టాక్ పాయింట్ల వద్ద భద్రత వంటివి పోలీసులే చూసుకోవాలి. వ్యాక్సిన్ బ్లాక్ మార్కెట్‌లోకి రాకుండా అడ్డుకోవడం, వ్యాక్సిన్ దారి మళ్లకుండా చూడటం, నకిలీలు చెలామణిలోకి రాకుండా చూడటం వంటివి కూడా పోలీసులే చేయాలి. ఫిబ్రవరిలో పోలీసులందరూ వ్యాక్సిన్ తీసుకుంటారు. అలాంటి సమయంలో వారు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అవకాశం ఉండదు. ఈ విషయాలన్నింటినీ హైకోర్టు పరిగణనలోకి తీసుకుని ఉండాల్సింది.
ప్రభుత్వ అభ్యంతరాలు పట్టించుకోలేదు
► రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండానే ఎన్నికల నిర్వహణకు నిర్ణయం తీసుకోవచ్చా? ప్రభుత్వ అభ్యంతరాలను బేఖాతారు చేసి ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయడం సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధం కాదా? ఎన్నికల కమిషనర్ పూర్తిగా దురుద్దేశాలతో వ్యవహరించారు.
► కేటగిరి 1, కేటగిరి 2 కిందకు వచ్చే వారికి అవసరమైన 9.8 లక్షల వ్యాక్సిన్లను ఇప్పటికే అందుకున్నాం. కేటగిరి 1 కిందకు వచ్చే ఆరోగ్య కార్యకర్తలకు జనవరి చివరి కల్లా వ్యాక్సినేషన్ పూర్తవుతుంది. కేటగిరి 2లోకి వచ్చే పోలీసులు, పురపాలక, రెవిన్యూ ఉద్యోగులకు ఫిబ్రవరి మొదటి వారంలో వ్యాక్సినేషన్ మొదలవుతుంది. ఆ తరువాత 50 ఏళ్లు పైబడిన, 50 ఏళ్ల లోపు బీపీ, సుగర్ వ్యాధిగ్రస్తులకు వ్యాక్సిన్ ఇస్తారు.
► వీటిని పరిగణనలోకి తీసుకోవడంలో ఎన్నికల కమిషన్ దారుణంగా విఫలమైంది. ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలను ఎన్నికల కమిషన్ పరిగణనలోకి తీసుకుందని హైకోర్టు చెప్పడం సరికాదు. ముందస్తుగా తీసుకున్న నిర్ణయం ఆధారంగానే ఎన్నికల కమిషన్ సంప్రదింపులు జరిపిందే తప్ప, చిత్తశుద్ధితో వ్యవహరించలేదు. ఎన్నికల కమిషనర్ తన లేఖల్లో ఉపయోగించిన భాష ఏ మాత్రం సరిగా లేదని చెప్పిన హైకోర్టు, మరో వైపు ఆయనకు దురుద్దేశాల్లేవని చెప్పడం సబబు కాదు. పురపాలక సంఘాల ఎన్నికల విషయాన్ని పక్కన పెట్టేసి, పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఇది దురుద్దేశంతో తీసుకున్న నిర్ణయం. ఈ విషయాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు.
ప్రాణాలు పణంగా పెట్టలేం..
రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్ని వాయిదా వేయాలని కోరుతూ సుప్రీంను ఆశ్రయించనున్నాం. కరోనా నేపథ్యంలో ఉద్యోగుల ప్రాణాలను పణంగా పెట్టలేం, అవసరమైతే ఎన్నికల్ని బహిష్కరిస్తాం. హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, కేరళ స్థానిక ఎన్నికల తర్వాత వేలాదిమంది ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. ఏపీలో ఎన్నికలు జరిపితే ఏడు లక్షలమందికిపైగా ఉద్యోగులు విధుల్లో పాల్గొనాల్సి ఉంటుంది. వారందరి పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది.
– ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు
అవసరమైతే ఎన్నికలు బహిష్కరిస్తాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్ని వాయిదా వేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు పలు ఉద్యోగసంఘాల నాయకులు గురువారం మీడియాతో చెప్పారు. ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఉద్యోగుల తరఫున ఈ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కరోనా నేపథ్యంలో ఉద్యోగుల ప్రాణాలను పణంగా పెట్టలేమని, అవసరమైతే ఎన్నికల్ని బహిష్కరిస్తామని పేర్కొన్నారు. ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్, ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ 22 కేసులున్నప్పుడు ఎన్నికలు వాయిదా వేసి, రోజుకు 200 కేసులు వస్తున్నప్పుడు ఎన్నికలు పెట్టడం సరికాదని చెప్పారు. హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, కేరళ స్థానిక ఎన్నికల తర్వాత వేలాది మంది ఉద్యోగులు కరోనా బారిన పడ్డారని తెలిపారు. కరోనా సమయంలో 7,200 మంది ఉద్యోగులు చనిపోయారని చెప్పారు. ఎన్నికలు జరిపితే 7 లక్షలమందికిపైగా ఉద్యోగులు విధుల్లో పాల్గొనాల్సి ఉంటుందని, వారి పరిస్థితి ఆందోళనకరంగా మారుతుందన్నారు.
ఏపీ ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి
వ్యాక్సినేషన్ పూర్తయ్యేవరకు వాయిదా వేయాలి
స్థానిక ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు మేము ఆశించిన విధంగా లేదు. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. వ్యాక్సినేషన్ పూర్తయ్యే వరకు ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతున్నాం. ఈ ప్రక్రియ రెండునెలల్లో పూర్తవుతుంది.
– కె.వెంకట్రామిరెడ్డి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్
మా ప్రాణాలు పణంగా పెట్టి ఎన్నికలు పెడతారా?
ఎన్నికల కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. మా ప్రాణాలు పణంగా పెట్టి ఎన్నికలు నిర్వహించడం అవసరమా? ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఉద్యోగులపైన ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నారో చెప్పాలి. ఇది సరైన పద్ధతి కాదు. అవసరమైతే విచక్షణాధికారాలను ఉపయోగించాలని గవర్నర్‌ను కోరాం.
– బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ చైర్మన్
ఎన్నికలకు సిద్ధంగా లేం
స్థానిక ఎన్నికలకు సిద్ధంగా లేమని ఇప్పటికే స్పష్టం చేశాం. ఎన్నికల్లో ఉపాధ్యాయులు చాలా కీలకం. ప్రతి ఉపాధ్యాయుడు వెయ్యిమందిని కలిసి వారి మధ్యలో పనిచేయాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు కరోనా వ్యాప్తి చాలా సులువుగా జరుగుతుంది. ఇప్పటికే చాలామంది టీచర్లు చనిపోయారు. మళ్లీ మా ప్రాణాల మీదకు తేవడం సరికాదు. ఈ విషయాలు సుప్రీంకోర్టుకు తెలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌లో ఇంప్లీడ్ అవుతాం.
– గిరిప్రసాద్, శ్రీధర్, పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు
వాయిదా వేయాలి
ఉపాధ్యాయుల శ్రేయస్సు దృష్ట్యా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యేవరకు స్థానిక ఎన్నికలు వాయిదా వేయాలి. ఉపాధ్యాయుల అభిప్రాయాలు తెలిపేందుకు మేం కూడా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం.
– జాలిరెడ్డి, వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ చైర్మన్
హైకోర్టు తీర్పుపై సుప్రీంకు
Published Fri, Jan 22 2021 5:41 AM | Last Updated on Fri, Jan 22 2021 5:45 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment