తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు రాజకీయ జీవితంపై భవిష్యత్తులో పరిశోధనాత్మక గ్రంధాలు రావచ్చు. పలువురు దీనిపై థీసిస్‌లు సమర్పించవచ్చు. ఒక సామాన్య నేత అంచెలంచెలుగా ఎదిగి సమాజాన్ని శాసించే స్థాయికి చేరుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఒక రెకంగా అది అద్భుతం, అమోఘం. ఒక నాడు తాను స్థాపించిన రాజకీయ పార్టీకి సొంత ఆఫీస్ లేదు. ఎవరో ఇచ్చిన భవంతిలోనో ఆఫీస్ నడపవలసి వచ్చేది. కాని ఈ రోజుబ్రహ్మాండమైన నవాబుల నాటి సంస్కృతితో నిర్మించిన భారీ భవనం. చేతిలో అవసరమైన సొమ్ము ఉండేది కాదు.అన్నిటికి కటకటే! మరి ఇప్పుడు ఆయన పార్టీ ఖాతాలోనే 1200 కోట్ల సొమ్ము. ఒకప్పుడు ఆయన శాసనసభలో ఒకే ఒక్కడు.
తనకు కేటాయించిన చాంబర్‌లో మీడియావారితో కబుర్లతో గడిపేవారు. ఈ రోజు ఆయనను కలుసుకోవడమే కష్టం. తనకు ఒకప్పుడు బాగా తెలిసినవారైనా, ఆయనకు ఇష్టం లేకపోతే అప్పాయింట్ మెంటే దొరకదు. అలా తెలంగాణ ఉద్యమ జీవితాన్ని ఆరంభించిన ఆయన ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంటూ పెద్ద,పెద్ద పార్టీలను కూడా తనదారిలోకి తెచ్చుకున్న ఘనాపాటి. తెలంగాణ జనజీవితాలను నిర్దేశించే నేత గానే కాదు. దేశాన్నే ఏలే స్థాయికి ఎదగడానికి ప్రయత్నిస్తున్న నేత. ఇదంతా కేసీఆర్ స్వయంకృషే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తనతో ఎవరు కలిసి వచ్చినా, రాకపోయినా తాను అనుకున్న మార్గంలో ముందుకు సాగి ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీని స్థాపించి తన సత్తాను చాటుతున్న నేత. ఒకప్పుడు ప్రాంతీయవాది అయినా, ఇప్పుడు ఆయనలో జాతీయవాది కనిపిస్తున్నారు.
ఇదంతా రెండు దశాబ్దాల వ్యవధిలోనే. ఎన్నో ఉత్ధాన ,పతనాలు చూశారు. అయినా చలించలేదు. ఒక దశలో పార్టీని ఎత్తివేయవలసి వస్తుందా అన్న ఆందోళన కూడా లేకపోలేదు. అయినా చలించలేదు. పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకున్న వ్యూహచతురుడు. ఆయనపై ఎన్ని రకాల విమర్శలైనా ఉండవచ్చు.ఎన్ని ఆరోపణలు ఉండవచ్చు. కుటుంబపాలన అని ప్రత్యర్ధులు ద్వజమెత్తవచ్చు. లోపాలు ఎన్ని ఉన్నాయన్నదాని గురించి కాదు. ఒక వ్యక్తి తన మేధస్సుతో రాజకీయాలలో ఎలా అత్యున్నత స్థానానికి చేరవచ్చని రుజువు చేసిన నేతగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. తెలుగు, హిందీ, ఉర్దూ, ఆంగ్ల భాషలలో ప్రావీణ్యం సాధించి అనర్ఘళంగా ప్రసంగించగల అరుదైన నేత కేసీఆర్. 2001 లో ఆనాటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడాన్ని ఆయన అవమానంగా భావించారు. దానిని జీర్ణించుకోలేకపోయారు.
ఈయనలోని అసంతృప్తిని చల్లార్చడానికి ఉప సభాపతి పదవి ఇచ్చినా, ఆయన సంతృప్తి పడలేదు. తనకంటూ అప్పటికే ఒక లక్ష్యం పెట్టుకున్నారు. అదే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన. ఇది సాద్యమేనా అన్న సంశయం నూటికి తొంభైమందికి ఉండేది. అయినా ఆయనలో ఆత్మ విశ్వాసం తగ్గలేదు. సిద్దిపేట సీటుకు రాజీనామా చేసి, టీడీపీకి గుడ్ బై చెప్పి ఉప ఎన్నికలో పోటీచేసినప్పుడు ఆయన సత్తా తెలియడం ఆరంభం అయింది. చంద్రబాబు ఆయనను ఓడించడానికి చేయని ప్రయత్నం లేదు. విశేషం ఏమిటంటే కేసీఆర్‌ను ఆనాడు పరాజితుడిని చేయడానికి కృషి చేసిన పలువురు ఇప్పుడు ఆయన క్యాబినెట్ లో మంత్రులు లేదా ఆయన ఇచ్చిన నామినెటెడ్ పదవులలో ఉన్న నేతలు. ఉదాహరణకు తలసాని శ్రీనివాసయాదవ్, వేణుగోపాలచారి వంటివారిని తీసుకోవచ్చు. వీరే కాదు. ఇంకా చాలామందే ఉన్నారు. అప్పట్లో ఏపీలో అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా మళ్లీ పీఠం ఎక్కాలన్న ధ్యేయంతో ఉండడం కేసీఆర్‌కు కలిసి వచ్చింది.
నిజానికి అప్పుడు టీఆర్‌ఎస్‌తో పొత్తు లేకపోయినా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది. కాని ఎవరి భయం వారిది కదా!తెలంగాణ కాంగ్రెస్ నేతలు జి.వెంకటస్వామి, డి.శ్రీనివాస్ తదితరులు ఎలాగైనా కేసీఆర్‌తో పొత్తు పెట్టుకుని తెలంగాణ సెంటిమెంట్ ద్వారా గెలవాలని అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారు. దాంతో కాంగ్రెస్ చరిత్ర కన్నా టీఆర్‌ఎస్ భవిష్యత్తేమారిపోయింది. కేసీఆర్‌ఏకంగా కేంద్రంలో మంత్రి అయ్యారు. వైఎస్ క్యాబినెట్ లో ఆరుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యారు. అయినా తెలంగాణ రాష్ట్ర సాధన పై పట్టు వీడకపోవడం కేసీఆర్‌ప్రత్యేకత అని చెప్పాలి. తన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించడమే కాకుండా, తాను సైతం రాజీనామా చేసి ఉప ఎన్నికల ద్వారా సెంటిమెంట్ ను నిలబెట్టడంలో ఆయన సఫలం అయ్యారు. ఆ ఎన్నికలలో కొన్ని సీట్లలో గెలిచినా, ఓడినా ప్రజలో సానుభూతి సంపాదించడంలో ఆయన విజయవంతం అయ్యారు. అదే సమయంలో సమైక్యవాద పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి అధికార కాంక్షను కేసీఆర్‌పెట్టుబడిగా వాడుకోగలిగారు. తనతో పొత్తు పెట్టుకోవాలంటే తెలంగాణపై తీర్మానం చేయాల్సిందేనని స్పష్టం చేశారు. దానికి లొంగిపోయిన చంద్రబాబు అదే ప్రకారం తీర్మానం చేసి టీఆర్‌ఎస్ తో కలిసి మహాకూటమి కట్టారు. నిజానికి చంద్రబాబుకు మనసులో తెలంగాణ రాష్ట్ర అనుకూలత లేదు.
అది అయ్యేదికాదని, ఎలాగైనా కేసీఆర్‌ను మాయచేయవచ్చన్నది ఆయన వ్యూహం. నువ్వొకందుకు పోస్తే, నేనొకందుకు తాగుతా అన్న సామెత మాదిరి అటు కాంగ్రెస్ ను, ఇటు టీడీపీని తన దారిలోకి తెచ్చుకున్న కేసీఆర్‌సగం విజయం సాధించినట్లయింది.ఈ మధ్యలో భారీ బహిరంగ సభలు, దేశంలో ఉన్న కొంతమంది ప్రముఖ నేతలను రప్పించి తెలంగాణకు అనుకూలంగా మాట్లాడించేవారు.అవసరమైతే ఆంద్ర ప్రాంతంపై తనదైన శైలిలో తీవ్ర పదజాలంతో మాట్లాడేవారు. తద్వారా తెలంగాణ ప్రజలలో ప్రత్యేక రాష్ట్ర భావనను బాగా నాటకలిగారు. ఈ తరుణంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అనూహ్యంగా హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించడంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యంగా సోనియాగాంధీకి స్వయం నిర్ణయ తెలివితేటలు అంతంతమాత్రమే కావడం కేసీఆర్‌కు కలిసివచ్చిన మరో అంశం. రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డికి ఏపీ పీఠం అప్పగించి ఉంటే చరిత్ర మరో విధంగా ఉండేదని చాలా మంది నమ్ముతారు.
రాష్ట్ర విభజన జరిగే అవకాశం చాలా తక్కువగా ఉండేదని పలువురు విశ్వసిస్తారు.కాని కాంగ్రెస్ లో వర్గాలు జగన్ పై లేనిపోని పితూరీలు చెప్పి, చివరికి అధిష్టానానికి ఆయనను దూరం చేసి, సొంతంగా పార్టీ పెట్టే పరిస్థితికి తీసుకువెళ్లారు. ప్రజలలో అంత పట్టు లేని రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి వంటి నేతలను కాంగ్రెస్ నమ్ముకుని మునిగిపోయింది. కిరణ్ కుమార్ రెడ్డి అయితే తొలుత తెలంగాణపై అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పినా, తర్వాత తిరగబడి పార్టీని గంగలో ముంచేశారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, ఏపీలో సొంత ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని రాష్ట్రపతి పాలన పెట్టుకునే దశకు వెళ్లడంలోనే ఆ పార్టీ బలహీనత కనిపిస్తుంది. మరో వైపు జగన్ ను తప్పుడు కేసులలో ఇరికించి 16 నెలలపాటు జైలులో ఉంచడం ప్రజలలో కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకతను తెచ్చింది. ఇలా కాంగ్రెస్ చేసిన స్వయంకృతాపరాధాలన్నీ కేసీఆర్‌కు వరంగా మారాయి. సోనియా పుట్టిన రోజున తెలంగాణ ప్రకటన చేయడం , ఆ తర్వాత ఆపడం తెలంగాణ ప్రజలలో పెనుమార్పులకు దారి తీసింది. కేసీఆర్‌తెలంగాణలోని కాంగ్రెస్, బీజేపీ తెలుగుదేశం తదితర చిన్నాచితక పార్టీల నేతలను ,ప్రజాసంఘాలను కూడగట్టుకుని తెలంగాణలో ఏకైక పెద్ద నాయకుడుగా ఆవిర్భవించారు. అదే ఆయన పెద్ద విజయం.
తెలంగాణ ఇస్తే తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానన్న అభిప్రాయానికి ఆయన కట్టుబడి ఉన్నా, కాంగ్రెస్ నాయకత్వం పూర్తి అసమర్దంగా వ్యవహరించడం కేసీఆర్‌కు కలిసి వచ్చింది. అప్పుడు ఆయన రిస్కు తీసుకుని ఒంటరిగా పోటీ చేయడంతో ఆయన రాజకీయ జీవితమే మారిపోయింది. 2014లో ముఖ్యమంత్రి కావడం ద్వారా దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించగలిగారు. ఆ తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఓటు కు నోటు కేసులో బుక్ చేసి హైదరాబాద్ నుంచి వెళ్లిపోయేలా చేయగలిగారు. అలాగే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ను బలహీనం చేసే కృషిలో భాగంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు డజను మందిని టీఆర్‌ఎస్‌లో కలిపేసుకున్నారు. టీడీపీ, సిపిఐ , బిఎస్పి వంటి పార్టీల ఎమ్మెల్యేలు సైతం అదే దారిపట్టారు. 2018లో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం కేసీఆర్‌నెత్తిన పాలు పోసినట్లయింది.ప్రజలలో కాంగ్రెస్,టీడీపీ యాంటి సెంటిమెంట్ ను సృష్టించి మరోసారి అధికారంలోకి వచ్చారు. అదే సమయంలో రైతు బంధు, 24 గంటలు విద్యుత్ సరఫరా తదితర స్కీములను కూడా ఆయన విజయవంతంగా అమలు చేయడం ఉపకరించింది.
2018లో గెలిచాక మళ్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చీల్చిపారేశారు. దాంతో ఆ పార్టీ మళ్లీ పుంజుకోవడానికి చాలా కష్టాలు పడవలసి వస్తోంది.సడన్ గా బీజేపీ రూపంలో కొంత ఇబ్బంది వచ్చినా, కాంగ్రెస్ , బీజేపీల నడుమ మరోసారి అధికారం సాధించడానికి ఆయన వ్యూహరచన చేసి 2023 ఎన్నికలకు సిద్దం అవుతున్నారు. ఒకప్పుడు ఉప ప్రాంతీయ పార్టీగా రంగంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రస్తుతం భారత రాష్ట్ర సమితిగా (బిఆర్ఎస్ ) మారి జాతీయ పార్టీగా అవతరించడం మరో గొప్ప విశేషం.
ఇప్పుడు ఆయన తన నివాసంగా ప్రగతి భవన్ ను కట్టుకున్నారు. సచివాలయానికి ఉన్న భవనాలు కూల్చివేసి అధునాతన సౌధాన్ని నిర్మించారు. ఇలా నాడు పార్టీకి సొంత భవనం లేని స్థితి నుంచి అటు పార్టీపరంగా, ఇటు ప్రభుత్వపరంగా తన ఆధిపత్యాన్ని చాటుతూ దేశ రాజకీయాలనే శాసించే స్థాయికి ఎదగాలని ఆయన ఉవ్విళ్లూరుతున్నారు. నిజంగానే కేసీఆర్ రాజకీయ ప్రస్తానాన్ని అధ్యయనం చేయడం, పరిశోధన చేయడం ద్వారా ఎన్ని డాక్టరేట్లు అయినా సాధించవచ్చు. కేసీఆర్ ఇప్పుడు ఒక వ్యక్తి కాదు. ఒక శక్తి. అప్పట్లో తన వెనుక ఎవరు ఉన్నారో వెతుక్కోవలసిన పరిస్థితి. మరి ఈనాడు ఆయన చూపు పడితే చాలు అనుకునే నేతలు కోకొల్లలుగా ఉన్న పరిస్థితి. 2023 శాసనసభ ఎన్నికలలో మరోసారి విజయం సాధిస్తే కేసీఆర్ దేశ రాజకీయాలను నిజంగానే ప్రభావితం చేసే స్థాయికి ఎదగవచ్చు. హాట్సాఫ్ టు కేసీఆర్.
-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ ప్రెస్ అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment