బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ధీమా
పునర్వ్యవస్థీకరణతో అసెంబ్లీ నియోజకవర్గాలు 160 వరకు పెరిగే చాన్స్
ఎవరికి బీఆర్‌ఎస్ బీ ఫామ్ దక్కినా విజయం ఖాయం
త్వరలో అన్ని స్థాయిల్లో పార్టీ కమిటీలు
పార్టీ జెడ్పీ చైర్మన్లతో ఆత్మీయ సమావేశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఆర్‌ఎస్ తిరిగి అధికారంలోకి వస్తే మరో 15 ఏళ్లు కొనసాగుతుందని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. మరో రెండేళ్లలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్య 160 వరకు పెరిగే అవకాశముందని, మహిళలకు కూడా ఎక్కువ అవకాశాలు వస్తాయని చెప్పారు. బీఆర్‌ఎస్ తరఫున ఎవరికి బీ ఫామ్ దక్కినా గెలుపు ఖాయమన్నారు. కేసీఆర్ మంగళవారం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన జెడ్పీ చైర్మన్లతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి మాట్లాడారు.
వారిని ప్రజలు అసహ్యించుకుంటున్నారు
‘తెలంగాణ పునర్నిర్మాణం ఇంకా జరగాల్సి ఉంది. తిరిగి బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుంది. పార్టీ నేతలకు సమన్వయంతో పాటు ఓపిక అవసరం. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కొంచెం కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి. త్వరలో అన్ని స్థాయిల్లో పార్టీ కమిటీల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు సోషల్ మీడియా విభాగాన్ని కూడా పటిష్టంగా తయారు చేస్తాం.
పార్టీ నాయకులను సృష్టిస్తుంది.. నాయకులు పార్టీని సృష్టించరు. భవిష్యత్తులో సమర్ధవంతమైన యువ నాయకత్వాన్ని తయారు చేస్తాం. అత్యున్నత పదవులు అనుభవించి పార్టీని వీడుతున్న వారిని ప్రజలు అసహ్యించుకుంటున్నారు. నాలుగు రోజులు పదవులు లేకపోతే ఉండలేరా? అని ప్రజలే ప్రశ్నిస్తున్నారు. ప్రజా జీవితంలో అడుగు పెట్టిన తర్వాత అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేసే వారే నిజమైన రాజకీయ నాయకులు..’అని స్పష్టం చేశారు.
పిచ్చి పనులు కాంగ్రెస్‌కు అలవాటే
‘ప్రజలతో ఛీత్కారాలు పొందే లక్షణం కాంగ్రెస్ పార్టీకి ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత పిచ్చి పనులు చేయడం కూడా వారికి అలవాటే. గతంలో ఎన్‌టీఆర్ పాలన తర్వాత 1989లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇదే రీతిన వ్యవహరించింది. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో అన్ని రంగాలు సవ్యంగా పనిచేయగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు, తాగునీరు, శాంతిభద్రతల సమస్యలు రావడం బాధ కలిగిస్తోంది.
కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామని చెప్తున్నవారు తెచ్చిన తెలంగాణను కూడా చెరిపివేస్తారా? వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అమలు చేసిన ఆరోగ్యశ్రీ , ఫీజు రీయింబర్స్‌మెంటు పథకాలను పేర్లు మార్చకుండా నేను కొనసాగించా. వ్యవసాయ స్థిరీకరణకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధుకు ఎగనామం పెట్టే ప్రయత్నం జరుగుతోంది. సాగు లెక్కలు, ఇతరత్రా కారణాలు పరిగణనలోకి తీసుకుంటే రైతుబంధు అమల్లో అవినీతి మొదలవుతుంది..’అని మాజీ సీఎం పేర్కొన్నారు.
రాష్ట్రాభివృద్ధిలో జెడ్పీ చైర్మన్ల కీలక పాత్ర
జెడ్పీ ఛైర్మన్లు రాష్ట్ర అభివృద్దిలో కీలక పాత్ర పోషించారని కేసీఆర్ ప్రశంసించారు. పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. జెడ్పీ చైర్మన్లు కుటుంబ సభ్యులతో సహా ఈ భేటీకి హాజరు కాగా, కేసీఆర్ వారిని పేరు పేరునా పలుకరించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జెడ్పీ చైర్మన్లకు జ్ఞాపికలతో పాటు యాదాద్రి ప్రసాదాన్ని కేటీఆర్ అందజేశారు.
ఈ భేటీలో మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, జి.జగదీశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, బాల్క సుమన్, గండ్ర వెంకట రమణారెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, నాయకులు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, వంటేరు ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జెడ్పీ చైర్మన్లు జనార్దన్ రాథోడ్ (ఆదిలాబాద్), కోరిపెల్లి విజయలక్ష్మి (నిర్మల్), దాదన్నగారి విఠల్ రావు (నిజామాబాద్), దఫేదార్ శోభ (కామారెడ్డి), దావా వసంత సురేష్ (జగిత్యాల), పుట్టా మధుకర్ (పెద్దపల్లి), కనుమళ్ల విజయ (కరీంనగర్), న్యాలకొండ అరుణ (రాజన్న సిరిసిల్ల), పటోళ్ల మంజుశ్రీ (సంగారెడ్డి), ర్యాకల హేమలత (మెదక్), వేలేటి రోజారాణి (సిద్దిపేట), శాంతకుమారి (నాగర్ కర్నూల్), బండా నరేందర్ రెడ్డి (నల్లగొండ), గుజ్జ దీపిక (సూర్యాపేట), ఎలిమినేటి సందీప్ రెడ్డి (యాదాద్రి భువనగిరి), ఆంగోత్ బిందు (మహబూబాబాద్), గండ్ర జ్యోతి (వరంగల్ రూరల్), మారపల్లి సు«దీర్ కుమార్ (వరంగల్ అర్బన్), జక్కు శ్రీహర్షిణి (జయశంకర్ భూపాలపల్లి ), బడే నాగజ్యోతి (ములుగు), లింగాల కమల్ రాజ్ (ఖమ్మం) హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment