సింగపూర్‌లో సీఎంకు ఘన స్వాగతం
24 వరకు బిజీబిజీగా గడపనున్న కేసీఆర్
హైదరాబాద్: తొలి విదేశీ పర్యటనకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు సింగపూర్‌లో ఘనస్వాగతం లభించింది. మంగళవారం రాత్రి 11 గంటలకు శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కేసీఆర్.. బుధవారం ఉదయం 6 గంటలకు సింగపూర్ చేరుకున్నారు. అక్కడి రిట్జ్ కార్టన్ హోటల్ వద్ద సీఎం బృందానికి ఎన్నారైలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఈనెల 22న ఐఐఎం పూర్వ విద్యార్థుల సదస్సు జరిగే స్టేడియాన్ని సందర్శించారు. స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్ల గురించి అక్కడి అధికారులు కేసీఆర్‌కు వివరించారు.
తర్వాత స్థానిక జేటీసీ కార్యాలయాన్ని సీఎం సందర్శించారు. గురువారం ఉదయం 11 గంటలకు అక్కడి భారత హైకమిషనర్‌తో, సాయంత్రం 4 గంటలకు సింగపూర్ విదేశాంగ మంత్రితో కేసీఆర్ సమావేశమవుతారు. 22న ఇంఫాక్ట్ సదస్సులో పాల్గొని అదేరోజు సాయంత్రం 5 గంటలకు సింగపూర్ ప్రభుత్వ ముఖ్యులతో భేటీ అవుతారు. 23న సింగపూర్ నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్‌కు కారులో వెళతారు. 24 రాత్రి అక్కడి నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి ఈటెల రాజేందర్, ఎమ్మెల్యేలు రవీందర్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, ఉన్నతాధికారులు కె.ప్రదీప్‌చంద్ర, జయేష్ రంజన్, హరిప్రీత్ సింగ్, స్మితా సబర్వాల్, రాజశేఖర్‌రెడ్డి, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు కె.సుధీర్‌రెడ్డి, ఎం.గోపాలరావు, ఫిక్కీ తరఫున దేవేందర్ సురానా ఉన్నారు.