సుప్రీం గడప తొక్కాల్సిందే!
• ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేయనున్న తెలంగాణ
• ఇప్పటికే విచారణలో స్పెషల్ లీవ్ పిటిషన్
• తీర్పుపై విద్యాసాగర్‌రావుతో మాట్లాడిన సీఎం
సాక్షి, హైదరాబాద్: బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పు రాష్ర్ట ప్రయోజనాలకు గొడ్డలిపెట్టులా ఉండడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. తీర్పు అమల్లోకి రాకుండా స్టే ఇవ్వాలని కోర్టును కోరాలని భావిస్తోంది. కృష్ణా జల వివాదాలపై ఏర్పాటైన బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును తుది గెజిట్‌లో ప్రచురించరాదని, ఈ కేసులో తమ వాదనలు పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఇదివరకే స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. అంతర్‌రాష్ట్ర నదీ వివాదాల చట్టం ప్రకారం ఏర్పడిన ట్రిబ్యునల్... తన తీర్పును ఆ చట్టంలోని 5(2) అధికరణ కింద వెలువరిస్తుంది.
దీనిపై ఆయా రాష్ట్రాలు మూడు నెలల్లోగా వివరణలు, స్పష్టతలు కోరవచ్చు. వీటిపై విచారణ జరిపి తదుపరి నివేదికను 5(3) అధికరణ కింద ట్రిబ్యునల్ కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. అనంతరం కేంద్రం 6(1) అధికరణ ప్రకారం గెజిట్ ప్రచురిస్తుంది. ఈ గెజిట్ సుప్రీంకోర్టులోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పుతో సమానం అవుతుంది. బ్రిజేశ్ ట్రిబ్యునల్ 5(2) కింద ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సుప్రీంను ఆశ్రయించింది.
ట్రిబ్యునల్ తీర్పును గెజిట్‌లో ప్రచురించరాదని కేంద్రాన్ని ఆదేశించింది. ఇదే విషయమై కర్ణాటక సైతం సుప్రీంను ఆశ్రయించగా మరో రాష్ట్రం మహారాష్ట్ర మాత్రం బ్రిజేశ్ తీర్పు, తుది తీర్పును గెజిట్‌లో ప్రచురించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ పిటిషన్ వేసింది. ఈ కేసులో కొత్తగా ఏర్పడిన తమను చేర్చాలని కోరుతూ తెలంగాణ వేసిన ఇంప్లీడ్ పిటిషన్‌కు సుప్రీం అంగీకరించి స్పెషల్ లీవ్ పిటిషన్‌కు అనుమతినిచ్చింది. ఈ పిటిషన్‌పై విచారణ ప్రస్తుతం సుప్రీంలో పెండింగ్‌లో ఉంది.
ఈ విచారణ పూర్తయ్యేంత వరకు బ్రిజేశ్ తీర్పును గెజిట్ చేయడానికి వీల్లేదు. అయితే ప్రస్తుతం బ్రిజేశ్ ట్రిబ్యునల్.. నీటి కేటాయింపులను రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయడంతో అదే అదనుగా కర్ణాటక, మహారాష్ట్రలు తమకు కేటాయించిన మేరకు గెజిట్ ఇవ్వాలని కోరే అవకాశం ఉంది. ఈ దృష్ట్యా తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకు వెళ్లడమే సరైందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి.
తీర్పుపై నేడు సమీక్ష: ట్రిబ్యునల్ తీర్పు, దాని ఫలితాలపై సీఎం కేసీఆర్ గురువారం సమీక్షించే అవకాశం ఉంది. తీర్పు వెలువడిన వెంటనే ఆయన ఢిల్లీలో ఉన్న ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, అడిషనల్ అడ్వొకేట్ జనరల్ రాంచందర్‌రావులతో మాట్లాడారు. సుప్రీంను ఆశ్రయించే అంశంపై గురువారం నిర్ణయం తీసుకోనున్నారు.