Spicy
-
పూతరేకులు.. వెరీ స్పైసీ గురూ..
సాక్షి, విశాఖపట్నం: పూతరేకు ఏంటీ.. స్పైసీగా ఉండట మేంటి...? విడ్డూరం కాకపోతేనూ...! అని అనుకుంటు న్నారా... లేదండీ... నిజమే.. ఇక నుంచి స్పైసీ పూత రేకులు మార్కెట్లో హాట్ హాట్‌గా కనిపించనున్నాయి. ప్రత్యేకంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల కోసం కాకరకాయ, వెల్లుల్లి కారంతో పూతరేకులను రూపొందించారు ఆత్రేయ పురానికి చెందిన తయారీదారులు. పూతరేకుల తయారీ అనేది డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయ పురం ప్రజలకు తరతరాలుగా వారసత్వంగా వస్తోంది. తొలినాళ్లలో పంచదారతోనే పూతరేకులు తయారు చేసేవారు. కాలానుగుణంగా మారుతున్న అభిరుచుల మేరకు పూతరేకుల్లోనూ అనేక రకాలు వచ్చేశాయి. బెల్లం, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ వంటి వాటితో రకరకాల పూతరేకులు తయారు చేస్తున్నారు. ఇప్పుడు పూతరేకుల తయారీదారులు ట్రెండ్ మార్చారు. స్పైసీ పూతరేకులు సిద్ధం చేశారు. కాకరకాయ, వెల్లుల్లి కారంపొడితో పూతరేకు చుడతారు. డయాబెటిక్‌తో ఉన్నవారికి ఇది ఒక ఔషధంలా పనిచేస్తుంది. ఈ పూతరేకులు తింటే రక్తశుద్ధి, ఇన్సులిన్ సామర్థ్యం పెరిగే అవకాశాలు ఉన్నాయని తయారీదారులు చెబుతున్నారు. మార్కెట్లోకి స్సైసీ బిట్టర్గార్డ్, గార్లిక్ పూతరేకులు ఇన్నాళ్లూ పూతరేకులు తీయని రుచితో నోరూరిస్తూ.. మధుమేహ బాధితులకు మాత్రం శత్రువుగా ఉండేవి. షుగర్ ఫ్రీ పూతరేకులు అందుబాటులోకి వచ్చినా వాటిపై డయాబెటిక్ రోగులు అంతగా ఆసక్తి చూపించలేదు. అందుకే ఇప్పుడు స్వీట్‌ని హాట్‌గా తింటూ... మధుమేహాన్ని కంట్రోల్ చేసుకునేందుకు ఆత్రేయపురం వాసులు తయారు చేసిన కొత్త తరహా పూతరేకులను శుక్ర వారం మార్కెట్లోకి విడుదల చేశారు. అత్రేయపురానికి చెందిన సర్ ఆర్థర్ కాటన్ పూతరేకుల సహకార సంఘం ప్రతినిధులు తీసుకువచ్చిన స్పైసీ బిట్టర్గార్డ్, గార్లిక్ పూతరేకులను దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ శ్రీసుధ మార్కెట్లోకి విడుదల చేశారు. ప్రతి ఒక్కరూ ఆస్వాదించేలా... ఆత్రేయపురం పూతరేకులు అంటే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. మా పూతరేకు ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తూ తినాలన్నదే తయారీదారులందరి కోరిక. పంచదారతో తయారు చేయడం వల్ల తినలేకపోతున్నామంటూ చాలామంది మధుమేహం ఉన్నవారు మా ఊరు వచ్చినప్పుడు చెప్పి బాధపడేవారు. అందుకే భౌగోళిక గుర్తింపు వచ్చిన తర్వాత మంచి రోజు చూసుకుని స్పైసీ పూతరేకులను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాం. – గాదిరాజు ప్రసాదరాజు, ఆత్రేయపురం -
గుంటూరు కారం కథ తెలుసా అసలు.?
బంగాళాదుంప , మొక్క జొన్న , వేరుశెనగ , పైన్ ఆపిల్ , నారింజ , పొగాకు , బాదం , బెండకాయ , సపోటా , బొప్పాయి , మిరపకాయ , జీడిపప్పు, .. ఇవి లేని జీవితాన్ని ఊహించండి ! అంటే … మసాలా దోస , మిర్చి బజ్జి , వేరుశనిగ చట్నీ , బెండకాయ పులుసు , జీడీ పప్పు ఉప్మా … ఇవన్నీ ఉండవన్న మాటే కదా ! “ అహో ఆంధ్ర భోజా ! .. శ్రీకృష్ణ దేవా రాయా ! శిలలపై శిల్పాలు చెక్కించావు .. కానీ గుంటూరు కారం రుచి చూడలేదు .. ఉడిపి మసాలా దోస రుచి తెలియదు. ఏంటి ప్రభు? అని టైం మెషిన్ లో వెనక్కు వెళ్లి అడిగితే .." నేనేమి చేసేది మా కాలానికి ఈ పంటలు లేవు అంటాడు. ఎందుకంటే ఈ పంటలను , అటు పై పోర్చుగీస్ వారు, లాటినా అమెరికా దేశాలనుంచి సేకరించి మన దేశంలో ప్రవేశపెట్టారు. మరి ఆ రోజుల్లో మనాళ్ళు మసాలా దినుసులుగా ఏమి వాడేవారు? అల్లం , పసుపు , ఆవాలు , దాల్చిన చెక్క , ఏలకులు , లవంగాలు, ధనియాలు, ఇంగువ , మెంతులు ... ఇవన్నీ మన పంటలే . వీటిని మసాలా దినుసులుగా వాడేవారు ! అదండీ గుంటూరు కారం కథ ! కేవలం నాలుగు వందల సంవత్సరాల చరిత్ర . నల్ల మిరియాలు అనాదిగా ఇండియా లో పండించేవారు. దాన్ని పోర్చుగీస్ వారు ఎగుమతి చేసుకున్నారు. ఇప్పుడు రాజ్యమేలుతున్న ఎన్నో వంటకాలు మనవి కాదు, కానీ తొందరగానే మన జీవితాలను పెనవేసుకుపోయాయి. మార్పు సహజం .. కానీ కొత్తొక వింత కాదు . పాతొక రోత కాదు. ఏది మంచి ? ఏది చెడు అని- నా వక్తిగత అభిప్రాయం కాకుండా సామజిక శాస్త్రం - మానవ శాస్త్రం - జీవ శాస్త్రం కోణం నుంచి శాస్త్రీయ విశ్లేషణలు చేస్తున్నా. వాసిరెడ్డి అమర్ నాథ్, మానసిక శాస్త్ర విశ్లేషకులు, ప్రముఖ విద్యావేత్త -
సుప్రీం గడప తొక్కాల్సిందే!
• ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేయనున్న తెలంగాణ • ఇప్పటికే విచారణలో స్పెషల్ లీవ్ పిటిషన్ • తీర్పుపై విద్యాసాగర్‌రావుతో మాట్లాడిన సీఎం సాక్షి, హైదరాబాద్: బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పు రాష్ర్ట ప్రయోజనాలకు గొడ్డలిపెట్టులా ఉండడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. తీర్పు అమల్లోకి రాకుండా స్టే ఇవ్వాలని కోర్టును కోరాలని భావిస్తోంది. కృష్ణా జల వివాదాలపై ఏర్పాటైన బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును తుది గెజిట్‌లో ప్రచురించరాదని, ఈ కేసులో తమ వాదనలు పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఇదివరకే స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. అంతర్రాష్ట్ర నదీ వివాదాల చట్టం ప్రకారం ఏర్పడిన ట్రిబ్యునల్... తన తీర్పును ఆ చట్టంలోని 5(2) అధికరణ కింద వెలువరిస్తుంది. దీనిపై ఆయా రాష్ట్రాలు మూడు నెలల్లోగా వివరణలు, స్పష్టతలు కోరవచ్చు. వీటిపై విచారణ జరిపి తదుపరి నివేదికను 5(3) అధికరణ కింద ట్రిబ్యునల్ కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. అనంతరం కేంద్రం 6(1) అధికరణ ప్రకారం గెజిట్ ప్రచురిస్తుంది. ఈ గెజిట్ సుప్రీంకోర్టులోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పుతో సమానం అవుతుంది. బ్రిజేశ్ ట్రిబ్యునల్ 5(2) కింద ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సుప్రీంను ఆశ్రయించింది. ట్రిబ్యునల్ తీర్పును గెజిట్‌లో ప్రచురించరాదని కేంద్రాన్ని ఆదేశించింది. ఇదే విషయమై కర్ణాటక సైతం సుప్రీంను ఆశ్రయించగా మరో రాష్ట్రం మహారాష్ట్ర మాత్రం బ్రిజేశ్ తీర్పు, తుది తీర్పును గెజిట్‌లో ప్రచురించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ పిటిషన్ వేసింది. ఈ కేసులో కొత్తగా ఏర్పడిన తమను చేర్చాలని కోరుతూ తెలంగాణ వేసిన ఇంప్లీడ్ పిటిషన్‌కు సుప్రీం అంగీకరించి స్పెషల్ లీవ్ పిటిషన్‌కు అనుమతినిచ్చింది. ఈ పిటిషన్‌పై విచారణ ప్రస్తుతం సుప్రీంలో పెండింగ్‌లో ఉంది. ఈ విచారణ పూర్తయ్యేంత వరకు బ్రిజేశ్ తీర్పును గెజిట్ చేయడానికి వీల్లేదు. అయితే ప్రస్తుతం బ్రిజేశ్ ట్రిబ్యునల్.. నీటి కేటాయింపులను రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయడంతో అదే అదనుగా కర్ణాటక, మహారాష్ట్రలు తమకు కేటాయించిన మేరకు గెజిట్ ఇవ్వాలని కోరే అవకాశం ఉంది. ఈ దృష్ట్యా తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకు వెళ్లడమే సరైందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. తీర్పుపై నేడు సమీక్ష: ట్రిబ్యునల్ తీర్పు, దాని ఫలితాలపై సీఎం కేసీఆర్ గురువారం సమీక్షించే అవకాశం ఉంది. తీర్పు వెలువడిన వెంటనే ఆయన ఢిల్లీలో ఉన్న ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, అడిషనల్ అడ్వొకేట్ జనరల్ రాంచందర్‌రావులతో మాట్లాడారు. సుప్రీంను ఆశ్రయించే అంశంపై గురువారం నిర్ణయం తీసుకోనున్నారు. -
నిజాంను పొగడడం తెలంగాణను అవమానపర్చడమే
హుస్నాబాద్‌రూరల్ : సాయుధ పోరాటంలో దొడ్డి కొంరయ్యను కర్కషంగా చంపిన నిజాంను కేసీఆర్ పొగడడం తెలంగాణను అవ మానపర్చడమేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తెలంగాణ సాయుధపోరాట యోధుడు అనభేరి 67వ వర్ధంతి సభను శుక్రవారం రాత్రి మహ్మదాపూర్ గుట్టల్లో ఘనంగా నిర్వహించారు. గుట్టల నుంచి కొవ్వత్తులతో ర్యాలీగా గ్రామంలోని స్తూపం వరకు పాదయాత్రగా వచ్చి నివాళులర్పించారు. హైదరాబాద్ కార్పొరేషన ఎన్నికల్లో గెలిచేందుకే ఎంఐఎంను పొగుడుతున్నారన్నారు. కేసీఆర్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కమ్యూనిస్టులకు ప్రథమ శత్రువుగా మారుతారని హెచ్చరించారు. కమ్యూనిస్టులకు పూర్వ వైభవం తెచ్చేందుకు కలిసి పనిచేస్తామన్నారు. భూర్జువా పార్టీలతో స్నేహం చేయడం శాపంగా మారిందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ సూర్య చంద్రులున్నంత వరకు అమరుల త్యాగాలు మరువబోమన్నారు. అధికారంలోకి వచ్చిన పది నెలల కాలంలో కేసీఆర్ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు. తెలంగాణ సాంస్కృతిక శౌర్య రాష్ట్ర కన్వీనర్ పాశం యాదగిరి, సినీ హీరో మాదాల రవి, జిల్లా కార్యదర్శి రాంగోపాల్‌రెడ్డి, మాజీ కార్యదర్శి నారాయణ, నాయకులు సృజన్‌కుమార్ , అయిలయ్య, మల్లేశ్, శోభారాణి, సర్పంచ్ రమేశ్,తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ జైళ్లశాఖకు కొత్త లోగో
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జైళ్లశాఖకు కొత్త లోగోను ప్రభుత్వం ఆమోదించింది. ఉమ్మడిరాష్ట్రంలో ఉన్న జైళ్లశాఖ లోగోలో మార్పులు చేస్తూ కొత్త లోగోను రూపొందిం చారు. ఇందుకు కళాకారుల సాయం తీసుకున్నారు. ప్రస్తుత లోగోను నీలంరంగు బ్యాక్‌గ్రౌండ్‌లో తెల్లని అక్షరాలలో తెలంగాణ స్టేట్ అని పైన, దాని క్రింద ప్రిజన్స్ అని రాశారు. లోగో పైన జాతీయ చిహ్నం సింహం గుర్తును బంగారు రంగులో ఏర్పాటు చేశారు. అలాగే లోగోలో కస్టడీ విత్ ఫెయిర్ అనే నినాదాన్ని చేర్చారు. ఈ లోగోకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదముద్ర వేయడంతో ప్రభుత్వం గురువారం జీవో జారీ చేసింది. -
మన తెలుగు వాచకం
తెలంగాణ మట్టిభాష పాఠ్య ప్రణాళికలలో పాఠ్యాంశంగా మారబోతుంది. అమ్మభాషతో తెలంగాణ తెలుగువాచకాలు తయారవుతున్నాయి. తెలంగాణలోని చారిత్రక ప్రదేశాలు, సంస్కతీ సంప్రదాయాలు, విశిష్టమూర్తుల విశేషాలను సిలబస్‌లో చేర్చే బృహత్తర పని మొదలైంది. ప్రజల ఆకాంక్షలను ప్రజా ఉద్యమంగా మలచటంలో, ఆ లక్ష్యం నెరవేరే వరకు తుదికంటా క్రియాశీల క పాత్ర పోషించి తెలంగాణ సాహిత్య, సాంస్కృతికరంగం నిలిచి గెలిచింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక తన పలుకుబళ్లతో తన భాషలో, తనయాసలో స్వేచ్ఛగా పాఠ్యప్రణాళికలను రచించుకుంటుంది. తెలంగాణ సాహిత్య సాంస్కృతిక రంగాన్ని అపూ ర్వంగా ఆవిష్కరించుకునే అరుదైన సందర్భమిది. తన మట్టిభాష పాఠ్య ప్రణాళికలలో పాఠ్యాంశంగా మారబోతుంది. ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాలలో తెలంగాణ ప్రాంతానికి సరైన ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఆ లోటును పూడ్చటానికి కొత్త పాఠ్యపుస్తకాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 1 నుండి 10వ తరగతి వరకు అన్ని పుస్తకాల సిలబస్‌లు కొత్తగా రచిస్తున్నారు. తెలంగాణ అమ్మభాషతో తెలంగాణ తెలుగు వాచకాలు తయారవుతున్నాయి. మన విస్మృత సాహిత్యం విశ్వవేదికపై ఆవిష్కరించబోతున్న సందర్భమిది. తెలంగాణ లోని చారిత్రక ప్రదేశాలన్నీ ప్రపంచానికి తెలియ చేసేందుకు సిలబస్‌లో చేర్చే బృహత్తర పని మొద లైంది. మన సంస్కృతి, మన పండుగలు, మన ఆటలు, వినోదాలు, మన భాష, మన నుడికారం, మన భావజాలం, మన ఉద్యమం, మన పోరాట వారసత్వం, తెలుగు సాహిత్య చరిత్ర పేజీల్లోకి ఎక్కించే పనికి శ్రీకారం చుడుతున్నారు. తెలంగా ణలో ఎన్నెన్నో చారిత్రక ప్రదేశాలున్నాయి. పాన గల్లు పచ్చల సోమేశ్వరాలయం, ఆలంపూర్లో ప్రఖ్యాత ఆలయం, పిల్లలమర్రి శివాలయం, బాసర సరస్వతి దేవాలయం, రామప్ప దేవాల యం, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, వేయిస్తంభాల గుడి, సమ్మక్క సారలమ్మ జాతర, భద్రాచలం రామాలయం లాంటి ఎన్నెన్నో చారిత్రక ప్రదేశాలు సిలబస్‌లోకి చేర్చేపని ముమ్మరంగా జరుగుతుంది. బతుకమ్మ పండుగ, దసరా, పీర్ల పండుగలు, మన ఏడుపాయల జాతరలు, జానపాడు సైదులు, దురాజ్‌పల్లి జాతరలు ప్రత్యేకంగా పిల్లలకు బోధనాంశాలవుతున్నాయి. రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, కళారంగాల్లో ప్రతిభావంతులైన మన తెలంగాణ మహనీయుల చరిత్ర పిల్లలకు బోధించే విధంగా సిలబస్ తీర్చిదిద్దబడుతుంది. 1 నుంచి 10 తరగతుల పిల్లలకు ఆయా తరగతుల స్థాయిని బట్టి పాఠాలు చెబుతారు. ఒకప్పుడు హైదరాబాద్ రాష్ట్రం అవతరించాక తెలుగు భాషలో పాఠ్యాం శాలను ప్రవేశపెట్టటమే పెద్దమార్పుగా ఉండేది. ఇప్పుడు తెలంగాణ తన చరిత్రను తాను రాసుకుం టుంది. తెలంగాణ పద్య సాహిత్యంలో మన పాల్కురికి, మన పోతన, కొరవి గోపరాజు, కందుకూరి రుద్రకవి, మల్లినాధసూరి, సురవరం ప్రతాపరెడ్డి, బి.ఎన్.శాస్త్రి, కపిలవాయి లింగ మూర్తి, హీరాలాల్ మోరియా, జమలాపురం కేశవరావు, చక్రవర్తుల లక్ష్మీనర్సమ్మ లాంటి ఎందరెందరో తెలంగాణ సాహిత్య మణిరత్నాల చరిత్ర పిల్లలకు పాఠాలుగా ముందుకు రాబోతు న్నాయి. కాకతీయుల కాలం నాటి సమ్మక్క, సారలమ్మల చరిత్రతోపాటుగా ఆ కాలం నాటి తెలంగాణకు ప్రాణాధారమైన జీవధార గొలుసు కట్టు చెరువులు సిలబస్‌లోకి ఎక్కుతున్నాయి. స్థానికత నేపథ్యంలో బాలసాహిత్యం ప్రవేశపెట్టే పని మొదలైంది. తెలంగాణకు పోరువారసత్వం ఎంతో బలమై నది. ప్రపంచపటంలో తెలంగాణకున్న గుర్తింపు పోరాట వారసత్వమేనన్నది మరువ రాదు. చాకలి ఐలమ్మ బువ్వగింజల పోరాటం, దొడ్డి కొమరయ్య భూమికోసం పోరాటం, బండి యాదగిరి ఉద్యమపాట, సుద్దాల హన్మంతు రాసిన పల్లెటూరి పిల్లగాడా అన్న పాట అంతర్జా తీయ మానవతాగీతం, రావి నారాయణరెడ్డి, భీమిరెడ్డి నర్సింహారెడ్డి, ధర్మభిక్షం, నల్లా నర్సింహులు, ఉప్పల మలుసూరు, దేవులపల్లి వెంకటేశ్వరరావు, 4,000 మంది నేలకొరిగిన పోరువీరుల చరిత్రను భావితరాలకు తెలియ జేయటం విధిగా జరగాలి. వేరు తెలంగాణ పోరుకు ఊపిరిలూదిన 1969 ఉద్యమకారుల చరిత్ర దగ్గర నుంచి నేటి ఉద్యమ సాఫల్యం వరకు కీలక ఘటనలను పాఠాలుగా బోధించాలి. కాళోజీ, ప్రొ॥జయశంకర్ లాంటి వాళ్ల చరిత్రను ప్రవేశపెట్టాలి. నిజాం కాలం నాటి అనుకూల, ప్రతికూల పరిస్థితులను నిష్కర్షగా ఉన్నది ఉన్నట్లుగా పాఠ్యాంశాలలో చేర్చగలగాలి. నిజాం కాలం నాటి సంస్కరణలు, మంచి పనులు చెప్పటాన్ని ఎవ్వరూ వ్యతిరేకించరు. కానీ ఆనాటి మట్టి మనుషులు చేసిన మహత్తర పోరాటాన్ని కూడా చెప్పాలి. నిజాం కాలంలో ఆనాటి ప్రజలు ఏ రకం గా అణిగిపోయారన్న చరిత్రను కూడా కళ్లకు కట్టిన ట్లు చెప్పాలి. త్రివేణి సంగమమైన మట్టిపల్లి లక్ష్మీనర్సింహ స్వామి, కృష్ణా, గోదావరి, మూసీ నదులు శాత వాహనుల కోటిలింగాల చరిత్ర, బొమ్మలమ్మగుట్ట, సంగారెడ్డి దగ్గరున్న అనంత పద్మనాభస్వామి, మెదక్ జిల్లాలోని ఏడుపాయల జాతరలాంటి తెలంగాణ తరతరాల వారసత్వ సంపదను కొత్తతరాలకు అందించాలి. ప్రధానంగా తెలుగు వాచకంలో మన తెలంగాణ భాషను ఎలా వ్యక్తీకరిస్తామో చెప్పగలగాలి. ప్రాచీన తెలంగాణ సాహిత్యం దగ్గర నుంచి ఇటీవల ఎవరెస్టు శిఖరం అధిరోహించిన జాతీయ సాహసబాలల చరిత్ర వరకూ సిలబస్‌లోకి ఎక్కాలి. తెలుగు సాహిత్యంలో విప్లవాత్మక మార్పులు తీసుకవచ్చి సామాజిక విప్లవాలకు సాక్ష్యాలుగా నిలిచిన శ్రీశ్రీ, పోతులూరి వీరబ్రహ్మం, వేమన, జాషువా, కందుకూరి కృష్ణశాస్త్రి, ఆరుద్ర లాంటి కవులు, రచయితల సాహిత్యాన్ని తెలంగాణ నేల ఎప్పటికీ మరిచిపోలేదు. భిన్నభావాల, భిన్న అస్తిత్వాల, భిన్న పోరాటాల, విభిన్న చైతన్యాలకు నిలయమైన తెలంగాణ తనను తాను రాసుకుంటూ కొత్త చరిత్రకు ద్వారాలు తెరువ బోతుంది. (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) -
యూపీఎస్సీకి స్పందన కరువు
హాజరు 38 శాతం మాత్రమే ఎస్వీయూ రీజియన్‌లో 7796 దరఖాస్తులు కేవలం 3 వేల మంది హాజరు యూనివర్సిటీ క్యాంపస్: తిరుపతిలో ఆది వారం నిర్వహించిన యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షలకు స్పందన తగ్గింది. ఐఏఎస్, ఐపీఎస్ కావాలంటే యూపీఎస్సీ నిర్వహించే పరీక్ష రాయాల్సిందే. ప్రతి యేడాదీ క్రమం తప్పకుండా దీనిని యుపీఎస్సీ నిర్వహిస్తోంది. యేడాదిలో క్రమం తప్పక నిర్వహిస్తున్నప్పటికీ హాజరవుతున్న వారి సంఖ్య తక్కువగా ఉంది. ఆదివారం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష రాష్ట్రంలో కేవలం మూడు కేంద్రాల్లో నిర్వహిం చారు. ఉమ్మడి రాష్ర్టంలో హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నంలో నిర్వహించేవారు. తెలంగాణ విడిపోయాక కొత్తగా విజయవాడలోను పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. ఎస్వీయూ రీజియన్ పరిధిలోని చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల అభ్యర్థులకు తిరుపతిలో పరీక్ష కేంద్రా లు ఏర్పాటు చేశారు. ఈ ప్రవేశ పరీక్షకు కేవలం 7796 మంది దరఖాస్తు చేయగా ఆదివారం నిర్వహించిన పరీక్షల్లో పేపర్-1కు 3వేల మంది, పేపర్-2కు 2294 మంది హాత్రమే హాజరయ్యారు. దీనిని బట్టి చూస్తే సివిల్స్ పట్ల యువత పెద్దగా ఆసక్తి చూపడం లేదని అర్థం అవుతుంది. ఎక్కువ శ్రమతో, కష్టంతో, దీర్ఘకాలం సిద్ధం కావాల్సిన ఈ ప్రవేశ పరీక్షకన్నా తక్కువ కాలంలో ఉద్యోగాలు వచ్చే వాటిపైనే యువత ఆసక్తి చూపుతోందనడానికి ఇది నిదర్శనం. ఈ యేడాది నుంచి ప్రవేశ పరీక్ష విధానంలో మార్పులు చేశారు. పేపర్-2లో ఇంగ్లిషు కాంప్రహెన్సివ్‌ను మెయిన్స్ ఎంపికలో పరిగణనలోకి తీసుకోవడంలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రవేశ పరీక్ష రాసిన వారు ఆ విభాగపు ప్రశ్నలను అటెంప్ట్ చేయలేదు. పరీక్ష కేంద్రాల వద్ద కూడా ఈ మేరకు నోటీసు బోర్డులు పెట్టడం విశేషం. పరీక్ష కేంద్రాల వద్ద సందడి ఆదివారం సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు నగరంలోని 13 కేంద్రాల్లో నిర్వహించారు. ఈ కేంద్రా ల వద్ద పరీక్షలు రాసేవారు, వారి సహాయకుల సందడి ఎక్కువగా కనిపించింది. కొందరు పిల్లలను కూడా పరీక్ష కేంద్రానికి తీసుకువచ్చారు. ఈ పరీక్షకు ఆరు జిల్లాల నుంచి అభ్యర్థులు వచ్చారు. వీరికి సరైన వసతి లేక చాలా ఇబ్బం దులు పడ్డారు. -
సింగపూర్‌లో సీఎంకు ఘన స్వాగతం
24 వరకు బిజీబిజీగా గడపనున్న కేసీఆర్ హైదరాబాద్: తొలి విదేశీ పర్యటనకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు సింగపూర్‌లో ఘనస్వాగతం లభించింది. మంగళవారం రాత్రి 11 గంటలకు శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కేసీఆర్.. బుధవారం ఉదయం 6 గంటలకు సింగపూర్ చేరుకున్నారు. అక్కడి రిట్జ్ కార్టన్ హోటల్ వద్ద సీఎం బృందానికి ఎన్నారైలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఈనెల 22న ఐఐఎం పూర్వ విద్యార్థుల సదస్సు జరిగే స్టేడియాన్ని సందర్శించారు. స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్ల గురించి అక్కడి అధికారులు కేసీఆర్‌కు వివరించారు. తర్వాత స్థానిక జేటీసీ కార్యాలయాన్ని సీఎం సందర్శించారు. గురువారం ఉదయం 11 గంటలకు అక్కడి భారత హైకమిషనర్‌తో, సాయంత్రం 4 గంటలకు సింగపూర్ విదేశాంగ మంత్రితో కేసీఆర్ సమావేశమవుతారు. 22న ఇంఫాక్ట్ సదస్సులో పాల్గొని అదేరోజు సాయంత్రం 5 గంటలకు సింగపూర్ ప్రభుత్వ ముఖ్యులతో భేటీ అవుతారు. 23న సింగపూర్ నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్‌కు కారులో వెళతారు. 24 రాత్రి అక్కడి నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి ఈటెల రాజేందర్, ఎమ్మెల్యేలు రవీందర్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, ఉన్నతాధికారులు కె.ప్రదీప్‌చంద్ర, జయేష్ రంజన్, హరిప్రీత్ సింగ్, స్మితా సబర్వాల్, రాజశేఖర్‌రెడ్డి, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు కె.సుధీర్‌రెడ్డి, ఎం.గోపాలరావు, ఫిక్కీ తరఫున దేవేందర్ సురానా ఉన్నారు. -
పార్టీని బలోపేతం చేస్తాం
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ చెప్పారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లోనూ విభిన్న వ్యూహాలతో ముందుకు వెళ్తామన్నారు. గతంలో ఒక రాష్ట్రంగా ఉన్న దృష్ట్యా ఒకే విధానాన్ని అమలు చేశామని, ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా చూస్తున్నామని, రెండు భిన్న వ్యూహాలతో పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన రామ్‌మాధవ్ ఆదివారం ‘సాక్షి టీవీ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లోని పరిమిత అవకాశాలను విస్తృతంగా మార్చుకోవడమే రాజకీయ సామర్థ్యమని చెప్పారు. తెలంగాణలో బీజేపీని ప్రధాన ప్రతిపక్షంగా మార్చేందుకు కృషి చేస్తామన్నారు. తెలంగాణ, ఏపీ, కేరళ, తమిళనాడులో సంస్థాగతంగా బలోపేతం చేస్తే రాబోయే రోజుల్లో ప్రజామద్దతు లభిస్తుందన్నారు.