Telangana New Secretariat Opening Today By CM KCR, Know Its Facts And Specialities - Sakshi
Sakshi News home page

Telangana New Secretariat: సరికొత్త పాలనకు నాంది.. నేడే సచివాలయం ప్రారంభోత్సవం

Published Sun, Apr 30 2023 4:53 AM | Last Updated on Sun, Apr 30 2023 12:05 PM

Telangana New secretariat Opening Today By CM KCR - Sakshi

తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం నుంచి పరిపాలన వ్యవహారాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం శ్రీకారం చుట్టనుంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టిన కొత్త సెక్రటేరియట్‌ను ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నారు. తర్వాత సీఎంతోపాటు మంత్రులు తమకు కేటాయించిన చాంబర్లలో ఆసీనులై.. కొత్త సెక్రటేరియట్‌ నుంచి తొలి సంతకాలు చేయనున్నారు. ఆ తర్వాత అతిథులను, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం కేసీఆర్‌ ప్రసంగించనున్నారు. 

ఉదయం సుదర్శన యాగంతో.. 
నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి సుదర్శన యాగంతో శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకోసం సచివాలయ ప్రాంగణంలో యాగశాలను సిద్ధం చేశారు. శృంగేరి పీఠానికి చెందిన వైదికు­ల ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 6 గంట­లకు యాగం ప్రారంభం కానుంది. మద్యా­హ్నం 1.20 నుంచి 1.30 గంటల మధ్య యాగం పూర్ణాహుతిలో సీఎం కేసీఆర్, శోభ దంపతులు పాల్గొంటారు. ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత కేసీఆర్‌ రిబ్బన్‌ కట్‌ చేసి భవన సముదాయాన్ని ప్రారంభిస్తారు. కాసేపు సచివాలయంలో కలియదిరిగి.. 6వ అంతస్తులోని తన చాంబర్‌కు చేరుకుంటారు. తన సీట్లో ఆసీనుడై పలు కీలక నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేస్తారు. మధ్యాహ్నం 1.58 – 2.04 గంటల మధ్య మంత్రులు, అన్నిశాఖల కార్యదర్శులు, అదనపు/సంయుక్త/ఉప కార్యదర్శులు, సెక్షన్‌ అధికారులు, అదనపు సెక్షన్‌ అధికారులు తమకు కేటాయించిన చాంబర్లు/ సెక్షన్లలో ఆసీనులై ఏవైనా ఫైల్స్‌పై తొలి సంతకాలు చేస్తారు. 

2,500 మంది అతిథులకు ఆహ్వానం 
మధ్యాహ్నం 2.15–2.45 గంటల మధ్య సచివాలయం ప్రాంగణంలో మంత్రులు, సచివాలయ అధికారులు, ఇతర అతిథులతో జరిగే సమావేశంలో సీఎం కేసీఆర్‌ ప్రసంగిస్తారు. ప్రారం¿ోత్సవ కార్యక్రమానికి ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, అన్ని శాఖల హెచ్‌ఓడీలు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా పరిషత్, డీసీసీబీ, డీసీఎంఎస్, జిల్లా గ్రంథాలయాల చైర్మన్లు, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు, మేయర్లతో సహా మొత్తం 2,500 మంది అతిథులను రాష్ట్ర ప్రభుత్వం ఆహ‍్వానించింది. 

మూడేళ్ల 10 నెలల తర్వాత.. 
పాత సచివాలయ భవనాలను కూల్చి నూతన సచివాలయం కట్టేందుకు 2019 జూన్‌ 27న సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేయగా.. సుమారు మూడేళ్ల 10 నెలల తర్వాత ప్రారం¿ోత్సవం జరుగుతోంది. వాస్తవానికి అన్ని అనుమతులు లభించాక 2021 జనవరిలో నిర్మాణ పనులను ప్రారంభించి.. ఈ నెలాఖరు నాటికి 26 నెలల్లో పూర్తి చేశామని ప్రభుత్వం పేర్కొంటోంది. ఇన్నాళ్లూ బీఆర్‌కేఆర్‌ భవన్‌లో తాత్కాలికంగా సచివాలయాన్ని నిర్వహించారు. 

హైమాస్ట్‌ లైట్‌ పోల్‌పై కెమెరా.. మొత్తం 300 కెమెరాలు 
తొలిరోజున పని మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు పనులను చిత్రీకరించేందుకు.. సచివాలయం ఎదురుగా తూర్పు దిశలో రోడ్డుపై ఉన్న భారీ హైమాస్ట్‌ లైట్‌ స్తంభంపై ప్రత్యేకంగా కెమెరాను ఏర్పాటు చేశారు. మూడేళ్లుగా జరిగిన పనులను అది చిత్రిస్తూ వచి్చంది. దాని ఆధారంగా ఇటీవలే ఓ వీడియోను రూపొందించి విడుదల చేశారు కూడా. 
 
సీఎం ప్రజాదర్బార్‌కు ఏర్పాట్లు 
కొత్త సచివాలయం 6వ అంతస్తులో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో సీఎం చాంబర్‌ ఏర్పాటు చేశారు. పూర్తిగా పాలరాతితో సీఎం కార్యాలయం, సిబ్బంది విభాగాలను తీర్చిదిద్దారు. సీఎం ప్రజలను కలిసేందుకు, ప్రజాదర్బార్‌ నిర్వహించేందుకు ‘జనహిత’ పేరిట 250 మంది కూర్చునే సామర్థ్యంతో ఒక హాల్‌ను ఏర్పాటు చేశారు. 25 మంది మంత్రులు, 30 మందికిపైగా అధికారులు కూర్చునేందుకు వీలుగా కేబినెట్‌ హాల్‌ను సిద్ధం చేశారు. కలెక్టర్లతో సమావేశాల నిర్వహణ కోసం 60మంది కూర్చునేలా ఒక హాల్, 50 మంది సమావేశమయ్యేందుకు మరో హాల్‌ నిర్మించారు. ఈ నాలుగు సమావేశ మందిరాలతో పాటు ముఖ్యమంత్రి విశిష్ట అతిథులతో కలసి భోజనం చేసేందుకు 25 మంది కూర్చోగలిగే అత్యాధునిక డైనింగ్‌ హాల్‌ను ఏర్పాటు చేశారు. 
 
సచివాలయం విశేషాలివీ.. 
సచివాలయంలో మొత్తం 28 ఎకరాల స్థలం ఉండగా.. 2.45 ఎకరాల(7,79,982 చదరపు అడుగుల)లో.. 265 అడుగుల ఎత్తుతో భవనాన్ని నిర్మించారు. మొత్తం 635 గదులు, 30 సమావేశ మందిరాలు, 34 గుమ్మటాలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ప్రధాన భవనం ఆరు అంతస్తులు ఉండగా.. ప్రధాన గుమ్మటం వద్ద మరో ఐదు అంతస్తులు కలిపి మొత్తం 11 అంతస్తులతో నిర్మించారు. సెక్రటేరియట్‌ ముందువైపు 10 ఎకరాల్లో పచి్చక మైదానం ఉండగా.. కోర్ట్‌ యార్డు (భవనం మధ్య ఖాళీ భాగంలో) రెండెకరాల్లో లాన్‌ ఏర్పాటు చేశారు. మొత్తంగా రూ.617 కోట్లతో పరిపాలన అనుమతులు జారీ చేయగా.. ఇప్పటివరకు రూ.550 కోట్లకుపైగా ఖర్చు చేశారు. ఇంకా కొన్ని పనులు సాగుతున్నాయి. అనుకున్న దానికంటే 20–30 శాతం వ్యయం ఎక్కువ అవుతోందని ప్రభుత్వం పేర్కొంది. 

కొత్త సచివాలయం విస్తీర్ణం వివరాలివీ.. 
మొత్తం భూ విస్తీర్ణం: 28 ఎకరాలు 
భవనం నిర్మించిన ప్రాంతం: 2.45 ఎకరాలు 
ల్యాండ్‌ స్కేపింగ్‌: 7.72 ఎకరాలు 
సెంట్రల్‌ కోర్ట్‌ యార్డ్‌ లాన్‌: 2.2 ఎకరాలు 
పార్కింగ్‌ సామర్థ్యం: 560 కార్లు, 700 బైకులు 
ప్రధాన భవన కాంప్లెక్స్‌ బిల్టప్‌ ఏరియా: 8,58,530 చదరపు అడుగులు 
లోయర్‌ గ్రౌండ్, గ్రౌండ్, ఆరు అంతస్తుల్లో ఒక్కోదాని ఎత్తు: 14 అడుగులు 
మొత్తం ఎత్తు: 265 అడుగులు 

నిర్మాణానికి ఉపయోగించిన సామగ్రి 
ఉక్కు: 8,000 టన్నులు 
సిమెంటు: 40,,000 టన్నులు 
ఇసుక: 30,000 టన్నులు (5 వేల లారీలు) 
కాంక్రీట్‌: 60,000 క్యూబిక్‌ మీటర్లు 
ఇటుకలు: 11 లక్షలు 
ఆగ్రా రెడ్‌ స్టోన్‌: 3,500 క్యూబిక్‌ మీటర్లు 
గ్రానైట్‌: మూడు లక్షల చదరపు అడుగులు 
మార్బుల్‌: లక్ష చదరపు అడుగులు 
ధోల్‌పూర్‌ రెడ్‌స్టోన్‌: 3,500 క్యూబిక్‌ మీటర్లు 
కలప: 7,500 క్యూబిక్‌ అడుగులు 
పనిచేసిన కారి్మకులు: మూడు షిప్టుల్లో 12,000 మంది 
 
యాక్సెస్‌ కార్డు ఉంటేనే లోపలికి.. 
నూతన సచివాలయ భవనంలోకి ప్రవేశించాలంటే ప్రత్యేకంగా రూపొందించే యాక్సెస్‌ కార్డు పాస్‌ తప్పనిసరి. ఏదైనా పనిమీద వచ్చేవారు ఏ శాఖ కార్యాలయానికి వెళ్లాలో అక్కడివరకు మాత్రమే వెళ్లగలిగేలా పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. లోపలికి అనుమతించే విషయంలో అప్రమత్తంగా ఉండేలా భద్రతా సిబ్బందికి ఆదేశాలు జారీ అయ్యాయి. రెండు షిఫ్టుల్లో 300 మంది చొప్పున సచివాలయంలో పహారా కాస్తారు. వారికి నిర్ధారిత డ్యూటీ పాయింట్లు ఉంటాయి. 
– గతంలో పాత సచివాలయంలో కూడా పాస్‌ల జారీ విధానం ఉండేది. ఒకసారి లోనికి వెళ్లాక సీఎం ఉండే సీ బ్లాక్‌లోకి తప్ప మిగతా అన్ని భవనాల్లోకి సులువుగా వెళ్లేందుకు అవకాశం ఉండేది. 
– సచివాలయంలోకి వెళ్లేందుకు నాలుగు ప్రధాన ద్వారాలు ఉంటాయి. ఇందులో ఆగ్నేయం (గతంలో పెట్రోల్‌ బంకు ఉండే ప్రాంతం) వైపు ఉండే ద్వారం నుంచి సందర్శకులను అనుమతిస్తారు. సందర్శకులు నిర్ధారిత కార్యాలయానికి వెళ్లేందుకు అక్కడ అనుమతి తీసుకుని, యాక్సెస్‌ పాస్‌ పొందాలి. లోపల ఉండే చెకింగ్‌ పాయింట్ల వద్ద ఆ పాస్‌ను చూపుతూ వెళ్లాలి. ఆ పాస్‌లో ఏ కార్యాలయానికి, ఎటువైపు అనుమతి ఉంటుందో అక్కడికి మాత్రమే సిబ్బంది అనుమతిస్తారు. 
– మీడియాను కూడా  
– భవిష్యత్తులో ఫేస్‌ రీడింగ్‌తో కూడిన యాక్సెస్‌ కార్డులను జారీచేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికి మ్యాన్యువల్‌గా తనిఖీ చేసి పంపే యాక్సెస్‌ కార్డులను జారీ చేయనున్నారు. 
– సచివాలయం భద్రత కోసం 300 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 

మీడియాకూ ఆంక్షలు! 
ఆగ్నేయ దిక్కున గేటు సమీపంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌లోకి మాత్రమే అనుమతిస్తారు. ఏదైనా మంత్రిత్వ శాఖ సమావేశ మందిరాల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే.. ముందుగా అధికారులు సెక్యూరిటీ అధికారులకు సమాచారం ఇస్తేనే.. మీడియాను లోపలికి పంపుతారని అధికార వర్గాలు చెప్తున్నాయి. లేకుంటే సంబంధిత అధికారులు మీడియా సెంటర్‌ వద్దకే వచ్చి సమాచారం ఇచ్చి వెళ్లేలా యోచన కూడా చేస్తున్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement